సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

9, సెప్టెంబర్ 2014, మంగళవారం

ముఖచిత్ర వివాదం - బాపు Vs రంగనాయకమ్మ!


బాపు గీసిన బొమ్మల్లోని అందం, వైవిధ్యం నాకు ఇష్టం. 
ఆయన వేసిన కార్టూన్లలో గిలిగింతలు పెట్టే హాస్యం, క్యాప్షన్ల సహజత్వం నచ్చుతాయి.

బాపు తీసిన కొన్ని సినిమాల్లోని కళాత్మకత ; ఆయన దస్తూరి ఒరిజినాలిటీ, ప్రయోగశీలత- ఇవన్నీ బాగుంటాయి.

బాపు ముఖచిత్రంతో కొత్త పత్రికలు ప్రారంభించటం తెలుగునాట ఓ సంప్రదాయంగా కొనసాగింది.

తను ఆమోదించని భావాలున్న పుస్తకాలకు కూడా చక్కని బొమ్మలు వేశారు బాపు. 

‘మహా ప్రస్థానం’లోని ‘ఋక్కులు’ కవితకు కవి శ్రీశ్రీని హంస వాహనుడైన చతుర్ముఖ బ్రహ్మగా వేశారు.

  త్రిపురనేని రామస్వామి  ‘భగవద్గీత’ పుస్తకం ముఖచిత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడిలా  విషాదయోగంలో కూర్చుని ఉండగా రచయిత  రామస్వామి గీతాబోధ చేస్తున్నట్టు గీశారు.

 ( పల్నాటి యుద్ధంలో బాలచంద్రుణ్ణి ఉద్దేశించి తండ్రి బ్రహ్మనాయుడు చేసిన గీతోపదేశమే ఈ భగవద్గీత. ‘శకటములందెల్ల ధూమశకటము నేనే.. యెడారులలోన సహారా యెడారిని నేనే..  పద్యముల గంద పద్యము... విద్యల యందెల్ల జోర విద్యను నేనే ’- ఈ పద్ధతిలో వ్యంగ్య ధోరణిలో భగవద్గీతను పరిహసిస్తూ రాసిన సెటైర్ ఈ రచన).

 .   భాగవతంలోని పోతన  ప్రసిద్ధ పద్యం ‘కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి..’ చాలామందికి తెలిసిందే. ఆ తర్వాత కృష్ణుడి స్థితి ఏమైవుంటుందో ఊహించి  ఓ  కార్టూన్ వేశారు.  హాస్యం కోసం పురాణేతిహాస ఘట్టాలను ఉపయోగించుకున్న ఇలాంటి బాపు కార్టూన్లు చాలా ఉన్నాయనుకోండీ.

వీటిలోని  చమత్కారం బోధపడక  కోపాలు తెచ్చేసుకుని  నొసలు చిట్లించేవారూ, అపార్థం చేసుకుని విమర్శలు ఎక్కుపెట్టేవారూ ఉంటూనేవుంటారు. కానీ  కళాకారుడిగా బాపు కుంచెను స్వేచ్ఛగా ఉపయోగించారనీ, సంకుచిత సరిహద్దులేమీ గీసుకోలేదనీ చెప్పటమే నా ఉద్దేశం.  తన ఫెయిల్యూర్ సినిమాలపై తనే కార్టూన్లు వేసుకున్నహాస్య చతురత ఆయనకుందని చాలామందికి తెలుసు!     

ఎవరినీ నొప్పించని సున్నిత మనస్కుడిగా - వివాదాలకు అతీతంగా ఉండే వ్యక్తిగా అభిమానులు  ఆయన్ను చెపుతుంటారు. కానీ  ఆయన ‘అలా చేసివుండకూడదు’ అని గట్టిగా అనిపించే  సందర్భం ఒకటుంది. అది రంగనాయకమ్మ రచన ‘రామాయణ విషవృక్షం’ పుస్తకానికి బాపు ముఖచిత్రం వేయటానికి నిరాకరించిన తీరు గురించినది. 

* * *

అసలు జరిగిందేమిటి?
నలబై ఏళ్ళ క్రితం... 1974లో రామాయణ విషవృక్షం తొలి భాగం ప్రచురణ జరిగింది. రచయిత్రి నవలలు కొన్నిటికి అప్పటికే బాపు ముఖచిత్రాలు వేసివున్నారు.









దీంతో  బాపును విషవృక్షానికి ముఖచిత్రం వేయమని ఆమె అడిగారు. దానిలో ఏయే అంశాలు ఉండాలని భావిస్తున్నదీ ఉత్తరంలో  వివరించారు.

కానీ  ‘‘అంతంత ఎత్తయిన, గొప్పవయిన, ఆలోచనలు నా బోటివారు అర్థం చేసుకుని బొమ్మ వెయ్యడం సాధ్యం కాని పని’’ అని బాపు జవాబు ఇచ్చారు. ఆమె పంపిన డిమాండ్ డ్రాఫ్టు వెనక పెద్ద అక్షరాలతో  ‘‘రామ- రామ’’ అని రాసి తిప్పి పంపారు. 

దీని గురించి ‘రామాయణ విషవృక్షం’ మొదటి భాగంలో రచయిత్రి  ఇలా రాశారు-




దీనిలో బాపు పేరును ఆమె ప్రస్తావించలేదు.  ‘ఒక చిత్రకారుడు గారు’ అని మాత్రమే అన్నారు.  ఆ చిత్రకారుడు ఎవరో  కొందరు ఊహించినప్పటికీ... చాలామంది పాఠకులకు స్పష్టంగా తెలియదు.

దాదాపు మరో 20 సంవత్సరాల తర్వాత  బాపు రాసిన వ్యాసం ద్వారా ఆ చిత్రకారుడు ఆయనేనని పాఠకులకు అర్థమైంది.  ఆంధ్రజ్యోతి ఆదివారం ప్రత్యేక సంచికలో రాసిన ఆ వ్యాసంలో ఆయన ఇలా రాశారు-  
   
‘‘... ఇంకో సంఘటన - డబ్బులొచ్చాయి. కానీ సబ్జెక్టు కష్టం! రామాయణ కల్పవృక్షానికి ఎగెనెస్ట్ గా ‘రామాయణ విషవృక్షం’ అన్న పుస్తకం- ముఖచిత్రానికి చెక్కు పంపారు. అంత గొప్ప రైటరు? ప్రపంచ సాహిత్యంలో అగ్రస్థానం వహించిన ఆ గ్రంథాన్ని ఇలా  అర్థం చేసుకున్నారా అని చెక్కు వెనక  రామ! రామ ! అని రాసి తిరిగి పంపించేసా. అది ఆ గొప్ప రచయిత రచనా సామర్థ్యం మీద కామెంట్ కాదు. కేవలం జాలి. ’’

‘రామాయణ కల్పవృక్షానికి ఎగెనెస్ట్ గా..’-
రామాయణ కల్పవృక్షానికీ, రామాయణ విషవృక్షానికీ సంబంధమే లేదు. కేవలం పేర్లలో కల్పవృక్షం- విషవృక్షం అనే మాటలను బట్టి బాపు  ఇలా పొరపడ్డారు. ఈయనే కాదు; ఎంతోమంది సాహితీకారులూ , పాఠకులూ కూడా విశ్వనాథ  కల్పవృక్షంపై విమర్శగా రంగనాయకమ్మ విషవృక్షం రాశారని భావిస్తుంటారు. విషవృక్షాన్ని చదవకుండా, దానిలో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా  ఏర్పరచుకున్న పొరపాటు అభిప్రాయాలివి.

‘చెక్కు వెనక రామ! రామ ! అని రాసి తిరిగి పంపించేసా.’-
చెక్కు కాదు; డీడీ! ఇన్ని సంవత్సరాల్లో  చెక్కో, డీడీయో ఆయన మర్చిపోయారన్నమాట. 

ఒక పుస్తకాన్ని అందరూ ఒకే రకంగా అర్థం చేసుకోరు. రామాయణాన్ని మార్క్సిస్టులు ఆ దృష్టికోణంలోనే చూస్తారు. వారు భక్తుల కోణంలో చూడలేదని ఆశ్చర్యపడటంలో, జాలిపడటంలో అర్థం ఏముంటుంది? (రచయిత్రి  పవని నిర్మల ప్రభావతి  రామాయణాన్నీ; రామాయణ విషవృక్షాన్నీకూడా సమానంగా ఇష్టపడతారు. ఇదో మినహాయింపు).  

