సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

25, డిసెంబర్ 2015, శుక్రవారం

మీ గొప్పలు మీరే చెప్పుకోవాలా?



న్మాన సభల్లో  కళాకారులను ధారాళంగా పొగుడుతూ చేసే కీర్తి గానాలు  దుర్భరంగా ఉంటాయి.

అవే అలా అనిపిస్తుంటే...

ఎవరికి వారు తమను  పొగుడుకుంటుంటే  వినాల్సిరావటం/  చదవాల్సిరావటం..
మరెంత  ఘోరం..!


*  *   * 

స్పీ బాలసుబ్రహ్మణ్యం  మధుర  గాయకుడిగానే కాదు-

చక్కని నటుడిగా , 
ప్రతిభావంతుడైన  డబ్బింగ్ ఆర్టిస్టుగా,
ప్రత్యేకించి అద్భుతమైన యాంకర్ గా  నాకెంతో ఇష్టం.

ఆయన ఇంటర్ వ్యూలు ఎప్పుడూ భలే  ఉంటాయి.  కొత్త విషయాలెన్నో తెలుస్తాయి.  అంతకుముందు తెలిసినవి కూడా  ఆయన మాటల్లో వింటే మరింత స్వారస్యంగా తోస్తాయి.

బాలూ పాడిన తొలిపాట రికార్డింగ్ జరిగి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా పది రోజుల క్రితం  ఆయనతో చేసిన పెద్ద  ఇంటర్ వ్యూ ఈనాడు సినిమా పేజీలో వచ్చింది.

ఆసక్తిగా చదివాను.


 మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి గానీ... 

 రెండు చోట్ల మాత్రం ఆయన సమాధానాలు చదువుతుంటే  చేదుగా అనిపించింది.

‘ఈ దేశం ఓ గొప్పకళాకారుడిని  సృష్టించింది’ అనీ,   ‘నాలాంటి గాయకుడు పుట్టడం చాలా అరుదు’ అనీ తన ఘనతను తానే చాటుకున్నారు  బాలు.

 


ఈ  విషయాలు ఎంత నిజాలైనా కావొచ్చు; కానీ వాటిని  ఆయనే  చెప్పుకోవటం మాత్రం ఏమీ బాగా లేదు.

అడిగిన ప్రశ్నల తీరు అలా చెప్పేలా ప్రేరేపించివుంటుందని సర్దుకుందామా?  సినీ మాయామేయ ప్రపంచంలో  దశాబ్దాలుగా విజయవంతంగా కొనసాగుతూ  అసంఖ్యాకమైన ఇంటర్ వ్యూలు  ఇచ్చి  ఏది ఎలా ఎంతవరకూ  చెప్పాలో ఎంతో తెలిసిన  బాలూ  కదా..  అలా ఎలా చెప్పాడనే ప్రశ్న మాత్రం వదల్లేదు నన్ను.  
  
 ‘‘ఇప్పుడు కూడా  నా గురించి నేను చెప్పుకోకపోతే నాకు నేను ద్రోహం చేసుకున్నవాడినవుతా!’’ అనే సమర్థన మరీ ఇబ్బందిని కలిగించింది. 

బాలూ!  మీ గురించి మీరలా చెప్పుకోకపోతే మీ గురించి  శ్రోతలకూ,  ప్రేక్షకులకూ  తెలియని పరిస్థితి  ఉందా?

మీరే ఇంతలా దీనంగా  భావిస్తుంటే... మరి మీ సీనియర్ గాయని సుశీల సంగతి?  

తెలుగు చిత్రసీమ  స్వర్ణయుగంలో అవిభాజ్య భాగమై..  ఘంటసాలతో,  మీతో  కూడా మరపురాని... మనోహరమైన పాటలనెన్నో ఆలపించిన సుశీల  ఇలా తన గొప్పలు తానే ఎన్నడైనా  చెప్పుకున్నారా?

అవార్డులే  కొలమానంగా భావించే, వాటికోసం  వెంపర్లాడే  సినిమా సంస్కృతిలో ఏళ్ళ తరబడి ఉంటూ కూడా ..

తను పాటలు పాడటం మొదలుపెట్టినపుడు బహుశా ఇంకా పుట్టని గాయని  చిత్రకు పద్మశ్రీ ఇచ్చి తనను పట్టించుకోకపోయినా-

ఆ గాన కోకిల  మౌనంగానే ఉన్నారు కదా?

ఆవేదనతోనో, ఆక్రోశంతోనో తన ఘనత చాటుకునే ప్రయత్నం ఆమె  చేయలేదు కదా? (కొద్ది కాలం తర్వాత ఎవరి సిఫార్సు పనిచేసో.. అంతకన్నాపెద్ద అవార్డే  వచ్చిందనుకోండీ...)    

బాలూ... మీ గురించి మీరిలా చెప్పుకోవడం ద్వారా మీ ఉన్నత వ్యక్తిత్వాన్ని కొంత  కుదించుకుని,  మిమ్మల్నిఅభిమానించేవారిని ఎంతో కొంత బాధపెట్టారనిపించింది.

