డా. కేశవరెడ్డి గారు రాసిన ‘మునెమ్మ’ను చాలా ఆలస్యంగా ఈమధ్య కాలంలోనే చదివాను. ఈ నవలిక మీద పత్రికల్లో, బ్లాగుల్లో వచ్చిన ప్రశంసలూ, విమర్శలూ కూడా పరిశీలించాను.
తాజాగా ఈ- సాహిత్య పత్రిక ‘వాకిలి’లో సుజాత గారు రాసిన వ్యాసం
ఇంకా, సాయిపద్మ గారి బ్లాగు పోస్టు - ఈ రెండూ కూడా చదివాను.
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ సెప్టెంబరు 2008లో ప్రచురించిన చిన్న నవల ఇది.
ముందు, వెనకమాటలూ తీసేస్తే 95 పేజీలే.
సైజు కూడా చిన్నదే. ఎక్కాల పుస్తకం లాగా ఉంటుంది. దినపత్రికల టాబ్లాయిడ్ (మినీ) పేజీని నాలుగు భాగాలు చేస్తే ఒక భాగం ఎంతుంటుందో అంత సైజు.
వెల 40 రూపాయిలు.
ఈ-పుస్తకంగా ఇది కినిగెలో దొరుకుతోంది. ...
http://kinige.com/kbook.ఈ పుస్తకంలో ఉపయోగించిన మాండలిక పదాలకు అధ్యాయాల వారీగా అర్థం ఇవ్వటం బాగుంది. ఈ నవలిక కథాంశం చాలామందికి తెలిసిందే.
రెండూళ్ళు తప్ప మిగతా లోకం చూడని పల్లెటూరి స్త్రీ మునెమ్మ తన భర్తను చంపిన హంతకులెవరో తెలివిగా కనిపెట్టటం; పెంపుడు జంతువైన గిత్త సాయంతో వాళ్ళ మీద పగతీర్చుకోవటం, తర్వాత నిర్లిప్తంగా, ధీమాగా బతుకుపోరాటంలో మునిగిపోవటం.
మునెమ్మకు వరసకు తమ్ముడు/మరిది అయిన సినబ్బ అనే 32 ఏళ్ళ యువకుడు పన్నెండేళ్ళ క్రితంనాటి ఈ కథనంతా మనకు చెప్పుకుంటూ వస్తాడు.
కథ జరిగిన కాలం 1945 ప్రాంతం.
సందర్భం రావాలే కానీ, ఒక సామాన్యమైన స్త్రీలో కూడా అంతర్గత శక్తులు బయటకు వస్తాయనేది ఈ నవలిక ద్వారా తెలిసే మంచి విషయం. ఆకట్టుకునే చక్కని రాయలసీమ మాండలికంతో వివిధ సంఘటనలు చకచకా నడుస్తుంటాయి.
కానీ పాత్రల స్వభావం స్పష్టంగా అర్థంకాదు.
చదువుతున్నపుడు పాఠకులకు తలెత్తే ఎన్నో ప్రశ్నలకు పుస్తకం పూర్తయినా జవాబులు దొరకవు.
హింసన చణ ధ్వంస ‘రచన’
గిత్తను రక్తం కారేలా హింసించటంతో మొదలైన కథ... అదే గిత్త తన కొమ్ములతో పేగులు లాగి మృత్యుతాండవం చేసిన వర్ణనతో ముగింపుకు చేరుతుంది. ఖూనీల , చావుల, శవాల, ప్రేతాల, చురకత్తుల నెత్తుటి భాష అడుగడుగునా పలకరిస్తుంటుంది!
