సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !
తెలుగు భాష లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తెలుగు భాష లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, సెప్టెంబర్ 2019, శుక్రవారం

బాల రాహుల్... గాన లాహిరి!



లేత గొంతు నుంచి  జాలువారే  ఆ  తీయని గానం  జనం  మనసులను ఇట్టే కట్టిపడేస్తుంది.  

ఆ  బెంగళూరు బాలుడి గళ  వశీకరణం అలాంటిది.

పేరు-  రాహుల్ వెల్లాల్ !  

‘వెల లేని పువ్వు కదా మనిషికి చిరునవ్వు!’ 
అంటుంది కవయిత్రి   యం.బి.డి. శ్యామల,  ఓ  గజల్ లో.     

రాహుల్ వెల్లాల్ ను వీడియోల్లో చూస్తుంటే... ఆ వాక్యమే గుర్తొస్తుంది!

పాడుతున్నంతసేపూ చెదరని  మందస్మితం.  స్వచ్ఛంగా,  అమాయకత్వం ఉట్టిపడే  చిలిపి  చిరునవ్వు.

మంద్ర-మధ్య- తార స్థాయి  శ్రుతులకు తగ్గట్టుగా -
తలను  చిన్నగా అటూ ఇటూ కదలిస్తూ...
ఒక్కోసారి కళ్ళు మూస్తూ.. 
చేతులను  భావ స్ఫోరకంగా  పైకెత్తుతూ ..  
తాదాత్మ్యంతో
ఆరోహణ... అవరోహణలతో
రాహుల్   పాడుతూవుంటే...  

త్యాగయ్య   చెప్పినట్టు- ‘నాభీ హృత్కంఠ రసన నాసాదుల యందు’ పాడుతున్నాడా అనిపిస్తుంది !
   
బాణీలోని  తీయదనం పంచుతూ  పాట  శ్రోతలకు  రసానుభవాన్ని అందిస్తుంది.  

*     *     * 


ఎస్ వీ భక్తి చానల్ లో ప్రసారమైన.. ‘అన్నమయ్య పాటకు పట్టాభిషేకం’  పాటల కార్యక్రమాలు హైదరాబాద్ లోనే జరిగాయి. వాటిలో రాహుల్ తన గాన వైదుష్యంతో  మెరిశాడు.

‘అయ్యో  నేనేకా అన్నిటికంటె దీలు..’  అనే   పాటను  రాహుల్  పాడుతుంటే   వేదిక మీద  ఉన్న గాయని సునీత   కదిలిపోయి,  కన్నీరు  కార్చి  ‘మనసూ, దేహం, ఆత్మా స్వచ్ఛమయ్యాయి’ అంటూ’   సభాముఖంగా చెప్పారు.  

సంగీత దర్శకుడు   కీరవాణి ‘ రాగమయి అయిన   సరస్వతి రాహుల్ వెల్లాల్ లో  కనిపించింది’   అంటూ మెచ్చుకున్నారు.

బాణీని  సరిగా  నేర్చుకుని  సంగీతపరంగా లోపాల్లేకుండా , భాషాపరంగా  ఉచ్చారణ దోషాల్లేకుండా పాడినంతమాత్రానే  ఏ పాటా మీటదు హృదయాల్ని.  సాహిత్యంలోని  భావం గ్రహించి రసానుభూతితో పాడటం కదా ముఖ్యం!

సంగీతం సమకూర్చిన జోశ్యభట్ల శర్మ  గారి నుంచి  ఆ పాట అర్థం  చెప్పమని అడిగి,  తెలుసుకున్నాకే  నేర్చుకుని పాడాడు  రాహుల్.    

అంత శ్రద్ధ ఉంది కాబట్టే..   తనకు  మాతృభాష కాని తెలుగులో 500 సంవత్సరాల క్రితం అన్నమయ్య  రాసిన పాటల విషయంలో  తనకుండే  పరిమితులన్నిటినీ అలవోకగా దాటేశాడు. అనితర సాధ్యమన్న రీతిలో  పాడేశాడు!

‘అన్నమయ్య పాటకు పట్టాభిషేకం’  సిరీస్ లో రాహుల్ పాడిన -

* ‘అమ్మేదొకటియును..అసిమ లోని దొకటీ’
* ‘శోధించి చూడబోతే..’ 
*  ‘ఏమని నుతించవచ్చు..’

పాటలు కూడా బాగుంటాయి.
   

*     *     *  

సాన పెట్టిన  కులదీప్ పాయ్

రాహుల్   వయసు ఇప్పుడు   పన్నెండేళ్ళు.  అయితే  ఇతడి ప్రతిభ ప్రపంచానికి   మూడేళ్ళ క్రితమే పరిచయం.


రెండేళ్ళ పసి వయసులో రాహుల్   పాటను గుర్తించటం, హమ్ చేయటం చూసి సంగీతం పట్ల అతడి ఆసక్తిని గమనించారు తల్లిదండ్రులు.  అంత చిన్నవయసులో సంగీత ఉపాధ్యాయులెవరూ  నేర్పలేమంటే..  నాలుగేళ్ళ వయసు వచ్చాక,  శిక్షణలో ప్రవేశపెట్టారు. 

సంగీత పాఠశాల వార్షికోత్సవంలో ఆరేళ్ళకే అరగంటసేపు మొదటి సంగీత కచ్చేరీని ఇచ్చేశాడు.  మరో ఏడాదికి బెంగళూర్ లోని ఓ గుడిలో పాటల లిరిక్స్ కాగితాలేమీ చూడకుండా, వాద్యకళాకారులతో  రిహార్సల్స్ లేకుండానే గంటన్నర సేపు రెండో కచ్చేరీ చేశాడు. 

బెంగళూరులోనే ఉండే కళావతి అవధూత  అతడి సంగీత గురువు.

నాలుగేళ్ళ క్రితం  సూర్య గాయత్రిని  చిన్న వయసులోనే   డిస్కవరీ చేసి, సంప్రదాయ సంగీతంలో అద్భుత గాయనిగా   తీర్చిదిద్దిన  కులదీప్ ఎం. పాయ్  తెలుసుగా?  

రాహుల్   వెల్లాల్   ప్రతిభకు సానపెట్టి   చక్కని పాటలు పాడించి మనందరికీ తెలియజేసింది కూడా   కులదీప్ పాయే..!

 ముగ్గురు... గురు శిష్యుల ఆటవిడుపు

 ( రాహుల్ ని మహావిష్ణువుగా,  సూర్య గాయత్రిని  సోదరి పార్వతిగా,  ఎత్తుకుని మోస్తున్న తనను ఆదిశేషుడిగా పోల్చుకుంటూ కులదీప్  ఈ ఫొటోకు సరదా వ్యాఖ్య  రాశారు). 




సూర్య గాయత్రితో కలిసి... 

కులదీప్ పాయ్ నిర్దేశకత్వంలో... సూర్య గాయత్రితో కలిసి రాహుల్ వెల్లాల్  పాడిన  అన్నమయ్య తెలుగు సంకీర్తనలు యూ ట్యూబ్ లో విడుదలై   లక్షలమంది సంగీతాభిమానులను  పరవశులను చేస్తున్నాయి. 
  
*    ‘బ్రహ్మమొక్కటే.. పర బ్రహ్మమొక్కటే’ 

*    ‘ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడే’



‘ గతియై మమ్ము గాచే కమలాక్షుడూ’  అని  స్థాయిని తగ్గించి పాడేటప్పుడు రాహుల్  కర విన్యాసం గమనించండి.  

కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన ఈ  బాల మేధావులు తమిళనాడులో స్థిరపడిన  కులదీప్ ఆధ్వర్యంలో తెలుగు పాటలను  శ్రవణపేయంగా  పాడటం  ముచ్చటగా అనిపిస్తుంది.  

రాహుల్ ఒక్కడే పాడిన పాటలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఎంతో బాగున్నవాటిలో..

సదాశివ బ్రహ్మేంద్ర సంస్కృత రచన -
* ‘పిబరే రామరసం’



 మీరాబాయి హిందీ రాజస్థానీ భజన-

  *‘పాయో జీ మైనే రామ్ రతన్ ధన్ పాయో’



ఈ పాటలో స్వర విన్యాసాలు చాలా బాగుంటాయి.  ముఖ్యంగా  వీడియోలో 5.02 నిమిషాల దగ్గర ‘మీ...రా.. కే ప్రభూ’ అనేచోట శ్రోతలను  సమ్మోహితులను చేస్తాడు.    


వైవిధ్యం.. మాధుర్యం
 
13వ శతాబ్దం నాటి సంత్  జ్ఞానేశ్వర్ అభంగ్ లూ, 
15వ శతాబ్ది నాటి అన్నమయ్య  సంకీర్తనలూ, 
వ్యాసరాయ తీర్థ  కన్నడ కృతులూ,
16 శతాబ్దపు మీరాబాయి  భజనలూ, 
17వ శతాబ్దానికి చెందిన రామదాసు కీర్తనలూ,
18-19 శతాబ్దాలకు చెందిన త్యాగయ్య కీర్తనలూ, 
సదాశివ బ్రహ్మేంద్ర  కీర్తనలూ...

రాహుల్ వెల్లాల్ గొంతులోని  వైవిధ్యాన్నీ, మాధుర్యాన్నీ వెలారుస్తున్నాయి. 

ముఖ్యంగా మన  తెలుగు పాటలను ఎంత చక్కని ఉచ్చారణతో  పాడుతున్నాడో!  ( సూర్య గాయత్రి దీ ఇదే తీరు).   

‘ద లయన్ కింగ్ ’ తెలుగు అనువాద చలన చిత్రంలో  రాహుల్  ‘నేనే రాజా ఎప్పుడౌతానూ ’ అనే హుషారు పాటను హరిప్రియ, రాములతో కలిసి పాడాడు.

సినీరంగంలో బహుశా తన తొలి అడుగు ఇదే.

మన బాలమురళీ కృష్ణ తనకు ఆదర్శం అని చెపుతాడు.

ఇలా మొత్తానికి రాహుల్ కీ తెలుగుకూ  చాలా అనుబంధం పెరుగుతున్నట్టే ఉంది. 

వెంటాడుతున్న అభంగ్ 

ఈ జనవరిలో విడుదలైంది  రాహుల్ పాడిన ‘యోగ యాగ విధీ.. యేణే నోహే సిద్ధి వాయాచి ఉపాధి దంభ ధర్మ'
 అనే  సంత్ జ్ఞానేశ్వర్ ‘ హరిపాఠ్ అభంగ్’. 

నేను విన్నది కొద్ది రోజుల క్రితమే. కులదీప్ ఎం. పాయ్  అద్భుతమైన  స్వరకల్పన, రాహుల్  తాదాత్మ్యతతో పాడిన విధానం గొప్పగా ఉన్నాయి.

ఈ మధ్య కాలంలో నన్ను బాగా  హాంట్ చేసేసి, ఎక్కువ సార్లు వినేలా చేస్తున్న మరాఠీ  పాట ఇది. 

