సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !
కళలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కళలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, జులై 2025, శనివారం

‘నవలా’ నీరాజనం!

బాలచందర్   ‘ఇది కథ కాదు’  (1979)  గుర్తుందా?    ‘ఆ దీన స్త్రీల రోదనం, వేదన నా చెవుల్లో గింగురుమంటున్నాయి’  అంటూ  చలం   కొటేషన్ తో ఆ సినిమా ముగుస్తుంది. 
 

‘రెక్క చాటు ఆకాశం’ (2025)  నవల  చలం కొటేషన్ తర్వాతే  ఆరంభమవుతుంది.  (‘మాతృత్వం ఉత్త సహజాతం. .. దానికి మహిమల్ని ఆపాదించి , గాలిపోసి ఉబ్బించి , ఏదన్నా భక్తికి తీసుకురావాలంటే దానికి నూతన పదం తగిలించి ఇంత మోసపుచ్చుతున్నారు...’)

ఇద్దరు రచయిత్రులు   కలిసి  ఇలా ఓ నవల రాయటం  తెలుగులో గతంలో ఎప్పుడూ జరగలేదు.   విశేషమేంటంటే..

వీరిద్దరికీ  నవలా రచనలో ఇదే తొలి అడుగు.  పైగా  ఉమ్మడి రచన.  అయినా కృత్యాద్యవస్థను   అధిగమించి  సాధికారికంగా,  ఆద్యంతం ఆసక్తికరంగా  చక్కని నవలను  అందించారు... వేల్పూరి సుజాత,  ఉమా నూతక్కి.
 
‘రెక్క చాటు ఆకాశం’ నవల  ఒకరు ముగించాక, మరొకరు రాసే  ‘గొలుసుకట్టు నవల’ కాదు.   ఇతివృత్త ఎంపిక,  పాత్రల క్రమ వికాసం, సన్నివేశ  పరికల్పన,  కథాంశ  పరిషోషణను  ఇద్దరూ కలిసి  నిర్వహించిన నవల.  అంటే ...  ‘కలిసికట్టు నవల’  అని చెప్పొచ్చు. 


ఇద్దరు  రాసినప్పుడు దేనికదే అన్నట్టు ... సరిగా బ్లెండ్ అవ్వదేమో అనే సందేహంతోనే  ఈ నవల చదవటం మొదలుపెట్టాను.  నాది  లేనిపోని అపనమ్మకం  మాత్రమేనని  అర్థమయింది. 

వర్తమానం నుంచి ఫ్లాష్ బ్యాక్ కి  వెళ్తూ ఇంకా వెనకటి కాలపు సంగతులను చెపుతూ.. తర్వాత ముందుకు సాగిపోయే  కథనంలో  రచయిత్రులు నేర్పు చూపించారు. 


‘‘ ఏ పాత్రని ఎవరు సృష్టించారు, ఏ చాప్టర్ ఎవరు రాశారో పాఠకులు కనిపెట్టలేనంత సిమెట్రీ తో రాశాం, ప్లాన్ చేసి కాదు, అనుకోకుండానే అలా జరిగిపోయింది’  - ఓ ఫేస్ బుక్ పోస్టులో  సుజాత.


నవలా గమనం  ఆసక్తికరంగా, వేగంగా సాగుతూ  పఠనీయంగా  ఉండటం వల్ల  ‘ఎవరు ఏది రాశారు?’ అనే  దృష్టి  నాకు రాలేదు . 


రెండోసారి  స్థిమితంగా ,  మరికాస్త పరిశీలనతో  చదివినప్పుడు   మాత్రం ఎవరు ఏది రాసివుండొచ్చా  అని ఆలోచించాను.   అక్కడక్కడా మాత్రమే కొంత అంచనా వేయగలిగా. 
 

ప్రోటాగనిస్ట్ ఇందిరను  సుజాత,   ఇందిరకు ఆసరాగా వెన్నంటివున్న కాథరిన్ ను ఉమ  సృష్టించివుండవచ్చు.  


 కానీ అన్ని  పాత్రల రూపకల్పనా,  నవలా విస్తరణా  ఇద్దరూ కలిసే ముందుకు తీసుకువెళ్ళారు.    

ఇదెలా సాధ్యమయింది?  


అదే  FB పోస్టులో దీనికి   సమాధానం ఉంది..


 ‘నవల రాయడం మొదలు పెట్టాక, ఒకరు రాసింది ఒకరికి వాట్సప్ లో షేర్ చేసుకున్నాం.  50 పేజీల వరకూ కూడా ఫాస్ట్ గా రాయలేక పోయాం మొదట.  తర్వాత ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేసి అందులో ఇద్దరం రాసింది చేరుస్తూ పోయాం. వాట్సప్ లో షేర్ చేసుకుంటూనే.


నవల్లో పాత్రల గురించి ఏమైనా చర్చించుకోవాలంటే, ఫోన్ చేసుకోకుండా, వాయిస్ మెసేజ్ లు పెట్టుకున్నాం. వాటిని మళ్ళీ రివైజ్ చేసి వినొచ్చు కాబట్టి.   


ఎందుకంటే ప్రతి పాత్రతోనూ ఇద్దరం అలా కనెక్ట్ కావడం వల్ల. ఒక చాప్టర్ లో ఉమ కొన్ని డైలాగ్స్ రాస్తూ మధ్యలో ఆపితే, ఆ డైలాగ్స్ ని నేను కంటిన్యూ చేశాను.  వైస్ వెర్సా. ’


*** 


 పిల్లలు పుట్టే అవకాశం  లేని  ‘ఇన్ ఫాంటైల్ యుటిరస్’  అనే శారీరక సమస్య ఇందిర అనే  అమ్మాయి  జీవితాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో,  ఎంత ఆత్మన్యూనతలోకీ,  అపరాధ భావనలోకీ   నెట్టివేసిందో ఈ నవల  లోతుగా చర్చించింది.   


