పి. సుశీల...
హాయి గొలిపే తీయని తెలుగు పాటకు మరో పేరు ఆమె!
ఐదు దశాబ్దాలకు పైగా సినీరంగంలో నిలిచి వెలిగి- తరతరాల శ్రోతలను మరపురాని పాటలతో మురిపించిన మధుర గాయని!
ఆమెనూ ఆమె పాటలనూ పలకరిస్తూ, పలవరిస్తూ, పరామర్శిస్తూ ఓ కథనాన్ని తాజా ‘సితార’ వారపత్రికలో రాశాను.
దాన్నిక్కడ చదవొచ్చు.
పాట వినగ ప్రాణాలు కదలురా!
సుశీల మధుర గీతాల్లో చాలావరకూ ఈ ‘సితార’ కథనంలో వచ్చాయి
స్థలం లేక ఎడిట్ అయినవీ, ఆ కథనం రాసినప్పుడు తప్పిపోయినవీ మరికొన్ని పాటలున్నాయి. వాటినిక్కడ గుర్తుచేస్తున్నాను.
సుశీల పాటల్లో ఎక్కువ భాగం సంగీతాభిమానులు ‘రేడియో’లో పదేపదే విని ఇష్టపడినవే. ఒక్కో శ్రోతకు ఒక్కో పాటతో ప్రత్యేక జ్ఞాపకం ఉండొచ్చు.
ఇలా ఈ పాటలను స్మరించుకోవటమంటే మనసును ఉల్లాసపరిచిన- ఉద్వేగపరిచిన కాలంలోకి ప్రయాణించడమే. కరిగిపోయిన గతంలోని చెరిగిపోని పాత పరిమళాల్లోకి సాగిపోయి పరవశమైపోవటమే!
(పాటలు ఏ సినిమాలోవో ఇస్తున్నాను. కానీ లింకులు ఇవ్వటం లేదు... ఆసక్తి ఉన్న శ్రోతలు ఈ ఆధారంతో నెట్ సాయంతో వాటిని తేలిగ్గానే సాధించగలుగుతారు కదా...)
* ఆహా అందము చిందే హృదయ కమలం (ఆడ బ్రతుకు)
* పచ్చని చెట్టూ ఒకటీ వెచ్చని చిలకలు రెండూ (రాము)
* పిల్లలూ దేవుడూ చల్లని వారే (లేత మనసులు)
* దీపానికి కిరణం ఆభరణం (చదువు- సంస్కారం)
* నీ చెలిమీ నేడె కోరితినీ (ఆరాధన)
* జోరు మీదున్నావు తుమ్మెదా (శివరంజని)
* చిన్నమాటా...ఒక చిన్నమాటా (మల్లెపూవు)
* ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో (మరో చరిత్ర)
* ఆకులో ఆకునై పూవులో పూవునై (మేఘ సందేశం)
* ముందు తెలిసేనా ప్రభూ నీ మందిరమిటులుంచేనా (మేఘ సందేశం)
సుశీల పాడిన తొలి పాటలను నటి జమునపై చిత్రీకరించారు. ఆ రకంగా సుశీల కెరియర్ ఆమెతోనే మొదలైందన్నమాట.
‘గొంతుకలో సన్నివేశానికి తగిన భావనను నింపి , ఆ పాత్ర స్వభావాన్ని అనుసరించి, అర్థం చేసుకుని పాడగల సమర్థురాలు’ అని జమున కితాబిచ్చారు.
అందుకే అంత వైవిధ్యభరితమైన పాటలకు ప్రాణ ప్రతిష్ఠ చేయగలిగారామె.
* పార్వతిని ప్రార్థించే పాటను (‘జననీ శివకామినీ..’ - నర్తనశాల) ఎంతగా మెప్పించారో...
మరియ తనయను స్తుతించే ( ‘రాజ్యము బలమూ మహిమా నీవే నీవే’- రాజాధిరాజు) గీతాన్ని కూడా అలాగే ఒప్పించారు.
* దయ్యం పాటంటే వెంటనే గుర్తొచ్చే సుశీలపాట- ‘‘నిను వీడని నీడను నేనే" (అంతస్తులు ) కదా?
టీజింగ్, చమత్కారపు పాటలు తల్చుకుందామా!
* పాండవులూ పాండవులూ తుమ్మెదా (అక్కా చెల్లెలు)
* ఏమండోయ్ శ్రీవారూ, ఒక చిన్నమాటా (మంచి మనసులు)
* పొరుగింటి మీనాక్షమ్మను చూశారా? ( సంబరాల రాంబాబు)
* ఎప్పుడూ మీ పాఠాలంటే ఎలాగండీ సార్ (అమ్మ మాట)
నటి వాణిశ్రీ ... సుశీల పాటల గురించి
ఏమన్నారో చూడండి-

పుట్టినరోజు సందర్భాన్ని గుర్తుచేసే ఈ పాటలు అత్యంత ప్రాచుర్యం పొందినవి-
* మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట (మట్టిలో మాణిక్యం)
* పుట్టిన రోజు పండగే అందరికీ (జీవన తరంగాలు)
* పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయీ ( బంగారు కలలు)
* ఈనాడే బాబూ నీ పుట్టినరోజు (తాత-మనవడు)
సుశీల పాడిన జోల/లాలి పాటలు ఎన్ని ఉన్నాయో...!
* పాలకడలిపై శేషతల్పమున పవళించేవా (చెంచులక్ష్మి )
* అత్త ఒడీ పువ్వు వలే మెత్తనమ్మా (తోడూ నీడా)
* వెన్నెలలోని వికాసమే వెలిగించెద నీ కనులా (ఆరాధన)
* నీ మది చల్లగా స్వామీ నిదురపో (ధనమా? దైవమా?)