మీరూ ఆ వీడియో చూడండి-



అష్టాంగ యోగాలూ, యాగాలూ లాంటి తంతులు మనిషికి  ముఖ్యం కాదనీ,  అవి డాంబికానికే, అహంకారానికే పనికొస్తాయనీ ఈ అభంగ్  చెపుతుంది. అలాగని ఇది  హేతువాద రచనేమీ కాదు.  ఆధ్యాత్మిక  ‘సిద్ధి’ని ప్రబోధించేదే.  

రాహుల్ గాన కళా చాతుర్యం
ఇంతగా వికసించటానికి స్వయం ప్రతిభతో పాటు  తల్లిదండ్రుల ప్రోత్సాహం తొలి కారణం. గురువుల,  పాటల సంగీత దర్శకుల, వాద్య బృందాల  సహకారమూ ఎంతో  ఉంది.  

ఇతణ్ణి  అభినవ బాలమురళీ కృష్ణ అనీ,  జూనియర్  శంకర్ మహదేవన్ అనీ  పోలికలు తెస్తున్నారు చాలామంది.   కానీ ఎవరితోనూ పోల్చనవసరం లేకుండా  సొంత ముద్రతో గానకళలో  ఎంతో ఎత్తుకు వెళ్ళగలిగే  సత్తా రాహుల్ కి ఉందనేది నిస్సందేహం.  

*     *     * 

భారతీయ సంప్రదాయ సంగీతమంటే  నాకు చాలా ఇష్టమూ, ఆసక్తీ !

కానీ  ఆ సంగీతంతో  అనుసంధానమై ఉండే ‘దైవ భక్తి’తో గానీ, ‘ఆధ్యాత్మికత’తో గానీ నాకే మాత్రమూ  ఏకీభావం లేదు,  ఉండదు. 

రాహుల్ ను గానీ, సాంప్రదాయిక సంగీతకారులు మరెవరినైనా గానీ అభిమానించటమంటే  సంగీత కళలో వారి విశిష్ట ప్రతిభను అభిమానించటం మాత్రమే. ఆ కళను  ఆస్వాదించటమే.  ఆ పాటల్లో పొదిగివున్న భక్తినీ, వాటిలోని  భావాలనూ  ఔదలదాల్చటం మాత్రం  కాదు !  

4, మార్చి 2018, ఆదివారం

రీ టెల్లింగ్ కథలా? ఫ్రీ టెల్లింగ్ కథలా?




చయితలు రాసిన  కథల నిడివిని  కుదించి,  వేరేవాళ్ళు తమ సొంత మాటల్లో చెపితే అది- ‘రీ టెల్లింగ్’. కథ సారాన్ని క్లుప్తంగా చెప్పటం దీని లక్షణం.  

రీ టెల్లింగ్ అనే ఈ అనుసరణ కథ.... ఒరిజినల్ కథ పరిధిలోనే  ఉండాలనీ,  కథలోని పాత్రల స్వభావాలను ఏమాత్రం మార్చకూడదనీ ఎవరైనా  ఆశిస్తారు.

దానికి విరుద్ధంగా సొంత కల్పనలను జోడిస్తే?

అప్పుడది రీ టెల్లింగ్ కాదు... ఫ్రీ టెల్లింగ్  అవుతుంది.

స్వకపోల కల్పనలను  యథేచ్ఛగా చేయాలనుకునేంత స్వేచ్ఛా పిపాసులు సొంత కథలను మాత్రమే రాసుకోవాలి.  అంతేగానీ  రీ టెల్లింగ్ పేరిట  ఇతరుల రచనల్లో  వేలు పెట్టకూడదు!   పెట్టి వాటిని కంగాళీ  చేయకూడదు!


* * *
రంగనాయకమ్మ ‘మురళీ వాళ్ళమ్మ’ కథను మొట్టమొదటిసారి 1999 లో  ఆంధ్రజ్యోతి వారపత్రిక దీపావళి సంచికలో ప్రచురించారు.

ఈ కథ ఈ 2018 మార్చి 1న సాక్షి దినపత్రిక ఫ్యామిలీ పేజీలో  రీ టోల్డ్ కథగా వచ్చింది.  (మహిళా దినోత్సవ సందర్భంగా రచయిత్రుల కథలను ఈ సిరీస్ లో ఇస్తున్నారన్నమాట...  ఈ కథ 19వ కథగా వచ్చింది.  ఇంకా రోజుకో కథ వస్తూనే ఉంది.)

ఈ పున:కథకుడు ఖదీర్
ఇక్కడ   చూడండి-



రీ టోల్డ్ కథ చూశారు కదా? 

ఇప్పుడు  రంగనాయకమ్మ ఒరిజినల్ కథ చూడాలి.

ఆంధ్రజ్యోతిలో వచ్చినప్పటి పేజీలను ‘కథా నిలయం’ సౌజన్యంతో ఇక్కడ ఇస్తున్నాను.


   murali vallamma by Reader on Scribd


* * *

‘మురళీ వాళ్ళమ్మ ’ నాకు నచ్చిన కథల్లో ఒకటి. 
ఇప్పుడీ  పున: కథనం  చదివాను.

అసలు కథకూ,  ఈ అనుసరణ కథకూ చాలా చోట్ల తేడాలు ఉన్నాయనిపించింది.  ‘అమ్మకి ఆదివారం లేదా’ పుస్తకం తీసి, దానిలో ఉన్న ఆ కథను మళ్ళీ చదివి చూశాను.



నా అనుమానం నిజమే!

‘మురళీవాళ్ళమ్మ’ పున: కథనం గతి తప్పింది.
పాత్రల స్వభావం మారింది.
సంభాషణలు  కూడా  కళ తప్పాయి.  
అన్నిటికంటే ఘోరం- ఒరిజినల్ కథలో లేని సంఘటనలు వచ్చి చేరాయి.


ఓ ఇంటర్ వ్యూలో  ‘వాక్యాన్ని మానిప్యులేట్  చేయగలను’  అని  ధీమాగా  ప్రకటించుకున్నారు ఖదీర్.  కానీ  తెలుగుకు అసహజమైన  ‘కలిగి  ఉండే’ వాక్య ప్రయోగంతో,  పేలవమైన సంభాషణలతో, సొంత కల్పనలతో  ఆయన రీ టెల్లింగ్  దుర్భరంగా తయారైంది.

అందుకే...
ఇది  రంగనాయకమ్మ రాసిన  ‘మురళీ వాళ్ళమ్మ’ కాదు... 
ఖదీర్ వండిన  ‘సొరకాయ పాయసం’!

* * *
ల్లికి అన్యాయం  చేసిన తండ్రిపై కోపం తెచ్చుకుని పదమూడేళ్ళ మురళి  తనకు తనే   ‘అమ్మా! ఏం చేద్దాం?’ అని మళ్ళీ మళ్ళీ అడిగి,  మార్గం కూడా తనే చూపిస్తాడు.  ఆ మాటలు గుర్తొస్తే తల్లికి  శరీరం పులకరిస్తుంది. 

రీ టెల్లింగ్ లో  ‘ఏమంటావు నాన్నా’ అని తల్లి అడిగాకే  కొడుకు జవాబు చెప్తాడు. దీంతో   చిన్నప్పటి మురళి పాత్ర  ప్రత్యేకత కాస్తా ఎగిరిపోయింది.
 
తల్లిని ఎదిరించి మాట్లాడలేని మురళి,  తల్లి కోపంతో అన్నమాటలకు జవాబు చెప్పే ప్రయత్నం చేయని మురళి  ఈ పున: కథనంలో మాత్రం తల్లితో ఏకంగా వాదనే పెట్టుకుంటాడు.  ఆఫీసులో అమ్మాయితో ‘ఇంత క్లోజ్ అయ్యాక తన ఎమోషన్స్ కూడా షేర్ చేసుకోవాలి కదా’ అని లాజిక్ తీస్తాడు.  

ఏమాత్రం రాజీపడకుండా  ఆత్మగౌరవంతో  ప్రవర్తించే  తల్లి రుక్మిణి  పాత్ర స్వభావాన్ని తెలుసుకోవటానికి ఆమె సంభాషణలు ఆయువుపట్టు.   ‘భర్తని ఎదిరించి బతికింది బిడ్డలతో రాజీపడటానికా?’ అనీ,  ‘నీ దారి నీదీ నా దారి నాదీ’ అని  స్థిరంగా, నిర్మొహమాటంగా  చెప్పే  పాత్రకు  ఇక్కడ- పున: కథనంలో  కళాకాంతులు తగ్గిపోయాయి. 

కొడుకుతో ఆమె - ‘నిన్ను నేను విడిచిపెట్టేస్తున్నాను’ అందట.  ‘హూంకరించింది’ అట.  రంగనాయకమ్మ కథనంలో  తల్లి .. కొడుకుని  పేరుతో పిలుస్తుంది గానీ  ఖదీర్ కథనంలో లాగా  ‘రా’ అని సంబోధించదు. దాంతో సంతృప్తిపడలేదేమో.. ఆమెతో కొడుకును ‘రేయ్..’అని కూడా అనిపించారు ఖదీర్.   

కథలో లేనివీ... కొత్తగా  చేర్చినవీ
ఒరిజినల్ కథలో మురళి తన ఆఫీసు అమ్మాయితో పదేపదే  ఫోనులో మాట్లాడుతుంటాడు.  కానీ ఆమెతో  బాత్ రూమ్ లో చాటింగ్ నూ, ముద్దులనూ కూడా అదనంగా చేర్చేశారు ఖదీర్. 

మొదట్లో,  చివర్లో ఖదీర్   చెప్పిన ‘సొరకాయ పాయసం’ (తల్లే స్వయంగా వండిందట అది)  ఒరిజినల్ కథలో లేనే లేదు.  ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడే ఆమె ఆ పాయసం అలా చేస్తుందట.  ఈ పాయసమూ,  సింబాలిజమూ ఖదీర్  సొంత కవిత్వం తప్ప  మరోటేమీ కాదు. 

‘జీడిపప్పు  ప్యాకెట్లు ’ మురళి  టూర్ నుంచి ఇంటికి తెస్తాడు.  ఖదీర్ ఆ జీడిపప్పు ప్యాకెట్లను వృథా కానీయకుండా  పాలు, చక్కెర వేసి  వేయించేశారు.  సువాసనలీనుతున్న ‘లేతాకుపచ్చ పాయసం’ తయారుచేసి  ఆ జీడిపప్పులు దానిలో  తేలేలా చేశారు.  ఆ సింబాలిజం అలా ఎదురుగా ఉంచుకుని... ఇక  స్వీయ పున: కథనం అల్లేశారు. 

అదింకా ఆ కథగానే ఉంటుందా?
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం  పాడిన పాటను వేరెవరో తన ఇష్టం వచ్చినట్టు మార్చేసి పాడి, ఆ  రికార్డును బాలు  ఫొటోతో విడుదల చేసినంతమాత్రాన అది బాలు పాట అయిపోతుందా?  

