సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

29, అక్టోబర్ 2016, శనివారం

వేదాలూ... హేతువాదాలూ!

 
రామాయణ, మహాభారత, మహా భాగవతాల్లో  ఏముందో  నా చిన్నవయసులోనే  ‘చందమామ’, ఇతర పుస్తకాల ద్వారా  తెలుసు. వాటి మూల గ్రంథాలను (తెలుగు వచన అనువాదాలే) తర్వాతి కాలంలో చదివాను. 

అయితే  వీటన్నిటికంటే ప్రాచీనమైన వేదాల గురించి ఇన్నేళ్ళుగా వింటూ ఉండటమే గానీ,  పెద్దగా తెలుసుకున్నదేమీ లేదు. 

అవి  కథా రూపంలో  ఉండకపోవటం  దీనికో కారణం కావొచ్చు!

‘భారతదేశ చరిత్ర’ పుస్తకాల్లో ఆర్యుల గురించీ, వేద కాలపు సమాజం గురించీ కొంత చదివినప్పటికీ అది వేదాలను చదవటమైతే  అవ్వదు కదా!

‘నాస్తికో వేద నిందక:’  అంటారు కదా? వేదాలను నాస్తికులు ఎందుకని నిందించారు? అసలు వాటిలో ఏముంది? ( అసలు వేదాల్లోనూ నాస్తికుల ప్రస్తావన కనిపిస్తుంది).  

ఈ సందేహాలను నివృత్తి చేసుకోవటం ఇన్నేళ్ళ తర్వాత కుదిరింది! 

దానికి కారణం... రంగనాయకమ్మ ఈ మధ్య రాసిన  వేదాల పరిచయ పుస్తకం- ‘ఏం చెప్పాయి వేదాలు?’

పవిత్రం... ప్రామాణ్యం..!

రుగ్వేదంలో  మొదటి శ్లోకం..
వేదాలను ప్రస్తావించి  మాట్లాడేవారు అవి పవిత్రమైనవనే చెపుతుంటారు.  శుభకార్యాలకు నాందిగా,  కొనసాగింపుగా నేపథ్యంలో  వేద మంత్రోచ్చారణలూ,  వేదఘోషలూ..!

వేదోక్తమంటే అది అనుల్లంఘనీయమో, అనుసరణీయమో అనే స్థాయిలో గౌరవాదరాలు కనపడుతుంటాయి.

ఫలానా దురాచారం వేదాల్లో లేదని చెప్పటానికీ, వాదాల్లో నెగ్గటానికి  ‘వేద ప్రామాణ్యాన్ని’ తురుపు ముక్కలా ఉదాహరించటానికీ  పండితులూ, సంస్కర్తలూ  ప్రయత్నించటం ఇటీవలి చరిత్రే..

వేదాల్లో  కుల (వర్ణ) వ్యవస్థ లేదనీ, అవి  స్త్రీల పట్ల ఎంతో గౌరవం చూపాయనీ నమ్మకంగా వాదించే వ్యాసాలు నెట్ లో ఇప్పటికీ చూడొచ్చు.

‘దయ్యాలు వేదాలు వల్లించినట్టు’ లాంటి సామెతలు  వేదాల పట్ల ఎంతో అనుకూల భావాలను కలగజేస్తుంటాయి.

అయితే... వేమన పద్యాలు కొంత మినహాయింపు అనుకోండీ...

‘‘వేద విద్యలెల్ల వేశ్యల వంటివి
భ్రమల పెట్టి తేటపడగనియవు
గుప్త విద్య యొకటి కులకాంత వంటిది
విశ్వదాభిరామ వినుర వేమ’’


వేదాలపై  అపరిమితమైన  భక్తి విశ్వాసాలు ప్రకటించేవారిలో  కూడా  ఎంతమంది వాటిని చదివివుంటారు?

