మంగళవారం 31 జనవరి 2012

విగ్రహాలూ.... ఆగ్రహాలూ!

కావలసింది ఆలోచన... విచక్షణ  (రోడిన్ శిల్పం ‘థింకర్’) 
శిలా విగ్రహాలో,  కాంస్య విగ్రహాలో..  అసలు ఏ విగ్రహమూ  కనపడని ఊరే మనకు కనపడదు!

తాము అభిమానించేవారు చనిపోయిందాకా ఆగకుండానే  విగ్రహాలు పెట్టేవారు కొందరైతే.. . తమ విగ్రహాలను తామే పెట్టించుకునేవారు మరికొందరు. 

సినీ తారలకు గుళ్ళు కట్టి పూజించే దురభిమానం..  కోపమొస్తే వాటిని  ధ్వంసం కూడా చేసేంతటి ఆగ్రహాభిమానం పొరుగు రాష్ట్రంలో చూస్తుంటాం!
 
రాజకీయాల విషయానికొస్తే...  విగ్రహాల ప్రతిష్ఠ అనేది  ప్రతిష్ఠకూ,  పరపతికీ  సంబంధించినదిగా,  ఓట్లు పెంచుకునే సాధనంగా భావించటం పెరగటం వల్ల ఈ విగ్రహావిష్కరణలు పెరుగుతూనే ఉన్నాయి.

కొత్త విగ్రహాలకు చోటే దొరకనంతగా ఊళ్ళల్లో  కూడళ్ళు  కిటకిటలాడటం చూస్తూనే ఉంటాం. 

రకరకాల భావజాలాల  ప్రతినిధుల  విగ్రహాలనూ , రాజకీయ నాయకుల  విగ్రహాలనూ  వాటి వ్యతిరేకులు  అవమానించటం,  ధ్వంసం చేయటం..  ప్రతిగా వారి వ్యతిరేకుల ప్రతిచర్యలూ..  ఆగ్రహావేశాలూ...   సవాళ్ళూ,  జరిగిన అవమానాన్ని ‘శుద్ధి ’ చేయటానికని  క్షీరాభిషేకాలూ ..  ఈ మధ్య ప్రతిరోజూ పేపర్లలో  చూస్తున్నాం. 

ఆ నాయకుల విగ్రహం ధ్వంసం  చేశారన్న  కోపంతో ఈ నాయకుల  విగ్రహాల  విధ్వంసం...  నిరసనగా  బంద్ .. . ఈ  బంద్ కు  వ్యతిరేకంగా ర్యాలీ...   


ఇవన్నీ విషవలయంలాగా  తయారయ్యాయి.


(ఈనాడు హైదరాబాద్ ఎడిషన్లో ఇవాళ వచ్చిన ఫొటో ఇది.) 

రాష్ట్రానికి తలనొప్పిగా మారిన కొత్త సమస్య ఇది.  ఎప్పటినుంచో  ఉండి, అప్పడప్పడూ బయటపడుతున్న పాత సమస్య కూడా!   

ఈ విగ్రహాల  అంశం మూలాలను స్పృశిస్తూ  రంగనాయకమ్మ గారు ఇవాళ ‘ఆంధ్రజ్యోతి’లో వ్యాసం రాశారు. 

ఆలోచనాత్మకమైన ఈ వ్యాసంలోని  కొన్ని భాగాలు చూడండి...

'విగ్రహ విధ్వంసం' అనే వికృతత్వం, దాని కన్నా ముందు జరిగే 'విగ్రహ ప్రతిష్ట' అనే మొదటి వికృతత్వానికి తప్పనిసరి ఫలితం! చిత్రాల లాగే విగ్రహాలు కూడా కళారూపాలే కావచ్చు. కళారూపాలకు, అవి నిలబడవలసిన స్తలాలే సవ్యమైన స్తలాలు. కళా రూపాలకు పోరాటాల పాత్రలు అప్పజెప్పకూడదు. 

మనుషుల విగ్రహాల్ని కళా రూపాలుగా భావిస్తూ, ఇళ్లల్లోనూ, మ్యూజియమ్‌లలోనూ పెట్టుకుంటే, వాటిని ఆ ఇళ్లవాళ్లూ, ఆ మ్యూజియంల వాళ్లూ, ఇష్టంతో బాధ్యతతో చూసుకుంటారు. కానీ వాటిని బహిరంగ ప్రదేశాల్లో పెడితే, వాటిని అవమానించే సదవకాశాలు వాటి వ్యతిరేకుల్ని పిల్చి అప్పగించినట్టే!


 విగ్రహాన్ని అవమానం నించి తప్పించే మార్గం, దాన్ని మరింత మరింత దృఢ తరం చెయ్యడం కాదు. మట్టితో రక్షణ లేక, కంచుతో రక్షణ దొరికితే, అది కంచు శక్తే గానీ, అది ఆ నాయకుడి శక్తి కాదు. విగ్రహం చుట్టూ తుపాకులతో కాపలాలు కాయడాలైతే, తుపాకీ లేకుండా రక్షణ దొరకని విగ్రహానికి అదే అసలైన అవమానం.

ఆహారంగా వుపయోగపడే పాలు, ఆకలితో అలమటించే నిరుపేద పిల్లల కడుపుల కోసంగానీ, విగ్రహాల అభిషేకాల కోసం కాదు. భూమిని ఉపయోగించవలసింది, నిలవనీడలేని నిరాశ్రయుల నివాసాల కోసం గానీ, బొమ్మల్ని నిలబెట్టడం కోసం కాదు.


మొత్తం వ్యాసం ఇక్కడ...