సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

4, డిసెంబర్ 2014, గురువారం

‘మహాభారతం’పై రంగనాయకమ్మ పుస్తకం!


‘కల్పవృక్షం’ అని సూతుడు పొగిడిన కథ...  మహా భారతం!

ఇది  లక్షకు పైగా సంస్కృత శ్లోకాల గ్రంథం.  క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దం నాటి రచన.

"ఇందులో ఏది ఉందో అదే ఎక్కడైనా ఉంది. ఇందులో లేనిది మరెక్కడా లేదు" (యది హాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్ క్వచిత్)  అనీ,  ‘‘పంచమ వేద’’మనీ ప్రశస్తి పొందింది.
ధర్మతత్త్వజ్ఞులు ధర్మశాస్త్రమనీ,  
అధ్యాత్మవిదులు వేదాంతమనీ,  
నీతి విచక్షణులు నీతి శాస్త్రమనీ, 
కవులు మహాకావ్యమనీ; 
లాక్షణికులు సర్వ లక్షణ సంగ్రహమనీ, 
ఐతిహాసికులు ఇతిహాసమనీ, 
పౌరాణికులు బహుపురాణ సముచ్చయమనీ ...  

ప్రశంసలు కురిపిస్తారనే  పేరు ఈ మహాభారతానికి!

ద్రౌపదీ పాండవుల  మహాప్రస్థాన ఘట్టాన్ని తెలిపే ఈ చిత్రం 19వ శతాబ్ది నాటి  Barddhaman edition of Mahabharata లోనిది.
 
ఈ పొగడ్తల్లో నిజానిజాలెంత?

వేద వ్యాస ముని రాసిన-  ఈ గ్రంథంపై రచయిత్రి  రంగనాయకమ్మ రాసిన క్లుప్త పరిచయం  ‘ఇదండీ మహా భారతం’ పేరుతో  పుస్తకంగా తాజాగా  విడుదలైంది.

వ్యాస మహాభారతానికి ఇంగ్లిష్ వచనానువాదం, కవిత్రయ భారతం , పురిపండా అప్పలస్వామి వ్యావహారికాంధ్ర మహాభారతం పుస్తకాల ఆధారంగా ఈ రచన సాగింది.

 ‘రామాయణ విషవృక్షం’ రాసిన దాదాపు నలబై ఏళ్ళ తర్వాత ‘మహా భారతం’ గురించి ఇప్పుడు  రాశారామె. 

‘‘భారతం కథని యథాతథంగా ఉన్నదాన్ని ఉన్నట్టే ఇచ్చాను. అసలు కథ ఎలా ఉంటుందో తెలియాలి పాఠకులకు. నా వ్యాఖ్యానాలు నేను వేరే చేసుకున్నాను. అంతేగానీ, అసలు కథలో నేను వేలు పెట్టలేదు.’’  అని ఈ పుస్తకం గురించి ఆమె చెప్పారు.

భారతం-  చరిత్ర అయినా కాకపోయినా ఆ రచనలో ఆ కాలంనాటి  సమాజ పరిస్థితులు ప్రతిబింబించకుండా ఉండవు.

అవెలా ఉన్నాయి?

భారతాన్ని ఇష్టపడి చదివే పాఠకులూ,  ఈ గ్రంథాన్ని  విమర్శనాత్మకంగా చదివే వారూ  కూడా  గమనించని కోణాల్లో..   మార్క్సిస్టు దృక్పథంతో  రంగనాయకమ్మ వ్యాఖ్యానం ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు!

 * * * * * 

ఈ పుస్తకంలోని కొన్ని  వాక్యాలూ, వ్యాఖ్యానాలూ...

‘‘ భారతంలో వందలాది కథలు ఉన్నా , ఏ రెండు కథలు చెప్పే అంశాలకీ తేడా లేదు; చెప్పే ధర్మాలకీ తేడా లేదు. అన్నిటి గుణమూ, అన్నిటి సారాంశమూ , ఒకటే.  చాతుర్వర్ణాలూ, రాజుల ఈశ్వరత్వమూ, పురుషులకు భోగాలూ, స్త్రీలకు త్యాగాలూ, అన్ని చోట్లా  అవే.’’

‘‘ భారతం మొత్తంలో ఉన్నదంతా,  చాతుర్వర్ణ  వ్యవస్తా, రాజుల ఆధిపత్య పాలనా, కుప్పల తెప్పల మూఢ విశ్వాసాలూ,  పురుషాధిక్యతా-  ఇవన్నీ కలిసిన దోపిడీ వర్గ భావ జాలమే.’’

‘‘ కవిత్వ వర్ణనల్లో ఎన్ని సొగసులు ఉన్నా, ఆ సొగసులు, చదివేవాళ్ళకి ఏ జ్ఞానాన్నీ ఇవ్వవు. ఆ సొగసులు, చదువరుల్ని   భ్రమల్లోకి  లాక్కుపోతాయి. ఆ సొగసుల్లో వుండే సమాజం ఎటువంటిది- అనేదే చదివేవాళ్ళు గ్రహించాలి.’’

‘‘ మనుషుల్ని పవిత్రులుగానూ- అపవిత్రులుగానూ  విభజించే ఏ రచన అయినా, స్త్రీలని సజీవంగా కాల్చి వెయ్యడాన్ని పవిత్రధర్మంగా చెప్పే ఏ గ్రంథం అయినా ,  ‘దుర్గ్రంధమే’.’’‘‘ భారతం, ప్రకృతి  సైన్సులు అభివృద్ధి చెందని క్రీస్తు వెనకటి అనేక  వందల ఏళ్ళ నాటిది. పైగా మూల మూలనా మూఢనమ్మకాలతో , శ్రమలు చేస్తూ బతికే ప్రజలను నిట్ట నిలువునా మోసాలు చేసేది. అలాంటి పురాణ గ్రంథాలకు చేతులు జోడిస్తున్నామంటే , మనం ఆధునిక మానవులం  కాదు. క్రీస్తు కన్నా వెనకటి కాలంలో ఉన్నాం.’’

‘‘ తప్పులో  ఒప్పులో, ఆ నాటి రచన అది.  దాన్ని చదవాలి. చర్చించి చూడాలి. మాట్లాడుకోవాలి. లైబ్రరీలో  పెట్టి ఉంచాలి. అంతే. అది అంతకన్నా నిత్య  పారాయణానికి పనికి రాదు.’’

‘‘ ఏ దేశం అయినా ఏ యే తప్పుడు సంస్కృతుల్లో పీకల దాకా కూరుకుని వుందో  ఆ సంగతి ఆ దేశంలో  జనాలకు నిజంగా తెలిస్తే , వాళ్ళు అదే రకం జీవితాల్లో వుండిపోవాలని కోరుకోరు. అజ్ఞానం వల్ల అలా వుండిపోతే ఆ జీవితాల్లో ఆనందంగా వుండలేరు!’’* * * * * 

488
పేజీలతో  రాయల్ సైజులో, హార్డు బౌండుతో. తయారైన ఈ పుస్తకం వాస్తవ ధర కనీసం  రూ.240 ఉండాలి.  కానీ పాఠకులందరికీ అందుబాటులో ఉండటం కోసం  దీని ధరను కేవలం  రూ.100గా  నిర్ణయించారు!

 హైదరాబాద్ లో నవోదయ బుక్ హౌస్ లో ఈ పుస్తకం దొరుకుతుంది. విజయవాడలో  అరుణా పబ్లిషింగ్ హౌస్ ( ఏలూరు రోడ్డు) దగ్గర ప్రతులు లభిస్తాయి. ఫోన్ నంబర్: 0866- 2431181.

 తాజా చేర్పు :  ఈ-బుక్ ఇక్కడ దొరుకుతుంది-   http://kinige.com/book/Idandi%20Maha%20Bharatam

57 వ్యాఖ్యలు:

SIVARAMAPRASAD KAPPAGANTU చెప్పారు...

వేణూ గారూ,

ఈ మధ్యనే అనుకున్నాను ఈవిడ రామయాణాన్ని విమర్శించారు కాని భారతం ఇప్పటిదాకా ముట్టుకోలేదని. ఆ పని కూడా అయిపోయిందన్న మాట.

sarma చెప్పారు...

మరోటొదిలేశారు అదీ సాయించేస్తే....

Marxist Hegelian చెప్పారు...

I am unable to find that book on Kinige.com

వేణు చెప్పారు...

This book may be available on kinige tonight onwards!

రమాసుందరి చెప్పారు...

తెప్పించుకోవాలి

అజ్ఞాత చెప్పారు...

Many thanks sir!. నేను నవోదయ బుక్ హౌస్‌లో ఈరోజే ఆర్డర్ ఇచ్చాను.

ఆవిడ మరిన్ని పుస్తకాలు రసి, మనలో కొంతమందినైనా ఆలోచించగలవారిలా మార్చాలని కోరుకుంటున్నాను.

కమనీయం చెప్పారు...రంగనాయకమ్మ ఇంకొక లాగ ఎలా రాస్తారు?కాని ఘోరంగా విఫలమైన కమ్యూనిజం గురించి,సోవియెట్యూనియన్ గురించి కూడారాస్తే బాగుంటుంది.కాని ఆవిడ వాటిగురించి ఒక్క మాట మాట్లాడదు.

Edge చెప్పారు...

శివరామ ప్రసాద్ గారు, శర్మ గారు,

మీ వ్యాఖ్యలలోని వ్యంగ్యాన్ని గమనిస్తే, రామాయణ,భారత, భాగవతాది పురాణ/మత గ్రంధాలు విమర్శకతీతం అనే ధోరణి అగుపిస్తోంది. అదే నిజమైతే, వేలాది సంవత్సరాలుగా ప్రచారంలో ఉన్న ఈ సాంప్రదాయ సాహిత్యం హేతుబద్ధ విమర్శకి నిలువలేదనే భయమే అందుకు కారణమా?

వేణు చెప్పారు...

కమనీయం గారూ! మీరు పొరబడ్డారు. రష్యా, చైనాల్లో కమ్యూనిజం ప్రయోగం ఎందుకు విఫలమైందీ.. ఆ కారణాలను విశ్లేషిస్తూ రంగనాయకమ్మ వివరంగానే రాశారు. ఉదాహరణకు- ‘పాఠకుల ప్రశ్నలూ రంగనాయకమ్మ జవాబులూ’ పుస్తకం. ఈ విషయంలో ఆమె ఏమీ మాట్లాడలేదనే మీ అభియోగంలో ఏమాత్రం నిజం లేదు!

THIRUPALU P చెప్పారు...

రమణీయం గారు కంయునిష్టు ఎలా ఉండ క్కుడదూ? అనే పుస్తకం చూడండండి మావొ లో మిగిలివున్న ఏ కొద్ది పాత భావజాలాన్నైన ఎండగట్టారు?

SIVARAMAPRASAD KAPPAGANTU చెప్పారు...

@EDGE

ఇంతటి హేతువాద దురంధరులు, మీకు మా వ్యంగ్యం చూస్తె భయం దేనికో! ఇంటర్నెట్లో ప్రొఫైల్ వ్రాసుకోవటానికి భయపడే అనామకులు కూడా "భయం గురించి మాట్లాడటమే. మీ దృష్టిలో ఈవిడగారు ఏమి వ్రాసినా సరే కరతాళ ధ్వనులతో సకల జనులూ ఆహ్వానించాలా. ఏమో 1960 లలో రష్యా అయ్యి ఉంటే ఈ పుస్తకానికి సకల ప్రజల కరతాళ భజన కార్యక్రమం పెట్టి లైవ్ టెలికాస్ట్ చేసి ఉండేవారే మరి. భారత దేశం కూడా రష్యా చేసి పారేసి ఉంటే మా వ్యంగ్యానికి అవకాశం ఉండేది కాదు కదా! పాపం ఆ పని జరగక ఇలాంటి పుస్తకాలు వ్రాసుకుంటూ హైరానా పడుతున్నట్టున్నారు పాపం.

