సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

31, డిసెంబర్ 2017, ఆదివారం

రాబిన్ సన్ క్రూసో ... ఆర్థికశాస్త్ర విశేషం

1719లో తొలి ప్రచురణ
క్కడో ఇంగ్లండ్ లో పుట్టి  దేశదేశాల పాఠకులకు చేరువయ్యాడు ..
రాబిన్ సన్ క్రూసో !


నా చిన్నప్పుడు మా అన్నయ్యల ఇంగ్లిష్ పాఠ్యపుస్తకం ద్వారా  పరిచయమయ్యాడు.  
 
ఎటు చూసినా అంతు లేని సముద్రం... లోపల ప్రమాదాలకు ఆలవాలమైన చిన్న దీవి!
నర మానవుడు కనపడని ఆ నిర్జన ప్రాంతంలో ఒంటరిగా బతకాల్సిరావటం ఎంతటి భయానకం!
ఆశ లేశమైనా లేని పరిస్థితుల్లో గొప్ప నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో  అక్కడ 28 సంవత్సరాలు  జీవించి,
ఆ ద్వీపం నుంచి బయటపడ్డాడు రాబిన్ సన్ క్రూసో ! 

అప్పుడు కథ సారాంశం మాత్రమే తెలుసు.  వివరంగా తెలియదు. రాబిన్ సన్ నిర్భీతీ, తెలివితేటలూ, ప్రణాళిక ప్రకారం దీవిలో జీవితాన్ని తీర్చిదిద్దుకున్న తీరూ ..ఇవన్నీ ఇష్టపడ్డాను.

డిగ్రీ కోర్సులో పరోక్షంగా ప్రస్తావనకు వచ్చిన క్రూసో.. ఆ తర్వాత  చదివిన  రంగనాయకమ్మ ‘ కాపిటల్ పరిచయం’లో మళ్ళీ తారసపడ్డాడు!

డేనియల్ డెఫో ఇంగ్లిష్ లో  రాసిన ఈ నవలను  సొదుం రామ్మోహన్ సంగ్రహంగా తెలుగులోకి అనువదించారు.  పీకాక్ క్లాసిక్స్ వారు ప్రచురించారు.


ఈ మధ్య దీన్ని  మళ్ళీ  చదివాను.

దీని గురించి ఏదైనా  రాయాలనుకున్నపుడు  రాబిన్ సన్ క్రూసో ఒరిజినల్ తో పాటు రెండు వర్షన్ల  కామిక్స్, ఇంకా  వన్ సిలబల్ వర్డ్స్ తో రాసిన నవల... ఇవన్నీ పరామర్శించాను.




క్రూసో వివిధ చిత్రకారుల ఊహల్లో ఎలా ఉన్నాడో  చూశాను.

1719లో మొదటిసారి ఇంగ్లండ్ లో ప్రచురితమైందీ నవల.  రెండు శతాబ్దాల తర్వాత ఈ నవలకు బొమ్మలు వేసే అవకాశం  1920లో  ఎన్.సి. వయత్ కు దక్కింది.

 
దాన్ని ఆయన అపూర్వంగా సద్వినియోగం చేసుకున్నాడు.

‘Do my pictures add a little to the vividness of this story? Do I aid a little in the clearer vizualization of Robinson Crusoe as he moves about on his sunny island? That is the most I can hope for. ' 


ఇంత వినమ్రంగా చెప్పుకున్న వయత్ వేసిన బొమ్మలు కొన్ని చూడండి-













 ***

సొదుం రామ్మోహన్ చేసిన అనువాదం  బాగుంది. ముందుమాటలో ఆయన అంటారు-

 ‘‘ప్రకృతి విసిరిన ప్రతికూల పరిస్థితులను ఎలా అనుకూల పరిస్థితులుగా మార్చుకోవచ్చునో ఈ పాత్ర పిల్లలకే కాదు పెద్దలకూ బోధిస్తుంది....అన్వేషణా స్ఫూర్తి, సాహసం, తెగువ, ఆత్మవిశ్వాసం, భవిష్యత్తుపై చెరగని ఆశ- ఇవీ క్రూసో లోని ప్రధాన లక్షణాలు’’

తన దుస్థితి గురించి ఆలోచిస్తూ  క్రూసో   ప్రతికూల అనుకూల అంశాలను రాసుకుని విశ్లేషించుకోవటం  గొప్పగా అనిపిస్తుంది.