‘పీనుగు వచ్చేదాక’ పక్కవాటాన పడేసినట్టున్న పార వర్ణనా, గిత్త కండరాలు వేలాడేస్తూ నెత్తురు కారుతూ ఊళ్ళోకి వెళ్తుంటే మోదుగు కొమ్మలు నడిచొస్తున్నట్టు పోల్చటం, ద్రౌపది వేషగాడి భయానక హత్య వివరాలూ, పశువుల సంతలో జనం ‘చేతులు నెత్తురుతో తడిసి ఉన్నట్టు’అనిపించటం, మందులోడి నడుము విరిగి ‘రక్తం ధారగా కారుతూ నేలమీద వెల్లువలా’పారటం, అన్నిటికీ మించి- చివర్లో తరుగులోడిని గిత్త కుమ్మి చంపిన బీభత్సం... !
సూక్ష్మాంశాలతో సాగిన హత్యల సవివర వర్ణనలు జుగుప్సను కలిగిస్తాయి. తర్కంతో పొసగని సంఘటనలు మెదడుకు పరీక్ష పెడతాయి.
సమాధానాలు దొరకని సందేహాలు
తనకు సమాధానం దొరకాల్సిన కొన్ని ప్రధాన ప్రశ్నలను మునెమ్మ పట్టించుకోనట్టు కథ నడిచింది.
1. బొల్లిగిత్త ను తన మొగుడు జయరాముడు ఎందుకంత దారుణంగా హింసించాడు? హఠాత్తుగా దాన్ని అమ్మెయ్యాలనే తీవ్ర నిర్ణయానికి ఎందుకు వచ్చాడు? ఆపై ఏమాత్రం ఆలస్యం చేయకుండా గిత్తను అమ్మటానికి మించి అర్జెంట్ పని లేనట్టు వందల కిలోమీటర్ల దూరం ఎందుకు ప్రయాణమయ్యాడు?
2. అప్పటివరకూ గిత్తను ఎలా అమ్ముతాడో చూస్తానని శాపనార్థాలు పెట్టిన సాయమ్మత్త, తన కొడుకు ఇంటికి రాగానే కోపమే లేనట్టు అకస్మాత్తుగా ఎందుకు ప్లేటు ఫిరాయించింది?
‘ఒళ్ళంతా ఒక పక్క నంజర నంజర అయిపోయేదాక’ గిత్తను ఎందుకు కొట్టావూ, అదేం జేసిందని మునెమ్మ నిలదీస్తే జయరాముడు ‘ఏవి జేసిందో నీకు తెలవదా? ఏవీ తెలవనట్టు మాట్లాడతా ఉండావుగదనే బెస్టు (భ్రష్ఠు) లంజా’ అని దూషిస్తాడు.
‘మరి బొల్లిగిత్తను అంతగా ఎందుకు కొట్టాడో నువ్వు తెలుసుకోలేదా?’ అని సినబ్బ అడిగినప్పుడు ‘తెల్సుకునేదానికి తేల్చుకునేదానికీ యాడ తీరిందిరా. అది జరిగినాక ఆయన బూమ్మీద ఉండింది రెండే రెండు దినాలు గదా?’ అంటుంది మునెమ్మ.
సమస్యంతా వ్యవధి చిక్కకపోవటమేనా? ‘తీరకపోవటమే’నా? మరి ఆ సందేహం ఇంకా ‘తీరకుండా’ అలాగే ఉంది కదా? ఆయన చనిపోయాడు సరే... ఆ ప్రశ్న ఇంకా సజీవంగానే ఉంది కదా?
జయరాముడు హత్యకు గురైందే- సంతలో గిత్తను అమ్మటానికి వెళ్ళటం వల్ల. ఆ అమ్మేపని పెట్టుకోకుండా ఉంటే బతికివుండేవాడే కదా? తనకెంతో ఇష్టమైన, జీవనానికి ఆధారమైన బొల్లిగిత్తపై కక్ష పెట్టుకున్నట్టు- దాన్ని అమ్మటానికి అంత అత్యవసరంగా అతడు ఎందుకు వెళ్ళాల్సివచ్చింది?
గిత్తను హఠాత్తుగా దారుణంగా హింసించిన జయరాముడు అంతటితో ఊరుకోలేదు. అలా ఎందుకు చేశాడో - మునెమ్మకు బాగా తెలుసని ఆరోపిస్తున్నాడు కూడా!
