సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

31, ఆగస్టు 2017, గురువారం

మన కళ్ళనెలా ఉపయోగించాలి?


‘చందమామ’ పత్రికలో  రాతిరథం, యక్ష పర్వతం   సీరియల్స్ వస్తున్న రోజులు..

వాటిలో  ‘చీకటి కొట్లో బంధించటం’  గురించి చదువుతున్నపుడు ఆ శిక్షను  ఊహించుకుని  మనసులో హడలిపోయేవాణ్ణి.

మరి  అలా  అంధకారంలో ఉండాల్సిరావటమంటే  భయంకరమే కదా!

చిమ్మ చీకట్లో  వెలుగులు  చిలుకుతూ   నింగిలో  మినుకుమనే   చుక్కలూ,  నిప్పు కణికల్లా  గాల్లో  తేలివచ్చే  మిణుగురులూ  ఎంత ఆనందం కలిగిస్తాయో !  

కరెంటు పోయి.. హఠాత్తుగా లిఫ్టు ఆగిపోతే  ఆ కాసేపటి చీకటికే గందరగోళంగా మనకు ఉంటుంది.  లిఫ్టు నుంచి బయటికి వచ్చేలోగా కాస్త వెలుగైనా ఉంటే గానీ ప్రాణం కుదుటపడదు.

జీవితాంతం వెలుగనేదే  ఉండని ... అసలేమీ చూడలేని అంధత్వం మరెంతటి  దుర్భరం!

* * *

ఇంటర్ చదివే రోజుల్లో యండమూరి వీరేంద్రనాథ్ ‘ప్రార్థన’  సీరియల్ గా ఆంధ్రభూమి వీక్లీలో వచ్చేది.

వారం వారం ఆసక్తిగా చదివేవాణ్ణి.


ఆ నవల్లో  హుషారుగా తిరిగే  ఎకౌంటెంట్ కుర్రాడు సోమశేఖరం. ఓ  ప్రమాదంలో అతడికి  కంటి చూపు పోతుంది. అంతే కాదు.. మాట్లాడటం, వినటం కూడా చేయలేకపోతాడు.

అలాంటి ఘోరమైన  పరిస్థితిని తల్చుకుని దు:ఖంతో  ఏడ్చి బెంబేలెత్తడు. వేగంగా  తేరుకుంటాడు.  బ్రెయిలీ భాష నేర్చుకోవటంతో మొదలుపెట్టి తన దురవస్థను ఎంతో  గొప్పగా ఎదుర్కొంటాడు.

ఈ పాత్రను ఆ నవల్లో బాగా చిత్రించాడు రచయిత.

ఆ సోమశేఖరం  ‘నిశ్శబ్దపు చీకటిలో మౌనంగా నా భావాలు’ అనే పుస్తకం రాయాలనుకుంటాడు కూడా!

* * *
కె. విశ్వనాథ్ సినిమా  ‘సిరివెన్నెల’ (1986) లో కథానాయకుడు సర్వదమన్ బెనర్జీ  అంధుడు. నాయిక సుహాసిని మూగ. వారి మధ్య సన్నివేశాలు బాగుంటాయి.

 ఒక  సందర్భంలో అతడు తాను ప్రేమించిన  మూన్ మూన్ సేన్ రూపాన్ని గురించి  చెపుతుంటే  సుహాసిని శిల్పంగా మలుస్తుంది.

ఈ సందర్భంగా సాక్షి రంగారావు ..‘ ఎన్నడూ చూడని వ్యక్తి  రూపాన్ని అతడు వర్ణించి చెపుతుంటే.. అసలు ఆమెను ఎన్నడూ చూడని వ్యక్తి శిల్పంగా  చెక్కటం..’ అంటూ  ఆ విడ్డూరానికి  గందరగోళపడతాడు.

సినిమా కాబట్టి .. మూన్ మూన్ సేన్  రూపం అన్ని విధాలుగా సరిపోయేలా శిల్పం తయారవుతుంది.


* * *

అంధత్వం  గురించి తల్చుకున్నపుడు గుర్తొచ్చే పేరు- 
హెలెన్ కెల్లర్ ..!

1880- 1968 సంవత్సరాల మధ్య జీవించిన అమెరికన్.అనారోగ్యం వల్ల 19 నెలల వయసుకే  శాశ్వతంగా  అంధత్వం, చెవిటితనం వచ్చిందామెకు.   యానీ సల్లివాన్ అనే టీచరు ఆమెకు జ్ఞాననేత్రం అయింది. ఆ చేయూతతో  హెలెన్ కెల్లర్ తన లోపాలను అధిగమించటానికి అనితర సాధ్యంగా ప్రయత్నించింది. ప్రపంచవ్యాప్తంగా  ఎందరికో ఆదర్శంగా నిలిచింది.   

ఈమె గురించి స్కూలు రోజుల్లో  ఇంగ్లిష్ పాఠ్య పుస్తకంలో  ఓ పాఠం ఉండేది.  "Three days to see'  అని.

ఆమె..  తనకు మూడు రోజులు కంటి చూపు వస్తే  ఏమేం చేయాలనుకుంటున్నానో దానిలో  చెపుతుంది. 

ఆ పాఠం ఏళ్ళు గడిచినా ఇంకా గుర్తుంది.

ఆ మధ్య ఆమె జీవిత గాథ  చదివాను. తన లోపాలను అధిగమించిన తీరు మనల్ని ముగ్ధులను చేస్తుంది. పరిసరాలపై, ప్రపంచంపై ఆమె పరిజ్ఞానం, అవగాహన ఆశ్చర్యపరిచేలా  ఉంటుంది.

హెలెన్ కెల్లర్ గురించి తెలుగులో  1956లో, 1959లలో  ప్రచురితమైన రెండు పుస్తకాలు చదివాను.
 మొదటిది  హెలెన్ కెల్లర్ ఆత్మకథ- ‘ఆశాజ్యోతి’. సుభద్రా నందన్ పాల్ అనువాదం.

 


రెండోది వాన్ బ్రూక్స్ అనే రచయిత రాసిన  హెలెన్ కెల్లర్  (జీవిత చిత్రణ) పుస్తకం. ఎన్ ఆర్ చందూర్ దీన్ని అనువదించారు.

వినికిడి ఘనం.. చూపు వరం

‘త్రీ డేస్ టూ సీ’ వ్యాసం  ఇంగ్లిష్ లో  నెట్ లో దొరుకుతుంది.
దాన్ని క్లుప్తంగా  తెలుగులో  ఇక్కడ  ఇస్తున్నాను.

‘‘ ప్రతి రోజూ మనకిదే ఆఖరిది’ అనుకుని బతకాలని నాకు ఒక్కో సారి అనిపిస్తుంది. చెవిటివారికే వినికిడిలోని గొప్పతనం తెలుస్తుంది. అంధులకు మాత్రమే చూపు ఎంతటి వరమో  అర్థమవుతుంది.

ప్రతి మనిషికీ కొద్ది రోజుల పాటు  చెవిటితనం, అంధత్వం  ఉంటే వారికే మంచిదని నాకు అనిపిస్తుంటుంది. అప్పుడు చీకటి.. వారికి చూపు ఎంత ఘనమైనదో  తెలుపుతుంది. నిశ్శబ్దం...  ధ్వనుల వల్ల వచ్చే ఆనందాన్ని తెలిసేలా చేస్తుంది.

ఈ మధ్య వన విహారానికి వ్యాహ్యాళికి  వెళ్ళి  అప్పుడే తిరిగివచ్చిన  ఓ మిత్రురాలిని అడిగాను...‘ ఏమేం చూశావు?’ అని.  ‘ప్రత్యేకంగా ఏమీ లేదు’ అందామె.

గంటసేపు అక్కడికి  వెళ్ళి  చెప్పుకోదగ్గదంటూ ఏమీ చూడకుండా ఉండటం ఎలా సాధ్యం?

నేను కంటితో చూడలేను గానీ,  వందలాది విషయాలు నాకు ఆసక్తిని కలిగిస్తాయి.

నేను ఏదైనా యూనివర్సిటీ  అధ్యక్షురాలినైతే  ‘మీ కళ్ళనెలా ఉపయోగించాలి?’ అనే కోర్సు  ప్రవేశపెడతాను.

మీకు  ఓ  మూడు రోజులు  మాత్రమే  చూపు ఉంటే  కళ్ళను ఎలా ఉపయోగిస్తారు? ఆ విలువైన సమయాన్ని ఎలా గడుపుతారు?

ఏదో అద్భుతం జరిగి ఓ మూడు రోజుల చూపు నాకు వస్తే...


తొలి రోజు :
ఇప్పటివరకూ  స్పర్శ ద్వారా మాత్రమే తెలిసిన నా  స్నేహితుల, బంధువుల  ముఖాలను మొదటిసారి చూస్తాను. ముఖ్యంగా నా ప్రియమైన టీచర్  యానీ సల్లివాన్ దివ్యమైన ముఖాన్ని చూస్తాను.  సహనంతో దయతో ఆమె అందించిన తోడ్పాటుతోనే నాకు ఈ ప్రపంచం తెలిసింది.   ఇంకా నమ్మకానికి మారుపేరైన కుక్కల మొహాలు చూస్తాను. ఇంట్లో  ఇంతవరకూ చూడకుండానే ఉపయోగిస్తూవచ్చిన  సామాన్లన్నీ చూస్తాను. సాయంత్రం చెట్లల్లోకీ, పొలాల్లోకీ ఇష్టంగా నడుస్తూ వెళ్ళి ప్రకృతి అందాన్ని తిలకిస్తాను.  చూపు వచ్చిన సంతోష పారవశ్యంతో రాత్రంతా మెలకువగానే ఉండిపోతాను.

రెండో రోజు: 
ఉదయాన్నే సూర్యోదయాన్ని చూస్తాను. న్యూయార్క్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీని చూస్తాను. ఆదిమ కాలం నుంచి  ప్రస్తుతం వరకూ ఈ భూమ్మీద జీవనం ఎలా అభివృద్ధి చెందిందో అక్కడ తెలుసుకుంటాను.  తర్వాత మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ సందర్శిస్తా. సాయంత్రం థియేటర్ లో నాటకమో,  సినిమానో చూసి ఆనందిస్తాను.

మూడో రోజు:
మళ్ళీ సూర్యోదయాన్ని పలకరిస్తాను. ప్రతిరోజూ దీనిలో కొత్త అందం ఉండే తీరుతుంది.  ఇక చుట్టూ  హడావుడిగా సాగే జీవితాన్ని గమనిస్తాను.  అడవీ, కొండలూ, పొడవైన ద్వీపం, తూర్పు నది, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, ఫిఫ్త్ ఎవెన్యూ,  పార్క్ ఎవెన్యూ... ఒకదాని తర్వాత ఒకటి చూసేస్తాను. జన సమ్మర్దం ఉండే కూడళ్ళలో  ఉరుకుల పరుగుల జనం సందడి చూసి సంతోషిస్తాను.  కర్మాగారాలనూ,   పార్కుల్లో ఆడుకునే పిల్లలనూ చూస్తాను. సాయంత్రం మళ్ళీ  థియేటర్ కి వెళ్ళి, సరదా నాటకం చూస్తా.

అర్ధరాత్రికల్లా మళ్ళీ నా జీవితంలోకి శాశ్వతమైన చీకటి వచ్చేస్తుంది. కానీ  ఒక తేడాతో.  ఇప్పుడైతే.. ఈ మూడు రోజుల గొప్ప జ్ఞాపకాలు ... సుదీర్ఘమైన చీకటి రాత్రి లాంటి నా జీవితంలో వెలుగునిచ్చే కొవ్వొత్తి మల్లే - ఎప్పటికీ ప్రకాశిస్తాయి!’’

* * *
సంతోషపు తలుపు 

హెలెన్ కెల్లర్ చెప్పిన  ఎన్నో  కొటేషన్లు అర్థవంతంగా, స్ఫూర్తినిచ్చేలా ఉంటాయి.‘‘ప్రపంచమంతా దు:ఖంతో నిండివుంది. అయితే.. దాన్ని అధిగమించటం కూడా అదే స్థాయిలో ఉంది’’

 ‘‘వెలుగులో  ఒంటరిగా నడవటం కంటే  నేస్తంతో కలిసి  చీకట్లోనైనా నడవటానికే  ఇష్టపడతాను.’’

