సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

4, జూన్ 2009, గురువారం

గంధర్వ గానం

ఇంట్లో పెళ్ళి సందడి.
ఎవరి హడావుడిలో వారున్నారు.

బాగా అలిసిపోయి టేప్ రికార్డర్ దగ్గరకు వచ్చి కూర్చున్నా.

ఓపిక లేకపోయినా అప్రయత్నంగా బటన్ నొక్కాను.

 మొదలైంది బాలూ స్వరధుని!


 మొదట మెల్లగా చల్లగాలిలా మనసును తాకింది. ఆపై అంతులేని మాధుర్యం సుగంధంలా చుట్టుముట్టింది. 

ఆ గంధర్వ గానం ఆస్వాదిస్తున్న నాకు గమ్మత్తుగా అలసట ఎప్పుడు మాయమయిందో కూడా తెలియలేదు. 

ఎంత అబ్బురంగా... ఆహ్లాదంగా అన్పించిందో చెప్పలేను!

ఎస్పీ బాల సుబ్రహ్మణ్యానిది గంధర్వ గానమంటే ఆమోదించనివారు ఎవరూ ఉండరనుకుంటాను.

ఇవ్వాళ (గురువారం ) బాలూ బర్త్ డే !

ఆయన పాటల్లో అత్యద్భుతమైనవి మాత్రమే ఎంచుదామని ప్రయత్నిస్తే.. ఆ జాబితా చాలా పెద్దదే అవుతుంది. బాలూ ఆణిముత్యాలసరాల సరాగాల సంగతులను కనీసంగా వివరించటానికైనా ఎన్ని పేజీలూ చాలవు.

ఘంటసాల కాలంలో లేత కోయిల్లాగా అమాయకత్వం నిండిన గొంతు.. ఆ తర్వాత పరిణతిని సంతరించుకుంటూ ఎన్నెన్ని పోకడలు పోయింది !

ఆ అపురూప స్వరం ఇళయరాజా యుగానికి ముందే సంపూర్ణత్వాన్ని సంతరించుకుంది. తెలుగు సినీ సంగీతాన్ని సుసంపన్నం చేసింది.

వైవిధ్యమైన భావాలనెన్నో అలవోకగా తన గళంలో పలికించే బాలూ శాస్త్రీయ సంగీతం నేర్చుకోలేదు. స్వరాలో, మూర్ఛనలో సాధికారికంగా పలికించలేకపోవచ్చు.

కానీ అపురూపమైన ఆ గొంతు నుంచి అమృతోపమానంగా జాలువారిన సోలోలూ, యుగళ గీతాలూ, బహు గళ బహుళ గీతాలూ వెల కట్టలేనివి కదా?

పాటల పోటీల్లో ‘మామా ... చంద మామా...’  అంటూ బాలూని అనుకరిస్తూ, చరణం దాకా రాకుండానే పల్లవి ఆలాపనతోనే న్యాయ నిర్ణేతల్ని ఆకట్టుకొని, ప్రైజులు కొట్టేసినవారెందరో.

బాలూ పాడిన పాటల్లో విభిన్నంగా అన్పించిన కొన్ని మంచి పాటలను గుర్తు చేస్తాను.

‘ఆలాపన’ సినిమాలో ‘ఆవేశమంతా ఆలాపనేలే ఎదలయలో... ఆవేశమంతా ఆలాపనేలే ఉదయినిగా నాలో జ్వలించే వర్ణాల రచన నాలో జనించే స్వరాలా...’ పాట ఎంతో బావుంటుంది. ఈ పాట చిత్రీకరణ ప్రత్యేకతను ఇక్కడ చెప్పటం లేదు. బాలూ గొంతు కాస్త జలుబు చేసినట్టుగా వైవిధ్యంగా తోస్తుంది. కానీ మాధుర్యం తగ్గదు.

ఈ పాట... ఆ తర్వాత వచ్చిన ‘గీతాంజలి’లోని ‘ఆమనీ పాడవే హాయిగా.. మూగవై పోకు ఈ వేళా…’ కు మాతృకలా ఉంటుంది. ఈ రెండో పాటే బాగా పాప్యులర్ అయింది. కానీ - ‘ఆవేశమంతా ...’ పాటకే ఎక్కువ మార్కులు వేస్తాను. రెంటికీ ఇళయరాజాయే స్వరకర్త.

‘పరిమళించు వెన్నెల నీవే...’ పాట తెలుసా? ఈ 'సాకీ' తర్వాత వచ్చే పల్లవే అందరూ గుర్తు పడతారు. అది - ‘కనుల ముందు నీవుంటే కవిత పొంగిపారదా? ’ . చెల్లెలి కాపురం సినిమాలో పాట. నాకు బాగా ఇష్టం. కేవీ మహదేవన్ సంగీతం అందించిన ఈ పాటలో బాలు గొంతు ప్రత్యేకంగా విన్పిస్తుంది.

