సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

28, ఫిబ్రవరి 2018, బుధవారం

మృతీ... స్మృతీ.. విస్మృతీ!

త్మీయులో, గాఢంగా అభిమానించేవారో మరణిస్తే... ఎవరికైనా అమితమైన బాధా,  దు:ఖం  సహజం. కాలం  గాయాల్ని మాన్పుతుంది కాబట్టి.... రోజులు గడుస్తున్నకొద్దీ  ఆ  జ్ఞాపకాలు పల్చబడి, వారి తలపోతలు తగ్గిపోవటం కూడా అంతే మామూలు.

అయితే అందరి విషయంలోనూ ఇది వర్తిస్తుందని చెప్పలేం!.

మా అమ్మకు వాళ్ళ నాన్న (మా తాతయ్య) అంటే ఎంత ఇష్టం అంటే... ఆయన చనిపోయి దశాబ్దాలు దాటుతున్నా ‘మా నాన్న’ అంటూ ఇష్టంగా ఆయన్ను గుర్తు చేసుకోని  రోజు ఆమెకు ఉండేది కాదు.  నేను పుట్టకముందే తాతయ్య  చనిపోయాడు.  ఫొటో చూడటం తప్ప ఆయన్ను నేను చూడలేదు. కానీ మా అమ్మ మాటల్లో, తాను తల్చుకుంటూ చెపుతూవుండే  జ్ఞాపకాల్లో ఆయన నాకు బాగానే తెలుసనిపిస్తుంది.

తండ్రిని  పదేపదే  తల్చుకోవటంలో, ఆయన ఘనతను సందర్భానుసారంగా చుట్టుపక్కలవారికి  గర్వంగా చెప్పటంలో సంతోషం, ఉపశాంతి ఆమెకు దక్కివుండాలి.  మరో కోణంలో చూస్తే... ఇప్పుడు నాకేమనిపిస్తోందంటే... తండ్రి తర్వాత ఆమెను  అంత ప్రేమగా , అంత అపురూపంగా, అంత గారాబంగా మేం చూసుకోలేదేమో.. అని! 

మా అమ్మ లాంటి వాళ్ళు అరుదేమీ కాదు.  మన చుట్టుపక్కలే చాలామందే ఉంటారు.  ఇదంతా  సామాన్యులకు సంబంధించిన  కోణం. 

శోభన్ బాబు  అంతరంగం
   
సినీ మాయామేయ జగంపై మనలో చాలామందికి అంత మంచి అభిప్రాయం ఉండదు. కానీ మంచి చెడుల సమ్మేళనం కదా ఏ రంగమైనా!

ఓసారి  ఈటీవీలో సినీ నటుడు  శోభన్ బాబు ఇంటర్వ్యూ చూశాను.   తన సినీ కెరియర్ ఎలా మొదలై, ముందుకు వెళ్ళిందీ  చెపుతూ వెళ్ళారు.  తన శ్రేయోభిలాషి ఎన్టీఆర్  తొలినాళ్ళలో  తననెంతగా ప్రోత్సహించిందీ గుర్తు చేసుకున్నారు.  అప్పటికి ఎన్టీఆర్ మరణించారు.

అలా మాట్లాడుతుంటే  శోభన్ బాబు గొంతు గాద్గదికమైంది. ఎన్టీఆర్ పట్ల మనసులో ఉన్న  కృతజ్ఞతతో,  ఆ  తలపుల భారంతో.. ఆయన కళ్ళ నుంచి నీరు ఉబికి వచ్చింది.  మాటలు  సరిగా  రాలేదు. మౌనం... కానీ  కెమెరా అలా నిశ్శబ్దంగా  పనిచేస్తూనే ఉంది.  యాంకర్  కూడా ఏమీ కలగజేసుకోలేదు.  కొద్దిసేపటికి శోభన్ బాబు  తమాయించుకుని,  ఇంటర్వ్యూను కొనసాగించారు.