చదివినవారిలో,  ‘కంఠస్థం’కూడా చేసి వాటిని భక్తిగా వల్లించేవారిలో కూడా... అర్థాలను తెలుసుకున్నవారు ఎందరు?

‘‘మంత్రమును దలుతురు మంత్రార్థ మెరుగరు
అర్థమెరుగలేక అంధులైరి’’
అన్నాడు వేమన!


శ్లోకాల భావం యథాతథంగా...

వేదాలను  పరిచయం చేయటమంటే .. కేవలం వ్యాఖ్యానం చేయటం కాకుండా ... నాలుగు వేదాల్లోని  శ్లోకాలకు పండితులు చేసిన అనువాదాలను కూడా రంగనాయకమ్మ ఈ పుస్తకంలో  ఇచ్చారు.  అలా  యథాతథంగా ఇవ్వటం ఎందుకు చేశారో...  ఆమె ఇలా చెప్పారు... .


 ఈ  ‘ఏం చెప్పాయి వేదాలు?’ పుస్తకం చదివాను.

దీనిలోని పది అధ్యాయాల్లో మొదటి నాలుగిటినీ నాలుగు వేదాల శ్లోకాల భావాలకు  కేటాయించారు. ఆరో అధ్యాయం పెద్దది. దీనిలో  15  అంశాలున్నాయి. మరో నాలుగు అధ్యయాల్లో వేద భక్తుల వాద భేదాలు మొదలైనవి చర్చించారు,
 
పుస్తకమంతా వేదాల్లోని  అంశాలను విశ్లేషించటం,  ప్రశ్నించటం, తర్కించటం  కనపడుతుంది. 

తన భావాలనూ, దృక్కోణాన్నీ నిక్కచ్చిగా... కుండబద్దలు కొట్టినట్టు  చెప్పటం ఆమెకు అలవాటే కదా!

ఈ పుస్తకంపై  ఈనాడు ఆదివారం పుస్తకంలో చిన్న రివ్యూ ఇలా  రాశాను...


ఒక వేపు జంతు బలుల గురించీ; ఇంకో వేపు మానవుల్లో భేదాల గురించీ బోధిస్తాయి వేదాలు. 

ఆ కాలంలో కూడా  హింసాయుత యజ్ఞాల్ని వ్యతిరేకించేవాళ్ళూ,  ఇంద్రుణ్ణి వ్యతిరేకించే మాయావాదులూ (నాస్తికులు)  ఉన్నారని వేదాల ద్వారానే తెలుస్తుంది.

‘‘వేదశాస్త్రములు చదివినవారే ఎరుగరు సృష్టివిలాసం’’ అని ‘బాటసారి’ సినిమాలో ఓ పాట ఉంది.

వేదశాస్త్రాలు చదివినవారికే కాదు, సాక్షాత్తూ  రుగ్వేదంలోని ‘నాసదీయ సూక్తం’... సృష్టి గురించి సృష్టికర్తక్కూడా తెలియదేమో అంటూ సందేహాలను ప్రకటిస్తుంది.  దీనికి నాస్తిక వాదాల ప్రభావం కారణం కావొచ్చు.
 

టెలివిజన్లో చర్చ..

ఈ  పుస్తకం విడుదలయ్యాక...  టీవీ 9 వాళ్ళు  ఒక చర్చా  కార్యక్రమం ప్రసారం చేశారు. టీవీ చర్చలంటేనే అరకొరగా,  అసమగ్రంగా ఉంటాయనేది నా అభిప్రాయం.  దాన్నిరుజువు చేస్తూ ఆ కార్యక్రమం సాగింది.

యాంకర్ గానీ,  చర్చకు వచ్చిన  వేద పండితులు గానీ ‘ఏం చెప్పాయి వేదాలు?’ పుస్తకం చదవనే లేదు. (అది స్పష్టంగా తెలుస్తోంది...)  రచయిత్రి మాట్లాడిన మాటల్లో రెండు మూడు  ముక్కలు చూపించి వాటి ఆధారంగా చర్చ జరిపారు. ఇదంతా అర్థరహితంగా అనిపించింది. ..

