
‘కళాత్మకంగా జీవించటం ఎలా ?’ అనే సందేహం ఎలా ప్రవేశించిందో కానీ ఇది ఈ మధ్య నా ఆలోచనల్లో భాగమైపోయింది.
‘‘బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగ సాగాలి’’ అనీ, ‘‘బ్రతుకంత సాగాలి పూలబాట’’ అనీ ఎవరైనా ఆశిస్తుంటారు. ‘‘బ్రతుకంత బాధగా... కలలోని గాథగా ’’ ఉండాలని ఎవరు మాత్రం కోరుకుంటారు?
సంతోషంగా కాలం గడిపేస్తుంటే అది కళాత్మక జీవితం అయిపోతుందా? ఈ సంతోషం విషయంలో కూడా మనిషి మనిషికీ తేడాలుంటాయి కదా!
ఏఆర్ రెహమాన్ కు ఆస్కార్ వచ్చిన వార్త ఎందరికో పండగలా ఉంటే ... నాకు ఆ రెహమాన్ ను చాలా చిన్నపుడే రమేష్ నాయుడు గుర్తించి తన టీమ్ లో అవకాశం ఇచ్చాడనే విషయం సంతోషాన్నిస్తుంది. నాకు ‘చిత్రా’ బొమ్మలూ, చిత్త ప్రసాద్ బొమ్మలూ చాలా ఇష్టమైతే మీకు ‘శంకర్’ గీసే రేఖలూ, రవివర్మ నిలువెత్తు తైలవర్ణ చిత్రాలూ ప్రాణం అయివుండొచ్చు. నాకు చదరంగమే ప్రపంచమయితే...మీకు క్రికెట్టే లోకమై ఉండొచ్చు.
ఇష్టమైన పుస్తకాన్ని చదవటం లో ‘కిక్’ నాకు మరెందులోనూ కన్పించదు. శ్రావ్యమైన పాటను ఆస్వాదిస్తుంటే అలసట మటుమాయమై ‘‘ఆనందం అర్ణవ’’మవుతుంది. సూక్ష్మాంశాలు లిఖించిన చిత్రకళను వీక్షించినపుడు నా సంబరం అంబరానికి ఎగసిపోతుంది.
అంటే... ఇష్టమైన కళలు సంతోషాన్ని ఇస్తాయనే కదా? వీటిని ఆస్వాదించటంలోనే కాదు; వాటి గురించి కళాభిరుచి ఉన్న స్నేహితులతో ఆలోచనలు పంచుకోవటంలో కూడా ఆనందం ఉంది.
కళారాధనకు... నేపథ్యం చాలా ముఖ్యమనిపిస్తుంది. రణగొణ ధ్వనుల్లో, గందరగోళంలో ఏ కళనూ ఆహ్లాదించలేము. ప్రశాంతత ముఖ్యం. బాహ్యంగానే కాదు.... మన అంతరంగం కూడా కళాస్వాదనకు అనుకూలంగా ఉండాలి. ఆందో్ళనలు చుట్టుముట్టినప్పుడో, అర్జెంటు పనులు హడావుడి పెడుతున్నపుడో కళకు స్థానం ఇవ్వటం కష్టమే.
సరే, పరిసరాలు ప్రశాంతం. మనసూ శాంతంగానే ఉంది. ఇప్పుడు ఏదైనా సంగీతం హాయిగా వీనులకు విందు చేస్తుందా? కానీ... కళ సున్నితమైంది కదా? మీరు మిట్టమధ్యాహ్నం మండుటెండలో కళను అనుభూతి చెందుదామంటే... మీ అంత భావుకత లేని కళ ... కళవెళ పడే ప్రమాదముంది. అందుకే తొలి సంధ్యకు ముందో, మలి సంధ్యకు తర్వాతో బెటర్.
ఇంతకీ కళాత్మక జీవితమంటే... ‘‘గానం ధ్యానం హాసం లాసం’’ మాత్రమేనా? లలిత కళలను తలపోసుకుంటూ మైమరిచిపోవటమేనా? కళామయ జగత్తులో స్వైర విహారం చేయటమేనా?