రామాయణ విషవృక్షానికి బొమ్మ వేయటం తనకు ఇష్టం లేకపోతే ఆ విషయాన్నేబాపు ... రచయిత్రికి  వ్యంగ్యాలేమీ లేకుండా సూటిగా/ మర్యాదగా/ సున్నితంగా చెప్పివుండాల్సింది. డీడీని కూడా యథాతథంగా వెనక్కిపంపివుండాల్సింది.  ‘తాను స్వీకరించదలచని’ డీడీ మీద ఏ రాతలైనా ఆయన ఎలా రాయగలిగారు?  

 


 బాపు వ్యాసం వచ్చాక...  గుంటూరు నుంచి ఎస్.వి. రాజ్యలక్ష్మి  అనే గుంటూరు  పాఠకురాలు ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలోనే  ఓ లేఖ రాశారు-

 ‘బొమ్మలు వేయించుకున్న పబ్లిషర్లెందరో డబ్బు ఇచ్చేటపుడు ఇబ్బంది పెట్టేవారని ఆయనే చెప్పుకున్నారు. అలాంటి మనుషుల మధ్య , రంగనాయకమ్మ బొమ్మ వెయ్యకముందే చెక్కు పంపించారంటే, అది ఆమె సంస్కారానికి గుర్తుగా కనపడుతోంది.  ఆర్టిస్టుకి ఇష్టమైతే బొమ్మ వేసి ఇవ్వాలి. ఇష్టం లేకపోతే చెక్కుని మర్యాదగా వెనక్కి పంపించెయ్యాలి. దానిమీద ‘రామ రామ’ అని గానీ, ‘కృష్ణ కృష్ణ’ అని గానీ , ఏదో ఒకటి రాయడానికి ఆయనకి హక్కు ఎలా వచ్చింది?’

ఈ ఉత్తరం బాపు చూశారో లేదో గానీ ఆయన ఆ వివాదంలో తన వైఖరికే చివరివరకూ కట్టుబడివున్నారని అర్థమవుతోంది.  ముఖీ మీడియా వారు  బాపు బొమ్మల కొలువు ప్రత్యేక సంచిక ( 2011)  వేస్తూ దానిలో  ఈ వ్యాసం పున: ప్రచురించటమే దీనికి రుజువు. (ప్రచురణకర్తలు బాపుకు చెప్పివుంటారు కదా... ఆ వ్యాసాన్ని వేస్తున్నామని...)   ‘కల్పవృక్షానికి ఎగెనెస్ట్ గా విషవృక్షం..’ అనే factual error కూడా ఆయన ఇన్నేళ్ళుగా గమనించనేలేదన్నమాట.  ఆయన  సన్నిహితులూ,  సాహితీ మిత్రులూ కూడా దీన్ని ఆయనతో ప్రస్తావించివుండకపోవటం విచిత్రం! 

జరిగింది ఇదీ !

బాపు కన్నుమూశాక ఆయన గురించి ప్రసారం చేసిన/ ప్రచురించిన టీవీలూ, కొన్ని పత్రికలూ, సంస్మరణ సభల్లో  కొందరూ  ఈ సంఘటనను ప్రస్తావించటం గమనించాను.  తనది కాని డీడీ వెనక రాతలు రాసి వెనక్కి పంపించటం సరికాదని వీరెవరికీ అనిపించలేదు. పైగా అలా చేయటంపై  ప్రశంసలు కూడా కురిపించారు .  ‘విలువలకు కట్టుబడటం’!  'ఈ పని నేను చెయ్యను అని చెప్పీ చెప్పకుండా చెప్పటం’! ‘నిజ జీవిత సమయస్ఫూర్తీ’, ‘తరగని రామభక్తీ’!...  ఈ రకంగా!   

కళాకారుడిగా బాపు కృషిని అభిమానించటం వేరు; ఒక ప్రత్యేక సందర్భంలో ఆయన తీరుపై విమర్శగా ఉండటం వేరు! దీనికి ఆయన సజీవంగా ఉన్నారా లేదా అన్నదానితో నిమిత్తం లేదు.   

* * *
కల్పవృక్షం... ఖండనం
సందర్భం వచ్చింది కాబట్టి  ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షము’ గురించి కొన్ని విషయాలు...  

విశ్వనాథ సత్యనారాయణ (1895- 1976) పద్యకావ్యంగా దీన్ని రాశారు. ఈ రచన 1932లో ప్రారంభమైంది. 1944- 1962ల మధ్య అన్నికాండల ముద్రణా పూర్తయింది.

ఈ రచనలో శబ్ద- అర్థపరంగా, ఛందోపరంగా ఉన్న లోపాలన్నీ వివరంగా పేర్కొంటూ కొత్త సత్యనారాయణ చౌదరి (1907- 1974) ‘కల్పవృక్ష ఖండనము’ రాశారు.  ఈ విమర్శ  ‘భారతి’లో 1961 జూన్-అక్టోబరుల మధ్య ప్రచురితమై, సంచలనం సృష్టించింది.  దానిపై ‘ఆంధ్రపత్రిక సారస్వతానుబంధం’లో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ చర్చనంతటినీ ఒకచోట కూర్చి 1962 జనవరి భారతి సంచికతో పాటు అందించారు.

ఇంత వివాదం జరిగినా 1970లో రామాయణ కల్పవృక్షానికి  జ్ఞానపీఠ బహుమతి వచ్చింది!

మరి ‘రామాయణ విషవృక్షం’ సంగతేమిటి?  ఇది వాల్మీకి రచించిన రామాయణంపై మార్క్సిస్టు దృక్పథంతో చేసిన పరిశీలన, విమర్శ.  ఇది వ్యాసాలుగా కాకుండా.. కథల  రూపంలో ఉంటుంది. అవసరమైనచోట వాల్మీకి మూలగ్రంథంలోని  శ్లోకాలూ, వాటి తెలుగు అర్థ తాత్పర్యాలూ, వివరణలూ ఫుట్ నోట్లుగా ఉంటాయి.



 ఈ పుస్తకానికి  ముఖచిత్రం అందించిన చిత్రకారుడు త్రిగుణ్!

45 కామెంట్‌లు:

hari.S.babu చెప్పారు...

‘తాను స్వీకరించదలచని’ డీడీ మీద ఏ రాతలైనా ఆయన ఎలా రాయగలిగారు?
>>
వెనకాల రాయదంలో తప్పేమి వుంది?బాంకు వాళ్లే ఇప్పుడు ఫోను నంబర్లు అవీ రాయమంటున్నారుగా! ఒకసారి ఒక వ్యక్తికి పంపించిన చెక్కుని గానీ డీడీని గానీ మరొక వ్యక్తికి పంపైంచతం కుదురుతుందా?అతను స్వీకరించనప్పుడు అదెటూ చెల్లనిదే అవుతుంది గదా!జాలి పుట్తి తన జాలిని వ్యక్తీకరించటం కోసమే అలా రాశాను అన్నప్పుడు ఇంక గొడవముంది?

G.P.V.Prasad చెప్పారు...

చనిపోయిన వారిని గురించి వ్రాయడం అవహేళన చెయ్యడం పరిపాటి అయ్యింది.
ఇక Marxism ఒక అబద్దం అన్నది జగమెరిగిన సత్యం అందులో సమానత్వం లేదు!
ఎందుకంటే అది యాంత్రికీకరణ వైపే మొగ్గు చూపుతుంది!
Modern way of slavery = Marxism

Surya Mahavrata చెప్పారు...

అదే విధంగా ప్రముఖ చిత్రకారులని 'చిత్రకారులు గారు ' అని వెటకారం చెయ్యటం కూడా ఆమెకి తగదని సూచించాల్సింది. కాని అలా చెయ్యం మనం ఎందుకంటే వ్యక్తుల్నీ రచనల్నీ దుయ్యబట్టడం కేవలం ఒక వర్గపు జన్మహక్కనీ మనం ఫిక్స్ అయిపోయేం. ఎవరి బుర్రకి తోచింది వాళ్ళు రాస్తూ ఊదరకొడుతున్నారు. వేసుకున్న పత్రికలు వేసుకుంటున్నాయి. ఒకపక్షాన్నే 'ఏమి హక్కుంది ' అని ప్రశ్నించే అధికారం మనకుందాని.

Narsimha Kammadanam చెప్పారు...

డీ.డి పైన బాపు గారి వివరాలేవి ఉండకపోవచ్చునా ..... ఈ సంధర్భం లో కూడా విషవృక్షం పైన మీరు చూపుతున్న అపార భక్తిభావం ఆస్తికత్వానికి పరాకాష్ట!.
రంగనాయకమ్మ గారికి నచ్చింది ఆమె ..రాసుకున్నారు బాబ్పు గారికి నచ్చింది ఆయన రాసుకున్నారు ....

తను రిజెక్ట్ చేయడానికి తను రయాల్సింది రాసారు .... దానికి అబ్యంతరం ఎవరికి ... ఎందుకు!!.

రమాసుందరి చెప్పారు...