* ముద్దుల మా బాబు నిద్దరోతున్నాడు (జీవనజ్యోతి)
* చందురుని మించి అందమొలికించు (రక్త సంబంధం)
* నీలాల కన్నుల్లో మెలమెల్లగా (నాటకాల రాయుడు)
* చిరుగాలే వింజామర చిట్టిపాపే కెందామర (శ్రీదేవి)
* ప్రేమకు నేనూ పేదను కాను (ముందడుగు)
* జోలపాట పాడి ఊయలూపనా (ఇది కథ కాదు)
* వటపత్ర శాయికి వరహాల లాలి (స్వాతిముత్యం)
సుశీల... ఘంటసాలతో పాడిన యుగళగీతాలు ఎన్నో శ్రావ్యమైనవి ఉన్నాయి. వాటిని ఇక్కడ ప్రత్యేకంగా ఇవ్వటం లేదు.
కానీ, ఘంటసాల ప్రాభవం ఉన్నరోజుల్లోనూ కాలానికి నిలిచే యుగళ గీతాలను బాలుతో కలిసి పాడటం విశేషం.
ముఖ్యంగా... ఘంటసాల సంగీత దర్శకత్వంలో సుశీల- బాలు పాడిన యుగళగీతం ఒకటి చెప్పుకోదగ్గది. అది-
* సెలయేటి గలగలా చిరుగాలి కిలకిలా (తులసి)
ఇంకా మిగిలిన పాటలు...
* ఏమంటున్నది ఈ గాలి ఎగిరే పైటను అడగాలి (మేమూ మనుషులమే)
* తనివి తీరలేదే నా మనసు నిండలేదే (గూడుపుఠాణి)
* కురిసింది వానా నా గుండెలోనా (బుల్లెమ్మ బుల్లోడు)
* కొండపైనా వెండివానా (ఇంటి దొంగలు)
* ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లూ (పండంటి కాపురం)
* నీలో విరిసిన అందాలన్నీ (మనుషులు- మట్టి బొమ్మలు)
* మల్లి విరిసిందీ పరిమళపు జల్లు కురిసిందీ (రామయ తండ్రి)
* మల్లెకన్న తెల్లనా మా సీత మనసు (ఓ సీత కథ)
* పాలరాతి మందిరాన పడుచు బొమ్మ అందం (నేనూ మనిషినే)
* చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమ వన్నెలు (చీకటి వెలుగులు)
* ఇది తీయని వెన్నెల రేయి (ప్రేమలేఖలు)
* మానసవీణా మధుగీతం (పంతులమ్మ)
* ప్రణయరాగ వాహినీ చెలీ వసంత మోహినీ (మాయామశ్చీంద్ర)
* కనులముందు నీవుంటే కవిత పొంగి పారదా (చెల్లెలి కాపురం)
* కుశలమా నీకు కుశలమేనా (బలిపీఠం)
* తొలివలపే తియ్యనిది (నీడ లేని ఆడది )
* మెరుపులా మెరిశావు (ప్రేమ సంకెళ్ళు)
* చినుకులా రాలి నదులుగా సాగి (నాలుగు స్తంభాలాట)
* నీకోసం జీవితమంతా వేచాను మల్లెలలో (మూడు ముళ్ళు)
* వ్రేపల్లియ ఎద ఝల్లున పొంగిన మురళి (సప్తపది)
స్లో సాంగ్స్ రోజుల్లోనూ చాలా వేగవంతమైన స్వరకల్పనలున్న పాటలను సుశీల పాడారు. వాటిలో చెప్పుకోదగ్గవి-
1) ముత్యాల జల్లు కురిసే రతనాల మెరుపు మెరిసే (కథానాయకుడు) సంగీతం: టీవీ రాజు
2) రా వన్నెల దొరా కన్ను చెదరా (లక్ష్మీ కటాక్షం) సంగీతం: ఎస్ పీ కోదండపాణి
ఈ పోస్టు శీర్షిక సంగతి
ఇంతకీ ఈ బ్లాగు పోస్టు టైటిల్ గురించి ఇంకా చెప్పనే లేదు కదూ...!
సుశీల పాటలు మనకు ఏళ్ళ తరబడిగా తెలుసు. మరి ఆమె మాట ఎలా ఉంటుందో చూద్దాం.
ఓ సందర్భంలో ఘంటసాల ఘనతను తల్చుకుంటూ నివాళిగా ఆమె ఇలా మాట్లాడారు....
ఈ పోస్టు రెండో భాగంలో సావిత్రి పాట గురించి ప్రస్తావన ఉంది. దాని సంగతేమిటి అంటారా ?
‘సుశీలమ్మ’ పాడితేనే తనకు బాగా నప్పుతుందని సావిత్రి నమ్మకం. అందుకే ఆమె మాత్రమే తనకు పాడాలని ఆమె కచ్చితంగా దర్శక నిర్మాతలకు చెప్పేవారట.
ఆమె ఓ ఇంటర్వ్యూలో ‘మూగ మనసులు ’ పాటలోని ఓ చరణాన్ని సరదాగా ఆలపించారు. అదిక్కడ విందాం. (చివర్లో అదే చరణాన్ని సుశీల గళంలో కూడా వినొచ్చు.)
విన్నారు కదా? స్థాయి (పిచ్) లో మాత్రం తేడా వచ్చింది కదూ... ( సుశీల పాడింది కూడా వింటే ఆ భేదం స్పష్టంగా తెలుస్తుంది).
కానీ అనౌన్సర్ కోరిక మీద అప్పటికప్పుడు పాడాల్సివచ్చిన సందర్భం ఇది!
సాధన చేయకపోయినా, సంసిద్ధంగా లేకపోయినా ట్యూన్ సరిగానే పాడేశారు సావిత్రి!