తొలి యౌవన దశలో   రక్తంతో తడిసిన శానిటరీ పాడ్స్ గిఫ్ట్ పాకెట్లుగా  రావడం ,  పెళ్లయ్యాక భర్త  వంచన అర్థమయ్యాక..  అతడు  వేరే స్త్రీని పడవ ఎక్కించుకుని  తనను  పడవలోంచి  నీళ్లలో తోసేయటం...


ఈ  రెండు సందర్భాల్లో  ఇందిరకొచ్చిన  పీడ కలల  వర్ణన ద్వారా  ఆమె మానసిక దుర్బలత్వాన్నీ, నిస్సహాయతనూ  రచయిత్రులు  గాఢంగా చిత్రించారు.  


‘అతనే లోకం అన్నట్టు బతికాను. చదువుకున్న  చదువు, చేసిన ఉద్యోగం,  చదివిన సాహిత్యం మొత్తం మర్చిపోయాను. తన కోసం అన్నీ వదులుకుని నన్ను నేను వదిలేసుకున్నాక,  అతనికి నేనే అవసరం లేకుండా పోయాను’   

‘నన్ను నన్నుగా ఉండనీయని అతని సాంగత్యంలో భార్యగా బతుకుతూ, ఆ సర్ప పరిష్వంగాన్ని ప్రేమ కౌగిలి అనుకున్నాను’


 భర్త స్వభావాన్ని అంచనా  వేయడంలో తప్పటడుగులు వేసినా  ఆలస్యంగా మేలుకున్న స్వాభిమానం   ఇందిరను  నిలబెడుతుంది.  తల్లిదండ్రుల , స్నేహితుల ఆసరాతో  తేరుకుని తన సమస్యను ధైర్యంగా  ఎదుర్కొంటుంది.   ఇందిర  వ్యక్తిత్వంలో  వచ్చిన  ఈ  ముఖ్య  పరిణామాన్ని  పరిణతితో  ఈ నవల చర్చించింది. 


ఒక దీపం మరో దీపాన్ని వెలిగించినట్టు  ఇందిర  తన కొలీగ్  మీనాకు ఎంతో కొంత  ఓదార్పునిచ్చింది. 

***

నేహా, పరిమళల ప్రవేశంతో,  కాథరిన్ (కాథీ) పున: ప్రవేశంతో నవల మేలు  మలుపు తీసుకుంది.  చురుకైన  పతాక స్థాయి  కథనంతో,  సంఘటనలతో,  వికసించిన విద్యుత్తేజం లాంటి  తీక్ష్ణ,  సెన్సిబుల్  సంభాషణలతో ఉత్కంఠభరితమయింది. 

***


ఈ నవల్లో  దాదాపు అన్ని పాత్రలూ  సజీవంగా, సహజంగా ప్రవర్తిస్తాయి.  

ఇందిరతో పాటు ఆమె  తల్లిదండ్రులు గీత, భాస్కర్ ,  కాథరిన్, వసంత,   మీనా, నేహా, పరిమళ, హరి, సుధ..
 

*  స్వభావరీత్యా సంస్కారం, మానవత్వం, స్నేహ పాత్రతలున్న అపురూపమైన  పాత్ర  హరి.  

*  అపార్థం చేసుకోవడానికి  అవకాశమున్నప్పటికీ సంస్కారంతో అతణ్ణి సవ్యంగా అర్థం చేసుకున్న గొప్ప వ్యక్తిత్వం  అతడి భార్య సుధది.  

చుట్టూ అంతమంది సాహిత్య ప్రేమికులున్న ఆమెకు రచయిత  చలం గానీ, ఆయన పాత్ర  రాజేశ్వరి గానీ  అస్సలు తెలియకపోవడం  (ఆ సందర్భంలో పేలిన  జోక్  నిజంగా బాగుంది) ఆశ్చర్యంగా ఉండొచ్చు కానీ అది  అసహజం మాత్రం కాదు.     

*  సి.ఎ. టాపర్ గా తన ఆశలనూ, ఆశయాలనూ సమాధి చేసుకుని  నోములూ , వ్రతాలతో తనను బిజీ చేసుకున్న పరిమళ  ఈ నవల్లో చాలా ప్రత్యేకం.  ప్రశాంతంగా కనిపించే అగ్నిపర్వతం ఒక్కసారిగా విస్ఫోటించినట్టు.. భంగపాటుతో పొగిలి వచ్చిన  ఆమె దు:ఖోద్వేగపు తీవ్రతను కళ్లు చెమర్చేలా రాసిన  తీరు  ప్రశంసనీయం.    


  ..   వీళ్లంతా నవల పూర్తయినా మన ఆలోచనల్లోకి చొచ్చుకునివచ్చి  వెంటాడుతూనే ఉంటారు.
 

**** 

మెరుపు సంభాషణలు
ఆలోచింపజేసే  పదునైన సంభాషణలు ఈ నవల పొడవునా ఉన్నాయి.  కొన్ని ఘట్టాల్లో  నిస్సంకోచంగా, నిర్భీతిగా పాత్రల సంభాషణలు మెరుపుల్లా దూసుకొస్తాయి.  పాఠకులకు షాకునిస్తాయి.  సహానుభూతితో ఆలోచనలూ రేపుతాయి.