ఎంతటి గొప్ప కావ్యానికైనా విమర్శ గీటురాయి అందుకు పురాణాలేమీ మినహాయింపు కాదు. కాకపోతే,మీరు కనిపెట్టిన మా వ్యంగ్యానికి కారణం, పాపం ఇంతటి మీ ఘోప్ప విమర్శకురాలికీ మహాభారతాన్ని విమర్శించటానికి నాలుగు దశాబ్దాలు పట్టిందే అని. ఆ విమర్శ కూడా ఎలా ఉన్నదో చదివి చూడాలి. అప్పుడు ఆ పుస్తకాన్ని విమర్శిస్తూ వచ్చే రచనలను మీలాంటి వాళ్ళు చూసి భయపడకూడదు మరి. ప్రస్తుతానికి తెన్నేటి హేమలతగారు లేరు, ఈ విమర్శను విమర్శించటానికి. వీలయితే రామాయణ విషవృక్ష ఖండన కూడా ఇలాగే వంద రూపాయలు పెట్టి ప్రచురించి "ప్రచారం" చేసి పెట్ట కూడదూ విమర్శ అంటే ఎంతమాత్రం భయం లేని నిర్భయులు.

Marxist Hegelian చెప్పారు...

That book is still not available on Kinige.

వేణు చెప్పారు...

గమనిక: వ్యక్తిగత దూషణలూ, రచయిత్రి గౌరవానికి భంగంగా శంకలను వ్యక్తం చేసే నిందాత్మక వ్యాఖ్యలను ప్రచురించను. పుస్తకం చదివి, అందులోని విషయాల గురించి మాట్లాడితే సరే!

వేణు చెప్పారు...

శివరామప్రసాద్ గారూ,
>> పాపం ఆ పని జరగక ఇలాంటి పుస్తకాలు వ్రాసుకుంటూ హైరానా పడుతున్నట్టున్నారు పాపం >> రచయిత్రి రాసిన విషయాలపై నిర్దిష్టంగా విమర్శ రాయవచ్చు. అంతేగానీ ఇలాంటి వ్యాఖ్యల మూలంగా రచయిత్రిపై అక్కసు బయటపెట్టుకోవడం తప్ప సాధించేదేమీ ఉండదు.

భారతాన్ని విమర్శించటానికి ఒక రచయితకు అన్ని దశాబ్దాలు పట్టిందే అని మీరెలా అడగ్గలరు? అది రచయిత వీలు, ఆసక్తి ని బట్టి ఉంటుంది. రచయిత్రి రాసింది ఎలా ఉందో చదివి, దాని మీద విమర్శించటంలో అర్థం ఉంటుంది.

విషవృక్ష ఖండన విషయం- ఆ పుస్తకం దశాబ్దాలుగా ఎక్కడా దొరకటం లేదు. దాన్ని అంతగా నచ్చినవారు తక్కువ రేటుకే అందుబాటులోకి తెచ్చి ‘ప్రచారం’ చేయవచ్చు. ఆ పని చేయాల్సిందీ, చేయగలిగిందీ... విమర్శ అంటే భయం లేనివారు కాదు, ఆ పుస్తకాన్ని ఇష్టపడేవారు!

SIVARAMAPRASAD KAPPAGANTU చెప్పారు...


మీ వ్యాసంలో మీరు వ్రాసిన వ్యాక్యమే( ‘రామాయణ విషవృక్షం’ రాసిన దాదాపు నలబై ఏళ్ళ తర్వాత ‘మహా భారతం’ గురించి ఇప్పుడు రాశారామె.) నేను వ్రాసిన వ్యాఖ్యకు మూలం. మీరు మీ పరిచయంలో అన్న "ఇప్పుడు" నా వ్యాఖ్యలో ఇన్నాళ్ళాకా అన్న వ్యంగ్యం దొర్లించాను అంతకంటే వేరే ఏమీ లేదు. ఈ మాత్రనికే అక్కసు వంటి పదాలు మీరు వాడగలరని నాకు తట్టలేదు మరి. పుస్తకం చదువుదామంటే ఇంకా దొరకటం లేదు. తప్పకుండా కొని చదువుతాను. For your information, రంగనాయకమ్మ గారి పుస్తకాలు మొత్తం ఇప్పటికే నా దగ్గర ఉన్నాయి. ఆవిడ రచనలు, ఇజాని ప్రచారం చెయ్యటానికి పూర్వం, నాకు నచ్చినవే.

విశ్వనాధ సత్యనారాయణ గారు దాటిపొయ్యే దాకా ఆగి (మీరు చెప్పినట్టుగా వీలు, ఆసక్తిని బట్టి) ఆ తరువాత ఆయన వ్రాసిన రామాయణ కల్పవృక్షం పేరుకు వ్యతిరేకంగా పేరు పెట్టి వ్రాయటాన్ని ఏమంటారు వేణూ గారూ. విశ్వనాథ వారి గ్రంధం గురించి కాని వారి పేరును కాని విష వృక్షంలో ప్రస్తావించకపోయినా చూడంగానే ఫలానా గ్రంధానికి ఈ పుస్తకం జవాబా అనిపించే భ్రాంతి కలచేయ్యలేదంటారా!

వ్యక్తిగత విమర్శలకు నేను కూడా వ్యతిరేకినే గమనించగలరు.

మీరు చెప్పిన విషయం బాగానే ఉన్నది హిందూ గ్రందాల మీద విమర్శ పేరుతొ ప్రచార పర్వంగా జరుగుతున్నది చూస్తుంటే, రామాయణ విషవృక్ష ఖండన వంటి విమర్శకు విమర్శనా గ్రంధాలను కూడా "ప్రచార ప్రచురణలు" చెప్పట్టాల్సిన అవసరం ఉన్నట్టున్నది.

Kondala Rao Palla చెప్పారు...

రాముడి నైనా - రంగనాయకమ్మ నైనా గుడ్డిగా భక్తి ప్రపత్తులతో సాగిలపడి నమ్మాల్సిన అవసరం లేదు. అలా చేయమని ఈ పుస్తకం చెప్పనప్పుడు ఓ రచయిత అభిప్రాయాలను గౌరవించకపోయినా హేళన చేయాల్సిన అవసరం లేదు. ఏ భావ ప్రకటననూ అక్కసుగానో, బలవంతంగానో అడ్డుకోవాలసిన అవసరం లేదు.

ప్రతి రచనలో, భావజాలం లో కూడా మంచి - చెడులు ఉంటాయి. అవి ఎప్పటికప్పుడు సాపేక్షమే. ప్రతీ రచనలో ఆయా కాలాల సంస్కృతి ప్రజల జీవన విధానం ప్రభావం ఉంటుంది. తరువాతి కాలాల్లో మేలైన మెరుగైన పరిస్తితులూ సంస్కృతీ రావడమేగాక అది డెఫినెట్ గా పురోగమనంలోనే ఉంటుంది.

చాతుఱ్వర్న వ్యవస్థా - సతీ సహగమనం వంటి దుర్మార్గాలను నేడు చాలామంది తప్పేనని ధైర్యంగా అంగీకరించినా అవే మార్గదర్శకాలుగా మంచి గా వర్ధిల్లలేదా? ఆ దురాచారాలకు ఎందరో బలి కాలేదా? భూమి గుండ్రంగా లేదని చెపితే బైబిలునే ధిక్కరిస్తావా అంటూ శాస్త్రవేత్తలను చంపేయలేదా? మరి భూమి గుండ్రంగా లేకపోయిందా?

ఏ ఇజమూ నిజాన్ని దాచలేదు. నిజానికి దగ్గరగా లేదా నిజాన్ని మాత్రమే చెప్పే ఇజాలే వర్ధిల్లుతాయి. వర్ధిల్లాలి. ప్రతి ఇజమూ పాతదానిలోని మంచిని తీసుకుని మెరుగైన ఇజంగా మారుతుంది. ఇది నిజం ను చేరుకునేవరకూ కొనసాగుతుంది.

రంగనాయకమ్మ హిందూ పవిత్ర గ్రంధాలను మాత్రమే విమర్శిస్తోందన్నమాట నిజమే. కానీ ఆమె ఇతర మతగ్రంధాలను పొగడడం వాటితో పోల్చడం చేసి వీటిని కించపరస్తే డెఫినెట్ గా ఆమెను తప్పు పట్టాల్సిందే. కానీ ఆమె రచనలు అజ్ఞానాన్ని జ్ఞానంతో పోల్చి చెప్పే ప్రయత్నం చేస్తున్నదనడంలో సందేహం లేదు.

ఇలా మతపరమైన పవిత్ర గ్రంధాలను విమర్శించడం సాహసంతో కూడుకున్న పనే తప్ప అసభ్యమో, దురహంకారమో అవుతుందా? ఎంత మాత్రమూ కాదు. రంగనాయకమ్మ చెప్పనంత మాత్రాన ప్రచారం చేయనంత మాత్రాన హిందూ మత గ్రంధాలలో మంచి విషయాలు ఆచరణలో కొనసాగకుండా పోవు. మార్క్సిష్టులు అయినా, కానివారైనా ఏ గ్రంధంలోనిదైనా మంచిని గ్రహించి చెడుని వదిలేయాలి.

రామాయణం - భారతం - భాగవతం మూడూ భారతీయులపై బాగా ప్రభావం చూపేవి. వీటిలోని మంచిని తీసుకుని చెడుని నాశనం చేయాలి. ఆ దిశగా ఈ పుస్తకం ఏమైనా ఉపయోగపడుతుందేమో కినిగెలొ కొని చదువుతాను.

నేనీ వ్యాఖ్యను ఏ ఒక్కరినో ఉద్దేశించి వ్రాయలేదు. ఇక్కడ చర్చ చూశాక నాకు వ్రాయాలనిపించింది మాత్రమే వ్రాశాను.

రవి చెప్పారు...

రంగనాయకమ్మ గారి మీద ఉన్న సదభిప్రాయం ఈ దెబ్బతో నశించే అవకాశం ఉంది.

రామాయణం అన్నది రాముని ఆయణం. స్పష్టంగా రాముణ్ణి ఒక నాయకుడిగా చేసిన ప్రాచీన కావ్యం. సాధారణంగా రామాయణ కథ చదివిన వారికి కూడా వాలివధ, శంబూకవధ, అగ్ని ప్రవేశం తదితర ఘట్టాలు చదివి అన్యాయమని అనిపిస్తుంది. పైగా రామాయణంలో రాముడు ఇప్పుడు దైవం. ఆయన దైవం కాబట్టి మన(సు)కు నచ్చకపోయినా ప్రజలు సర్దిచెప్పుకుని ఊరికే ఉంటున్నారు కాబట్టి ఆ నేపథ్యంలో రంగనాయకమ్మ గారి విమర్శ (అదేదైనా) లో కాస్త నిజాయితీ ఉందని ఏ కొందరైనా భావించగలరు.

మహాభారతం అలాకాదే!పాండవులు చేసిందంతా ధర్మం కాదు. ఆ ధర్మాలు (ఐదుమంది ఒకర్ని వివాహం చేసుకోవడం, యుద్ధంలో అన్యాయంగా శత్రువులను చంపడం, ధర్మరాజు పొద్దస్తమానం జూదమాడ్డం, వగైరా వగైరాలు నీతులుగా ధర్మాలుగా ఎస్టాబ్లిష్ అవలేదు, ఆ ధర్మాలను ప్రజలు నాటి నుండి నేటి వరకూ గౌరవించనే లేదు. పాటించనూ లేదు.

ఇంకా మహాభారతంలో ధర్మాలగురించి అదే కావ్యంలో ఇతర సందర్భాల్లో చర్చలు వస్తాయి.

