ఈ సినిమాకు మాటలు రాసింది ముళ్ళపూడి అయినా నవలీకరణ మాత్రం ఎమ్వీయల్. (ఆయన నూజివీడులోని ‘మా’ డీఏఆర్ కాలేజీలో తెలుగు లెక్చరర్. ఆయన పాఠాలు మిస్సవకూడదనే ఇంటర్లో నేను సెకండ్ లాంగ్వేజ్ సంస్కృతం బదులు తెలుగు తీసుకున్నాను. అంతకుముందు మూడు సంవత్సరాలు సంస్కృతం నేర్చుకునివుండి కూడా!).
ఎమ్వీయల్ గారు ఆంధ్రజ్యోతి వీక్లీలో ‘యువజ్యోతి’ కాలమ్ నిర్వహించిన సంగతి చాలామందికి తెలుసు. పాఠకుల ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఎంత ‘సటిల్’ గా ఉండేవో.
‘అందాల రాముడు’ సంగతికొస్తున్నా....
ఇక ఎప్పుడెప్పుడు ఆ సినిమా చూస్తానా అని అవకాశం కోసం ఎదురుచూశాను. తీరా ఆ సినిమా చూశాక అసంతృప్తి కలిగింది చాలా చోట్ల. చదివేటప్పుడు నేను ఎంజాయ్ చేసిన కొన్ని సన్నివేశాలు చిత్రీకరణలో పేలవంగా తోచాయి.
ఇక్కడ దర్శకుడి ప్రతిభను తక్కువ చేయటం కాదు. అక్షర రూపంలోని ఘట్టాలను పాఠకులు తమ తమ ఊహా ప్రపంచాల్లో అందంగా, రసవంతంగా అనువదించుకుంటారు. ఉన్నతీకరించుకుంటారు. వాటికి దీటుగా చిత్రీకరణ చేయటం ఎవరికైనా కత్తి మీద సామే. (పాఠకుల ఊహలకంటే మించి చిత్రీకరణ చేయగలిగినవారు ఉండరని కాదు; కానీ అది చాలా అరుదు).
వెండితెర నవలలు నాకు చాలా ఇష్టం. మీరు ఒకే సినిమావి డీవీడీ, నవలా చూపించి, ‘ఏది కావాలో కోరుకో’ అంటే ముందు నవలే తీసుకుంటాను. అది నచ్చితేనే డీవీడీ కావాలంటాను.
‘శంకరాభరణం’ సినిమా సంచలనం సృష్టించిన తొలినాళ్లలోనే ఆ సినిమా వెండితెర నవల విడుదలైంది. రాసింది వంశీ. ఆయన ఆ సినిమాకు అసోసియేట్ దర్శకుడు. నిర్మాతలైన పూర్ణోదయా వారే ఈ నవలను ప్రచురించారు. చాలా అందంగా ఉంటుందా పుస్తకం. చక్కని వర్ణచిత్రాలూ, అందమైన ముద్రణా. ఆ పుస్తకాన్ని అక్కడక్కడా చూడటమే కానీ చదవటానికి వీల్లేకపోయిందప్పుడు. (అప్పుడు స్కూలు విద్యార్థినే కదా.. నచ్చిన పుస్తకం కొనుక్కునేంత అవకాశమెక్కడా?)
తర్వాత కాలంలో ‘శంకరాభరణం’ నవల చదివాను. కానీ అది రెండో ముద్రణ. బయటివారు ప్రచురించారు. వర్ణచిత్రాలు లేవు. అందమైన గెటప్ కూడా లేదు. అయినా వంశీ కథనం చాలా నచ్చేసింది.
చిత్ర రూపకల్పనలో పాత్ర ఉన్న వ్యక్తి వెండితెర నవల రాస్తే ఎంత బాగుంటుందో చెప్పటానికి ఈ నవల ఓ చక్కని ఉదాహరణ. ఇది చదివి, వంశీ అభిమానినైపోయాను. (ఇప్పటికి దాదాపు ౩౦ సంవత్సరాలు గడిచినా ఆనాటి ‘శంకరాభరణం’ నవల ఇంకా నాకు దొరకనే లేదు.)
తర్వాత తర్వాత ‘మంచుపల్లకీ’తో మెగాఫోన్ పట్టుకున్న వంశీ పూర్ణోదయాలోనే ‘సితార’ మీటిన సంగతి వేరే గుర్తు చేయనక్కర్లేదు కదా? కొన్నేళ్ళ తర్వాత విజయవాడలో వంశీని కలిశాను, జర్నలిస్టు అవతారమెత్తి.
మిమ్మల్ని కలుసుకోవటానికి మాత్రమే ఈ ఇంటర్వ్యూ సాకు గానీ అదంత ముఖ్యం కాదని చెప్పా. వంశీ అభిమాని తప్ప వేరే ఎవరూ అడగలేని నా ప్రశ్నలకు చాలా సంతోషపడ్డారాయన. ( ఇంటర్వ్యూ లు ఇవ్వటం వంశీకి అసలు ఇష్టం ఉండదు).
ఇంతకీ విషయం వెండితెర నవల్లు కదా? దానికే పరిమితమవుతా.
వంశీ వీటిని రాయటానికి స్ఫూర్తి ముళ్ళపూడి వెంకటరమణ గారి వెండితెర నవలలు. వంశీ రాసిన మిగతా వెండితెర నవలలు తాయారమ్మ-బంగారయ్య, శుభోదయం. మొదటిది పుస్తక రూపంలో రాలేదట. రెండోది చదివే అవకాశం నాకు రాలేదు.
‘గుండమ్మ కథ’, ‘గోరంత దీపం’ నేను చదివిన మరికొన్ని నవలలు.
వెండితెర నవలల గురించి ఆంధ్రజ్యోతి వీక్లీ 2005 అక్టోబరు 9న ఓ కవర్ స్టోరీ ప్రచురించింది. రచన- వడ్డి ఓం ప్రకాశ్ నారాయణ, పులగం చిన్నారాయణ.
‘గుండమ్మ కథ’, ‘గోరంత దీపం’ నేను చదివిన మరికొన్ని నవలలు.
వెండితెర నవలల గురించి ఆంధ్రజ్యోతి వీక్లీ 2005 అక్టోబరు 9న ఓ కవర్ స్టోరీ ప్రచురించింది. రచన- వడ్డి ఓం ప్రకాశ్ నారాయణ, పులగం చిన్నారాయణ.
ఆ వ్యాసం చదివితే చాలా వివరాలు తెలుస్తాయి. అంత పాత వీక్లీ ఇప్పడు దొరకటం కష్టమే. కానీ మీది హైదరాబాద్ అయితే... ఆబిడ్స్, కోఠీ పేవ్ మెంట్ల మీదా; విజయవాడ అయితే లెనిన్ సెంటర్, అలంకార్ సెంటర్ పాత పుస్తకాల షాపుల దగ్గరా వెతికితే దొరక్కపోదు.
ఈ వీక్లీ దొరక్కపోయినా అలనాటి ‘శంకరాభరణం’ రంగుల నవల దొరకొచ్చు. అది దొరికితే మాత్రం నాకు వెంటనే చెప్పేయండి! సరేనా?
PS: ‘వంశీ వెండితెర నవలలు’ నవలా సంపుటి ముఖచిత్రాన్ని తాజాగా జత చేస్తున్నా. ( వ్యాఖ్యలో ఈ పుస్తకాన్ని ప్రస్తావించిన సుజాత గారికి ధన్యవాదాలు. )