సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

30, అక్టోబర్ 2009, శుక్రవారం

ఎమ్వీయల్... నూజివీడూ!


ముళ్ళపూడి వెంకటరమణతో ఎమ్వీయల్...  పక్కన బాపు

నూజివీడు అంటే- 'రసాల మామిడి పండ్లు' గుర్తొస్తాయి ఎవరికైనా!


ఆ ఊరి గురించి తెలిసినవారికి అక్కడి జమీందారీ భవనాల అవశేషాలూ, చారిత్రక గుర్రం గేటూ, కుక్కల గేటూ-

ఆ రెంటి మధ్యలో ఉండే ధర్మ అప్పారావు కాలేజీ, దగ్గర్లోనే పీజీ కాలేజీ...

ఇవన్నీ తలపుల్లో మెదులుతాయి.

సాహితీ అభిమానులకైతే నూజివీడు అనగానే ఎమ్వీయల్ గుర్తొచ్చేస్తారు. 

42 ఏళ్ళకే అస్తమించిన ప్రతిభాశాలి ఆయన!

బాపు వేసిన ‘ముత్యాల ముగ్గు’(1975) కు నిర్మాతా;
బాపు నడిపిన ‘తూర్పు వెళ్ళే రైలు’(1979) కు మేలిముత్యాల్లాంటి మాటలు రాసిందీ ఎమ్వీయల్లే.


‘‘ కన్నీటికి ఆనకట్ట కట్టు

 కరెంటు పుట్టుకొస్తుంది

  కష్టాల కొమ్మలు నరికవతల పెట్టు

   కొత్త చిగురు వేస్తుంది’’

 - ఇంతటి ఉత్తేజకరమైన కవిత రాసింది ఆయనే.

 
‘షా’ అనే ఈ కవిత-

‘‘చేతిలోని గీత తప్పు

 నుదుటి పైన రాత తప్పు’’
 అంటూ మూఢత్వాలను నిరసిస్తూ యువతను ఉద్బోధిస్తూ సాగుతుంది.ఆంధ్రజ్యోతి వీక్లీలో (బహుశా 1978 ప్రాంతాల్లో) ‘యువ జ్యోతి’ శీర్షికను అద్భుతంగా నిర్వహించారు ఎమ్వీయల్ . ఇది సెంటర్ స్ప్రెడ్ లో నిలువుగా ఉండేది. పాఠకులు అడిగే సరదా ప్రశ్నలకు చమత్కారంగా, చురకలంటిస్తూ ఆయన చెప్పే సమాధానాలు చాలా ఆసక్తిగా ఉండేవి.


‘‘పరీక్షలు దగ్గరపడుతున్నాయి. ‘ఈనాడు’ చదవమంటారా? ‘రేపు’చదవమంటారా?’’ (అప్పట్లో 'రేపు' మాసపత్రిక ఉండేది కదా!)..

ఇలాంటి కొంటె ప్రశ్నలెన్నిటికో ఆయన అంతే దీటుగా ‘సటిల్’ జవాబులు చెప్పేవారు.


‘ఎమ్వీయల్’ అంటూ పేరు రాసుకోవటంలోనే విలక్షణత్వం ఉంది. ఆయన పూర్తి పేరేమిటో చాలామందికి అంతుబట్టేది కాదు.


యువజ్యోతి శీర్షికలో ఒక రీడర్ ‘‘మీ పూర్తి పేరు ముళ్ళపూడి వెంకట రమణా?’’ అని అడిగారు.

దానికాయన చెప్పిన సమాధానం- ‘‘ఔను. చిన్నప్పట్నుంచీ నాకు ‘ర’ పలికేది కాదు. ‘ముళ్ళపూడి వెంకట లమణ’ అని పలికేవాణ్ణి. అలా ఎమ్వీయల్ అనే పేరొచ్చింది’’.


ఈ సమాధానం చదివి కన్ ఫ్యూజ్ అయిన వాళ్ళలో నేనూ ఉన్నాను. ఇంతకీ ఆయన అసలు పేరేమిటా అని!

కొన్నేళ్ళ తర్వాత నూజివీడులోని ధర్మ అప్పారావు కాలేజీలో ఇంటర్మీడియట్ లో చేరినప్పుడు కానీ నాకు సమాధానం దొరకలేదు. ఆ కాలేజీ తెలుగు విభాగాధిపతి ఎమ్వీయల్ గారే!

