సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

30, నవంబర్ 2017, గురువారం

ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ ‘మ్యాజిక్!’



సినిమాల్లో  పాత్రధారుల సంభాషణల మధ్యా,  డైలాగులు లేని సన్నివేశాల్లోనూ  వినిపించేది... నేపథ్య సంగీతం-  బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ( బీజీఎం).

దీన్ని సినిమా చూస్తూ  గమనించడం, బాగుంటే ఆస్వాదించటం నాకు ఇష్టం. 

ఒక మాదిరిగా ఉండే దృశ్యాలకు కూడా  ప్రాణం పోసి,   పాత్రధారుల మూడ్ ను ఎలివేట్ చేసి,  చూసేవారికి  సన్నివేశం హత్తుకునేలా చేసే శక్తి ఈ బీజిఎంకు ఉంది కాబట్టే  దానిపై నాకు అంత  ఆసక్తి!  

అందుకే... ఈ బీజీఎం ల ప్రస్తావన  ఈ బ్లాగులో కనీసం రెండు పోస్టుల్లో ఇప్పటికే వచ్చేసింది  కూడా.  

సన్నివేశాన్ని ఒక్కసారి చూసి, దానికి సరిపోయే నేపథ్య సంగీతాన్ని ఎంతో వేగంగా అందించటం  ఇళయరాజాకు అలవాటు.  ఆ ప్రక్రియను గమనిస్తే  అదెంతో అబ్బురంగా అనిపిస్తుంది.

దీని గురించి  కిందటి సంవత్సరం మే నెల్లో ఓ పోస్టు రాశాను. ఆసక్తి ఉంటే ... ఇక్కడ క్లిక్ చేయండి.  
  
* * *


ళయరాజా బీజీఎంల ప్రత్యేకతను వివరించే వీడియోలు యూ ట్యూబ్ లో చాలానే ఉన్నాయి.  

వాటిలో  రెండు  వీడియోలను యూ ట్యూబ్ లో  ఈ మధ్య పదేపదే చూశాను.  వాటిని ఆ సినిమాల దర్శకులే స్వయంగా వివరించటం ఓ విశేషం.

ఆ ఇద్దరూ ఒకరు  భారతీరాజా.  రెండోవారు బాల్కి.  

భారతీ- రాజా 
ముదల్ మరియాదై అనే తమిళ సినిమా 1985లో వచ్చింది. దీన్ని తెలుగులో ఆత్మబంధువుగా అనువదించారు. ఆత్రేయ పాటలు, ఇళయరాజా సంగీతం చాలా బాగుంటాయి.

ఈ సినిమాలో ఓ సన్నివేశం.. దానికి  బీజీఎం జోడింపులో ప్రత్యేకతను ఆ చిత్ర దర్శకుడు భారతీరాజా ఈ వీడియోలో  బాగా వివరించారు. చెప్పింది తమిళంలో అయినప్పటికీ  భావం తేలిగ్గానే అర్థమవుతుంది. 



ఈ సన్నివేశంలో కనిపించే దుర్ఘటనా, ఆపై  చకచకా వచ్చే  వివిధ దృశ్యాలూ, ఆకాశం నుంచి కిందకు జారిపడుతున్న వేణువూ..ఆ దృశ్యాల గాఢతనూ, విషాదాన్నీ తెలిపేలా క్లుప్తమైన ఫ్లూట్ బిట్స్ తో  ఇళయరాజా  ఎంత బాగా బీజిఎం కూర్చారో కదా!


దర్శకుడు  బాల్కీ మాటల్లో...
ఇక 2009లో హిందీ సినిమా పా  వచ్చింది. అమితాబ్, అభిషేక్ బచ్చన్ లు నటించిన ఈ చిత్రం దర్శకుడు బాల్కీ. ఆయన ఇళయరాజా బీజీఎంల ప్రత్యేకతను ఇంగ్లిష్ లో  చక్కగా వివరించిన వీడియో ఇది.




 తను తీసిన  పా చిత్రంలో ఒకటిన్నర నిమిషం సన్నివేశాన్ని శబ్దం లేకుండా చూపించారాయన. తర్వాత ఆ సన్నివేశానికి  ఇళయరాజా కూర్చిన బీజీఎం ను  విడిగా వినిపించారు.  ఆ పైన..   నేపథ్య సంగీతంతో జతకూడి  ఆ సన్నివేశం ఎంత కళగా, ఎంత చక్కగా మారిపోయిందో చూపించారు. 

ఇళయరాజా కూర్చిన నేపథ్యసంగీతంలో .. ఆ వాద్యాల సమ్మేళనంలో మనసుకు హాయి కలిగించే  శ్రావ్యతను గమనించవచ్చు.  ఆ బీజీఎంలనుంచి చాలా పాటలకు బాణీలు వస్తాయని బాల్కీ అనటంలో అతిశయోక్తి ఏమీ కనపడదు మనకి.  నిజానికి  ఆయన బీజిఎంల నుంచి పుట్టిన ఆయన  పాటలు చాలామందికి తెలిసినవే! 