* ఏ మగవాడికైనా ఒక స్ర్తీ అవైలబుల్ గా లేనంత కాలం దేవత.  అందుబాటులోకి వచ్చాక,  చదివేసిన ఒక ఉత్తరం.  ఏ సస్పెన్సూ లేని ఉత్తరం.  తాగేసిన గ్లాసు.  వాడేసిన టిష్యూ’                   - మీనా

 
‘అబ్యూసివ్ రిలేషన్ షిప్ మొదలైనపుడు అబ్యూసివ్ గా ఉండదు. ప్రేమలు కురిపిస్తూ , తేనెలు ఒలికిస్తూనే ఉంటుంది. మన దురదృష్టం కొద్దీ,  మన మనసులో అదే స్థిరపడిపోయి , తిరిగి ఆ ప్రేమ ఎప్పటికైనా తిరిగి వచ్చి మనల్ని కౌగిలించుకుంటుందని నమ్ముతాం మనం.   ఆ మనిషి మాయమైపోలేదని, జస్ట్ ఒక మేఘమో, మంచో అడ్డం వచ్చిందని నమ్మించుకుంటాం.’                - ఇందిర
   
 ఆనంద్ వల్ల  మోసపోయి పరస్పరం  ప్రత్యర్థులుగా భావించుకున్న   ఇందిర, మేఘన చివర్లో  ‘మనిద్దరం సఫర్ అయ్యాం’  అనే ఎరుకతో  ఒకరినొకరు  అర్థం చేసుకునే ఘట్టం  మనసుకు హత్తుకుంటుంది.  ‘పితృస్వామ్యంలో మంచి చెడు అనేవి ఉండవు. అందులో ఉన్నది మహిళల పట్ల వివక్ష మాత్రమే’  అంటుంది మేఘన..  ఇందిరతో. 


సాహిత్య ప్రస్తావనల పరిమళం
చలం, రంగనాయకమ్మ,  డా. శ్రీదేవి, గుల్జార్, మాయా  ఏంజెలో, కమలాదాస్,  సిమోన్ డి  బావియర్,  టాల్ స్టాయ్, ప్రాయిడ్...     ఏదో ఓ సందర్భంలో వీళ్ల  రచనల ప్రసక్తో,   కొటేషన్లో వస్తాయి.   

ఈ నవలా రచయిత్రులు  పుస్తకాలను అమితంగా ప్రేమించే సాహిత్యాభిమానులు  కావటం వల్ల కూడా చాలా ఘట్టాల్లో  సాహిత్య ప్రస్తావనలు పరిమళించాయి.  

ఒక్కో అధ్యాయపు సారాంశాన్ని స్ఫురించేలా శీర్షికలు  పెట్టడం బాగుంది.  అయితే ఆ  పేర్లను ఇంగ్లిష్ లో పెట్టడం మాత్రం  నాకో అసంతృప్తి. 
 

స్త్రీ  పురుష సంబంధాల్లోని  చిక్కులూ,  స్త్రీల ఆత్మగౌరవం, సాధికారత,  స్వేచ్ఛల  గురించీ వాస్తవికంగా,  సాహసోపేతంగా  చర్చించిందీ  రచన.   

ఈ మధ్య కాలంలో నాకు బాగా  నచ్చిన నవల  ఇది!  అందుకే దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత  ఓ బ్లాగ్ పోస్టు రాసే ఉత్సాహాన్నిచ్చింది. :)    


**** 

 

2, అక్టోబర్ 2020, శుక్రవారం

చందమామ ‘శంకర్’ కుంచె విన్యాసాలు!

సూక్ష్మాంశాలతో  సజీవ రూపు ‘రేఖ’లకు తుది మెరుగులు దిద్దుతూ..  శంకర్

  
‘చందమామ’ పత్రిక  అంటే ఆహ్లాదపరిచే  కథలే కాదు; అపురూపమైన బొమ్మలు కూడా! 

ఎలాంటి బొమ్మలవి? 

కథలను అలంకరించేవీ, కథ చదవాలనే ఉత్సుకతను కలిగించేవీ.  వాటిలోని సహజమైన రూపురేఖలూ, పరిసరాలూ కథను సంపూర్ణంగా ఆస్వాదించేలా చేసేవి.  అంతర్లీనంగా .. చదివేవారి పరిశీలనా శక్తిని అద్భుతంగా పెంచగలిగేవి!      

చందమామ చిత్ర సౌథానికి నాలుగు స్తంభాలైతే.. వారు  ఎంటీవీ ఆచార్య, వడ్డాది పాపయ్య;  చిత్రా, శంకర్ లు.  మొదటి ఇద్దరూ ప్రధానంగా ముఖచిత్ర రూపకర్తలు. చివరి ఇద్దరూ కథలను చిరకాలం గుర్తుండేలా చేసిన అజరామర చిత్ర లేఖనా శిల్పులు. 

వారిలో చందమామ వైభవ శకానికి తానొక్కరే సజీవ సాక్ష్యంగా ఉన్న శంకర్..  మొన్న సెప్టెంబరు 29న  కన్నుమూశారు.  

సంవత్సరాల తరబడి ఆయన గీసిన బొమ్మలు ఎన్నో తరాల మనసుల్లో నిలిచిపోయాయి.  ఆయన్ను ప్రత్యక్షంగా  చూడకపోయినా...  చిత్రాల అనుసంధానంతో,  అ అనుబంధంతో  ఎందరికో ఆత్మీయుడిగా నిలిచారు.  