కాలేజీ మ్యాగజీన్ లోనో, ప్రాస్పెక్టస్ లోనో ఆయన పూర్తి పేరు ఎం.వి.ఎల్.(మద్దాలి వెంకట లక్ష్మీ ) నరసింహారావు అని చూశాను. ఇంతకాలమూ ఎం.వి.ఎల్. అనే abbreviation లోనే పేరుంది అనుకుంటూ ఊహించటానికి ప్రయత్నించాను. తీరా ఎమ్వీయల్ అనేది ఆయన అసలు పేరుకు ముందొచ్చే మాటలేనని అర్థమైంది.

ఇంటర్లో మార్కుల కోసం ద్వితీయ భాషగా సంస్కృతమే తీసుకుంటారు కదా ఎక్కువమంది?
పైగా నేనప్పటికే ఓరియెంటల్ స్ట్రీమ్ లో సంస్కృతం మూడేళ్ళు చదివివున్నాను. కానీ నేను ఎమ్వీయల్ గారి పాఠాలు వినటం కోసమే తెలుగును ద్వితీయ భాషగా ఎంచుకున్నాను!


ఎప్పుడో గానీ క్లాసు తీసుకునేవారు కాదు. మొహం సీరియస్ గానే కనిపించేది; దానిలోంచి హాస్య చతురత అల్లరిగా తొంగి చూసేది.

పాఠం చెపుతోంటే... ఆ మాటలు ప్రాసలుగా పరవళ్ళు తొక్కుతూ ప్రవాహంలా దూసుకొచ్చేవి.

తెలుగు పాఠ్యపుస్తకంలో ఒక పేజీ కూడా తిరిగేది కాదు.

కానీ ఆయన ఉపన్యాస శాఖా చంక్రమణంలో బోలెడన్ని సాహిత్యపు విశేషాలూ, వ్యాఖ్యానాలూ, చమక్కులూ.

ఆయన వేపు కళ్ళప్పగించి చూస్తూ... ఆసక్తిగా వినేవాళ్ళం. అవర్ అయిందనే గుర్తుగా బెల్లు మోగితే నిరాశగా అనిపించేది.


నవలీకరణలో ఎమ్వీయల్ ముద్ర ‘అందాల రాముడు’(1973) వెండితెర నవల్లో కనిపిస్తుంది. ఆ నవల చదివిన తర్వాతే సినిమా చూశాను.

నవల్లో నచ్చిన కొన్ని సన్నివేశాలు సినిమా చూసినప్పుడు  నిరాశ కలిగించాయంటే నవలీకరణ (ముళ్ళపూడి మార్కు సంభాషణలూ, స్క్రీన్ ప్లే కూడా ) ఎంతో బావున్నట్టే కదా?
ఆయన కవితలు ‘కవన కదనం’ పేరుతో 1984లో సంపుటంగా వచ్చాయి. దీన్ని ‘ముత్యాల ముగ్గు కాంట్రాక్టర్’ రావుగోపాలరావు గారికి అంకితమిచ్చారు. విజయవాడ నవోదయ వారు పంపిణీ చేశారు.


‘‘అబద్ధాన్ని కవి సమయాల ఒరల్లో దాచి

నిజాన్ని కవిత్వంతో చంపకు’’

అనే పంక్తులు ‘గంధర్వ గానం’ అనే కవితలోవి.


‘‘కష్టజీవి కండలలో, గుండెలలో ఖజానాలున్నాయి’’ అంటూ శ్రామిక పక్షపాతం చూపిస్తారు.


‘ఆనంద ముద్ర’ అనే కవిత చూడండి-


‘‘బాధలు

సూదులనుకుంటే

జీవితం పిన్ కుషన్


సంతృప్తిని అచ్చుకిస్తే

లోకమే

ప్రింటింగ్ మిషన్’’‘సింహనాదం’ అనే కవిత ఉపసంహారమిది-

‘‘ఈ తరం తరంగంలా విరుచుకుపడుతుంది

కురంగంలా పరుగులు పెడుతుంది

మొండి రాళ్ళ మీద విరిగిపడినా

వేటగాళ్ళ గురి తగిలి పడినా- ’’మినీ కవితలు రాసే యువతను ప్రోత్సహించటంలో ముందుండేవారు. ‘‘ కోడెకారు కవులు సూటిగా, ఘాటుగా ధ్వనిస్తున్న కవితలు కొన్ని వందల సభలలో వినిపించి శ్రోతలలో కనిపించిన స్పందనకు పులకించి, వారి ఆనందోద్రేకాలలో పాలు పంచుకున్నాను’’ అని స్వయంగా చెప్పారు.