కళాత్మక జీవితమంటే అందంగా, ఆహ్లాదంగా జీవించటమని నా ఉద్దేశం. ఇంకా చెప్పాలంటే అర్థవంతంగా జీవనాన్ని కొనసాగించటం.
* * *
‘‘ఆకలీ బాధలూ ఆందోళనలూ సమస్యలూ విరివిగా ఉన్న’’ ఈ లోకంలో ‘‘లేచిన మరుక్షణం ఎన్నో ప్రశ్నలు గోరుచుట్టులా సలిపే లక్షల సమస్యలు’’!
వీటికి మూలం ఏమిటో గ్రహించటం ప్రధానమైన విషయమే.
అసలీ అసమానతల సమాజంలో కళాత్మకంగా జీవించటం కేవలం ఆదర్శమనీ, ఒకరకంగా ఇది హాస్యాస్పద విషయమనీ అనిపిస్తుంది.
కానీ... కళలను ప్రేమించేవారు వీలున్నంతవరకైనా వాటిని తమ దైనందిన జీవితంలో నిలుపుకోవటం కష్టమేమీ కాదు.
మీకు ఇంకా సందేహంగానే ఉంది కదూ?
చెత్త చలన చిత్రాలు చూడ్డానికి లేటెస్ట్ ఫ్యాషన్ల డ్రెస్సులతో ముస్తాబై వెళ్తుంటాం కదా... (వెళ్ళి, తిట్టుకుంటూనే, విమర్శిస్తూనే అదే పని పదే పదే చేస్తుంటాం ).
దానికి బదులు చక్కని సంగీతం వింటే బావుండదా? మనసుకు నచ్చిన పాటలను ప్రాక్టీసు చేసుకోకూడదా? పోనీ, ఇష్టమైన పనికి ఆ సమయం మిగుల్చుకోవచ్చేమో !
దానికి బదులు చక్కని సంగీతం వింటే బావుండదా? మనసుకు నచ్చిన పాటలను ప్రాక్టీసు చేసుకోకూడదా? పోనీ, ఇష్టమైన పనికి ఆ సమయం మిగుల్చుకోవచ్చేమో !
గాసిప్స్ తో ‘టైమ్ పాస్’ చేసేబదులు ‘‘మౌనానికీ, ధ్యానానికీ, కార్యాలకీ , విజయాలకీ’’ ఆ వ్యవధిని కేటాయించవచ్చునే !
ఇంటిల్లపాదీ గంటల తరబడి టీవీకి అతుక్కుపోయి దుర్భర నృత్య విన్యాసాలు చూస్తూ కళానురక్తిని సంతృప్తి పరుచుకుంటున్నవేళ....
అదే ఇంటి డాబా మీదకు పాకిన సన్నజాజి తీగలపై, అర విరిసిన పూలపై జలజల కురిసే వెన్నెల ఎలా వ్యర్థమవుతోందో ఎంతమందికి అర్థమవుతుంది?
కానీ... జీవితాన్ని రసభరితం చేసుకునే కళ అప్రయత్నంగానే సిద్ధించి, సహజంగానే దాన్ని ఆచరించేవారు మనచుట్టూ లేకపోలేదు.
ఓ దృశ్యం ఊహించుకోండి.
కొబ్బరాకుల నీడల వెనక... నింగి నుంచి చందమామ తొంగి చూస్తూ ఉండే నిశీధి వేళ !
ఆ వెన్నెల్లో ఇద్దరమ్మాయిలు.