కళను కళగా మాత్రమే చూస్తే బాపుగారు గొప్ప కళాకారుడు. ఒక మతానికి సంబంధించిన సాంప్రదాయ వస్త్రధారణతో ఆడపిల్లల, స్త్రీల బొమ్మలు వేసి ఆయన మధ్యతరగతి వర్గానికి ఆయన దగ్గర అయ్యారు. అయితే ఆయన బొమ్మల్లో సామాజిక, రాజకీయ విమర్శను నేను ఎక్కడా చూడలేదు. గొప్ప సంఘర్షణల యుగంలో పుట్టిన కళాకారుడు వాటికి అంటరానివాడిగా బ్రతికాడంటే అది కూడ ఆయన గొప్పతనంగా పొగిడేవాళ్ళకు ఏమీ చెప్పలేము. అసలు ఆ ఘర్షణలే ఆయన బతికిన సమాజంలో లేవనేవారి గురించి కూడ చెప్పేదేమి ఉండదు.

y.v.ramana చెప్పారు...

వేణు గారు,

పోస్ట్ చక్కగా రాశారు. 1970 లలో ఇదే విషయంపై నా మిత్రుల మధ్య జరిగిన చర్చ జ్ఞాపకం వస్తుంది.

మీ ధైర్యాన్ని అభినందిస్తున్నాను. ఇక బాపు భక్తుల నుండి విమర్శల వానకి రెడీగా వుండండి ('శ్రీరామరాజ్యం' పోస్టులో నాకు అనుభవం అయ్యిందిలేండి).

తెలుగు బ్లాగుల్లో బాపు, రంగనాయకమ్మల ప్రస్తావన వచ్చినప్పుడు rationale గా, objective గా చర్చ జరుగుతుందని అనుకోను.

(బాపు / రాముడి భక్తులకి ఆ డ్రాఫ్టు వెనక రాసిన 'రామ రామ' గొప్పగా అనిపిస్తుంది. ఈ భక్తికి రంగనాయకమ్మ వ్యతిరేకత కూడా తోడైతే మహా గొప్పగా వుంటుంది.)

hari.S.babu చెప్పారు...

@ramaa sundari
అయితే ఆయన బొమ్మల్లో సామాజిక, రాజకీయ విమర్శను నేను ఎక్కడా చూడలేదు
>>
ఆయన కార్టూన్లలో పొలిటికల్ కార్టూన్లు కూడా వున్నాయి.స్టేట్మెంట్లు ఇవ్వకపోయినా చుట్టూ జరుగుతున్న వాట్ని తచ్ చేశాడు.
వుదాహరణకి;

మాశ్టారు:సత్యం అంతే యేమిటిరా?
కుర్రాడు:మేటాసండి!

నండూరి వెంకట సుబ్బారావు చెప్పారు...

వేణు గారి వ్యాసం లక్ష్యం ఏమిటో స్పష్టంగా అర్థమవుతోంది. అందరూ బాపు చాలా గొప్ప మహానుభావుడని పొగుడుతున్నారు. కాదు ఆయన కూడా మామూలు మనషే. ఆయనలోనూ లోపాలున్నాయి అని ప్రకటించడం.
నిజమే బాపు కూడా మామూలు మనిషే ఆయనకూ రాగ ద్వేషాలున్నాయి. వాటిని ఆయన బాణీలో ఆయన వ్యక్తం చేశాడు. ఆయనగానీ, రమణగారూ కానీ తాము సామాన్య మానవ ప్రకోపాలకు అతీతమైనవారిమని ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ చెప్పుకోలేదు కదా! బాపు గారి వ్యక్తిత్వానికి నా ధృవపత్రం కానీ, వేణుగారి ధృవపత్రం కానీ అవసరం లేదు కదా

సుజాత వేల్పూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
శ్యామలీయం చెప్పారు...

ఒక డీడీ.
దానిని బాపుగారు తిరస్కరించారు. ఆయన కారణాలు ఆయనవి.
డీడీ పంపిన రంగనాయకమ్మగారు విషవృక్షం ఎందుకు వ్రాసారు? ఆవిడ కారణాలు ఆవిడవి.

ఒక డీడీని ఒకవ్యక్తికి పంపాక అది అందుకున్న వ్యక్తి స్వంతమే అవుతుంది. దానిని ఆయన ఏమైనా చేసుకోవచ్చును. బ్యాంకువారు తిరస్కరించే ప్రమాదం లేని విధంగా వీలైతే ఏదన్న వ్రాయవచ్చును కూడా దాని మీద. దానిని కళ్లకద్దుకుని సొమ్ము చేసుకోవచ్చును. పటం‌ కట్టుకుని దాచుకోవచ్చును. లేదా దానిని చించి పోగులు చేసుకోవచ్చును. ఇతరులకు విమర్శించటానికి ఏమీ లేదు. చివరికి డీడీ ఇచ్చిన వారు కూడా ఇక్కడ ఇతరులే. అలాగే సదరువ్యక్తి దానిని తిప్పి పంపవచ్చును - ఐనా అది అది ఎవరిపేరున ఇవ్వబడిందో వారి ఆస్తి మాత్రమే. అది వద్దని తిరస్కరించే హక్కుంది కదా. తిరస్కరించి చెల్లకుండా చేయకూడదని అనలేరు. అలాగే ఆ డీడీ మీద ఏమీ వ్రాయకూడదని రూలేం లేదు - దాని స్వంతదారు ఇష్టం ఈ‌ విషయంలో. ఏమీ వివాదం లేదిక్కడ.

మార్క్సిష్టు విమర్శ అనే పేరుతో స్వకపోల కల్పనలు చేసి పుస్తకం వేసుకునే హక్కు రంగనాయకమ్మకు ఉంటె ఉన్నట్లే, దానిని నిరసించే హక్కూ‌బాపూగారికి ఉంది నిర్మొగమాటంగా. మార్క్సిష్టూ ఐనందుకు రంగనాయకమ్మ సిగ్గుపడనవసరం‌ లేదు - అలాగే రామభక్తుడు ఐనందుకు బాపూ‌కూడా సిగ్గుపడనవుసరం‌ లేదు. ఆవిడకు తోచినపని ఆవిడ చేసింది రామవ్యతిరేకక్రియగా ఒక పుస్తకం రూపంలో. బాపూగారు అయనకి తోచింది ఆయన చేసారు రాఅమభక్తిప్రకటన రూపంలో.

ఇకపోతే రమాసుందరిగారు విషయానికి tangential గా ఏరో వ్రాసారు. అసందర్భం. పికాసో కాలంలో బ్రతికిన వాళ్ళందరకూ క్యూబిజం గురించి బ్రహ్మాండంగా తెలియాలీ బొమ్మలేయటం బాగారావాలీ చచ్చినట్లు అన్న రూలుందా? లేదు కదా? ప్రపంచం బహుముఖమైనది. మీరు అనుకున్న కోణంలోంచి చూసూ బ్రతక్కపోతే ఏదో ద్రోహులు నిష్ప్రయోజకూలూ అన్నట్లు రమాసుందరిగారు ఆలోచించటం ఆవిడ హ్రస్వదృష్టి మాత్రమే.

రమణగారు బాపూభక్తులదాడి అంటూ హెచ్చరికలు జారీచేసారు. కానీ‌ నేనేమీ బాపూ‌భక్తుణ్ణి కాను. శ్రీరామరాజ్యం ఒక డొక్కుసినిమా అని నా ఉద్దేశం. దానర్థం బాపూకు దర్శకత్వం రాదని నా అభిప్రాయం కాదు - ఆ సినిమా వెనుక బిజినెస్ వాళ్ళ హస్తవాసి ఎక్కువ బాపూ హస్తవాసి కన్నా. ఆముదపు చెట్టు మహావృక్షం అనే కాఅంలో అది ఒక గొప్ప సినిమా ఐపోయిందేమో. నేను compromise కాలేను
అదే ఊపులో మరో‌మాటా చెప్పాలి రంగనాయకమ్మగారి కొన్ని రచనలు నాకు నచ్చాయి- కొన్ని రచనలు నచ్చలేదు. కొన్ని బాపూ సినిమాలు నచ్చి కొన్ని నచ్చనట్లు. అంతే.


వేణూ గారన్నట్లు మన ధ్రువపత్రాలేవీ‌ బాపుకు అవసరం లేదు. రంగనాయకమ్మకూ అవసరం లేదు ఆ మాటకు వస్తే. అలాగే
కేవలం‌ బాపూవ్యక్తిత్వంలో లోపాలెంచటం కోసం ఆయన్ను కించపరచటం వలన కూడా ఏమీ ప్రయోజనం లేదు.

Jai Gottimukkala చెప్పారు...