ఈ  ‘చర్చ’ సాగుతుండగా టీవీలో యాంకర్  మాట్లాడిన మాటలు... ‘స్క్రోలింగ్’లోనూ  చూపించారు.  ఇవి  మరీ ఘోరం.

‘సోషల్ మీడియాలో రంగనాయకమ్మపై నెటిజన్ల ఎదురుదాడి’  అట.

నెటిజన్లందరూ  ఒకే రకమైన  ఆలోచనా  దృక్పథం ఉన్నవాళ్ళు అయినట్టు! 

ఈ పుస్తకం లోని విషయాలను గురించి ఏమీ ప్రస్తావించకుండా... చర్చించకుండా  ఫేస్ బుక్ లో  ఇద్దరు ముగ్గురు  అశ్లీల పదజాలంతో  రచయిత్రిపై పోస్టులు రాశారు.

ఆ  అసహనమేనా  ‘ఎదురు దాడి’  అంటే!

చర్చించే సత్తా లేని, సంస్కారంలేని వాళ్ళు  ఉక్రోషంతో ఆశ్రయించేది దూషణనే కదా?

స్క్రోలింగ్ లో మరో వాక్యం-

‘‘వేదం గురించి తెలియని రంగనాయకమ్మ విశ్లేషించడమేంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు’’

వేదాల గురించి తెలియకుండానే, వాటిని  చదవకుండానే  ఆమె విశ్లేషించారా?

ఎవరీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు? ఆ నెటిజన్లలో  ‘వేదం’ చదివినవారు ఎంతమంది? 
   .
కుల వ్యవస్థకు పునాది
‘వేదాలకు సకల ప్రాణిజాలం మీద అనంతమైన ప్రేమానురాగాల’ని వాటిని తెలుగులో అనువదించిన దాశరథి రంగాచార్య అంటారు.  కానీ ఆయనే ‘అశ్వమును వధించిన మాట వాస్తవము. ఆ వధ ఎవరి కొరకు జరిగినది?  సంకుచిత స్వార్థమునకు కాదు. సమస్త మానవాళి కల్యాణమునకు!’ అంటూ దానికి మళ్ళీ   సమర్థన!

అమానుషమైన వర్ణవ్యవస్థకు పునాది వేదాల్లోనే  ఉంది. 

రుగ్వేదం చివరిలో - పురుష సూక్తమ్ లో... వర్ణాల్ని దేవుడే  సృష్టించాడు అని చెప్పారు...


బ్రాహ్మణో”‌உస్య ముఖ’మాసీత్ | బాహూ రా’జన్యః’ కృతః |
ఊరూ తద’స్య యద్వైశ్యః’ | పద్భ్యాగ్‍మ్ శూద్రో అ’జాయతః ||


దీని  అర్థం -

‘‘ఆ విరాట్ పురుషుడి నుండియే బ్రహ్మాండము ఏర్పడినది... అతని ముఖము నుండి బ్రాహ్మణులూ; బాహువుల నుంచి  క్షత్రియులూ , తొడల నుంచి వైశ్యులూ, పాదముల నుండి శూద్రులూ జన్మించినారు’’


దీనిపై  రచయిత్రి వ్యాఖ్యలు-

‘‘విరాట్ పురుషుడి నుంచి బ్రహ్మాండం ఏర్పడింది. అసలు, విరాట్ పురుషుడు ఎవరి నుంచి ఏర్పడ్డాడు? ... ఈ సమాజంలో  ఆ 4 రకాల వర్ణాలూ కనపడుతున్నాయి. ఆ విరాట్ పురుషుడు కనపడటం లేదు.’’ 

‘‘దేవతల పేర్లతో జంతువుల బలులు ఎంత క్రూరమో, మానవుల్ని ఎక్కువ తక్కువలుగా భావించే విభజన, ఇంకో రకం క్రూరం!’’  