‘నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలి నే పంచుకోనా...’ (ముద్దమందారం- రమేష్ నాయుడు ) పాటలో బాలూ స్వరాన్ని స్మరించుకోండి. ఎలా ఉంటుందో గుర్తొచ్చిందా?

అదే సినిమాలో ‘అలివేణీ... ఆణిముత్యమా..’ పాటలో టీనేజ్ యువకుడి గొంతు ఛాయలు కథానుగుణంగా విన్పించటం ఆశ్చర్యంగా అన్పిస్తుంది.

‘మధు మాస వేళలో... మరుమల్లె తోటలో ’ (అందమె ఆనందం - సత్యం ) ప్రస్తావించకుండా ఉండటం కష్టం. ఎంతో హాయిగా... స్వేచ్ఛగా... శ్రావ్యంగా సాగే పాట ఇది.

‘బలిపీఠం’లో దేవులపల్లి గీతం ‘కుశలమా..... కుశలమా నీకు కుశలమేనా ఇన్ని నాళ్ళు వదలలేకా ఎదో ఎదో రాశానూ అంతే అంతే అంతే . ... ’ వింటే తెలియని ఆనందం నిలువెల్లా ఆవరిస్తుంది. చక్రవర్తి స్వరకల్పన. పల్లవిలోని భావానికి తన గళంతో భాష్యం చెప్పే బాలూ స్వరం, అంతే... అనే పదం దగ్గర క్లుప్తంగా పలకరించి, పులకరింపజేసే వేణు గానం ఈ పాటకు అమూల్య అలంకారాలు.

‘మాయా మశ్చీంద్ర’ సినిమాలో ‘ప్రణయ రాగ వాహినీ... చెలీ వసంత మోహినీ... మదిలో ఏవో సుధలే కురిసే మధుర మధుర యామినీ’ పాట ఎంత బావుంటుందో కదా? ఈ యుగళ గీతంలో ‘మలయ పవన మాలికలు... ’అనే చరణంలో 'పదునారు కళలా పరువాల సిరులా పసిడి బొమ్మవు నీవనీ' అంటూ సాగే బాలూ గానం సూదంటు రాయిలా ఆకర్షించదూ?

‘పడమటి సంధ్యారాగం ’ సినిమాకి బాలూయే మ్యూజిక్ ఇచ్చింది. ‘పిబరే రామరసం’ కీర్తనను బాలూ ఎంత హృద్యంగా ఆలపిస్తాడో గుర్తు చేసుకోండి.

ఎన్ని పాటలు... ఎన్ని ఆపాత మధురాలు... ఎన్ని శ్రవణ సుభగాలు....

ఇక ఈ పాటల తోటలో స్వరాలతో చెట్టాపట్టాలేసుకొని నడుస్తూ ఉంటే మళ్ళీ బాలూ బర్త్ డే వచ్చేసినా రావొచ్చు. అందుకని-

 ‘పల్లవించవా నా గొంతులో... పల్లవి కావా నా పాటలో...’  (కోకిలమ్మ)  అంటూ బాలూనే కోరుకుంటూ ముగిస్తాను!

15 కామెంట్‌లు:

Anil Dasari చెప్పారు...

మంచి పాటలు గుర్తు చేశారు. వీటిలో చాలా పాటల mp3లు నాదగ్గరున్నాయి. వాటి రికార్డింగ్ నాణ్యత అంతంతమాత్రం. బాలు తొలినాళ్లలో ఇప్పుడున్నలాంటి సాంకేతిక పరిణితి ఉండుంటే బాగుండేదనిపిస్తుంది.

బాలుపై రఫీ ప్రభావం, సోనూ నిగమ్‌పై వీళ్లిద్దరి ప్రభావమూ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటాయి గమనించారా?

Unknown చెప్పారు...

నాకు నిద్ర పట్టకపోతే నేను వినే పాట ఆమనీ పాడవే... అదే పాట తమిళంలో విన్నా. కాకపోతే పాడినది బాలు గారు కాదు. అంతే ఆ ఎఫెక్టు మాయం.
జన్మదిన శుభాకాంక్షలు గాన గంధర్వునికి

మరువం ఉష చెప్పారు...

కడలిలో ఒక అల కదిపారు, సుడులై వేలపాటల్ని విసిరింది. జన్మదిన శుభాకాంక్షలు గాన గంధర్వ శిఖామణికి.

పరిమళం చెప్పారు...

బాలు గారికి జన్మ దిన శుభాకాంక్షలు !

మేధ చెప్పారు...

ప్రొద్దున మాటి.వి.లో చూశా, బాలు గారి పుట్టినరోజని.. బాలు స్వరార్చన పేరుతో కార్య్క్రమం వస్తోంది.
కూడలి తెరవగానే మీ టపా..
చాలా మంచి పాటలు గుర్తు చేశారు.. నవరసాలు పండించగలరు ఆయన గాత్రంలో..
BTW, బాలు గారికి జన్మదిన శుభాకాంక్షలు..