మహాభారతాన్ని rationalize చేసిన పర్వ అనే చక్కని రచన మనకుంది. మన ప్రస్తుత సమాజంలోనే ఎన్నో అవకతవకలు ఉన్నాయి. ఇప్పుడు ఎదురుగా ఉన్న సమస్యలను ముందెట్టుకుని ఎప్పుడో జరిగిపోయిన మహాభారతం మీద ఈమె విమర్శ, అదీ ఆ మహాభారత ధర్మాలను యథాతథంగా ప్రజలు పాటించని నేపథ్యంలో రచనగా చేయటం - కేవలం పబ్లిసిటీ కోసమా అని అనుమానం వస్తుంది.

SIVARAMAPRASAD KAPPAGANTU చెప్పారు...

కొండలరావు గారూ,

"........ఓ రచయిత అభిప్రాయాలను గౌరవించకపోయినా హేళన చేయాల్సిన అవసరం లేదు. ఏ భావ ప్రకటననూ అక్కసుగానో, బలవంతంగానో అడ్డుకోవాలసిన అవసరం లేదు. ....."


మీ అభిప్రాయం చాలా బాగున్నది ఆచరణీయమూ కూడానూ. కానీ హేళన లేకుండానే విషవృక్ష రచన జరిగినది అంటారా!

Kondala Rao Palla చెప్పారు...

ప్రసాద్ గారు, నేనన్న విమర్శ రంగనాయకమ్మ గారికి వర్తించదంటారా?

SIVARAMAPRASAD KAPPAGANTU చెప్పారు...

Mondale RAO Garu,

విపులీకరించినందుకు ధన్యవాదాలు.

Edge చెప్పారు...


శివరామ ప్రసాద్ గారు, మీకు నా ప్రతిస్పందన ఈ క్రింద:

“ఇంతటి హేతువాద దురంధరులు” - ad hominem

“మీకు మా వ్యంగ్యం చూస్తె భయం దేనికో” - పొరపాటు పడ్డారు, మీ వ్యంగ్యానికి నేను భయపడలేదు

“ఇంటర్నెట్లో ప్రొఫైల్ వ్రాసుకోవటానికి భయపడే అనామకులు కూడా "భయం గురించి మాట్లాడటమే” - ad hominem మరియు అసందర్భ ప్రలాపం

“ఏమో 1960 లలో రష్యా అయ్యి ఉంటే ఈ పుస్తకానికి సకల ప్రజల కరతాళ భజన కార్యక్రమం పెట్టి లైవ్ టెలికాస్ట్ చేసి ఉండేవారే మరి. భారత దేశం కూడా రష్యా చేసి పారేసి ఉంటే మా వ్యంగ్యానికి అవకాశం ఉండేది కాదు కదా! పాపం ఆ పని జరగక ఇలాంటి పుస్తకాలు వ్రాసుకుంటూ హైరానా పడుతున్నట్టున్నారు పాపం” - అప్రస్తుత ప్రసంగం

“ఎంతటి గొప్ప కావ్యానికైనా విమర్శ గీటురాయి అందుకు పురాణాలేమీ మినహాయింపు కాదు. కాకపోతే,మీరు కనిపెట్టిన మా వ్యంగ్యానికి కారణం, పాపం ఇంతటి మీ ఘోప్ప విమర్శకురాలికీ మహాభారతాన్ని విమర్శించటానికి నాలుగు దశాబ్దాలు పట్టిందే అని” - వేణు గారి ప్రతిస్పందనే నాది

” ఆ విమర్శ కూడా ఎలా ఉన్నదో చదివి చూడాలి”- హర్షించదగ్గ నిర్ణయం

“అప్పుడు ఆ పుస్తకాన్ని విమర్శిస్తూ వచ్చే రచనలను మీలాంటి వాళ్ళు చూసి భయపడకూడదు మరి” - విమర్శకి ఆహ్వానం

“ప్రస్తుతానికి తెన్నేటి హేమలతగారు లేరు, ఈ విమర్శను విమర్శించటానికి”- అర్ధం కాలేదు, తెన్నేటి హేమలతగారు తక్క రంగనాయకమ్మ గారి రచనలను విమర్శించ గల సమర్ధులు వేరెవ్వరు లేరనా మీ ఉద్దేశ్యం?

“ఈ విమర్శను విమర్శించటానికి. వీలయితే రామాయణ విషవృక్ష ఖండన కూడా ఇలాగే వంద రూపాయలు పెట్టి ప్రచురించి "ప్రచారం" చేసి పెట్ట కూడదూ విమర్శ అంటే ఎంతమాత్రం భయం లేని నిర్భయులు”- వృధా ప్రయాస, ప్రస్తుత చర్చకు ఏ మాత్రం విలువ జోడించదు

వేణు చెప్పారు...

శివరామప్రసాద్ గారూ !
‘వ్యక్తిగత విమర్శలకు నేను కూడా వ్యతిరేకినే’- అంటున్నారు మీరు. సంతోషం.
అయితే నేను ‘అక్కసు’ అని రాసింది ‘ఇన్నాళ్ళకా ’ అనే మాట ద్వారా మీరు వ్యంగ్యం దొర్లించినందుకు కాదు. అలాంటి అభిప్రాయం కలిగించిన మీ వాక్యాన్ని నా వ్యాఖ్యలోనే కోట్ చేశాను. ఆ వాక్యం వ్యక్తిగత విమర్శ కిందకు వస్తుందో రాదో మీరే పరిశీలించుకోండి.

>> విశ్వనాధ సత్యనారాయణ గారు దాటిపొయ్యే దాకా ఆగి (మీరు చెప్పినట్టుగా వీలు, ఆసక్తిని బట్టి) ఆ తరువాత ఆయన వ్రాసిన రామాయణ కల్పవృక్షం పేరుకు వ్యతిరేకంగా పేరు పెట్టి వ్రాయటాన్ని ఏమంటారు వేణూ గారూ>>

'విషవృక్షం'మొదటి భాగాన్ని రంగనాయకమ్మ గారు 1974లో, 2వ భాగాన్ని 1975లో, 3వ భాగాన్ని 1976లో రాశారు. విశ్వనాథ సత్యనారాయణ గారు చనిపోయిందేమో... 1976 అక్టోబరు 18న. పైగా విషవృక్ష రచన గురించి విశ్వనాథ గారి వ్యాఖ్య... దానికి రంగనాయకమ్మ గారి సమాధానం కూడా విషవృక్షంలోనే ప్రచురితమై ఉన్నాయి, ఇన్నేళ్ళ నుంచీ.

ఇప్పుడు చెప్పండి- ‘ విశ్వనాథ సత్యనారాయణ గారు దాటిపొయ్యే దాకా ఆగి ...’ - అనే మీ ఆరోపణ ఎంత సత్య దూరమో!

రామాయణ విషవృక్షం- పేరును బట్టి రామాయణ కల్ఫవృక్షానికి జవాబు అని భ్రాంతి కలగజేస్తోందా? కానీ విషవృక్షం పుస్తకం కొద్ది పేజీలు చూస్తే ఆ భ్రాంతి పటాపంచలైపోతుంది కదా? ఇంక పేచీ ఏముంది? పుస్తకం చదవకుండా దాన్ని గురించి అనవసరంగా అపోహలు పడేవారి ప్రస్తావన వల్ల ఏం ఉపయోగం చెప్పండి.

వేణు చెప్పారు...

రవి గారూ,
రామాయణ విషవృక్షానికీ ఈ ‘ఇదండీ మహా భారతం’ పుస్తకానికీ ప్రధానమైన తేడా ఉంది. ఈ పుస్తకం భారతానికి క్లుప్త పరిచయం. వ్యాఖ్యానాలు ఉన్నా అవి కథలో భాగంగా ఉండవు.

మీరు గానీ ఎవరు గానీ ఈ పుస్తకం చదివి ఒక అభిప్రాయానికి రావటంలో న్యాయం ఉంటుంది. ఈలోపు ఎలాంటి నిర్థారణలకైనా రావటం సరి కాదు కదా?

‘ఒక వ్యక్తి పబ్లిసిటీ కోసం ఏదైనా చేశారా?’ అనే సందేహం రావాలంటే అంతకుముందు ఆ వ్యక్తికి ప్రచార కండూతి ఉందని స్పష్టం కావాలి. అప్పుడు మాత్రమే అలాంటి అనుమానాలు వ్యక్తం చేయటంలో సబబు ఉంటుంది.

Edge చెప్పారు...

“”'విషవృక్షం'మొదటి భాగాన్ని రంగనాయకమ్మ గారు 1974లో, 2వ భాగాన్ని 1975లో, 3వ భాగాన్ని 1976లో రాశారు. విశ్వనాథ సత్యనారాయణ గారు చనిపోయిందేమో... 1976 అక్టోబరు 18న. పైగా విషవృక్ష రచన గురించి విశ్వనాథ గారి వ్యాఖ్య... దానికి రంగనాయకమ్మ గారి సమాధానం కూడా విషవృక్షంలోనే ప్రచురితమై ఉన్నాయి, ఇన్నేళ్ళ నుంచీ.

ఇప్పుడు చెప్పండి- ‘ విశ్వనాథ సత్యనారాయణ గారు దాటిపొయ్యే దాకా ఆగి ...’ - అనే మీ ఆరోపణ ఎంత సత్య దూరమో!””

వేణు గారు, అభినందనలు. శివరామప్రసాద్ గారి భావోద్వేగ ప్రేరితమైన, వాస్తవ విరుద్ధ, నిరాధార ఆరోపణకు చక్కటి సమాధానం.

The glaring contrast between an “emotional, presumptuous and prejudiced argument” and a “measured, rational and factual argument” is obvious here.

అజ్ఞాత చెప్పారు...

అసలు విమర్శలో వ్యంగ్యం ఎందుకు కూడదు? ఒక అర్ధంపర్ధంలేని ఆదర్శాన్నో, విలువలో, విషయాన్నో ప్రచారంచెయ్యడానికి ఒక రచనపూనుకుంటే (ఆ రచన ఎవరిదైనా కావచ్చు) దాన్ని వ్యంగ్యంతో విమర్శించిన విమర్శే The Best విమర్శ అవుతుంది. రచనమీద జరిగే అన్ని విమర్శలనూ valid criticismగానే పరిగణించాలని నేను కొండలరావుగారికీ, ఇతరులకూ చెప్పదలచుకున్నాను. రామాయణమ్మీద రంగనాయకమ్మగారి విమర్శ తప్పో, నేరమోకాదు. విషవృక్షమ్మీద ఇంకొకరి విమర్శా నేరంకాదు (అందులో ఎంత వ్యంగ్యం ఒలికినాసరే). కాకుంటే విమర్శ విషయమ్మీద ఉండాలి. విమర్శలో విషయముండాలి.

ముఖ్యంగా రచనను పవిత్రమైనదానినిగా చేసేసి (తల్లిలాంటిది, తండ్రిలాంటిది లాంటి మనోభావాలను రెచ్చగొట్టే పదజాలాన్ని ఇందుకువాడుతారు), దానిచుట్టూ మనోభావాల దడికట్టేసి, విమర్శలపట్ల తీవ్ర అసహనాన్ని ప్రదర్శించే వాతావరణంలో విమర్శ అత్యవసరం.

శ్రీకాంత్ చారి చెప్పారు...

@Iconoclast

Well said.

We can accept any style of critisism as long as it is valid and it is on works rather than a personal attack.

రవి చెప్పారు...

వేణు గారు,

నేను నిర్ధారించలేదండి. అనుమానిస్తున్నాను.

మీరన్న ప్రచార కండూతి - ఇది అంత సులభంగా బయటపడే అంశం కాదండి.