ఈ ఆత్మ శ్లాఘనలు మీ ఔన్నత్యాన్ని తగ్గించాయనే  అభిప్రాయం  నాలాంటి అభిమానులకు  ఏర్పడిందంటే- ఇప్పుడు నిజంగానే మీకు మీరే  ద్రోహం చేసుకున్నట్టు అవలేదా? 

 
*  *   * 
‘ఆత్మ శ్లాఘన’అనే మాట వినగానే గుర్తొచ్చే రచయిత చెలం.

 శ్రీశ్రీ మహా ప్రస్థానానికి  ఆయన  రాసిన ‘యోగ్యతాపత్రం’లో  ఈ వాక్యాలు చూడండి-

‘‘అబద్ధాలతో, స్తోత్రాలతో, వంచనలతో, అనుకూల దుష్ట ప్రచారంతో, ఆత్మ శ్లాఘనలతో దేశం మీద పడి బతుకుతున్న ఈ  prasite కవివరేణ్యులు శ్రీ శ్రీ ని విమర్శించడానికి సాహసిస్తున్నారు. "అభివృద్ధికి రాతగినవాడవు" అని ఆకాశమంత ఎత్తుగా వుండే అతని వీపు తట్ట చూస్తున్నారు.’’


అలాంటి శ్రీశ్రీ  తర్వాతి కాలంలో   ‘ఈ శతాబ్దం నాది’ అంటూ  గొప్పలు పోవటం బాగా అనిపించలేదు.

ఒక భాషా సాహిత్యంలోని ఒకానొక  ప్రక్రియలో ప్రభావశీలమైన ప్రతిభ చూపినంతమాత్రాన ఒక  శతాబ్దం మొత్తం ఆ కవిదే  అయిపోదు.  ఒకవేళ అయితే గియితే...ఆ మాట ఇతరులు.. విమర్శకులు చెప్పొచ్చు  గానీ..

ఒక కవి తన ప్రభావం గురించి తానే  ఎలుగెత్తి చెప్పుకోవడం చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. 

ఆ  శ్రీశ్రీని  తొలి దశలో ప్రబావితం చేసిన  కవి  విశ్వనాథ  సత్యనారాయణ.   

 ‘ధిషణాహంకారం’తో  విశ్వనాథ  చేసిన స్వీయ కీర్తిగానాలూ  అంతే!


చూడండి-

‘‘అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగ మస్మాదృశుం
డలఘు స్వాదు రసావతార ధిషణాహంకార సంభార దోః
హల బ్రాహ్మీమయమూర్తి  శిష్యుడయినాడన్నట్టి దా వ్యోమపే
శల చాంద్రీ మృదుకీర్తి చెళ్ళపిళ వంశ స్వామి కున్నట్టుగన్
’’
(శ్రీమద్రామాయణ కల్పవృక్షం)

తనంతటివాడు శిష్యుడైన అదృష్టం చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రికి  దక్కింది గానీ నన్నయ, తిక్కనలకు కూడా  దక్కలేదట! 

తిరుపతి వేంకటకవుల్లో  ఒకరు ఈ చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి.

ఆ జంట కవులు విసిరిన సవాళ్ళలో  ఎంతెంత సొంత పొగడ్తలు కురిపించుకున్నారో చూడండి-



"దోసమటం చెఱింగియును దుందుడు కొప్పఁగఁ బెంచినార మీ
మీసము రెండుభాషలకు మేమె కవీంద్రులమంచుఁ దెల్పఁగా
రోసము గల్గినన్ గవివరుల్ మము గెల్వుఁడు గెల్చిరేని యీ
మీసము దీసి మీపదసమీపములం దలలుంచి మ్రొక్కమే."


తెలుగు, సంస్కృత భాషలు రెంటికీ వాళ్ళే కవీంద్రులట. అందుకే  మీసం పెంచారట.  తమను ఏ కవులైనా గెలిస్తే వారి మీసం తీసేసి, వాళ్ళ కాళ్ళ దగ్గరపెట్టి మొక్కుతామని సవాలు విసిరారు.

అప్పట్లో కొప్పరపు కవులకూ,  వీరికీ మధ్య  అవధానాల, కవనాల, వాగ్యుద్ధాలు హోరాహోరీగా  జరిగేవట. మొహమాటాలేమీ పడకుండా యథేచ్ఛగా ఎవరి  గొప్పలు వారే చెప్పుకోవటం అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం.

కొప్పరపు కవులు కూడా ఇలాగే తమ ఘనతను చాటుకున్నారో  లేదో  తెలియదు.

*  *   * 
హాభారత రచనా కాలం నాటికే  ఎవరిని వారు పొగుడుకోవటం  హీనమైన విషయంగా ఉంది.