అలాగే  ఒక రచయిత  ఫొటో వేసి  ‘మళ్ళీ చెప్పుకుందాం’ అంటూ కథనంతా ఈ రీటెల్లింగ్ రచయిత  మూడు కాలాల్లోకి కుదించేసి- రచయిత తన కథలో రాయని  సంఘటనలను కొత్తగా జోడించేస్తే అది  పున: కథనం అవుతుందా?  అప్పుడది ఒరిజినల్ రచయిత కథగానే ఇంకా మిగిలివుంటుందా? 

మంచి కథలను పాఠకులకు మళ్ళీ  గుర్తు చేయాలనుకుంటే, కొత్త పాఠకులకు తెలపాలనుకుంటే.. తగిన అనుమతులు తీసుకుని వాటిని యథాతథంగా ప్రచురించాలి.

 ‘నిడివి ఎక్కువ, అలా చేయలేం’ అనుకుంటే... ఆ కథల ప్రత్యేకతల గురించి వివరిస్తూ  సమీక్ష/ పరిచయం/ విశ్లేషణ ఇవ్వటానికి మాత్రమే పరిమితం కావాలి.  


అంతేగానీ..  కథనంతా రీ టోల్డ్ మూసలో పేర్చి,  స్వీయ కల్పనలు చేర్చి రాస్తే...  అది వక్రీకరణకు తక్కువ అవ్వదు. కథా రచయితను ఇది  నిశ్చయంగా అగౌరవపరచటమే! 

ఆ కథను అమితంగా అభిమానించే  పాఠకుల అనుభూతిని ఇది భగ్నం చేయటం కాదా?  వారి మనసుల్లో ముద్రించుకున్న చక్కటి దృశ్యాన్ని మొరటుగా చెరిపేయటం కాదా?



నేను ఈ సిరీస్ లో ఒక్క కథనే పరిశీలించాను.  ఇక మిగిలినవి ఎలా ఉన్నాయో ...!  ఈ పున: కథనాల విషయంలో  ఒరిజినల్ రచయిత్రులు సంతృప్తిగా ఉన్నారో, లేదో, ఒకవేళ అసంతృప్తి ఉంటే  దాన్ని  ప్రకటించారో లేదో నాకు తెలియదు!

31, జనవరి 2018, బుధవారం

ఎమ్వీయల్లూ ... కథల ఎన్నీయల్లూ !


బాస్వెల్ తో పోల్చారు  ఆరుద్ర.
కీట్సుతో  సామ్యం తీసుకొచ్చారు  వేటూరి.

ఎవరిని?

ఎమ్వీయల్ గారిని !

* * * 

యన్ను  నూజివీడు మర్చిపోలేదు.

అక్కడ కాలేజీలో ఆయన పాఠాలు విని మనసారా ఇష్టపడ్డ  కాలేజీ విద్యార్థులూ,

ఆయన వాక్చాతుర్యం,  రచనా చమత్కారం చవి చూసిన  తెలుగు పాఠకులూ, సాహిత్యాభిమానులూ ..

ఇంకా ఆయన స్నేహ పరిమళం పంచుకున్న సినీ ప్రముఖులూ...

ఎవరూ
ఆయన్ను
మర్చిపోలేదు.

ఆయన  విద్యార్థులూ, స్నేహితులూ నూజివీడులో ‘ ఎమ్వీయల్ సాహితీ సమాఖ్య’ గా ఏర్పడి, ఆయన రచనలను అందుబాటులోకి తీసుకురావటానికి చొరవ తీసుకున్నారు.

ఆ కృషి ఫలితమే.. డిసెంబరు 24న  విడుదలైన ‘ఎమ్వీయల్ కథలు’ పుస్తకం !
 

ఒక రచయిత  కన్నుమూసిన   32 సంవత్సరాల తర్వాత ఆయన రాసిన కథలన్నీ సేకరించి,  పుస్తకంగా తీసుకురావటం అసాధారణమైన విషయం కదా !
  

ఈ పుస్తకంలో 17 కథలున్నాయి.

వెన్నెల్లాంటి  హాయినిచ్చే  ఈ  కథలన్నిటిలో   ప్రత్యేకంగా గమనించదగ్గ  అంశం- కథనం .  ఎమ్వీయల్ ముద్రను పట్టించే  మెరుపు వాక్యాలు చమక్కుమంటూ  చాలా కథలను పఠనీయం చేశాయి.

వాటిలో కొన్నిటి గురించి  కొంచెం (మాత్రమే) చెప్తాను.

‘రసవద్గీత’
మామిడి రసాలూరే  చక్కటి  కథ.  ఇది 1979లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో  ప్రచురితమయింది.

బుజ్జి  అనే కుర్రాడు  ఇష్టంగా తన పేరు చెక్కుకుని మరీ తినబోయిన  హిమాం పసందు  మామిడికాయ  అనుకోకుండా అతడి  చేజారిపోతుంది.  అది ఊరంతా తిరిగి తిరిగి  చేతులు మారి  అనూహ్యంగా  బుజ్జి చేతుల్లోకి  నాటకీయంగా వచ్చేస్తుంది.

కథా వాతావరణం సూచించినా,  పోలిక చెప్పినా అందులోనూ  మామిడి  గుబాళింపులే !

‘పుల్లమావిడి తిన్నట్టు పులిసిపోయింది భద్రం మనసు. ’


‘మేనేజరు మాటలు చాలా భాగం గాలి దుమ్ముకి రాలిన మామిడి కాయల్లా గేటివతలే పడిపోయాయి.’ 


చెక్కినట్టు కాకుండా  చటుక్కున రాసినట్టుండే  వాక్యాలు  కొన్ని చూడండి-

‘మేనేజరు గారి మొహమాటానికి పడక్కుర్చీ మెలికలు తిరిగింది’

‘భద్రం మెరుపులా వరండాలోకి వెళ్ళి ఉరుములా మారిపోయాడు’ 



‘పొద్దుతిరుగుడు పూలు’
 1974లో ఆంధ్రజ్యోతి దీపావళి సంచికలో ప్రచురితమైన కథ.  ఇది చదువుతుంటే తిలక్  ‘నల్లజర్ల రోడ్డు’ కథ గుర్తొచ్చింది.

‘నిరాశలా చీకటి
చీకటిని చీలుస్తూ మనిషిని బతికించే ఆశలా కారు హెడ్ లైట్’


- ఇలా మొదలవుతుంది.


అడవిలో  అర్ధ రాత్రి కారు చెడిపోయి ఆగిపోయింది.  అప్పుడు దానిలో ప్రయాణించే  వివిధ రకాల వ్యక్తుల్లో  భయం, కంగారు,  ధైర్యం, నిరాశ,  స్వార్థపు ఆలోచనలు ఎలా ఉంటాయి, మారతాయి ?  ఉత్కంఠభరితమైన ఈ  కథ  ఆసక్తికరంగా  దీన్ని  చెప్తుంది.


‘సిరిగలవాడు’
 రచనా కాలం 1985.  2001 వరకూ ఇది అముద్రితంగానే ఉండి, ఆంధ్రప్రభ వారపత్రికలో వచ్చింది.

ఇది గల్పికో, కథానికో... ప్రక్రియ ఏదైనా కానీ  వాక్యాలు అలవోకగా  జాలువారుతాయి. పదాల విరుపులతో కదం తొక్కే కథన విన్యాసం  కనపడుతుంది.

పార్వతి శివుడితో ఇలా అంటుంది-

‘ఈ వెండి కొండ మీద మీ పలుకే బంగారం. మూడో కంటికి కూడా తెలీకుండా కూడబలుక్కోడం కూడానా?’

వెండికొండ-  బంగారం...  మూడో కంటికి  అన్న సార్థక పదాల్లోని
స్వారస్యం ప్రత్యేకంగా చెప్పాలా?

 కవి శ్రీనాథుడు రాళ్ళసీమలో దాహార్తితో ‘పరమేశా గంగ విడుము పార్వతి చాలున్’ అని  శివుణ్ణి ఎత్తిపొడుస్తాడు కదా?  అది విని శివుడు కరుణించి  గంగను పంపించాడని  రచయిత ఊహ.

అప్పుడు  శ్రీనాథుడు ఎలా పరవళ్ళు తొక్కాడో  రాసిన ఈ వాక్యాలు చూడండి-

‘జలద రహితమైన నీలాకాశం నుంచి ఉప్పొంగి వస్తున్న గంగను చూసి, శ్రీనాథుడు జలదరించాడు. జల ధరించాడు’.

ఆకాశగంగ కాబట్టి జలదం (మబ్బు )తో  పని లేదు.  ఇక జలదరించడం, జల ధరించడం... అంటూ ఒకే మాటను విడదీసి, చిన్న మార్పుతో కొత్త అర్థాన్ని సాధించటం ఎంత బాగుందో కదా !



‘కల’కలం
ఈ పుస్తకంలో  విలక్షణమైన కథ ఇది. నిజానికిది రేడియో ప్రసంగం.

ఎమ్వీయల్ గారి గొంతులోనే  దాన్ని విందామా?



* * *
ఇంతకీ ఎమ్వీయల్ ను  బాస్వెల్ తో  ఎందుకని పోల్చారు ఆరుద్ర !

ఎవరా బాస్వెల్?

(ఈ సందేహం కొంతమందికైనా ఉంటుందని భావించి,  దాని గురించి కొంత ఇక్కడ  చెప్తాను. )

ముళ్ళపూడి వెంకట రమణ  సాహిత్యంపై సమగ్రంగా పరిశోధన చేసి  ఆయన రచనా వైశిష్ట్యాన్ని 1973లోనే  ‘కానుక’గా  రాశారు  ఎమ్వీయల్.

27-28 సంవత్సరాల వయసుకే  ఇలాంటి  మౌలిక  కృషి చేశారాయన.


ఆ పుస్తకానికి  ముందుమాట రాస్తూ  ఆరుద్ర -

 ‘ముళ్ళపూడి భాయీ జాన్సన్ కి
ఎమ్వీయల్ సెబాస్వెల్’ 


అని చమత్కరించారు.
శామ్యూల్ జాన్సన్


ఇంగ్లిష్ నిఘంటు కర్త, కవీ,  విమర్శకుడూ అయిన  శామ్యూల్ జాన్సన్ (1709-1784)  జీవిత చరిత్రను  జేమ్స్ బాస్వెల్ (1740-1795) రాశాడు.  ఆ పుస్తకం పేరు ‘Life of Samuel Johnson'.

జీవిత చరిత్రల రచనలోనే అది  కొత్త ఒరవడి సృష్టించింది !


ముళ్ళపూడి రమణ  రచనలపై   ఎమ్వీయల్  చేసిన  పరిశోధన అలాంటిదని ఆరుద్ర ప్రశంసన్నమాట.

*  సెబాస్ + బాస్వెల్ ... సెబాస్వెల్ అయింది.
*  ఎమ్వీయల్ , బాస్వెల్ మాటల సారూప్యత  కూడా ఎంచక్కా సరిపోయింది  కదా !