స్వర్ణ సీతను చూసినప్పుడు...
2011లో బాపు దర్శకత్వంలో వచ్చిన శ్రీరామ రాజ్యంలో ఇళయరాజా సంగీతం, నేపథ్య సంగీతం వీనుల విందు చేస్తుంది. వనవాసం చేసే సీత ... వాల్మీకి అనుగ్రహంతో  అయోధ్య రాజమందిరం చేరుకుని- స్వర్ణసీత విగ్రహం చూస్తున్న సందర్భంలో ఆమె హావభావాలు, మనో సంఘర్షణ, చివరకు సంతోషం, మైమరపు .. వీటి నేపథ్యంలో  వచ్చే సంగీతం ఎంత బాగుంటుందో గమనించండి-
 


ఇళయరాజా బీజిఎంల ప్రత్యేకతలను తెలుగు సినిమాలకే పరిమితమై క్లుప్తంగా చెప్పాలన్నా అది ఒక పట్టాన తేలే పని కాదు. ఎందుకంటే..  సితార, గీతాంజలి, మౌనరాగం (అనువాద చిత్రం), శివ, సాగర సంగమం, స్వర్ణ కమలం... ఇలా ఎన్నో సినిమాల్లోని చాలా సన్నివేశాలను చూపించాల్సివుంటుంది మరి!

* * *
సంగీతాన్నీ, నేపథ్య సంగీతాన్నీ సందర్భోచితంగా, శ్రావ్యంగా,  మనసుకు హత్తుకునేలా సమకూర్చడంలో ఇళయరాజాకు దగ్గరగా వచ్చే సంగీత దర్శకులు ఉండేవుంటారు.  ఇళయరాజా  వెయ్యి సినిమాలకు సంగీతం సమకూర్చటం ఘనతే కానీ, అంతకంటే ముందే.. ఎమ్మెస్ విశ్వనాథన్ 1200 సినిమాలకు సంగీతం అందించారు!

పాటలూ, బీజిఎంలకు మించి ఇళయరాజాలో ఇంకా చాలా విషయాలు నాకు నచ్చుతాయి.

ఆయనలో, ఆయన మాటల్లో ప్రస్ఫుటంగా కనిపించే ఒక లక్షణం.. నిరాడంబరత్వం.  అది తెచ్చిపెట్టుకున్న వినయంతో వచ్చినది కాదు.  ఆయన స్వభావమే అంత. 

వేదికలమీద తనపై పొగడ్తలు కురిపిస్తుంటే ఆయనకు నవ్వులాటగా ఉంటుందట.  వక్తలు తనను కీర్తిస్తుంటే తన  పూర్వ సంగీత దర్శకులైన  సి. రామచంద్ర, సీఆర్ సుబ్బరామన్, ఖేమ్‌చంద్ ప్రకాశ్, నౌషాద్, మదన్ మోహన్, ఎస్ డీ బర్మన్, ఎమ్మెస్ విశ్వనాథన్ లాంటి వాళ్ళ పేర్లు చెపుతారు.  వాళ్లు ప్రయాణించిన బాటలోనే నేనూ ప్రయాణిస్తున్నాను అని  చెపుతారు.

ఆయన తరచూ చెప్పే కొన్ని మాటలు చూడండి- 
 
నాకు సంగీతం గురించి తెలియదు. కాబట్టే సంగీతం  చేస్తున్నాను. తెలిసుంటే హాయిగా ఇంట్లో కూర్చొనేవాణ్ణి.

ఒకరి భావాన్ని ఎదుటి వ్యక్తి దగ్గర వ్యక్తీకరించడానికి చాలా మార్గాలున్నాయి. అందులో సంగీతం ఒకటి. మాటల్లో చెప్పలేని భావాన్ని సంగీతం ద్వారా ఆవిష్కరించొచ్చు. అందుకే సంగీతానికి ట్రెండ్ లేదని చెబుతాను.


సంగీతం అనేది ఒక సముద్రం లాంటిది. ఒక ఆకాశం లాంటిది. ఒక భూమి లాంటిది. ఎంతో విస్తారమైనది సంగీత ప్రపంచం. సముద్రపుటొడ్డున కూర్చుని అక్కడ కనిపించే ఆల్చిప్పల్ని ఏరుకుని వాటిని మాలగా కూర్చి, దానికి మెరుగుపెట్టి అమ్మే పని చేస్తున్నాను నేను.  
  అయితే సంగీత సాగరంలో ఎక్కడెక్కడ ముత్యాలు దొరుకుతాయో, సంగీతాకాశంలో వీణ శ్రుతులెక్కడ ఆడుకుంటాయో, ఈ సంగీతం భూమిపై ఎక్కడెక్కడికి వ్యాపించి కళ్లకు కనిపించే దృశ్యాల రూపంలో ప్రభవిస్తుందో నాకు తెలుసు. 
 కానీ దీని గురించి ప్రజలకు వివరించే సందర్భాన్ని భగవంతుడు నాకు ప్రసాదించలేదు.’  (దైవం  మీద విశ్వాసం ఉన్న వ్యక్తి ఇళయరాజా.  అలాగే.. రమణ మహర్షి తాత్విక చింతనను ఆయన అభిమానిస్తారు

బాల్కీ తీసిన మరో హిందీ సినిమా షమితాబ్(2015) విడుదల సందర్భంగా  హీరో ధనుష్  రాజా సర్ తన జీవితంపై ఎంత గాఢమైన ముద్ర వేశాడో వేదికపై ఇలా చెప్పాడు - " I draw my emotions from your music... all my happiness, my joys and sorrows, my love, my heart breakings, my pain, my lullaby...every thing is your music''. 
(‘‘నా  భావోద్వేగాలను మీ సంగీతం నుంచే పొందుతుంటాను.  నా  మొత్తం సంతోషం, నా  ఆనంద విషాదాలూ,  నా ప్రేమా,  నా హృదయ భగ్నతా,  నా పరివేదనా, నా  లాలి పాటా.. ప్రతిదీ మీ సంగీతమే’’)

ఇళయరాజా పాటలు వింటూ పెరిగిన కొన్ని తరాల  శ్రోతల మనసులోని మాటలు కదూ ఇవి!