తనకు ఏం తెలుసు? ఏం జరిగిందసలు? ఈ ప్రశ్నలేవీ మునెమ్మకు రావా?
తిరునాళ్ళకు వెళ్ళినపుడు ఎవరి దగ్గర సవాయి రోగం తగిలించుకున్నదీ, ఎవరి దగ్గర కొరుకుడు రోగం అంటించుకున్నదీ దాచుకోకుండా చెప్పే మొగుడి గురించి చాలా ‘మురిపెం’గా చెప్పే మునెమ్మకు అతడి స్వభావం ఏమిటో కూడా బాగానే తెలిసుండాలి. అవన్నీ కలిపి ఆలోచిస్తే కారణం ఊహించటం కష్టం కాదు.
అంతా తేటతెల్లమే...
అసలు ఇంత విచికిత్స కూడా అక్కర్లేదు. బొల్లిగిత్త తనవీపుపై కాలుపెట్టినప్పుడు తను భయంతో కెవ్వున కేక వేసింది. తర్వాత (బహుశా వెంటనే) జయరాముడు ఆ గిత్తను దారుణంగా హింసించాడు.
అప్పుడు మునెమ్మకు వెంటనే అర్థం కావాలి- తనవీపుపై కాలు వేసినందుకే గిత్తపై అంత కోపమని. పైగా- ‘ఇంతింత గుడ్లు పెట్టుకుని కాసేపు నన్నూ, కాసేపు ఆ గిత్తనూ చూసినాడు’ అని తనే చెప్పింది. ఇంత తేటతెల్లంగా ఉన్న పరిస్థితిని అర్థం చేసుకోలేకపోవటం ఏమిటి? ఆమె చాలా ఆశ్చర్యపోయిందట కానీ, గిత్త మీద అతడికి అంత కోపం ఎందుకు వచ్చిందో మాత్రం అర్థం చేసుకోలేదట.
గొడ్డును అమ్ముతాడని తెలిసి తారస్థాయిలో విరుచుకుపడిన సాయమ్మ తర్వాత కొడుకు వచ్చినపుడు-అసలేమీ పోట్లాడకుండా ‘అమ్మెయ్యాలనే తొందర’ తనకే ఎక్కువ ఉన్నట్టు ప్రవర్తిస్తుంది.
‘ఈళ్ళ యవారం నీకేవన్నా అర్తమయిందా?’అని సినబ్బను అడిగితే సినబ్బ ఏమీ చెప్పలేదు. (సినబ్బకు ‘ చాలా రోజుల తర్వాత’ కాదు; అప్పటికే ఆ కారణం అర్థమైందనీ, అయినా ఆమెకు చెప్పలేదనీ తర్వాతి వాక్యం సూచిస్తుంది. దీన్ని తర్వాత ప్రస్తావిస్తాను).
సినబ్బను అడిగి ఆ సంగతిని మునెమ్మ అంతటితో వదిలిపెట్టేస్తుందా? ఆమె తన సందేహానికి సమాధానం వెతుక్కోదా?
ఔచిత్య భంగం
సాయమ్మ ప్రవర్తన లో ఎప్పుడు మార్పొచ్చింది? తను గిత్త మూలంగా రవిక రెండు మూడు చోట్ల చినిగిందని చెప్పాకే కదా? ఈ రెంటినీ లంకె పెట్టి ఆలోచించే అవకాశం మునెమ్మకు ఉంది కదా?
అపరాధ పరిశోధకురాలి స్థాయిలో ఎంతో సూక్ష్మంగా, నిశితంగా ఆలోచించే మునెమ్మ జయరాముడి ప్రవర్తనలోని తేడా, సాయమ్మ ధోరణిలో అనూహ్యంగా వచ్చిన తేడాలకు కారణాల గురించి పట్టనట్టు ఉండటం ఆ పాత్ర ఔచిత్యానికే భంగం!