నా బాల్యాన్ని-  

తన సున్నితమైన రేఖలతో, 

కనువిందైన రంగులతో, 

ముచ్చటైన నగిషీలతో, 

 ప్రశాంత ముని కుటీరాల,  

కీకారణ్యాల, 

అశ్వపద ఘట్టనల యుద్ధ ఘట్టాల, 

పౌరాణిక  రామణీయక దృశ్యాలతో  

సంతోషభరితం చేసిన.. చిత్రకారుడు శంకర్ గారి గురించి...

 దాదాపు 11 సంవత్సరాల క్రితం (30, నవంబర్ 2009)  ఇదే బ్లాగులో ఓ పోస్టు రాశాను. అందులోంచి కొంత.. 

--------------------

పౌరాణిక చిత్రకల్పనా శిల్పి... శంకర్ !

 
శ్రీ కృష్ణుడు కల్లోకి వస్తే... అది నిశ్చయంగా ఎన్టీఆర్ రూపమే అవుతుంది! అలాగే... ‘మహాభారతం’ అయినా, ‘రామాయణం’ అయినా- వాటిలోని సంఘటనలు,  చాలామంది తెలుగు పాఠకులకు ‘శంకర్’ చిత్రాలుగానే స్ఫురణకు వస్తాయి.


పౌరాణిక ఘట్టాలకు సాధికారికంగా, నేత్రపర్వంగా చిత్రకల్పన చేయగలిగిన ‘చందమామ’ శంకర్... (కె.సి. శివశంకర్)....  ఆ పత్రికలో మిగిలిన నాటి తరం చివరి చిత్రకారుడు!


దశాబ్దాలుగా వేన వేల అజరామరమైన, అపురూప చిత్రాలను దీక్షగా సృజించి కూడా ప్రాచుర్యానికి దూరంగా ఉండిపోయిన అద్భుత కళాకారుడు!


పౌరాణిక గాథలూ, ఇతిహాసాలూ చందమామలో ప్రచురితమై అశేష పాఠకుల మనసులకు హత్తుకుపోయాయంటే... ముఖ్యంగా శంకర్ ప్రతిభా విశేషాలే కారణమనిపిస్తాయి.


చందమామలో 1969 మార్చిలో ‘మహా భారతం’ ధారావాహికగా మొదలైంది. మొదటి భాగానికి వడ్డాది పాపయ్య గారు బొమ్మలు వేశారు. టైటిల్ లోగో వ.పా. శైలిలో నే ఉండటం గమనించవచ్చు. రెండో భాగం నుంచీ బొమ్మల బాధ్యతను శంకర్ గారు తీసుకున్నారు. ఈ ధారావాహిక 1974 సెప్టెంబరు వరకూ.... ఐదు సంవత్సరాలకు పైగా కొనసాగింది.


1974 అక్టోబరు నుంచీ ‘వీర హనుమాన్’ ధారావాహిక ప్రారంభమైంది. దీని లోగో కూడా మహాభారతం మాదిరే ఉంటుంది!


మహాభారతం సీరియల్ గా వచ్చినపుడు కొన్ని సంచికలే అందుబాటులో ఉండి, వాటిని మాత్రమే చదవగలిగాను. వీరహనుమాన్ మాత్రం దాదాపు అన్ని సంచికలూ చదివాను. సరళమైన చందమామ భాషతో పాటు అద్భుతమైన శంకర్ బొమ్మలు పేజీలను అలంకరించివుండటం వల్ల ఈ ధారావాహిక రసవత్తరంగా, ఉత్కంఠభరితంగా అనిపించింది.


కురుక్షేత్ర సమర ఘట్టాలు, 

భీష్ముడి అవక్ర పరాక్రమం, 

పాండవుల మహాప్రస్థానం; 

రాముడి అరణ్యవాసం, 

వాలి సుగ్రీవుల గాధ, 

వాలి వధ, 

హనుమంతుడి లంకా నగర సాహసాలు, 

వారధి నిర్మాణం, 

రామ రావణ యుద్ధం .. 

ఇవన్నీ శంకర్ కుంచె విన్యాసాల మూలంగా నా మనో ఫలకంపై నిలిచిపోయాయి.


ఇలాంటి అనుభూతులే అసంఖ్యాకమైన పాఠకులకు ఉండివుంటాయి!


చిత్రా, శంకర్ ల బొమ్మలతో మాత్రమే చందమామ సంచికలు వచ్చిన దశకాల్లో చందమామది ఉజ్వల శకం.  

ఈ ఇద్దరు చిత్రకారులదీ  సూక్ష్మాంశాలను కూడా వదలకుండా వివరంగా  చిత్రించే శైలి. వీరి బొమ్మల్లో ఆకట్టుకునే నగిషీల్లో కూడా సారూప్యం కనిపిస్తుంది. 

అయినా, ఇద్దరి బొమ్మల్లో స్ఫష్టమైన తేడా!  

చిత్రా బొమ్మల్లో పాత్రలు కాస్త ‘లావు’;  

శంకర్ పాత్రలు మాత్రం  ‘స్లిమ్’!  (రాక్షసుడూ, రాక్షసి లాంటి పాత్రలు మినహాయింపు అనుకోండీ.)


చిత్రా విశిష్టత జానపదమైతే... శంకర్ ప్రత్యేకత పౌరాణికం!

--------------------

ప్రస్తుతానికి వస్తే....