కర్ణపర్వం మూడో ఆశ్వాసంలో  అర్జునుడు ఓ సందర్భంలో  దర్మరాజును నానా తిట్లూ తిడతాడు. ఆపై పశ్చాత్తాపంతో  తన తల నరుక్కుంటానని అంటాడు.

కృష్ణుడు " అర్జునా ! దానికీ ఒక ఉపాయం ఉంది !  తనని తాను పొగుడుకోవడం చావుతో సమానం అంటారు పెద్దలు. అందుచేత నిన్ను నువ్వు పొగుడుకో. అదే ప్రాయశ్చిత్తం.’’ అంటాడు.

అప్పుడు అర్జునుడు తనను ఇలా పొగుడుకుంటాడు-

 " ధర్మజా ! నా పరాక్రమం నీకు తెలియనిదా !  శివుడు వొక్కడూ తప్పిస్తే  విల్లు పట్టినవాళ్ళలో నాతో సాటి వచ్చేవాడు ముల్లోకాల్లోనూ లేడు. దిగ్విజయం చేశాను. కోట్లు కోట్లు ధనం నీ రాజసూయం దక్షిణల కోసం తెచ్చిపోశాను. సాటి లేని  సంశప్తకులను  నాశనం చేశాను. నా చేతిలో చచ్చిన కౌరవసేనలు ఎలా పడివున్నాయో ఒక్కసారి చూడు’’ 

‘నిన్ను నువ్వు పొగుడుకుంటే  నిన్ను నువ్వు చంపుకున్నట్టే’ అంటూ  సొంత డబ్బా కొట్టుకోవడాన్ని ఆ కాలంలోనే అంత తీవ్రంగా నిరసించేవారన్నమాట!

*  *   *  

రు సంవత్సరాల క్రితం రచయిత  నామిని సుబ్రహ్మణ్యం నాయుడికి తిరుపతిలో  చెక్కు బహూకరణ సన్మానం జరిగింది.

ఆ సందర్భంగా తన  ప్రసంగ వ్యాసం- ‘పాఠకులారా! మిమ్మల్నిక్షమించలేను’లో  నామిని తన రచనల ఘనతను స్వయంగా చాటుకున్నారు.



 ‘ఆబాల గోపాలానికి ఎంతగానో ఉపయోగపడే ఇన్నిపుస్తకాలు’ రాశానన్నారు. పాఠకుల దేహాల్లో  ‘ఎప్పటికప్పుడు మంచి రసాయనాల ఇన్సులిన్ పడటానికి ’ తన  పుస్తకాలు కొనాలని చెప్పుకొచ్చారు.

దీన్ని రచయిత్రి  రంగనాయకమ్మ ఎలా దుయ్యబట్టారో చూడండి-

                             
‘‘ఏ మనిషి అయినా , ‘నేను అందరికన్నా చాలా గొప్పవాణ్ణి’ అన్నాడంటే , అనుకున్నాడంటే ఆ మనిషి మొదట అందరికన్నా అల్పుడు!  తర్వాత అందరికన్నా మూర్ఖుడు! 

నువ్వు చాలా గొప్పవాడివే అయితే , ఆ మాట, నీ గురించి ఇతరులు చెప్పుకోవాలి. నిన్ను నువ్వే వర్ణించుకోవడం కాదు.  ఇంత చిన్నవిషయం తెలియని ఏ మనిషి అయినా , గొప్పవాడయ్యేది , అల్పత్వంలోనే !’’


‘గొప్పవాడయ్యేది అల్పత్వంలోనే... ’ -  ఎంత  పదునుగా ఉందో కదా  ఈ వ్యాఖ్య!

*  *   * 

న ప్రతిభా సంపత్తుల విషయంలో నమ్రతగా, వినయంగా  ఉన్న కవి కాళిదాసు!

రసవంతమైన- మనసుకు హత్తుకునే పోలికలు చెప్పటంలో  ‘ఉపమా కాళిదాసస్య’  అని  ప్రఖ్యాతికెక్కిన సంస్కృత కవి.

 తాను రాసిన  కావ్యం   ‘రఘువంశం’  మొదట్లోనే  తన గురించి ఏం చెప్పుకున్నాడో  చూడండి-




మన్ద: కవియశ: ప్రార్థీ గమిష్యామ్యపహాస్యతామ్
ప్రాంశులభ్యే ఫలే లోభాదుద్బాహురివ వామన:


అంటే-

‘‘నేనొక తెలివితక్కువ వాణ్ణి.  కవి అనే కీర్తి పొందాలనే కోరిక ఉన్నవాణ్ణి . పొడుగైన వాళ్ళకు మాత్రమే అందే పళ్ళు అందుకోవాలని చేతులు సాచే పొట్టివాడిని చూసి నవ్వినట్టు జనం నన్ను చూసి నవ్వుతారేమో.’’

 కర్ణకఠోరమైన స్వీయ గుణగానాలతో ‘పోలిస్తే’ కాళిదాసు తన గురించి  చెప్పింది హాయిగానూ,  శ్రవణపేయంగానూ  లేదూ!