సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

26, జులై 2010, సోమవారం

నా హీరోలు.. వాలీ, కర్ణుడూ!

విజేతలంటే  ఎవరికైనా ఇష్టమే! కానీ  పరాజితుల్లోనూ  కొందరు తమ  ప్రత్యేక లక్షణాలతో ఆకట్టుకుంటారు. పురాణేతిహాసాల విషయానికొస్తే... రామాయణంలో వాలీ, భారతంలో కర్ణుడూ  అలా నాకు ఇష్టంగా అనిపిస్తారు. ఇద్దరూ అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు.

చెట్టు చాటు నుంచి దూసుకొచ్చిన  రామబాణానికి వాలీ; 
రథం కుంగి నిస్సహాయంగా ఉన్నపుడు  అర్జున బాణానికి కర్ణుడూ!

భీష్ముడు  అర్థరథుడిగా చేసి అవమానించినా తర్వాత కౌరవ సేనకు సర్వసైన్యాధిపత్యం వహించిన కర్ణుడి పేర ఏకంగా ఓ పర్వమే ఉంది; ‘కర్ణుడు లేని భారతం’ అని మాట పుట్టింది. ఈ స్థాయిలో వాలికి,  రామాయణంలో ప్రాధాన్యం లేకపోయినా ఆ పాత్రలో ఆకర్షణ ఉంది.

ఎదుటివ్యక్తిలోని శక్తిని లాగేసుకునే ప్రత్యేకత వాలిది. సహజ కవచ కుండలాలు కర్ణుడి విశిష్టత. వీటివల్ల నాకు ప్రాథమికంగా ఆ పాత్రలపై ఆసక్తి పెరిగి వుండొచ్చు.  

వాలి వధ విషయంలో రాముడి వాదన అసంతృప్తికరంగానే ఉండేది, చిన్నప్పట్నుంచీ. ‘చందమామ’లో ‘వీర హనుమాన్’ధారావాహిక వస్తున్నపుడు కూడా ఈ ఘట్టాన్ని ఆసక్తిగా చదివాను.
తారతో వాలి సంభాషణ (చందమామలో చిత్రకారుడు శంకర్ వేసిన చిత్రం)

కొడవటిగంటి కుటుంబరావు గారు రాశారో, మరెవరు రాశారో గానీ.. సుగ్రీవుడు అన్నను నిందిస్తూ  యుద్ధానికి రమ్మని సవాలు విసురుతుండగా కిష్కింధ అంత:పురంలో  వాలీ, తారల మధ్య నడిచే సంభాషణ ఎంతో భావగర్భితంగా ఉంటుంది.

రామాయణాన్నిఒక కవి రాసిన సాహిత్యంగా కాకుండా... వాస్తవంగా జరిగిన గాథగా, ఆ రచనను పవిత్ర గ్రంథంగా భావించే భక్తుల్లో కూడా వాలి వధ విషయంలో భిన్నాభిప్రాయాలుండటం  నాకు తెలుసు. దీనిపై అనుకూల ప్రతికూల వాదనలూ, చర్చోపచర్చలూ తరతరాలుగా కొనసాగుతూనే ఉన్నాయనుకోండీ.

శ్రీరాముడి వల్ల వాలికి అన్యాయం జరిగిపోయిందనే నా ఆలోచనలకు తర్కబద్ధమైన సమర్థన రంగనాయకమ్మగారి ‘రామాయణ విషవృక్షం’లో దొరికింది. ఈ పుస్తకం చదివేనాటికే నాకు భక్తి విశ్వాసాలు  లేకపోవటం వల్ల  ఆ పుస్తకాన్ని పూర్తి సానుకూల దృష్టితో చదవగలిగాను. ఒకవేళ  అప్పటికి నాస్తికుణ్ణి కాకపోయినప్పటికీ ‘వాలి వధ’ఘట్టంలో రంగనాయకమ్మగారి వాదన నాకు  నచ్చివుండేదే!

కన్నతల్లితో కర్ణుడు  (చందమామలో శంకర్ వేసిన బొమ్మ)


కర్ణుడి విషయానికొస్తే.. తనను ఆదరించిన కౌరవుల పక్షాన చివరిదాకా ఉండటం, చెప్పిన మాటకు కట్టుబడటం కర్ణుడి పాత్రను ఉన్నతంగా నిలిపాయి. కుంతి వచ్చి తన జన్మ రహస్యం చెప్పి పాండవపక్షానికి రమ్మని  బతిమిలాడినప్పుడు నిరాకరించటం, తల్లిని నిరాశపరచకుండా  ఒక్క అర్జునుణ్ణి మినహా మిగతా పాండవులను చంపనని మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకోవటం కర్ణుడంటే ఏమిటో నిరూపిస్తాయి.