‘కవన కదనం’ కాకుండా ఎమ్వీయల్ ఇతర రచనలు పుస్తకాలుగా వచ్చాయో లేదో తెలియదు.

‘నాకు నచ్చిన కథ’గా ఎన్.ఆర్.నంది ‘ద్వేషం’ కథను స్వాతి (?) మంత్లీలో పరిచయం చేశారు. ఈ కథను చదివి ‘ఎవరీ నందీశ్వరుడు?’ అని ఆయనపై ద్వేషం పెంచుకున్నానని చమత్కరిస్తారు.

చివరిదశలో ‘తాగుడు మూతలు’ అనే కాలమ్ (‘రచన’లో?) నిర్వహించారు.


యనది అకాల మరణం (1944-1986). మితి మీరిన మద్య సేవనం దీనికి కారణమంటారు. ఇలాంటి అలవాట్లు ఎందరు ప్రతిభావంతుల జీవితాలను అర్థాంతరంగా బలి తీసుకుంటున్నాయో కదా అనిపిస్తుంది!

 ఇంటర్నెట్ లో ఆయన  వేరే ఫొటోలు  గానీ, పూర్తి వివరాలు గానీ దొరకటం లేదు.

 ప్రతిభా సంపత్తి పూర్తిగా వెల్లడి కాకముందే అకస్మాత్తుగా అస్తమించిన రచయితా, కవీ, వక్తా, అధ్యాపకుడూ ఎమ్వీయల్!

26 వ్యాఖ్యలు:

తృష్ణ చెప్పారు...

చాలా మంచి పరిచయాన్ని అందించారండీ...Quotes from his poems are excellent..ధన్యవాదాలు.

సురేష్ - మ్యూజింగ్స్ చెప్పారు...

వేణు గారూ, మన సొంత ఊరు నూజివీడు గురించి, మన MVL గారి గురించి మీ చక్కని పరిచయము నాకు చెప్పలేనంత ఆనందము కలిగించినది. DAR కాలేజి, కుక్కల గేటు అన్ని గుర్తొచ్చాయి. ధన్యవాదములు. MVL గారి గురించి నాకు తెలియని చాలా విషయాలు చెప్పారు.

మీకు కుదిరితే నా blogలోని "నూజివీడు మావి పండు" గురించి ఉన్న కవిత చదవగలరు.

వేణు చెప్పారు...

@ సుజాత : ఎమ్వీయల్ రచనలు ఎన్ని పుస్తకాలుగా వచ్చాయో కూడా తెలియదండీ. విజయవాడ నవోదయ బుక్ హౌస్ లో కూడా ఇన్నేళ్ళ తర్వాత ఆ పుస్తకాలు ఉంటాయనుకోను. ‘కవన కదనం’ పుస్తకమైనా నేను పాత పుస్తకాల షాపులో సంపాదించిందే.

ఎమ్వీయల్ రాసిందే ‘కాన్క’ అనే పుస్తకం ఒకటి ఉన్నట్టు గుర్తు. (చలం ‘ కాన్క’ వేరు).

నేను రాసిన టపా జ్ఞాపకాల ఆధారంగా రాసిందే. యువజ్యోతిలో ‘ఈనాడు’,‘రేపు’ ప్రశ్న అడిగింది స్వరూపరాణి (?) అనే పాఠకురాలనుకుంటా. ఆ పేరు కలిసొచ్చేలా ఎమ్వీయల్ సమాధానం ఇచ్చారు. అది సరిగా గుర్తులేనప్పుడు రాసి ఆ ‘సటిలిటీ’ చెడగొట్టటం ఎందుకని ఆ సమాధానం రాయటానికి ప్రయత్నించలేదు.
మీ అభినందనకు థాంక్యూ!


@ తృష్ణ : ఎమ్వీయల్ గారి మినీ కవితల్లాగే వాటికి పెట్టిన శీర్షికలు కూడా అద్భుతంగా ఉంటాయి. ధన్యవాదాలండీ!

వేణు చెప్పారు...

సురేష్ గారూ, అమెరికాలో ఉన్న మీరు ఈ టపా ద్వారా నూజివీడు జ్ఞాపకాలు తలపోసుకున్నారన్నమాట. బావుంది!