మహాభారతం విషయంలో ఆ అనుమానం ఎందుకు వస్తుందంటే - భారతదేశంలో అనేకులు మహాభారతాన్ని పూజ్యంగా భావించటానికి కారణం భగవద్గీత. భగవద్గీత ప్రధానంగా ఆత్మౌన్నత్యాన్ని ప్రబోధించేదే కానీ ఏవో కొన్ని మూఢవిశ్వాసాలనూ, వివక్షతలనూ సమర్థించేది కాదు. (అఫ్ కోర్సు సరైన స్పిరిట్ తో చదివితేనేననుకోండి).ఒకరకంగా చూస్తే మహాభారత సంగ్రహార్థం భగవద్గీతలో ఉంది.

పరిచయం పేరుతో ఒక ఐతిహాసిక రచన తాలూకు సంగ్రహార్థాన్ని పట్టించుకోకుండా రంధ్రాన్వేషణ ధ్యేయంగా చూస్తే తప్పులు ప్రపంచంలో ఏ కావ్యంలోనైనా, ఏ మనిషిలోనైనా కనబడతాయి. (తప్పులు అని రంగనాయకమ్మ పుస్తకం చదవకోకుండానే ఎందుకంటున్నానంటే - ఆ పరిచయానికి మీరు రాసిన పరిచయంలోనే ఆమె కనుక్కున్న సామాజిక అసంబద్ధతలు ఉటంకింపబడినాయి కనుక)

అసలు రంగనాయకమ్మ గారు ఊహించే సమానత్వ యుటోపియా ఉన్న కాలం, ఆ నాటి రచనా ఎక్కడుంది? అలా లేనప్పుడు, ఎప్పుడో, ఏదో కాలానికి చెందిన ఐతిహాసిక శకలాన్ని గురించి రాస్తున్న విషయానికి సరైన స్కోప్, పరిధి స్పష్టంగా ఉండాలి.

ఏదేమైనా ’చదివి’ విమర్శించటం అన్న సమర్థన ఉంది లెండి. డబ్బు "కొనుక్కుని" చదివి ఆపై విమర్శిస్తేనేం, ఇంకోటైతేనేం, అమ్ముకున్న వాళ్ళకు వాళ్ళ డబ్బు వాళ్ళ డబ్బు కిట్టేసింది. చదివి నిజాయితీలేమిని గుర్తించిన వాడికి డబ్బులు బొక్క, అనవసర టెన్షన్. పాఠకులు ముష్టివాళ్ళే ఎప్పుడైనా, ఆరువేలు పెట్టి పుస్తకాలమ్ముకునే విశ్వనాథ విషయంలోనైనా, ఇప్పుడు రంగనాయకమ్మ విషయంలోనైనా.

వేణు చెప్పారు...

రవి గారూ,

నిజమే! పుస్తకాలను ఆర్థిక లాభాలే ముఖ్యంగా ప్రచురించే రచయితలూ, ప్రచురణకర్తలూ ఉన్నారు. ఆ పుస్తకాల వల్ల తమకు ప్రయోజనం ఉందనుకుంటే పాఠకులు చదువుతారు. లేకపోతే లేదు.

తమ భావాలు నలుగురికీ చేరాలనే ఉద్దేశంతో తక్కువ ధర పెట్టి- ప్రతి ప్రచురణకూ ఆర్థికంగా నష్టపోయేవారు కూడా ఉన్నారు. ‘డబ్బు కిట్టించుకునే’ విమర్శ ఇలాంటివారికి వర్తించదు.

తమ అభిరుచుల మేరకు ఏ పుస్తకాలు చదవాలో ఎంచుకునే స్వేచ్ఛ పాఠకులకు ఎప్పుడూ ఉంది. నిజాయితీ లేని పుస్తకాలను గుర్తించటంలో ఒకటి రెండు సార్లు పొరబడినా త్వరలోనే వాస్తవం గ్రహించి అలాంటివాటికి దూరంగా ఉంటారు. ‘పాఠకులు ముష్ఠివాళ్ళే ఎప్పుడైనా’ అన్న మీ మాటల్లోని అభిప్రాయం స్పష్టం కావటం లేదు. అలాగే పుస్తకాలు ‘అమ్ముకోవటం’లో విశ్వనాథ, రంగనాయకమ్మ గార్లను ఒకే గాట కట్టి చేసిన మీ వ్యాఖ్యను కూడా అర్థం చేసుకోలేకపోతున్నాను.

Marxist Hegelian చెప్పారు...

డబ్బులకి ఆశపడేవాళ్ళైతే వ్యక్తిత్వ వికాసం, జ్యోతిష్యం, వాస్తు, సెక్స్ లాంటి వాటి గురించి పుస్తకాలు వ్రాస్తారు కానీ నాస్తిక పుస్తకాలు అమ్మితే పది రూపాయలు లాభం కూడా రాదు. ఎనిమిదేళ్ళ క్రితం నేను నాస్తికులతో కలిసి తిరిగేవాణ్ణి. నాస్తిక పుస్తకాలు కొనేవాళ్ళు ఎంత తక్కువో నాకు తెలుసు.

వేణు చెప్పారు...

ఇప్పుడు కినిగె లో ఈ-బుక్ దొరుకుతోంది. http://kinige.com/book/Idandi%20Maha%20Bharatam

Marxist Hegelian చెప్పారు...

I purchased it just now.

Kondala Rao Palla చెప్పారు...

@ Iconoclast గారు, మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. కానీ నేను హేళన గురించి చెప్పాను. వ్యంగ్యం గురించి చెప్పలేదని గమనించగలరు.

అజ్ఞాత చెప్పారు...

@Kondala Rao Garu:
తీవ్రమైన వ్యంగ్యాన్ని హేళన అంటారనుకుంటాను. రచన తీవ్రమైన nonsense ఐనప్పుడు, మరీ దుర్మార్గపు ధర్మాలను ప్రచారంలో పెట్టడానికి ప్రయత్నించినప్పుడు, ఒక హాస్యాస్పదమైన రచన పవిత్ర గ్రంధంగా మన్నలందుకుంటున్నప్పుడు హేళన సరైనదే! -దాన్ని విషయానికి గురిపెట్టినప్పుడు.

లోపాలతో కూడిన రచన దుమ్ముపట్టిన గోనెపట్టాలాంటిదనుకుంటే, దాని మకిలి వదిలించడానికి దాన్ని ఎండలోపడేసి విమర్శతో బాదాల్సుంటుంది. ఆ విమర్శ పేముబెత్తమైతేనే మంచిది. నెమలీకలతో పనవ్వదు.

Kondala Rao Palla చెప్పారు...

@ Iconoclast గారు, మరీ దుర్మార్గపు ధర్మాలను వరకూ అయితే, అవి ఎక్కడున్నా, ఎలా చేసినా ఫర్వాలేదు కానీ, రామాయణ - భారత - భాగవతాలంతటా అన్నీ దుర్మార్గ ధర్మాలను ప్రచారంలో పెట్టడానికి యత్నించారని నేను భావించడం లేదు. ఎక్కడ మంచి ఉన్నా తీసుకోవాలి. ఓ రచన ప్రజల మన్ననలు పొందిందంటే అందులో మంచి ఉండి తీరుతుందనేది నా నమ్మకం. ఏది ఎలా దుర్మార్గమో చెప్పవచ్చు. వ్యక్తులను లేదా వారి విశ్వాసాలను టార్గెట్ చేస్తూ అతిగా విమర్శించడం లేదా కుత్సితంగా విమర్శించడం హేళన అవుతుంది. వ్యంగ్యంలో వ్యక్తులను టార్గెట్ చేయడం ఉండదు. వ్యవస్తీకృత అంశాలపై వ్యంగ్యం ఉంటుంది. ఉదాహరణకు బాల్య వివాహాలను నేడు ఎంత వ్యంగ్యంగానైనా విమర్శ చేయవచ్చు. ఫలానా వ్యక్తి ఫలానా విధంగా అనకూడదు. ఆయా కాలాలలో బాల్యవివాహాలు వర్ధిల్లాయి. ఈనాడూ దాదాపుగా ఎవరూ చేయడం లేదు. ఏ ఒక్క రచనలు చదివి మాత్రమే బాల్యవివాహాలు తగ్గు ముఖం పట్టలేదని గమనంలో ఉంచుకోవాలి. అనేక ఇతర అంశాల ప్రభావమూ ఉంటుంది. రచనల ప్రభావం పాత్ర ఎంతమేరకు? ఎలా? అనేది కూడా సాపేక్షమే తప్ప నిరపేక్షం కాదు గనుక వాటిని విమర్శించేటప్పుడు కూడా పరిస్తితులు-కాలమూ-ప్రదేశం వంటివి గమనంలో ఉంచుకోవాలి. సమాజమంతా కూడా అజ్ఞానంలో ఉన్నప్పుడు ప్రజలంతా కూడా వారి చైతన్యస్థాయి మేరకే వ్యవహరిస్తారు. ప్రజల చైతన్యం మేరకు కొన్ని భావోద్వేగాలపై విమర్శ ఎలా చేస్తే బాగుంటుందనే జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నగీతను చెరపకుండానే పెద్దగీతను గీయవచ్చు. దేవుడు లేడని ప్రచారం చేయాల్సిన అవసరం ఎప్పుడు పోతుంది? మనిషిని మనిషి సంపూర్ణంగా నమ్మగలిగేలా సైన్స్ సమాజం ఏర్పడినప్పుడు.

అజ్ఞాత చెప్పారు...

మీవ్యాఖ్యలో నాకు చాలా విషయాలు అర్ధంకాలేదు.

"రామాయణ - భారత - భాగవతాలంతటా అన్నీ దుర్మార్గ ధర్మాలను ప్రచారంలో పెట్టడానికి యత్నించారని నేను భావించడం లేదు"

నిజమే! నేననేది ఏమిటంటే ఆ ధర్మాలన్నీ ఎక్కువమందికి మంచి జరుగుతుందా లేదా అన్న ఆలోచనతో ప్రచారంలో ఉంచబడ్డవికావు. పలుకుబడీ, సంపత్తీ ఉన్న కొద్దిమంది మిగిలినవారిని అణగదొక్కి, వారిచేత సేవలు చేయించుకోవడానికి ఆ ధర్మాలను ప్రవేశపెట్టారు. కొన్ని మంచివికూడా చెప్పి ఉండవచ్చు.

"ఎక్కడ మంచి ఉన్నా తీసుకోవాలి. ఓ రచన ప్రజల మన్ననలు పొందిందంటే అందులో మంచి ఉండి తీరుతుందనేది నా నమ్మకం."

నేడుకూడా మనం ఎన్నో అధర్మాలు ధర్మంగా కనబడటం చూస్తూ దీన్ని మీరు ఎలా అనగలిగారో నాకు ఎంతమాత్రమూ అర్ధం కావడంలేదు. లంచగొండితనం, వరకట్నం, భ్రూణహత్యలు ఈనాటికీ మెజరిటీ ప్రజలు తమ విషయంలో సమర్ధించుకుంటూనే ఉన్నారు. అవన్నీకూడా ఎక్కువమంది సమర్ధించినంతమాత్రాన్నే మంవివైతే ఇక నేను చెప్పగలిగింది ఏమీలేదు.