‘‘ఆశావాదం అనేది మనల్ని  విజయం వైపు  నడిపించే నమ్మకం. ఆశ, నమ్మకం లేకపోతే ఏదీ చేయలేము’’

‘‘ఒక సంతోషపు తలుపు మూసుకుపోతే మరోటి తెరుచుకుంటుంది. కానీ తరచూ  మూసిన తలుపు వైపే ఎక్కువసేపు చూస్తుంటాం కానీ మన కోసం తెరుచుకున్న తలుపును గమనించం’ * * *

హెలెన్ కెల్లర్  చెప్పినట్టు... చూపూ, వినికిడీ  లేని పరిస్థితి  మనకు (కొద్ది రోజులు మాత్రమే సుమా)  వస్తే  ఎలా ఉంటుంది!  ఊహించండి.

31, జులై 2017, సోమవారం

మీకు నచ్చిందని... నాకూ నచ్చాలా?


  సినిమా
ఓ రచన...

ప్రేక్షకుల, పాఠకుల  విశేష ఆదరణ పొందినంతమాత్రాన

వాటిని మెచ్చని వాళ్ళు  ఉండరని చెప్పలేం.

అసంఖ్యాకుల అభిప్రాయానికి  అది తేడాగా ఉంది కాబట్టి...

‘ఊరంతా ఒకదారి ఉలిపికట్టెదొక  దారి’ అంటూ వారి అభిప్రాయాలనూ  ఈసడిస్తే...

ఆస్వాదన తెలియదని  వారిని  తీసిపడేస్తే..

అది న్యాయంగా ఉంటుందా?

 ‘పదుగురాడు మాట పాడియై ధర జెల్లు’
నిజమే.

‘ఒక్కడాడు మాట ఎక్కదెందు.’

అయినా...
ఒక  భిన్నాభిప్రాయం మిగతా మూస  అభిప్రాయాల మధ్య  తళుక్కున  మెరుస్తుంది.

దానికి  విలువ కూడా  ఎప్పుడొస్తుందంటే...

అది కేవలం  భిన్నంగా ఉండటం వల్ల  కాదు;
దానిలో  తర్కమూ, వాస్తవమూ ఉంటే,  వాటి వల్లనే!


1975 లో  వచ్చిన  ‘ముత్యాల ముగ్గు’  ఎంతో ప్రజాదరణ  పొందిన సినిమా.
దీనిపై   మహా కవి  శ్రీశ్రీ  వ్యాఖ్య-

‘ముత్యాల ముగ్గు
రత్నాల రగ్గు
దయ్యాల దగ్గు’


మేమంత కష్టపడి  అంత  బాగా  తీస్తే ,  ఆంధ్రదేశమంతా  బ్రహ్మరథం పడుతోంది.  ఈయన  అలా  అంటారా? అనో, ఆయన అలా అంటే మాత్రం మాకేంటి  నష్టం ’ అనో  కోపాలు తెచ్చుకోలేదు  ఆ సినిమా రచయిత  ముళ్ళపూడి వెంకట రమణ,  ‘మహాకవి ఏమన్నారన్నది కాదు,  మన సినిమా గురించి  ఏదో ఒకటి అన్నారు కదా?, అది చాలు’ అంటూ స్పందించారు.

ఒకవేళ  ఆ  సినిమాపై   శ్రీశ్రీ  అభిప్రాయం  అర్థరహితంగా ఉందని ఎవరైనా   ఎదురుదాడికి దిగివుంటే ఏమయ్యేది? 

శ్రీశ్రీ  తన అభిప్రాయం  మరింత  గట్టిగా  చెప్పివుండేవారు. అంతేగానీ,  తన అభిప్రాయమైతే మార్చుకునేవారు  కాదు కదా?‘క్లాసిక్’ గా  పేరుపొందిన  ‘యోగి వేమన ’ (1947)  కూడా శ్రీశ్రీ కి నచ్చలేదు మరి.  ఎందుకు నచ్చలేదో వివరంగానే  అప్పట్లో ఓ రివ్యూలో రాశారు.

మరి  శ్రీశ్రీకి నచ్చేవి  ఏమిటి ?

చాలా ఉన్నాయి.  చాప్లిన్ సినిమాలూ,  ఇంకా మరెన్నో.

రా.వి. శాఃస్త్రి  ‘ఆరు సారా కథల’ను  ఆరు కళా ఖండాలుగా  అభివర్ణించాడు శ్రీశ్రీ.

1962లో  ఆ కథల సంపుటికి  రాసిన ముందు మాటలో ఇలా అంటాడు -

‘‘ఏక కాలంలో అనేక రసాలను ఉప్పొంగింపజేసే కళాఖండాలను మాత్రమే  నేను ఉత్కృష్ట రచనలుగా అంగీకరిస్తాను. కథలలో, కవిత్వంలో, శిల్పంలో, చిత్రాలలో, నవలల్లో, నాటకాల్లో నేను ఇటువంటి రసానుభూతినే అన్వేషిస్తాను. చార్లీ చాప్లిన్ తన చలనచిత్రాలతో ఈ రసానుభవం నాకు కలిగించాడు. పికాసో రచించిన ‘గుయెర్నికా’ నాలో ఒక్కసారిగా నవ్వూ, ఏడుపూ, ఆశ్చర్య మూ, భయమూ కలిగించాయి. డిక్కెన్స్ నవలల్లోనూ, గురజాడ రచనలలోనూ  ఇటువంటి రస స్పందనలే  నాకు ఈనాటికీ ఉత్తేజం కలిగిస్తాయి ’ ’

గీతాంజలి  X  వాడే వీడు


‘‘మృత్యు దేవత నీ తలుపు తట్టినపుడు నువ్వేం అర్పిస్తావు అతనికి?
ఏమీ?  నా జీవిత పూర్ణపాత్రని  అతని ముందుంచుతాను. రిక్తహస్తాలతో అతన్ని ఎన్నడూ పంపను’’

‘‘ఓ నాడు ఈ భూమి నా కనుమరుగవుతుందనీ చివరి తెరని నా కళ్ళపైకి లాగి జీవితం మౌనంగా శలవ తీసుకుంటుందనీ నాకు తెలుసు’’

‘ ‘ అరణ్యంలో  అర్థరాత్రి  పుష్పించే కుసుమం వలె ఈ అనంత
నిగూఢ అద్భుత ప్రపంచంలోకి ఏ శక్తి నన్ను వికసింప చేసిందో!’’

‘‘ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో,
ఎక్కడ మనుషులు తలలెత్తి తిరుగుతారో,
ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో....
....................


ఆ స్వేచ్ఛా స్వర్గానికి , తండ్రీ, నా దేశాన్ని మేల్కొలుపు’’


రవీంద్రనాథ్ రాగూర్ గీతాంజలికి  తెలుగు అనువాదాలు ఎన్నో  వచ్చాయి.   ఎక్కువ  ప్రసిద్ధమైనవాటిలో  చలం  అనువాదం (1958)  ఒకటి.

‘గీతాంజలి సంపూర్ణంగా అర్థం కావాలన్నా, అనుభవంలోకి రావాలన్నా, ఈశ్వరుడిలో విశ్వాసం ఉండాలి’ అంటాడు చలం  ముందుమాటలో.

ఆ విశ్వాసం లేని  శ్రీశ్రీ కి గీతాంజలి  నచ్చకపోవటంలో  ఆశ్చర్యం లేదు.

గీతాంజలిపై   శ్రీశ్రీ  విమర్శల  గురించి సాహితీ మిత్రుల్లో చాలామందికి తెలిసేవుంటుంది .

కానీ  ఆ వివాదం ఎలా సాగిందో .. ముగిసిందో  వివరంగా  చదివినవాళ్ళు తక్కువ మందే ఉంటారని  అనుకుంటున్నాను. 

ఎందుకంటే... అది  దాదాపు 70 ఏళ్ళ క్రితం నాటి ముచ్చట.

‘ తెలుగు స్వతంత్ర’  వారపత్రికలో  జరిగిన  ఈ వివాదం  దూషణలకు దూరంగా,  చక్కగా  సాగటం విశేషం.
(అప్పుడు  మరి  ఫేస్ బుక్ లూ, బ్లాగులూ, వాట్సాప్ లూ  లేవు కదా అంటారా?  :))

శ్రీశ్రీ, చలంలతో పాటు ‘చతుర్వేది’ అనే మరో వ్యక్తి దీనిలో  పాల్గొన్నారు.

·   1948 నంబరు 5 సంచికలో ‘వాడే వీడు ’ అనే వ్యాసంతో  శ్రీశ్రీ దీనికి తెర తీశాడు.
·    1948 నవంబరు 19 సంచికలో  ‘చతుర్వేది ’ అభిప్రాయం వచ్చింది.
·    1948  డిసెంబరు 24 సంచికలో  తన ‘మ్యూజింగ్స్ ’ కాలమ్ లో  చలం  శ్రీశ్రీ  అభిప్రాయం గురించి  ప్రస్తావించారు.
·    1948 డిసెంబరు 31 సంచికలో ‘టాగూరు నా  ఎల్లెర్జీ’  అంటూ శ్రీశ్రీ  ఘాటుగా స్పందించారు.
·    ఆ తర్వాత  వెలువడిన తన మ్యూజింగ్స్ లో  చలం  ‘ శ్రీశ్రీ  అనుభవాన్ని కాదనలేను’  అంటూ  ఇంకా  కొంత  రాశారు.

ఎవరెవరు  ఏమని అన్నారు? శ్రీశ్రీ :  నిస్సందేహంగా  ‘గీతాంజలి’ కంటే ‘వాడే వీడు’ గొప్ప గ్రంథం

చతుర్వేది:  నిస్సందేహంగా గీతాంజలి గొప్ప గ్రంథమే.  

 
చలం: గీతాంజలిలో  ప్రతి మాటలో స్ఫురించే కవిత్వం, అందం, ఆ కలల విశాలత్వం, మూలిగే నలిగే ఆత్మలకి శాంతీ, ఆశ, జీవితానికి ఓ అర్థమివ్వాలనే ప్రయత్నం, ఈ చిరాకుల్లోంచి, అల్పత్వాల్లోంచి గొప్పతనం చూడగల దృష్టి, ఇవన్నీ ఎట్లా మిస్ కాగలిగారు శ్రీశ్రీ!

శ్రీశ్రీ :  ప్రపంచమంతా హారతి పట్టినా నేను టాగూరును కవిగా అంగీకరించలేను.  


చలం: శ్రీశ్రీ తనకి గీతాంజలిలో ఏమీ కనపళ్ళేదంటే , ఆ అనుభవాన్ని కాదనలేను, ఏదో అవునని రాయడం తప్ప.


 ఆ  వాదనల క్రమాన్ని  ‘తెలుగు స్వతంత్ర’  సంచికల నుంచి  తీసి, వాటిని  ఒక ఫైలుగా కూర్చి  ఇక్కడ   ఇస్తున్నాను.
   Srisri Tagore Chalam by Reader on Scribd


దాదాపు 11 పేజీల్లో ఉండే  ఈ సమాచారంలో  మొత్తం  ‘గీతాంజలి- వాడేవీడు ’  గురించి మాత్రమే ఉండదు.  ముఖ్యంగా  చలం    ‘మ్యూజింగ్స్’ లో  ఈ విషయాన్ని  దాదాపు  ఒక  న్యూట్రల్ టోన్  ప్రస్తావించినా  శ్రీశ్రీ మాత్రం  ఎగ్రెసివ్ గానే స్పందించటం చూడవచ్చు.  

*** 

శ్రీశ్రీ  అభిప్రాయం చదివితే నాకేమనిపిస్తుందంటే...

అందరూ మెచ్చుకునే  గీతాంజలి తనకు  నచ్చలేదనే విషయం బలంగా  చెప్పడానికే ,  డిటెక్టివ్ నవలతో పోల్చటం ద్వారా  షాక్ చేసి,  అందరినీ ఆలోచింపజేయడానికే  ఆయన  ఇలా రాశాడని!

ఈ సందర్భంగా  నసీరుద్దీన్ కథ ఒకటి గుర్తొస్తోంది.

మహీధర నళినీ మోహన్   ‘ మౌల్వీ నసీరుద్దీన్ కథలు’ రెండు భాగాలుగా   తేట తెలుగు నుడికారంతో అందించారు. వాటిలో చాలా కథలు నాకు బాగా ఇష్టం.

అందులో ఓ కథంటే  మాత్రం మరీ మరీ!

నాకు గుర్తున్నంతవరకూ  నా మాటల్లో..  చెప్తానీ కథని.

రాజు   తైమూర్ కి  ఓసారి  కవిత్వం రాయాలనే కోరిక కలిగింది.  ఏదో తోచినట్టు రాసేశాడు.

అది బాగుందో లేదో  తెలియాలి కదా?