నూజివీడు అంటే నాకు ఇంగ్లిష్ లెక్చరర్ ఎం.ఎస్.అప్పారావు గారూ, బోటనీ లెక్చరర్ జాన్ గారూ , తెలుగు లెక్చరర్ RNR గారూ.. ఇలా ఎందరో గుర్తొస్తారు. ఇంకా- ద్వారక, సత్యనారాయణ థియేటర్లూ, పెద్ద గాంధీ బొమ్మ సెంటరూ.. ఇవన్నీ అలా సినిమా రీలులాగా గిర్రున తిరుగుతాయి.

మీ 'మ్యూజింగ్స్' బ్లాగు ఇప్పుడే చూశాను. నూజివీడు మామిడి పండు గురించి మీరు పద్యాలతో రాసిన టపా సరదాగా ఉంది. నూజివీడు అంటే మీకు అవధుల్లేని అభిమానం లా ఉందే!:)

తృష్ణ చెప్పారు...

ఇంకో మంచి విషయం చెబ్దామని మళ్ళీ వచ్చానండీ...M.V.L గారి అబ్బాయి ఇంజినీరింగ్ లో మా అన్నయ్య క్లాస్మేట్ ట...బాపూ గారి "స్నేహం" చిత్రానికి ప్రొడ్యూసర్ ఆయనేట..!
ఆఫీసయి వచ్చాకా రాత్రికేమన్నా ఎక్కువ వివరాలు చెప్తాడేమో అడగాలి.

వేణు చెప్పారు...

తృష్ణ గారూ, M.V.L గారి అబ్బాయి గురించి తెలియటం సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఎమ్వీయల్ రచనల జాబితా, అవి ఎక్కడ దొరుకుతాయీ అనే వివరాలు తెలుస్తాయేమో ప్రయత్నించగలరా?

చదువరి చెప్పారు...

జ్యోతిలో ఆయన శీర్షికను చదివేవాణ్ణి. ఆయన పేరు తలుచుకోగానే మందు గుర్తొచ్చేది. బహుశా ఆయన చమక్కుల్లో ఎక్కువ మందు గురించే ఉండేవేమో! ఎన్నో అరుదైన సంగతులను రాసారు. ఆయన గురించి పెద్దగా ఎక్కడ చదవలేదు కూడా. ఇంత వివరంగా చదవడం ఇక్కడే. నెనరులు.

ఆ "రేపు" పత్రికను నడిపిన సి. నరసింహారావు విజయానికి ఐదుమెట్ల లాంటి పుస్తకమేదో రాసారు. లక్ష కాపీలకు పైగా అమ్ముడైందని విన్నాను. తెలుగు పుస్తకాల్లో లక్షకు పైగా అమ్ముడైంది బహుశా అదొక్కటేనేమో! ఆయనే ఇప్పుడు టీవీల్లో పొద్దుటిపూట రాజకీయ విశ్లేషకుడిగా కనిపిస్తున్నారు.

నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి) చెప్పారు...

తణుకులో నన్నయ భట్టారక పీఠం వారు ఓసారి ఆయనని పిలిపించి ఆయనచే ఉపన్యాసం ఇప్పించారు. ఆయన ఆముక్తమాల్యద గొప్పదనాన్నిగురించి చెబుతూ
" తలబక్షచ్ఛటగుచ్చి బాతువులు కేదారంపు గుహ్యాంతర స్థలిన్ -- అనే పద్యాన్ని కడురమ్యంగా వర్ణించి చెప్పారు. అదిప్పటికీ నాకు గుర్తుంది.ఆయన వివరణ విన్నాకే ఆ కావ్యాన్ని చదవాలనిపించింది. మీరు వ్రాసిన పరిచయం ఆనాటి జ్ఞాపకాలను తట్టి లేపింది.ధన్యవాదాలు.

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

ఎమ్వీయల్ గారి ఆటోగ్రాఫ్ నా దగ్గరుందండోయ్.తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో చదువుచున్నప్పుడు మా కాలేజీకొచ్చినప్పుడు తీసుకున్నాను.

Gnana Prasuna చెప్పారు...

venu garu
mvl gurinchi meeru vraasinanduku chaalaa aanandinchaanu. ilaati pratyekamaina tapaalu eppudo kaani raavu. atanu spuradroopi.sanchinindaa kavitvam techchukoni tvara tvaragaa borlinchi chinnatanamlo ne paaripoyaadu. nuziveedu maa ammagaari puttillu. naa janma sthalamu ade! meeru varninchina vanni
naakallalloki vachchaayi. nuziveedante maamidipande!
gnanaprasuna

శ్రీ చెప్పారు...