బాస్వెల్
మరో  విషయం-  

75 ఏళ్ళు జీవించిన జాన్సన్  గురించి రాసిన బాస్వెల్ 54 ఏళ్ళు బతికాడు.

ముళ్ళపూడి వెంకట రమణ (1931-2011)  80 సంవత్సరాలు జీవించారు కానీ..  ఆయన బాస్వెల్... మన ఎమ్వీయల్  42 సంవత్సరాలకే   కనుమరుగయ్యారు.


వేటూరి సుందర రామమూర్తి  వ్యాఖ్య సంగతి కూడా వివరంగా చూద్దామా?
 ‘ఆంగ్ల కవి కీట్సును అన్ని విధాలా పుణికిపుచ్చుకున్న జీవితం అతనిది. స్వగతంలో నేపథ్య కవితాలాపన అతనిది ’  అన్నారు  వేటూరి.

బైరన్, షెల్లీల  సమకాలికుడైన  రొమాంటిక్ కవి జాన్ కీట్స్ (1795-1821).

జాన్ కీట్స్

'Heard melodies are sweet, but those unheard are sweeter'
అనీ,

' A thing of beauty is a joy forever' అనీ చెప్పింది  కీట్సే.

పాతికేళ్ళకే  టీబీ వ్యాధికి బలైన కవి కీట్స్.  చిన్నవయసులోనే కన్నుమూయటం  ఒక్కటే కాకుండా..  కళాప్రతిభ,  కవిత్వారాధనల విషయంలో కూడా కీట్స్ - ఎమ్వీయల్ ల మధ్య సామ్యం  కనపడింది వేటూరికి.


* * *
బాపు రేఖాచిత్రం  ముఖపత్రంగా అలంకరించుకున్న ఈ  ‘ఎమ్వీయల్ కథల’ పుస్తకం వెల 70 రూపాయిలు.

ఎమ్వీయల్ తో తన అనుబంధం గురించి గాయకుడు బాలు స్వదస్తూరితో  రాసిన  ఆత్మీయపు పలుకులు  పుస్తకం మొదట ప్రచురించారు.  వారిద్దరి మధ్య ఉన్న స్నేహాన్నీ,  గాఢతనూ అవి  తెలుపుతాయి.

డా. చెంగల్వ బొడ్డపాటి రామలక్ష్మి
  ఈ కథలపై సమీక్ష  చేశారు, ‘పాలపిట్ట’ మాసపత్రిక  సెప్టెంబరు 2017 సంచికలో.

 ‘‘ఎమ్వీయల్ కథలలో బరువైన సమస్యలుండవు. ఏ విధమైన సందేశాలుండవు. మధ్య తరగతి మానవ స్వభావ చిత్రణ ఉంటుంది. కుటుంబసభ్యుల మధ్య ఆత్మీయానురాగాలు ఉంటాయి. సంభాషణా చాతుర్యముంటుంది. .... చక్కగా హాయిగా చదువుకునే కథలు ... తెలుగుదనం ఉట్టిపడే కథలు’ అని ఆమె చక్కగా అంచనా వేశారు.

ఈ సమీక్షను కూడా ఈ పుస్తకంలో ప్రచురించారు. 

విజయవాడ  ‘సాహితి’  ప్రచురణగా వచ్చిన ఈ సంకలనం కాపీలు  కావలసినవారు 2436642/43, 8121098500 నంబర్లను సంప్రదించవచ్చు.  


తాజా చేర్పు :  ఫిబ్రవరి 4న ఈనాడు ఆదివారం లో  ఈ పుస్తకం గురించి నేను రాసిన  చిన్న పరిచయం వచ్చింది.  అది ఇక్కడ ఇస్తున్నాను.  

 

29, అక్టోబర్ 2017, ఆదివారం

కలలో నీలిమ కని .... వేణువు విని!



సంగీతమే ఓ లలిత కళ.  మళ్ళీ దానిలోనూ  లలితమైనది-  లలిత సంగీతం!

రేడియో మూలంగానే  ఈ లలిత సంగీతం  పుట్టింది.  సినిమా సంగీత  సునామీని  తట్టుకుని  తెలుగు శ్రోతలకు  చేరువైంది.

ఏళ్ళు గడిచినా  మరపురాని స్మృతుల  పరిమళాలను  రస హృదయులకు పంచుతోంది.

అలాంటి  ఒక చక్కని  రేడియో  పాట గురించి  కొద్ది సంవత్సరాల క్రితం తెలిసింది. 

సాహిత్యం మాత్రమే  తెలిసిన ఆ పాటను - 
వినటానికి మాత్రం చాలా కాలం పట్టింది.  

ఆ పాట దొరికి,  విన్నాను -  కొద్ది రోజుల క్రితం! 

రేడియోకు సంబంధించి నాకు ఏదైనా సమాచారం  కావాలంటే...
మలపాక పూర్ణచంద్రరావు  గుర్తొస్తారు.

‘రేడియో హీరోయిన్’ శారదా శ్రీనివాసన్ గారి  ద్వారా ఆయన నాకు పరిచయం.  యువభారతి ఫౌండేషన్ కార్యదర్శి.    ఆ పాట కావాలని అడిగితే...  తన కలెక్షన్లోంచి వెతికి ఆయన  నాకు పంపించారు.

వినగానే  ఎంత  సంతోషమయిందో!

సంగీత తరంగాలపై  నన్ను తేలుస్తూ-  దశాబ్దాల వెనక్కి-  ‘ఆకాశవాణి  మంచి  రోజుల్లోకి’  నన్ను తీసుకువెళ్ళింది  ఆ పాట!

రేడియో కళాకారులూ, అనౌన్సర్లూ మన ఇంటి సభ్యులేనని భావించిన కాలమది.  వారి  రూపం ఎన్నడూ చూడకపోయినా వారు మనకు బాగా తెలుసనీ, మనకెంతో ఆత్మీయులనీ  అనిపించేది.

ఆ పాట  పాడినది  రేడియో కళాకారులూ,  సంగీత విద్వాంసులూ  మల్లాది సూరిబాబు.  

 ఆయన అమేయ సంగీత ప్రతిభకు ఈ లలిత సంగీతపు పాట గానీ,  మరొక పాట గానీ మాత్రమే  ప్రాతినిధ్యం వహించవు.   నాకు నచ్చిన ఆయన పాటలను స్మరించుకోవటం మాత్రమే ఇది.

 ఇదీ ఆ పాట-



కలలో నీలిమ కని
నీలిమలో...  కమల పత్ర చారిమ గని   //కలలో//


కమల పత్ర చారిమలో  సౌహృద మృదు రక్తిమ కని
అగరు ధూప లతిక వోలె
అగరు ధూప లతిక వోలె
అవశమయ్యేనే..
మనసు- ఎగసిపోయేనే
మనసు...  ఎంత వెర్రిదే   ఆ....  //కలలో //

కలలో మువ్వలు విని
మువ్వలలో సిరి సిరి చిరు నవ్వులు విని  //కలలో//


సిరి సిరి నవ్వులలో  మూగ వలపు సవ్వడి విని
అగరు ధూప లతిక వోలె...
అగరు ధూప లతిక వోలె
అవశమయ్యేనే..
మనసు-  ఎగసిపోయేనే
మనసు..  ఎంత వెర్రిదే    ఆ....  //కలలో //

కలలో వేణువు విని
వేణువులో విరహ మధుర వేదన విని   //కలలో//


విరహ మధుర వేదనలో  ప్రణయ తత్వ వేదము విని
అగరు ధూప లతిక వోలె...
అగరు ధూప లతిక వోలె
అవశమయ్యేనే..
మనసు- ఎగసిపోయేనే
మనసు..  ఎంత వెర్రిదే     //కలలో //


ఈ పాట  సంగీత కర్త  సూరిబాబు గారి గురువుల్లో ఒకరైన   ఓలేటి వేంకటేశ్వర్లు 


రాసిన వారు  ఎస్.వి. భుజంగ రాయ శర్మ

రంగుల రాట్నం (1966) లోని పాట  గుర్తుందా?

- ‘కలిమి నిలవదు  లేమి మిగలదు-  కల కాలం ఒక రీతి గడవదు-  నవ్విన కళ్లే చెమ్మగిల్లవా?  వాడిన బ్రతుకే పచ్చగిల్లదా  ఇంతేరా ఈ జీవితం - తిరిగే రంగుల రాట్నమూ ’ రాసింది భుజంగ రాయశర్మే.  

సాహిత్యంలో  మెరుపులు
‘ముక్త పద గ్రస్తం’ అనే అలంకారం  తెలుసు  కదా?
ముందు రాసి  విడిచిన పదాన్నే  మళ్ళీ గ్రహించి రాయటం-   అది ఈ పాటలో  చూడవచ్చు.

కలలో నీలిమ- నీలిమలో కమల పత్ర చారిమ (సౌందర్యం) -  కమల పత్ర చారిమలో సౌహృద మృదు రక్తిమ

రెండో మూడో చరణాల్లో కూడా ఇలా  ఒక మాట రాసి,   దాన్ని మళ్ళీ  మరోదానికి  అందంగా లంకె  వేయటం కనిపిస్తుంది. 

‘అగరు ధూప లతిక’  అన్న ప్రయోగం చూడండి.   అగరు పొగ... తీగలాగా వంపులు తిరుగుతూ  పైకి సాగిపోవటం  కళ్ళ ముందు కనిపించదూ!

 ఆ  ధూపాన్ని పట్టుకోవడం గానీ, ఆపటం గానీ  అసాధ్యం కదా? అందుకే  దాన్ని వశంలో లేని మనసుతో  పోల్చారు కవి.   

పాటలోని   పదాలూ, పదబంధాలూ కొత్తగా   అనిపిస్తాయి. 
నీలిమ , చారిమ, రక్తిమ, లతిక-  ఈ  తరహా ‘derived/ modified ’ పదాల్లో ఒక అందముంటుంది.

( నవలలు బాగా చదివిన అలవాటు ఉన్న పాఠకులకు  ఇలాంటి  మాటలు బాగానే పరిచయం ఉంటాయి.   అరుణిమ, రూపసి, వీణియ, నిష్కృతి... ఇలాంటివే.)  

*** 

 ఆలోచనామృతమైన  సాహిత్యం ... ‘ఆపాత మధుర’ సంగీతానికి  ఆలంబన కదా!

‘‘సంగీతానికి.. సొంపు కూర్చేది.. సాహిత్యం. సాహిత్యానికి ఇంపు కూర్చేది సంగీతం. శుద్ధమైన కర్ణాటక సంగీతానికైనా, సరళంగా వినబడే లలిత సంగీతానికైనా ఇదే లక్ష్యం ’’  అంటారు మల్లాది సూరిబాబు.

 ఈ మధ్య  ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉదయం వేళల్లో ఈ లలిత సంగీతపు పాటలను ప్రసారం చేస్తోందట.  గత ఏడాది నవంబరులో ఆంధ్రభూమి దినపత్రికలో రాసిన ఓ వ్యాసంలో  మల్లాది సూరిబాబు ఈ సంగతి చెప్పుకొచ్చారు.
 