పండితుడుగా పేరుమోసిన నసీరుద్దీన్ ని పిలిపిస్తాడు.

అతడా  కవిత్వం చదివి, ‘అబ్బే ఏమీ బాగా లేదు’ అని పెదవి విరుస్తాడు, రాసింది రాజు అనే మొహమాటం కూడా లేకుండా.

‘అంత కష్టపడి రాస్తే  ఇలా చెప్తాడా ’ అని  తైమూర్ కి  చిర్రెత్తుకొస్తుంది.   ‘ఇతగాణ్ణి గాడిదల కొట్టంలో  పడెయ్యండి’ అని ఆజ్ఞాపిస్తాడు.

కానేపటికి  కోసం తగ్గుతుంది తైమూర్  కి.  ‘ అంతటి  పండితుడు అలా అన్నాడంటే, నిజంగానే  నా కవిత్వం బాగా లేదేమో’ అనే ఆలోచనతో తన తొందరపాటుకు  పశ్చాత్తాపపడి,  కొట్టంలోంచి  నసీరుద్దీన్ ని  విడుదల చేయిస్తాడు.

కొన్నాళ్ళకు బాగా కృషి చేసి కవిత్వం రాస్తాడు తైమూర్.

నసీరుద్దీన్ అభిప్రాయం  తెలుసుకోవటానికి  మళ్ళీ అతణ్ణి పిలిపిస్తాడు.

తన  కొత్త కవిత్వం గురించి  ఏం చెపుతాడా అని  తైమూర్ ఉత్కంఠగా ఎదురుచూస్తుంటాడు.

మొత్తం చదివేసి,  ఆ కాయితాలు  పక్కన పెట్టేసి  మౌనంగా అక్కణ్ణుంచి బయటకి  అడుగులు వేస్తుంటాడు నసీరుద్దీన్.

‘ఏమీ చెప్పకుండా  బయల్దేరుతున్నావేంటీ? ఎక్కడికీ?  ఆశ్చర్యంతో అడుగుతాడు తైమూర్.

నిర్వికారంగా... స్థిరంగా  జవాబిస్తాడు నసీరుద్దీన్-

 ‘గాడిదల కొట్టంలోకి!’

30, జూన్ 2017, శుక్రవారం

మధుర స్వరాల డోల!


మ్మెస్ సుబ్బలక్ష్మి పాటల పరిచయం కాదిది... ఆమె పాటలతో నాకున్న కొద్ది పరిచయం!

ఆమె గురించీ, ఆ సంగీత ప్రతిభ  గురించీ  ఎన్నేళ్ళ నుంచో  వింటూ వస్తున్నటికీ ఆమె పాటలను పనిగట్టుకుని వినలేదెప్పుడూ. 

సంగీతమంటే ఇష్టం ఉండి కూడా,   సుబ్బలక్ష్మి  పాటలను వినాలని అనిపించకపోవడానికి  సినీ సంగీత ప్రభావం  కారణం కావొచ్చు.

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం రేడియోలో విన్నపుడు  ప్రౌఢంగానూ,  అదేదో  బృందగానంలానూ   అనిపించింది కానీ,   శ్రావ్యంగా అనిపించలేదు.

 భజ గోవింద శ్లోకాలో, విష్ణు సహస్రనామాలో  రేడియో నుంచీ,  మైకుల నుంచీ  చెవినబడినా  ఆసక్తిగా  పట్టించుకోలేదు.

ఏళ్ళు గడిచాయి.

ఈ మధ్యే  ఆమె జీవిత చరిత్ర  ‘సుస్వరాల లక్ష్మి MS సుబ్బలక్ష్మి’ చదివాను. 

ఆమె పాటలపై ఆసక్తి  ఏర్పడింది.

వరసగా వాటిని  యూ ట్యూబ్ లో వింటూ ... ఆనందిస్తూ  వచ్చాను.

ఎంఎస్ పాటలు ప్రధానంగా భక్తి పాటలే!
 
 కానీ నాకు,  ఆమె పాటలో  భావం కంటే  బాణీలో మెరుపులూ ,  ఆ కంఠంలోని   మాధుర్యమూ   ప్రధానం.

ముఖ్యంగా ఆమె పాడిన  ఓ రెండు పాటలను  ప్రస్తుతం  బాగా వింటున్నాను. విననప్పుడు కూడా తరచూ గుర్తొస్తూ ‘హాంట్’ చేస్తున్న పాటలివి.  (నిజానికివి నాకు  కొత్త కావొచ్చు గానీ... సంగీతాభిమానులు  దశాబ్దాలుగా వింటూ ఉన్నవే,  ప్రసిద్ధమైనవే.). 

మొదటిది  మధురాష్టకం. 

తెలుగు మూలాలుండి,   శ్రీకృష్ణ దేవరాయల కొలువుకు కూడా వచ్చిన  వల్లభాచార్యుడు (1479- 1531)  సంస్కృతంలో రాసిన  అష్టకమిది.
కృష్ణుడికి సంబంధించినది  ఏదైనా  మధురమేనని వర్ణించే  ఈ పాట..

మొదట నెమ్మదిగా మొదలై,  ఆపై  వేగం పుంజుకుంటుంది. మొదట్లో.. ‘మధురాధిపతే రఖిలం’ అనే చోట ‘రా’ను పలికిన  తీరు మధుర సోపానాల ఆరోహణే!

అలాగే...   ‘స్మరణం’ అనే పదాన్ని  ‘పిచ్’ తగ్గించి పలకటంలోని  అందం ఆస్వాదించాల్సిందే.

‘వేణుర్మధురో’  అని ఉండటం వల్ల నాకీ పాట నచ్చిందనుకోవద్దు :) 

రెండోసారి   పాడినపుడు ఇక్కడ కూడా ‘పిచ్’ తగ్గించటం గమనించవచ్చు.

   
రెండో  పాట... ‘డోలాయాం చల..’ .   వల్లభాచార్య కంటే ముందుతరం వాడైన  అన్నమయ్య  (1408-1503)  సంకీర్తనలు తెలుగులోవే  ఎక్కువ.

ఆయన సంస్కృతంలో  రాసిన  పాట ఇది.
 విష్ణువు  దశావతారాల్లో ఒక్కో అవతారాన్నీ  సంబోధిస్తూ ‘ఓ శ్రీహరీ,  ఉయ్యాల (డోల) లో ఊగు’ అని పాడే జోల పాట ఇది. 

ఇందులో ‘దారుణ బుద్ధ’ అనే  పదబంధం  విచిత్రంగా కనిపించవచ్చు.  అన్నమయ్య  చెప్పిన  ఈ బుద్దుడు కారుణ్యమూర్తి అయిన చారిత్రక  బుద్ధుడు కాడు.  పురాణ బుద్ధుడు.    

‘సీర పాణే .. గోసమాణే’ అన్నచోట  శ్రావ్యత  సాంద్రమై ఆకట్టుకుంటుంది... ఎం.ఎస్. గళంలో.

 మొదట శార్ఙ్గపాణే  అనీ,  రెండోసారి  సీరపాణే  అనీ వినపడుతుంది.  మొదటి పదానికి  విల్లు పట్టుకున్న విష్ణువు అనీ,  రెండోదానికి  నాగలి ధరించిన బలరాముడు అనీ అర్థాలు.గాయకుల్లో రకరకాలు. ప్రేక్షకులను అతిగా పట్టించుకుంటూ పాడేవారు కొందరు.  ఎదుట ఉన్న ప్రముఖులను సంబోధిస్తూ చప్పట్లను ఆశిస్తూ  పాట కొనసాగించేవారు కొందరు. 

ఇలా కాకుండా పాడే పాటమీద దృష్టి పెట్టి  తాదాత్మ్యతతో  పాడటం సుబ్బలక్ష్మి ప్రత్యేకత.


పాట భావం,  ఉచ్చారణ  తెలుసుకుని శ్రద్ధగా నేర్చుకోవటం,  కచ్చేరీకి ముందు గంటలకొద్దీ  కఠోర సాధన చేయటం ... చిత్తశుద్ధితో చేసే ఈ కృషికి  ఆమె  కంఠ మాధుర్యం,  ప్రతిభ జోడయ్యాయి.

అలాంటి  ఏకాగ్రతా, దీక్షా ఏ కళలోనైనా, ఏ పనిలోనైనా ముఖ్యమే కదా!     

తాజా చేర్పు :    ‘సుస్వరాల లక్ష్మి MS సుబ్బలక్ష్మి’ పుస్తకంపై  ‘ఈమాట’లో  చేసిన  సమీక్ష  ఇక్కడ


    

31, మే 2017, బుధవారం

ఆహ్లాదపరిచే కవిత్వ పరిమళం!
విత్వం గురించి పెద్దగా తెలియని అమాయకపు రోజుల్లో  నేనూ కవితలు రాశాననుకున్నాను . అవి ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి పంపిస్తే...  ఒకటి రెండు సార్లు ‘యువవాణి’ కార్యక్రమంలో ప్రసారం అయ్యాయి కూడా.

అయితే... Poetry is not my cup of tea... అని అర్థం చేసుకున్నాక  మళ్ళీ కవితలు రాసే జోలికి పోలేదెప్పుడూ! 

అంతేకాదు;  కవిత్వాన్ని అర్థం చేసుకునే,  ఆస్వాదించే లక్షణం నాలో తగినంతగా లేదనిపించేది. కవుల  భావనా ప్రపంచానికీ, నా లోకానికీ  పొంతన కుదరదనే నమ్మకం వల్ల కవిత్వాన్ని పెద్దగా పట్టించుకునేవాణ్ణి కాదు.

కథలూ, నవలలూ, జీవిత చరిత్రలూ, నాన్ ఫిక్షనూ... అంతా వచనమే!  ఇవి చదవటమే  ఇష్టంగా ఉండేది. 

మంచి కవిత్వం నేను చదవకపోవటమూ, చదివిన కాస్త కవితలూ నాకు నచ్చకపోవటమూ ... ఈ రెండు కారణాలతో  కవిత్వంపై  చిన్నచూపు కూడా మొదలైంది.  

ఆ తక్కువ అభిప్రాయం మారేలా చేసిందిశ్యామల కవిత్వం!
చక్కని భావాలను చిక్కగా కవిత్వీకరించగల భాషా పటిమా, భావుకతా  ఈమె కవితల్లో  దర్శనమిస్తుంది.   

***

మె కవితలు  ‘నా గుండె గుమ్మానికి పచ్చనాకువై’,  ‘సజీవ క్షణాల కోసం’ అనే రెండు పుస్తకాలుగా  ఇప్పటికే వచ్చాయి.

ఇప్పుడు  ‘రెండు సంధ్యల నడుమ’  కొత్తగా విడుదలయింది.


దీనిలో 55 కవితలున్నాయి.  వీటిలో ఎక్కువ కవితలు చక్కని అనుభూతిని కలిగించేవే.  సమాజ శ్రేయస్సు కోరేవే! 

***

విత్వాన్ని ఆల్కెమీ ( రస వాదం) గా  వర్ణించిన మన తెలుగు కవి తిలక్  ‘అందం,  ఆనందం దాని పరమావధి’ అంటాడు.  ఈ రెండు లక్షణాలూ శ్యామల కవిత్వంలో కనిపిస్తాయి.

కళ్ళకు కట్టేలా అద్భుత వర్ణనలతో కవితలను  అలంకరించి తన అనుభూతిని పఠితలకు అందంగా అందేలా చేసే కవితలెన్నో ఉన్నాయి ఈ సంకలనంలో.

కొన్ని మచ్చుకు చూపిస్తాను..

‘వర్ణాలను రాశి పోసినవాడు’  నుంచి...

‘కాగితపు కుబుసాన్ని ఒలిచి వో చీరను మృదువుగా
బయటకు తీసి... ఒక్కొక్క పొరా విడుస్తుంటే
ఉరుముల మెరుపుల నల్ల మబ్బు నీడలో నాట్యమాడడానికి
సిద్ధమైన నెమలిపిట్ట వన్నెవన్నెల నెమలీకల పింఛాన్ని విప్పుకున్నట్లే వుంటుంది!’