రుగ్వేదంలో-  స్త్రీల గురించి ఏం చెప్పారు?

రుషులు రుక్కుల్లో  కీర్తించే ఇంద్రుడి మాటల్లో - ‘‘స్త్రీ మనసును శాసించుట అసంభవము. స్త్రీ బుద్ధి కొంచెముది.’’

ఇక  ఊర్వశి మాటల్లో- ‘‘ స్త్రీల ప్రేమ నిలుచునది కాదు. స్త్రీ హృదయము తోడేలు హృదయము వంటిది ...’’  ( స్త్రీ ఎంతో చెడ్డదని స్త్రీతోనే చెప్పించారన్నమాట) 

‘మాకు ఆత్మజ్ఞానమును, కీర్తి ప్రతిష్ఠలను, ఆరోగ్యమగు దేహమును, భోగభాగ్యములను ప్రసాదించు’ అనే  ప్రార్థనపై రంగనాయకమ్మ వ్యాఖ్య...

‘‘కీర్తి ప్రతిష్ఠల ఆశకీ, ఆత్మజ్ఞానానికీ  ఎక్కడ పొసుగుతుంది? భోగభాగ్యాలకీ, ఆరోగ్యమగు దేహానికీ ఎక్కడ పొసుగుతుంది? సోమరసం పేరుతో , పిచ్చెక్కినట్టు మద్యాలు తాగుతూ, పొట్టల్ని గుట్టలుగా ఉబ్బించుకుంటూ వుంటే, ఇక ఆరోగ్యమా? భోగభాగ్యాలే పరిపూర్ణ ఆరోగ్యానికి శత్రువులు! ’’


జుర్వేదంలో  అశ్వమేధ వర్ణన... జుగుప్సాకరంగా ఉంటుంది.


‘అశ్వమా! లోకము దృష్టికి నీవు చంపబడినదానవు అగుచున్నావు. వాస్తవముగా నీకు మరణము లేదు. నీవు హింసింపబడుట లేదు. నీవు చక్కని మార్గమున దేవతలకు చేరుచున్నావు. అప్పుడు నీ కొరకు హర్యశ్వములు రథమునకు కూర్చబడును. అశ్వ సుందరాంగులు అందు ఉందురు. గాడిద బరువు మోసిన నీకు దివ్యాశ్వప్రాప్తి కలుగును’ 
(6-9-10) 


గుర్రం పేగుల్లో సగం అరిగిన గడ్డి గురించీ, పచ్చి మాంసం వాసన గురించీ, అశ్వ మాంసం నిప్పు మీద బాణలిలో ఉడికేటపుడు వచ్చే ‘పరిమళం ’ గురించీ  వర్ణనలు! 

దాన్ని కోసేవారు ‘పుణ్యాత్ములు’అట. ‘‘అశ్వమా!  ఎవడు నిన్ను నరుకును? ఎవడు నీ తోలు వలుచును? ఎవడు నీ అవయవములను కోయును? విద్వాంసుడే వీనినన్నిటిని చేయును. మరొకడు కాడు’’

పుత్ర సంతానం గురించి  ‘అధర్వ వేదం’ చెప్పిన మాటలు-
  
‘ఓ నారీ నీవు మగబిడ్డను  కను! ఆ తరువాతా పుత్రుడే కలుగు గాక! ఆ పుత్రులకు నీవు తల్లివి కమ్ము! ఆ తరువాత కలిగే పుత్రులకు కూడా తల్లివి కా!’’