తార మాట వినకుండా సుగ్రీవుడితో యుద్ధానికి వెళ్ళిన వాలీ, 
కుంతి మాటను తిరస్కరించి పాండవ పక్షానికి వెళ్ళని  కర్ణుడూ 
ప్రాణాలు పోగొట్టుకున్నప్పటికీ; తారకూ, కుంతికీ వారు తమ కోణంలో చెప్పిన సమాధానాలు వారిమీద గౌరవం పెంచుతాయి.  

జాషువా అద్భుత పద్యాలు
నా స్కూలు రోజుల్లో గుర్రం జాషువా గారి ‘భారత వీరుడు’ (రచనా కాలం:1927)  పద్యాలు చదివాను. వాటిలో కర్ణుడి ఔన్నత్యాన్నీ, నిజాయతీనీ సమర్థిస్తూ జాషువా గారు అద్భుతంగా రాశారు. అర్జునుడి మీద ప్రయోగించిన నాగాస్త్రం కొద్దిలో గురి తప్పి, వెనుదిరిగి వచ్చి మళ్ళీ ప్రయోగించమని కోరినపుడు ‘ఛీ..ఎంగిలి బాణం వాడను’ అనటం.. ఇలాంటి ఘట్టాలను ప్రస్తావిస్తూ నేరుగా కర్ణుడినే ఉద్దేశిస్తూ  పద్యాలు సాగుతాయి. కర్ణుడే నిజమైన ‘భారత వీరుడ’ని అభివర్ణిస్తారు.

అంతర్జాలంలో ఆ పద్యాలు దొరుకుతాయేమోనని వెదికాను కానీ, ప్చ్... ఫలితం కనిపించలేదు!

కర్ణుడి మరణానికి కారకులెవరు?
‘కర్ణుడి చావుకు అనేక కారణాలున్నట్టు’ అనీ,  ‘కర్ణుడి చావుకు వెయ్యి కారణాలున్నట్టు’ అనీ  అంటుంటారు. కానీ శ్రీమదాంధ్ర మహాభారతంలో తిక్కన పద్యం ప్రకారం చూస్తే.. కర్ణుడి మరణానికి ఆరుగురు కారణమని అర్జునుడికి  స్వయంగా కృష్ణుడే చెప్పినట్టు ఉంది.

ఆ పద్యం చూడండి-
‘నీ చేతను నా చేతను
వరమడిగిన కుంతి చేత వాసవు చేతన్
ధర చేత భార్గవు చేత
నరయంగా కర్ణుడీల్గె నార్వురి చేతన్’


1.అర్జునుడు   2.కృష్ణుడు   3.కుంతి   4.ఇంద్రుడు   5.భూదేవి   6.పరశురాముడు.

అయితే - యుద్ధ సమయంలో కర్ణుణ్ణి  అన్ని విధాలుగా నిరుత్సాహపరిచిన శల్య సారథ్యం సంగతేమిటి? ప్రత్యర్థిని హంసగా వర్ణించి, పొగడ్తలతో ముంచెత్తి, కర్ణుడిని కాకితో పోల్చి అతడి మనసును వికలం చేయటం... మానసికంగా బలహీనుణ్ణి చేయటం చిన్న విషయమేమీ కాదు  కదా!

అందుకని ఏడో కారకుడిగా శల్యుణ్ణి   పై జాబితాలో కలుపుకోవచ్చనిపిస్తుంది!

16, జులై 2010, శుక్రవారం

అద్భుతమైన తెలుగు సినిమా లోగోలు!

గంగాధర్
తెలుగు సినిమాల పేర్లు కొన్నిటిని గుర్తు చేసుకోగానే ఆకట్టుకునే వాటి ‘లోగో’లు వెంటనే గుర్తొచ్చేస్తాయి. అలనాటి పబ్లిసిటీ ఆర్టిస్టుల గొప్పతనమది! (లోగో అంటే  అక్షరాలంకరణ అని అర్థం చెప్పుకోవచ్చు).

తెలుగు సినిమా పబ్లిసిటీని ఒక కళగా తీర్చిదిద్ది,  ప్రాచుర్యం కల్పించి, ఉన్నత స్థాయికి చేర్చిన చిత్రకారుల్లో గంగాధర్, ఈశ్వర్ అగ్రశ్రేణిలో నిలుస్తారు.

 గంగాధర్ ఆరేళ్ళ క్రితం చనిపోయారు.


ఆయన సంతకమే విలక్షణం.  హిందీ అక్షరాల మల్లే అడ్డంగా ఓ గీత... దాన్ని తాకుతూ అందమైన, ముత్యాల్లాంటి తెలుగు అక్షరాలు!  ‘గ’ తర్వాత మొదటి సున్నా.. పై గీతను తాకదు గానీ,   తర్వాత సున్నా ‘గా’ అక్షరాన్ని స్ఫురింపజేస్తూ గీతను తాకుతూ అర్థవంతంగా ఉంటుంది. చివర్లో మరో సున్నా... ఆ సున్నా తాకే  గీత పై మరో  గీత  స్టైల్ గా.. ‘ర్’ని తలపిస్తూ!