‘నాట్లెయ్యడం చూసినాక’ నుంచి - 

‘పనిని వో పదంలా... పాటలా వాళ్ళు మట్టిలో విత్తుతుంటే
పులకించిన గాలి పిల్ల వారి కొంగుల ఉయ్యాలలో
ఊగుతూ వంత పాడుతుంది!
పొద్దు నడినెత్తికొచ్చాక..
సూరీడు ఎర్రగారమై వారి చద్దెన్నపు చందమామను
ముద్దాడి మురిసిపోతాడు’

 ‘వెన్నముద్ద చెట్టు’ నుంచి -

‘నా బాల్యాన్ని చిలికి తీసిన వెన్నముద్దను పూలలా పూసే
మా చెట్టంటే నాకెంతో యిష్టం
బహుశా పాలెక్కువై సలపరింతతో అమ్మ పిండి పాదులో
పోసిన పాలు తాగి పెరిగిన చెట్టు కాబట్టేమో !
అమ్మ ప్రేమంత కమ్మగా... అమ్మ నవ్వంత తెల్లగా యిప్పటికీ
పూస్తూనే ఉంది! నా తోటంతా పండు వెన్నెలలు కాస్తూనే ఉంది!’

***

‘కవిత్వం బాధకు పర్యాయపదం’ అన్నాడు శ్రీశ్రీ.

ఈ సంపుటిలో  ‘బాధ ఓ జీవితావసరం’ అనే కవిత బాధను కొత్త కోణంలో చూపిస్తుంది.

కొన్ని పంక్తులు ఇక్కడ ఇస్తున్నాను.

‘పుట్టుక నుండి చావు దాకా
మనిషి. పాడుకునే బతుకు పాటకు పల్లవి బాధే  
...
బాధ ఆనందానికి సోపానం
బాధ ఒకోసారి ఆయుధం కూడా అవుతుంది’
...
బాధను భరించేవాడికే ప్రశ్నించే హక్కు
నిలదీసే ... నినదించే హక్కు ఉంటాయి!
నిజమే... బాధ వో జీవితావసరం!!’’


***
‘వంటిల్లు’ అనగానే విమల రాసిన కవిత గుర్తొస్తుంది.

‘ఈ వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి
అయనా చివరకు వంటింటి గిన్నెలన్నింటి పైనా
మా నాన్న పేరే !

నేనొక అలంకరించిన వంట గదిలా
కీ ఇచ్చిన బొమ్మలా ఇక్కడ తిరుగుతూ ఉంటాను
నా వంటిల్లోక యంత్రశాలలా ఉంది
రకరకాల చప్పుళ్ళతో ఈ వంటిల్లొక కసాయి
దుకాణంలా ఉంది’ ... 

ఇవి విమల  కవితలో  కొన్ని భాగాలు...


అదే పేరుతో ఈ  ‘రెండు సంధ్యల నడుమ’  పుస్తకంలో  కవిత రాసిన  శ్యామల  వంటింటిని మరో కోణంలో దర్శింపజేస్తుంది.


‘నన్ను ప్రేమగా పలకరించే ప్రియసఖి నా వంటిల్లే!’ అనటమే కాదు;

‘పద చిత్రాల్ని భావ చిత్రాల్ని ఏరేరి తెచ్చుకుని అపురూపంగా
అల్లిన కవిత ’ అంటూ వంటను వర్ణిస్తుంది.

వంటిల్లు తన కవితా రచనకు మౌన సహచరి అంటూ కితాబునిస్తుంది.

‘అన్నిటికీ తానే వేదికై... వేడుకగా.. కిటికీల కళ్ళెత్తి
అబ్బురపడుతూ వింటుంది’

చివరికొచ్చేసరికి...  స్త్రీవాద ఛాయలతో ముగుస్తుందీ కవిత.

‘చిన్నప్పటి నుండీ.. ఇప్పటివరకూ
వంటింటి సదుపాయాలు మారాయేమో గానీ..
వంటింటి పాత్రలూ అవే !
వంటగత్తె పాత్రలూ అవే!

గిన్నె గరిట బాండి కుక్కరు
అమ్మమ్మ అమ్మ నేను నా పాప!

వంటిల్లు మాత్రం ఎప్పటికీ నిత్య స్త్రీ లింగమే!’


భావుకత, పఠనీయత నిండుగా ఉన్న ఈ కవితలకు చిదంబరం  అర్థవంతమైన బొమ్మలను జోడించారు.   

‘సామాజికత, మానవత, ప్రౌఢత ముప్పేటలుగా అల్లుకున్న  కవిత్వం’ అంటూ డా. ఎన్. గోపి తన ముందుమాటలో  అంచనా వేశారు.  ‘రెండు సంధ్యల మధ్య ఎండలాంటి స్వచ్ఛమైన కవిత్వమిది’ అని ప్రశంసించారు. 

వీటిలోని  రాజకీయ, సామాజిక కవితలు సమూల సామాజిక మార్పును  కాకుండా, సంస్కరణవాదాన్ని కోరేవే  కావొచ్చు. ఆ పరిమితుల్లోనూ  ఆహ్లాదపరిచి, ఆలోచింపజేసి... కవిత్వంపై మంచి అభిప్రాయం కలగజేస్తాయీ కవితలు !

27, ఏప్రిల్ 2017, గురువారం

స్వాతిముత్యంలో సంఘర్షణ! సిరివెన్నెల్లో శోధన!!


 
టీవీలో  హిందీ ‘మహాభారత్’ సీరియల్ వస్తోంది... 1990 ప్రాంతంలో.  దుర్యోధనుడు భీముడి గదాఘాతానికి తొడలు విరిగి నేలపై పడిపోయిన సన్నివేశం. దుర్యోధనుడికి మద్దతుగా కోపంతో అతడి గురువు బలరాముడి వాదనలూ, అన్నను అనునయిస్తూ భీముణ్ణి సమర్థిస్తూ కృష్ణుడి ప్రతివాదనలూ వాడిగా సాగుతున్నాయి.

ఇదంతా జరుగుతున్నపుడు... ఆ నిస్సహాయ స్థితిలో దుర్యోధనుడి మొహంలో భావాలు ఎలా ఉన్నాయి? 

దర్శకుడైన రవి చోప్రాకు ఆ దృష్టి ఉన్నట్టు లేదు. అందుకే అతడి వైపు తిప్పనివ్వలేదు కేమెరాని!

బలరాముడు వెళ్ళిపోయాక..  నేలవాలిన  దుర్యోధనుడి చుట్టూ పాండవులూ, కృష్ణుడూ నిలబడతారు. కేమెరా దుర్యోధనుడి  తల వెనకభాగం మీదుగా  వాళ్ళను చూపించింది.. అతడి ముఖం కనపడకుండా జాగ్రత్తపడుతూ!

దేశవ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకున్న బీఆర్ చోప్రా సీరియల్  మహాభారత్. ఏదో  వీలుండి... చూసిన ఆ 91వ ఎపిసోడ్ అంత నాసిగా అనిపించింది. 

ఆఫీసుకు వచ్చాక...  సినీరంగంతో సంబంధం ఉన్న మా సీనియర్ జర్నలిస్టు డి. చంద్రశేఖర్ గారితో ఇదంతా చెప్పాను, నా అసంతృప్తిని పంచుకున్నాను.  అంతా విని ‘డైరెక్టోరియల్ యాంగిల్లో ఆలోచించావే..’ అంటూ ఆయన మెచ్చుకున్నారు.

ఆ కోణమూ అదీ నాకేమీ తెలీదు. అసలది కామన్ సెన్స్ పాయింటు కదా!

* * *


ర్శకుడు కె. విశ్వనాథ్ తీసిన ఎన్నో సినిమాలు నాకు ఇష్టం.

ఆయన సినిమాలు సమాజాన్ని మార్చాలనుకునే తరహావి కావు. వాటి లక్ష్యం అది కాదు.

ఉన్న వ్యవస్థలో ఉపరితలంగా కనిపించే ‘కొన్ని’ లోపాలను ఉదారంగా, సంస్కరణతో మెరుగుపరచాలనుకునేవి. 

చౌకబారు హాస్యం, ద్వంద్వార్థాల సంభాషణలూ, చీదర పుట్టే ఐటమ్ సాంగులూ, కృత్రిమమైన పాత్ర చిత్రణలూ, అవకతవకల కథాంశాల సినిమాల మధ్య విశ్వనాథ్ సినిమాలు చాలా ఊరటనిస్తాయి. 
 
సహజంగా  సాగే సంఘటనలూ, 


మానవత్వానికీ, సంస్కారానికీ ప్రతీకలైన పాత్రలూ... 


అర్థవంతమైన... లోతైన హావభావాలూ...


కథలో భాగంగా వచ్చే సున్నిత హాస్యం...


వినసొంపైన సంగీతం, కనువిందు చేసే చిత్రీకరణా..  


ఇవన్నీ విశ్వనాథ్ సినిమాల ట్రేడ్ మార్క్. 

‘శంకరాభరణం’ (1979) రాకముందే ఎన్నో మంచి చిత్రాలు తీశారాయన. ఆత్మగౌరవం, చెల్లెలి కాపురం, కాలం మారింది, సీతామాలక్ష్మి,  శారద,  సిరిసిరి మువ్వ...

శంకరాభరణం తర్వాత మాత్రం?

సాగర సంగమం, సిరివెన్నెల, స్వాతిముత్యం, శుభలేఖ, స్వర్ణ కమలం, స్వాతి కిరణం...

వ్యాపారాత్మక సినిమాల ఉరవడిలోనూ తన మార్గం వదల్లేదు.
ఏటికి ఎదురీది  క్లాస్ మాస్ సరిహద్దులు ఎంతో కొంత చెరిపేశారు!

తన పరిధిలో సంస్కరణనూ, శ్రమైక జీవన సౌందర్యాన్నీ కళాత్మకంగా చెప్పటానికి ప్రయత్నించారు.

* * *
సంవత్సరాల క్రితం కె.  విశ్వనాథ్ ను కలిసి వివరంగా ఇంటర్ వ్యూ చేసినట్టు కల  వచ్చేది.

ఆ తర్వాత కొంత కాలానికి ఓ రోజు మా ఆఫీసు పై అంతస్తులో నిలబడివుండగా ..  ఏదో టీవీ చర్చలో పాల్గొనటానికి ఆయన మెల్లగా నడిచివస్తూ కనిపించారు.
అదే ఆయన్ను తొలిసారి ప్రత్యక్షంగా చూడటం!

సంభ్రమంగా అలా  చూస్తూవుండిపోయాను.

మళ్ళీ కొన్నేళ్ళకు హైదరాబాద్ లోనే  ఓ పెళ్ళి  కార్యక్రమంలో ఆయన్ను దగ్గర్నుంచి చూశాను.
తెలిసినవారూ, తెలియనివారూ ఆయనకు నమస్కారాలూ, విష్ చేయటం చేస్తూనేవున్నారు...
నేనూ పలకరించవచ్చు గానీ...
ఏమని మాట్లాడాలి?  మీరు సినిమాలు బాగా తీస్తారు అనా?  శంకరాభరణానికంటే ముందు నుంచే మీ సినిమాలంటే  నాకు ఇష్టం.. అనా? మిమ్మల్ని నా కలలో ఇంటర్ వ్యూ చేశాననా?... 

పేలవంగా ఉండదూ!

అందుకనే  మౌనాన్ని ఆశ్రయించాను. 
* * *

ప్రతి పాత్రకూ నిర్దిష్ట స్వభావం నిర్వచించుకుని, ఆ పాత్ర చూపులో, చర్యలో, మాటలో,  మౌనంలో అది వ్యక్తం అవుతూవుండాలనే దృష్టి  ఉన్న దర్శకుడు విశ్వనాథ్.

నవల్లో అయితే  రచయితకు పాత్రల అంతరంగాన్ని చిత్రించే సౌలభ్యం ఉంటుంది.
కానీ దృశ్య మాధ్యమంలో ఆ వెసులుబాటు ఉండదు.
పాత్రల మొహాల్లో ... తగిన మోతాదులో... వ్యక్తం కావాల్సిందే.

దాన్ని చూపించటం దర్శకులకు  కొన్ని సందర్భాల్లో కత్తిమీద సాముగా పరిణమిస్తుంది.

 అంతరంగ సంఘర్షణ!
ఒక చిన్న సన్నివేశం...దానిలో నాలుగే  డైలాగులు... ప్రతిభావంతులైన  నటులు!

ఇక  చిత్రీకరించటం ఎంతసేపు!

కానీ దానిలో ఒక పాత్ర  స్పందన (రియాక్షన్)....అది ముఖంలోనే ప్రతిఫలించాలి. మౌనమే... మాటలుండవు. అంతరంగాన్ని వ్యక్తం చేసేలా పలకాలి ముఖ కవళికలు!.