బాపు సినిమాలలో ఆయన ఆస్తికత్వం (ముఖ్యంగా రాముడి భక్తి) స్పష్టం. అయితే చిత్రకారుడి అవతారంలో ఆయనకు రాముడికి సంబంధం లేదు.

ఆకాలంలో చిత్రకారులలో బాపు అగ్రగణ్యులు. తన వ్యక్తిగత నమ్మకాలకు అనుగుణంగా మాత్రమె బొమ్మలు గీసేవారని చెప్పలేము. రంగనాయకమ్మ ఆయనను డబ్బిస్తే ఏదయినా చిత్రించే ఒక మేటి చిత్రకారుడిగా చూడడం కరెక్టే. బాపు professionalగా కాక వ్యక్తిగతంగా (as a believer) రియాక్ట్ అవడం సబబు కాదని నా అభిప్రాయం.

నీకెందుకు నువ్వు నాస్తికుడివి అనో, ఆంద్ర icon ను మీ తెలంగాణా వాళ్ళు ఎందుకు తక్కువ చేస్తున్నారు అంటే నా దగ్గర సమాధానం లేదు.

If this is the bench marking of icons, I have no comments.

కమనీయం చెప్పారు...



నేను రామాయణ విషవృక్షం ' ఇంతకుముందు చదివేను.నాకు నచ్చలేదు.రామాయణాన్నివిమర్శించినందుకు కాదు.చాలామంది విమర్శించారు.ఆవిడ విమర్శించినపద్ధతి బాగు లేకపోవడం వల్లనే.ఒకక్లాసిక్ ని వెటకారంతో,ఎకసక్కంగా,అసహ్యంగా విమర్శించినందుకే.
ఇక బాపుగారు డి.డి నితిరస్కరించినందుకూ.వెనకా రామ రామ 'అనిరాయడానికి హక్కు వుంది.

Krishna చెప్పారు...

బాపు గారికిఒక పంపి ముఖ చిత్రం వెసి ఇయ్యమనే హక్కు రచయిత్రి గారికి ఎంత ఉందో ..ఆ ని తిరిగి పంపి వెనక ఎదైనా రాసే హక్కు బాపు గారికి ఉంది...

Krishna చెప్పారు...

"రామాయణ కల్పవృక్షానికీ, రామాయణ విషవృక్షానికీ సంబంధమే లేదు. "విషవృక్షం అనే పేరు ఎల ఒచ్చింది అని మిరు అనుకుంటున్నారు ?

కల్పవ్రిక్ష ఖండన
ప్రస్తవన చెసిన మీరు విషవ్రిక్ష ఖండన ప్రస్తావన చెయలెదు ?

Saahitya Abhimaani చెప్పారు...

I agree with Shri Kamaneeyam garu. Ramanagaru is unsuccessfully trying to show holier than thou attitude and appearing to be standing on a high pedestal as is the normal behaviour for Leftists.

Venu garu your article is not in good taste for the simple reason of its timing.

It is a very strange parody that when Ranganayakamma chose to write a cheap satire on Ramayanam in the name of criticism which is an epic and holy book for millions of Hindus, it is OK for you, but when Bapu chose to refuse to draw picture for such book and returned that cheque/DD by writing Rama Rama on the back of it is termed objectionable by you and your ilk. On the same analogy, Ranganayakamma has no right to write her writings about Ramayana in public domain hurting millions of Hindus. What Bapu wrote on the back of the Cheque/DD was not in public domain and she chose to put it in public domain in her unsuccessful and mischievous attempt just to malign Bapu. But the reverse happened as Bapu earned thousands more Fans with that episode.

బాలు చెప్పారు...

వేణు గారు.. మీ టపా చదువుతున్నప్పుడు నాకు కలిగిన భావాలన్నీ సుజాత గారు చెప్పేశారు.
(I second sujatagaru)
నావంతు ఇంకోటి.. ‘రామదాసు గుణం వ్యక్తపరచుకున్నాడు’
అంటే, బాపు గారు ‘రామదాసు’ అని తెలిసే ఆవిడ పంపిందన్నమాట. బాపుగారు చేసిన తప్పేమీ లేదు. టిట్ ఫర్ టాట్. అచ్చతెలుగులో చెప్పాలంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ.

బాపు గారు చేసింది తప్పనే మీ వాదన నిజమైతే.. ఆయన ‘రామదాసు’ అని తెలిసి కూడా అడగడం ఆవిడ తప్పు. ఈయన్ది తప్పనే ముందు ఆవిడది తప్పని ఒప్పుకోండి.

యరమణగారూ.. :)
కమ్యూనిస్టులు.. అందునా రంగనాయకమ్మ భక్తులైతే వాళ్లని పట్టుకోవడం ఎవరివల్లా కాదప్పా

lakshman చెప్పారు...

ఆవిడ విమర్శించినపద్ధతి బాగు లేకపోవడం వల్లనే.ఒకక్లాసిక్ ని వెటకారంతో,ఎకసక్కంగా,అసహ్యంగా విమర్శించినందుకే.
ఇక బాపుగారు డి.డి నితిరస్కరించినందుకూ.వెనకా రామ రామ 'అనిరాయడానికి హక్కు వుంది.

శ్యామలీయం చెప్పారు...

శ్రీగొట్టిముక్కలవారు, రంగనాయకమ్మ ఆయనను డబ్బిస్తే ఏదయినా చిత్రించే ఒక మేటి చిత్రకారుడిగా చూడడం కరెక్టే అన్నారు. దానికి వారు చూపిన కారణం బాపుగారు తన వ్యక్తిగత నమ్మకాలకు అనుగుణంగా మాత్రమె బొమ్మలు గీసేవారని చెప్పలేమన్నది.

బాపుగారు వ్యంగ్యం స్థాయి వరకూ విమర్శనాత్మకమైన ధోరణిలో ఉన్న రచనలు ఒకవేళ తనవ్యక్తిగత విశ్వాసాలకు అనుగుణంగా లేకపోయినా, నొచ్చుకోకుండా వృత్తిధర్మంగా బొమ్మలు వేసి ఇచ్చేవారని నా అభిప్రాయం. రంగనాయకమ్మగారి రామాయణ విషవృక్షం సంగతి వేరు. అది విమర్శలతో కాదు నిందలతో నిండిన పుస్తకం. అందుచేత బాపుగారు హర్షిచలేకపోయారు. నిందలను బలపరుస్తూ తనపేర కొంత సరుకు (బొమ్మ(లు)) జత చేర్చి తానూ ఆ నిందల్లో (బొమ్మవేయటంద్వారా) భాగస్వామి కాదలచుకోలేదు. అందుకే తన ఆక్షేపణ తెలియచేసారు. ఇందులో ఆయన్ను తప్పుపట్టటం ఆయన భావవ్యక్తీకరణస్వేఛ్ఛను తప్పుపట్టటమే!

బాపుగారి డబ్బిస్తే ఏదైనా చిత్రించటం అన్నప్పుడు, డబ్బుకోసం ఆత్మను అమ్ముకున్న వ్యక్తిగా భావించటం స్ఫురిస్తోంది కాబట్టి అలా చూడటంలో కొంతగా సామజస్యం లోపించిందని నా ఉద్దేశం. ఎవరన్నా డబ్బిస్తే బాపుగారు బూతుబొమ్మలు వేసిచ్చేవారా మాటవరసకి అడుగుతున్నాను? ఎక్కడో అక్కడ విలువల కోసం ఆర్టిష్టు రాజీపడకుండా ఆగుతాడు - ఒకరిచ్చే డబ్బు ఎంతన్నది చూడకుండా. బాపుగారు చేసినదీ అదే.

అజ్ఞాత చెప్పారు...

పది రోజులు ఆలస్యం చేశారేం. అప్పుడే వేసి ఉంటే మరింత సందర్భోచితంగా ఉండేది.

1. 1974లో రామాయణ విషవృక్షం మొదటి భాగం ప్రచురణకు వచ్చే నాటికే బాపు కేవలం చిత్రకారుడు కాదు... లబ్ధప్రతిష్టుడైన దర్శకుడు కూడా. 1971 లోనే సంపూర్ణ రామాయణం విడుదలైంది. బాపు రామభక్తి అప్పటికే వేలాది చిత్రలేఖనాల్లో బహిర్గతం. అయినా కూడా, రంగనాయకమ్మ గారు తన రచనకు ముఖచిత్రం వేయమని బాపూను కోరడానికి కారణం ఏమిటి? బాపూ బొమ్మల వల్ల మాత్రమే తన రచనలు అమ్ముడుపోతాయని ఆమె భావించారా? ఆమె వ్యక్తిత్వం అంత సంకుచితమైనది కాదు కదా. ఉద్దేశపూర్వకంగానే ఆమె తన రచనకు ముఖచిత్రం వేయమని కోరారు కదా.