‘‘ఓపికతో వినే ప్రయత్నం చేస్తే, రణగొణ ధ్వనుల కాలుష్యంతో నిండిపోయిన చౌకబారు పాటలకూ, వీటికీగల తేడా ఏమిటో  గమనించగలం’’ అంటారాయన.

***
సూరిబాబు మరో గురువు...  గాన రుషిగా పేరుపొందిన  శ్రీపాద పినాకపాణి . 


 ఆయన స్వర కల్పన చేసిన  అన్నమయ్య పాటల్లో ఒకటి-  ‘ చందమామ రావో ’. 
 
ఈ పాట తెలియని వాళ్ళుండరు కదా?

 ఈ పాటను   సూరిబాబు 2014లో  - మూడేళ్ళ క్రితం- సంగీత శిక్షణ కార్యక్రమంలో ఇలా  పాడారు.

బాణీ లోనూ.  గానంలోనూ  ముగ్ధులను చేసే  సంగతులను  విని తెలుసుకోవాల్సిందే !   ముఖ్యంగా ‘జాబిల్లి’ అన్నచోట ఆ బాణీలో ఎంత ఆప్యాయత,  లాలిత్యం!



చందమామ రావో
జాబిల్లి రావో   //చందమామ//

కుందనపు పైడి కోర
వెన్న పాలు తేవో  //చందమామ//

నగుమోము చక్కనయ్యకు
నలువ పుట్టించిన తండ్రికి  //నగుమోము//
నిగమము లందుండే యప్పకు
మా నీల వర్ణునికి  

జగమెల్ల నిండిన సామికి 
చక్కని ఇందిర మగనికి  //జగమెల్ల//
ముగురికి మొదలైన ఘనునికి
మా ముద్దుల బాలునికి  //చందమామ//


ఇంకో రెండు చరణాలు కూడా ఉన్నాయి ఈ పాటలో.

వెన్న,  పాలు  రెండూ అని అర్థమా?  ఒకవేళ అది వెన్నపాలు అయితే- ఇప్పుడు మనం వాడే ప్యాకెట్ పాలలో  క్రీమ్ మిల్క్/ హోల్ మిల్క్ అన్నమాట !  :)

***

ళ్ళీ మొదటి పాట దగ్గరికి వెళ్దాం !

‘కలలో నీలిమ కని’ పాట   కృష్ణుడిని తల్చుకుంటూ  రాధికో, గోపికో  పాడుకున్న  విరహ గీతికేమో  అనిపిస్తుంది .

పాట  నిలువెల్లా  బృందావన  కృష్ణుడిని తలపించే  ప్రతీకలే ఉన్నాయి.
నీలిమ.  కమల పత్రాలు ( యమున ఒడ్డున ),  మువ్వలు,  నవ్వులు , వేణువు... విరహం,  ప్రణయ తత్వం-  

కానీ  ఈ పాటను గాయనితో కాకుండా  గాయకుడితో పాడించటానికి  కారణమేమైనా ఉందా?

ఏదేమైనా...  మల్లాది సూరిబాబు దీన్ని శ్రావ్యంగా, అనుపమానంగా  పాడి  ఎంతో  ప్రాచుర్యంలోకి  తెచ్చారు

ఆయన  పాడి  దశాబ్దాలు గడిచినా  ఇప్పటికీ  దాన్ని ఇష్టంగా  తల్చుకునేవాళ్ళుండటమే దీనికి తిరుగులేని రుజువు కదా! 

21, సెప్టెంబర్ 2016, బుధవారం

వేగుచుక్కా... తోకచుక్కా!

గురజాడ  చూసి  వర్ణించిన ‘హేలీ’ ఇదే   ( 1910  నాటి ఛాయాచిత్రం)

 నింగిలో వెలిగే  హేలీ తోకచుక్కను ‘చన్నకాలపు చిన్నబుద్ధులు’  కీడుగా భావించి బెదిరిపోతే...

ఆ మూఢ విశ్వాసాన్ని ఖండించి-

దాన్ని భూమికి దూరబంధువుగా,
నరుల కన్నుల పండువగా భావించిన,
సంఘ సంస్కరణ ప్రయాణ పతాకగా సంభావించిన
మహాకవి గురజాడ అప్పారావు...

వ్యావహారిక భాషకు కావ్యగౌరవం కల్పించిన నాటకకర్త.

భాషలో, భావంలో.. తన కాలం రచయితలకంటే కంటే ఎంతో ముందుచూపున్న ఆయన రచనా స్వరూపం అందరికీ తెలిసిందే.

మరి ఆయన భౌతిక రూపం ఎలా ఉంటుంది? 



మనం చూసే ఇలాంటి  ఒకటి రెండు ఫొటోల కంటే మించి-
ఆయన ‘ఫీచర్స్’ను గురించి తెలుసుకోవటం ఆసక్తికరంగా ఉంటుంది కదా!

అందుకని... గురజాడను ప్రత్యక్షంగా చూసిన, ఆయనతో బాగా పరిచయం ఉన్నవాళ్ళనుంచే ఆ సంగతులు విందాం...

సుబ్రహ్మణ్యం  సాన్నిహిత్యం

ఒంగోలు ముని సుబ్రహ్మణ్యం  గారు .. కన్యాశుల్కం ప్రచురణ అవుతున్నకాలంలో దాని విశేషాలను గురజాడ నుంచి  లేఖలుగా అందుకున్న అరుదైన వ్యక్తి.  ఆయన ఇలా చెప్పుకొచ్చారు-
  
 ‘‘ఆ రోజుల్లో నేను అప్పారావు గారి వెంట ఎప్పుడూ వుండేవాణ్ణి. సాహితీవేత్త అంటే ఇలాగ వుండాలని నేనాయన్నొక ఆదర్శమూర్తిగా భావించుకునేవాణ్ణి. ఆయన నాకొక ఆరాధ్య దేవతా పురుషునివలె కనిపించేవారు. నాతోటి విద్యార్థులు , మా యిరువురి సన్నిహితత్వాన్ని జాన్సన్ -బాస్వెల్ ల సన్నిహితత్వంతో సరిపోల్చుతూ వుండేవారు.

రూపంలో జాన్సన్ వలె అప్పారావు గారు విలక్షణంగా కనిపించే వారన్నమాట నిజమే కాని, ఇద్దరికీ పోలిక లేదు. జాన్సన్ ఎంత లావుగా వుండేవాడో ఈయన అంత సన్నంగా వుండేవారు.
...


1936  ఫిబ్రవరి 27వ తేదీన ‘ది హిందూ’ దినపత్రికలో ఆయన్ని గురించి నేను వ్రాసిన ఈ దిగువ వాక్యాలలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. ‘‘అతి బక్కపల్చటి మనిషి. తరుచు రెండు మూడు చొక్కాలు, ఒకటి రెండు కోటులు తొడుక్కునేవారు. ’’

తనకు ముప్ఫయి అంగుళాల చుట్టుకొలత గల  బెల్టు కావలసివుందని ఆయన తన డైరీలలో వొక చోట వ్రాసుకున్న పంక్తులను గమనిస్తే  అప్పారావు గారెంత సన్నని మనిషో పాఠకులు యిట్టే ఊహించుకోగలుగుతారు. పంతులు గారు సదా హాస్యప్రసన్నులుగా వుంటూ వుండేవారు’


(1958లో విశాలాంధ్ర ప్రచురణ ‘మాటా మంతీ  అవీ: ఇవీ’కి రాసిన పీఠిక నుంచి) 

శ్రీపాద  చూసిన వేళ..

గురజాడ అప్పారావు గారిని ప్రత్యక్షంగా ఒకసారి  ఆంధ్రసాహిత్య పరిషత్తు సభలో.  చూశారట కథక చక్రవర్తి  శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.  కాకినాడలో  1914లో- గురజాడ అస్తమయానికి ముందు ఏడాది.

డిసెంబరు 1946లో  ఆయన రాసిన  ‘మార్గదర్శి గురజాడ అప్పారావు గారు’ అనే వ్యాసం లో ఆ సందర్భాన్ని ఇలా వర్ణించారు- 

‘‘... ఈ మిత్రులిద్దరూ (ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, భమిడిపాటి కామేశ్వరరావులు) ఆ మహాకవిని ప్రత్యక్షంగా చూసి ఎరగరు.

నాకు మాత్రం ఆ మహా భాగ్యం పట్టింది.

ఒక్క మాటే పట్టింది.
...


తెల్లటి పంచే, నల్లని పొడుగు కోటు,  ఆ కోటు మీద పరిణత వయస్కతకు సూచకంగా తిలతండుల న్యాయంగా వుండిన గుప్పెడేసి మీసాలు, పట్టి పల్లారుస్తున్న దీర్ఘవ్యాధికి గుర్తుగా. కానీ దూసుకుపోయే చురుకైన చూపులు.

ఇదీ , ఆ ఒక్కమాటే నేను చూసిన ఆ మహాకవి మూర్తిమంతం. 


అప్పటి సమావేశం అంతటిలోనూ ఒక్క అప్పారావు గారి ఆకృతే విలక్షణంగా ఉండింది. అందుకు తగ్గట్టు ఇప్పటి ఆంధ్రసాహిత్యం అంతటిలోనూ ఒక్క అప్పారావు గారి రచనలే విలక్షణంగా వున్నాయి.’’

అదే వ్యాసంలో  ‘ముత్యాల సరములు ’లో అన్వయించగల ఓ విశేషం గురించి ఇలా రాశారు శ్రీపాద. 


‘‘తూర్పు బలబల తెల్లవారెనుః
తోకచుక్కయు వేగుచుక్కయు
ఒడయుడౌ వేవెల్గు కొలువుకు
వెడలి మెరసిరి మిన్ను వీధిని’’

అన్నారు వారు.

తోకచుక్క విచ్ఛిత్తికి సూచకం. వేగుచుక్క మహోదయానికి సూచకం. నిజమే కాని ఈ తోక చుక్క ఏమిటి? ఇది చేసిన వినాశం ఏమిటి? ఈ వేగుచుక్క ఏమిటి? దీని తరువాత జరిగిన మహోదయం ఏమిటి? అంటే  వశ్యవాక్కులు శ్రీ భమిడిపాటి కామేశ్వర్రావు..  గిడుగు రామ్మూర్తి పంతులు గారే  తోకచుక్క యని,  గురజాడ అప్పారావు గారే వేగుచుక్క అనీ వ్యాఖ్యానం చేశారు..

రామమూర్తి గారు చేసింది  కృతక భాషా విధ్వంసనమేగా?  అప్పారావు గారు చేసింది కవికుమార కళ్ళకు వెలుగు కలిగించడమేగా?’’
 

* * * 

కొత్తపాతల మేలుకలయిక   క్రొమ్మెరుంగులు జిమ్మగా

‘గుత్తునా ముత్యాల సరములు’ అంటూ మొదలయ్యే ఈ పద్యాలు మొత్తం 29.