‘‘నేను జనావాసం లేని దీవిలోకి వచ్చి పడ్డాను. ఇక్కడ నుంచి బయటపడతానన్న  ఆశలు లేవు ’’ 

దీన్నిప్రతికూల పరిస్థితిగా రాసుకున్న క్రూసో...
దాని ఎదురుగా సానుకూల పరిస్థితిని కూడా ఇలా  రాస్తాడు-

 ‘‘మొత్తానికి సముద్రంలో మునిగి చావకుండా ఇంకా సజీవంగానే ఉన్నా’’

మనిషి  సంఘజీవి (man is by nature a social animal) అని  చెప్పిన సోక్రటీస్ (క్రీస్తు పూర్వం 470 - 399) మాటలు ఎంత నిజమో క్రూసో కథ స్పష్టం చేస్తుంది.

దూరాన ఆగివున్న ఓడను చూసిన క్రూసో మానసిక స్థితిని రచయిత డేనియల్ డెఫో బాగా వర్ణిస్తాడు-

‘‘ఎక్కువమంది వద్దు...ఒక్కరంటే ఒక్కరు, ఒకే ఒక వ్యక్తి ఇటు వస్తే నేనెంత సంబరపడిపోతానో! 

ఎన్నేళ్ళయింది మనుషులతో మాట్లాడక......మనుషులతో మాట్లాడాలని నేను ఇంతకుముందెన్నడూ ఇంత గాఢంగా కోరుకోలేదు. 

కనీసం ఒక్క వ్యక్తి కూడా తోడు లేనందుకు నా హృదయం దు:ఖంతో లోలోతులకు కుంగిపోతోంది...’’.

మానవ ప్రపంచానికి సుదూరంగా ఉన్న ద్వీపంలో ఒంటరి మనిషి మనుగడ ఎలా ఉంటుందో  పరిశోధన చేసి రాసినట్టు  ఉంటుందీ నవల.

రచయిత డేనియల్ డెఫో
 300 వందల ఏళ్ళక్రితం రాసిన ఈ  నవల  ఇప్పటికీ ఉత్కంఠభరితంగానే ఉంటుంది.


రాబిన్ సన్ క్రూసో  వాస్తవిక వ్యక్తి కాదు. అది రచయిత కల్పనే.  మరి క్రూసోకు నమూనా ఎవరైనా ఉన్నారా? 

పసిఫిక్ ద్వీపం లో నాలుగేళ్ళు ఒంటరిగా గడిపిన నావికుడు అలెగ్జాండర్ సెల్ కిర్క్ (1676- 1721).  అతడే రియల్ రాబిన్ సన్.



ఆ సెల్ కిర్క్ గురించి   విలియం కౌపర్ (1731-1800) అనే కవి The solitude of Alexander Selkirk  అనే పొయెం రాశాడు.

దానిలో ఓ చిన్న భాగం-

O Solitude! where are the charms
That sages have seen in thy face?
Better dwell in the midst of alarms,
Than reign in this horrible place.


మనుషులెవరూ కనపడని  ఒంటరితనం ఎంత దుర్భరంగా ఉంటుందో చెప్పే ఈ పద్యాన్ని డిగ్రీ  పాఠ్యపుస్తకంలో  చదువుకున్నాను.

అప్పుడు కూడా క్రూసో గుర్తొచ్చాడు.

***

ధునిక కాలపు క్రూసో ఎవరంటే.. అడ్మిరల్ బర్డ్.