నిషిగంధ చెప్పారు...

బాలు గారికి జన్మదిన శుభాకాంక్షలు..

'నేనొక ప్రేమ పిపాసిని ' అంటూ భగ్న హృదయవేదనని, 'మబ్బే మసకేసిందిలే' అంటూ హుషారు గొలిపించే జానపద శృంగారాన్నీ అలవోకగా పలికించడం ఆయనకే చెల్లింది!!

ఆపాత మదురాలను మళ్ళీ జ్ఞప్తికి తెచ్చినందుకు మీకు ధన్యవాదాలు..

rishi చెప్పారు...

" అరె ఏమైందీ ..ఒక మనసుకు రెక్కలొచ్హి వాలింది".
బాలు గారి పాటల గురించి వింటె ...అదీ స్తిథి ..
అనంద ,విషాద ,ప్రేమ ,ఇంకా ఎన్నెన్నొ బావాల్ని
గమకాలుగ పలికి మన మనస్సుల్ని .సేద తీర్చె ..
బాలు గారికి , జన్మదిన శుభాకాంక్షలు .

వేణు చెప్పారు...

@ అబ్రకదబ్ర, సుజాత, మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్,ఉష, పరిమళం, మేధ , నిషిగంధ, రిషి గార్లకు ... మీ స్పందనకు ధన్యవాదాలు.

ఈ టపా రాశాక చాలా మంచి పాటలు గుర్తొచ్చాయి. వాటిని ప్రస్తావించలేకపోయానే అన్పించింది. ఏమైనా... బాలూకి ఇలా జన్మదిన శుభాకాంక్షలు మీతోపాటు చెప్పగలిగినందుకు సంతోషంగా ఉంది.

ముఖ్యంగా ‘ప్రేమలేఖలు’ సినిమాలోని ‘ఇది తీయని వెన్నెల రేయి’ పాట. ఇంకా ‘ఈనాడే ఏదో అయ్యింది..’, ‘మెరిసే మేఘమాలిక’...ఇలాంటివి.

వేణూశ్రీకాంత్ చెప్పారు...

బాలు గారికి జన్మదిన శుభాకాంక్షలు చాలా బాగా చెప్పారండీ.. చాలా మంచి పాటలు గుర్తు చేసారు.

వేణు చెప్పారు...

వేణూ శ్రీకాంత్ గారూ, మీకు ధన్యవాదాలు.

SURYA చెప్పారు...

In last week's Paaduta Teeyaga episode, Balu sang the Pallavinchava naa gontulo song as a tribute to Sri K Balachander. What a song! KBC termed it the. Best song of his films. The two episodes where KBC and Ganesh Patro were chief guests together were superb with beautiful songs.

వేణు చెప్పారు...

SURYA! బాలచందర్, గణేష్ పాత్రోల కోసం ‘ పాడుతా తీయగా’ ప్రోగ్రాం చూద్దామనుకున్నా కానీ కుదర్లేదు. యూట్యూబ్ లో వెతకాలి.

ఇక ‘పల్లవించవా’ పాటతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. అసలు కోకిలమ్మ పాటలన్నీ (ఎమ్మెస్ విశ్వనాథన్) ఎంతో శ్రావ్యంగా ఉంటాయి. ఇప్పుడొస్తున్న పాటలు వింటుంటే.. మధురగీతాలకు
కాలం చెల్లిపోయిందేమోననిపిస్తోంది.

జలతారు వెన్నెల చెప్పారు...

http://www.manatelugumovies.net/2012/05/padutha-theeyaga-3-21st-may-grand.html

http://www.manatelugumovies.net/2012/05/padutha-theeyaga-3-28th-may-grand.html

వేణు చెప్పారు...

జలతారువెన్నెల గారూ! ఆన్ లైన్లో వెతికే శ్రమ తప్పించి ‘పాడుతా తీయగా’ లింకులు ఇచ్చినందుకు మీకు చాలా.. చాలా థాంక్స్! బాలచందర్,గణేష్ పాత్రోల తాజా ఎపిసోడ్ తో పాటు పాత ఎపిసోడ్ల లింకులు కూడా దీనిలో ఉన్నాయి.

M b d syamala చెప్పారు...

గాన గంధర్వునిపై మీ టపా చాలా బాగుంది మరీ మొదట్లో ఆ లేతతనపు గొంతు దానిప్రత్యేకత దానిదే!నిజానికి అనేక మధుర గీతాలని రాసిపోస్తే కొన్ని ఏరడం కష్టమే మరి!అయినా మామా! చందమామా! ,కనుల ముందు నీవుంటే ఈనాడే ఏదో అయ్యింది . . ఇవన్నీ నాకు చాలా ఇష్టమైన పాటలు అభినందన పాటలు కూడా!ఈనాడే ఏదో . . . పాటలో tune ఎంత tipicalగా ఉంటుందో బాలు గొంతు అంత మాధుర్యం ఒలికింది చక్కటి టపాకి అభినందనలు