"ఉదాహరణకు బాల్య వివాహాలను నేడు ఎంత వ్యంగ్యంగానైనా విమర్శ చేయవచ్చు. ఫలానా వ్యక్తి ఫలానా విధంగా అనకూడదు. ఆయా కాలాలలో బాల్యవివాహాలు వర్ధిల్లాయి. ఈనాడూ దాదాపుగా ఎవరూ చేయడం లేదు. ఏ ఒక్క రచనలు చదివి మాత్రమే బాల్యవివాహాలు తగ్గు ముఖం పట్టలేదని గమనంలో ఉంచుకోవాలి. అనేక ఇతర అంశాల ప్రభావమూ ఉంటుంది. రచనల ప్రభావం పాత్ర ఎంతమేరకు? ఎలా? అనేది కూడా సాపేక్షమే తప్ప నిరపేక్షం కాదు గనుక వాటిని విమర్శించేటప్పుడు కూడా పరిస్తితులు-కాలమూ-ప్రదేశం వంటివి గమనంలో ఉంచుకోవాలి. సమాజమంతా కూడా అజ్ఞానంలో ఉన్నప్పుడు ప్రజలంతా కూడా వారి చైతన్యస్థాయి మేరకే వ్యవహరిస్తారు. ప్రజల చైతన్యం మేరకు కొన్ని భావోద్వేగాలపై విమర్శ ఎలా చేస్తే బాగుంటుందనే జాగ్రత్తలు తీసుకోవాలి. "

ఎవ్వరూ విమర్శకుండా, ఎవ్వరూ తెలియ జెప్పకుండా బాల్య వివాహ్హాల్లంటీ దురాచారాలు ఎలా తగ్గుముఖం పట్టాయన్నది మీభావమా?

" ప్రజల చైతన్యం మేరకు కొన్ని భావోద్వేగాలపై విమర్శ ఎలా చేస్తే బాగుంటుందనే జాగ్రత్తలు తీసుకోవాలి. "

మీ ఉద్దేశ్యం అది కాకున్నా, మీ వ్యాఖ్య విమర్శించేవారికి చేస్తున్న బెదిరింపులా ఉంది. మీరు బ్లాగుల్లో మర్యాదస్తులనిపించుకోవడంకోసం మీ విలువలలతో రాజీ పడుతున్నారని నా అభిప్రాయం. అందుకే మీ వ్యాఖ్యలో 'లెఫ్టూ', ' రైటూ' కూడా మొగ్గారు. తప్పును తప్పని చెప్పడానికి మీకున్న మొహమాటాలేమిటో అర్ధం కావడంలేదు.

Zilebi చెప్పారు...

వామ్మో వామ్మో

రంగనాయకమ్మ గురించి టపా పెడితే ఇన్నేసి కామెంట్లు పడతాయా !

రెపు నేనూ ఒక టపా కట్టెస్తా ఈ టాపిక్ మీద !!


వేణు చెప్పారు...

@ Zilebi: తెలుగు బ్లాగ్ ప్రపంచంలో రంగనాయకమ్మ గారి గురించి అపోహలూ, వ్యతిరేకతా కనపడతాయి. ఆమె రాతలు చదవకుండానే అభిప్రాయాలు ఏర్పరచుకోవటం కూడా గమనించాను, చాలా సందర్భాల్లోో. అలాంటివాళ్ళ తమ తరహాలో కామెంట్లు రాయటం సహజమే కదా!

రాసిన విషయంపై స్పందనగా వచ్చే కామెంట్లు కాకుండా కామెంట్ల కోసమే విషయం రాసెయ్యటమా?! ఇలా కూడా ఉంటుందన్నమాట..

Marxist Hegelian చెప్పారు...

పెట్టుబడిదారీ ఆర్థిక శాస్త్రం కూడా చదవని పెట్టుబడిదారులు ఉన్నారు. వీళ్ళు రంగనాయకమ్మ గారి సాహిత్యం చదువుతారని అనుకోలేము.

ఒక ఉదాహరణ చెపురాను. ద్రవ్యోల్బణం అంటే అవసరానికి మించి కరెన్సీ ముద్రించడం. అవసరానికి మించి కరెన్సీ ముద్రిస్తే కరెన్సీ ప్రవాహం పెరుగుతుంది కానీ వనరులు పెరగవు. అప్పుడు పెట్టుబడిదారులు తమ సరుకుల ధరలు పెంచేస్తారు. తమకి ఎక్కువ రాశిలో డబ్బులు ఇచ్చినవాళ్ళకే సరుకులు అమ్ముతారు. కార్మికుల జీతాలకీ, ద్రవ్యోల్భణానికీ సంబంధం లేదు. కానీ కార్మికుల జీతాలు పెంచితే ద్రవ్యోల్బణం వస్తుందని వ్యాఖ్యలు వ్రాసినవాళ్ళని చూసాను. కార్మికులకి జీతాలు పెరిగితే పెట్టుబడిదారులకి ఆదాయం తగ్గుతుంది. అంతే కానీ దాని వల్ల ద్రవ్యోల్బణం రాదు. ఇందియాలో ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఎక్కువ. దాన్ని ఎవరూ ద్రవ్యల్బణం అనరు సరి కదా ప్రతివాడూ ప్రభుత్వ ఉద్యోగమే కావాలంటాడు, ప్రైవేత్ ఉద్యోగం వద్దంటాడు. ఆంధ్ర ప్రదేశ్‌లోని నిరుద్యోగుల్లో ఎక్కువ మంది కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు చెయ్యాలనుకుంటున్నవాళ్ళే. ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులతో ఇస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు పెరిగితే ప్రజలపై పన్నులు పెరుగురాయి తప్ప ద్రవ్యోల్బణం రాదు. ద్రవ్యోల్బణం ఎందుకు వస్తుందో తెలియాలంటే ఈ మధ్య జపాన్‌లో జరిగినవి చూడాలి. అక్కడి ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడే నెపంతో కావాలని కరెన్సీ కట్టలు ఎక్కువగా ముద్రించి వాటిని బ్యాంక్‌లకి తక్కువ వడ్డీకి అప్పుగా ఇచ్చింది. ఆ డబ్బుతో బ్యాంక్‌లు జనానికి ఎక్కువ మొత్తంలో అప్పులు ఇవ్వడం వల్ల అక్కడ కరెన్సీ ప్రవాహం పెరిగింది. కరెన్సీ ప్రవాహాన్ని చూసి అక్కడి పెట్టుబడిదారులు ధరలు పెంచేసారు. కరెన్సీ విలువ తగ్గి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తే గానీ సరుకు దొరకని పరిస్థితి వచ్చింది. Unitగా కరెన్సీ విలువ తగ్గడం వల్ల అక్కడి stock marketలలో షేర్‌లు కొనే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FII) పెరిగి stock marketలు మాత్రమే లాభాలతో మెరిసిపోయాయి.

ఈ విషయాలు ఇందియాలో చాలా మందికి తెలియవు. పెట్టుబడిదారీ వ్యవస్థ వల్లే తమకి సాఫ్త్‌వేర్ కంపెనీలో యాభై వేలు జీతానికి ఉద్యోగం దొరికిందని పెట్టుబడిదారీ వ్యవస్థని సమర్థించేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. అమెరికాలో రోజుకి 8 గంటలు మాత్రమే పని, ఎన్ని గంటలు పని చేస్తే అన్ని గంటలకి జీతం, వారానికి రెండు సెలవులు లాంటి చట్టాలు ఉన్నాయి కాబట్టే బహుళ జాతి కంపెనీలు ఖర్చు తగ్గించుకోవడానికి ఇందియాలో పెట్టుబడులు పెడుతున్నాయని వాళ్ళకి తెలిసినట్టు లేదు. అమెరికావాళ్ళు తమ దేశంలో కార్మిక చట్టాలని అమలు చేసి మన ఇందియా మీదకి మాత్రం స్వేచ్ఛా వాణిజ్యాన్ని వదులుతారు. ఇందియాలో పన్నులూ, కార్మిక చట్టాలూ రద్దు చేస్తేనె తాము ఇక్కడ పెట్టుబడులు పెడతామని అమెరికా ప్రపంచ బ్యాంక్ చేత చెప్పిస్తుంది.

సమాజం గురించి ఆలోచించేవాళ్ళే మార్క్సిజం చదువుతారు కానీ తమకి IT ఉద్యోగమో, ప్రభుత్వ ఉద్యోగమో ఉంది కనుక ఇంకేమే అవసరం లేదు అనుకునేవాళ్ళు మార్క్సిజం చదవరు.

Kondala Rao Palla చెప్పారు...

@Iconoclast గారు, మీ కామెంటుని ఆలస్యంగా చూశాను. నేను విమర్శించేవారిని బెదిరిస్తున్నానంటూనే మర్యాదస్తుడనని అనిపించుకోవడం కోసం విలువలతో రాజీ పడుతున్నానంటున్నారు. ఈ రెండూ ఒకేసారి ఎలా సాధ్యమో అర్ధం కాలేదు.

Left, Right లలో ఎటో ఒకవైపే మొగ్గాలా? లేదా ఆ రెండూ తప్ప ఇంకెటూ మొగ్గకూడదా? నాకేది మంచి అనిపిస్తే అటు మొగ్గుతుంటాను. నాకు తెలిసిందే మంచి అనడం లేదు. నిర్ధారించుకున్నవి మాత్రం డెఫినెట్ గా ఎవరితోనైనా వాదిస్తాను రాజీ పడకుండా. తెలియంది, డవుట్ గా ఉన్నవీ, వ్యక్తిగతానికి సంబంధించినవీ, సమయం కుదరని సందర్భాలలో కొన్నింటిని ఇగ్నోర్ చేస్తుంటాను.

దీనికి కారణం నాకు విషయాలు కొద్ది కొద్దిగా తెలియడమే. నేను చాలా తక్కువ బుక్స్ మాత్రమే చదివాను. ఆ లోపం వల్లనే నేను కొన్ని చోట్ల ఇగ్నోర్ చేసేదానిని మీరు రాజీపడడం అనుకుంటూ ఉండివుండవచ్చు. బెదిరించడం అనేది మీకు నచ్చిన పద్ధతికి భిన్నంగా మాట్లాడి ఉంటాను కాబట్టి అని ఉంటారు. నా అభిప్రాయం నేను చెప్పగలను తప్ప బెదిరించాల్సిన అవసరం , రాజీపడి మర్యాదస్తుడనని అనిపించుకోవలసిన అగత్యమూ లేదు. చర్చలలో, అభిప్రాయాలను విభేదించడంలో మర్యాదని కోల్పోవలసిన అవసరం అసలు లేదని మాత్రం చెప్పగలను.

విమర్శపై నా అభిప్రాయం : విమర్శ అనేది ఆలోచింపజేసేదిగా, అజ్ఞానం నుండి జ్ఞానం వైపు మార్చేదిగా ఉండాలి కానీ హేళనగానూ,కించపరచేదిగానూ, మనకు జ్ఞానం తెలుసుకనుకా దానిని ప్రదర్శించే తత్వంతో అతిగానూ ఉండకూడదు. వ్యక్తులుగా సాధించేదిగా కంటే వ్యవస్థీక్రుతంగా సాధించేదే ఎక్కువ. వ్యక్తులను సమీకరించడానికి జ్ఞానప్రవాహం ఆయా సందర్భాలను బట్టి జాగ్రత్తగా ఉండాలి. అజ్ఞానంలో ఉన్నవారిని మార్చి జ్ఞానం వైపు చేర్చగలిగితే జ్ఞాన సమూహానికి మేలు జరుగుతుంది తప్ప అజ్ఞానంలో ఉన్న వ్యక్తిని టార్గెట్ చేస్తే ప్రయోజనం లేదని చెప్పడమే ఇక్కడ నా ఉద్దేశం. అదే సందర్భంలో సమాజంలో వివిధ వ్యక్తుల మధ్య జ్ఞానం విషయంలో అంతరాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయనేదీ గమనంలో ఉంచుకోవాలి.

ఎవరూ విమర్శించకుండా బాల్యవివాహాలు తగ్గాయని నేను చెప్పలేదు. అసలు పోరాటం లేకుండా, ఘర్షణ లేకుండా ఏ మార్పూ జరుగదు. కానీ మార్పుకీ ప్రాసెస్ ఉంటుంది. నోడల్ పాయింట్ కు రావడానికి క్రితం జరిగే ప్రాసెస్ పై మీ అభిప్రాయానికీ, నా అభిప్రాయానికీ కొంత అభిప్రాయబేధం ఉన్నట్లనిపిస్తున్నది.