ఆ వీర పుత్రులకు మళ్ళీ అతి వీర పుత్రులు కలగాలంటే , ఆ అతి వీర పుత్రులకు తల్లులు అయ్యేది ఎవరు? అని ప్రశ్నిస్తారు రంగనాయకమ్మ.పుస్తకంలో ఆలోచింపజేసే  కొన్ని  వ్యాఖ్యలు:

*  వేద కాలాన్ని , క్రీస్తు కన్నా వెనక, 3 వేల నాడు కాకపోతే, 6 వేల నాడు కాకపోతే,  10 వేల నాడు అనుకుందాం. ఆ 10 వేల కన్నా వెనక, వేదం లేనట్టేగా? దాన్ని ‘నిత్యం, నిత్యం, నిత్యం’ అని ఎలా అనగలరు?  ‘వేద కాలం ఇదీ అని ఏదో ఒక కాలాన్ని  కనిపెట్టిన తర్వాత, అప్పుడు వేదం ఒక కాలంలో లేనిదే అవుతుంది గానీ, ‘నిత్య సత్యమైనది’ఎలా అవుతుంది?

* ‘వేదం నిత్యమే’ అని, వేదంలోనే ఒక మంత్రం వుంది! అయితే వేదం తనకి తనే గొప్పగా చెప్పుకుంటే, అది సత్యం ఎలా అవుతుంది? ఒక మనిషి  ‘నేను చాలా ఉత్తముణ్ణి! గొప్పవాణ్ణి ! ’ అని చెప్పుకుంటే, అది సరియైన వాదం అవుతుందా?  అవదు. ఆ  తప్పుకి , ‘ఆత్మాశ్రయ దోషం’ అనే పేరు కూడా వుంది.


*   వేదాలు ‘చాతుర్వర్ణాల్ని చెప్పాయ’ని దాన్నీ గొప్పగా చెప్పడమే! వేద కవుల్నే ‘సేవక వర్ణం’లో వుంచి, మిగతా వర్ణాలకు సేవలు చెయ్యమంటే, అప్పుడు తెలుస్తుంది చాతుర్వర్ణాల నీతి!   ... అన్నీ  వేదాల్లోనే ఉన్నాయిష!

ప్రాచీన కాలపు సాహిత్యాలన్నీ, అన్ని దేశాల్లోనూ కట్టు కథలుగా (మైతాలజీ), కల్పనలుగా, ఊహలుగా ఉంటాయి.  అవన్నీ ఆ నాటి మానవుల ఆశలనీ, కోరికలనీ అర్థం చేసుకోకుండా, వాటిని వాస్తవాలుగా నమ్ముతున్నారు.  వేదాల్లో  ప్రస్తావించిన కొన్ని ఊహలను  అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంగా భావించి ప్రచారం చేయటం ఇలాంటిదే. 

‘మనకు తెలియని ఏ సాహిత్యం గురించి అయినా , ‘‘ఇది చాలా గొప్ప గ్రంథం! పవిత్ర గ్రంథం!’’అంటూ దానికి మూర్ఖపు భజనలు చెయ్యడం కాదు. ఆ సాహిత్యం ఎలా వుందో, అందులో ఏం వుందో, చదివి చూడాలి ! అప్పుడే ఒక న్యాయమైన అభిప్రాయానికి రావాలి’’  అంటారు రంగనాయకమ్మ. 

నిజమే కదా? 

చతుర్వేదాలపై  ఆరుగురి అనువాదాలతో  కలిపి 18  పుస్తకాలూ,  వికీపీడియా వ్యాసాలూ  చదివాకే  ఈ  పుస్తకం రాశారామె.

కథగా లేకుండా,  కేవలం స్తోత్రాలూ,  ప్రార్థనలతో సాగే  వేదాలను చదవటమే ఎంతో విసుగుపుట్టే వ్యవహారం. అయినప్పటికీ దాన్ని భరించి వాటిని పరిచయం చేయటం  అంటే.. ఎంతో శ్రద్ధ, ఓపిక,  నిబద్ధత... ఉంటే తప్ప సాధ్యం కాదు.

ఒక పుస్తకాన్ని (అది వేదాలు  కావొచ్చు;  వేదాలపై చేసిన ఇలాంటి పరిచయం/ విమర్శ కావొచ్చు)  ఇష్టపడటానికైనా,  దానిపై వ్యతిరేకత చూపడానికైనా  దాన్ని చదవటం,  తెలుసుకోవటం కనీసమైన  షరతు.