2. రంగనాయకమ్మ గారు ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యకు బాపు నుంచి ప్రతిచర్య ఉండదని ఆమెకు కానీ, ఇతరులకు కానీ తెలియదా? వ్యంగ్యం ఒక వర్గానికి చెందిన వారు తాము వ్యతిరేకించే వర్గం వారి మీద ప్రయోగించడానికి మాత్రమే ఉందా? సంస్కారం ఏకపక్షంగా మాత్రమే ఉండాలా?

3. 'అంతంత ఎత్తయిన... వెటకారాలు కురిపించారు...' ఇదంతా రంగనాయకమ్మ గారి ఇంటర్ ప్రిటేషనే కదా. బాపు ఆ మాటలు అన్నారో లేదో తేల్చేదెవరు? బాపు, మరో చిత్రకారుడు విషవృక్షానికి బొమ్మలు వేయనందుకు వారికి వ్యంగ్యంగా కృతజ్ఞతలు చెప్పారే... మరి వారితోనే ఆ చిత్రాలు వేయించుకోవాలని ఎందుకు అనుకున్నారు? వారిని కవ్వించడానికేగా. అది కవ్వింపు కాకపోతే... వారి చిత్రాల ద్వారా పుస్తకం అమ్మకాలు మరింత పెంచుకోవాలన్న ఎత్తుగడా? అది నెరవేరలేదన్న బాధా?

4. 'కల్పవృక్షానికి ఎగెనెస్ట్ గా... బాపు పొరపడ్డారు...' మీరు సరిగ్గా చెప్పారు. విషవృక్షం... కల్పవృక్షానికి విమర్శ కాదు. (విమర్శ అంటే తిట్టడం అన్న ఉద్దేశంలో వాడడడం లేదు, సాహిత్యవిమర్శ అన్న అర్ధంలో వాడుతున్నాను) విశ్వనాథ కల్పవృక్షానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులు, విశ్వనాథ అన్ని రచననల్లాగే దానిమీద కూడా జరిగిన చర్చోపచర్చలు రంగనాయకమ్మ గారికి స్పష్టంగా తెలుసు. ఆ పేరుకు దగ్గరగా ఉంటే, అదీ సంచలనాత్మకంగా ఉంటే ప్రజా బాహుళ్యానికి బాగా దగ్గరవుతుంది కదా. ఆమె ఉద్దేశం అది అయినా (అవునని నేరుగా ఒప్పుకోరు కదా) కాకపోయినా దగ్గరి పేర్ల వల్ల వచ్చే పోలిక లాభదాయకం. మంచి వ్యూహమే.

5. 'రచయిత్రికి వ్యంగ్యాలేమీ లేకుండా, సూటిగా, మర్యాదగా, సున్నితంగా...' మౌలికంగా బాపు గారు హాస్యప్రియుడు కదా... వ్యంగ్యం వద్దన్నా తన్నుకువస్తుంది. ఇక డీడీ ఆమె చిరునామాకే తిప్పి పంపించారు కదా... అది సూటిగానే చేరుకుంది కదా. రంగనాయకమ్మ గారి మర్యాదను బాపు ఎక్కడ అతిక్రమించారు? సున్నితంగా కాక దుడ్డుకర్ర పుచ్చుకుని నడుములు విరగ్గొట్టారా?

6. తాను స్వీకరించదలచని డీడీ మీద ఏ రాతలైనా ఆయన ఎలా రాయగలిగారు? మంచి ప్రశ్న వేశారు. తనేమిటో తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా తనను కవ్వించడానికి చేసిన చర్యకు స్పందించడం తప్పు మాత్రమే కాదు, మహానేరం కూడా. రాజ్యలక్ష్మిగారు చెప్పినట్టు రంగనాయకమ్మగారికి ఉన్న సంస్కారంలో నలుసంతైనా బాపుగారికి లేదు మరి. ఆ బాపూలా, ఒక చెంప మీద కొట్టిన వారికి రెండో చెంప చూపేంత సంస్కారం ఈయనకు లేదు మరి. ఇలాంటి వాడు తెలుగువాడిగా పుట్టడం ఈ జాతి దౌర్భాగ్యం.

కొసరు కొమ్మచ్చి :
'పురాణేతిహాసాలపై బాపు వేసిన కార్టూన్ల మీద కోపగించుకున్న వారూ, అపార్ధం చేసుకుని విమర్శలు ఎక్కుపెట్టేవారూ ఉంటూనే ఉంటారు...' ఇప్పటివరకూ మీకు అలాంటివారు ఎవరైనా కనిపించారా? ఎంఎఫ్ హుసేన్ చిత్ర లేఖనాల వెనుక ఉద్దేశాలకూ, బాపు హాస్యచతురతకూ తేడా తెలీని అలాంటి వారు (ఒకవేళ ఉంటే) బాపును నిందిస్తూ చేసిన విమర్శలు ఏమైనా పబ్లిక్ సర్క్యులేషన్లో ఉన్నాయా? లేనప్పుడు ఇలాంటి బ్లాంకెట్ స్టేట్మెంట్ల లక్ష్యం ఏంటి?

Jai Gottimukkala చెప్పారు...

శ్యామలీయం మాస్టారూ, బాపు గారి స్వేచ్చను నేను తప్పు పట్ట్లలేదు. ఆయన తన నిరసన ఒక భక్తుడిగా కాక చిత్రకారుడిగా తెలియచేసుంటే బాగుండేది అన్నదే నా ఉద్దేశ్యం.

As he received the request in his status as a cartoonist, he could have replied in the same role (e.g. by sending in a drawing showing Ram in positive light).

జయహొ చెప్పారు...

మనదేశం లో దాదాపు అన్ని మతాల వేషధారణ ఒకేవిధంగా ఉంట్టుంది. కళ్లు మాత్రం కనిపిస్తూ వస్త్రాలు ధరించే సాంప్రదాయం ఉన్న ఆడపిల్లల, స్త్రీల బొమ్మలు వేయటానికి ఒక కళాకారునిగా బాపు గారి కి ఉన్న స్కోప్ ఎమిటి? కుంచే ఇస్తే చిన్న పిల్లలు కూడా వేయగలరు.

శ్యామలీయం చెప్పారు...

తన నిరసన ఒక భక్తుడిగా కాక చిత్రకారుడిగా తెలియచేసుంటే బాగుండేదని జైగారి అభిప్రాయం.

ఒక చిత్రకారుడిగా ఒక బొమ్మ వేయటం పట్ల తనకు అభ్యంతరం ఉన్నసందర్భంలో పారితోషికంగా అందిన దాన్ని తిప్పిపంపి నిరసన తెలియజేసారు. సబబే.

అలగే, రామాయణం అనే ఆరాధ్యగ్రంథాన్ని అకటావికటపు విమర్శలతో నిందించినందుకు నిరసనగా, ఒక రామభక్తుడిగా బాపుగారు 'రామరామ' అని వ్రాసారు. అదీ సబబే.

ఒకవేళ బాపుగారు ఆ డీడీ మీద ఏమీ వ్రాయకుండా రామరామ అని మరొక కాగితం మీద వ్యాఖ్యానించి డీడీతో జతపరచి తిప్పి పంపిఉంటే అది బాగుండేదా? ఏమో, మన విమర్శక రంధ్రాన్వేషక మిత్రులు బాపుగారు అనవసరంగా ఒక కాగితం వృధా ఎందుకు చేసారూ, అదే డీడీమీద ఒక రామరామ అని వ్రాస్తే పోయేదానికీ అని సాగదీసేవారు కాదా?

sarma చెప్పారు...

Good post

y.v.ramana చెప్పారు...

i enjoyed the comments also.

this is like deja vu for me after so many years.

thank you.

Dr. IVNS Raju చెప్పారు...

కుప్పించి ఎగసిన పద్యం భారతం ఆంధ్రీకరించిన తిక్కన గారు వ్రాయలేదు భాగవతం తెలుగులో వ్రాసిన పోతన గారు వ్రాసింది.
విష వృక్షం రచయితకు ఉన్న భావ వ్యక్తీకరణ స్వేచ్చే బాపూ గారికీ రామ రామ వ్రాయడం లో ఉంది. వ్యక్తులు లను బట్టి భావ వ్యక్తీకరణ స్వేచ్చే కు ఉన్న నిర్వచనం మారదు కదా !!

Dr. IVNS Raju చెప్పారు...

మరొక్క మాట:
విషవృక్షం వ్రాసి రామాయణాన్ని బాహాటం గా ఎద్దేవా చేసే హక్కు రచయిత ఉన్నపుడు బాపూ గారు తన నిరసనను ప్రైవేటు గా ఆ రచయితకు తెలపడం లో ఆయన భావ వ్యక్తీకరణ స్వేచ్చ కు ఒక చక్కని అర్థాన్ని ఇచ్చారు. ఇది మీరు మీ బ్లాగ్ ద్వారా బాహాటం చేసి ఆ "హక్కు" ని వాడుకున్నారు !!