ఇక్కడ విషయం తీసుకున్నా నేను రంగనాయకమ్మ గారి విమర్శను ఆహ్వానిస్తున్నాననే చెప్పాను. ఆ బుక్ కొందామని ప్రయత్నిస్తే ఇంకా అందుబాటులోకి రాలేదు. సందేహాలు - శాస్త్రీయ సమాధానాలు అనే ఇంకో బుక్ కొన్నాను. ఇప్పుడైనా రంగనాయకమ్మ గారి బుక్ కొని చదువుతాను.

రంగనాయకమ్మను హేళంగా విమర్శిస్తూ హిందూ ధర్మం ప్రకారం విమర్శిస్తున్నామని ఓ పోస్టు చూశాను. అక్కడ నేను అందులో దూరడం కంటే ఇగ్నోర్ చేయడమే ఉత్తమమని భావించాను. మరి మీ వంటి వారూ అక్కడ లేరు. కానీ మీరు భయపడ్డారనో? మర్యాద కోల్పోకూడదని చూస్తూ ఊరుకుని భీరులుగా ఉన్నారనో ఆరోపణలు చేయను. మీరా పోస్టుని చూడకపోవచ్చు. చూసి ఇగ్నోర్ చేయవచ్చు. ఏదైనా సరే అక్కడ చేయగలిగేది ఇగ్నోర్ చేయడమేననేది నా అభిప్రాయం. అక్కడ చర్చే అర్ధవంతంగా లేనప్పుడు అక్కడ దూరి నేర్పేది గానీ, నేర్చుకునేదిగానీ ఏమీ లేనప్పుడు ఏమి చేయగలమో అదే చేస్తాం. ఆ పోస్టు వ్రాసిన వ్యక్తిపై శతృత్వమూ పెంచుకోను. వేరే విషయాలపై కొన్నింట చక్కగా వ్రాయగలిగేవాడు ఇంత అమాయకంగా ఎలా వ్రాశాడా? అనిపించిందంతే. అదనపు విలువపై నాకు ఓ నిర్ధారణ ఉంది కనుక అక్కడ విషయాల్పై ఓ అవగాహనకు రాగలను. అక్కడే చెప్పాలా? వద్దా? అనేది నా అభిప్రాయం మేరకే చేస్తాను తప్ప. భయపడో, మర్యాదకోసమో కాదు. ఆ విషయాన్ని అక్కడ దూరి చెప్పినా ప్రయోజనం లేదని అక్కడ వాతావరణం తెలియజేస్తున్నది. అక్కడ దూరడం అతి అవుతుందనిపించింది.

అజ్ఞాత చెప్పారు...

మీరు బెదిరిస్తున్నారు అనేది నా అభిప్రాయం కాదు. ఆలోచించుకోవాలి అని చెబుతున్న మీ ఆ వ్యాఖ్య అలా ఉందన్నది మాత్రమే నా అభిప్రాయం. మీరు రాజీపడుతున్నారనుకోవడమ్మీదమాత్రం నా అభిప్రాయం స్థిరమైనదే. మీరు విలువల్స్ని చూస్తున్నరే తప్ప, వాటి వెనుకున్న కారణాలను చూడటం కావాలనే మానేశారని నాకు అనిపిస్తుంది. లేకుంటే, రాజ్యాంగంలోనికి మతవిలువలను జొప్పించాలని మీరు మీబ్లాగులో అభిలషించేవారు కానేకాదు (ఇస్లామిక్ దేశాలు తమ మతంలోని "మంచి"ని జొప్పించి ప్రస్తుతం దేశాన్ని నడుపుతున్న తీరు చూస్తూకూడా). మీరు ఇంతలా బాధపడారుకానీ ఏదీ మీరు అంతగా ఎవరికోసమైతే మొహమాటపడ్డారో వారిని తమ మతంలోని చెడ్డవిలువలను నాలుగంటే నాలుగు లిస్టిచ్చి. వాటినీ, వాటికి సమర్ధనగా ఉన్న పవిత్రగ్రంధాలలోని శ్లోకాలనీ బుట్టదాధలు చెయ్యలని చెప్పమనండి. వాళ్ళు చెప్పరు. మీరుమాత్రం ఆచెత్తతెచ్చి ప్రజలందరి మెదళ్ళలో నిచిప్తం చెయ్యాలని చూస్తారు. వాళ్ళు ఫలానిది చెత్త అని ఒప్పుకోరు. ఇంకెవరైనా చెబుతే దాన్ని వేళాకోలమంటారు. సున్నితంగా చెప్పలేదని తెగఫీలౌతారు. ఎన్ని మతగ్రంధాల్లో సున్నితమైన విషయాలున్నాయిసార్! పెద్దకులాల పురుషుల్ని తప్ప, తక్కినందర్నీ అవి నీచంగా చూసి, వారి గురించి అత్యంత అమానవీయమైన అభిప్రాయాలని ప్రజల మెదళ్ళలోకి అవి ఎక్కిస్తే అవి పవిత్రమూ, వాటి తాటతీస్తూ ఎవరినా విమర్శిస్తే అది పరుషమూ? ఎక్కడి double morals సార్ ఇవి?

అసలు విమర్శ గంధమ్రాసినంత సున్నితంగా ఉండేమాత్రానికి అసలా విమర్శమాత్రం ఎందుకు? ఓపక్క బాల్య వివాహాలు విమర్శలవల్లే అంతరించాయంటారు, మత గ్రంధాల విషయంలోమాత్రం ఒక్కరి విమర్శలవల్ల విమర్శలు ఒరిగేదేమీ లేదంటారు. ఇంకోపక్క అందరూ గౌరవిస్తున్నారుకాబట్టి, వాటిల్లో మంచివిలువలు ఉండే ఉంటాయంటారు (ఇంత తర్కదూరమైన వాదన మీనుంచి విని, మీరసలు ఆలోచించగలిగే స్థితిలో ఉన్నారా అని అనుమానం వస్తే, అది నా తప్పెలా అవుతుంది?). Fine! లెఫ్టూ, రైటూ వదిలెయ్యండి. మనుషుల మధ్య అంతరాలను సృష్టించి, వాటి ఆధారంగామాత్రమే మనగలిగిన కూతనీతిని మాత్రం సమర్ధించకండి. అదికూడా మార్క్సిస్టునని డప్పుకొట్టుకుంటూ.

మీరు రాసిన చాలా ఫిలాసఫీ నాకు అర్ధం కాలేదు. మీకు అర్ధమయ్యే ఉంటుందనీ, చిలుక పలుకులు కావనీ ఆశిస్తున్నాను. నాకుమాత్రం పదాడంబరంతప్ప మీభావాల్లో సంబధ్ధత కనబడడంలేదు.

అజ్ఞాత చెప్పారు...

ఇకపోతే రంగనాయకమ్మ గారి గురించి. ఆవిడ గ్రంధాల్లో అన్ని విమర్శలూ నాకు నచ్చలేదు (నేను అతివాద మార్క్సిస్టును కాదుకదా, కనీసం మితవాద మార్క్సిస్టునుకూడా కాదు). అంతమాత్రాన ఆ పుస్తకం రాయడమే తప్పని నేను అనుకోను. దేన్నైనా ప్రశించే హక్కు, విమర్శించేహక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. పవిత్రత ముసుగు తొడిగో, విమర్శ ఇలా ఉండాలని నిర్దేశించో దాన్ని రక్షించాలని చూడడం తెలివైన పనవ్వదు.


రామాయణ విషవృక్షంలోని ప్రతి పేరాకీ విమర్శరాస్తామని కొందరు ఆరంభశూరులు రాముడిమీద ఒట్టేసిమరీ కొన్నాళ్ళక్రింద మొదలుపెట్టారు. ఒకానొక బ్లాగు స్వామీజీ వారిమీద రాముని కృప ఉంటుంది confirmగా చెప్పారుకూడా. మరి రాముడే ఆపని కొనసాగనివ్వలేదో, రాముడిమీద వారికి భక్తి తగ్గిందో, ఆ రామభక్తుడు రాముడి కరుణ విషయంలో వారితో అబధ్ధమాడాడో తెలియదుగానీ ప్రస్తుతం ఆ బ్లాగులో కనీసం నాలుగు పోస్టులుకూడా విషవృక్షమ్మీద లేవు :-). ఇంకొకరిమీద నోరుపారేసుకోవడం తేలికేనండి, తము నమ్మిన వాటిమీద commitmentతో తమ భావలను ప్రజల్లోకి తీసుకుపోవడం గొప్ప. అది రంగనాయకమ్మగారిలో ఉంది. ఆ ఆరంభశూరుల్లో లేదు. అందుకే వాళ్ళని నేను ignore చేస్తాను. మీరు ignore చెయ్యడంలేదండీ, support చేస్తూ రాస్తున్నారు. వాళ్ళ భావాలను మీరు అలవర్చుకుంటున్నారు. మీరు నమ్మినవాటిని చెప్పడానికి మొహమాటపడుతూ, ఒకవేళ చెప్పినా ధాటిని తగ్గించుకొని, సన్నాయినొక్కులు నొక్కుతూ, ఇతరులూ అలాగే చెప్పాలని ఆశిస్తున్నారు.

ఇక మీరుదహరించిన పోస్టు జిలేబీ గారిదే అయితే. అదినేనూ చూశాను. ఆ కాలంనాటి గ్రంధాన్ని, అందులోని విలువల్నీ ఇప్పుడు విమర్శించి ప్రయోజనమేమిటి అని అమాయకంగా అడిగేవారందరూ, తరువాత అదే గ్రంధము మన సంస్కృతికిమూలము, అందులోనే నీతంతా ఉంది గర్వంగా చెబుతారు. ఆవిషయాన్ని వాళ్ళు విమర్శయొక్క అవశ్యకతతో ముడిపెట్టరు. Convenientగా మర్చిపోతారు. అప్పుడలా, ఇప్పుడిలా. ఎప్పుడు ఏవాదం అవసరమైతే అప్పుడు ఆవాదం. వీళ్ళని ఎవరైనా seriousగా తీసుకోగలరు చెప్పండి?

Kondala Rao Palla చెప్పారు...

నేను మార్క్సిష్టునని, మార్క్సిజాన్ని బోధించడానికి బ్లాగు నడుపుతున్నానని ఎవరికీ డప్పు కొట్టలేదు. మీకాడప్పు ఎప్పుడు ఎలా వినిపించిందో నాకు తెలీదు. మార్క్సిజంలో నాకు చాలా తక్కువ విషయాలే తెలుసునని చెప్పాను ఎవరికైనా. మీ ఇష్టమొచ్చిన స్టేట్మెంట్లు ఇలా అర్ధసత్యంగా ఇస్తే అది మీ ఇష్టం. రాజ్యాంగంలో మత విలువలు జొప్పించాలని నేను చెప్పానని అనడం పూర్తిగా తప్పు. మీకు అలా విషయాలు అర్ధమవుతున్నాయా? నన్ను టార్గెట్ చేయడమే మీ ఉద్దేశం లా ఉన్నది. నేను అలా చెప్పలేదు. చిలుకపలుకులు పలకాల్సిన అవసరం అసలే లేదు. ఇలా వ్యక్తిగతంగా అతిగా కువిమర్శలు చేయడమే మంచిది కాదని నేను చెప్పింది. అది మీకు అర్ధం కాదని అర్ధం అవుతున్నది.

Kondala Rao Palla చెప్పారు...

నేను రంగనాయకమ్మ గారు విమర్శించడాన్ని ఎక్కడ విమర్శించానో చెప్పగలరా?