అదేమీ చేయకుండా  వెలిబుచ్చే  అభిప్రాయాలకూ,  చేేసే వ్యాఖ్యానాలకూ  విలువ ఉంటుందా? 

9 వ్యాఖ్యలు:

Indian Minerva చెప్పారు...

ఒక friend పంపిస్తే, ఇప్పుడే చూశాను మీ టపా.....

రంగనాయకమ్మ శైలితో నా విభేదాలు నాకుండొచ్చుగానీ హేతువాదంలో ఆవిడ దిట్ట. రంగనాయకమ్మ ఒక Indian Bertrand Russel, ఒక Indian Tasleema Nasreen. May their tribe increase... ఆవిడలాంటివాళ్ళు వర్ధిల్లుగాక. ఎప్పుడైతే వేదాలను ప్రజాబాహుళ్యానికి అవల ఉంచారో, అలా ఉంచినా సమాజపు గతికి ఏఢొకా లేదో అప్పుడే అవి useless అన్నవిషయం మనకు అవగతమవ్వాల్సింది.

M b d syamala చెప్పారు...

వేణూ! రంగనాయకమ్మగారి వేదాలు పుస్తకంపై నీ blog చూసి ఎంతో సంతోషించాను!నిజానికి నీ మాటప్రకారమే వేదాలు చదవకుండా అభిప్రాయాన్ని వెలిబుచ్చటం సరి అయిన పనికాదు!అయినా పుట్టినప్పటినుండీ వాటి పవిత్రత వినీ వినీ వేదాలంటే ఇంతే!అనిఅంగీకరించటం కష్టంగా వుంది!ముఖ్యంగా ఈ అంశంపై నీ విశ్లేషణ అద్భుతంగా వుంది!స్త్రీలను కించపరచడం చాతుర్వర్ణ్యవ్యవస్థ ప్రాణిహింస భగవంతుడైనా మెచ్చుతాడని అనుకోను!అలా మెచ్చితే అతడు దేవుడెలా అవుతాడు?ఆసాంతం ఆలోచనాత్మకంగా సులలితంగా సుతిమెత్తని అధిక్షేపంతో వున్న నీ ఈ రచనకు నా అభినందనలు!

GKK చెప్పారు...

రంగనాయకమ్మ, రాంగోపాల్ వర్మ, కంచ ఐలయ్య, గోగినేని బాబు .....

చాగంటి, సామవేదం షణ్ముఖ శర్మ, కందాడై, ప్రేమ సిద్ధార్థ,జగ్గివాసుదేవ్,....

అందరికీ వారి వారి సిద్ధాంతాలు ప్రచారం చేసుకునే అవకాశం మనదేశంలో ఉంది. This is the beauty of our country.
People have a variety of choice indeed. People are intelligent enough to choose what is liked by them and suits them.

One gets a feeling that Ranganayakamma and other rationalists concentrate too much on the shortcomings / faults / lacunae in the Hindu scriptures. Why can't they write about the good things in the scriptures. They are prejudiced. Vedantic thought is widely acclaimed and accepted by great intellectuals across the globe. The constant attempt by skewed writers like Ranganayakamma to malign Hindu scriptures is in poor taste and malicious in nature.

Some of the practices prevalent thousands of years ago may not be relevant now. The Hindu society has largely moved on.

Let us accept the good and bad of every religion. Hindus are ready for that. Can we say the same thing about other religions. Can we imagine discussing the holy scriptures of other religions.

Venu garu. Ranganayakamma garu's selective dissection of Hindu scriptures is not acceptable to many people.

In my opinion, people who accept only empirical facts can never understand vedantic thought.

Indian Minerva చెప్పారు...

