సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

29, జులై 2014, మంగళవారం

ఇరవై ఏళ్ళ తర్వాత కలిసిన ‘మంచి మిత్రులు’!



చిన్నప్పుడు ఒక  తెలుగు నవల చదివాను.  చివరి పేజీలు చినిగిపోయిన ఆ  పుస్తకం  పేరు గుర్తులేదు.  రచయిత పేరు తెలియదు.  అక్క చెల్లెళ్ళు  ప్రధాన పాత్రలు. ధనికురాలైన అక్క  పేద చెల్లెలి పట్ల నిర్దయగా ప్రవర్తిస్తుంటుంది. చెల్లెలి భర్త  ఏదో వ్యాధితో బాధపడుతుంటాడు. పేరు విభూది బాబు అని గుర్తు.  (ఈ పేరుబట్టే అది బెంగాలీ అనువాద నవల అని ఊహిస్తున్నాను. )  ఈ కథలోని విషాదం వల్లనేమో..... ఇన్నేళ్ళుగా  ఆ నవల గురించి మర్చిపోలేదు. పాత పుస్తకాల షాపులకూ , లైబ్రరీలకూ వెళ్ళినపుడు అప్రయత్నంగానే  దీని  కోసం  వెతుకుతుంటాను!

అది గొప్ప పుస్తకం అని కాదు. కానీ  దొరికితే  మళ్ళీ చదవాలని ఎందుకంత ఆసక్తి?  కథ మొత్తం తెలుస్తుందనే కాదు; ఇన్నేళ్ళ తర్వాత  చదివితే ... పాత జ్ఞాపకాలను తడిమి చూసుకోవచ్చనే కోరిక కూడా కారణమనుకుంటాను.

ప్రాణం లేని పుస్తకాలకే ఇంత శక్తి ఉంటే మరి సజీవమైన మనుషుల సంగతి?

బాగా తెలిసిన వ్యక్తులను ఈ జీవన ప్రయాణంలో పెద్ద విరామం తర్వాత మళ్ళీ చూడటం థ్రిల్ కలుగజేస్తుంది.  

ఓ హెన్రీ  ఓ కథ
ఈ ‘పునర్దర్శనం’లో  మానవాసక్తికరమైన ఎలిమెంట్ ఉంది  కాబట్టే  కొసమెరుపు రచయిత ఓ హెన్రీ  After twenty years  అనే కథానిక రాశాడు.

స్కూలు రోజుల్లో ఇంగ్లిష్ పాఠ్యపుస్తకంలో చదివాను. కథ నచ్చింది కానీ,  అప్పుడు రచయిత ఎవరో పట్టించుకోవాలని తెలియదు.  తర్వాతి కాలంలోనే  దీన్ని రాసింది సాక్షాత్తూ ఓ హెన్రీ అని తెలిసింది.

ఇద్దరు స్నేహితులు బతుకు తెరువు కోసం వేర్వేరు చోట్ల బతకాలని  నిశ్చయించుకుని మళ్ళీ  ఇరవై సంవత్సరాల తర్వాత అదే సమయానికి అక్కడే కలుసుకోవాలని నిర్ణయించుకుంటారు. వాళ్ళిద్దరూ కలుసుకుంటారా? అప్పుడేమవుతుంది?  ఇదీ కథాంశం.

ఊహించని మలుపు ప్రవేశపెట్టి పాఠకులను ఆకట్టుకునే నేర్పును రచయిత దీనిలో ప్రదర్శించాడు.

ముఖ్యంగా నాటకీయతతో పాటు రిటార్టుతో పదునుగా ఉండి, కథ ముగిసినా వెంటాడే సంభాషణలు- 

"Twenty years is a long time, but not long enough to change a man's nose from a Roman to a pug."

"It sometimes changes a good man into a bad one"

ఈ కథ ను ఈ లింకు లో చదవొచ్చు. ఆసక్తి ఉన్నవారు ఆడియో (7.5 నిమిషాలు) కూడా వినొచ్చు.

నూటెనిమిది ఏళ్ళ క్రితం...
1906 లో రాసిన ఈ కథకు అనుసరణలుగా  ఎన్నో భాషల్లో ఎన్నో కథలు వచ్చాయి.