ఈ గంగాధర్ సంతకాన్ని ప్రాక్టీస్ చేయటం భలే సరదాగా ఉండేది, చిన్నప్పటి రోజుల్లో!

యన రూపొందించిన సినిమా లోగోలంటే నాకు ప్రత్యేకాభిమానం.

దానవీరశూర కర్ణ, అమరదీపం, బొట్టు కాటుక, శంకరాభరణం, ఏకలవ్య, విప్లవశంఖం.. ఈ సినిమాల  లోగోల  రూపకర్త గంగాధరే.  కోడెనాగు సినిమా లోగో కూడా ప్రత్యేకంగా ఉంటుంది. 

సినిమా సారాన్నీ, స్వభావాన్నీ సాధ్యమైనంతవరకూ  లోగోలోకి తీసుకురావటమే ఈ లోగోల ప్రత్యేకత.

అన్ని లోగోల గురించీ వివరించను కానీ, ఎంతో  ప్రత్యేకత  ఉన్న ఒక సినిమా లోగో గురించి మాత్రం చెప్తాను.  గంగాధర్ అనితర సాధ్యంగా దీన్ని రూపొందించారు.


1979లో తీసిన ‘బొట్టు కాటుక’ సినిమా అది. మురళీమోహన్, మాధవి నాయికా నాయకులు. నిర్మాణ సంస్థ శ్యామ్ ప్రసాద్ ప్రొడక్షన్స్. ఈ సంస్థ నిర్దేశకుడు విజయబాపినీడు . ఆయనకు పత్రికా రంగంలో అప్పటికే  పేరుంది. అభిరుచితో ఆయన ఓకే చేసిన లోగో ఇది.

లోగోను ఇక్కడ చూపించి, దాని గురించి చెప్పటమే సరైంది. కానీ ‘బొట్టు కాటుక’ లోగో కోసం ఎంత ప్రయత్నించినా దొరకలేదు. అందుకే ఆ లోగో ఎలా ఉంటుందో  చేతనైనంతవరకూ వర్ణించటానికి ప్రయత్నిస్తాను.

గుండ్రటి బొట్టు ఆకారంలో ‘బొట్టు’అనే రెండక్షరాలూ ఒదిగిపోయాయి.
మిగిలింది- కాటుక. ‘కా’ అక్షరాన్ని ఎడమ  కన్నుగా, ‘టు’ను ముక్కుగా వేసి, ‘క’ను కుడి  కన్నుగా వేశారు.

చూడగానే ఓ స్త్రీ మూర్తి ముఖం కదా అనిపిస్తుంది. కొంచెం పరిశీలించి చూస్తే... ‘బొట్టు కాటుక’ అనే అక్షరాలు కనిపిస్తాయి.  చిత్రకళాభిమానులకు అప్పట్లో  గొప్ప ‘థ్రిల్’ని కలిగించిందీ లోగో! 

ఈ లోగో కళాత్మకంగా ఉన్నప్పటికీ సామాన్య ప్రేక్షకులకు అర్థం కాదని , వేరే  లోగో వేయించి, దాన్నే వాల్ పోస్టర్లలో  వాడారు, పబ్లిసిటీలో.
 మార్చిన లోగో రెండు కళ్ళపై వంపు తిరిగి బాగానే ఉంది కానీ, మొదట వేసిన లోగో తో పోలిస్తే ఏమాత్రం నిలవదు!

ఈ లోగో కథ అప్పట్లో సినీ వార పత్రిక ‘జ్యోతి చిత్ర’లో పూర్తి పేజీలో ప్రచురించారు. మొదట ఈ సినిమా కోసం ఏ లోగోలను గంగాధర్ వేశారో వాటిని కూడా ఇచ్చారు. కళాత్మకమైన లోగో  తొలి రూపం, దాన్ని ఇంప్రూవ్ చేసి, ఎలా రూపుదిద్దుకుందీ .. చివరికి ఏ లోగో ఖరారు చేసిందీ... ఆ పరిణామ క్రమమంతా  చక్కగా అందించారు.

30 ఏళ్ళు దాటినా తెలుగులో  ఈ స్థాయి లోగోను నేనెక్కడా చూడలేదు!

ఇప్పడొస్తున్న సినిమా లోగోల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. దాదాపు అన్నీ  మూసలోనే ఉంటున్నాయి.  ఏ లోగో అయినా ఒకే రకంగా, ఎడమవైపు కిందభాగం నుంచి మొదలై కుడివైపు పైభాగానికి ఏటవాలుగా వెళ్తుంది. సినిమాను  తల్చుకుంటే లోగో పొరపాటున కూడా గుర్తుకురాదు.

అసలు తెలుగు సినిమా పబ్లిసిటీ లో ‘కళ’ ఏనాడో అంతరించిపోయిందని నిరాశ కలుగుతోంది!