‘కల’ తర్వాతే మునెమ్మ స్వభావంలో, ఆలోచనా తీరులో గణనీయమైన మార్పు వచ్చిందంటారా? (అది ఎలా సాధ్యమనేది వేరే చర్చ). సరే, అప్పుడైనా... ఆ సుదీర్ఘ ప్రయాణ సమయంలో భర్త, అత్తల ధోరణుల్లో వచ్చిన మార్పులకు మూల కారణాన్ని గురించి ఆమె ఆలోచించనే ఆలోచించదా అనే ప్రశ్న దూసుకొస్తుంది!
ఆమె ఆలోచించింది కానీ సినబ్బకు ఆ సంగతి చెప్పలేదంటారా? (సినబ్బ ద్వారానే కదా మనకు ఈ కథ తెలుస్తోంది.)
గిత్తను కొట్టిన పారను చూస్తే ఏమనిపించిందో, మొగుడు ఏమేం ఆంతరంగిక విషయాలు చెప్పాడో ... అవన్నీ సినబ్బకు దాపరికం లేకుండా చెప్పిన ఆమె ఇంత ప్రధానమైన సంగతిని మాత్రం ఎందుకు దాస్తుందనే ప్రశ్న వస్తుందప్పుడు!
ఆమె సినబ్బకు చెప్పింది కానీ అతడే మనకు చెప్పలేదంటే గానీ ఈ ప్రశ్నల పరంపర ముగియదు!
అసలు వాళ్ళిద్దరి మధ్యా ‘గిత్తను అంతగా ఎందుకు కొట్టాడో ’ అనే అంశం అప్పటికే ప్రస్తావనకు వచ్చిందని గుర్తుంచుకోవాలి. అప్పుడు తెలియలేదనుకుందాం ; తర్వాత మునెమ్మకు తెలిసివుంటే/ దానికి కారణం ఊహించివుంటే ఆ సంగతిని సినబ్బతో పంచుకోకుండా ఉండటానికి ఆస్కారం లేదు.
అపార్థాలకు సరంజామా
గిత్త ముందరి కాళ్ళను పైకెత్తి వీపు మీదుంచినపుడు కొయ్యబారిపోయి, భయంతో కేక వేసిన మునెమ్మ - ఆ సంగతిని సాయమ్మత్తకు చెప్పేటపుడు ‘బోర్లపడి మోకాళ్ళు చెక్కుకుపోయాయని చెప్పినంత సహజంగా, దూలగొండి తగిలి దురద పెడుతున్నాయని చెప్పినంత సహజంగా’ చెప్పిందని సినబ్బ మనకు చెప్తాడు.
ఈ రెంటికీ పొంతన కనపడదు. తను భయంతో కొయ్యబారిపోయిన సంగతిని మామూలు ధోరణిలో చెప్పటం ఆమె ధీరత్వాన్ని సూచిస్తుందా? అమాయకత్వాన్నా? నిర్లిప్తతనా?
ఇలాంటి సందర్భాలు పాఠకులను తికమకపెడతాయి.
పాఠకులు గందరగోళపడటానికీ, అపార్థం చేసుకోవటానికీ వీలు కల్పించే సంఘటనలూ, వాక్యాలూ నవలికలో ఉన్నాయి.
జయరాముడు బొల్లిగిత్తను తోలుకుని పరసకు వెళ్ళిపోయినపుడు సినబ్బ వ్యాఖ్య చూడండి-
‘ఐతే మునెమ్మ చెప్పిందంతా విన్నాక నాకనిపించిందొక్కటే- తను దు:ఖపడుతున్నది జయరాముని కోసమో, బొల్లిగిత్త కోసమో ఆమె తేల్చుకోలేకపోతున్నది’
చివరలో గిత్తను పిలగాడిగా సంబోధించటం కూడా ఇలాంటిదే. ‘పిలగాణ్ణి వదిలిపెట్టు..’ అని రెండు సార్లు పొలికేక వేసిందనీ, అది విని దిగ్భ్రాంతి చెందాననీ సినబ్బ చెపుతాడు మనకి!