అవి... ఎలా ఉండాలనేది స్పష్టం చేసుకుని, దాన్ని చిత్రీకరించటానికి  ఏకబిగిన 19 గంటలు... పగలూ, రాత్రీ మథనం చేశారు విశ్వనాథ్!  అంతటి తపన ఎందరు దర్శకులకు ఉంటుంది?   

స్వాతిముత్యం (1985) లోది  ఆ సన్నివేశం!

తనకు మంచి చెయ్యాలని తాళి కట్టిన లౌక్యం తెలియని అమాయకుడు కమల్  ఓ రాత్రి హఠాత్తుగా తన పక్కలోకి వచ్చి పడుకుంటాడు. ఉలిక్కిపడి లేచిన రాధికలో కొద్ది క్షణాల్లో అంతరంగ సంఘర్షణ ఎలా చెలరేగుతుంది?


దీని గురించి దర్శకుడు విశ్వనాథ్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చారు.


ఆ సన్నివేశం ఇక్కడ చూడండి

* * *
 చూపులో శోధన!!

సిరివెన్నెల (1986) లో నాయకుడు సర్వదమన్ బెనర్జీ  అంధుడు, నాయిక సుహాసిని మూగది. అతడి పట్ల అనురాగం పెంచుకున్న ఆమెకు అప్పటికే ఓ అతడో స్త్రీని ఆరాధిస్తున్నాడని తెలుస్తుంది.

అది  తెలిశాక.. అతడిని మొదటిసారి చూసినపుడు ఆమె చూపు ఎలా ఉంటుంది?  అంతకుముందులాగా మాత్రం ఉండే అవకాశం లేదు.

ఆ చూపు... అప్పటి ఆమె మనోభావాలను ప్రతిబింబించేలా ఉండాలి.
అందుకే... అతడిని ఆమె కొత్త వ్యక్తిని చూస్తున్నట్టు..  ఒక శోధనతో చూస్తుంది.

దర్శకుడు విశ్వనాథ్ ఆ సన్నివేశ ప్రత్యేకతను ఇలా వివరించారు.
 

* * *
రెండు సన్నివేశాల్లోని లోతును నేను ఆ సినిమాలు చూసినప్పుడే గ్రహించానా?
లేదు.

దర్శకుడు  ఇలా ఇంటర్ వ్యూల్లో వివరించాకే  వాటిని తెలుసుకోగలిగాను.

‘సాగర సంగమం’లో కూడా  ఎప్పుడూ తనతోనే ఉంటానని హీరోయిన్ చెప్పగానే   హీరో   తన  సంతోషాన్ని ఆస్వాదించటానికి  ఆమె నుంచే  ఏకాంతం కోరుకుంటాడు. ఆమెతో పాటు వెళ్తున్న కారులోంచి దిగిపోతాడు.   దీనిలోని సైకలాజికల్ పాయింటును దర్శకుడు చెప్పలేదు కానీ... ఓ మిత్రుడు చెపితే  దాన్ని గ్రహించాను.  

ఇలాంటివి  వివరిస్తే గానీ అర్థం కావటం లేదంటే  అది ఆ దర్శకుడి లోపమనుకోకూడదు. వివరించకపోయినా గ్రహించే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. (దర్శకుడు కూడా ఆలోచించని విషయాలను ‘సింబాలిక్ గా గొప్పగా చెప్పారం’టూ అన్వయించి చెప్పేవాళ్ళు కూడా ఉంటారనుకోండీ...)

ఆ సన్నివేశాల రూపకల్పన వెనకునన్న  ఆంతర్యం తెలియకపోయినా సినిమా ఆస్వాదనకు లోటుండదు.
కానీ ఆ లోతు  తెలిస్తే మరింత ముగ్ధులమవుతాం! 
 
ఏ కళారూపమైనా ...
మరీ నిగూఢంగా, మార్మికంగా, పాషాణ పాకంలా, అయోమయంగా ఉండకూడదు  కానీ...
తరచిచూసిన కొద్దీ... ఆలోచించిన కొద్దీ..  కొత్త అందాలూ, కోణాలూ తెలిసేలా చేసేది ఉత్తమ కళే!

అది-
రచన కావొచ్చు.
సంగీత రచన కావొచ్చు.
చిత్రం కావొచ్చు..
చలన చిత్రం కావొచ్చు! 


(యూ ట్యూబ్ ద్వారా ఈ వీడియోలు  అందుబాటులో ఉంచిన సంబంధిత  టీవీలకూ,  వాటిలో పాల్గొన్న యాంకర్లకూ  కృతజ్ఞతలు.  వీడియోల్లో  ఈ పోస్టుకు ‘ అవసరమైనంతవరకూ ’క్రాప్ చేశాను..)


20, మార్చి 2017, సోమవారం

ఆ నవల కోసం.... ఏళ్ళ తరబడి సాగిన అన్వేషణ!నిషి కోరుకునేవీ;  అతడికి  సంతోషం, సంతృప్తి  కలిగించేవీ  ఏమిటి?

పోతన భాషలో - బలి చక్రవర్తి  వామనుడికి  చెప్పిన జాబితా చూస్తే....

‘వర చేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో
హరులో రత్నములో రథంబులొ విమృష్టాన్నంబులో కన్యలో
కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో
ధరణీ ఖండమో...’  


వస్తువులూ జంతువులతో సమానంగా ‘కన్యల’ను కలిపెయ్యటం గురించి ఇక్కడేమీ చర్చించబోవటం లేదు.

మిగిలినవాటినే చూస్తే...  మంచి వస్త్రాలూ, డబ్బూ, పండ్లూ, అటవీ సంపదా, ఆవులూ, గుర్రాలూ,  రత్నాలూ, రథాలూ, మంచి ఆహారం, ఏనుగులూ, బంగారం, భవనాలూ, గ్రామాలూ, పొలాలూ , భూ భాగం....

వీటిలో  గ్రంథాలు (పుస్తకాలు)  లేవు!
 
‘ నే జదివినవి గలవు పెక్కులు- చదువులలో మర్మమెల్ల జదివితి’ అన్న ప్రహ్లాదుడికి మనవడై వుండి కూడా బలి చక్రవర్తి ... ఈ జాబితాలో పుస్తకాలను చేర్చలేదెందుకో!

కోరుకోవాల్సిన జాబితాలో పుస్తకాలు ఉండకపోతే నాకు  నచ్చదు.

పుస్తకాలు అంటే సాహిత్యం...
ప్రధానంగా నాకైతే  కథలూ, నవలలూ!

‘పుస్తకాలంటే ప్రాణం!’ అంటూ  ఈ బ్లాగు హెడర్ కింద నా గురించి రాసుకున్నాను కూడా! 

ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే...

చిన్నప్పుడు మూడొంతులు చదివి, చివరి పేజీలు లేక పూర్తిగా చదవలేకపోయిన ఓ నవల...

కథలోని  విషాదంతో  కళ్ళు చెమర్చేలా చేసిన నవల...


బాల్యం నుంచీ మరపు పొరల్లోకి  జారిపోకుండా... తరచూ గుర్తొస్తూ  వెంటాడిన నవల...


దాన్ని మళ్ళీ చదవాలని  ఎంతగానో కోరుకున్నాను.

అది  సెంటిమెంటల్ నవలే.  కానీ నా బాల్యంలో అమితంగా ఇష్టపడ్డాను కదా? అందుకే అది చదవాలనే తపనా,  దానిపై ఇంత  ఆసక్తీ!

దశాబ్దాలుగా వీలున్నపుడల్లా వెతుకులాడుతూ వచ్చాను...
మిత్రుల ద్వారా రకరకాల మార్గాల్లో  ప్రయత్నించాను...

ఇక  దొరకటం దాదాపు అసంభవమేమో అని నిరాశపడ్డాను కూడా!

అలాంటిది -
ఆచూకీ తెలిపీ  తెలపకుండా దోబూచులాడి...
చివరికి..
ఆ పుస్తకం

దొ
    రి
        కిం
              ది!     

అప్పటి నా మన: స్థితిని ఊహించండి!

నలబై సంవత్సరాల తర్వాత ఆ పుస్తకం పూర్తిగా చదవగలిగాను.

*  *  *

ది జరిగి  కొద్ది రోజులే అయింది.

ఏమిటా నవల?
ఎవరు రచయిత?
ఇవేగా  మీ సందేహాలు!

ఇవేమీ నాకూ  తెలియవు  మొన్నమొన్నటి దాకా!

నవల పేరూ,  రచయిత పేరూ , ఆ నవల ముగింపూ తెలియకపోయినా ఇన్నేళ్ళుగా దాని సంగతి ఎప్పుడూ మర్చిపోలేదు.

కనీస ఆధారాలేమీ  తెలియకుండా వెతకటం అంటే చీకట్లో నల్లపిల్లి కోసం వెతకటంతో సమానమేగా?

మనసులోనే నిలిపివుంచుకుంటూ  మరెవరికీ  చెప్పకుండా... మౌనంగా, ఏకాంతంగా సంవత్సరాలుగా సాగించిన ఈ పుస్తకాన్వేషణ...

భౌతిక రూపంలో అక్షరాలుగా బయటపడింది మాత్రం  2014  జులై నెలాఖర్లో.

అప్పుడు ఓ బ్లాగు పోస్టును రాస్తూ ఈ పుస్తకం గురించి ప్రస్తావించాను.నేను గుర్తుంచుకున్న పాత్ర పేరు ‘ విభూతి’  అని తర్వాత అర్థమైంది.

బెంగాలీ నవల  అంటే అది శరత్ రచనో,  బంకించంద్ర రచనో అయివుండొచ్చనుకున్నాను.
 

ఆ పుస్తకాన్ని  కృష్ణాజిల్లాలో  వెనకబడిన  ప్రాంతంలోని మా  ఊరు  చాట్రాయిలో మా ఇంట్లో చదివాను.
బహుశా 1977 ప్రాంతంలో...!

అంత నచ్చిన పుస్తకం పేరు గుర్తు పెట్టుకోలేదు.
రచయిత ఎవరో గమనించే దృష్టి అప్పటికి లేదు.
తర్వాత  ఆ పుస్తకం ఏమయిందో తెలియదు.  మళ్ళీ కనపడనే లేదు.

ఏళ్ళు గడిచాయి.

సరే,   2014లో  బ్లాగు పోస్టులో దాన్ని గురించి  రాశాక,  అది చదివినవారెవరైనా  ఆ నవల ఆచూకీని, కనీసం దాని పేరు అయినా చెపుతారని కొంత ఆశపడ్డాను కానీ,  దాని గురించి ఎవరూ  చెప్పలేకపోయారు.

దాంతో  యథాతథ స్థితి కొనసాగింది.

నవల పేరు ... తె  లి  సిం  ది!

2016లో... అంటే కిందటి సంవత్సరమే... అనుకోకుండా ఆ నవల పేరు తెలిసింది!

యద్దనపూడి సులోచనారాణి  ‘మీనా’ ప్రారంభ భాగాల కోసం యువ పాత సంచికల పీడీఎఫ్ లు తిరగేస్తున్నాను.  అనుకోకుండా ‘ఎండమావులు’ సంక్షిప్త నవల కంటపడింది. దానిలో మొదటి పేజీ మిస్సింగ్.  అయినా కథ చదువుతుంటే  నేను చిరకాలంగా  అన్వేషిస్తున్న కథాంశమున్న నవల ఇదేనని అర్థమైంది.


విషయసూచిక చూస్తే.. రచయిత గా  డా.  నీహార్ రంజన్ గుప్తా  పేరు కనపడింది. (అనువాదకుడి పేరు- మిస్సయిన మొదటిపేజీలో ఉందేమో తెలియదు)

ఈ ఆధారం చాలదూ?

గూగుల్ సహకారంతో తెలుగు , ఇంగ్లిష్ సెర్చి పదాలు ఉపయోగించి వెతికాను.  ఆ రచయిత రాసిన రచనల వివరాలు తెలిశాయి.

వాటిలో మద్దిపట్ల సూరి  తెలుగులోకి అనువదించిన ‘మాయామృగం’ నవల పేరు కనపడింది. నిజానికి నీహార్ రంజన్ గుప్తా రచన తెలుగులోకి వచ్చింది ఇదొక్కటే.


ఎండమావులకూ,  మాయామృగం  పేరుకూ చాలా సారూప్యత కనపడింది.

అంతే కాదు,  మాయామృగ/ మాయా మృగో  బెంగాలీ నవలను బెంగాలీ సినిమాగా తీశారు. దాన్ని‘అన్నై’ పేరుతో భానుమతి- షావుకారు జానకిలతో తమిళంలో తీశారు. దాన్ని తెలుగులో ‘పెంచిన ప్రేమ’గా డబ్ చేశారు.

