అందమైన 'చందమామ' బొమ్మ. దానికి మరో పేరు....
'చిత్రా'!
కళ్ళకు కనికట్టు చేసే చిత్ర రేఖా విన్యాసం ఆయన విశిష్టత.
1947 జులై లో వెలువడిన ‘చందమామ’ మొదటి సంచికకు ముఖచిత్రం వేసిందీ, 1955 సెప్టెంబరులో వచ్చిన తొలి బేతాళ కథకు అపురూప చిత్రం సమకూర్చిందీ కూడా చిత్రానే. ఈ ఒరిజినల్ వెర్షన్ లో ఉన్న విక్రమార్కుడి భంగిమను మార్చి, బేతాళుడి కాళ్ళకు బదులు తల కనపడేలా చేసి మరింత మెరుగుపరిచారు శంకర్.
మనందర్నీ ఇంతగా ఆకట్టుకున్న ఈ బొమ్మ వెనక ఈ ఇద్దరు చిత్రకారులున్నారంటే విశేషమే కదా!

చందమామ ఇంటింటి పత్రికగా పాఠకాదరణ పొందటంలో ప్రధాన పాత్ర జానపద ధారావాహికలది. వాటికి
చిత్రా బొమ్మలు ప్రాణం పోశాయి.
అజరామరమైన కళా సృష్టి అది! మొదట్లో వెలువడిన సంచికల్లో దాదాపు ప్రతి కథకూ ఆయనే బొమ్మలు వేసేవారు. మూడు దశాబ్దాల్లో పదివేల చిత్రాలను సృజించారు. ఇంత విస్తృతంగా, అద్భుతంగా వైవిధ్యభరితమైన బొమ్మలను గీసిన చిత్రా ప్రతిభకు తగినంత ప్రాచుర్యం రాలేదు!
ఆయన ఏదైనా కథకు బొమ్మలు గీస్తే... అవి ఆ కథ స్థాయిని పెంచేసి, ఆ కథ నిజమని భ్రమ కలిగిస్తాయి. కథలో వాతావరణాన్ని ఒక్కోసారి రచయిత ఊహల కంటే మిన్నగా కళ్ళముందుకు తెచ్చేసే అపార ప్రజ్ఞ ఆయన సొంతం.
చిత్రా బొమ్మల్లో ఒకనాటి మధ్యతరగతి లోగిళ్ళూ, పేదల పూరి గుడిసెలూ ఏవో పాతకాలం నాటి జ్ఞాపకాలను తట్టి లేపుతాయి. ప్రశాంతమైన ముని వాటికలూ, రాజ ప్రాసాదాల సంగతి చెప్పేదేముంది? రాజ భవనాల్లో దుస్తుల అలంకరణలూ, కుడ్యాలకు అలంకరించే అందమైన తెరలూ, స్తంభాల నగిషీలూ, నేలకూ, పై కప్పుకూ ముచ్చటైన డిజైన్లూ ... ఆ అతి సూక్ష్మ వివరాలన్నీ అలాగే ఆ బొమ్మలను చూస్తూ ఉండాలనిపించేస్తాయి.
ఒకనాటి తెలుగు గ్రామీణ వాతావరణాన్ని ఆయన బొమ్మల్లో పున: సృష్టిస్తారు. అంతేనా? చీనా జానపదమైనా, గ్రీకు పురాణ గాధ అయినా, బెంగాలీ నందినుల కథలైనా ఆ గీతల్లో అలా ఒదిగిపోవాల్సిందే! ఆయన రేఖల కలయికతో నిర్జనమైన అడవులూ, కలవరపరిచే కడలీ, విశాలమైన మైదానాలూ దృశ్యబద్ధమవుతాయి. అశ్వ పద ఘట్టనా, మద గజ ఘీంకారం, చండ సింహ గర్జనా ఆ చిత్రాల్లోంచి వినిపిస్తాయి.
ఆ వర్ణ చిత్రాలు... కంచుకోటలై కనువిందు చేస్తాయి. జ్వాలా ద్వీపాల్లో, రాకాసి లోయల్లో విచిత్రాకార జీవులై ఆకాశయానంతో అలరిస్తాయి. పాతాళ దుర్గాలైనా, యక్ష పర్వతాలైనా ఆ కుంచె స్పర్శతో రమణీయమై శోభిస్తాయి. ఆ చిత్రాల స్మృతులు శిథిలాలయాలనూ, వాటి ప్రాకారాలనూ దాటేసి, విశాలమైన ప్రకృతిలోకీ, నిసర్గ సౌందర్యం నిండిన అరణ్యాల్లోకీ పరుగులు తీస్తాయి. చిత్ర విచిత్రాలు చేసే ఆ బొమ్మలు మాయా సరోవరాలై ఆహ్లాదపరిచి, తరతరాల చిత్ర కళాభిమానుల జ్ఞాపకాల్లో రాతిరథంలా చెక్కుచెదరకుండా నిలిచివుంటాయి!