‘అవసరం అన్నీ నేర్పుతుంది, ఈ మాట గొడ్డుకు కూడా వర్తిస్తుంది’ అనే మునెమ్మ చివరి వాక్యం కూడా.
2008లో సాక్షి సాహిత్యపేజీలో చర్చ జరిగినపుడు ఈ రెండు అంశాలకూ రచయిత వివరణ ఇచ్చారు. వివరణ సందేహాల్ని తీర్చిందో లేదో వేరే విషయం ... అసలు కథనంలో ఆ సందర్భాల్లో అస్పష్టత ఉండటం వల్లే ఇలా రకరకాల వ్యాఖ్యానాలు వచ్చాయనీ, రచయిత వివరణ అవసరమైందనీ గమనించాలి.
‘లక్షలాదిగా ఉన్నపాఠకులు మునెమ్మను ఇంకాస్త బాగా అర్థం చేసుకునేందుకు ఇవన్నీ చెప్పాను’ అంటారు రచయిత డా. కేశవరెడ్డి. ‘ఇంకాస్త బాగా అర్థం చేసుకోవటం’ తర్వాతి సంగతి, ఆమె పాత్రను పాఠకులు ‘అపార్థం’ చేసుకోవటానికి వీలు కల్పించే సరంజామా సినబ్బ వ్యాఖ్యల్లో, కథనంలో పుష్కలంగా ఉంది !
సినబ్బకు తెలుసా?
ఇంతకీ ఈ సినబ్బకు జయరాముడికి కోపం ఎందుకొచ్చిందో, కోపంగా ఉన్న సాయమ్మ అకస్మాత్తుగా మెత్తబడి తన వైఖరి ఎందుకు మార్చుకుందో బాగానే తెలుసని కథలోనే సూచన ఉంటుంది.
‘ఈళ్ళ యవారం నీకేవన్నా అర్తమయిందా?’అని సినబ్బను అడిగితే ‘నేనేమీ చెప్పలేదు’ అంటాడు. (నాకు తెలియదనో, అర్థం కాలేదనో కాదు). ఆ వెంటనే అతడు మనకు చెప్పే వ్యాఖ్యానం చూడండి- ‘తొడిమ మీద మల్లెపువ్వు తెల్లగా ఉంటుంది. తొడిమ మీదున్నంతకాలమైనా అది తెల్లగానే ఉండాలన్నది నా కోరిక. ఆకు మీద మంచుబిందువు ముత్యంలా ఉంటుంది. ఆకు మీదున్నంత కాలమైనా అది ముత్యంలాగే ఉండాలన్నది నా కోరిక.’
ఇదేమిటో నాకు బోధపడలేదు. సినబ్బకు ‘విషయం’ తెలుసనే అంచనాకు రావొచ్చనిపించింది. మునెమ్మ మనసు బాధపెట్టటం ఇష్టం లేక తాను జయరాముడి అనుమానం, సాయమ్మ వైఖరిలో మార్పుల గురించి చెప్పలేదని సినబ్బ భావించివుంటే... అదైనా కథలో చెప్పుండొచ్చు.
తరుగులోడి ఇంటికి బొల్లిగిత్తను తీసుకురావటానికి ఒంటిల్లుకు సినబ్బ వెళ్ళినపుడు సాయమ్మను ఓ మాట అడగాలి కదా? కానీ ఆమె ప్రస్తావనే ఉండదు. సినబ్బ ఆమెతో అసలేమీ మాట్లాడలేదా? ఆమె కొడుకు చనిపోయాడని కనీసం చెప్పాలి కదా... చివర్లో జీవనోపాధి విషయంలో కూడా సాయమ్మ అభిప్రాయం, స్పందన ఏదో ఉండివుండాలి. కానీ ముగింపులో కూడా ఆమె ఊసే లేకపోవటం గమనించవచ్చు.