నేను చూసిన టీవీ ఇంటర్ వ్యూల్లో ఇది బహుశా అత్యుత్తమం.  అప్పటిదాకా  శోభన్ బాబు అంటే మంచి అభిప్రాయమే ఉంది. అప్పటి నుంచీ ఆయనంటే  చాలా గౌరవం ఏర్పడింది.  ఎన్టీఆర్ చనిపోయిన   చాలా కాలం  తర్వాత  చేసిన ఇంటర్వ్యూ ఇది.  ఒక వ్యక్తి  చేసిన మేలును  ఏళ్ళు గడిచిన  తర్వాత కూడా మర్చిపోకుండావుంటూ  అలా  కన్నీరు మున్నీరయ్యే  హృదయం ఎంత  సున్నితమైనది, ఎంత  స్వచ్ఛమైనది!  ఆ అనుబంధం ఎంత గాఢమైనది!


సామూహిక విషాదం
సినీ  ప్రముఖులో, రాజకీయ నాయకులో మరణిస్తే  మీడియా ఆ వార్త ఇచ్చి ఊరుకోదు. మృతుల ప్రాముఖ్యాన్నీ , ప్రాచుర్యాన్నీ బట్టి  చాలా హడావుడి చేస్తుంది.

మిగిలిన  ఘటనల ప్రాధాన్యం తగ్గించి అయినా సరే,  భిన్న కోణాల్లో అతిశయోక్తులు జోడించి  విషాదాన్ని పెను విషాదంగా, సామూహిక విషాదంగా మార్చేలా కథనాలూ, స్పందనలూ, అభిప్రాయాలూ  ప్రసారం చేస్తుంది.  ప్రచురిస్తుంది.

‘పోటీలో వెనకబడకుండా’,  ‘సృజనాత్మకతకు సానపెట్టి మరీ’  మీడియా సంస్థలు అదే పనిగా కథనాల పరంపరతో  వీక్షకుల్నీ, పాఠకుల్నీ ఆకట్టుకోవటానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తుంటాయి.

మరో కొత్త సంఘటనో, దుర్ఘటనో సంభవించేవరకూ (మాత్రమే)  ఇది  కొనసాగుతూవుంటుంది. 

మీడియా ముందు జాగ్రత్తలు
ప్రముఖులు  చనిపోతే ... వారి గురించి  అప్పటికప్పుడు  సమాచారం సేకరించి,  కథనాలు  రాసి డెడ్ లైన్ లోపు  ప్రచురించాలంటే   అది  చాలా కష్టం.  అందుకే   పత్రికలు (ఇప్పుడైతే  టీవీ చానళ్ళు కూడా)  ముందు జాగ్రత్త పాటిస్తుంటాయి.  అదేమిటంటే... కాస్త పెద్ద వయసులో ఉండే  ప్రముఖుల  జీవిత విశేషాలతో , ఫొటోలతో, వీడియో క్లిపింగ్ లతో  కొంతమేరకైనా కథనాలు సిద్ధం చేసుకుంటూవుంటాయి....

ఎందుకంటే...
ఒ క వే ళ  ఆ ప్రముఖులు  చనిపోతే ... వెనువెంటనే  పాఠకులకు/ వీక్షకులకు ఆ విశేషాలు  అందించేందుకు!

వినటానికి  ఇది  దారుణంగా  అనిపించవచ్చు.  కానీ  మీడియాకు ఇదేదో కొత్తగా పుట్టిన అలవాటూ కాదు.   ఎప్పటినుంచో ఉన్నదే!


 స్వాతంత్ర్య సమరయోధుడూ, శాసనసభ్యుడూ అయిన  వావిలాల గోపాలకృష్ణయ్య  ఓసారి అనారోగ్యం పాలయ్యారు.  ఆంధ్రజ్యోతి ఎడిటర్ గా  అప్పుడు నార్ల వెంకటేశ్వరరావు ఉన్నారు.
 