వేణు చెప్పారు...

Dr. IVNS Raju గారూ, మీకు కృతజ్ఞతలు. ఈ పద్యం భాగవతంలోనిదే. భారతయుద్ధ ఘట్టం కాబట్టి రాసింది తిక్కన అని పొరబడ్డాను!

వేణు చెప్పారు...

ఈ పోస్టు బాపుపై వ్యతిరేక ధోరణితో రాసింది కాదు!

బాపుపై నాకున్న అభిమానం తెలిపే పోస్టులు ఈ బ్లాగులోనే ఉన్నాయి. పాత పోస్టులదాకా ఎందుకూ? దీనికంటే 9 రోజుల ముందే ‘కొసరు కొమ్మచ్చి’ పుస్తకంపై ‘రమణకు అపురూప నివాళి ’పోస్టు రాశాను. దానిలో బాపు ప్రస్తావన కూడా ఉంది.

‘డీడీ వెనక రామ రామ రాసి వెనక్కి పంపటం’బాపు గొప్పతనానికి ప్రతీకగా పేపర్లలో, టీవీల్లో, సంస్మరణ సభల్లో కొందరు విరివిగా కోట్ చేశారు. ఆ సంఘటన ఆయన కీర్తిని చాటేది కాదనీ, ఆయన అలా చేసివుండకూడదనే అభిప్రాయం నాది. అందుకే దాని పూర్వాపరాలు చర్చిస్తూ ఈ పోస్టు రాయాల్సివచ్చింది.

ఒకరిపై అభిమానం చూపేవారు ఒకానొక సందర్భంలో వారిపై విమర్శగా కూడా ఉండొచ్చు. అంతమాత్రాన అది వారి వ్యక్తిత్వంలో లోపాలెంచటం- కించపరచటం అవ్వదు. అభిమానులందరూ ఒకే రీతిలో ఉండరు కదా?

ఒక వివాదాస్పద విషయం మంచి చెడులను చర్చించుకోవటానికి ఆ వివాదంలోని వ్యక్తులు సజీవంగా ఉన్నారా లేదా అనేదానితో నిమిత్తం లేదనేది నా దృఢాభిప్రాయం. దీనిలో చనిపోయినవారిని హేళన చేయటంలాంటిదేమీ లేదు!

* * *
బాపు వెటకారాలను ప్రస్తావించి విమర్శించారు కాబట్టి రంగనాయకమ్మ- తాను వ్యంగ్యం లేకుండా ఆ ముఖచిత్ర వివరణ రాసివుండాల్సింది. నిజమే! దీన్ని నేను ఈ పోస్టులోనే రాసివుంటే పోస్టు ఇంకా బాగుండేది.

‘కల్పవృక్ష ఖండన’ను ప్రస్తావించి ‘విషవృక్ష ఖండన’ గురించి ఎందుకు రాయలేదని Krishna అనే వ్యాఖ్యాత అడిగారు. రాయకూడదనేమీ లేదు. రామాయణ విషవృక్షానికి వ్యతిరేకంగా తెన్నేటి హేమలత రాసిన ఈ ‘విష వృక్ష ఖండన’ ప్రచురణ కాలం, ఇతర వివరాలు ఎక్కడా దొరకటం లేదు. ఆ పుస్తకం కోసం చాలాకాలంగా ప్రయత్నిస్తున్నాను. (ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం కాలేజ్ లైబ్రరీలో చదివాను).

* * *
@ puranapandaphani: >> 'పురాణేతిహాసాలపై బాపు వేసిన కార్టూన్ల మీద కోపగించుకున్న వారూ, అపార్ధం చేసుకుని విమర్శలు ఎక్కుపెట్టేవారూ ఉంటూనే ఉంటారు...' ఇప్పటివరకూ మీకు అలాంటివారు ఎవరైనా కనిపించారా? ఎంఎఫ్ హుసేన్ చిత్ర లేఖనాల వెనుక ఉద్దేశాలకూ, బాపు హాస్యచతురతకూ తేడా తెలీని అలాంటి వారు (ఒకవేళ ఉంటే) బాపును నిందిస్తూ చేసిన విమర్శలు ఏమైనా పబ్లిక్ సర్క్యులేషన్లో ఉన్నాయా? లేనప్పుడు ఇలాంటి బ్లాంకెట్ స్టేట్మెంట్ల లక్ష్యం ఏంటి? >>

బాపు కార్టూన్లలో హాస్యాన్ని చూడకుండా అపార్థం చేసుకున్న సంప్రదాయవాదులు నాకు తెలుసు. ఇక మీ ప్రశ్నలోని పోలికకు సరిగ్గా సరిపోయే విమర్శ 2012లో రాణి శివశంకరశర్మ ప్రచురించిన ‘అమెరికనిజం’ పుస్తకంలో ఉంది. ఆ పుస్తకంలోని లౌక్యాభిరామాయణం అనే ప్రకరణం చదవండి.

కాళిదాసు కుమారసంభవం, భాగవత పురాణంలోని ఘట్టాలు గుర్తుకుతెచ్చేలా ఎం.ఎఫ్. హుస్సేన్ చిత్రకళలో సంప్రదాయం, భారతీయ తత్వం ప్రస్ఫుటంగా కనిపిస్తాయనీ; మర్యాదల్ని అతిక్రమించలేని బాపు లౌక్యపు చిత్రకళలో సంప్రదాయం లేదనీ, ఆయన బొమ్మల్లో వైవిధ్యం శూన్యమనీ రాణి శివశంకరశర్మ వాదిస్తారు.

(హుస్సేన్ చిత్రకళను నేనంతగా పరిశీలించలేదు. కానీ బాపు బొమ్మల్లో వైవిధ్యం లేదనే అభిప్రాయాన్ని నేను అంగీకరించను.)








రవి చెప్పారు...

బ్లాగుల నుంచీ చాలా కాలంగా దూరంగా ఉండి ఈ పోస్టు ఇప్పుడే చూస్తున్నాను. బాపు గురించి కాకుండా, ఈ పోస్టులో మరొక ప్రధానాంశం రామాయణ విషవృక్షం -> రామాయణ కల్పవృక్షానికి వ్యతిరేకంగా వ్రాసింది కాదు అన్న విషయం పై నా అభిప్రాయం ఇది.

క్రితం వారం విశ్వనాథ సత్యనారాయణ గారిపైన శ్రీరమణ గారు ఒక వ్యాసం వ్రాశారు సాక్షిపత్రికలో. అందులో ఈ విషయమూ వచ్చింది.దాని పూర్వాపరాలు ఇవి.

శ్రీరమణ గారి అభిప్రాయం ప్రకారం "వి.స.నా గారు తమ చెలియలికట్టను మైదానం కు వ్యతిరేకంగా వ్రాయలేదు". వి.స.నా గారు ఈ మాట చెప్పకపోయినా శ్రీరమణ గారికి ఆ విషయం అర్థమైపోయింది.అందుకే అలా వ్రాశారు.

కానీ రంగనాయకమ్మ - తన పుస్తకం కల్పవృక్షాన్ని చూసి వ్రాసింది కాదు అని స్వయంగా చెప్పినా, ఆ పుస్తకం ద్వారా అర్థమైనా కూడా ఆ సంగతి శ్రీరమణ గారు ఒప్పుకోరు. కల్పవృక్షం ప్రేరణలో విషవృక్షం వచ్చింది అని చెప్పి అంతటితో ఊరుకోక, విశ్వనాథ గారి "థూ..థూ" లను ప్రస్తావించారు.

శ్రీరమణే కాదు, విసనా భక్తులెవరూ కూడా ఒప్పరు. పైగా ఆమె ఉద్దేశ్యాల వరకూ వెళతారు. విశ్వనాథ ఉద్దేశ్యాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు - సంగతి వేరుగా ఉంటుంది. ఆయన ఉద్దేశ్యాలు కాదు, రచనల బాగోగుల గురించి మాత్రమే మాట్లాడాలి అందరూ.

రంగనాయకమ్మ గారి పుస్తకానికి ప్రేరణ మార్క్స్. కల్పవృక్షం కాదు. ఇది విషవృక్షం చదివిన వాడెవడైనా చెబుతాడు. మరి అంత స్పష్టంగా తెలిసీ కల్పవృక్షం ప్రస్తావన ఎందుకు తీసుకువస్తున్నారు? ఇక్కడ ఎవరు ఎవరి పేరును పబ్లిసిటీగా ఉపయోగించుకుంటున్నట్టు?

hari.S.babu చెప్పారు...