కావాలనే రచయిత ఈ పాత్రను కొనసాగించలేదనిపిస్తుంది. ఎందుకంటే ... సినబ్బ సాయమ్మను కలిస్తే... జయరాముడి మరణం గురించి చెప్పాల్సివస్తుంది. అలా చెపితే ఊరంతా తెలిసిపోతుంది. అప్పుడు ‘నీకెట్ట తెల్సిందిరా నా మొగుడు చచ్చినాడని? ఊర్లో ఎవరికీ తెలియకముందే నీకెట్ట తెలిసింది?’ అనే పదునైన, శక్తిమంతమైన సంభాషణకు అవకాశం పోతుంది.
కానీ... సాయమ్మ పాత్రను ఉంచి కూడా కథ నడపొచ్చు. జయరాముడి మరణవార్త బయటకొస్తే.. తరుగులోడు తప్పించుకునే అవకాశం ఉంది. మునెమ్మ దీన్ని ముందే పసిగట్టి ‘సాయమ్మత్తకు తెలియకుండా గిత్తను తీసుకురా’ అని సినబ్బకు చెప్పినట్టు కథ నడిపొచ్చు. ఆమె ముందుచూపు కూడా వెల్లడయ్యేది.
పిలగాడు...
ఈ నవల చదివినవారిని వదలకుండా బాగా పట్టుకునే ప్రశ్న.. ఏకాంతంలో లేదా భావావేశంలో ఉన్నపుడు భర్తను పిలిచే రహస్యనామం ‘పిలగాడు’ను మునెమ్మ గిత్తను ఉద్దేశించి ఎందుకు సంబోధించిందన్నది.
మునెమ్మకు కల వచ్చి విలపిస్తూ ‘పిలగా..’ అని రెండు మూడుసార్లు అంటే ఆమె ఎవరిని పిలుస్తోందో ‘కొద్ది రోజుల తర్వాత గాని’ అర్థం కాలేదంటాడు సినబ్బ. ‘ఆ విషయం సాయమ్మత్తకు కూడా తెలియదు’. తరుగులోడిని గిత్త చంపటానికి ముందు ‘పిలగాణ్ణి వదిలిపెట్టు’ అని ఆమె పొలికేక వేసినప్పుడు మాత్రం సినబ్బకు పిలగాడెవరనేది తెలుసు.
ఇంత ఆంతరంగిక విషయం మునెమ్మ అతడికి ఎప్పుడు చెప్పింది? ఆ సంగతి కథలో ఎక్కడా ఉండదు. తమ ప్రయాణంలో ఆమె సినబ్బకు ఈ సంగతి చెప్పివుండాలి.
వెంట్రుకలతో.. ..
జయరాముణ్ణి వెంట్రుక దారం మెడకేసి బిగించి చంపేశారని పోలీసు జవాను చెప్పినపుడు మునెమ్మ దిగ్భ్రాంతితో పిచ్చిదానిలా బాగిమాను దగ్గరకు పరిగెడుతుంది. ‘అవి నా వెంట్రుకలేరా సినబ్బా. పిలగాణ్ణి నేనే సంపేసినానురా’ అని రోదిస్తుంది. తన వెంట్రుకలతోనే హంతకులు భర్త చంపేశారని తెలిసినపుడు ఆమె స్పందన అలా ఉండటం సహజమే కదా అనిపిస్తుంది మొదట.
అయితే వెంట్రుకలతో పేనిన దారం జయరాముడి మెడ చుట్టూ ఉరితాడులా బిగుసుకునివున్నట్టు ఆమెకు కలలోనే కనపడింది కదా? ఆ కలను ఆమె సంపూర్ణంగా విశ్వసించింది కదా? వెంట్రుకల దారంతో చంపారని ‘కొత్తగా’ నిర్థారణ అయేదేముంది?