ఓ హెన్రీ కథలు తెలుగులో ఎప్పుడో అనువాదాలుగా వచ్చాయి. శ్రీరాగి అనువాదం చేసిన ఈ  After twenty years తెలుగు అనువాదం ఇక్కడ చదవొచ్చు.


ఎందుకు నచ్చింది?
ఇద్దరు స్నేహితులు ఇరవై సంవత్సరాల తర్వాత... తాము అనుకున్న మాటను సిన్సియర్ గా గుర్తుంచుకుని కలుసుకోవాలనుకోవటం-  బాగా నచ్చిన పాయింట్.  స్నేహం కంటే విధినిర్వహణకే  ప్రాముఖ్యం ఇవ్వటం చిన్నప్పుడు ఎంతో నచ్చేవుంటుంది.

కానీ దీన్నిప్పుడు చదివితే జిమ్మీ ప్రవర్తనలో కొంత లోపం కనిపించి, అతడి వైఖరి అంత గొప్పగా అనిపించటం లేదు!

కథ ప్రకారం- వెయ్యి మైళ్ళు ప్రయాణం చేసి తనను కలుసుకోవటానికి వచ్చిన ‘బాబ్’తో  ‘జిమ్మీ’ ప్లెయిన్ గా వ్యవహరించలేదు. బాబ్ మొహం లైటర్ వెలుగులో చూడకముందే  జిమ్మీకి అతడెవరో అర్థమైవుండాలి.  "I'm just waiting for a friend. It's an appointment made twenty years ago...’  అని స్పష్టంగానే చెప్తాడు బాబ్.  వెంటనే జిమ్మీ సంతోషాన్ని గానీ, ఎక్సైట్ మెంటును గానీ ఏమీ ప్రదర్శించలేదు.

అలా గంభీరంగా ప్రవర్తించటం అతడికి ‘డ్యూటీ’నేర్పిన కిటుకో, సహజంగా వచ్చిన అలవాటో తెలియదు కానీ అది అసహజంగానే ఉందనిపిస్తోంది. 

కథలో చెప్పనంతమాత్రాన  జిమ్మీ మానసిక సంఘర్షణ పడలేదని చెప్పలేం. నోట్ రాసి, వేరే వ్యక్తిని పంపించడంలో అది సూచనప్రాయంగా కనపడుతుంది. తను సకాలానికే ‘సంకేత స్థలానికి’ వచ్చానని మిత్రుడికి తెలియజెప్పిన సిన్సియారిటీని  కూడా అతడు ప్రదర్శించాడు. ‘నోట్ ’ చదివిన బాబ్ చేతులు వణకటం దేనికి సూచన? అరెస్టు భయానికా? మిత్రుడి నిబద్ధతను  తెలుసుకున్నందుకా?  ప్రియమిత్రుడి  ప్రమేయంతో  చిక్కుల్లో పడ్డానే అన్న బాధతోనా?  దేనికైనా కావొచ్చు.

ఇంత చిన్న కథలో  పేజీల కొద్దీ విశ్లేషణ చేయదగ్గ అంశాలున్నాయి. ఏమైనా దీని గురించి ప్రస్తావించే  సందర్భాల్లో  ‘జిమ్మీ ప్రవర్తన సవ్యమైనదా? కాదా? ’ అనే చర్చ జరుగుతూనే ఉంది.

కామిక్ రూపంలో....
ఈ కథను  కామిక్ బొమ్మల రూపంలో కూడా చదవటం ఆసక్తికరంగా ఉంటుంది. మన ఊహల్లో ఉన్నవ్యక్తులూ, పరిసరాలూ కళ్ళముందుకు వస్తారు.

పైకో క్లాసిక్స్ సంస్థ ప్రచురించిన ‘The best of O henry ’ పుస్తకంలో ఈ కథ ఉంది.

దీన్ని  సచిత్రంగా ఇక్కడ చదవొచ్చు.

ఇలస్ట్రేషన్లు వేసినవారు- యాంటన్ కారవానా.



రెండు విరుద్ధ మార్గాలు పట్టిన ఈ స్నేహితుల కథ  చదివాక-  ‘మంచి మిత్రులు’ (1969)  సినిమాలోని ‘ఎన్నాళ్ళో వేచిన ఉదయం’ పాట గుర్తొస్తుంది!