బాస్వెల్ తో పోల్చారు ఆరుద్ర.
కీట్సుతో సామ్యం తీసుకొచ్చారు వేటూరి.
ఎవరిని?
ఎమ్వీయల్ గారిని !
* * *
ఆయన్ను నూజివీడు మర్చిపోలేదు.
అక్కడ కాలేజీలో ఆయన పాఠాలు విని మనసారా ఇష్టపడ్డ కాలేజీ విద్యార్థులూ,
ఆయన వాక్చాతుర్యం, రచనా చమత్కారం చవి చూసిన తెలుగు పాఠకులూ, సాహిత్యాభిమానులూ ..
ఇంకా ఆయన స్నేహ పరిమళం పంచుకున్న సినీ ప్రముఖులూ...
ఎవరూ
ఆయన్ను
మర్చిపోలేదు.
ఆయన విద్యార్థులూ, స్నేహితులూ నూజివీడులో ‘ ఎమ్వీయల్ సాహితీ సమాఖ్య’ గా ఏర్పడి, ఆయన రచనలను అందుబాటులోకి తీసుకురావటానికి చొరవ తీసుకున్నారు.
ఆ కృషి ఫలితమే.. డిసెంబరు 24న విడుదలైన ‘ఎమ్వీయల్ కథలు’ పుస్తకం !
ఒక రచయిత కన్నుమూసిన 32 సంవత్సరాల తర్వాత ఆయన రాసిన కథలన్నీ సేకరించి, పుస్తకంగా తీసుకురావటం అసాధారణమైన విషయం కదా !
ఈ పుస్తకంలో 17 కథలున్నాయి.
వెన్నెల్లాంటి హాయినిచ్చే ఈ కథలన్నిటిలో ప్రత్యేకంగా గమనించదగ్గ అంశం- కథనం . ఎమ్వీయల్ ముద్రను పట్టించే మెరుపు వాక్యాలు చమక్కుమంటూ చాలా కథలను పఠనీయం చేశాయి.
వాటిలో కొన్నిటి గురించి కొంచెం (మాత్రమే) చెప్తాను.
‘రసవద్గీత’
మామిడి రసాలూరే చక్కటి కథ. ఇది 1979లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురితమయింది.
బుజ్జి అనే కుర్రాడు ఇష్టంగా తన పేరు చెక్కుకుని మరీ తినబోయిన హిమాం పసందు మామిడికాయ అనుకోకుండా అతడి చేజారిపోతుంది. అది ఊరంతా తిరిగి తిరిగి చేతులు మారి అనూహ్యంగా బుజ్జి చేతుల్లోకి నాటకీయంగా వచ్చేస్తుంది.
కథా వాతావరణం సూచించినా, పోలిక చెప్పినా అందులోనూ మామిడి గుబాళింపులే !
‘పుల్లమావిడి తిన్నట్టు పులిసిపోయింది భద్రం మనసు. ’
‘మేనేజరు మాటలు చాలా భాగం గాలి దుమ్ముకి రాలిన మామిడి కాయల్లా గేటివతలే పడిపోయాయి.’
చెక్కినట్టు కాకుండా చటుక్కున రాసినట్టుండే వాక్యాలు కొన్ని చూడండి-
‘మేనేజరు గారి మొహమాటానికి పడక్కుర్చీ మెలికలు తిరిగింది’
‘భద్రం మెరుపులా వరండాలోకి వెళ్ళి ఉరుములా మారిపోయాడు’
‘పొద్దుతిరుగుడు పూలు’
1974లో ఆంధ్రజ్యోతి దీపావళి సంచికలో ప్రచురితమైన కథ. ఇది చదువుతుంటే తిలక్ ‘నల్లజర్ల రోడ్డు’ కథ గుర్తొచ్చింది.
‘నిరాశలా చీకటి
చీకటిని చీలుస్తూ మనిషిని బతికించే ఆశలా కారు హెడ్ లైట్’
- ఇలా మొదలవుతుంది.