అలాంటపుడు ఆమె ఈ లోకాన్ని మర్చిపోయి అంత ఉద్విగ్నభరితంగా, విపరీతమైన వేగంతో నగ్నంగా పరుగెత్తినట్టు రాయటం నాటకీయత కోసమే అనిపిస్తుంది.
మునెమ్మ పాత్ర పలికే ఆణిముత్యాలు ఆ పాత్ర పరిధిని దాటి, నేర పరిశోధకురాలి స్థాయిలో ఉన్నాయి. ఒక మంత్రగత్తె మాటలుగా కూడా తోచాయి, కొన్ని సందర్భాల్లో!
మార్మికతకు కారణం
అసలు ఈ పుస్తకం ఇంత ‘మార్మికం’గా తయారవటానికి రచయిత పాటించిన నిర్దిష్ట రచనా విధానమే ప్రధాన కారణం. అదేమిటంటే... వివిధ సందర్భాల్లో సినబ్బ జోక్యం.
ఏ పాత్ర అయినా తన అనుభవం చెప్పబోతుంటే ఇతడు పూర్తిగా చెప్పనివ్వడు. వాళ్ళను మొదట్లోనో, మధ్యలోనో ఆపేసి- తను చెప్పటానికి తయారవుతుంటాడు. దీంతో ఆ పాత్రల స్పందన, ఆలోచనాతీరు, స్వభావం అంతుపట్టకుండా పోతుంది. ముఖ్యంగా మునెమ్మ పాత్ర విషయంలో అస్పష్టతా, సందిగ్ధతా, అపార్థాలూ పుట్టటానికి ప్రాతిపదిక ఇదే !
కథ మొత్తానికీ ఆయువుపట్టు అనదగ్గ సంఘటన- మునెమ్మ వీపుపై బొల్లిగిత్త ముందరికాళ్ళను వేయటం! దీన్ని మునెమ్మ తన అత్తకు చెప్పినట్టు సినబ్బ మనకు చెపుతాడు. ‘కాలవ గెడ్డన ఎండుగడ్డి చెక్కతా ఉంటిమి అత్తమ్మా..’ అంటూ ప్రారంభిస్తుంది.
అంతే ! ఇక సినబ్బ ప్రవేశించి మిగిలిందంతా ‘తన మాటల్లో’ చెప్పేస్తాడు. మునెమ్మను చీకట్లో ఉంచి ఆమె మనోభావాలూ, స్పందనలూ పాఠకులకు అర్థం కాకుండా చేసేస్తాడు.
చూడని దృశ్యం చూసినట్టు...
మునెమ్మ తన అనుభవం చెప్పేటపుడు ఆమె చూడని, ఆమె చెప్పని (చూడలేదు కాబట్టి చెప్పే అవకాశం లేదు) వివరాలను కూడా సినబ్బ చెప్పేస్తాడు!
(బొల్లి గిత్త) ‘శరీరాన్ని ఒక పక్కకు విల్లులాగ వంచి మునెమ్మ వైపు నాలుగడుగులు జరిగింది. అలా మరొకసారి చేసి మునెమ్మకు చేరువగా వచ్చి...’ -
ఇదంతా ఎవరు చూశారు? అక్కడున్న జయరాముడు, మునెమ్మ ఇద్దరూ చూడలేదు. సినబ్బ అక్కడ లేడు. ఎవరూ చూడని దృశ్యాన్ని మరెలా చెప్పగలిగాడు?
నాటకీయత కోసం ఇష్టం వచ్చినట్టు ఊహించి ‘దగోత్తరంగా’ (దారుణంగా) చెప్పేస్తాడన్నమాట!
మందులోడి భార్య ‘చెప్పే మాటలలో నెల్లు ఎంత? పొల్లు ఎంత?’ అని ఆలోచిస్తాడు సినబ్బ. మరి తను చెప్పిన ఈ మునెమ్మ కథలో ఏది ఎంత సత్యం? ఎంత ఊహ?