‘పెంచిన ప్రేమ’ పాటలపుస్తకంలో కథాసంగ్రహం చూశాను.... నాకు తెలిసిన ఆ  కథే.  ఎండమావులు కథే.

అంటే-
నేను ఇన్నేళ్ళూ వెతుకుతున్న నవల - ‘మాయామృగం’ అన్నమాట.

ఇక నా  అన్వేషణకు స్పష్టత వచ్చింది.
ఈ వెతుకులాటలో ముఖ్యమైన ఈ మలుపు  సంభవించిన రోజు-  2016  సంవత్సరం  ఫిబ్రవరి 17!

ఆ రోజే  గుంటూర్లో ఉన్న  శ్యామ్ నారాయణ గారికి  మెయిల్ రాశాను.  తన దగ్గరున్న పుస్తకాల్లో   ‘మాయా మృగం’ ఉందేమో చూడమనీ,  అది  ‘బాల్యం నుంచీ  పేరు తెలియకుండా  నేను  తెగ అన్వేషిస్తున్న నవల ( నవల పేరు ఇవాళే  తెలిసింది.. )  అనీ’ రాశాను.

‘లేదు’ అని   సమాధానం.  కాస్త నిరాశ...

ఇంకా ఆ పుస్తకం గురించి తెలిసే అవకాశం ఉన్న- నాకు తెలిసిన కొద్దిమంది సాహితీవేత్తలకు మెయిల్స్ రాశాను.

అతి కొద్దిమంది మిత్రులకూ తెలియజేశాను.

నవల పేరూ, రచయిత పేరూ తెలియదు కాబట్టి, ఆ పుస్తకం నాకు  దొరికే ఛాన్సు దాదాపు లేదనే భావిస్తూ వచ్చాను.

కానీ అనుకోకుండా ఆ నవల పేరూ, వివరాలూ తెలిశాయి కాబట్టి  ఆ పుస్తకం దొరుకుతుందని నమ్మకం వచ్చేసింది.

ఆధారం దొరికింది కదా?  నవల పేరూ,  రచయిత పేరూ,  అనువాదకుడి  పేరూ ‘కీ వర్డ్స్’గా ఇంటర్నెట్లో  విస్తృతంగా వెతకటం మొదలుపెట్టాను.

dli.ernet.in,
ulib.org,

archive.org,
tirumala.org,

sundarayya.org..

ఇంకా ఇతర  సైట్లలో, చివరకు -
kathanilayam.com లో కూడా వెతుకుతూ వచ్చాను.

కానీ... ఆచూకీ ఏమీ  దొరకలేదు.

అయితే...  నీహార్ రంజన్ గుప్తా రాసిన బెంగాలీ నాటకం ‘మాయామృగ’ pdf  దొరికింది!

లిపీ, భాషా ఏమాత్రం తెలియకపోతేనేం... దాన్ని డౌన్ లోడ్ చేసుకున్నాను.

హిందీ అక్షరాలతో పోలిక ఉన్న భాష  కాబట్టి పాత్రల పేర్లు  పోల్చుకున్నాను.

ఇప్పుడో  కొత్త సందేహం....
ఇంతకీ మాయామృగ  నాటకమా? నవలా? అని. 
బెంగాలీ నవల నెట్లో దొరకలేదు.   నాటకం ఎదురుగా కనపడుతోంది..

మరి మద్దిపట్ల సూరి నాటకాన్ని నవలగా మార్చి అనువదించారా?

సమాధానం దొరకలేదు  (ఇప్పటికీ).

రే,  నవల పేరు తెలియటం తప్ప...  నెలలు గడిచిపోతున్నా పుస్తకం దొరికే దిశలో అడుగు ముందుకు పడలేదు-
...  శ్యామల  పూనుకునేదాకా!

శ్యామల నా చిన్ననాటి స్నేహితురాలు.  నేను హైస్కూల్లో చదువుతున్నపుడు  తను నా సీనియర్.

తను సాహిత్యాభిలాషి మాత్రమే కాదు. అనుభూతివాద కవిత్వాన్ని అద్భుతంగా రాసే భావుకురాలూ,  తొలి తెలుగు గజల్ కవయిత్రీ! 

నా వెతుకులాట గురించి  ఓసారి యథాలాపంగా చెప్పాను.

‘ఆ  పుస్తకం కోసం ప్రయత్నిస్తాననీ,  తప్పకుండా సాధించి ఇస్తా’ననీ  తను వాగ్దానంలాగా చెప్పినపుడు మొహమాటంగా నా సంతోషం తెలిపాను.

అంతే.!  ఆశలైతే పెట్టుకోలేదు. నిజం చెప్పాలంటే... అది సాధ్యమవుతుందని నమ్మనే లేదు!

పుస్తకం దొరికే ఛాన్సు తక్కువ ఉండటం, తన సోర్సులు పరిమితమేనని అనుకోవటం, తన పట్టుదల సంగతి తెలియకపోవటం... దీనికి  కారణాలు.

నా అభిప్రాయం తప్పని త్వరలోనే అర్థమవసాగింది.

పాత పుస్తకాల షాపుల్లో చూడటం,  ఆన్ లైన్లో వెతకటం తప్ప నాకుగా నేను  చెప్పకోదగ్గ ప్రయత్నం ఏం చేశాను?

కానీ శ్యామల సిన్సియర్ గా పుస్తకం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది.  సుప్రసిద్ధ వేటపాలెం గ్రంథాలయంలో ,  తెనాలి , గుంటూరు గ్రంథాలయాల్లో కూడా  ఈ పుస్తకం కోసం  వెతికింది, వెతికించింది. వాటిలో దొరకలేదు.

మద్దిపట్ల సూరి గారి వారసులను సంప్రదిస్తే  పుస్తకం దొరకవచ్చు కదా  అని సలహా ఇచ్చింది.
ఈ ఆలోచన అప్పటికే నాకూ  వచ్చింది కానీ...  అది చివరి ప్రయత్నంగా చేద్దామని ఊరుకున్నాను.

( సాహితీ వేత్తల వారసుల్లో చాలామందికి ఆ సాహిత్యంపై అనురక్తి  లేకపోవటం, వాటి విలువ తెలియనంత అనాసక్తి  ఉండటం నాకు తెలుసు. అందుకే ఈ మార్గం అంత సఫలం కాకపోవచ్చని అనిపించింది కానీ,  పూర్తిగా ఆశ వదులుకోలేదు.)

ఈలోగా శ్యామల తన ప్రయత్నం కొనసాగిస్తూనేవుంది.  రచయితా, అన్నమయ్య ప్రాజెక్టు బాధ్యులూ అయిన పెద్ది సాంబశివరావు గారికీ, ఇతర సాహిత్యాభిమానులకూ  ఆ పుస్తకం గురించి చెప్పివుంచింది.

*  *  *


మాయామృగం ... పేరు తెలిసి ఊరించి -  నిరాశపరుస్తూ ఉన్నకాలంలో అనుకోకుండా మరో మలుపు.

నెట్లో యథాలాపంగా సెర్చి చేస్తుంటే.. ఆ లింకు వికీపీడియా సైట్ ద్వారా పిఠాపురంలోని వందేళ్ళ గ్రంథాలయ పుస్తకాల జాబితా -2కి తీసుకువెళ్ళింది.  మూడో వరసలో ఉన్న  పేరు చూడగానే ఆశ్చర్యానందాలు.

మయా మృగం...

మొదటి పదం మొదటి అక్షరంలో  దీర్ఘం లేకపోతేనేం... సుదీర్ఘమైన అన్వేషణ ఫలించే సూచనను ఆ  పదం అందించింది.

ఎంట్రీ నంబర్ తో సహా  పుస్తకం వివరాలు  కనపడ్డాయి. ప్రచురణ సంస్థ పేరూ, ప్రచురించిన సంవత్సరం కూడా !


ఇంత స్పష్టంగా పుస్తకం ప్రచురణ వివరాలు తెలియటం ఇదే మొదటిసారి.

ఆ లైబ్రరీలో తప్పకుండా పుస్తకం ఉంటుందని నమ్మకం. 

గట్టి నమ్మకంతో ...ఆశతో... అక్కడి లైబ్రేరియన్ ని ఫోన్లో సంప్రదించాను.

కొద్ది రోజుల్లో....  ఆయన సమయం వెచ్చించి మరీ వెతికారు గానీ దొరకలేదు.

లైబ్రరీలో  ఎంట్రీగా ఉండి కూడా పుస్తకం దొరకనందుకు  నిరాశ పడ్డాను.

*  *  *
వల పేరు తెలిసి సంవత్సరం కావొస్తోంది.

1962లో   తొలిసారి ముద్రితమైన  ఆ పుస్తకం రెండో ముద్రణ కూడా వచ్చినట్టు లేదు.  ఈ 55 ఏళ్ళలో వేసిన వెయ్యి కాపీలూ శిథిలమైవుండటమో,  కాలగర్భంలో కలిసివుండటమో జరిగివుండొచ్చు. ఫిజికల్ కాపీ దొరికే ఆశలను దాదాపు వదిలేసుకున్నాను.

హైదరాబాద్ తార్నాక లోని  స్టేట్ ఆర్కయివ్స్ వారి వద్ద డిజిటల్ రూపంలో ఉండవచ్చనే ఒక ఆశ ఇంకా మిగిలింది.

ఈ పరిస్థితుల్లో శ్యామల ద్వారా ఓ అనుకూల సమాచారం  విన్నాను.  అది పెద్ది సాంబశివరావు గారి ద్వారా తెలిసిన విషయం. వికీపీడియన్, సాహిత్యాభిమానీ అయిన రహమాన్ దగ్గర ఆ పుస్తకానికి సంబంధించిన భరోసా వార్త  ఉందని!

నేరుగా రహమాన్ నే సంప్రదించాను. ఆ పుస్తకం తన దగ్గర లేదనీ,  అఫ్జల్ గంజ్ లోని  స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో డిజిటల్ రూపంలో ఉందనీ , ఆ పుస్తకం సీరియల్ నంబర్ తదితర వివరాలు ఇచ్చారు.

ఆ లైబ్రరీ బాధ్యులతో మాట్లాడాను.  వారం రోజుల తర్వాత మళ్ళీ సంప్రదించమని చెప్పారు.

ఆ హామీతో  నిశ్చింతగా ఉండగా....

ఈ  అన్వేషణ మరో మలుపు తిరిగింది.


*  *  *


రోజు  డిపార్ట్ మెంట్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ సైట్ లోకి ఎలాగో  వెళ్ళాను.  సెర్చి ఆప్షన్లో  నవల పేరును ఎంటర్ చేసి వెతికాను.

ఇలా కనపడింది.
వివరాల  కోసం view details  క్లిక్ చేశాను.

గుంటూరు రీజనల్ లైబ్రరీలో  ఈ పుస్తకం ఉందంటూ ఇలా కనపడింది.

 మళ్ళీ ఉత్సాహం...

పిఠాపురం లైబ్రరీ నిరాశపరిచాక...   ఫిజికల్ పుస్తకం దొరుకుతుందనే ఆశ మళ్ళీ  అంకురించింది.

కానీ అక్కడ వెతికాక   నిరాశే మిగిలింది.

2011లో  చివరిసారి ఎంట్రీ ఉన్న ఆ పుస్తకం ఆ లైబ్రరీలో  కనపడలేదు.

పుస్తకాలను భద్రంగా సంరక్షించాల్సిన గ్రంథాలయాల్లో  పరిస్థితి ఇలా ఉందన్నమాట!

ఇక చేసేదేముందీ... డిజిటల్ పుస్తకం మీదే ఆశలన్నీ పెట్టుకుని ఉన్నాను.   

ఈ అన్వేషణ చివరికి వచ్చేసినట్టేననీ,  డిజిటల్ పుస్తకం దొరకటం మాత్రం తక్కువ సంతోషమేమీ కాదనీ  సర్దుబాటు ధోరణిలోకి వచ్చేశాను.

అయితే-

మరో  సంతోషకరమైన మలుపు నాకోసం ఎదురు చూస్తోందని అప్పటికి నాకు తెలియదు!

*  *  *

నవల అనువాదకుడు మద్దిపట్ల సూరి స్వగ్రామం  తెనాలి దగ్గరున్న  అమృతలూరు అని  వికీపీడియా సమాచారం.

రచయిత సొంత ఊళ్ళోని గ్రంథాలయంలో ఆ పుస్తకం ఉండొచ్చు కదా అనే ఆలోచనతో శ్యామల చేసిన ప్రయత్నం అద్భుతంగా ఫలించింది!