వారిలో ఒకరు హిందో్ళంలో ‘సామజ వర గమనా’ పాడుతుంటారు. రెండో ఆమె ఆ గాన మాధుర్యానికి చెవులప్పగించి ఆ పాట రాగచ్ఛాయల్లో స్వరకల్పన చేసిన పాటలేమున్నాయో స్ఫురణకు తెచ్చుకుంటూ ఉంటుంది. విసురుగా విచ్చేసిన చల్లగాలి ఆ స్వరాభిషేకానికి అంతరాయం కలిగించలేనట్టుగా మెల్లగా వీచి, అక్కణ్నుంచి వదల్లేక వదల్లేక సాగిపోతుంటుంది. కురిసే మెరిసే వెన్నెల... ఆ వేళ... తాదాత్మ్యతతో పరవశించిపోతుంటుంది. ఆ కళాస్వాదన ఎంత సేపు సాగినా ప్రతి క్షణమూ అపురూపమే కదా?
వారిలో ఒకరు హిందో్ళంలో ‘సామజ వర గమనా’ పాడుతుంటారు. రెండో ఆమె ఆ గాన మాధుర్యానికి చెవులప్పగించి ఆ పాట రాగచ్ఛాయల్లో స్వరకల్పన చేసిన పాటలేమున్నాయో స్ఫురణకు తెచ్చుకుంటూ ఉంటుంది. విసురుగా విచ్చేసిన చల్లగాలి ఆ స్వరాభిషేకానికి అంతరాయం కలిగించలేనట్టుగా మెల్లగా వీచి, అక్కణ్నుంచి వదల్లేక వదల్లేక సాగిపోతుంటుంది. కురిసే మెరిసే వెన్నెల... ఆ వేళ... తాదాత్మ్యతతో పరవశించిపోతుంటుంది. ఆ కళాస్వాదన ఎంత సేపు సాగినా ప్రతి క్షణమూ అపురూపమే కదా?
ఇలాంటి కళాత్మక జీవన దృశ్యాలు ఎదురయితే సృజన వెల్లివిరియకుండా వుంటుందా?
చిత్రకారులైతే పంచవర్ణాల్లో కుంచె ముంచి అలాంటి ఘట్టాలకు ప్రాణ ప్రతిష్ఠ చేయటానికీ, సాహితీ స్రష్టలైతే ‘అక్షరాలా’ చిరస్మరణీయం చేయటానికీ ఉత్సాహం చూపకుండా ఉండగలరా?
కళలు పరస్పరానురాగ బంధితాలు. అవి మనిషిని సున్నితంగా చేస్తాయి. మృదువుగా మలుస్తాయి.
వాటిని ‘ సృష్టించటమే కాదు, అందంగా ఆస్వాదించటమూ వరమే’ మరి.
ఇంతకీ... కళల ప్రమేయమేమీ లేకుండా కళాత్మక జీవితం ఉండదా?
అలాంటి జీవితానికి కళా సాధన, కళాస్వాదన అత్యవసరం కాదు కానీ, అవి కూడా ముఖ్యమేనని నా నమ్మకం.
అలాంటి జీవితానికి కళా సాధన, కళాస్వాదన అత్యవసరం కాదు కానీ, అవి కూడా ముఖ్యమేనని నా నమ్మకం.
సాటి మనిషి కష్టానికి చలించిపోవటం, నిరాశోపహతులకు బతుకుపై ఆశ పెంచగలగటం, చేయగలిగినంత సాయం చేయటం... కళాత్మకంగా జీవిస్తున్నట్టు కాదా?
బాల్యంలోని ‘స్నిగ్థత’నూ, స్వచ్ఛతనూ కోల్పోకుండా నాటి అమాయకత్వాన్ని పలవరించి, పరవశించగలిగే లక్షణం కళాత్మక జీవన పార్శ్వమే!
మన కారణంగా ఎవరూ సంతోషపడకపోయినా బాధ పడకూడదనే మనస్తత్వం, మనకు మేలు చేసినవారిని కలలో కూడా మర్చిపోకుండా కృతజ్ఞతతో స్మరించుకోవటం, ఇతరుల కష్టాలపై సహానుభూతి... ఇవి ఉన్నవారు ఎవరైనా
కళాత్మకంగానే జీవిస్తున్నట్టు !
మీరేం చెపుతారు మరి?