@venu
మీరు నిజంగా నిష్పక్షపాతంగా వుంటే నా కామెంటును యెందుకు బ్లాక్ చేసారు?ఆవిడ విమర్శించిన పధ్ధతి యెలా వుందో చూపించతమే గదా నేను చేసింది!
@ravi
రంగనాయకమ్మ గారి కల్పవృక్షానికి ప్రేరణ మార్క్స్ అని చెప్పారు, బాగానే వుంది!కానీ అందులో మార్క్స్ గారు చెప్పిన సిధ్ధాంత పరమయిన విమర్శ యెక్కడుందో చెప్పగలరా?

రామాయణంలో వున్న అంతఃసార మేమిటి?ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి బతికే ధర్మానికి వాళ్ళిద్దరినీ వుదాహరణగా తీసుకుంటూ ప్రాస్తావికంగా ఇతరమయిన వాట్ని కూడా కలిపి కధా రూపంలో చెప్పడం, అంతేనా? అసలు రాముడు శూర్పణఖని తిరస్కరించటమే తప్ప యే విధమయిన వికారానికీ లోను కాలేదని వాల్మీకి చూపిస్తే - అసలు అలా జరగలేదు, నేను చూశాను లొట్ట లేసుకుంటొ చూశాడు అనే పధ్ధతిలో రాయటం మార్క్సీయ విధానం ప్రకారమే జరిగిందా?ఆవిడ వెక్కిరించాలనుకున్న అసలు రాముడు ఇప్పటికీ గౌరవించబడుతూనే వున్నాడు!ఆవిడ వెక్కిరించింది తను సృష్టించిన మరో రకమయిన రాముణ్ణి, కాదా?దేన్ని విమర్శించాలని బయల్దేరి దేన్ని విమర్శించింది?గ్లాసుడు మంచినీళ్ళ సిధ్ధాంతాన్ని ఫాలో అయ్యారని మావోనీ మావో భార్యనీ తిట్టి దానికి భిన్నమయిన రాముణ్ణీ సీతనీ కూడా తిట్టి ఆవిడా ఆవిడ అభిమానులూ సాధించిందేమిటి?

పెళ్ళాన్ని యెవడో యెత్తుకెళ్తే యేడ్చిన వాడు వీరుడెట్లా అయ్యాడు అనేసింది, అదే నోటితో స్నేహితుడు చచిపోతే భోరు మని యేడ్చిన స్పార్తకస్ని మహా వీరుడని కీర్తించింది, నిజమా కాదా?

తనె కమ్యునిష్టులూ కమ్యునిష్టేతరులూ అనే వర్గభెదాన్ని వొదుల్చుకోలేని దుస్థితిలో వుండి వర్గద్వేషంతో అవాకులూ చెవాకులూ పేలే తను వర్గరహిత సమాజం గురించి మాట్లాడట మేమిటి చెత్తగా!

వేణు చెప్పారు...

@ Hari Babu Suraneni: మీ వ్యాఖ్య ఎందుకు పబ్లిష్ అయి, తర్వాత డిలీట్ అయిందో కారణం అడుగుతున్నారు మీరు!

మీ వ్యాఖ్య పబ్లిష్ చేశాక అదే వ్యాఖ్య మరో బ్లాగులోనూ కనపడింది. నేను పబ్లిష్ చేయనప్పుడు దాన్ని వేరే బ్లాగుకు పంపివుంటే అది వేరే సంగతి. కానీ మీరలా చేయలేదు కాబట్టే మీ వ్యాఖ్యను డిలీట్ చేశాను!

hari.S.babu చెప్పారు...

@venu
మొదట పబ్లిష్ అయ్యి మాయ మయిన తర్వాతనే వేరే చోట వేసాను.నాకు బాగా గుర్తు!మీరు వేఅరే బ్లాగులో చూశా నన్నారు కదా, అక్కద రెఫరేన్సు కూడా ఇచ్చాను.సరే ఇప్పుడు తైము లెక్కేసి ఖచ్చితంగా తేల్చుకుని చేసేది యేమీ లేదు,ఇది పెద్ద విషయం కాదు లెండి!

వేణు చెప్పారు...

Hari Babu Suraneni : నిజమే. ఇది పెద్ద విషయం కాదు. కానీ మీరే దీన్ని చర్చనీయాంశంగా మార్చారు!

>> మొదట పబ్లిష్ అయ్యి మాయ మయిన తర్వాతనే వేరే చోట వేసాను.నాకు బాగా గుర్తు!>>

మీ వ్యాఖ్య వేరే బ్లాగులో కనపడటం అనే ఒక్క కారణం వల్లనే నేను ఇక్కడ డిలీట్ చేశాననేది నూరు శాతం వాస్తవం.

‘అక్కడ నా వ్యాఖ్యకి అలాంటి గతి పడుతుందని నాకు తెలుసు! అందుకే ఆ పోష్టుకు జవాబుగా మరొక బ్లాగరు వేసిన పోష్టులోనూ కామెంటు వేశాను ’ - ఇవి మీ బ్లాగులో మీరు రాసుకున్నమాటలు.

ఇక మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.

hari.S.babu చెప్పారు...

సారీ, నా బ్లాగు పోష్టు లోంచి మీ గురించిన ప్రస్తావనని తీసేశాను, ఇక రవి గారు యేమి రిప్లై ఇస్తారో చూడాలి.

GKK చెప్పారు...

వేణు గారు: బాపు గారు రామ రామ బదులుగా రంగనాయకమ్మ గారి caricature గీసిఉంటే బాగుండేది. మనకు ఒక అపురూపచిత్రమైనా దక్కేది.రంగనాయకమ్మగారు విమర్శను sportive గా తీసుకున్న సందర్భం ఏదైనా ఉందా? అలాగే తన పాత అభిప్రాయాల్లో కొన్ని మార్పులు వచ్చినట్టుగానీ ఎప్పుడైనా చెప్పారా? you are an authority on రంగనాయకమ్మగారు కాబట్టి అడుగుతున్నాను.

బాపు గారు mild satire . రంగనాయకమ్మగారు wild riposte. the episode is hilarious.

రవి చెప్పారు...

అనుకుంటూనే ఉన్నాను, ఇలాంటిది మొదలవుతుందని.:)

Haribabu గారు: రంగనాయకమ్మ గారి రచనకు మార్క్సిజం ప్రేరణ అని మాత్రమే నా వ్యాఖ్య. ఆమె రాస్ంది తప్పా, కరెక్టా, నాకు రామాయణం మీద గౌరవం ఉందా? లేదా? రంగనాయకమ్మ ను సమర్థిస్తానా లేదా ఇవన్నీ ఊహించుకోకండి. వీటి మీద నా జడ్జిమెంట్లు అనవసరం. నేను VIP నీ కాదండీ, నా అభిప్రాయాలపై డిస్కస్ చేయడానికి. మీరామెను తిట్టుకుంటే తిట్టుకోండి. నాకు అనవసరం.

వేణు చెప్పారు...

@ తెలుగు అభిమాని: I don't think I am an authority on రంగనాయకమ్మ గారు. ఆమె రచనల్లో స్త్రీ పాత్రల గురించి టి. పద్మలోచనాదేవి 1991లో పరిశోధన చేశారు.

అసలు ఆమె గురించి మొదట నేను విన్నది వ్యతిరేకంగానే. పుస్తకాలు చదివాక ఏర్పడిన అభిప్రాయం వేరు!

విమర్శను ఆమె sportive గా తీసుకున్న సందర్భం గురించి మీరడిగారు. కచ్చితంగా ఇప్పటికప్పుడు చెప్పలేను. తన పాత అభిప్రాయాల్లో మౌలికమైన మార్పులు వచ్చి, తన రచనలను తనే నిష్కర్షగా విమర్శించుకోవటం, మార్పులు చేయటం, కొన్నిటిని ప్రచురణలోంచి తీసెయ్యటం.. ఆమె పుస్తకాల్లో కనపడే ప్రత్యేక విషయం. ఇలాంటి లక్షణం తెలుగులో మరే రచయితలోనూ కనపడదు.

hari.S.babu చెప్పారు...

రవి గారూ,
వ్యక్తిగతంగా తిట్టుకోవడం అనేది నేను చెయ్యను.ఆవిణ్ణి తిట్టుకోవాల్సిన అవసరం నాకేంటి?మీరు ఆవిణ్ణి సమర్ధిస్తూ కామెంటు వేసారు గాబట్టి ఆవిడ తరపున జవాబు చెప్తారేమో అనుకున్నాను, అంతే!

అజ్ఞాత చెప్పారు...

