గొప్ప నటుల అభినయంలో కనపడే పోలికలు ఆసక్తికరంగా ఉంటాయి. కమలహాసన్ నటన చూస్తుంటే నాకు చాప్లిన్ గుర్తొస్తుంటాడు. (ఆయన్ని కమల్ తెలిసో తెలియకుండానో అనుకరిస్తుంటాడని నా నమ్మకం). అలాగే ఒక్కోసారి నవ్వుల రాజబాబు కూడా కమల్ నటనలో తొంగిచూస్తుంటాడు!
ఈ మధ్య ఎన్టీఆర్ ‘నర్తనశాల’ చూస్తుంటే సన్నివేశపరంగా కమల్ ‘విశ్వరూపం’ గుర్తొచ్చింది.
‘నర్తనశాల’లో నాట్యాచార్యుడైన బృహన్నల పాత్ర అర్జునుడిగా మారి శంఖం పూరించినపుడు ఎన్టీఆర్ చూపిన వైవిధ్యం అబ్బురంగా కనపడుతుంది.
‘విశ్వరూపం’లో కూడా కథక్ డాన్స్ మాస్టర్ గా పరిచయమై, నపుంసక ఛాయల్లో హావభావాలూ, సంభాషణలూ పలికే కమల్ ఒక్కసారిగా మెరుపు ఫైట్ చేసి హీరోయిన్ నీ, ప్రేక్షకులనూ ఆశ్చర్యంలో ముంచెత్తుతాడు!
సినిమా ఇంకా చూడని వారు ఆ trasformation సన్నివేశాన్ని యూ ట్యూ బ్ లో చూడొచ్చు.
స్వర్ణోత్సవ సందర్భంగా ....
ఇంతకీ ‘నర్తనశాల’ చిన్నప్పుడెప్పుడో చూశాను కానీ ఈ మధ్య ఈనాడు సినిమా పేజీలో కథనం రాయటం కోసం ఒకటికి రెండు సార్లు ఆ సినిమాను చూడటం తటస్థించింది.
![]() |
ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు |
ఈ సినిమా విడుదలై యాబై ఏళ్ళయిన సందర్భంగా రాసిన ఆ కథనం ఇక్కడ-
అర్జునుడి రాకతో పరవశుడై ద్రోణుడు ఆలపించిన తిక్కన పద్యం - 'సింగంబాకటితో గుహాంతరమునన్ చేడ్పాటు మైనుండి...’ సన్నివేశం చూడండి-
![]() |
అర్జునుడిని బృహన్నలగా తొలిసారి చూసినపుడు ద్రౌపది (సావిత్రి) ముఖంలో హావభావాలు |
‘సఖియా వివరించవే...’ |
ఈ పాట పాడుతుంటే... తొలిసారి సైరంధ్రిని చూస్తాడు కీచకుడు.
![]() |
ఆమెపై మరులుగొని సెగలు కక్కుతున్న మోహావేశాన్ని తన ముఖకవళికల్లో అనితర సాధ్యంగా ప్రతిఫలించిన ఎస్.వి. రంగారావు |
ఉత్తర గోగ్రహణం అడ్డుకున్న యుద్ధంలో కౌరవ సేనపై అర్జునుడి సమ్మోహనాస్త్ర ప్రయోగం |
అతిథి పాత్రలో నాటి అందాల తార కాంచనమాల |
శ్రీమద్విరాట పర్వము
‘నర్తనశాల’ చూశాక ఎన్టీఆర్ ప్రపంచ రికార్డు ‘పంచ పాత్రలు ’ వేసిన ‘శ్రీమద్విరాట పర్వము’ ఎలా ఉందో అని ఆసక్తి కలిగింది.
చూశాను!
‘నర్తనశాల’ విడుదలైన పదహారు సంవత్సరాలకు ఎన్టీఆర్ చేసిన ప్రయత్నమిది.
‘నర్తనశాల’ సంగీత దర్శకుడు, ఛాయాగ్రాహకుడు, గాయకుడు (బాల మురళీ కృష్ణ) దీనికి కూడా పనిచేశారు. ముఖ్యంగా ఎన్టీఆర్ నిర్మాణ - దర్శక బాధ్యతలతో పాటు రెండు పాత్రల నుంచి ఐదు పాత్రలకు తన కృషిని విస్తరించారు.
తగిన ఫలితం రాకపోవటానికి ఎన్నో కారణాలు...!
ద్రౌపది పాత్ర ( సావిత్రి) రూపకల్పనకు ఎంతో విరుద్ధంగా ఉంది వాణిశ్రీ ధరించిన పాత్ర.
దర్శకుడు కమలాకర కామేశ్వరరావు పనిచేయలేదు సరే; సావిత్రి , ఎస్వీ రంగారావులు లేని లోటు బాగా కనపడింది. ఎల్. విజయలక్ష్మి లేకపోవటం కూడా!
‘నర్తనశాల’లో బృహన్నల పాత్రపై తీసుకున్న శ్రద్ధ, జాగ్రత్తలు ‘శ్రీమద్విరాటపర్వము’ లో కనిపించలేదు.
అసలు స్క్రిప్టులో, పాత్రల తీరుతెన్నుల్లోనే లోపాలుండటం ఈ సినిమా పరాజయానికి ప్రధాన కారణం!