సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

18, మే 2009, సోమవారం

వెండితెర నవలలు ఎందుకిష్టం?


‘అందాల రాముడు’ సినిమా చూడకముందు దాని వెండితెర నవల చదివాను.
ఈ సినిమాకు మాటలు రాసింది ముళ్ళపూడి అయినా నవలీకరణ మాత్రం ఎమ్వీయల్. (ఆయన నూజివీడులోని ‘మా’ డీఏఆర్ కాలేజీలో తెలుగు లెక్చరర్. ఆయన పాఠాలు మిస్సవకూడదనే ఇంటర్లో నేను సెకండ్ లాంగ్వేజ్ సంస్కృతం బదులు తెలుగు తీసుకున్నాను. అంతకుముందు మూడు సంవత్సరాలు సంస్కృతం నేర్చుకునివుండి కూడా!). ఎమ్వీయల్ గారు ఆంధ్రజ్యోతి వీక్లీలో ‘యువజ్యోతి’ కాలమ్ నిర్వహించిన సంగతి చాలామందికి తెలుసు. పాఠకుల ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఎంత ‘సటిల్’ గా ఉండేవో.
‘అందాల రాముడు’ సంగతికొస్తున్నా....
ఇక ఎప్పుడెప్పుడు ఆ సినిమా చూస్తానా అని అవకాశం కోసం ఎదురుచూశాను. తీరా ఆ సినిమా చూశాక అసంతృప్తి కలిగింది చాలా చోట్ల. చదివేటప్పుడు నేను ఎంజాయ్ చేసిన కొన్ని సన్నివేశాలు చిత్రీకరణలో పేలవంగా తోచాయి.
ఇక్కడ దర్శకుడి ప్రతిభను తక్కువ చేయటం కాదు. అక్షర రూపంలోని ఘట్టాలను పాఠకులు తమ తమ ఊహా ప్రపంచాల్లో అందంగా, రసవంతంగా అనువదించుకుంటారు. ఉన్నతీకరించుకుంటారు. వాటికి దీటుగా చిత్రీకరణ చేయటం ఎవరికైనా కత్తి మీద సామే. (పాఠకుల ఊహలకంటే మించి చిత్రీకరణ చేయగలిగినవారు ఉండరని కాదు; కానీ అది చాలా అరుదు).

వెండితెర నవలలు నాకు చాలా ఇష్టం. మీరు ఒకే సినిమావి డీవీడీ, నవలా చూపించి, ‘ఏది కావాలో కోరుకో’ అంటే ముందు నవలే తీసుకుంటాను. అది నచ్చితేనే డీవీడీ కావాలంటాను.

‘శంకరాభరణం’ సినిమా సంచలనం సృష్టించిన తొలినాళ్లలోనే ఆ సినిమా వెండితెర నవల విడుదలైంది. రాసింది వంశీ. ఆయన ఆ సినిమాకు అసోసియేట్ దర్శకుడు. నిర్మాతలైన పూర్ణోదయా వారే ఈ నవలను ప్రచురించారు. చాలా అందంగా ఉంటుందా పుస్తకం. చక్కని వర్ణచిత్రాలూ, అందమైన ముద్రణా. ఆ పుస్తకాన్ని అక్కడక్కడా చూడటమే కానీ చదవటానికి వీల్లేకపోయిందప్పుడు. (అప్పుడు స్కూలు విద్యార్థినే కదా.. నచ్చిన పుస్తకం కొనుక్కునేంత అవకాశమెక్కడా?) తర్వాత కాలంలో ‘శంకరాభరణం’ నవల చదివాను. కానీ అది రెండో ముద్రణ. బయటివారు ప్రచురించారు. వర్ణచిత్రాలు లేవు. అందమైన గెటప్ కూడా లేదు. అయినా వంశీ కథనం చాలా నచ్చేసింది.
చిత్రరూపకల్పనలో పాత్ర ఉన్న వ్యక్తి వెండితెర నవల రాస్తే ఎంత బాగుంటుందో చెప్పటానికి ఈ నవల ఓ చక్కని ఉదాహరణ. ఇది చదివి, వంశీ
అభిమానినైపోయాను. (ఇప్పటికి దాదాపు ౩౦ సంవత్సరాలు గడిచినా ఆనాటి ‘శంకరాభరణం’ నవల ఇంకా నాకు దొరకనే లేదు.)

