సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

31, జనవరి 2017, మంగళవారం

సముద్రం... అరణ్యం... సమున్నత చిత్ర సౌందర్యం!


రేమండ్ షెపర్డ్ ...!

ఈ అపురూప చిత్రకారుడి పేరు నాకు తెలిసి కొద్దికాలమే అయింది.

నేనింకా పుట్టకముందే ఆయన కన్నుమూశాడు. 1913-1958 సంవత్సరాల మధ్య 45 ఏళ్ళు మాత్రమే జీవించాడీ  బ్రిటిష్ చిత్రకారుడు.

అల్లం శేషగిరిరావు గారి తెలుగు వేటకథలు చదువుతూ... ఆసక్తితో సమాంతరంగా ఇంగ్లిష్ వేట కథల కర్త జిమ్ కార్బెట్ కథలనూ పరామర్శించాను.

అప్పుడే నాకు ఈ రేమండ్ తారసపడ్డాడు!.

ఆ చిత్రకారుడి గురించి కొంత తెలుసుకున్నాను.


ఆయన వేసిన బొమ్మలు చాలానే చూశాను.

ఆనందించాను!

రేమండ్  ప్రకృతిని బాగా  ప్రేమించిన మనిషి.

చిత్రకారుడిగా అరణ్యాన్నీ,  సముద్రాన్నీ, తను చూసిన ప్రపంచాన్నీ  కథాత్మకంగా... కళాత్మకంగా రేఖల్లో , రంగుల్లో  రమణీయంగా  ప్రతిసృష్టి చేసిన సృజనశీలి.


జంతువులను లండన్  జూలో ప్రత్యక్షంగా చూస్తూ స్కెచ్చులు వేసుకునేవాడు. ఆ అనుభవంతో  జంతువులనూ, పక్షులనూ చిత్రించటంలో రాటుదేలాడు.

చివరకు  డ్రాయింగ్ మెలకువలను బోధిస్తూ  పుస్తకాలే  రాశాడు.

బ్రిటిష్ ఇండియన్ హంటర్-రైటర్ అయిన  జిమ్ కార్బెట్ ... మనదేశంలో గడిపినప్పటి  స్వీయానుభవాల వేట కథల రచనలకు రేమండ్ బొమ్మలు వేశాడు.  ఆ కథలు పాఠకుల్లో ప్రాచుర్యం పొందటానికి ఆ చిత్రాలు  బాగా  తోడ్పడ్డాయి.










హెమింగ్వే సుప్రసిద్ధ నవల  ‘ద ఓల్డ్ మాన్ అండ్ ద సీ’ ఉంది కదా? దానికి కళ్ళు చెదిరే, అబ్బురపరిచే నలుపు తెలుపు బొమ్మలను వేశాడు రేమండ్.









వినోదం కోసమో,  గొప్ప కోసమో  పులుల్ని వెంటాడే సగటు  వేటగాడు కాదు జిమ్ కార్బెట్.  ఇతడు పర్యావరణ ప్రేమికుడు..  ‘మ్యానీటర్ ’లుగా మారే  పులుల, చిరుతల  స్వభావాన్నీ, జీవన విధానాన్నీ బాగా అధ్యయనం చేసిన వ్యక్తి.

నర భక్షిణిగా  మారిన ఓ పులిని అంతం చేయటానికి  వెళ్ళిన జిమ్...  ఆహారం తిని విశ్రాంతి తీసుకుంటున్న పులిని చంపటానికి  సంకోచిస్తాడు.  మనుషులను చంపే ఈ జంతువును హతమార్చక తప్పదని సంకల్పం చెప్పుకుని, చివరకు తుపాకీని ప్రయోగిస్తాడు.

‘క్రూర’ జంతువులుగా మనం భావించే ప్రాణుల పట్ల సరైన అవగాహనను కల్పిస్తాయి జిమ్ కార్బెట్ రచనలు.  

జీవితంలో  ఎన్ని కష్టాలు ఎదురైనా  చివరిదాకా పోరాడాల్సిందేననీ, నిరాశకు తావివ్వకూడదనీ  హెమింగ్వే  నవల మనకు కళాత్మకంగా చెపుతుంది.      

నేను ఇష్టపడే  ఈ  ఇద్దరు రచయితల పుస్తకాలకు అజరామర చిత్రాలను సమకూర్చిన  రేమండ్ ...  తన చిత్రకళా నైపుణ్యంతో నాకు ఇష్టుడైపోయాడు.

* * * 
ధుర  గాయకుడు  ఘంటసాల గళంలో  పొంగిపొరలిన కరుణ...  కరుణశ్రీ  ‘పుష్ప విలాపం’ అసంఖ్యాకమైన  శ్రోతలకూ,  పాఠకులకూ  చేరువయ్యేలా చేసింది.  ఆ గానం లేకపోతే  తన రచన జనాలకు ఇంతగా తెలిసేది కాదని  జంధ్యాల పాపయ్యశాస్త్రి  కృతజ్ఞతగా స్మరించుకోవటం నిన్నటి చరిత్ర.

ఇంకా  వెయ్యి  సంవత్సరాల వెనక్కి వెళ్తే ....