1934లో ఈ అన్వేషకుడు అంటార్కిటికాలో దక్షిణ ధ్రువాన్ని కప్పే విశాలమైన మంచుదిబ్బలో దాదాపు కూరుకుపోయిన గుడిసెలో ఐదు నెలల పాటు ఒంటరిగా గడిపాడు.  చుట్టు పక్కల వందమైళ్ళ దూరంలో ఎలాంటి ప్రాణీ లేని నిర్జన ప్రదేశమది. మైనస్ 80 డిగ్రీల విపరీతమైన చలి... కటిక చీకటి...లాంతరు మాత్రం ఉంది. 


Alone అనే తన రచనలో బర్డ్ తన అనుభవాలను రికార్డు చేశాడు. 


డేల్ కార్నెగీ 1948లో రాసిన - How to stop worrying and start living (తెలుగులో- ఆందోళన చెందకు ఆనందంగా జీవించు) లో  బర్డ్ ప్రస్తావన వస్తుంది.


***

స్తువులూ -విలువలూ -మారకాలకు సంబంధించి ఆర్థిక శాస్త్ర అంశాన్ని చెప్పటానికి  కార్ల్ మార్క్స్ ‘కాపిటల్’ లో  రాబిన్ సన్ క్రూసోను కోట్ చేస్తాడు.



రాబిన్ సన్ దీవిలో ఒక్కడే వేర్వేరు రకాల శ్రమలు చేశాడు. జంతువుల్ని వేటాడటం, చేపలు పట్టడం, ఇల్లు కట్టుకోవడం, వంట చేసుకోవడం, మేకల్ని పెంచడం...ఇలా.  వాటిని ఉపయోగించుకోవటంలో అతడికెలాంటి సమస్యా రాలేదు.  

ఆ దీవిలోకి రాబిన్ సన్ ఒక్కడే కాకుండా పగిలిపోయిన ఓడ నుంచి మరికొంత మంది మనుషులు కూడా వచ్చివుంటే? అందరూ తలో శ్రమా చేసి తయారుచేసుకున్న వస్తువుల్నీ, పదార్థాల్నీ అందరూ సమష్టిగా ఉపయోగించుకుంటే బాగానే ఉంటుంది.

అలా కాకుండా ఎవరికి వాళ్ళే తాము తయారుచేసుకున్న వస్తువులకు సొంతదారులుగా ఉండి, వాటిని ఇతరుల వస్తువులతో ‘మారకాలు’ చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది?

వాళ్ళంతా ‘విలువల గందరగోళం’లో  పడిపోతారని మార్క్స్ చెపుతాడు.

ఆ వస్తువుల్లో శ్రమకాలాలు రకరకాలుగా ఉన్నాయి కాబట్టి  వాటికి రకరకాలుగా మారకపు విలువలు ఏర్పడి వాటిని మార్చుకోవడంలో చిక్కులు మొదలయ్యేవి. పోట్లాటలూ, కొట్లాటలూ, నరుక్కోవడాలతో ఆ దీవి లో ప్రశాంతత భగ్నమయ్యేది.

ఆ వస్తువులన్నిటి సొంతదారు రాబిన్ సన్ ఒక్కడే కాబట్టి .. తన  వస్తువులను తన ఇతర వస్తువులతో  మారకం చేసుకోనక్కర్లేదు కాబట్టి... ఆ దీవిలో మారకపు విలువల తల నొప్పుల నుంచి తప్పించుకోగలిగాడు రాబిన్ సన్.

అంటే... మనుషులంతా శ్రమలు చేస్తూ ప్రణాళికతో వస్తువులు ఉత్పత్తి చేసుకుని, వాటిని సమష్టిగా (ఎవరి అవసరం మేరకు వారు) వాడుకోవటం మాత్రమే శాస్త్రీయమైన, ఉన్నతమైన మార్గం... అని చెపుతాడు మార్క్స్.

సమ సమాజపు ఈ ఊహ నిజమైతే.. ఎంతో బాగుంటుంది కదూ..!