మునెమ్మ స్వభావం ఏమిటి?
ఈ కథ ప్రకారం- భర్త తన వ్యభిచార సంబంధాలను దర్జాగా వర్ణించి చెపితే మునెమ్మ అతడికి ఆ సంబంధాలున్నందుకు బాధపడదు. పైగా అలా దాపరికం లేకుండా చెప్పే మొగుడు దొరకటం ఘనతగా భావించి, దాన్ని సినబ్బతో మురిపెంగా చెప్పుకుంటుంది.
కారణమేదో కనీసం చెప్పకుండా... భర్త తనను బూతుతిట్టు తిట్టి, చెంప పగలగొట్టినపుడు కోపం తెచ్చుకోదు. నిరసనా, బాధా ప్రకటించదు.
ఆ పాత్రకున్న చైతన్య పరిధిలో ఇవన్నీ సహజమే కావొచ్చు.
కానీ చివర్లో తరుగులోడి భార్యను ఈ వివాదంలోకి లాగటంతో మునెమ్మ పాత్ర స్థాయి పడిపోయింది. ‘నా గిత్తకు తరుపుల్ని (యుక్తవయసులో ఉన్న ఆవుల్ని) తార్చమన్నా. తరుపుల్ను గాకపోతే ఆడవాళ్లనే తార్చు. నీ పెండ్లాంతో బోణీ చెయ్’ అంటుంది.
‘తరుగులోణ్ణి రెచ్చగొట్టటానికే ఆమె గురించి అలా చెప్పాల్సివచ్చిందిరా సినబ్బా’ అని బాధ ప్రకటించివుంటే వేరే సంగతి.
ఒక రచన చదివిన పాఠకులు నచ్చితే మెచ్చుకుంటారు. నచ్చకపోతే విమర్శిస్తారు. పాఠకుల్లో ఈ రెండు రకాల వాళ్ళూ ఉంటారు. విమర్శకులు కూడా పాఠకుల్లో భాగమే. కానీ లక్షలాది పాఠకులు వేరూ; కొద్దిమంది విమర్శకులు వేరూ అని రచయిత భావించినట్టు కనపడుతుంది.
![]() |
రచయిత కేశవరెడ్డి |
అందుకే విమర్శల పట్ల అసహనం చూపారు. ‘దే మీన్ నథింగ్ టు మీ’ అని ఈసడించారు. కానీ ‘పాఠకులకు’మాత్రం మునెమ్మ ‘ఇంకాస్త బాగా అర్థం’ కావాలని కోరుకున్నారు.
పాఠకులెవరైనా ఈ నవలికలోని అసంబద్ధతను ఎత్తిచూపితే వారు కాస్తా విమర్శకులైపోయి ఆయన అసహనాన్ని చవిచూడాల్సివస్తుందేమో!
‘మునెమ్మ ఒక అద్భుత పాత్ర’ అనీ, ‘.. ఆ పాత్రను సృష్టించగలిగినందుకు నాకు చాలా గర్వంగా ఉంది’ అనీ రచయిత తన వివరణ వ్యాసంలో ప్రకటించారు.
పాఠకులు అనాల్సిన మాటలను రచయితే చెప్పటం ముచ్చటేస్తోంది! కానీ అస్పష్టతలో ముంచి కథనూ, సందేహాలు ముసిరేలా ఆ పాత్రనూ రూపొందించారనే విమర్శలను ఆయన ఎదుర్కోక తప్పదు !
-----------------------------------------------------------------
‘మునెమ్మ’ నవలపై 2008లో సాక్షి సాహిత్య పేజీలో నాలుగు వారాలపాటు జరిగిన చర్చ- చివర్లో రచయిత ఇచ్చిన సమాధానం : వీటి క్లిపింగ్స్ కోసం ‘మనసులో మాట’ బ్లాగు చూడండి -
http://manishi-manasulomaata.blogspot.com/2013/03/blog-post_5.html