బేతాళ కథల బొమ్మ
బేతాళ కథలకు శంకర్  వేసిన విక్రమార్కుడి బొమ్మ (లోగో) ఎంతో ప్రాచుర్యం పొందింది.  ఇది  గొప్పగా ఉందనటంలో సందేహమేమీ లేదు.  

కానీ -
 

శవంలోని బేతాళుణ్ణి భుజాన వేసుకుని, మౌనంగా శ్మశానంకేసి నడిచే ఆ విక్రమార్కుడి బొమ్మను మొదట వేసింది ‘చిత్రా ’(1955  సెప్టెంబర్ సంచిక).  ఆ శ్మశానం, విక్రమార్కుడి భంగిమ, భీతిగొలిపే వాతావరణం ... ఆ క్రెడిట్ ఆయనదే.  దానిలో విక్రమార్కుడు మన వైపు తిరిగి ఉంటే, బేతాళుడి కాళ్ళు కనిపిస్తుంటాయి. 

చిత్రా సృష్టించిన చిత్రమిదే.. 


ఆ కాళ్ళకు బదులు తల కనపడేలా దీన్ని మార్చి, మరింత మెరుగుపరిచింది శంకర్.  ఓర చూపు, స్థిర సంకల్పంతో ఠీవిగా కదులుతూ,  వీపు కనిపించేలా నడిచే విక్రమార్కుడి భంగిమ చిత్రించి, దానికి శాశ్వతత్వం సమకూర్చారు ఆయన.  

శంకర్ మెరుగుపరిచిన  బొమ్మ

బేతాళ కథలకు శంకర్  పేటెంట్ చిత్రకారుడిలా ఎక్కువ బొమ్మలు వేశారు. 

బేతాళుణ్ణి  భుజాన  వేసుకుని, చెట్టు కొమ్మల్లోంచి దిగబోతున్న విక్రమార్కుడి బొమ్మ కూడా బాగుంటుంది. చిత్రా చిత్రించిన ఈ లోగోను మధ్యలో కొన్ని సంచికల్లో వరసగా  ప్రచురించారు. 
 
శంకర్ వేసినన్ని కాదు గానీ...  చిత్రా.. ఇంకా ఎంటీవీ ఆచార్య, బాపు.. తర్వాత కాలంలో రజీ, శక్తిదాస్ లు  బేతాళ కథలకు బొమ్మలు వేశారు.
 

చందమామలో శంకర్ తొలి బొమ్మలు...

1947 జులైలో ఆరంభమైన చందమామలోకి  శంకర్  1952 లో చేరారని తెలుసు.  కానీ  ఆ సంవత్సరం సంచికల్లో శంకర్ బొమ్మలేవీ లేవు.  బహుశా ఆయన  ఆ సంవత్సరాంతంలో చేరివుంటారు. 

ఆయన తొలి నాటి బొమ్మలు ఎలా ఉన్నాయి? వాటిని  చూడాలనే  ఆలోచన వచ్చింది.   

పాత సంచికలు తిరగేశాను, ఆసక్తిగా.

1953 జనవరి సంచికలో ఆయన మూడు కథలకు బొమ్మలూ, ఒక ఫీచర్ కు లోగో చిత్రించారు. 

సంచికలో మొదటగా కనిపించే ‘పాడుబుద్ధి’ కథకు వేసిన బొమ్మలను ఆయన మొదటి బొమ్మలనుకోవచ్చు. 


శంకర్ వేసిన  తొలి ఫీచర్ బొమ్మ

శంకర్ తొలినాటి ఓ  బొమ్మ... 

వీరబల్ (బీర్బల్) కథకు వేసిన బొమ్మ.. 1953 జనవరిలోదే

కథ మొత్తం కావాలంటే... ఈ నాలుగు పేజీలూ చదవండి..





అప్పట్లో ఆయన సంతకం ఇంగ్లిష్  కాపిటల్స్ లో  ఒద్దికగా ఉండేది. తర్వాత సంతకం.. మనందరికీ తెలిసినది- కుడివైపుకు ఏటవాలుగా వంగి,  స్వేచ్ఛగా స్మాల్ లెటర్స్ తో  ఉంటుంది. 

 
ఫిబ్రవరి 1953  చందమామ  సంచికలో దాదాపు అన్ని కథలకూ శంకరే వేశారు.  వీటిలో ఆలూరి బైరాగి, కొడవటిగంటి కుటుంబరావుల గేయమూ, కథా  ఉన్నాయి. 

కొడవటిగంటి  ‘అభేద్య’ కథ చివరి బొమ్మ ఇది. దీనిలో శంకర్  శైలి అనదగ్గ ‘నగిషీ’ మొదలైంది,  చూడండి.


ఆ నగిషీ తర్వాతి కాలంలో  చాలా చిత్రాల్లో ఉంటుంది. 

కింద ఈ రెండు బొమ్మలూ  చూడండి, ఆ నగిషీ ఎక్కడుందో గమనించండి.



సహజ ప్రతిభావంతుడైన శంకర్ గీతలో పరిణతీ, సాధికారతా ఆయన చిత్రించిన  రెండో సంచిక (1953 ఫిబ్రవరి) కల్లా  వచ్చేశాయి!

తర్వాతి  సంచిక... 1953 మార్చి నెలది.  ఈ సంచికకు శంకర్  ఏకంగా ముఖచిత్రమే వేసేశారంటే  ఆయన సామర్థ్యాన్ని  చందమామ ఎంతలా గుర్తించిందీ అర్థం చేసుకోవచ్చు!