రాజ కుమారుల ఆహార్యం అద్భుతంగా ఉండదూ? ముంజేతికి లోహ కంకణాలూ, మెరిసే కత్తి ఒరా, నుదురుపైనా, మెడ వేపూ ఒంపు తిరిగిన శిరోజాలూ, శరీరంపై వేలాడే అంగీ, పాదాలకు అంటిపెట్టుకుని వుండే ‘కుర్తా’, చివరి భాగం సన్నగా వెనక్కి ఒంపు తిరిగి ఉండే పాదరక్షలూ ...
‘అలాంటి డ్రెస్సులు ఇప్పుడు అందరూ ఎందుకు వేసుకోరు? అలా వేసుకుంటే ఎంతో బావుంటుంది కదా!‘ అనే ఊహలు బాల్యంలో ఎవరికైనా వచ్చేస్తాయి. ఆ బొమ్మల ఘనత అలాంటిది!
కదిలే నిశ్చల ‘చిత్రా’లు!
పేరుకు నిశ్చల చిత్రం... కానీ దానిలో అద్భుతమైన కదలిక చిత్రా బొమ్మల ప్రత్యేక లక్షణం. వీలున్న ప్రతి సందర్భంలోనూ పాత్రల కదలికలను చూపించటానికి ఇష్టపడతారని ఆయన బొమ్మలే సాక్ష్యం చెపుతాయి. పోరాట సన్నివేశాల్లో యుద్ధోత్సాహం చిత్రించేటప్పుడు ఆయన కుంచె కదం తొక్కుతుందనిపిస్తుంది!
వీచే గాలిని బొమ్మల్లో చూపించటం కష్టం. కానీ చిత్రా ముద్రతో అది సుసాధ్యమైపోయింది. కొండ మీదో, మైదానంలోనో పాత్రలు నిలబడివుంటే వారి ఉత్తరీయాలూ, దుస్తులూ గాలికి ఎగురుతున్నట్టు గీస్తారాయన.
ఫొటోగ్రఫీలో అభినివేశం ఉండటం వల్ల కాబోలు... విభిన్నమైన కోణంలో బొమ్మను చూపించటానికి ప్రాముఖ్యం ఇచ్చేవారు. ఎంతో ఎత్తు నుంచి కింద దృశ్యాలను చూపించటమో, కింద నుంచి- ఎత్తయిన కోణంలోని దృశ్యాలను వివరాలకు భంగం రానీయకుండా చిత్రించటమో ఎన్నో సందర్భాల్లో కనిపిస్తుంది.
చందమామలో విశేష పాఠకాద


రణ పొందిన తొలి జానపద ధారావాహిక నెల ‘విచిత్ర కవలలు’. రాజారావు గారు రాసిన ఈ ఏకైక సీరియల్ 1950 జులై- 1951 డిసెంబర్ మధ్య ప్రచురితమైంది. దీనికి నలుపు తెలుపు బొమ్మలను వేసిన చిత్రా ఇదే సీరియల్ 24 ఏళ్ళ తర్వాత (1974 జులై- 1975 డిసెంబర్) తిరిగి ప్రచురించినపుడు వర్ణచిత్ర మాయాజాలం చేశారు.
పాతవాటికంటే ఎంతో మెరుగ్గా సరికొత్త బొమ్మలను గీసి పాఠకులను ముగ్ధుల్ని చేశారు.
చందమామకు అట్టవెనక బొమ్మలు కూడా కొన్ని వేశారు చిత్రా. అయితే అవి పెద్దగా ఆకట్టుకోవు! పెయింటింగ్స్ లో కంటే రేఖా చిత్రాల్లోనే ఆయన శైలి ప్రస్ఫుటమవుతుంది.
కథల, సీరియల్స్ టైటిల్స్ ను కథాంశం వ్యక్తమయ్యేలా చిత్రా చక్కగా రాసేవారు. ‘తోకచుక్క’ సీరియల్ కు రాసిన అక్షరాలు తోకచుక్క ఆకారంలోనే కనిపిస్తాయి. చైనా కథల టైటిల్స్ చైనీస్ అక్షరాలను పోలివుండేలా, దయ్యాల కథలకు అక్షరాలు వణుకుతున్నట్టుగా, భలే ఉంటాయి ఆయన లోగోలు!