తర్వాత తర్వాత ‘మంచుపల్లకీ’తో మెగాఫోన్ పట్టుకున్న వంశీ పూర్ణోదయాలోనే ‘సితార’ మీటిన సంగతి వేరే గుర్తు చేయనక్కర్లేదు కదా? కొన్నేళ్ళ తర్వాత విజయవాడలో వంశీని కలిశాను, జర్నలిస్టు అవతారమెత్తి.
మిమ్మల్ని కలుసుకోవటానికి మాత్రమే ఈ ఇంటర్వ్యూ సాకు గానీ అదంత ముఖ్యం కాదని చెప్పా. వంశీ అభిమాని తప్ప వేరే ఎవరూ అడగలేని నా ప్రశ్నలకు చాలా సంతోషపడ్డారాయన. ( ఇంటర్వ్యూ లు ఇవ్వటం వంశీకి అసలు ఇష్టం ఉండదు).

ఇంతకీ విషయం వెండితెర నవల్లు కదా? దానికే పరిమితమవుతా. వంశీ వీటిని రాయటానికి స్ఫూర్తి ముళ్ళపూడి వెంకటరమణ గారి వెండితెర నవలలు. వంశీ రాసిన మిగతా వెండితెర నవలలు తాయారమ్మ-బంగారయ్య, శుభోదయం. మొదటిది పుస్తక రూపంలో రాలేదట. రెండోది చదివే అవకాశం నాకు రాలేదు.

‘గుండమ్మ కథ’, ‘గోరంత దీపం’ నేను చదివిన మరికొన్ని నవలలు.

వెండితెర నవలల గురించి ఆంధ్రజ్యోతి వీక్లీ 2005అక్టోబరు 9న ఓ కవర్ స్టోరీ ప్రచురించింది. రచన- వడ్డి ఓం ప్రకాశ్ నారాయణ, పులగం చిన్నారాయణ. ఆ వ్యాసం చదివితే చాలా వివరాలు తెలుస్తాయి. అంత పాత వీక్లీ ఇప్పడు దొరకటం కష్టమే. కానీ మీది హైదరాబాద్ అయితే... ఆబిడ్స్, కోఠీ పేవ్ మెంట్ల మీదా; విజయవాడ అయితే లెనిన్ సెంటర్, అలంకార్ సెంటర్ పాత పుస్తకాల షాపుల దగ్గరా వెతికితే దొరక్కపోదు.
ఈ వీక్లీ దొరక్కపోయినా అలనాటి ‘శంకరాభరణం’ రంగుల నవల దొరకొచ్చు. అది దొరికితే మాత్రం నాకు వెంటనే చెప్పేయండి! సరేనా?

PS: ‘వంశీ వెండితెర నవలలు’ నవలా సంపుటి ముఖచిత్రాన్ని తాజాగా జత చేస్తున్నా. ( వ్యాఖ్యలో ఈ పుస్తకాన్ని ప్రస్తావించిన సుజాత గారికి ధన్యవాదాలు. )

9 కామెంట్‌లు:

సుజాత వేల్పూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
అజ్ఞాత చెప్పారు...

మీ బ్లాగ్ చాలా బాగుంది. ఎప్పటెప్పటి విషయాలో రాస్తున్నారు. వెండితెర నవలలు పాతవన్నీ బయటికొస్తే బాగుండును. ఆ మధ్య ఇద్దరు మిత్రులు సినిమాను వెండితెర నవలగా వేశారు. విశాలాంధ్రలో లభ్యం అనుకుంటాను!

వేణు చెప్పారు...