1929 నాటి ప్రచురణలో ఈ పద్యాలను ఇక్కడ చదువుకోవచ్చు.




ఇంటర్మీడియట్ తెలుగులో...
ఈ ముత్యాల సరములు - ఆంధ్రప్రదేశ్ లోని  ఇంటర్ మొదటి సంవత్సరం  తెలుగు పాఠ్యపుస్తకంలోని పద్యభాగంలో ఓ పాఠంగా  ఉన్నాయి.

పాఠ్యాంశంగా పెట్టటం అభినందనీయమే. అయితే  ఈ పద్యాలను  అక్షర దోషాలేమీ లేకుండా ప్రచురించే శ్రద్ధ తీసుకోవాలి కదా?

కానీ అది జరగలేదు. 

*  గురజాడ ‘ముత్యాల సరములు’ అని ప్రయోగిస్తే దాన్ని ‘ముత్యాలసరాలు’ గా మార్చారు. కానీ ఇది పెద్ద విషయమేమీ కాదు.

*   రెండో పద్యం -
 ‘మెచ్చనంటా వీవు; నీవిక
మెచ్చకుంటే మించిపాయెను;
కొయ్యబొమ్మలె మెచ్చు కళ్ళకు
కోమలుల సౌరెక్కునా’


పాఠ్యపుస్తకంలో ‘మెచ్చనంటా నీవు’  అని  తప్పుగా  ప్రచురించారు. ఈ సంధిని ఎలా విభజించి అర్థం, అన్వయం ఎలా చెపుతారో పాపం, పాఠం బోధించే తెలుగు అధ్యాపకులు! 

*  27వ పద్యం  ఇలా ఉంటుంది -

‘కలిసి మెసగిన యంత మాత్రనె
కలుగుబోదీ యైకమత్యము;
మాల మాదిగ కన్నెనెవతెనొ
మరులు కొనరాదో?’


‘మాల మాదిగ’ అన్న మాటలు  పాఠ్యపుస్తక రూపకర్తలకు అభ్యంతరకరంగా తోచివుంటాయి. దీంతో ఆ పదాన్ని ‘యేదొవొక కన్నెనెవతెనొ’ అని మార్చేసి, ప్రచురించారు.

 
ఆ మాటలు విశాల దృక్పథం అలవర్చుకోని ఓ పాత్ర మాటలు.
కవి నేరుగా పలికినవి  కావు.   

అయినప్పటికీ విద్యార్థులు చదివే పాఠంలో కులాల ప్రసక్తి ఎందుకూ అనుకునివుంటారు.
సరే!  అలాంటప్పుడు మొత్తం పద్యాన్నే తొలగించివుండాల్సింది.

అంతే కానీ-
కవి రాసిన పద్యంలో పదాలను ‘మాత్రా ఛందోబద్ధంగా’ మార్చివేయటం అనుచితం కాదా?

ఇప్పడీ మార్పు చేసిన పద్యాన్ని అధికారిక- ఆధునిక ప్రక్షిప్తం అనాల్సివుంటుందేమో!  

‘‘మంచి చెడ్డలు మనుజులందున,
యెంచి చూడగ,  రెండె కులములు
మంచి యన్నది, మాలయైతే,
మాలనే, అగుదున్!’’  


...  అని ఎలుగెత్తి చాటిన గురజాడ రాసిన పద్యాన్ని...స్వల్పంగానైనా ‘సవరించి’  ప్రచురించటం ఆయనకు గౌరవం  ఇచ్చినట్లవుతుందా? 

కుల మత ఛాందసత్వాలను నిరసిస్తూ గురజాడ రాసిన కింది  పద్యాలు చూడండి-

 ‘‘యెల్ల లోకము వొక్క యిల్లై,
వర్ణ భేదము లెల్ల కల్లై,
వేల నెరుగని ప్రేమ బంధము
వేడుకలు కురియ’’

 

‘‘మతములన్నియు మాసిపోవును,
జ్ఞానమొక్కటి నిలచి వెలుగును;
అంత స్వర్గ సుఖంబులన్నవి
యవని విలసిల్లున్’’


ఇవి  వెలకట్టలేని ‘ముత్యాల సరములే’ కదా!

31, మార్చి 2016, గురువారం

పుస్తకాల్లోంచి పలకరించి .. వెంటాడిన పాట!

66 ఏళ్ళ నాటి సినిమా  ‘షావుకారు’. 

ఈ చిత్రం  వివరాలు కొన్ని   తెలుసు గానీ,   దాన్ని చూసే  సందర్భం,  ఆసక్తీ  రాలేదు.



కానీ దానిలోని ఓ పాట మాత్రం వరసగా నేను చదివిన రెండు పుస్తకాల్లోనూ కనపడి, ఆ పాట సంగతేమిటో పట్టించుకోకుండా ఉండలేని స్థితిని కల్పించింది.

మొదట చదివిన పుస్తకం - ‘చందమామ’ (విజయా ప్రొడక్షన్స్)  నాగిరెడ్డి గారి కొడుకు  విశ్వం రాసిన  ‘నాన్నతో నేను’.  దాని వెనక అట్ట మీద ఇలా ఉంది-

‘‘మారిపోవురా కాలము
మారుట దానికి సహజమురా’’ 

ఇది మా నాన్న గారు- చక్రపాణి గారితో కలిసి రూపొందించిన తొలి చిత్రం ‘షావుకారు’లోని ఓ పాటకు పల్లవి. ...

ఇలా ఆ పాటతో పుస్తకానికి అనుసంధానం చేస్తూ కొన్ని వివరాలు ఇచ్చారు.
....

ఓహో...అనుకున్నాను. ఆ పాట గురించి పెద్దగా పట్టించుకోలేదు.

 
‘దొంగ తల్లిదండ్రులుంటారు జాగ్రత్త!’ నవల రెండోది.  ఈ పుస్తకంలో అడుగడుగునా ఈ పాట ప్రస్తావన ఎన్నోసార్లు కనిపించింది.

చాలా సన్నివేశాలకు ఈ పాట భావాన్ని అన్వయిస్తూ రాశారు ఈ నవలా రచయిత్రి  రంగనాయకమ్మ

 ‘షావుకారు’ సినిమా పాటల పుస్తకంలోంచి ఆ పాట-




ఎవరికైనా  అవసరమయ్యే  ఆశావహ దృక్పథాన్ని తేలిక మాటల్లో  వ్యక్తం చేసిన పాట ఇది. ముఖ్యంగా కష్టాల్లో చిక్కుకుని, నిరాశతో మునిగినవారికి ఈ పాట ఎంతో ఊరటనిస్తుంది. 

ఇక ఈ పాట  ట్యూను ఎలా ఉంటుందో తెలుసుకోవాలనిపించి, ఆడియో విన్నా. చాలా బాగుంది. అప్పట్నుంచీ ఆ పాట బాణీ తరచూ గుర్తొస్తూ నన్ను వెంటాడటం మొదలుపెట్టింది!

‘మారుట సహజమురా’ అని గాయకుడు పాడారు.
పాటల పుస్తకంలో ‘మారుటె సహజమురా’ అని ఉంది, చూశారా? 
పాటల రికార్డింగులో ‘మారుట’ అనే మాటే  పాడుకోవటానికి సౌకర్యంగా బాగుంటుందని మార్చివుంటారు.

‘ఉదయాస్తములూ’ అనే మాట చూడగానే దానిలో ఏదో తప్పుందని అనిపించింది. కానీ సాహిత్యం అలాగే ఉంది, పాటలోనూ అలాగే ఉంది.

 ‘ఉదయాస్తమయాలూ’  అని ఉండాలి  కదా అనే సందేహం నాకింకా అలాగే ఉంది.

( ఈ  సందేహం తీరింది.  నిఘంటువులో చూస్తే   ‘అస్తం’ అనే మాట ఉంది. అస్తాద్రి అనే మాట పుస్తకాల్లో కనపడుతుంది కూడా.   అస్తం అనే పదానికి  - సూర్యుడు అస్తమించే కొండ,  కుంకటం, కనపడకపోవటం అనే అర్థాలున్నాయి. కాబట్టి  అస్తములూ  అనే మాట  సరైనదే.  పాడటానికి కూడా అనుకూలంగా ఉందీ మాట..)  


ఈ పాట ఒక  రోజు రాత్రి విన్నాను.

తర్వాతి రోజు పొద్దున్నే ఆ పాటను నా మెయిల్లోకి పంపుకుని, మొబైల్లో  ఓపెన్ చేశాను.  ఆ పాటను రంగనాయకమ్మ గారు వినాలని వాట్సాప్ లో పంపించేశాను. (ఆ పాట ఆమెకు ఎంత సుపరిచితమైనా , దాన్ని విని ఎంతకాలమైందో తెలియదు కదా.. మరోసారి వినాలని.. )

 ఇప్పుడే పాట విన్నాం.  రాసిన పాట, కట్టిన బాణీ,  పాడిన తీరు..  అన్నీ బాగున్నాయి. మంచి పని చేశారు, అందరూ కలిసి-  అని  సమాధానం వచ్చింది! 

ఈ సాట పాడినవారు మాధవపెద్ది సత్యం. రాసింది సముద్రాల. సంగీత దర్శకత్వం- ఘంటసాల. 



ఈ పాట చిత్రీకరణ ఎలా ఉంటుంది?  ఈ ఆసక్తి ఏర్పడింది. 

యూట్యూబ్ లో చూశాను.

దీని సినిమాటోగ్రఫీ  ‘మాయాబజార్’ ఫేమ్ మార్కస్ బార్ట్లే ది.  చక్కని పల్లెటూరి, ప్రకృతి దృశ్యాలను  ఈ పాటలో చూడొచ్చు. (షావుకారు సినిమా తర్వాతే  మాయాబజార్ ని తీశారనుకోండీ..)



వల సంగతేమిటి?

మాతృదేవోభవ,  పితృదేవోభవ ... అనే మాటలు  తరతరాలుగా  వింటూవస్తున్న మనకు ‘దొంగ తల్లిదండ్రులుంటారు జాగ్రత్త!’ అన్న నవల  పేరు చప్పున మింగుడుపడదు.

పిల్లలను  ప్రేమగా పెంచే తల్లిదండ్రులు  దేవుళ్ళయితే, వాళ్ళను హింసించే తల్లిదండ్రులు మనుషులు కాకపోగా, క్రూర  రాక్షసులే అవుతారు కదా?    


 
 ఈ రచనకు ప్రధాన ఆధారం  ఒక పాఠకురాలి జీవితంలో జరిగిన చేదు అనుభవాలు.  కొన్ని ఇతర కల్పిత పాత్రలు సృష్టించి, కథాగమనానికి అవసరమైన మార్పులూ చేర్పులూ  జోడించానని రచయిత్రి పుస్తకంలో  ‘చివరి మాట’లో రాశారు.  

ఈ నవల సీరియల్ గా  ‘నవ్య’ వారపత్రికలో వచ్చింది. అప్పుడు లేని,  వేరే సంఘటనలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి.