శంకర్ వేసిన మొదటి ముఖచిత్రం

అలా ఆయన చందమామలో స్థిరపడిపోయారు.  క్రమంగా పౌరాణికాల చిత్రరచనలో స్పెషలైజ్  చేశారు.  

శంకర్ ప్రతిభ చందమామకే పరిమితం కాలేదు.  రామకృష్ణ ప్రభలో  కామిక్స్ లాంటి కొన్ని పౌరాణిక బొమ్మల కథలు వేశారు.  అవి పుస్తకాలుగానూ వచ్చాయి.


శంకర్ వేసిన పౌరాణికాల  బొమ్మలే  వేలల్లో ఉంటాయి.  ఆయన చిత్రలేఖన ప్రతిభను ప్రతిఫలించే  కొన్నిటిని  చూడండి.

    

వృత్రాసురుడి విజృంభణ


నరకుడి కొడుకు..భగదత్తుడు

భీష్ముడి యుద్ధ పరాక్రమంపై పాండవుల సమాలోచన

     దేవీ భాగవతం సీరియల్లో సింహ వాహినీ,  శ్రీ కృష్ణుడూ


కురుక్షేత్రంలో  క్రౌంచ (పక్షి) వ్యూహం

సీతాపహరణాన్ని అడ్డగిస్తూ రావణుడితో జటాయువు యుద్ధం

హనుమంతుడు చూస్తున్న లంకా నగర దృశ్యం

అనిరుద్ధుడి అదృశ్యం.. అతడి భార్యల కలవరం. దూరంగా ‘తాత’  శ్రీకృష్ణుడి సమాలోచనలు

శ్రీకృష్ణావతారం 

బేతాళ కథ చివరిపేజీలో విక్రమార్కుడి భుజమ్మీద నుంచి (శవంలోంచి) మాయమై, చెట్టుమీదకు దూసుకుపోయే బేతాళుడి బొమ్మలు శంకర్ ఎన్ని వందలు వేశారో! ప్రతి బొమ్మలోనూ సారాంశం ఒక్కటే అయినా, ఎంతో వైవిధ్యం చూపించారు. తోకతో తెల్లగా దయ్యంలా  (దయ్యం ఇలాగే ఉంటుందని....  నాలాంటి ఎందరికో  చిన్నపుడు అనిపించేది)  చెట్టు మీదికి దూసుకుపోయే బేతాళుడూ; కత్తి దూసి, వెంటాడే విక్రమార్కుడూ... ఈ చిత్రం ఎందరో పాఠకుల  స్మృతుల్లో సజీవం!


(చిత్రా కూడా ఈ బేతాళుడు చెట్టుమీదకు దూసుకుపోయే ఆఖరి పేజీ బొమ్మలు కొన్ని వేశారు.  విక్రమార్కుణ్ణి లాంగ్ షాట్లో  ఉంచి బేతాళుణ్ణి క్లోజప్ లో వేయటం చిత్రా స్పెషాలిటీ )
 
శంకర్ వేసిన ఆ బొమ్మలు కొన్ని ఇక్కడ చూడండి- 

 




















తన పౌరాణిక  బొమ్మల లోకంలో  శంకర్

 


27, సెప్టెంబర్ 2019, శుక్రవారం

బాల రాహుల్... గాన లాహిరి!



లేత గొంతు నుంచి  జాలువారే  ఆ  తీయని గానం  జనం  మనసులను ఇట్టే కట్టిపడేస్తుంది.  

ఆ  బెంగళూరు బాలుడి గళ  వశీకరణం అలాంటిది.

పేరు-  రాహుల్ వెల్లాల్ !  

‘వెల లేని పువ్వు కదా మనిషికి చిరునవ్వు!’ 
అంటుంది కవయిత్రి   యం.బి.డి. శ్యామల,  ఓ  గజల్ లో.     

రాహుల్ వెల్లాల్ ను వీడియోల్లో చూస్తుంటే... ఆ వాక్యమే గుర్తొస్తుంది!

పాడుతున్నంతసేపూ చెదరని  మందస్మితం.  స్వచ్ఛంగా,  అమాయకత్వం ఉట్టిపడే  చిలిపి  చిరునవ్వు.

మంద్ర-మధ్య- తార స్థాయి  శ్రుతులకు తగ్గట్టుగా -
తలను  చిన్నగా అటూ ఇటూ కదలిస్తూ...
ఒక్కోసారి కళ్ళు మూస్తూ.. 
చేతులను  భావ స్ఫోరకంగా  పైకెత్తుతూ ..  
తాదాత్మ్యంతో
ఆరోహణ... అవరోహణలతో
రాహుల్   పాడుతూవుంటే...  

త్యాగయ్య   చెప్పినట్టు- ‘నాభీ హృత్కంఠ రసన నాసాదుల యందు’ పాడుతున్నాడా అనిపిస్తుంది !
   
బాణీలోని  తీయదనం పంచుతూ  పాట  శ్రోతలకు  రసానుభవాన్ని అందిస్తుంది.  

*     *     * 


ఎస్ వీ భక్తి చానల్ లో ప్రసారమైన.. ‘అన్నమయ్య పాటకు పట్టాభిషేకం’  పాటల కార్యక్రమాలు హైదరాబాద్ లోనే జరిగాయి. వాటిలో రాహుల్ తన గాన వైదుష్యంతో  మెరిశాడు.