వావిలాల  గోపాలకృష్ణయ్య

నార్ల వెంకటేశ్వరరావు
 పత్రికలో పని చేసే తుర్లపాటి కుటుంబరావును నార్ల  పిల్చి , ‘పెద్దాయన కదా... ఏమో...  ఏమైనా  అనుకోనిది జరగొచ్చు.  వావిలాల జీవిత విశేషాలతో  కథనం  సిద్ధం చేయండి’ అని చెప్పారట.  ఆ ప్రకారమే  తుర్లపాటి కథనం రాసివుంచారు.

కానీ... వావిలాల చక్కగా అనారోగ్యం నుంచి తేరుకున్నారు; బాగా కోలుకున్నారు.
పత్రిక సిద్ధం చేసిన కథనం అప్పటికి వ్యర్థమైంది.

మరోసారి వావిలాల అస్వస్థులయ్యారు.
ఈసారి కూడా  పత్రికల ముందస్తు తయారీ వార్తలకు  పని కల్పించకుండా ఆయన  హాయిగా  కోలుకున్నారు.

కొంతకాలం గడిచింది. వావిలాల  క్షేమంగానే ఉన్నారు కానీ...  ఎడిటర్ గా  పదవీ విరమణ చేసిన  నార్ల వెంకటేశ్వరరావు  కన్నుమూశారు!

తుర్లపాటి కుటుంబరావు
వావిలాలను కలిసినప్పుడు  తుర్లపాటి  తమ పత్రిక చేసిన తమ ముందస్తు ‘నివాళి’  ఏర్పాట్ల సంగతులన్నీ  దాచకుండా  చెప్పేశారు.  పైగా  ‘చిరంజీవి వావిలాల’ అన్న బిరుదును కూడా ఆయనకు ఇచ్చేశారు.

నార్ల   (డిసెంబరు 1908-1985)  మరణించిన తర్వాత మరో  18 సంవత్సరాలు జీవించారు వావిలాల (సెప్టెంబరు 1906- 2003).
  
ఒక్క ఆంధ్రజ్యోతే కాదు,  మిగిలిన  అన్ని పత్రికలూ  వావిలాల... ఆయన లాంటి  పెద్ద వయసు ప్రముఖుల  గురించి ముందస్తు కథనాలు సిద్ధం చేసుకుంటూనేవుంటాయి.  వృత్తి ధర్మం  అలా ఉంటుంది.  

ఈ సందర్భంగా ఓ జోక్ గుర్తొస్తోంది.

ఒక యువకుడు పల్లెటూళ్ళో ఉన్న  తొంబై ఏళ్ళు దాటిన వృద్ధుడిని కలిశాడు. పిచ్చాపాటీ అయ్యాక  పట్నం  వెళ్ళటానికి  సెలవు తీసుకుటూ...  ‘తాత గారూ,  నేను రావటానికి చాలాకాలం పడుతుంది.  మిమ్మల్ని మళ్ళీ చూస్తానో లేదో..’ అన్నాడట.  తాత గారు తాపీగా  ‘ఏం నాయనా, నీ ఆరోగ్యం బాగానే ఉన్నట్టుంది కదా.. ఎందుకంత నిరాశ!  ఫర్వాలేదు, నీకేం కాదులే’  అని ధైర్యం చెప్పాడట.  

 

ఎన్నో  వ్యక్తిత్వాలు
ఈ మధ్య గొల్లపూడి మారుతీరావు రాసిన ‘ఎలిజీలు’ అన్న పుస్తకం చదివాను.  రాజకీయ,  సాంస్కృతిక, సేవా  రంగాలకు చెందిన 79 మంది వ్యక్తులను వారి మరణానంతరం  స్మరించుకుంటూ రాసిన ఆత్మీయ రచనలివి.  గొల్లపూడి వ్యక్తిగత కోణంలో  ఆ ప్రముఖుల వ్యక్తిత్వాలు మనకు పరిచయమవుతాయి.

కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, దాశరథి,  జరుక్ శాస్త్రి, చెలం,  ఆత్రేయ, రావిశాస్త్రి, బుచ్చిబాబు, ఉషశ్రీ, ఎమ్వీయల్,  ఎన్టీఆర్, ఏఎన్నార్, ఆరుద్ర, భానుమతి, ఎస్ వరలక్ష్మి, జగ్గయ్య, అంజలీదేవి, కొమ్మూరి వేణుగోపాలరావు,  మాలతీ చందూర్, రమణ , బాపు,  వేటూరి, బాలచందర్ .. ఇంకా ఎందరో!

గొల్లపూడి  వ్యాసాల్లో నాకు నచ్చని భావాలు కొన్ని ఉంటుంటాయి   కానీ ఇలా నివాళి వ్యాసాలను రాయటంలో ఆయన చూపే  ప్రతిభ,  చక్కని  పోలికలతో  వాక్యాలను  ఆర్ద్రంగా అల్లే  తీరూ  నాకు  నచ్చుతుంది.  

ముందుమాటలో  ఇలా అంటారు- ‘ఇది నాలుగో ముద్రణ.  (2016). ప్రతిసారీ నిష్క్రమించిన ఎందరో సన్నిహితులు, పెద్దలు, మిత్రుల  జ్ఞాపకాలతో ఈ పుస్తకం మరింత బెంగనీ, దు:ఖాన్నీ పెంచుకుంటూ ఉంది.  ...  ఈ పుస్తకంలో ప్రతి పేజీ నా  హృదయాన్ని బరువెక్కిస్తుంది. ఎన్ని జ్ఞాపకాలు! ఎంత దూరం ఈ  ప్రయాణం. ఆయా వ్యక్తుల పరిచయం, సౌహార్దం అనే పుప్పొడితో ఈ జీవన మాధుర్యానికి రుచి పెరిగింది. వీరంతా ఈ జీవితాన్ని అలంకరించిన ఆప్తులు, జీనన యోగ్యం చేసిన ఓషధులు. ఈ ఆప్త వాక్యాలతో ఆయా వ్యక్తులను తలచుకోవడం ఓ నిస్సహాయమైన ఓదార్పు.  చరిత్రగా మిలిగే నిట్టూర్పు. ... మరో ముద్రణ అంటే భయమేస్తుంది. మరెంతమంది ఆప్తులను నష్టపోతానో అని.’

  రావూరి భరద్వాజ స్మతి సాహిత్యం 


తెలుగులో స్మృతి రచనలు చాలా వచ్చాయి కానీ..  దినచర్య రూపంలో మొదట వచ్చింది.. రావూరి భరద్వాజ ‘నాలోని నీవు’  పుస్తకంతోనే.

భార్య కాంతమ్మ వియోగ దు:ఖం  తాను చనిపోయేవరకూ ఆయన్ను  వదల్లేదు.  తన కష్టాల్లో, కన్నీళ్ళలో కలిమి లేముల్లో  భాగస్వామి అయిన అర్ధాంగి కాంతమ్మ జ్ఞాపకాలకు విస్తృతంగా అక్షరరూపమిచ్చారు.  డైరీల్లో తన వేదననూ, దు:ఖోద్వేగాలనూ నిక్షిప్తం చేశారు.

అవి పుస్తకాలుగా వచ్చాయి.  ‘ నాలోని నీవు’ తో పాటు   ‘అంతరంగిణి’, ‘ అయినా ఒక ఏకాంతం’, ‘ఐతరేయం’, ‘ ఒకింత ఏకాంతం’  భరద్వాజ  స్మృతి సాహిత్యమే.



ఆయన డైరీల్లోని కొన్ని వాక్యాలు...
‘... కాంతమ్మ స్మృతులు నన్ను కకావికలు చేస్తున్నాయి...పీల్చుకు తింటున్నాయి. కాల్చుకు తింటున్నాయి. ఎన్నోజన్మల పుణ్యం వల్ల గానీ అలాంటి ఉత్తమురాలు భార్యగా దొరకదు.’