సీరియల్ నాటికన్నా ఇందులో కొత్త చేర్పులు  దాదాపు 40 పేజీలవరకూ ఉన్నాయి. 
 
తాజా  చేర్పు :  ఈనాడు ఆదివారం అనుబంధంలో  ఏప్రిల్ 4న వచ్చిన రివ్యూ ఇది...



ఈ నవల్లో కథానాయిక పార్వతి.  ఆమెపై ఆమె చెల్లెలు సరస్వతిపై వాళ్ళ తల్లిదండ్రుల  వేధింపులూ, దౌర్జన్యాలూ చదువుతుంటే ఒకపట్టాన నమ్మబుద్ధి కాలేదు.

కన్నబిడ్డలపై ఎవరైనా ఇంత హేయంగా,  నిర్దయగా ప్రవర్తిస్తారా? ఇంత కాఠిన్యం చూపుతారా? కనీసమైన జాలినైనా  ప్రదర్శించరా?... ఇవీ నా సందేహాలు... 

కానీ అవన్నీ వాస్తవంగా జరిగినవే.

సీరియల్ గా వచ్చినపుడు ఈ నవల్లోని   బొమ్మలు ...
 
అంతే కాదు;  ఈ నవల ‘నవ్య’లో సీరియల్ గా వస్తున్నపుడు మరికొందరు ఘోరమైన తమ చేదు అనుభవాలను రచయిత్రితో పంచుకున్నారు.

పిల్లలపై  తల్లిదండ్రుల వేధింపుల సవివర వర్ణన.. అప్పటికి వాటిపై  నాకున్న సందేహాలవల్లనేమో,  కొంత విసుగు పుట్టింది.

కానీ తర్వాత కథాగమనం వేగంగానే నడిచింది.

ముఖ్యంగా పార్వతి పెద్దయ్యాక  తల్లిదండ్రులతో చేసే సంభాషణలు అద్భుతం.  నవల్లోని అలాంటి  ఘట్టాల్లో ప్రత్యేకంగా రచయిత్రి కలం కదం తొక్కింది.

ఓ చోట చూడండి-
 
‘‘నాన్నగారా? ఎవరు ఆయన? అసలు నేనెవర్ని మీకు? మీ కొంపలో నించి నేను కాలు బైటపెట్టి నాలుగేళ్ళయింది! కూతుర్ని చచ్చినదానితో  జమకట్టారు! ఇంకా ‘కూతురి’గా నేనెక్కడున్నాను మీకు? ..’’
...  ....  ..... 


‘‘నాన్న గారికి పక్షవాతం వొచ్చిపడితే కూడా కోపంగా మాట్లాడతావా?’’


‘‘‘నాన్నగారికి’ పక్షవాతం ఇప్పుడొచ్చి పడిందేమో గానీ, మొదటినించీ వుంది పక్షవాతం! ఆడపిల్లల్ని అనాథాశ్రమాల్లోకి గెంటెయ్యాలని చూశాడు నాన్నగారు; పెద్దదాన్ని చేరిస్తే ఫర్వాలేదని సలహా ఇచ్చారు అమ్మగారు. ఆ పక్షవాతాలకి వైద్యాలు చేయించుకున్నారా?’’


***

మరో చోట పార్వతి తన అత్త కొడుకుతో మాట్లాడే ఘట్టం...

‘‘పసితనం నించీ, ఉగ్గుపాల నించీ, అవమానాల అగాధంలో కూరుకుపోయి కమిలిపోయిన మనిషిని నేను. కన్న తల్లిదండ్రుల కౌగిళ్ళలో పువ్వులాగ పెరిగిన మనిషివి నువ్వు!’’


*** 

408 పేజీల ఈ నవల చదివాక  నాయనమ్మ, సావిత్రి, సుబ్బన్న, వంజాక్షి,  పార్వతి, మూర్తి,  సరస్వతి,  దాసు, శంకర్రావు, సత్య.. ఈ పాత్రలన్నీ  పాఠకుల్ని ఒకపట్టాన వదిలిపెట్టవు.

కాలక్షేపం కోసం చదివే పుస్తకమేమీ కాదిది.
అలా అని  విషాదంలో ముంచెత్తే  రచన కూడా కాదు.

 ‘మన చుట్టూ  ఇలాంటి జీవితాలు కూడా ఉన్నాయి’ అనే స్పృహను కలిగించే, ఆశావాదాన్ని నింపే నవల. 

పుట్టింటి నరకం నుంచి బయటపడటానికి తనకు పెళ్ళి జరగాలని కోరుకుంటుంది పార్వతి. కానీ అత్తింటికి వెళ్ళటం ‘పెనం లోంచి పొయ్యిలోకి పడ్డ’ట్టు అయింది.  కానీ కాలం మారిపోతుంది. ఆమె జీవితంలో మంచి రోజులు మొదలవుతాయి.

తన బతుకు బాగుపడితే చాలనే చిన్న పరిధిని దాటిపోయి, సమాజం మొత్తం సమూలంగా బాగుపడాలని కోరుకునే మనిషిగా ఆమెలో పరిణతి వస్తుంది.

‘తల్లిదండ్రుల మీద ద్వేషం పుట్టించడానికి రాసిన నవల ’ అంటూ కొన్ని విమర్శలు ఈ నవలపై వచ్చాయట. కానీ -

‘కీర్తి’కోసం, ధనం కోసం ప్రమాదకరమైన పర్వతారోహణలకు  పిల్లలను ప్రోత్సహించేవారి గురించీ, ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారని కొడుకులనూ, కూతుళ్ళనూ పరువు హత్యలతో మట్టుబెట్టే వారి గురించీ తరచూ వార్తల్లో చదువుతూనే వున్నాం, టీవీల్లో చూస్తూనే వున్నాం కదా?  మరి వీరు కూడా తల్లిదండ్రులే కదా?   

అందుకే ఈ నవల.. పెద్దగా మనం ఆలోచించని, పట్టించుకోని కోణాన్ని మనకు చూపేట్టే సమకాలీన రచన! 

13, నవంబర్ 2015, శుక్రవారం

సుశీల మాటా... సావిత్రి పాటా!

 

పి. సుశీల...

హాయి గొలిపే తీయని తెలుగు పాటకు మరో పేరు ఆమె! 

ఐదు దశాబ్దాలకు పైగా సినీరంగంలో నిలిచి వెలిగి- తరతరాల శ్రోతలను మరపురాని పాటలతో మురిపించిన మధుర గాయని!

ఆమెనూ  ఆమె పాటలనూ పలకరిస్తూ,  పలవరిస్తూ,  పరామర్శిస్తూ  ఓ కథనాన్ని తాజా ‘సితార’ వారపత్రికలో రాశాను.

దాన్నిక్కడ చదవొచ్చు. 



పాట వినగ ప్రాణాలు కదలురా!

సుశీల మధుర గీతాల్లో చాలావరకూ  ఈ  ‘సితార’ కథనంలో వచ్చాయి 

స్థలం లేక ఎడిట్ అయినవీ, ఆ కథనం రాసినప్పుడు తప్పిపోయినవీ మరికొన్ని పాటలున్నాయి. వాటినిక్కడ గుర్తుచేస్తున్నాను.

సుశీల పాటల్లో ఎక్కువ భాగం సంగీతాభిమానులు ‘రేడియో’లో పదేపదే విని ఇష్టపడినవే. ఒక్కో శ్రోతకు ఒక్కో పాటతో ప్రత్యేక జ్ఞాపకం ఉండొచ్చు.

ఇలా  ఈ పాటలను స్మరించుకోవటమంటే మనసును ఉల్లాసపరిచిన- ఉద్వేగపరిచిన కాలంలోకి ప్రయాణించడమే. కరిగిపోయిన గతంలోని చెరిగిపోని పాత పరిమళాల్లోకి సాగిపోయి పరవశమైపోవటమే! 


(పాటలు ఏ సినిమాలోవో ఇస్తున్నాను. కానీ  లింకులు ఇవ్వటం లేదు... ఆసక్తి ఉన్న శ్రోతలు ఈ ఆధారంతో  నెట్ సాయంతో  వాటిని తేలిగ్గానే సాధించగలుగుతారు కదా...)

* ఆహా అందము చిందే హృదయ కమలం  (ఆడ బ్రతుకు)
* పచ్చని చెట్టూ ఒకటీ వెచ్చని చిలకలు రెండూ   (రాము) 
* పిల్లలూ దేవుడూ చల్లని వారే (లేత మనసులు)
* దీపానికి కిరణం ఆభరణం  (చదువు- సంస్కారం)

*  నీ చెలిమీ నేడె కోరితినీ  (ఆరాధన)
*  జోరు మీదున్నావు తుమ్మెదా (శివరంజని)
*  చిన్నమాటా...ఒక చిన్నమాటా (మల్లెపూవు)
*  ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో (మరో చరిత్ర)

*  ఆకులో ఆకునై పూవులో పూవునై (మేఘ సందేశం)
* ముందు తెలిసేనా ప్రభూ నీ మందిరమిటులుంచేనా  (మేఘ సందేశం)


సుశీల పాడిన తొలి పాటలను నటి జమునపై చిత్రీకరించారు. ఆ రకంగా సుశీల కెరియర్ ఆమెతోనే మొదలైందన్నమాట.

 ‘గొంతుకలో సన్నివేశానికి తగిన భావనను నింపి , ఆ పాత్ర స్వభావాన్ని అనుసరించి, అర్థం చేసుకుని పాడగల సమర్థురాలు’  అని జమున కితాబిచ్చారు.

అందుకే అంత వైవిధ్యభరితమైన పాటలకు ప్రాణ ప్రతిష్ఠ చేయగలిగారామె.

*  పార్వతిని ప్రార్థించే పాటను (‘జననీ శివకామినీ..’ - నర్తనశాల) ఎంతగా మెప్పించారో...

మరియ తనయను స్తుతించే ( ‘రాజ్యము బలమూ మహిమా నీవే నీవే’- రాజాధిరాజు)  గీతాన్ని కూడా అలాగే  ఒప్పించారు. 

*  దయ్యం పాటంటే వెంటనే గుర్తొచ్చే సుశీలపాట- ‘‘నిను వీడని నీడను నేనే" (అంతస్తులు )  కదా? 

 టీజింగ్, చమత్కారపు పాటలు  తల్చుకుందామా! 

*  పాండవులూ పాండవులూ తుమ్మెదా (అక్కా చెల్లెలు)  
* ఏమండోయ్ శ్రీవారూ, ఒక చిన్నమాటా (మంచి మనసులు)
*  పొరుగింటి మీనాక్షమ్మను చూశారా? ( సంబరాల రాంబాబు)
*  ఎప్పుడూ మీ పాఠాలంటే ఎలాగండీ సార్ (అమ్మ మాట)



నటి వాణిశ్రీ ...  సుశీల పాటల గురించి
ఏమన్నారో చూడండి-   


 పుట్టినరోజు సందర్భాన్ని గుర్తుచేసే ఈ పాటలు అత్యంత ప్రాచుర్యం పొందినవి-

*  మళ్ళీ మళ్ళీ పాడాలి  ఈ పాట (మట్టిలో మాణిక్యం)
*  పుట్టిన రోజు పండగే అందరికీ (జీవన తరంగాలు)

*   పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయీ ( బంగారు కలలు)

*  ఈనాడే బాబూ నీ పుట్టినరోజు  (తాత-మనవడు)



సుశీల పాడిన జోల/లాలి పాటలు ఎన్ని ఉన్నాయో...!