రంగనాయకమ్మను, రాంగోపాల్వర్మను ఒక వాక్యంలో స్మరించడం తప్పు. చాగంటి మధ్యతరగతిలో popularize ఐన ఒక బఫూన్. ఈయన లాజిక్కులస్సలు లాజిక్కులేకావు. ఇంకొక హిందూ పండితుడే ఏకినట్లుగా... ఈయన జ్ఞానమెంత? ఈయన పాండిత్యమెంత? ఈయనచెప్పే రామాయణ భాష్యం రాధాకృష్న న్ చెప్పినదానికి ఏవిధంగా భిన్నం?

Sudheer చెప్పారు...

@తెలుగు అభిమాని గారు:

బహుశా తస్లీమా నస్రీన్ గురించి కూడా బంగ్లాదేశ్‌లో ఇలానే అనుకుంటారేమో! " rationalists concentrate too much on the shortcomings / faults / lacunae in the" islamic scriptures అని. I would like to to realize that your appeal to the ignorance of negativity of the Hindu scriptures doesn't account to the positive attitude. If "Hindu Society" has really moved on, why is that the inter-caste marriages are not so common?


Your own comment says that you are not ready to accept the bad about the religion you are so vocal about.

Wait a minute. If we are to entertain non-(empirical)-facts, why not the out right lies? Who has agreed to that deal by the way?

Brahmayya చెప్పారు...

వేదం గురించి మాట్లాడేటప్పుడు రెఫరెన్సులు ఇవ్వాలి. అవి లేకుండా ఎన్ని చెప్పినా ఉపయోగం లేదు.
మీరు అబద్ధాలు చెబుతున్నట్లు అవుతుంది.

వేణు చెప్పారు...

రెఫరెన్స్ లు లేకుండా ఈ పుస్తకం రాయలేదు. ఆ పుస్తకం మీద ఇది ఓ సమీక్ష.

సమస్య ఏమిటంటే..వేదాలను గౌరవించేవారిలో వాటిని చదివినవారు అతి తక్కువ. విమర్శ అయినా, ప్రశంస అయినా మూల గ్రంధాలు చదవకుండా చేయకూడదు. చేస్తే విలువ ఉండదు!

నీహారిక చెప్పారు...

వేదాలు 10 వేల సంవత్సరాల నాటివి అని అంటున్నారు.10 వేల సంవత్సరాల నాటి పుస్తకాలను ఇప్పుడు విమర్శించడం భావ్యమేనా ? అప్పటి రచయతలు/రచయిత్రులు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఉపయోగించి భవిష్యత్తు తరాలకు కొన్ని సూచనలు చేసారు. వాటిలో కొన్ని లోపాలున్నాయి. ముఖ్యంగా చాతుర్వర్ణాల గురించి వ్రాసింది తప్పే కావచ్చు. మొత్తంగా వేదాలని తప్పు పట్టలేము.కార్ల్ మార్క్స్ వ్రాసినదాంట్లో కూడా కొన్ని తప్పులున్నాయి. మార్క్స్ నాకు దేవుడు మీరు అనుసరించండి అనడం కూడా తప్పే. ఎపుడో వ్రాసిన పుస్తకాలను బట్టి ఇప్పటి జీవన సరళిని నిర్ణయించడం సరి అయిన వేదం కాదు.

प्रवीण చెప్పారు...

రంగనాయకమ్మ గారి సిద్ధాంతం వేరు, బెర్ట్రాండ్ రసెల్ సిద్ధాంతం వేరు. అసలుకి మార్క్సిజం వేరు, నాస్తికత్వం వేరు. ఈ మధ్యనే ఫేస్‌బుక్‌లో కొంత మంది నాస్తికులు ఒకరినొకరు కులం పేరుతో తిట్టుకోవడం చూసాను. నాస్తికత్వం నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాదు అనే వాదన ఉంది. రంగనాయకమ్మ గారిని నాస్తికులతో పోల్చడం అంటే అది బోడి గుండుకి మోకాలితో ముడి పెట్టడమే అవుతుంది.