ఫిబ్రవరి 27న... ఆ పుస్తకం అమృతలూరు లైబ్రరీలో తనకు

దొ
రి
కిం
ది!


ఇదే  ఆ పుస్తకం !

కానీ  15వ పేజీ నుంచే ఉంది. ముగింపు  పేజీలూ లేవు.

అయితేనేం...!  డిజిటల్ ప్రతిలోంచి ఆ పేజీలను భర్తీ చేసుకోగలననే భరోసా ఉంది కాబట్టి  అది పెద్ద లోటు అనిపించలేదు.

పుస్తకం కొరియర్లో  పంపిస్తే మిస్ అవ్వొచ్చు కదా,  స్వయంగా వచ్చి  తీసుకుంటాననీ చెప్పాను.

ఈ లోపు  పుస్తకం  పేజీల  ఫొటోలు చూసి, చాలా  ఆనందపడ్డాను.

ఎప్పుడో చిన్నప్పుడు చదివిన పుస్తకం ప్రతిని మళ్ళీ చూడగలననీ, చదవగలననీ అనుకోలేదు.

ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ కళ్ళముందుకొచ్చి,  ఎంత సంతోషం వేసిందో!


  కథకు కొస మెరుపు కూడా ఉంది!

మరో ఐదు రోజుల తర్వాత-   మార్చి 5న...

ఆ ఆదివారం నాడు హైదరాబాద్ ఆబిడ్స్  ఫుట్ పాత్  దగ్గర  పరిచిన పుస్తకాలను చూస్తున్న రహమాన్ కు  ‘మాయా మృగం’ కనపడింది! ( ఈ పుస్తకం గురించిన వెతుకులాట గురించి అప్పటికే తనకు తెలిసివుండటం వల్ల  రహమాన్ దృష్టిని  ఆ నవల ఆకర్షించింది.)

పుస్తకం దొరికిన విషయం  వెంటనే నాకు ఫోన్ ద్వారా తెలిపి సంతోషపెట్టారు రహమాన్.

అంతే కాదు,  నవలకు అన్ని పేజీలూ ఉన్నాయని చెప్పారాయన. దాన్ని హైదరాబాద్ లోనే ఉన్న సాంబశివరావుగారికి అందజేస్తానని చెప్పారు. 

మరుసటి రోజు సాయంత్రం ...  సాంబశివరావు గారిని మాధాపూర్ లో కలుసుకున్నాను.
ఆయనిచ్చిన ఆ పుస్తకాన్ని పదిలంగా తీసుకున్నాను.

గట్టి అట్టతో ఉన్న కవర్ పేజీని  చూశాను.  నవల పేరూ,  మూల రచయిత పేరూ, ప్రచురణ సంస్థ పేరూ మురిపిస్తూ కనపడ్డాయి.
 
చిన్నప్పటి నుంచీ చదువుదామని తపించిన పుస్తకం..


నా జ్ఞాపకాల్లో ఏళ్ళ తరబడి నిలిచిన పుస్తకం..


ఆశా నిరాశల మధ్య ఊగిసలాడించిన, ఊరించిన పుస్తకం..


ఆచూకీ దొరికినట్టే మెరిసి.. అంతలోనే మాయమవుతూ వచ్చిన  ‘మాయా మృగం’

...  ఇలా చేతుల్లోకి వచ్చింది...

ఆత్మీయమైన పాత నేస్తం మళ్ళీ కలిసినప్పటి సంభ్రమంతో
సంతోషంతో
అపురూపంగా అందుకున్నాను!

1977లో ఆ నవల చదివివుంటాను.
2016లో  దాని పేరు తెలిసింది...
2017లో పుస్తకం  దొరికింది!


ఈ సందర్భంగా  రహమాన్ కూ,   పెద్ది సాంబశివరావు గారికీ  కృతజ్ఞతలు చెప్పుకోవటం నా ధర్మం.


రహమాన్ నాకు తెలిసిన వ్యక్తి అయినప్పటికీ ... మాయామృగం గురించి తనను అడగాలని తోచలేదు.  ప్రత్యక్షంగా సాంబశివరావుగారి ద్వారా,  పరోక్షంగా రహమాన్ ద్వారా ఈ పుస్తకం దొరికేందుకు  శ్యామల  దోహదపడింది. అసలు దొరకదనుకున్న పుస్తకాన్ని  స్వయంగా సాధించటంతో పాటు  మరో ప్రతి  కూడా  దొరకటానికి  కారకురాలయింది.

ఆ రకంగా ఈ చిరకాలపు  అన్వేషణ...  శ్యామల ద్వారా  అద్భుతంగా ఫలించింది!

తన  సంకల్పం,  శ్రద్ధా,  పట్టుదలా  లేకపోతే ఇది సాధ్యమయ్యేదే కాదు!

28, ఫిబ్రవరి 2017, మంగళవారం

తులసిదళం - నేనూ - గంజాయిదమ్ము విమర్శా!

ఆ  తెలుగు  నవలను  చదివాను... ఉత్కంఠభరితంగా ఉండి, బాగా నచ్చింది.

ఆ రచయితపై అభిమానం పెంచేసుకున్నాను.

ఇంతలో... ఆ నవలపై  కఠోర  విమర్శ  కనపడింది.  అయిష్టంతో ...  అసహనంగా చదివాను  దాన్ని.
   
ఘన సమ్మోహనాస్త్రమనుకున్న  నవలను  ఆ విమర్శ గంజాయిదమ్ము  అని ఈసడిస్తుంటే ....  పట్టరాని ఉక్రోషం,  ఆ విమర్శ చేసిన వ్యక్తిపై కోపం కూడా వచ్చేశాయి.

అవి నా టెన్త్  రోజులు... దాదాపు ముప్పయి ఏళ్ళ  క్రితం నాటి ముచ్చట ఇది..  కథలూ, నవలల్ని అమితంగా ఇష్టపడటం అప్పటికే ఉంది మరి. 

అలా   కొద్ది కాలం  గడిచాక..

విచిత్రంగా...
ఆ నచ్చిన నవలపైనా,
ఆ  నచ్చని విమర్శపైనా 
నాకు  ఏర్పడిన  అభిప్రాయాలు  తలకిందులయ్యాయి!

నేనంతగా ఇష్టపడిన  ఆ నవలలోని  లోపాలను చూడగలిగే  ,  దాని  సైడ్ ఎఫెక్టులు గ్రహించగలిగే  చూపును-

నాకు దుర్భరంగా అనిపించిన అదే  ‘ విమర్శ’ నాకు  అందించింది. 

ఆ నవల  మారలేదు,  దానిపై  విమర్శా  మారలేదు.
మారింది  నేనే !


ఇదొక మరిచిపోలేని అపూర్వానుభవం నాకు!

* * *
నవల  ‘తులసిదళం’.
రచయిత- యండమూరి వీరేంద్రనాథ్.


 ఆ విమర్శ-  ‘తులసిదళం కాదు గంజాయి దమ్ము’

వ్యాసకర్త - రంగనాయకమ్మ.* * *
 1980  నాటి నవల ‘తులసిదళం’.  ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో  సీరియల్ గా వచ్చింది. తర్వాత ఆ వారపత్రికలోనే  దాని కొనసాగింపుగా అదే రచయిత  ‘తులసి’ రాస్తున్నపుడు  సీరియల్ భాగాలు కొన్ని  చదివాను.

పల్లెటూళ్ళలో అప్పుడప్పుడూ  జనం నోళ్ళలో  వినబడే  ‘చేతబడి’ని  కథా వస్తువుగా  చేసుకున్న రచనలు ఇవి.

అప్పటికి ఎవరూ వినవుండని ‘కాష్మోరా’ అనే క్షుద్ర దేవతను తెలుగు పాఠకులకు పరిచయం చేసిన నవలలివి. 

‘తులసిదళం’ సీరియల్  సంచలనాత్మకమై. ఆంధ్రభూమి వారపత్రిక సర్క్యులేషన్ ను అమాంతం పెంచేసింది.

లోకజ్ఞానం, శాస్త్రీయ దృక్పథం ఉన్నవారు నిర్ద్వంద్వంగా ఖండించే మూఢ నమ్మకాలకు ‘ సైంటిఫిక్ రీజనింగ్’ ఇస్తూ  వాటి వెనక శాస్త్రీయ కారణాలు ఉన్నాయని నిరూపించటానికి ప్రయత్నించింది.  

సీరియళ్ళు ముగిసి, పుస్తకరూపంలో వచ్చాకనే...  ఆ నవలలు పూర్తిగా చదివాను.  ఉత్కంఠగా  ‘భలే ఉన్నాయే’ అనిపించింది. 

ఈ అభిప్రాయం తర్వాత మారటానికి   ‘... గంజాయి దమ్ము’ విమర్శ నాకో ఉపకరణం అయింది.

 ‘‘పాఠకులకు కనీసం కూడా విమర్శ అనే ఆయుధం ఇవ్వకపోతే , ఇటువంటి సాహిత్యం మీద వాళ్ళ నమ్మకం ‘వైద్యం లేని జబ్బులాగా పెరిగిపోతూ ఉంటుంది’’ అంటారామె, ఆ విమర్శలో. ఆ రకంగా ఈ విమర్శ అనే ఆయుధం నాకు ఉపయోగపడింది.

‘దీంట్లో ఒక వెయ్యి మెలికలు ఉండటం వల్ల, దీని నిజ స్వభావాన్ని పాఠకులు గ్రహించలేకపోతున్నారు.. ఇది ఎంత క్షుద్రమైన, ఎంత అభివృద్ధి నిరోధకమైన పుస్తకమో చెప్పడానికే దీని మీద విమర్శ కావాలి. ఇది సైంటిఫిక్ దృష్టితో నడిచిందనే భ్రమల్ని పటాపంచలు చెయ్యడానికే దీని మీద విమర్శలు కావాలి’’ అంటారు రంగనాయకమ్మ తన విమర్శలో.

అలా గ్రహించనివాళ్ళలో నేనూ ఒకణ్ణి.

ఆ విమర్శా వ్యాసంలోని  ధర్మాగ్రహం,  భావ తీవ్రత,  తిరుగులేని తర్కం.. ఇవన్నీ నాకు  ఎంతో నచ్చాయి.

వీటితో పాటు  చెప్పదల్చిన పాయింట్లను యాంత్రికంగా ఏదోలా  పేర్చినట్టు కాకుండా-

ఆలోచనల్ని సానపెట్టేంత పదునుగా... ఆసక్తికరంగా, అనితర సాధ్యమనిపించేంత  శక్తిమంతంగా  రాయటం నాకు అబ్బురంగా అనిపించింది.

* * *

విమర్శ సుతిమెత్తగా, మృదువుగా ఉండాలని డా. ద్వా.నా. శాస్త్రి  ఆంధ్రభూమిలో ఓ వ్యాసం రాశారు.  దాదాపు 20 ఏళ్ళ క్రితం.  అంతటితో ఆగకుండా  విమర్శ అనేది తులసిదళంపై రంగనాయకమ్మ రాసిన  విమర్శలాగా ఉండకూడదని కూడా  చెప్పుకొచ్చారు.

స్పందించకుండా ఉండలేకపోయాను.   ‘దారుణాఖండల శస్త్ర తుల్యమైన రంగనాయకమ్మ విమర్శ వల్లనే ఆ నవల గురించి సరైన దృష్టిని నాలాంటివాళ్ళు  ఏర్పరచుకోగలిగారు’ అంటూ నన్నయ్య పద్యభాగాన్ని తోడుగా చేసుకుని,  ఆవేశంతో  నాలుగు ముక్కలు రాసి పంపాను.  పాఠకుల లేఖల్లో అది  వచ్చింది. 

ద్వా.నా. శాస్త్రి గారితో  తర్వాతి కాలంలో బాగానే పరిచయం పెరిగింది. కానీ ఆయన వ్యాసం గురించీ, దానిపై అప్పట్లో  రాసిన లేఖ గురించీ  చెప్పాలని తోచలేదు....ఇంతవరకూ!


* * *
 తులసిదళాన్ని ‘నవలాథ్రిల్లర్’ అని మెచ్చుకుంటూ  మరో రచయిత డా. కొమ్మూరి వేణుగోపాలరావు ఆ నవలకు  ముందుమాట రాశారు.

ఆ  నవలపై  రంగనాయకమ్మ  విమర్శా వ్యాసం  ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో  1981 డిసెంబరు 6 నుంచి ఏడు వారాలపాటు కొనసాగింది.