అడవిలో అర్ధ రాత్రి కారు చెడిపోయి ఆగిపోయింది. అప్పుడు దానిలో ప్రయాణించే వివిధ రకాల వ్యక్తుల్లో భయం, కంగారు, ధైర్యం, నిరాశ, స్వార్థపు ఆలోచనలు ఎలా ఉంటాయి, మారతాయి ? ఉత్కంఠభరితమైన ఈ కథ ఆసక్తికరంగా దీన్ని చెప్తుంది.
‘సిరిగలవాడు’
రచనా కాలం 1985. 2001 వరకూ ఇది అముద్రితంగానే ఉండి, ఆంధ్రప్రభ వారపత్రికలో వచ్చింది.
ఇది గల్పికో, కథానికో... ప్రక్రియ ఏదైనా కానీ వాక్యాలు అలవోకగా జాలువారుతాయి. పదాల విరుపులతో కదం తొక్కే కథన విన్యాసం కనపడుతుంది.
పార్వతి శివుడితో ఇలా అంటుంది-
‘ఈ వెండి కొండ మీద మీ పలుకే బంగారం. మూడో కంటికి కూడా తెలీకుండా కూడబలుక్కోడం కూడానా?’
వెండికొండ- బంగారం... మూడో కంటికి అన్న సార్థక పదాల్లోని
స్వారస్యం ప్రత్యేకంగా చెప్పాలా?
కవి శ్రీనాథుడు రాళ్ళసీమలో దాహార్తితో ‘పరమేశా గంగ విడుము పార్వతి చాలున్’ అని శివుణ్ణి ఎత్తిపొడుస్తాడు కదా? అది విని శివుడు కరుణించి గంగను పంపించాడని రచయిత ఊహ.
అప్పుడు శ్రీనాథుడు ఎలా పరవళ్ళు తొక్కాడో రాసిన ఈ వాక్యాలు చూడండి-
‘జలద రహితమైన నీలాకాశం నుంచి ఉప్పొంగి వస్తున్న గంగను చూసి, శ్రీనాథుడు జలదరించాడు. జల ధరించాడు’.
ఆకాశగంగ కాబట్టి జలదం (మబ్బు )తో పని లేదు. ఇక జలదరించడం, జల ధరించడం... అంటూ ఒకే మాటను విడదీసి, చిన్న మార్పుతో కొత్త అర్థాన్ని సాధించటం ఎంత బాగుందో కదా !
‘కల’కలం
ఈ పుస్తకంలో విలక్షణమైన కథ ఇది. నిజానికిది రేడియో ప్రసంగం.
ఎమ్వీయల్ గారి గొంతులోనే దాన్ని విందామా?
* * *
ఇంతకీ ఎమ్వీయల్ ను బాస్వెల్ తో ఎందుకని పోల్చారు ఆరుద్ర !
ఎవరా బాస్వెల్?
(ఈ సందేహం కొంతమందికైనా ఉంటుందని భావించి, దాని గురించి కొంత ఇక్కడ చెప్తాను. )
ముళ్ళపూడి వెంకట రమణ సాహిత్యంపై సమగ్రంగా పరిశోధన చేసి ఆయన రచనా వైశిష్ట్యాన్ని 1973లోనే ‘కానుక’గా రాశారు ఎమ్వీయల్.
27-28 సంవత్సరాల వయసుకే ఇలాంటి మౌలిక కృషి చేశారాయన.
ఆ పుస్తకానికి ముందుమాట రాస్తూ ఆరుద్ర -
‘ముళ్ళపూడి భాయీ జాన్సన్ కి
ఎమ్వీయల్ సెబాస్వెల్’
అని చమత్కరించారు.
![]() |
శామ్యూల్ జాన్సన్ |
ఇంగ్లిష్ నిఘంటు కర్త, కవీ, విమర్శకుడూ అయిన శామ్యూల్ జాన్సన్ (1709-1784) జీవిత చరిత్రను జేమ్స్ బాస్వెల్ (1740-1795) రాశాడు. ఆ పుస్తకం పేరు ‘Life of Samuel Johnson'.
జీవిత చరిత్రల రచనలోనే అది కొత్త ఒరవడి సృష్టించింది !
