మీ గతంతో సంబంధమున్న ఏ ప్రదేశానికైనా ఏళ్ల విరామం తర్వాత మీరెప్పుడైనా వెళ్లారా?
నేను వెళ్ళాను...
కరిగిపోయిన బాల్యాన్ని వెతుక్కుంటూ , కొద్ది రోజుల క్రితం!
కాల యంత్రంలో వెనక్కి... 29ఏళ్ళ వెనక్కి వెళ్ళిన అనుభూతి ....
చిన్నతనపు అమాయకపు రోజులతో అనుబంధమున్న ఆ పరిసరాలు మౌనంగా పలకరిస్తూంటే ఓ క్షణం కళ్ళు చెమర్చినట్టనిపించింది.
రేపటి కోసం ఎక్కువ తాపత్రయపడటం, పాత విషయాల తలపుల్లో మునిగిపోవటం... ఈ రెండూ మంచి లక్షణాలు కాదంటారు వ్యక్తిత్వ వికాస నిపుణులు.
వర్తమానంలో... ఈ క్షణంలో జీవించాలని హితవు చెప్తారు.
కానీ... గతమెప్పుడూ మధురమే.
చేదు అనుభవాల జాడలను ‘కాలపు కడలి’ కెరటాలు తుడిచిపెట్టేస్తాయి. ఒకవేళ వాటి ఛాయలున్నా వాటిలో ఒకప్పటి సాంద్రత ఉండదు కదా?
అందుకే... ఒక్కసారి గతంలోకి తొంగిచూసి, జ్ఞాపకాలు తడిమిచూసుకోవటం ఎవరైనా ఇష్టపడే విషయమే !
మాతృశ్రీ సంస్కృత పాఠశాల నేను చదివిన స్కూలు పేరు.
అది గుంటూరు జిల్లా బాపట్ల దగ్గరున్న జిల్లెళ్ళమూడి అనే ఓ పల్లెటూరిలో ఉంది.
మా స్కూలు సంస్కృత కళాశాలకు అనుబంధం. స్కూలు పిల్లలూ, కాలేజీ విద్యార్థులూ కలిసే ఉండేవారు.
ఆ కళాశాల లెక్చరర్ ఝాన్సీ గారు. చాలా బాగా పాడతారు. ‘శంకరాభరణం’ సంగీత ఝరి రాష్ట్రాన్నీ, దేశాన్నీ ముంచెత్తుతున్న కాలంలో సంగీత కళకు పునర్వైభవం వచ్చింది కదా?
ఆ తరుణంలో...
‘సరళీ స్వరాల’ ఊసు కూడా తెలీని నాకు శాస్త్రీయ సంగీతం నేర్పించాలని ఝాన్సీ గారు ప్రయత్నించారు. నా గాత్రం బావుందనీ, ట్యూనింగ్ సెన్స్ ఉందనీ ప్రోత్సహించారు.
కారణాంతరాల వల్ల ఆ అవకాశం వినియోగించుకోలేకపోయానప్పుడు.
ఇన్నేళ్ళ తర్వాత అక్కడికి వెళ్ళి, బాల్య మిత్రులను కలుసుకోవటంతో పాటు ఆమెకు కృతజ్ఞత తెలుపుకోవటం కూడా నా ఎజెండాలో భాగంగా నిర్దేశించుకున్నాను.
ఇప్పుడా ఊరికి వెళ్ళాను హైదరాబాద్ నుంచి!
ఝాన్సీ గారిని కలిసి, పూర్వ విద్యార్థిగా పరిచయం చేసుకున్నాను. పాత సంగతులు చెప్పాను.
ఆ ఊళ్ళోనే సెలవుల్లో జరిగిన ఓ సరదా ఫంక్షన్లో ఆమె ‘జోరు మీదున్నావు తుమ్మెదా’ పాటను పాడిన ఘట్టాన్ని నేను గుర్తు చేశాను.
మరపున- మరుగున పడిపోయిన ఈ జ్ఞాపకాన్ని అనూహ్యంగా వెలికితీసేసరికి ఆమె షాకయ్యారు!
ఎందుకంటే అది జరిగి, దాదాపు మూడు దశాబ్దాలవుతోంది.
గాయని సుశీల గారు కూడా పాడటానికి ఇబ్బంది పడిన ఆ ‘శివరంజని’ పాటను ఆమె శ్రావ్యంగా, అలవోకగా పాడిన ఘటనను చెపితే, స్ఫురణకు తెచ్చుకున్నారు.
నాకు సంగీతం నేర్పటానికి ఆమె ప్రోత్సహించిన సంగతి గుర్తు చేశాను.
ఆసక్తిగా విన్నారు.
ఝాన్సీ గారు సంస్కృత సాహిత్యంలో, వ్యాకరణాల్లో అభినివేశమున్నవారు. అధ్యాత్మ - వాల్మీకి రామాయణాలను సంస్కృతంలో తులనాత్మకంగా అధ్యయనం చేసి, డాక్టరేట్ సాధించిన పరిశోధకురాలు. అంతటి వ్యక్తి నా చిన్ననాటి చిన్న జ్ఞాపకాన్ని, ఆమె ప్రమేయమున్న సంఘటనలను గుర్తు చేయగానే కదిలిపోయారు.
‘మధుర జ్ఞాపకాలను’ గుర్తు చేశానని ఎంతో సంతోషపడ్డారు. నా వివరాలన్నీ అడిగారు. ‘ఇంత ఆసక్తి ఉంది కదా, సంగీతం ఇప్పుడైనా నేర్చుకోవచ్చ’ని సాంత్వన వచనాలు పలికారు.
నా కోరిక ప్రకారం ఆమె ఓ లలిత గీతం ఆలపించారు.
ఆమె పాడుతుంటే 29ఏళ్ళ క్రితం ఒద్దికగా నేలమీద కూర్చుని ఎలా విన్నానో, అలా కూర్చుని ఆలకించాను. కామెరాతో ఝాన్సీ గారి ఫొటో తీసుకున్నాను.
‘సాయం చేయబోయిన వ్యక్తికే ఇంత విలువ ఇచ్చినపుడు నిజంగానే సాయం చేసిన వ్యక్తికి మరింత విలువ ఇవ్వాలి కదా?’ అని మీరు అనవచ్చు.
ఇక్కడ సాయం చేయటానికీ, చేయటానికి ప్రయత్నించటానికీ (స్వీకరించే వ్యక్తుల కోణంలోంచి చూస్తే ) పెద్ద భేదం ఉందనుకోను.
సాటి మనిషికి మేలుచేయాలనే సంకల్పం, స్పందన, కన్సర్న్... ఇవే ముఖ్యం.
స్కూలు రోజుల్లోనే, అదే ఊళ్ళోనే నేను పంట కాలవలో ఈత నేర్చుకుందామని వెళ్లి, మునిగిపోతుంటే నా ప్రాణాలు కాపాడాడో మిత్రుడు. ప్రాణదానం చేసిన అతనికి నేనెంత విలువనివ్వాలి?
జీవితంలో అతన్ని ఏ క్షణమైనా విస్మరిస్తే అది ఎంతో అపరాధమవుతుంది కదా?
బాల్యపు జాడలను అన్వేషిస్తూ సాగించిన
నా ఈ పర్యటనలో
అతడు...
ఆదినారాయణ
నా పక్కనే, తోడుగానే ఉన్నాడు !