   Critique on Tulasidalam by Reader on Scribd


ఈ సుదీర్ఘ  విమర్శ ను పరిచయం చేస్తూ..  వచ్చిన  ఇంట్రో చూడండి-రంగనాయకమ్మ విమర్శలో ఒక ప్రత్యేక లక్షణం .. ఇతరులు సాధారణంగా గమనించని  మౌలికమైన అంశాలను లేవనెత్తటం.

కొన్ని పదునైన  వాక్యాలూ, వాటిలో  తర్కం చూడండి....
‘‘పేషెంట్ కి గుండె ఆపరేషన్ చేయాలని అంతవరకూ ఉద్దేశమే లేకుండా , ఏ ఏర్పాట్లూ లేకుండా ఒక్క నిముషంలో, ఒక్క నిముషం అంటే ఒక్క నిముషమే, ఒక్క  నిముషంలో గుండె ఆపరేషన్ ప్రారంభిస్తారా ప్రపంచంలో ఎక్కడైనా? ’’

‘‘ఇది ఫలానా జబ్బు. దీని లక్షణాలు ఇలా ఉంటాయి. ఇది 21 రోజులు ఉంటుంది. చివరి రోజున ఆపరేషన్ కూడా అవసరమవుతుంది. పిల్లకి వచ్చిన బాధలన్నీ ఈ జబ్బు వల్లే వచ్చాయి’ అని డాక్టరు ఒక జబ్బు పేరు చెప్పాలి. అలా ఎందుకు చెప్పలేదంటే  అలాంటి జబ్బేదీ ప్రపంచంలో లేదు గనక!’’

‘‘ఈ చెత్త చదవటం వల్ల వచ్చేఫీలింగ్ సస్పెన్స్ కాదు. జుగుప్స! రోత! చీదర! ’’ 

‘‘ఈ పుస్తకం వెకిలిగా, చౌకబారుగా, ఆటవిక కాలం నాటి అజ్ఞానంతో ఉందనే సంగతి నాకే కాదు, పాఠకులకు కూడా అర్థం కావాలి కదా? వాళ్ళకి అర్థం కాలేదు. అర్థం కాకే వాళ్ళు దీన్ని నెత్తిన పెట్టుకున్నారు..’’


ఇంత సీరియస్  విమర్శలోనూ రంగనాయకమ్మ మార్కు  హాస్యం, వ్యంగ్యం ఈ వ్యాసంలో తళుక్కున మెరుస్తుంటాయి. 

ముందుమాటా.. కేసులూ

చయిత నవల్లో  చేతబడిని సమర్థించడం గురించి  ముందుమాట రాసిన  డాక్టరు రచయిత  చిన్న విమర్శ అయినా చేయలేదనీ,

నవల్లో వైద్యం అనే కోణాన్ని సర్కస్ లో బఫూన్ని లాగా తయారుచేసినా తాను డాక్టరైవుండి కూడా కిమ్మనలేదనీ,

రచయిత శ్రద్ధా, పరిశోధనలు చేశారని  పొగడ్తలు కురిపించారనీ  ఆ ముందుమాటను కూడా రంగనాయకమ్మ ఘాటుగా  విమర్శించారు.

నవలపై వచ్చిన విమర్శపై  రచయిత  వీరేంద్రనాథ్ ఏమీ స్పందించలేదు. 

కానీ ముందుమాట రచయిత  డా.  కొమ్మూరి వేణుగోపాలరావు మాత్రం ఊరుకోలేదు. అలా అని ప్రతివిమర్శ చేయటం ద్వారా తన వైఖరిని సమర్థించుకోవటం కూడా చేయలేదు. 

ఆయన ఈ సాహిత్య వివాదాన్ని న్యాయస్థానంలో పరిష్కరించుకోవటానికి సిద్ధమయ్యారు.  ఆ విమర్శ వల్ల తన పరువుకు నష్టం జరిగిందనీ,  విమర్శకురాలు తనకు బేషరతుగా క్షమాపణ చెప్పాలనీ లాయరు నోటీసు పంపారు.

ఆయనకు పరువు నష్టం కలిగివుంటే  ఆ పని జరిగింది తన వల్ల కాదనీ, ఆయన ప్రవర్తన వల్లే ఆయనకు పరువునష్టం కలిగిందనీ-

తాను ఆయనకు క్షమాపణ చెప్పుకోవటం కాదు- ఆయనే తెలుగు పాఠకలోకానికి క్షమాపణ చెప్పుకోవాలనీ-
లాయర్ నోటీసుకు రంగనాయకమ్మ బదులిచ్చారు. 

దీంతో...  తర్వాత సివిల్,  క్రిమినల్ కేసులూ ... విచారణలూ... చివరకు  జరిమానా!

ఈ విమర్శతో పాటు ఆ వివరాలన్నీ  పుస్తకంగా వచ్చాయి. (పరువునష్టంగా కోర్టులు భావించిన పదాలూ, వాక్యాలూ  తొలగించి).


ఈ విమర్శా వ్యాసానికి ఇంట్రో ను  ఎడిటర్  ఏబీకే ప్రసాద్ రాసివుంటారు.

‘సాంఘిక విమర్శ దావాలకు అతీతం’  అనే చక్కటి  వ్యాసాన్ని ఆయన ఈ వివాద సందర్భంలో రాశారు. విమర్శ చివరిభాగంతో పాటు దీన్నీ ప్రచురించారు.

అంతే కాదు-

‘న్యాయమూర్తి  సూచన శిరోధార్యం’  అంటూ 1985లో  ఓ సంపాదకీయాన్ని ఆయన ఉదయం దినపత్రికలో  రాశారు.

అందులో ‘తులసిదళం’ నవలను చీదరించుకున్న న్యాయమూర్తి అబిప్రాయాలను కోట్ చేయడంతో పాటు...  కొమ్మూరి వేణుగోపాలరావు ముందుమాట పాఠకులకు ఖండనార్హం ఎందుకయిందో తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పుకొచ్చారు.

ఏబీకే ప్రసాద్  రెండు వ్యాసాలనూ ఈ విమర్శ ఉన్న పుస్తకంలో చదవొచ్చు.

* * *

ఇందాక  ఈ విమర్శపై వీరేంద్రనాథ్ స్పందించలేదన్నాను కదా? అది కరెక్టు కాదనుకుంటాను.

తులసిదళం నవల వచ్చాక దానికి పేరడీగా ఆంధ్రప్రభ వారపత్రికలో  ‘వేపమండలు’ అనే సీరియల్ వచ్చింది.  శ్రీమతి  సంగీతారెడ్డి అనే పేరుతో..ఈ నవల తులసిదళాన్నీ,  ఆ రచయితనూ  సమర్థించటానికి ప్రయత్నించింది.

 ‘ఎలక్ట్రానిక్స్ నుంచి హిప్నాటిజం వరకూ- రకరకాల పాత్రలూ, వాటి వ్యక్తిత్వమూ- ఘర్షణా- అన్నిటికీ మించి  మంచి క్లైమాక్సూ..’’  అంటూ ఆ నవలకు  కితాబులిచ్చింది.

‘సరదాగా చదివి పక్కనపెట్టెయ్యకుండా  ఒక భూత అద్దం తీసుకుని రామాయణంలా దీన్ని పఠించి, తప్పులెన్ని, దీనిమీద వ్యాసాలు వ్రాసి గ్లామరు పెంచుకునే అవసరం లేదని కూడా అనుకుంటున్నాను’’ అని ఓ పాత్ర తో చెప్పించింది.  అంటే   ఈ నవలపై విమర్శ   ‘గ్లామర్ పెంచుకోవటం కోసం’!

కథలో  పాత్రల మాటల మాటున  స్వీట్ హోమ్,  బలి (ఉరి) పీఠం అంటూ రంగనాయకమ్మ రచనల పేర్ల చెప్పి రచయిత్రిని ఎకసెక్కం చేయటానికి ముసుగులో  ప్రయత్నించింది ఈ  పేరడీ నవల.

విమర్శ ను రుజు మార్గంలో ఎదుర్కోలేని,  నేరుగా ప్రతి విమర్శ చేయలేని  అశక్తత తప్ప మరేమీ కాదిది.

ఇంతకీ  ఈ వేపమండలు రాసినవారు వీరేంద్రనాథ్ అభిమాన రచయిత  అయివుంటారని  అనుకున్నాను. కానీ దీన్ని స్వయంగా వీరేంద్రనాథే రాసినట్టు  2014లో  సాక్షి పత్రికకు ఇచ్చిన ఈ ఇంటర్ వ్యూ సాక్ష్యమిస్తోంది..

లింకు  చూడండి- 


 ‘తులసిదళం’కి పేరడీగానే ‘వెన్నెలకంటి వసంతసేన’ లాంటి పేరుతో ‘వేపమండలు’ రాశా. కామెడీ రాయలేనన్న వారికీ, ఆ గొడవకూ నా జవాబు ఆ రచన.’’  (పెట్టుడు పేరు మర్చిపోయినట్టన్నమాట...)

‘‘ఆ నవలల వల్ల కొందరిలో మూఢనమ్మకాలు పెరగడం, కొంత నష్టం జరగడం నిజమే.’’  

నిజమా?  నవల రాసిన ఇన్నేళ్ళ తర్వాత అయినా రచయిత  ఈ మాత్రం ఒప్పకున్నందుకు సంతోషించాలేమో.

 * * *
అంతటి వివాదానికి కారణమైన ముందుమాటను 1992లో తులసిదళం నుంచి తీసివేశారు. మళ్ళీ  ఎప్పట్నుంచి  జోడించటం మొదలుపెట్టారో కానీ 2015 ఎడిషన్లో  మాత్రం ఈ ముందుమాట కనపడుతోంది.

ఈ విమర్శా వ్యాసం ప్రభావం నా మీద చాలా ఉంది. .. ఇన్ని సంవత్సరాలుగా.

డా.  కేశవరెడ్డి నవల  ‘మునెమ్మ’ గురించి చాలా కాలం క్రితం  బ్లాగులో రాశాను. ఆ రాతలో  ఈ వ్యాస ప్రభావం స్పష్టంగా తెలుస్తుంది.

 వ్యాస రచనా విధానం  ..  చెప్పదల్చుకున్న  అంశాలను పకడ్బందీగా, చక్కగా   అమర్చిన  క్రమం నాకు భలే ఆశ్చర్యంగా ఉంటుంది.

వ్యాస  నిర్మాణానికి    బ్రీఫ్ నోట్సు/ ప్రణాళిక ఏమైనా ఉందేమో అనిపించి  రంగనాయకమ్మ గారిని  అడిగాను,  కొద్ది రోజుల క్రితం. (16.2.2017 తేదీన).  దానికి ఆమె ఇలా చెప్పారు.

‘‘ మాట్లాడేటప్పుడు తెలియకుండానే ఒక తర్కంతో మాట్లాడతాం. ఇదీ అంతే. ఆ నవల చదువుతుంటే దానిలో వైరుధ్యాలూ, తప్పులూ తెలిసిపోయాయి. వాటిని తర్కంతో ఖండించే పనే చేసింది. ఏం చెప్పాలి, ఎలా మొదలుపెట్టాలి, ఏది ముందు , ఏది వెనక అనేది ఆలోచించటం తప్ప ప్రత్యేకంగా నోట్స్ రాసుకోవటమో, ప్లాన్  వేసుకోవటమో ఏమీ లేదు. ’  

రంగనాయకమ్మ వ్యాసం వచ్చిన కొద్ది నెలలకే  1982 ఫిబ్రవరి లో  బాలగోపాల్ ‘కుహనా వైజ్ఞానిక నవలలు’ అనే వ్యాసం రాశారు, ‘అరుణతార’ పత్రికలో!

ఆయన మాటల్లో-

‘మంత్ర తంత్రాలను గురించి,  చేతబడి గురించి మనకున్న జ్ఞానం అసంపూర్ణం కాదు, సంపూర్ణమే. ’’

 ‘‘మంత్ర విద్యను సైన్సుతో సమంగా నిలబెట్టడం శాస్త్రీయం కాదు సరికదా,  సైన్సును క్షుద్రపరచడం అవుతుంది’’

ఆసక్తి ఉన్నవారు ఆ వ్యాసం పూర్తి పాఠాన్ని ఇక్కడ చూడవచ్చు.

ఈ రెండు నవలలు సరే...  మరి వీరేంద్రనాథ్ రాసిన మిగతా నవలల సంగతేమిటి?   

‘యుగాంతం’,  ‘వెన్నెల్లో ఆడపిల్ల’, ‘ప్రార్థన’  లాంటివి   నాకు ఇప్పటికీ  నచ్చుతాయి!