ముళ్ళపూడి రమణ రచనలపై ఎమ్వీయల్ చేసిన పరిశోధన అలాంటిదని ఆరుద్ర ప్రశంసన్నమాట.
* సెబాస్ + బాస్వెల్ ... సెబాస్వెల్ అయింది.
* ఎమ్వీయల్ , బాస్వెల్ మాటల సారూప్యత కూడా ఎంచక్కా సరిపోయింది కదా !
![]() |
బాస్వెల్ |
75 ఏళ్ళు జీవించిన జాన్సన్ గురించి రాసిన బాస్వెల్ 54 ఏళ్ళు బతికాడు.
ముళ్ళపూడి వెంకట రమణ (1931-2011) 80 సంవత్సరాలు జీవించారు కానీ.. ఆయన బాస్వెల్... మన ఎమ్వీయల్ 42 సంవత్సరాలకే కనుమరుగయ్యారు.
వేటూరి సుందర రామమూర్తి వ్యాఖ్య సంగతి కూడా వివరంగా చూద్దామా?
‘ఆంగ్ల కవి కీట్సును అన్ని విధాలా పుణికిపుచ్చుకున్న జీవితం అతనిది. స్వగతంలో నేపథ్య కవితాలాపన అతనిది ’ అన్నారు వేటూరి.
బైరన్, షెల్లీల సమకాలికుడైన రొమాంటిక్ కవి జాన్ కీట్స్ (1795-1821).
![]() |
జాన్ కీట్స్ |
'Heard melodies are sweet, but those unheard are sweeter' అనీ,
' A thing of beauty is a joy forever' అనీ చెప్పింది కీట్సే.
పాతికేళ్ళకే టీబీ వ్యాధికి బలైన కవి కీట్స్. చిన్నవయసులోనే కన్నుమూయటం ఒక్కటే కాకుండా.. కళాప్రతిభ, కవిత్వారాధనల విషయంలో కూడా కీట్స్ - ఎమ్వీయల్ ల మధ్య సామ్యం కనపడింది వేటూరికి.
* * *
బాపు రేఖాచిత్రం ముఖపత్రంగా అలంకరించుకున్న ఈ ‘ఎమ్వీయల్ కథల’ పుస్తకం వెల 70 రూపాయిలు.
ఎమ్వీయల్ తో తన అనుబంధం గురించి గాయకుడు బాలు స్వదస్తూరితో రాసిన ఆత్మీయపు పలుకులు పుస్తకం మొదట ప్రచురించారు. వారిద్దరి మధ్య ఉన్న స్నేహాన్నీ, గాఢతనూ అవి తెలుపుతాయి.
డా. చెంగల్వ బొడ్డపాటి రామలక్ష్మి ఈ కథలపై సమీక్ష చేశారు, ‘పాలపిట్ట’ మాసపత్రిక సెప్టెంబరు 2017 సంచికలో.
‘‘ఎమ్వీయల్ కథలలో బరువైన సమస్యలుండవు. ఏ విధమైన సందేశాలుండవు. మధ్య తరగతి మానవ స్వభావ చిత్రణ ఉంటుంది. కుటుంబసభ్యుల మధ్య ఆత్మీయానురాగాలు ఉంటాయి. సంభాషణా చాతుర్యముంటుంది. .... చక్కగా హాయిగా చదువుకునే కథలు ... తెలుగుదనం ఉట్టిపడే కథలు’ అని ఆమె చక్కగా అంచనా వేశారు.
ఈ సమీక్షను కూడా ఈ పుస్తకంలో ప్రచురించారు.
విజయవాడ ‘సాహితి’ ప్రచురణగా వచ్చిన ఈ సంకలనం కాపీలు కావలసినవారు 2436642/43, 8121098500 నంబర్లను సంప్రదించవచ్చు.
తాజా చేర్పు : ఫిబ్రవరి 4న ఈనాడు ఆదివారం లో ఈ పుస్తకం గురించి నేను రాసిన చిన్న పరిచయం వచ్చింది. అది ఇక్కడ ఇస్తున్నాను.