వృత్తి రిత్య బాపుగారు చిత్రకారుడు, వేయాలి, శ్రీరాముడికి అనుంగు భక్తుడు, అక్కడ వేస్తె ఓడిపోతాడు. రంగనాయకమ్మ గారు బాపుగారిని అవహేళన గా మాట్లడడం, చెక్ తిరిగి వచ్చిన తర్వాత జరిగింది.దక్షిణ,ఉత్తర ద్రువాలు,దేవుడు లేడని ఆమె, ఉన్నాడని ఈయన, నాకు బుద్ధిమంతుడు సినిమా గుర్తుకు వస్తుంది

Unknown చెప్పారు...

Manam Baapu gaarni,Ranganayakamma gaarni goppa artists ga chustooneh vaariddaru ververu(Individuality) Vyaktitwam unnah mahaanu bhavuluga gurtisteh inta charcha anavasaram!Vaaremi tappu cheyaledu daanni saagadeesi manam ekkada tappu chestunnam!!!!!!!!!!!!!!

Pavan santhosh చెప్పారు...

రవిగారూ,
విశ్వనాథ రచనకు విశ్వనాథ రామాయణం అనే పేరు పెట్టుకుంటే ఆవిడ ఏం చేసేవారో. విషవృక్షమనే టైటిల్ వరకైనా ఆయన రచన ప్రేరణ లేదా? ఏందో గొడవ. విశ్వనాథ ప్రేరణ ఉండకపోలేదు. ఐతే మార్క్స్, వాల్మీకి ఇద్దరూ ముఖ్యప్రేరకులు ఆ రచనకు

’వాచస్పతి’ చెప్పారు...

బాపు గారు రామభక్తుడని తెలిసీ రామనిందాత్మకమైన వ్రాతకి బొమ్మలు వేయమని కోరడం వెకిలి మనస్తత్త్వం.

వేణు చెప్పారు...

@ వాచస్పతి: ఒక రచయిత భావాలతో తన భావాలు ఏకీభవిస్తేనే చిత్రకారుడు బొమ్మలు వేయాలనేమీ లేదు. బాపు తన నమ్మకాలకు విరుద్ధమైన రచనలకు కూడా ముఖచిత్రాలను ఎన్నెో వేశారని ఈ పోస్టులో వివరంగా చెప్పాను. అది మీరు చదవలేదో, చదివినా పట్టించుకోదలచలేదో!

మీకో విషయం తెలుసో లేదో.. సీతను అనుమానించిన విషయంలో అంత గొప్ప ‘రామభక్తుడు’ బాపు .. రాముడి పట్ల ఎవరైనా ఆశ్చర్యపోయేంత విమర్శగా ఉన్నారు. (చూడండి... ‘రచన’మాసపత్రిక బాపు స్మరణీయ సంచికలు)

విమర్శ అనేది మీ దృష్టిలో నింద! సరే, అది మీ అభిప్రాయం. కానీ ‘వెకిలి మనస్తత్వం’ అనే పదప్రయోగం వాచస్పతి అనే మీ పేరుకు తగినట్టుగా లేదు!

Pavan santhosh చెప్పారు...

// ఈ రచనలో శబ్ద- అర్థపరంగా, ఛందోపరంగా ఉన్న లోపాలన్నీ వివరంగా పేర్కొంటూ కొత్త సత్యనారాయణ చౌదరి (1907- 1974) ‘కల్పవృక్ష ఖండనము’ రాశారు. ఈ విమర్శ ‘భారతి’లో 1961 జూన్-అక్టోబరుల మధ్య ప్రచురితమై, సంచలనం సృష్టించింది. దానిపై ‘ఆంధ్రపత్రిక సారస్వతానుబంధం’లో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ చర్చనంతటినీ ఒకచోట కూర్చి 1962 జనవరి భారతి సంచికతో పాటు అందించారు.

ఇంత వివాదం జరిగినా 1970లో రామాయణ కల్పవృక్షానికి జ్ఞానపీఠ బహుమతి వచ్చింది! //
మీరు ఆ కల్పవృక్ష ఖండనముని పరిశీలించి చూశారా? అలానే వివాదాస్పదమైన రచనలు గొప్పవి కాదని, వాటికి అవార్డులు, గుర్తింపు రాకూడదని ఏంటి లెక్క? దారిన పోయే పుస్తకాలను ఎవరూ పట్టించుకోరు. రామాయణాలు లెక్కలేనన్ని వచ్చాయి తెలుగు సాహిత్యంలో, 20వ శతాబ్దిలో భక్తి రచనలు ఇబ్బడిముబ్బడి. కానీ రామాయణ కల్పవృక్షంపైనే ఎందుకు విమర్శలు వచ్చాయి.
వెల్చేరు నారాయణరావు గారి వ్యాఖ్య నాకన్నా చక్కగా వివరిస్తుంది - "సత్యనారాయణ గారు అద్భుతమైన కవి కాకపోతే ఏ గొడవా లేకపోవును. ఎంతో మంది పాతతరం పండితులు కూడ ఇవే మాటలన్నారు. ఐతే వాళ్ళని ఛాందసులని కొట్టి పారేసి ఎప్పుడన్నా పాత పుస్తకాల్తో అవసరం పడ్డప్పుడు సంప్రదించే వరకే వాళ్ళ పరిధిని పరిమితం చేశారు ఆధునికులు. కాని సత్యనారాయణ గారు అలాటి వాడు కాడు. ఉజ్వ్జలమైన ధిషణ, ఇంగ్లీషులో కూడ మంచి సామర్య్థం, వీటన్నిటికీ మించి అద్భుత కవితా ప్రతిభ వున్నాయాయనలో. ఆయన తన రామాయణ పద్యాల్ని సభల్లో చదివినప్పుడు వందలమంది ముగ్ధులై విన్నారు. ఆయన సాహితీ స్వరూపం, పాండిత్య, కవిత్వ మేధ జనం మళ్ళీ సాంప్రదాయిక రామాయణం మీదికి దృష్టి సారించేట్టు చేశాయి. ఆయన రామాయణం భక్తి మార్గంలోదే ఐనా, ఆయన పాత్ర చిత్రణ, కథా కథనం ఉన్నతమైనవి. నీరసపు రామకథల్ని మళ్ళీ మళ్ళీ చదివి విసుగెత్తిన పాఠకులకు ఉత్తేజకరమైన మరో దారి చూపించాడు విశ్వనాథ."
మనకు నచ్చని భావాలున్నంత మాత్రానా కొట్టిపారేయడం తగదు.. కల్పవృక్షమైనా, విషవృక్షమైనా. వీలున్నంతవరకూ రచనల శైలి, శిల్పాలను, భాషాంశాలను విమర్శించేప్పుడు వస్తువును పరిగణించకూడదు. మనకు నచ్చకపోతే నచ్చలేదనాలి, సమస్య ఉంటే సమస్య ఉందనాలి, బాగోలేదనకూడదు.
http://eemaata.com/em/issues/200309/471.html?allinonepage=1

Pavan santhosh చెప్పారు...

//మీకో విషయం తెలుసో లేదో.. సీతను అనుమానించిన విషయంలో అంత గొప్ప ‘రామభక్తుడు’ బాపు .. రాముడి పట్ల ఎవరైనా ఆశ్చర్యపోయేంత విమర్శగా ఉన్నారు. (చూడండి... ‘రచన’మాసపత్రిక బాపు స్మరణీయ సంచికలు)//
మీకో విషయం తెలుసో లేదో.. సీతను అనుమానించి, అగ్నిపరీక్ష చేసిన విషయంలో అంత గొప్ప రామభక్తుడు విశ్వనాథ సత్యనారాయణ.. రాముడి పట్ల ఎవరైనా ఆశ్చర్యపోయేంత విమర్శగా ఉన్నారు. హనుమంతుడు సీతారాముల రాకను నందిగ్రామంలో చెప్పేందుకు వెళ్తూంటే అగ్ని చుట్టూ తిరుగుతూ భరతుడు అగ్నిప్రవేశం చెయ్యబోతాడు. అన్నదమ్ములు రాముడు, భరతుల మధ్య కొట్టొచ్చినట్టున్న పోలికల గురించి వర్ణిస్తూ విశ్వనాథ హనుమంతుడి నోట - సీతమ్మను అగ్నిప్రవేశం చేయించినందుకు, ప్రాయశ్చిత్తంగా రాముడే ప్రాయోపవేశం చేస్తున్నాడా అనిపిస్తోంది అని రాశారు మీరు ఏదో అనుకునే ‘‘రామాయణ కల్పవృక్షం’’లో. :-) రామభక్తులైనంత మాత్రాన అసలు ఏ విమర్శా చెయ్యరనీ, చేస్తే రాముడిపై చేసే అన్ని రకాల విమర్శలనూ బేషరుతగా ఒప్పుకోవాలని మీకు ఎలా అనిపిస్తోందో.