‘అయ్యో  నేనేకా అన్నిటికంటె దీలు..’  అనే   పాటను  రాహుల్  పాడుతుంటే   వేదిక మీద  ఉన్న గాయని సునీత   కదిలిపోయి,  కన్నీరు  కార్చి  ‘మనసూ, దేహం, ఆత్మా స్వచ్ఛమయ్యాయి’ అంటూ’   సభాముఖంగా చెప్పారు.  

సంగీత దర్శకుడు   కీరవాణి ‘ రాగమయి అయిన   సరస్వతి రాహుల్ వెల్లాల్ లో  కనిపించింది’   అంటూ మెచ్చుకున్నారు.

బాణీని  సరిగా  నేర్చుకుని  సంగీతపరంగా లోపాల్లేకుండా , భాషాపరంగా  ఉచ్చారణ దోషాల్లేకుండా పాడినంతమాత్రానే  ఏ పాటా మీటదు హృదయాల్ని.  సాహిత్యంలోని  భావం గ్రహించి రసానుభూతితో పాడటం కదా ముఖ్యం!

సంగీతం సమకూర్చిన జోశ్యభట్ల శర్మ  గారి నుంచి  ఆ పాట అర్థం  చెప్పమని అడిగి,  తెలుసుకున్నాకే  నేర్చుకుని పాడాడు  రాహుల్.    

అంత శ్రద్ధ ఉంది కాబట్టే..   తనకు  మాతృభాష కాని తెలుగులో 500 సంవత్సరాల క్రితం అన్నమయ్య  రాసిన పాటల విషయంలో  తనకుండే  పరిమితులన్నిటినీ అలవోకగా దాటేశాడు. అనితర సాధ్యమన్న రీతిలో  పాడేశాడు!

‘అన్నమయ్య పాటకు పట్టాభిషేకం’  సిరీస్ లో రాహుల్ పాడిన -

* ‘అమ్మేదొకటియును..అసిమ లోని దొకటీ’
* ‘శోధించి చూడబోతే..’ 
*  ‘ఏమని నుతించవచ్చు..’

పాటలు కూడా బాగుంటాయి.
   

*     *     *  

సాన పెట్టిన  కులదీప్ పాయ్

రాహుల్   వయసు ఇప్పుడు   పన్నెండేళ్ళు.  అయితే  ఇతడి ప్రతిభ ప్రపంచానికి   మూడేళ్ళ క్రితమే పరిచయం.


రెండేళ్ళ పసి వయసులో రాహుల్   పాటను గుర్తించటం, హమ్ చేయటం చూసి సంగీతం పట్ల అతడి ఆసక్తిని గమనించారు తల్లిదండ్రులు.  అంత చిన్నవయసులో సంగీత ఉపాధ్యాయులెవరూ  నేర్పలేమంటే..  నాలుగేళ్ళ వయసు వచ్చాక,  శిక్షణలో ప్రవేశపెట్టారు. 

సంగీత పాఠశాల వార్షికోత్సవంలో ఆరేళ్ళకే అరగంటసేపు మొదటి సంగీత కచ్చేరీని ఇచ్చేశాడు.  మరో ఏడాదికి బెంగళూర్ లోని ఓ గుడిలో పాటల లిరిక్స్ కాగితాలేమీ చూడకుండా, వాద్యకళాకారులతో  రిహార్సల్స్ లేకుండానే గంటన్నర సేపు రెండో కచ్చేరీ చేశాడు. 

బెంగళూరులోనే ఉండే కళావతి అవధూత  అతడి సంగీత గురువు.

నాలుగేళ్ళ క్రితం  సూర్య గాయత్రిని  చిన్న వయసులోనే   డిస్కవరీ చేసి, సంప్రదాయ సంగీతంలో అద్భుత గాయనిగా   తీర్చిదిద్దిన  కులదీప్ ఎం. పాయ్  తెలుసుగా?  

రాహుల్   వెల్లాల్   ప్రతిభకు సానపెట్టి   చక్కని పాటలు పాడించి మనందరికీ తెలియజేసింది కూడా   కులదీప్ పాయే..!

 ముగ్గురు... గురు శిష్యుల ఆటవిడుపు

 ( రాహుల్ ని మహావిష్ణువుగా,  సూర్య గాయత్రిని  సోదరి పార్వతిగా,  ఎత్తుకుని మోస్తున్న తనను ఆదిశేషుడిగా పోల్చుకుంటూ కులదీప్  ఈ ఫొటోకు సరదా వ్యాఖ్య  రాశారు). 




సూర్య గాయత్రితో కలిసి... 

కులదీప్ పాయ్ నిర్దేశకత్వంలో... సూర్య గాయత్రితో కలిసి రాహుల్ వెల్లాల్  పాడిన  అన్నమయ్య తెలుగు సంకీర్తనలు యూ ట్యూబ్ లో విడుదలై   లక్షలమంది సంగీతాభిమానులను  పరవశులను చేస్తున్నాయి. 
  
*    ‘బ్రహ్మమొక్కటే.. పర బ్రహ్మమొక్కటే’ 

*    ‘ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడే’



‘ గతియై మమ్ము గాచే కమలాక్షుడూ’  అని  స్థాయిని తగ్గించి పాడేటప్పుడు రాహుల్  కర విన్యాసం గమనించండి.  

కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన ఈ  బాల మేధావులు తమిళనాడులో స్థిరపడిన  కులదీప్ ఆధ్వర్యంలో తెలుగు పాటలను  శ్రవణపేయంగా  పాడటం  ముచ్చటగా అనిపిస్తుంది.  

రాహుల్ ఒక్కడే పాడిన పాటలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఎంతో బాగున్నవాటిలో..