*  పాలకడలిపై శేషతల్పమున పవళించేవా (చెంచులక్ష్మి )
*  అత్త ఒడీ పువ్వు వలే మెత్తనమ్మా (తోడూ నీడా)
*  వెన్నెలలోని వికాసమే వెలిగించెద నీ కనులా (ఆరాధన)
*  నీ మది చల్లగా స్వామీ నిదురపో (ధనమా? దైవమా?)

*  ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు (జీవనజ్యోతి)
*  చందురుని మించి అందమొలికించు (రక్త సంబంధం)
*  నీలాల కన్నుల్లో మెలమెల్లగా (నాటకాల రాయుడు)
*  చిరుగాలే వింజామర చిట్టిపాపే కెందామర (శ్రీదేవి)

*  ప్రేమకు నేనూ పేదను కాను (ముందడుగు)
*  జోలపాట పాడి ఊయలూపనా (ఇది కథ కాదు)
*  వటపత్ర శాయికి వరహాల లాలి (స్వాతిముత్యం)

సుశీల...  ఘంటసాలతో పాడిన యుగళగీతాలు ఎన్నో శ్రావ్యమైనవి ఉన్నాయి. వాటిని ఇక్కడ ప్రత్యేకంగా ఇవ్వటం లేదు. 

కానీ,  ఘంటసాల ప్రాభవం ఉన్నరోజుల్లోనూ  కాలానికి నిలిచే యుగళ గీతాలను బాలుతో కలిసి పాడటం విశేషం.

ముఖ్యంగా... ఘంటసాల సంగీత దర్శకత్వంలో సుశీల- బాలు పాడిన యుగళగీతం ఒకటి చెప్పుకోదగ్గది. అది-

* సెలయేటి గలగలా చిరుగాలి కిలకిలా  (తులసి)

ఇంకా మిగిలిన పాటలు...

* ఏమంటున్నది ఈ గాలి ఎగిరే పైటను అడగాలి  (మేమూ మనుషులమే)
*  తనివి తీరలేదే నా మనసు నిండలేదే (గూడుపుఠాణి)
*  కురిసింది వానా నా గుండెలోనా (బుల్లెమ్మ బుల్లోడు)

* కొండపైనా వెండివానా (ఇంటి దొంగలు)

*  ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లూ (పండంటి కాపురం)
*   నీలో విరిసిన అందాలన్నీ  (మనుషులు- మట్టి బొమ్మలు)  

* మల్లి విరిసిందీ పరిమళపు జల్లు కురిసిందీ (రామయ తండ్రి) 
* మల్లెకన్న తెల్లనా మా సీత మనసు  (ఓ సీత కథ) 
పాలరాతి మందిరాన పడుచు బొమ్మ అందం (నేనూ మనిషినే) 
చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమ వన్నెలు (చీకటి వెలుగులు) 

* ఇది తీయని వెన్నెల రేయి (ప్రేమలేఖలు)
 * మానసవీణా మధుగీతం (పంతులమ్మ)


*  ప్రణయరాగ వాహినీ చెలీ వసంత మోహినీ (మాయామశ్చీంద్ర)
*  కనులముందు నీవుంటే కవిత పొంగి పారదా (చెల్లెలి కాపురం)
*  కుశలమా నీకు కుశలమేనా (బలిపీఠం)


*  తొలివలపే తియ్యనిది (నీడ లేని ఆడది ) 

*  మెరుపులా మెరిశావు (ప్రేమ సంకెళ్ళు)
*  చినుకులా రాలి నదులుగా సాగి  (నాలుగు స్తంభాలాట)
*  నీకోసం జీవితమంతా వేచాను మల్లెలలో (మూడు ముళ్ళు)
*  వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన మురళి (సప్తపది) 
 
 స్లో సాంగ్స్ రోజుల్లోనూ  చాలా వేగవంతమైన స్వరకల్పనలున్న  పాటలను సుశీల పాడారు. వాటిలో చెప్పుకోదగ్గవి-

 1) ముత్యాల జల్లు కురిసే రతనాల మెరుపు మెరిసే (కథానాయకుడు)  సంగీతం: టీవీ రాజు

 2) రా వన్నెల దొరా కన్ను చెదరా  (లక్ష్మీ కటాక్షం)  సంగీతం:  ఎస్ పీ కోదండపాణి

ఈ  పోస్టు శీర్షిక సంగతి

 ఇంతకీ  ఈ బ్లాగు పోస్టు  టైటిల్  గురించి ఇంకా చెప్పనే లేదు కదూ...!

సుశీల పాటలు మనకు ఏళ్ళ తరబడిగా తెలుసు. మరి  ఆమె మాట ఎలా ఉంటుందో  చూద్దాం.

ఓ సందర్భంలో  ఘంటసాల ఘనతను తల్చుకుంటూ నివాళిగా ఆమె ఇలా మాట్లాడారు....




ఈ పోస్టు రెండో భాగంలో సావిత్రి పాట గురించి ప్రస్తావన ఉంది. దాని సంగతేమిటి  అంటారా ?  

‘సుశీలమ్మ’ పాడితేనే తనకు బాగా నప్పుతుందని సావిత్రి నమ్మకం. అందుకే  ఆమె మాత్రమే తనకు పాడాలని ఆమె కచ్చితంగా దర్శక నిర్మాతలకు చెప్పేవారట. 

ఆమె ఓ ఇంటర్వ్యూలో  ‘మూగ మనసులు ’ పాటలోని ఓ చరణాన్ని సరదాగా ఆలపించారు.  అదిక్కడ  విందాం.  (చివర్లో  అదే చరణాన్ని  సుశీల గళంలో కూడా వినొచ్చు.)

  



విన్నారు కదా?   స్థాయి (పిచ్) లో మాత్రం తేడా వచ్చింది కదూ... ( సుశీల పాడింది కూడా  వింటే ఆ భేదం స్పష్టంగా తెలుస్తుంది).

కానీ  అనౌన్సర్  కోరిక మీద అప్పటికప్పుడు పాడాల్సివచ్చిన సందర్భం ఇది!  

సాధన చేయకపోయినా,  సంసిద్ధంగా లేకపోయినా ట్యూన్ సరిగానే పాడేశారు సావిత్రి!

31, డిసెంబర్ 2014, బుధవారం

పాతికేళ్ళుగా నడుస్తున్న విలక్షణ పత్రిక!

రుక్మిణీ కల్యాణ ఘట్టానికి  చిత్రరూపం

చాలా ఏళ్ళ క్రితం ...

హైదరాబాద్ లోని ఒక పత్రికా కార్యాలయానికి  వచ్చిందో యువతి. ఆ పత్రికలో ఏదైనా రాస్తే పీహెచ్ డీ వస్తుందని  ప్రొఫెసర్లు చెప్పారనీ, తన వ్యాసం ప్రచురించమనీ కోరింది.

ఆ  సంపాదకుడు అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి.    

ఆమె అందించిన కాగితాలు చూశారు. వాటిమీద పన్నెండు ప్రశ్నలు రాశారు. వాటికి అదే క్రమంలో స్పష్టంగా సమాధానాలు రాసివ్వమన్నారు. అలా చేస్తే వ్యాసం సరిగా తయారవుతుందనీ, అప్పుడు ప్రచురిస్తాననీ తెలిపారు.

అది తన శక్తికి మించిన పని అంటూ ఆమె వెనుదిరిగివెళ్ళిపోవటం వేరే విషయం!

ఆ పత్రికే  ‘మిసిమి’! 

దానిలో ప్రచురించే వ్యాసాల స్థాయి అది. ధన సంపాదన కంటే విజ్ఞాన వ్యాప్తి ప్రధానమనే ఉద్దేశంతో కొనసాగుతోందీ మాసపత్రిక.

కొన్ని సంచికల  కవర్ పేజీలూ,  చిత్రాలూ   చూడండి....   

ఇది తొలి సంచిక

బౌద్ధ ప్రాంగణ ద్వారం


కిరాతార్జునీయం
ఇది నవంబరు 2014 సంచిక
కళలూ, సాహిత్యాంశాలను ప్రచురించే  పత్రికలు ఉండటంలో  పెద్ద విశేషమేమీ లేదు.

కానీ, ఈ పత్రికలో  హేతువాదానికీ, తర్కానికీ, శాస్త్రీయ విశ్లేషణకూ కొంత ప్రాధాన్యం ఉంటుంది.  చిత్ర, శిల్పకళలకు కూడా ప్రాముఖ్యం ఉంటుంది.  అదీ చెప్పుకోదగ్గ విషయం.  ముఖచిత్రం  విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తుంది.  

‘మిసిమి’ మాసపత్రిక రజతోత్సవం  నవంబరు 4న హైదరాబాద్ లో జరిగింది. ఒక సాహిత్య సభ  ప్రేక్షకులతో  కిక్కిరిసి హాలంతా నిండుగా ఉండటం నేనదే చూడటం. 

ఈ పత్రిక గురించి  తెలుగు వెలుగు డిసెంబరు 2014 సంచికలో ఓ వ్యాసం - ‘మిసిమిలమిలలు’ రాశాను.


 ఈ లింకు లో ఆ వ్యాసం చూడవచ్చు.

‘తెలుగు వెలుగు’లో  వ్యాసం వచ్చాక...  పాఠకుల నుంచి వచ్చిన ఫోన్లలో  ‘మిసిమి అనే పత్రిక ఒకటి ఉందా? దీని గురించి వినటం ఇదే మొదటిసారి ’ అని చాలామంది  చెప్పారు.

ఆశ్చర్యం కలిగింది!


25 సంవత్సరాలుగా ప్రచురితమవుతున్న పత్రిక పరిస్థితి ఇది!  సినీ టీవీ రంగాల్లో  నిన్న గాక మొన్న ప్రవేశించినవాళ్ళ  గురించి  (ముఖ్యంగా నటులు )  మాత్రం  కోట్ల మందికి  ఇట్టే  తెలిసిపోతుంటుంది.


పాత సంచికలకు ఇదిగో లింక్.. 

 1990 తొలిసంచిక నుంచి 2010 మే సంచిక వరకూ మొత్తం 245  ‘మిసిమి’ సంచికలు  పత్రిక వెబ్ సైట్ లో ఉచితంగా లభ్యమవుతున్నాయి.  ఈ లింకు నుంచి PDF  ఫైళ్ళను డౌన్ లోడ్ చేసుకోవచ్చు కూడా!