‘... నాకింకో జన్మ అంటూ ఉంటే, కాంతమ్మ గర్భవాసాన జన్మించి, ఆమె రుణం తీర్చుకొంటాను.’

 ‘మళ్ళా, మళ్ళా, మళ్ళా- నిన్నెప్పుడైనా చూస్తానా? నా పిలుపు,నా రోదన, నీదాక రావడం లేదా? రావడం లేదా? రావడం లేదా కాంతం? ’


బతికున్నపుడే నివాళి

ప్రాణం పోయాక  ‘అంత మంచి, ఇంత గొప్ప’  అంటూ  ఎన్ని విశేషాలతో,  ఎంత రాసినా  దానివల్ల  ఏమిటి ప్రయోజనం  అనే ప్రశ్న నాకు వస్తుంటుంది.

తనకు  ప్రపంచం అర్పించే  నివాళిని  ఏ వ్యక్తీ  చూడలేడు.  (లోక్ నాయక్  జయప్రకాశ్ నారాయణ్,  సాహితీ వేత్త  రోణంకి అప్పలస్వామి లాంటివారు చనిపోకముందే  వారు మరణించారని  పొరపాటు వార్తలు వచ్చాయి. అలాంటి సందర్భంలో  తప్ప...)

 ప్రజా కవి  సుద్దాల హనుమంతు తనపై రాసిన ‘నివాళి’ని తను జీవించివున్నపుడే విన్నారట.


డా.  ద్వా.నా శాస్త్రి  సంకలనం చేసిన ‘మా నాన్న గారు’ అనే పుస్తకం 2009లో వచ్చింది. దానిలో కీర్తిశేషులైన 62 మంది సాహితీ ప్రముఖులను తల్చుకుంటూ వారి కుటుంబ సభ్యులు రాసిన వ్యాసాలున్నాయి.

సినిమా పాటల కవి  సుద్దాల అశోక్ తేజ తన తండ్రి సుద్దాల హనుమంతు గురించి  వ్యాసం రాశారు.  అందులోని ఓ భాగం చూడండి-

సుద్దాల హనుమంతు

సుద్దాల అశోక్ తేజ
 ‘ఆ రోజుల్లోనే నాకో ఆలోచన వచ్చింది- ప్రపంచంలో ఎంత మహానుభావుడికైనా చనిపోయాక కదా స్మృతి గీతం రాస్తారు. మావో, గాంధీ, లెనిన్, శ్రీశ్రీ ఎవరైనా తన స్మృతి గీతం తను వినరు కదా, నాన్న స్మృతి గీతం రాసి నాన్నకే వినిపిస్తే అనిపించింది. తప్పో - ఒప్పో నాకు తెలియదు. నేను మా నాన్న కనుమూయకముందే (క్యాన్సర్ తో బాధపడుతున్న సమయం...)  నాన్న స్మృతి గీతం రాశాను.  నాన్నకి ఏడుస్తూ వినిపించాను. 

పాట వినిపించడం పూర్తయింది. నాన్న తప్ప ఇంట్లో అందరం ఏడుస్తున్నాం. మా నాన్న రెండు చేతులు చాపి నన్ను పిలిచాడు. కౌగిలించుకున్నాడు. తన భుజంపై నా దు:ఖబాష్పాలు... నా భుజంపై నాన్న ఆనంద బాష్పాలు... నా వీపు నిమిరిన నాన్న చేతుల స్పర్శ... భుజంపై నాన్న ఆనంద బాష్పాల తడి ఇప్పటికీ ఆరిపోలేదు... ఎప్పటికీ ఆరిపోదు.’


ఇలా బతికున్నపుడే ఎలిజీ రాయటం ‘తప్పో ఒప్పో నాకు తెలియదు’  అన్నారు కదా అశోక్ తేజ.  నేను కూడా  అది సరైనదనో,  కాదనో   నిర్దిష్టంగా  ఒక అభిప్రాయానికి రాలేకపోతున్నాను!