 ‘పాయక పాక శాసనికి భారత ఘోర రణంబునందు నారాయణునట్లు’ మహాభారత ఆంధ్రీకరణలో  నారాయణ భట్టు తనకు సహకరించాడని  నన్నయ్య చెప్పుకున్నాడు.  అలా  నన్నయభట్టు- నారాయణ భట్టు ఒక జట్టు.

ఇలాంటి కాంబినేషన్లు  రచయిత, చిత్రకారులకు సంబంధించి కొన్ని చెప్పుకోవచ్చు.
 
సత్యం శంకరమంచి  ‘అమరావతి కథల’కూ,
దాశరథి ‘గాలిబ్ గీతాల’కూ బాపు  వేసిన బొమ్మలు చాలా ప్రత్యేకమైనవి కదా?

ఆ  పుస్తకాలు పాఠకులకు చేరువ అవటంలో ఆ చిత్రాల పాత్ర ఉంది.

అలాగే...  చందమామలో  దాసరి సుబ్రహ్మణ్యం  రాసిన- తోకచుక్క, ముగ్గురు మాంత్రికులు, కంచుకోట, జ్వాలాదీపం,  మకరదేవత, రాతి రథం,  శిథిలాలయం,  మాయా సరోవరం లాంటి జానపద సీరియళ్ళ విజయంలో సగ భాగం...  ‘చిత్రా’ బొమ్మలకు దక్కుతుంది!

ఈ సీరియళ్ళను చందమామలో  కనీసం రెండు మూడు సార్లు ప్రచురించారు. ఆ పున: ప్రచురణల్లో  చిత్రా బొమ్మలను  ప్రచురించటం చందమామకు సమస్య అయికూర్చుంది. ఎందుకంటే - వాటి ఒరిజిల్స్ నూ, వాటి బ్లాకులనూ  భద్రపరచలేదు. చిత్రకారుడు అప్పటికే కన్నుమూశారు.

అందుకే పాత సంచికల బొమ్మలను అదేరకంగా ట్రేసింగ్ చేయించి ప్రచురించారు. మరో గొప్ప చిత్రకారుడు  ‘శంకర్’చేత ఈ పనిచేయించారట.

జిమ్ కార్బెట్ రచనలు ప్రచురించిన  ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వాళ్ళక్కూడా ఇదే సమస్య వచ్చింది.

జిమ్ కార్బెట్  రచన  The Temple Tiger పుస్తకం 1954లో  ప్రచురితమైంది.


ఈ రచనను ఆక్స్ ఫర్డ్ వాళ్ళు 1988 నుంచి ప్రచురించటం మొదలుపెట్టారు. అప్పటికి చిత్రకారుడు  రేమండ్ చనిపోయి చాలా కాలమైంది.

దాంతో  ఇతర చిత్రకారులతో  ఆ బొమ్మలను కాపీ చేయించి, ప్రచురించారు.  అలాంటి ఓ చిత్రం -


ఈ  పుస్తకం  2006 ప్రచురణ నా దగ్గరుంది.  ఇలస్ట్రేషన్స్ బై రేమండ్ షెపర్డ్  అని వేసి,  redrawn by  అంటూ మరో ఐదుగురు చిత్రకారుల పేర్లను ప్రచురించారు.

ఈ విషయాన్ని పాఠకుల ముందు పెట్టే నిజాయతీని ప్రదర్శించినందుకు ఈ ప్రచురణకర్తలను నిజంగా మెచ్చుకోవాలి.

ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ఆ పుస్తకాలకు  రేమండ్ బొమ్మలను re draw చేయించి మరీ  ఉపయోగించటం ఆ చిత్రకారుడి బొమ్మల ప్రాముఖ్యాన్నీ, ఘనతనూ  చాటుతోంది కదా!

రేమండ్ చిత్రించిన  బొమ్మల్లో  నాకు ఎన్నో నచ్చాయి. వాటిలోంచి  గొప్పగా అనిపించినవాటిలో  కొన్నిటిని  ఎంచి, ఇక్కడ ఇస్తున్నాను.










* * * 
మ పాప క్రిస్టీన్ రూపాన్ని చాలా బొమ్మల్లో రికార్డు చేశాడు,  రేమండ్.

వాటిలో ఈ రెండూ చూడండి...

ఆమె పెద్దయ్యాక తన తండ్రి  మిగిల్చి వెళ్ళిన చిత్రకళా సంపదను ఒక పుస్తక రూపంలో  కూర్చింది.

ఆ  పుస్తకం కవర్ పేజీ-

ఈ గొప్ప చిత్రకారుడు వేసుకున్న స్వీయ రూపచిత్రాలు ( సెల్ఫ్ పోర్ట్రెయిట్స్ ) ... చూడండి.




బాగున్నాయ్ కదూ!

* * * 

హా శక్తీ,  చురుకైన కదలికలూ, అనూహ్య కోణంలో  చిత్రణా ... ఈ  చిత్రకారుడి బొమ్మల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.

అలాంటి  చిత్రాల్లో  కొన్నిటిని  ఇక్కడ ఇస్తున్నాను-  (  ఇంటర్ నెట్ లోని వివిధ సైట్ల  సౌజన్యంతో...)














 ఓడ  ప్రమాద దుర్ఘటన ...   ప్రయాణికులను  రక్షించే ఘట్టం