సుజాత గారూ, ఓ పుస్తక ప్రదర్శనకు అనుకోకుండా వెళ్ళి ‘వంశీ వెండితెర నవలలు’ పుస్తకం చూశాను. తీసుకోవాల్సిన పుస్తకాల జాబితాలో పెట్టుకున్నా. కానీ ఇలా సంకలనంలా కాకుండా దేనికది ప్రత్యేకంగా లభ్యమయితే మరీ బాగుంటుంది కదా? ‘సాగర సంగమం’ వెండితెర నవలా? Interesting. అలాంటిది ఒకటుందని నాకు తెలీనే తెలియదు.

వంశీని అడిగిన ప్రశ్నలా? అన్నీ గుర్తులేవు. ‘మహర్షి’ కోసం స్వరకల్పన చేసిన ‘ కోనలో సన్నజాజి మల్లి జాజిమల్లి- మేనులో పొన్నపూలవల్లి పాలవెల్లి..’ అనే పాట ఎందుకు వాడలేదని అడిగాను. ‘జోకర్’ లో కూడా మరోపాట తయారుచేసి కూడా వాడలేదు. దాని సంగతి అడిగాను. వంశీ మార్కు క్యారెక్టర్ల గురించీ , ఇళయరాజాతో అనుబంధం గురించీ అడిగాను. ఆ ఇంటర్వ్యూ తర్వాత ఆయన నాకు లేఖ రాశారు. తర్వాత కూడా నేను రాసిన ఉత్తరానికి జవాబుగా మరో లేఖ రాశారు. నాదగ్గర భద్రంగా ఉందది. వంశీ దస్తూరి చాలా బాగుంటుంది. కానీ బాలూది మరింత అద్భుతంగా ఉంటుందంటారు వంశీ.

@ Neelaanchala గారూ, బ్లాగుపై మీ అభినందనకు ధన్యవాదాలు. మీరన్నట్టు ‘ఇద్దరు మిత్రులు’ వెండితెర నవల ఇప్పుడు దొరుకుతోంది, పుస్తకాల షాపుల్లో. ఇలా పాత వెండితెర నవలలను ఎవరో ఒకరు ప్రచురిస్తే చాలామంది పాఠకులు సంతోషిస్తారు.

Bolloju Baba చెప్పారు...

i too read vamsi's Samkaraabharanam novel.

అందులో ఒకచోట,
శంకర శాస్త్రి స్నానం చేసి నడుస్తుండగా తడిపాదాల ముద్రలను చూపించవలసిన షాట్ లో, ఆ ఏటవాలు ఎండకు పాద ముద్రల తడి ఆవిరై కనిపించని పరిస్థితులలో, నూనెలో కాళ్లు తడిపి నడిపించారట.

ఇది నేను పదో తరగతిలో చదివిన విషయం. ఇప్పటికీ ఇంకా ఫ్రెష్ గా ఉంది.

Sreenivas Paruchuri చెప్పారు...

ఆ వెండితెర నవలలు ఇప్పుడు collectors' items. నాకు కొందరు collectors తెలుసు. నేను పని కట్టుకుని పోగుచేయలేదు కానీ విజయవాడ, తెనాలి రోడ్ల పక్కన పేవ్‌మెంట్ల పైన చాలానే దొరికాయి. అదీను సంవత్సరానికొకసారి 3-4 వారాలు పాటు ఇండియా వచ్చే నాలాంటి వాడికి. గుండమ్మకథ, జయభేరి, నర్తనశాల, వీరపాండ్య కట్టబొమ్మన, మూగమనసులు ... వాటిలో కొన్ని. బాపు-రమణల సినిమా నవలలు మాత్రం అన్నీ వున్నాయి. నవోదయ వాళ్ళు వేసారు అప్పట్లో. నవోదయ వాళ్ళే "షావుకారు" కూడా వేసారు.

మీరు ప్రస్తావించిన "శంకరాభరణం", "అందాల రాముడు", ఆ.జ్యోతి ఆదివారం అనుబంధంలో వచ్చిన వ్యాసం నా దగ్గరున్నాయి. ఫోటోకాపీలు ఇవ్వగలను.