ఆ అక్షరాల తీరులో ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. గుండ్రటి తెలుగు అక్షరాలను పలకలుగా రాసి, వాటి లోపల అందమైన నగిషీలు చెక్కటం చూడొచ్చు.
‘మాయా సరోవరం’ ధారావాహిక, చిత్రా మృతి చెందిన మరుసటి నెలే ముగిసింది. అప్పటికే ఆయన బొమ్మలు గీయటం పూర్తి చేయటం వల్ల ఇబ్బంది లేకుండా పోయింది. దాసరి సుబ్రహ్మణ్యం గారి ‘భల్లూక మాంత్రికుడు’ సీరియల్ కు ...
జయ బొమ్మలు గీశారు. ఆయన బాగానే వేశారు గానీ, చిత్రాతో పోలిస్తే... నిలబడే చిత్రాలు కావు. ఆ రకంగా చిత్రా తోనే సుబ్రహ్మణ్యం గారి ‘ఉజ్వల శకా’నికి తెరపడిందనిపిస్తుంది!
చిత్రా, నేనూ!
1978 మే 6న అస్తమించిన చిత్రా గురించి తర్వాతి నెలలో చందమామలో ప్రచురించినపుడు, నా చిన్నపుడు- చదివాను, బాధ అన్పించింది. కానీ

కాలక్రమంలో చిత్రా గొప్పతనం ఎక్కువగా అర్థమయ్యాక ఆయన లోటు మరింతగా తెలిసొస్తోంది.
‘పాతాళ దుర్గం’ ధారావాహికలో ఒక సన్నివేశం ఉంది. చెట్టుకొమ్మల్లో ధూమక సోమకులు దాక్కునివుంటారు. సోమకుడు ఉగ్రసేనుడికి గురిచేసి బాణం ఎక్కుపెట్టిన దృశ్యాన్ని చిత్రా చాలా బాగా గీశారు. అది నాకు బాగా నచ్చేసింది.
ఉండబట్టలేక- తెల్ల చాక్ పీస్ తో ఆ బొమ్మను అనుకరించి గీశాను. ఎక్కడంటే- మా ఇంటి గేటు దాటగానే ఎదురుగా గోడమీద కనిపించే చిన్న బ్లాక్ బోర్డు మీద! గ్యాస్ సిలెండర్ తెచ్చిన ఓ వర్కర్ ఆ బొమ్మను చూసి, ‘ఎవరు వేశారండీ, ఆ బొమ్మను?’ అని అడిగి, ‘చాలా బావుంది, చాలా బావుంది!’ అని ‘నన్ను’ మెచ్చుకున్నాడట. ఆ సమయంలో నేను ఇంటి దగ్గర ఉండివుంటే ‘అది చిత్రా గీసిన బొమ్మ’ అంటూ దాని గురించి ఉత్సాహంగా వర్ణించి చెప్పేవాణ్ణి! బొమ్మలను చూసి, ఆనందించే కళా హృదయం అందరికీ ఉండదు కదా!
చందమామ సంపాదకీయం పేజీలో ఉండే చిత్రా బొమ్మ గుర్తుందా? కొలనులో మెడలను అందంగా వంచేసిన రెండు హంసలూ, పద్మాలూ, నీళ్ళలో ప్రతిబింబించే కొండల నీడలూ, ఆకాశం, మబ్బులూ- ఈ దృశ్యం నన్నెంతో ఆకట్టుకునేది. ఆ బొమ్మ ఎడమవేపు కింది భాగంలో స్వేచ్ఛగా పెట్టిన చిత్రా సంతకం కూడా నాకు ఇష్టమే!
మరణించి 30 ఏళ్ళు గడిచినా చిత్రా స్థానం భర్తీ కాలేదంటే ఆయన ముద్ర ఎంత బలీయమైనదో అర్థమవుతుంది. 66 సంవత్సరాలకే జీవితం చాలించకపోతే మరెన్ని అద్భుత వర్ణచిత్రాలు ఆయన గీసేవారో కదా!
కథల మాంత్రి
కుడి మాటల్లో.....