ఎలా విమర్శించాలనేదానిపై నా అభిప్రాయం చెప్పాను. అది రంగనాయకమ్మ గారికైనా, మీకైనా చెప్తాను. విమర్శించే విధానంపై నాకో అభిప్రాయం ఉండడాన్ని ఇంకెవరో అతిగా చెపుతాననడం మంచిది కాదు కదా? నా అభిప్రాయంతో మీరు ఏకీభవించకపోతే మీ విధానంతోనే ఎక్కువ ప్రయోజనం ఉంటుందనుకుంటే అదే ఫాలో అవుతారు డెఫినెట్ గా.

నేనుదహరించినది జిలేబి గారిది కాదు. జిలేబి గారి పోస్టులో అదనపు విలువ గురించి చర్చించలేదే? అంటే మీరు నేను చెప్పేవి పూర్తిగ చదవకుండానే విమర్శలు చేస్తున్నారా? జిలేబి గారు విషవృక్షం చదివి వాంతి వచ్చినంతపని అయిందన్నారు. అలా చెప్పేముందు ఆమె విషవృక్షం చదివానన్నారు. అలా చదివి అభిప్రాయం చెపితే మంచిదే. రంగనాయకమ్మ గారు చెప్పినట్లే జిలేబి గారికీ విమర్శ చేసే అధికారం అవకాశం ఉన్నది. అక్కడే భారతమూ చదివి చెపితే బాగుంటుందనీ చెప్పాను. ఆమె హిందూ మతంలోని సతిని రాజారామ్మోహన్ రాయ్ వ్యతిరేకించడాన్ని ఆహ్వానించారు. అంటే హిందూ మతంలోని చెడుని వ్యతిరేకించినట్లే కదా? అదే విషయాన్ని నా కామెంటులో చెప్పాను. రంగనాయకమ్మ గారు అంతగా విమర్శించకముందే హిందుమతంలోని దుర్మార్గాలను సంస్కర్తలు వ్యతిరేకించారు. పోరాడారు. నేనెలా ఉండాలనేదానిపై విమర్శవల్ల ఇక్కడ ఎవరికీ ప్రయోజనమో నాకర్ధం కాలేదు.

మీరంటున్నట్లు నేనెవరినీ కావాలని సమర్ధించడం లేదు. మీరనుకునే అభిప్రాయాలకు, పలుకుతున్న అసత్యాలకు ఆధారాలు చూపితే నిజంగా పనికివచ్చేవి ఉంటే స్వీకరిస్తాను. ఎవరినైనా విమర్శించవచ్చంటూనే విమర్శపై అభిప్రాయం చెపితేనే ఇంత వ్యక్తిగత టార్గెట్ ఎందుకు?

నేనడిగేది రామాయణ కల్పవృక్షమూ, విషవృక్షమూ రెండూ చదవకుండా ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేరా? ప్రపంచంలో ఇవి రెండూ తెలియకుండా ఎవరూ మంచి చెడులను గుర్తించలేక పోతున్నారా? తాట తీసే తెల్చుకుందామనుకునేవారు అంతకు ముందు సమాజంలో సంస్కర్తల పోరాటాలూ ఉన్నాయని గుర్తించాలి. వారి పోరాటాలనూ స్పూర్తిగా తీసుకుంటారు. అందరూ తాట తీసి తోలు ఊడదీసి చేయడమే పోరాటం లేకుంటే కాదు అనుకోవాలని లేదనేది నా అభిప్రాయం.

అజ్ఞాత చెప్పారు...

1) మీమీద వ్యక్తిగతంగామాత్రమే దాడిచెయ్యగల, సిధ్ధాంతపరంగా దాడిచెయ్యలేని స్థాయిలో మీరులేరు. కాబట్టి మీరు మిమ్మల్ని victimise చేసుకోవడాన్ని మానేస్తే మంచిది. అందుకోసం నావ్యాఖ్యల్ని వక్రీకరించడంకూడా మీరు మానుకోవాలని విజ్ఞప్తి.
2) మీమీద వ్యక్తిగత దాడి చెయ్యల్సిన అవసరం అసలు నాకులేదుకూడా. మీరు అభ్యుదయాన్ని సనాతనభావాలతో కలుషితం చేస్తున్నారన్నది నా అభిప్రాయం. దానికి కారణ మీ కాపట్యమా, లేక మొహమాటమో లేక అందరిని కలుపుకుపోక తప్పదన్న తప్పుడు బావమో తెలుసుకుందామనేది నా ప్రయత్నం. ఇక మీదట ఆప్రయత్నాన్ని విరమించుకుంటున్నాను. ఎందుకంటే ఆ అవసరం ఇకమీదట నాకు ఉండబోదు. ఇకమీదట మీ భావాలను నేను పట్టించుకోదలుచుకోలేదు. మీ ఇష్టం వచ్చినట్లు, మీ అభిమానులకు నచ్చేలాగా మంచీ, చెడూ రెండింటినీ కనిపి ఒక నైతిక పాకం వండి మీబ్లాగు చదువరులకు తినిపించండి. I don't care!.

" ప్రజల చైతన్యం మేరకు కొన్ని భావోద్వేగాలపై విమర్శ ఎలా చేస్తే బాగుంటుందనే జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నగీతను చెరపకుండానే పెద్దగీతను గీయవచ్చు."

నేను పైనుదహరించిన మీవ్యాఖనే తీసుకోండి విమర్శ toned down గా, ఏమాత్రమూ బాధని ఆలోచన రేకెత్తించనిదిగా, సుతారంగా ఉండాలని మీరు అభిప్రాయ పడడం నిజంకాదా? కొన్నింటిమీడ విమర్శలు చేసేముందు విమర్శకులు జాగ్రత్తలు తీసుకోవాలని మీరన్నమాట నిజంకాదా. అదే జగ్రత్తలు మీరూ తీసుకుంటున్నారని నేనంటే దానికి మీకు అంత ఉలుకెందుకు. మీరు మీ ంబ్లాగులో వాడుతున్న భాష ఈ అతివాదుల భాషతో సరిపోలడంలేదా? పవిత్రత, moral policing లాంటి భావాలను మీరు నిర్ద్వందంగా ఎన్నడైనా ఖండించారా? ఖండిస్తూ రాసినపేరాలోనే abstractగా మీరు వాతిని సమర్ధించడం నిజంకాదా! విమర్శ తీరుపైని మీ నిబంధనలు ఏంటండీ? పుస్తకాల్లో ఉన్న దుర్మార్గపునీతులను సమర్ధించేవాళ్ళు సంస్కృతి పేరున సమర్ధిస్తూనే ఉన్నప్పుడు. మీలాంటివారు మాత్రం విమర్శ తగుమాత్రంగానూ, జాగ్రత్తలతో కూడినదిగానూ ఉండాలని ఉండాలని అభిప్రాయపడడంలోని అర్ధమేమిటి?


సమస్యకూ, నీతులకూ మూలాలని ఆలోచించగలగాలి. ఆలోచించగలిగినవారే మార్క్సిటో ఇంకెదో అవుతారు. వాటిని పైపైన పరిశీలిస్తూ, మెచ్చుకుంటూ పోతే మీరూ భక్తులే అవుతారు. ముందుగా మీరు ఇది తెలుసుకోండి.

Sujata చెప్పారు...

వేణు గారూ... తాంబోలాలిచ్చేసారు. భలే! రచయిత్రి లాంటి ప్రశ్నించే ధోరణి కలిగి ఉండటం చాలా మంచిది. వ్యక్తిగతంగా నాకు భారతం ఇష్టమైన, ఆసక్తి కలిగించే అత్భుత గ్రంధం. ఆ రోజుల్లో సమాజం అలా వుండేదా ? అంటూ అనుకోవడమే తప్ప ఎక్కువ శల్యపరీక్ష చెయ్యలేను. అయినా, అసలు సమాజం లో ప్రగతి ప్రశ్నించడం తోనే వస్తుంది. మీ పరిచయం బావుంది. ఈ దృక్కోణం కూడా ఆసక్తికరమే.

Hari Babu Suraneni చెప్పారు...

భారతం కథని యథాతథంగా ఉన్నదాన్ని ఉన్నట్టే ఇచ్చాను. అసలు కథ ఎలా ఉంటుందో తెలియాలి పాఠకులకు. నా వ్యాఖ్యానాలు నేను వేరే చేసుకున్నాను. అంతేగానీ, అసలు కథలో నేను వేలు పెట్టలేదు.
????>
అప్పుడు రాసినట్టు "రాముదు శూర్పనఖని లొట్టలేసుకుంటో చూశాదనీ,ఆహా,సీత కన్నా ముందు ఈవిడ(యెంత గౌరవమో - పెళ్ళి కాదు ఒక్కసారి కోర్కె తీర్చవా అని ఒక పెళ్లయిన మగాణ్ణి అడిగిన స్వైరిణి పట్ల రచయిత్రికి) కనబడి వుంటే ఈమెనే చేసుకునేవాణ్ణి గదా అనుకున్నాడు" అనే టైపులో ఈసారి రాస్తే కుదరదని తెలిసొచ్చింది కాబోలు:-)

వేణు చెప్పారు...

ఆ పుస్తకం అలా రాయటానికీ, ఈ పుస్తకం ఇలా రాయటానికీ కారణాలున్నాయి. కాస్త గమనిస్తే తెలియనిదేమీ కాదు- అది అర్థం చేసుకోగలవాళ్ళకు! అపార్థం చేసుకోదలిచినవాళ్ళను ఎవరూ ఆపలేరు.

మొదటి పుస్తకం కథ ప్రజలకు బాగా తెలుసు. అందుకే ఆ పాత్రల స్వభావాలను పరిశీలించి... వాటి ప్రకారం కథను మళ్ళీ తను గ్రహించిన కోణంలో రాయటం! భారతం కథ స్థూలంగా మాత్రమే ఎక్కువమందికి తెలుసు. వివరంగా మూలంలో ఏముందో తెలిసినవాళ్ళు తక్కువ. అందుకే రచయిత్రి మహాభారతం ‘పరిచయం’ రాశారు!

Hari Babu Suraneni చెప్పారు...

??మొదటి పుస్తకం కథ ప్రజలకు బాగా తెలుసు. అందుకే ఆ పాత్రల స్వభావాలను పరిశీలించి... వాటి ప్రకారం కథను మళ్ళీ తను గ్రహించిన కోణంలో రాయటం!

అంటే -రాముదు శూర్పనఖని లొట్టలేసుకుంటో చూశాదనీ,ఆహా,సీత కన్నా ముందు ఈవిడ(యెంత గౌరవమో - పెళ్ళి కాదు ఒక్కసారి కోర్కె తీర్చవా అని ఒక పెళ్లయిన మగాణ్ణి అడిగిన స్వైరిణి పట్ల రచయిత్రికి) కనబడి వుంటే ఈమెనే చేసుకునేవాణ్ణి గదా అనుకున్నాడు" అనే టైపులో రాస్తే- మీరు సమర్ధిస్తున్నారా!

ఒక రచయిత రాసినదాన్ని పూర్తిగా తనకనుకూలంగా ఒక వెర్షను రాసుకుని తను మార్చుకుని రాసిన వెర్షను ప్రకారం విమర్సిస్తే అది తనని తను వెక్కీంచ్కున్నట్టు అవుతుందా,అవతలి రచయితను విమర్శించినట్టు అవుతునా, రచయిత చెప్పని తన సొంత పులుముడికి కూడా ఒక గంభీరమయిన ప్రాతిపదికని చూశారా మీరు?

వేణు చెప్పారు...

@ Hari Babu: ఇలా ముక్కలు ముక్కలుగా మీరు అడగటం- నేను చెప్పటం వల్ల ఈ పుస్తకం గురించి చర్చించుకున్నట్టవదు. అది సాధ్యం కూడా కాదు.