సదాశివ బ్రహ్మేంద్ర సంస్కృత రచన -
* ‘పిబరే రామరసం’



 మీరాబాయి హిందీ రాజస్థానీ భజన-

  *‘పాయో జీ మైనే రామ్ రతన్ ధన్ పాయో’



ఈ పాటలో స్వర విన్యాసాలు చాలా బాగుంటాయి.  ముఖ్యంగా  వీడియోలో 5.02 నిమిషాల దగ్గర ‘మీ...రా.. కే ప్రభూ’ అనేచోట శ్రోతలను  సమ్మోహితులను చేస్తాడు.    


వైవిధ్యం.. మాధుర్యం
 
13వ శతాబ్దం నాటి సంత్  జ్ఞానేశ్వర్ అభంగ్ లూ, 
15వ శతాబ్ది నాటి అన్నమయ్య  సంకీర్తనలూ, 
వ్యాసరాయ తీర్థ  కన్నడ కృతులూ,
16 శతాబ్దపు మీరాబాయి  భజనలూ, 
17వ శతాబ్దానికి చెందిన రామదాసు కీర్తనలూ,
18-19 శతాబ్దాలకు చెందిన త్యాగయ్య కీర్తనలూ, 
సదాశివ బ్రహ్మేంద్ర  కీర్తనలూ...

రాహుల్ వెల్లాల్ గొంతులోని  వైవిధ్యాన్నీ, మాధుర్యాన్నీ వెలారుస్తున్నాయి. 

ముఖ్యంగా మన  తెలుగు పాటలను ఎంత చక్కని ఉచ్చారణతో  పాడుతున్నాడో!  ( సూర్య గాయత్రి దీ ఇదే తీరు).   

‘ద లయన్ కింగ్ ’ తెలుగు అనువాద చలన చిత్రంలో  రాహుల్  ‘నేనే రాజా ఎప్పుడౌతానూ ’ అనే హుషారు పాటను హరిప్రియ, రాములతో కలిసి పాడాడు.

సినీరంగంలో బహుశా తన తొలి అడుగు ఇదే.

మన బాలమురళీ కృష్ణ తనకు ఆదర్శం అని చెపుతాడు.

ఇలా మొత్తానికి రాహుల్ కీ తెలుగుకూ  చాలా అనుబంధం పెరుగుతున్నట్టే ఉంది. 

వెంటాడుతున్న అభంగ్ 

ఈ జనవరిలో విడుదలైంది  రాహుల్ పాడిన ‘యోగ యాగ విధీ.. యేణే నోహే సిద్ధి వాయాచి ఉపాధి దంభ ధర్మ'
 అనే  సంత్ జ్ఞానేశ్వర్ ‘ హరిపాఠ్ అభంగ్’. 

నేను విన్నది కొద్ది రోజుల క్రితమే. కులదీప్ ఎం. పాయ్  అద్భుతమైన  స్వరకల్పన, రాహుల్  తాదాత్మ్యతతో పాడిన విధానం గొప్పగా ఉన్నాయి.

ఈ మధ్య కాలంలో నన్ను బాగా  హాంట్ చేసేసి, ఎక్కువ సార్లు వినేలా చేస్తున్న మరాఠీ  పాట ఇది. 

మీరూ ఆ వీడియో చూడండి-



అష్టాంగ యోగాలూ, యాగాలూ లాంటి తంతులు మనిషికి  ముఖ్యం కాదనీ,  అవి డాంబికానికే, అహంకారానికే పనికొస్తాయనీ ఈ అభంగ్  చెపుతుంది. అలాగని ఇది  హేతువాద రచనేమీ కాదు.  ఆధ్యాత్మిక  ‘సిద్ధి’ని ప్రబోధించేదే.  

రాహుల్ గాన కళా చాతుర్యం
ఇంతగా వికసించటానికి స్వయం ప్రతిభతో పాటు  తల్లిదండ్రుల ప్రోత్సాహం తొలి కారణం. గురువుల,  పాటల సంగీత దర్శకుల, వాద్య బృందాల  సహకారమూ ఎంతో  ఉంది.  

ఇతణ్ణి  అభినవ బాలమురళీ కృష్ణ అనీ,  జూనియర్  శంకర్ మహదేవన్ అనీ  పోలికలు తెస్తున్నారు చాలామంది.   కానీ ఎవరితోనూ పోల్చనవసరం లేకుండా  సొంత ముద్రతో గానకళలో  ఎంతో ఎత్తుకు వెళ్ళగలిగే  సత్తా రాహుల్ కి ఉందనేది నిస్సందేహం.  

*     *     * 

భారతీయ సంప్రదాయ సంగీతమంటే  నాకు చాలా ఇష్టమూ, ఆసక్తీ !

కానీ  ఆ సంగీతంతో  అనుసంధానమై ఉండే ‘దైవ భక్తి’తో గానీ, ‘ఆధ్యాత్మికత’తో గానీ నాకే మాత్రమూ  ఏకీభావం లేదు,  ఉండదు. 

రాహుల్ ను గానీ, సాంప్రదాయిక సంగీతకారులు మరెవరినైనా గానీ అభిమానించటమంటే  సంగీత కళలో వారి విశిష్ట ప్రతిభను అభిమానించటం మాత్రమే. ఆ కళను  ఆస్వాదించటమే.  ఆ పాటల్లో పొదిగివున్న భక్తినీ, వాటిలోని  భావాలనూ  ఔదలదాల్చటం మాత్రం  కాదు !