చిత్రా గురించి చెప్పుకునేటప్పుడు- జానపద ధారావాహికల స్రష్ట
దాసరి సుబ్రహ్మణ్యం గారిని తల్చుకోకుండా ఉండలేం. వారిద్దరిదీ అపూర్వ సమ్మేళనం! ‘తోకచుక్క’ నుంచి ‘మాయా సరోవరం’ వరకూ దాసరి- చిత్రాల కాంబినేషన్ ‘చందమామ’ వేదికగా అద్భుతాలు సృష్టించి పాఠకలోకాన్ని ఉర్రూతలూగించింది.
సుబ్రహ్మణ్యం గారిని విజయవాడలో కలిసినప్పుడు చిత్రా గారి గురించి ఆయన్ను చాలా అడిగాను. ఆ విశేషాలు...
చిత్రాతో మీ అనుబంధం...
‘‘ఆర్టిస్ట్ చిత్రాను, నేను 1952 జనవరిలో, చందమామ సంపాదక వర్గంలో చేరిననాడు, చూడడటం జరిగింది. ఆయన 1947లో చందమామ ప్రథమ పత్రిక వెలువడిననాడే, అందులో పనిచేస్తున్నాడు. చిత్రకారుడిగా, ఇలస్ట్రేటర్ గా ఆయన చాలా ప్రతిభావంతుడు.
నేను 1954 జనవరిలో రాయడం ప్రారంభించిన, నా ‘తోకచుక్క’ సీరియల్ కు, ముందుగా చందమామలో (ఒక నెలకు ముందు) ఒక పేజీ రాబోయే కథలోని బొమ్మలను వేసి, దానికి మంచి ఆదరణ (ప్రారంభంలోనే) కలిగేట్టు చేశాడు.
తర్వాత నే రాసిన ‘మకర దేవత’, ‘ముగ్గురు మాంత్రికులు’, ‘కంచుకోట’ ... అలా మరికొన్నిటికి చిత్రాలు వేశారు.
ఆయనది చాలా అకాల మరణం. ఆయనతో నా అనుబంధం- కేవలం రచయితా, చిత్రకారులుగానే కాక, చాలా స్నేహ, పరస్పర గౌరవాదరాలతో కూడినది.
చిత్రా స్వగ్రామం, ఇప్పటి ఆంధ్రా, తమిళనాడు సరిహద్దుల్లోని తిరువళ్ళూరు దగ్గిర చిన్న గ్రామం అని కొద్దిగా గుర్తు. ఆయన చందమామలో చేరిన - తర్వాతి ఆర్టిస్టుల్లా కాక, తెలుగు రాయా చదవా ఎరిగినవాడు.’’
చిత్రా బొమ్మల ప్రత్యేకత, ఆయన శైలి....
‘‘ఆయన బొమ్మల ప్రత్యేకత... బొమ్మల్లో, ఆయా వాతావరణానికి (Background) తగిన రీతిలో వాస్తవంగా కదులుతున్నట్టు ఉండేవి. ఇంక శైలి మాటకొస్తే, ఆయనకంటూ ఒక ప్రత్యేక శైలి ఉన్నదని నేననుకోను.
ఆనాటీ, ఈనాటీ ఆర్టిస్టుల్లో ఆయన సమర్థుల్లో అత్యంత సమర్థుడు.’’
జానపద సీరియల్స్ పాత్రల చిత్రకల్పన విషయంలో మీ ఇద్దరూ చర్చించుకునేవారా?‘‘నేను రాసిన జానపద సీరియల్స్ మొత్తం జనవరి 1954 నుంచి 1978 వరకూ పన్నెండు. వాటిని గురించిన చర్చ (పాత్ర- చిత్రకల్పన) వగైరా చిత్రా గారి తోనే కాదు, ఆ తర్వాత చిత్రాలు వేసిన జయ గారితో కూడా చర్చించడం జరగలేదు. అంత అవసరం అనుకుంటే పాత్రల వేషధారణలో కొన్ని మార్పులు చెప్పేవాడిని.’’
యక్షపర్వతం, రాతిరథం సీరియల్స్ కథానాయకులు ఖడ్గ వర్మ, జీవ దత్తుల పాత్రల ఆహార్యం మీరు ఊహించినట్టే వచ్చిందా? అంతకంటే బాగా వచ్చిందా?
‘‘మీరు ఉదాహరించిన పాత్రలే కాదు, తర్వాత రాసిన సీరియల్స్ లోని పాత్రలూ, నా ఆలోచనకు పూర్తి అనుగుణంగా వచ్చినవి. ఇప్పుడు (2009లో ప్రచురణ జరుగుతున్న) ‘పాతాళ దుర్గం’ బొమ్మలతో పాటు లోగడ ఆయన చిత్రించిన సీరియల్ బొమ్మలు, ఈ నాటికీ... ఇన్నేళ్ళ తర్వాత కూడా అద్భుతం అనుకుంటున్నాను.’’