భవదీయుడు,
-- శ్రీనివాస్

వేణు చెప్పారు...

బొల్లోజు బాబా గారూ, ఇలాంటి చమత్కారాల సంగతులు సినిమా విడుదలయ్యాక రాసిన నవలల్లో మాత్రమే సాధ్యం.

@ Sreenivas paruchuri గారూ, మీ దగ్గర చాలా వెండితెర నవలలే ఉన్నాయి. అభినందనలు మీ అభిరుచికి. ‘శంకరాభరణం’ నవల మీ దగ్గరున్నది- పూర్ణోదయ వారు రంగుల్లో ప్రచురించిన పుస్తకమేనా? ఆంధ్రజ్యోతి వ్యాసమైతే నా దగ్గరుంది. ‘అందాల రాముడు’ నవల ఎక్కడో పోయింది.

వేణు చెప్పారు...

టపాలో నేను ప్రస్తావించిన ‘జ్యోతి’ వ్యాసం శీర్షిక పేరు ‘అనగనగా ఒక వెండితెర నవల’. ఆ వ్యాసం సౌజన్యంతో కొన్ని విశేషాలు...

‘‘నా విశ్లేషణ ప్రకారం వెండితెర నవల అక్షరాల్లో సినిమాను చూపించగలగాలి. అదంత సులువైన ప్రక్రయ కాదు. స్క్రిప్ట్ ని బాగా మధించి, సినిమాని బాగా జీర్ణించుకుని రాస్తేనే నవల పండుతుంది.... ప్రస్తుతం పాఠకులు తగ్గిపోయారు. అయినా వెండితెర నవల వస్తే బాగుండునని ఎదురుచూసేవారిలో నేనూ ఒకణ్ణి. ’’ - వంశీ (సినీ దర్శకుడు).

‘‘వెండితెర నవల అనేది పాటల పుస్తకానికి ఎక్స్ టెన్షన్, సెల్యులాయిడ్కి పేపర్ వెర్షన్ అనుకోవచ్చు.’’ - వేమూరి సత్యనారాయణ (చలిచీమలు, మా బంగారక్క, దేవదాసు మళ్ళీ పుట్టాడు, రామక్రిష్ణులు, బంగారు బొమ్మలు వెండితెర నవలల రచయిత ).

వేణూశ్రీకాంత్ చెప్పారు...

వేణు గారు ఏదో వెతుకుతూ మీ ఈ వ్యాసం దగ్గర తేలాను. వంశీ వెండితెరనవలలు మొన్నే కొన్నాను ఇంకా చదవలేదు కానీ వీరి ప్రచురణ సాథారణంగా ఉంది, మీరు చెప్పిన వర్ణచిత్రాలతో కూడిన శంకరాభరణం పుస్తకం దొరికితే బాగుండు అనిపిస్తుంది. చిన్నపుడు మా ఇంట్లో త్యాగయ్య నవల ఉండేది ఆయిల్ ప్రింట్ ఫోటోలతో చాలా రమణీయంగా ఉండేది ఎన్ని సార్లు చదివానో ఆ పుస్తకం. మీ పుణ్యమా అని ఆరోజులలోకి వెళ్ళివచ్చాను మళ్ళీ ఓసారి.

వేణు చెప్పారు...

వేణూ శ్రీకాంత్ గారూ! థాంక్యూ.
వెండితెర నవల్ల గురించి మొన్నామధ్య సాక్షిలో ఓ వ్యాసం వచ్చింది కానీ, దానికంటే ఆంధ్రజ్యోతిలో గతంలో వచ్చిన వ్యాసమే సమగ్రంగా ఉంది. ఇక ‘‘వర్ణచిత్రాల ‘శంకరాభరణం’ వెండితెర నవల నా దగ్గరుందీ’’ అని ఎవరైనా చెపితే బావుండని ఎదురుచూస్తున్నానండీ. అయితే ఆ పుస్తకం మీదగ్గర కూడా లేదన్నమాట. :)