‘విషవృక్షం’ రచనాధోరణిని నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. రామాయణ కథను తిరగరాసిన కారణాలను రచయిత్రి ఆ పుస్తకంలోనే వివరంగా రాశారు. ఆ కారణాలను మీరు వ్యతిరేకించదలిస్తే అది మీ ఇష్టం! ఇక ‘సొంత పులుముడు’ లాంటి పద ప్రయోగాలు మీ అసహనాన్ని మాత్రమే వ్యక్తం చేస్తాయి.

Marxist Hegelian చెప్పారు...

నేను ఆ పుస్తకాన్ని నా మొబైల్‌లోకి download చేసుకున్నాను. మనుషులకి పాములూ, పక్షులూ పుడతాయని మనం చెపితే ఎవరూ నమ్మరు కానీ పురాణకర్తలు చెపితే నమ్ముతారని అది చదువుతున్నప్పుడు నాకు అనిపించింది.

రఘునాత నాయకుడు వాల్మీకి చరిత్రలో మహర్షులు మన్నార్‌గుడి వెళ్తున్నట్టు వ్రాసాడు. మన్నారుగుడి చోళ రాజులు కట్టినది, వాల్మీకీ కాలంలో అది ఎక్కడ ఉండేది? కవి ఏమి వ్రాసినా మనం దాన్ని నమ్మాలి అన్నట్లు ఉంది!

ybr (alias ybrao a donkey) చెప్పారు...

రంగనాయకమ్మ గారు రామాయణ విషవృక్షంలో వ్రాసిన విషయాలను నేను వ్రాసిన విషయాలతో పోల్చి చూసుకోవాలనుకునే వారు ramayanayb.blogspot.com చూడచ్చు. ఇది దాదాపు ౨౦౦ వ్యాసాల పని.
రంగనాయకమ్మ గారు తమ మహాభారతంలో వ్రాసిన విషయాలను వ్యాసభారతం ఆధారంగా నేను అంతకు ముందే వ్రాసిన విషయాలతో పోల్చి చూడాలనుకునే వారు నేను వ్రాసిన mahabharatayb.blogspot.com. చూడచ్చు. ఇందులో ముఖ్యంగా మాధవి, గాలవుడు, విశ్వామిత్రుడు, గరుడుడుల కథను కవర్ చేశాను. వ్యాస సంస్కృత భారతానికి, గంగూలీ గారి ఆంగ్లానువాదంలో సర్చికి లింకులు పెట్టటం జరిగింది. నా ఈ మెయిల్ ybhask. ఇది జీమెయిల్లో ఉంది.
ఆమె వలెనే నేను కూడ నాస్తికుడను,మార్క్సిజాన్ని సమర్ధఇంచే వాడిని కనుక, మీ అసహనానికి కూడ స్వాగతమే.
ధర్మరాజు తన అశ్వమేథఁలో ఎద్దులనే కాక, స్త్రీలను కూడ బలి ఇచ్చాడనే అనుమానానికి తావు ఉన్నది. దీనికి సాక్ష్యాలను నా problemsoftelugus.blogspot.com లో వ్రాయటం జరుగుతుంది. దీనిని రంగనాయకమ్మగారు కవర్ చేశాలో లేదో నాకు తెలియదు.

శ్రీ వేణు గారు, ఈలింకులను మీరు నోట్ చేసుకున్నాక, నా ఈ కామెంట్ ను మీరు స్పామ్ గా పరిగణించి డిలెట్ చేసినా నా కేమీ అభ్యంతరం ఉండదు.

chinna narsimulu చెప్పారు...

రంగ నాయకమ్మకు రామాయణంలో,భారతంలో మంచి కనిపంచ లేదా?ప్రజలు పట్టించకోని విషయాలను పట్టి పట్టి ప్రచారం చేయడమెందుకు? సమాజాన్ని చైతన్యం చేయాలంటే రామాయణం,భారతాల మీద పడాలా? రామాయణ,భారతాల్లో ఉన్న దురాచారాల్ని ఎవరైనా పాటిస్తున్నారా?రామాయణ,భారతాల గురంచి ఎవరైనా చెప్పేటప్పుడు మంచి చెప్తరు కాని దానిలోని చెడుని పాటించమని చెప్తున్నారా? ప్రస్తుతం ఉన్న దురాచారాలన్ని వాటినుంచి వచ్చినవేనా?నేటి సమాజంల చాలా సమస్యలుండవి వాటి గురించి రాయనింకే రాదా? ఎవరినన్న రామునిలో,ధర్మరాజులో మీకేం నచ్చిందని అడగితే ఏంచెప్తరు?మీలో ఉన్న విషాన్ని సమాజంమీద ఎందుకు కక్కుతరు? వీలైతే మంచిని ప్రచారం చేయండి.చెడుని ప్రచారం చేసి చెడ్డవాల్లెందుకైతరు? మంచిని చెప్పకపోయినా పరవాలేదు దయచేసి చెడుని మాత్రం ప్రచారం చేయవద్దు.

వేణు చెప్పారు...

@ chinna narsimulu: ఒక పుస్తకాన్ని ఎవరి కోణంలో వాళ్ళు చూస్తారు; వ్యాఖ్యానిస్తారు. ఒక పార్శ్వాన్ని మాత్రమే చూడమని చెప్పటానికి ఎవరికీ హక్కు ఉండదు.

రామాయణ, మహాభారతాల్లో మంచీ చెడూ రెండూ ఉన్నాయని మీరంటున్నారు. సరే. ఆ పుస్తకాల ఘనత గురించి భక్తి చానళ్ళలో, భక్తి మ్యాగజీన్లలో ప్రవచనాలు ధారాళంగానే సాగుతున్నాయి. చెడు కూడా ఉన్నపుడు దాని గురించి ఎవరైనా లేవనెత్తితే సమస్యేముందీ?

ఒక పుస్తకంలో ఏముందో చెపుతూ ఒక విమర్శ రాసినంత మాత్రానే అది సమాజం మీద విషం కక్కడం అవదు. ఒక వాస్తవాన్ని చెప్పడం అవుతుంది.

మూలగ్రంథాల్లో లేని అంశాలను రంగనాయకమ్మ ఎక్కడైనా వక్రీకరించి రాశారా? అలా జరిగితే ఎక్కడెక్కడ, ఎలా? వీటి గురించి నిర్దిష్టంగా చెప్పి, అప్పుడు ఆమె రాతలను విమర్శించండి. అది సరైన పద్ధతి.

రామాయణాన్ని ఇష్టపడేవాళ్ళు కూడా వాలి వధ, సీత అగ్నిప్రవేశం, శంబుక వధ ఘట్టాల్లో రాముడి ప్రవర్తనను విమర్శిస్తుంటారు. తమ్ములనూ, భార్యనూ జూదంలో ఒడ్డిన ధర్మరాజును అందరూ ఇష్టపడుతున్నారా? ‘పేరు ధర్మరాజు, పెను వేపవిత్తయా’ అని ఏనాడో వేమన అన్నాడని మీరు చదవలేదా?

yallapragada h.kumar చెప్పారు...

ఇంత రాద్ధాంతం అవసరం లేదు వేదాలైనా, భారతం ఐన బైబిల్ ఐన ఖురాన్ ఐన వాటి నుంచి మంచి తీసుకొని చెడుని వదలటమే మనపని. అలాచేస్తునందుకే ప్రస్తుత ఈ ప్రపంచాభివృధి. నాకు తెలిసినంతవరకు ప్రస్తుత హిందూ మతంతో వచ్చినంత, వస్తున్నంత మార్పు మరేమతంలోను రాలేదు. ఎన్నో మతాలు పుట్టక ముందు వేల సంవత్సరాలనుంచి ఉన్న ఈ మతంలో ఎన్నో మూఢనమ్మకాలు అసహజ సంఘటనలు కావాలని జొప్పించిన విషయాలు ఉండటంలో ఆశ్చర్యం లేదు. అలానే అసలు రామాయణమహభారతాలు కేవలం పుక్కిటి పురాణాలే అనటం లో కూడా అర్థం లేదు. అనేక చారిత్రక సాక్షాలు వెలుగు చూస్తున్నాయ్ కదా. సుమారు వెయ్యి సంవత్సరాలు పరాయి పాలనలో మగ్గిన ఈ దేశంలో ఏ చారిత్రక సాక్ష్యం నాశనం అయిపోయిందో ఎవరు చెప్పగలరు.

Ramana చెప్పారు...

భారతం, ప్రకృతి సైన్సులు అభివృద్ధి చెందని క్రీస్తు వెనకటి అనేక వందల ఏళ్ళ నాటిది

I am trying to understand what this means. What impact does the development of natural sciences have on Bharatham? It is basically a story about the rivalry between princes who happened to be brothers. It is a story about human nature, nature of power and how they end up in war.
Does the development of natural sciences make any of this irrelevant by eliminating wars, etc.? For example, Duryodhana got jealous after watching Mayasabha. On top of that he felt humiliated when Draupadi laughed at him. The story tells how these emotions finally lead to war. Do the natural sciences make this story irrelevant because science helps us in overcoming those emotions?

Ramana చెప్పారు...

రంగనాయకమ్మ గారి విమర్శనాత్మక శైలి క్లుప్తంగా చెప్పాలంటె ఆమె టాలుస్టాయి గురించి చేసిన ఈ వ్యాఖ్యానం చూదాలి.

"టాలుస్టాయి కాలంలో, మార్క్సు ‘కాపిటల్’ అందుబాటులోనే వుంది. కనీసం ఆ సమాచారం అయినా అందుబాటులో వుంది. కానీ, టాలుస్టాయి “అహింసా, క్షమించడం” వంటి మత సూత్రాల్లో మునిగి వుండి, ఆ మూఢత్వాన్ని గొప్ప పవిత్ర ధర్మంగా తీసుకున్నాడు.
టాలుస్టాయికి, ‘వర్గాల’ సంగతి తెలియదు. అయినా, దీనుల సంక్షేమం కోసం తపించాడు. కానీ, పోరాటాల్ని సహించలేకపోయాడు."

ఈ పద్ధతిలో సమాజాన్ని పరిశీలించాలంటే మార్క్సుకి పూర్వం ఉన్న పరిశీలనా పద్ధతులన్నిటినీ తిరస్కరించాలి.
సమాజాన్ని వర్గ పోరాటం దృష్టితో మాత్రమే చూడాలి.
ఏది సత్యం, ఏది అసత్యం, ఏది ఒప్పు ఏది తప్పు, ఏ సమస్యకు ఏది సరైన పరిష్కారం, ఇలాంటి ప్రశ్నలన్నింటికి జవాబులు వర్గ పోరాటం దృష్టితో కాకుండా మరొక కోణం లో నుంచి చూడాలన్న ప్రయత్నాలు మానుకోవాలి.

మార్క్సు బోధించిన వర్గ పోరాటం పద్ధతిలో కాకుండా టాలుస్టాయి లాగ సమస్యలకు పరిష్కారాలు మరో పద్ధతిలో అన్వేషించటం మూఢత్వం.

ఎందుకంటే, "మార్క్సిజమే తెలియకపోతే" అనే రంగనాయకమ్మ గారి రచన ముఖ చిత్రం మీద sub-title చూడండి.

"మార్క్సిజమే తెలియకపోతే, పుట్టిన వాళ్ళం పుట్టినట్టుగానే ఉంటాం."
"మానవ సమాజానికి మార్క్సిజమే జ్ఞానోదయం, సూర్యోదయం."

Unknown చెప్పారు...

18 పర్వాలున్న మహాభారతంలో ఆవిడకి కొన్ని తప్పులు కనిపించి, అవి ఎత్తి చూపారు. ఆవిడ భారతం చదవదానికి ప్రథమ కారణం criticise చెయ్యాలని. ఆ భగవంతుడే ఈవిడని రక్షించాలి