రోహిణీ ప్రసాద్ గారి జ్ఞాపకాల్లో...
చందమామను అనితర సాధ్యంగా, అత్యద్భుతంగా తీర్చిదిద్దిన లెజెండ్ కొడవటిగంటి కుటుంబరావు గారు. ఆయన కుమారుడు రోహిణీ ప్రసాద్ గారు 2006 జనవరిలో
ఈ మాట లో రాసిన ‘చందమామ జ్ఞాపకాలు ’ విలువైన సమాచారంతో ఉన్న వ్యాసం. దీనిలో చిత్రా గారి ప్రస్తావన ఇలా ఉంటుంది-
‘‘ చిత్రాగారు చిత్రకళ నేర్చుకోలేదు. స్వంతంగా ప్రాక్టీసు చేశారు. ఆయన మంచి ఫోటోగ్రాఫరట. ఎప్పుడూ నీట్‌గా డ్రస్ చేసుకుని వచ్చేవారు. మితభాషి. అస్తమానం ఇన్హేలర్ ఎగబీలుస్తూ ఉండేవాడు.
చిన్నప్పుడు నాకు బొమ్మలు గీసే అలవాటుండడంతో ఆయన పక్కన గంటల తరబడి కూర్చుని చూసేవాణ్ణి. ముందుగా పెన్సిల్ స్కెచ్ గీసుకుని, ఆ తరవాత ఇండియన్ ఇంక్‌తో ఆయన బొమ్మలు వేసేవారు. ఒక సందర్భంలో బాపూ
చిత్రాగారి బొమ్మలు తన కిష్టమనీ, గాలిలో ఎగిరే ఉత్తరీయం గీసే ఆయన పద్ధతి తనకు నచ్చుతుందనీ మాతో అన్నారు.
అమెరికన్ కామిక్స్ “చందమామ” ఆఫీసులో చాలా ఉండేవి. వివిధ దేశాలవారి డ్రస్సులనూ, వెనకాల బిల్డింగుల వివరాలనూ చిత్రా వాటినుంచి తీసుకునేవారు. ఈ కారణంగా విదేశీ కథలన్నీ సామాన్యంగా ఆయనకే ఇచ్చేవారు.
దాసరి వారి సీరియల్‌కు చిత్రాగారి బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి. అప్పుడప్పుడూ ఆయన బొమ్మల కోసమేనేమో అన్నట్టుగా సుబ్రహమణ్యంగారు “మూడు కళ్ళూ, నాలుగు తలలూ ఉన్న వికృతాకారుడు” మొదలైన పాత్రలను కథలో ప్రవేశపెట్టేవారు. మొసలి దుస్తులవాళ్ళూ, భల్లూకరాయుళ్ళూ చిత్రా గారి బొమ్మల వల్ల ఆకర్షణీయంగా కనబడేవారు.
శంకర్ ఆర్టు స్కూల్‌కు వెళ్ళిన మనిషి. టూరిస్టు వింతలవంటి ఒక పేజీ విషయాలకు ఫోటోను చూసి చిత్రీకరించడం ఆయన ప్రత్యేకత.
మొత్తం మీద వీరిద్దరూ డిటెయిల్స్‌తో కథలకు బొమ్మలు వేసే పద్ధతిని ప్రవేశపెట్టారు. అప్పుడప్పుడూ యువ దీపావళి సంచికల్లో కూడా కథలకు వీరు చిత్రాలు గీసేవారు. “చందమామ”కు ప్రత్యేకత రావడానికి బొమ్మలు చాలా దోహదం చేశాయి.’’
ఈ టపాలో మొదట ఇచ్చిన చిత్రం ‘జ్వాలా దీపం’ధారావాహికకు చిత్రా కుంచె చిత్రించిన బీభత్స దృశ్యం.
ఇప్పుడు 'తోకచుక్క
','మాయా సరోవరం' సీరియల్స్ లోని రెండు అద్బుత చిత్రాలు చూడండి!
చిత్రా గురించి ఇటీవల శివరామప్రసాద్ గారూ, రాజశేఖర రాజుగారూ తమ బ్లాగుల్లో రాశారు. వాటి లింకులు ఇస్తున్నాను.
‘సాహిత్య అభిమాని’ బ్లాగు
టపా.
‘చందమామ చరిత్ర’ బ్లాగు
టపా.