ఏమ్విఎల్ గారి వర్ధంతి కి ఒక ప్రత్యెక సంచిక వేసారు అంది. అది మా పెదనాన్న గారి ఇంట్లో చూసాను దాదాపు పెదేళ్ళ క్రితం అనుకుంటా.. మా పెదనాన్నగారు అక్కడ బ్యాంకు లో పెద్ద పదవి లో ఉండటం వల్ల అందరితో బాగా పరిచాయ్లు ఉండేవి. మా అక్క వాళ్ళు ఈయన క్లాసు అంటే మిస్ అయ్యే వారే కాదు. ఇప్పటికి మా అక్కగారు తలుచుకుంటూ ఉంటారు అయన అంత బాగా చెప్పేవారు అని. ఈ రోజు పుస్తకం అవసరం ఉండేది కాదు అని చెప్పేవారు. ముత్యాల ముగ్గు కథా చర్చలు కొన్ని నూజీవీడు మామిడి తోటల్లో జరిగాయాని మా పెదనాన్నగారు అన్నారు . అయన గురించి సాహితి ప్రియులేవ్వరు మరిచిపోలేదు అండి .. ఇంకో మర్చిపోలేని వ్యక్తీ ఎన్. ఆర్ నంది గారు... నవోదయ రామోహనరావు గారిని అడిగి చూడండి ఏమ్విఎల్ గారి పుస్తకాల గురించి.. దొరికితే స్కాన్ చేసి నెట్ లో పెట్టి చూదాం మనలాంటి వాళ్ళకోసం ...

సుజాత చెప్పారు...

చదువరి గారు,
వ్యక్తిత్వ వికాసం పుస్తకం రాసిన నరసింహారావు గారు, పొద్దున్నే టీవీలో కనిపించే నరసింహారావు గారు ఒక్కరే అనేది నాకు కొత్త సమాచారం. ధన్యవాదాలు. ఈయనే రేపు సంపాదకులనే విషయం కూడా తెలీదు.

జ్ఞానప్రసూన గారు,
"సంచినిండా కవిత్వం తెచ్చుకొని త్వర త్వరగా బోర్లించి చిన్న తనంలోనే పారిపోయాడు" ఎంత బాగా చెప్పారండీ! చాలా ఆవేడనతో రాసినట్లున్నా, ఎంతో అర్థ వంతంగా రాశారు. మా అమ్మ కూడా ఇలాగే ఆయన రాతల్లోని "పన్" ని తల్చుకుని ఎంవీయెల్ గారు పోయినపుడు ఎంతో బాధ పడ్డారు.

మనసుని తాకే రచనలు చేసిన వారు చిన్నతనంలోనే లోకం విడిచి పారిపోయినా వారిని అంత త్వరగా సాహితీ మిత్రులు మర్చిపోరనడానికి ఈ టపా, దాని వ్యాఖ్యలే నిదర్శనం!

వేణూ, మరో సారి ధన్యవాదాలు మీకు!

వేణు చెప్పారు...

చదువరి గారూ,
ఎమ్వీయల్ గారి గురించి నాకు తెలిసిన సంగతులు.. అవి కూడా పాతికేళ్ల క్రితానివి జ్ఞాపకం చేసుకుంటూ రాశాను. ఆయనతో వ్యక్తిగత పరిచయం ఉన్నవారు ఎవరైనా రాస్తే మరింత బావుంటాయి. మీ స్పందనకు ధన్యవాదాలు.

తెలుగులో సైకాలజీ గురించి తొలిసారి వచ్చిన ప్రత్యేక మాసపత్రిక ‘రేపు’. ఎంతో ఆసక్తిగా ఉండేది ఈ మ్యాగజీన్. దీని సంపాదకుడు సి.నరసింహారావు రచన పేరు ‘వ్యక్తిత్వ వికాసం’. ఇది మొదట జ్యోతిలో ధారావాహికగా వచ్చి, తర్వాత పుస్తకంగానూ, ఆడియో రూపంలోనూ వచ్చింది.


నరసింహ (వేదుల బాలకృష్ణమూర్తి) గారూ,
ఎమ్వీయల్ గారికి ప్రాచీన, ఆధునిక సాహిత్యాలతో బాగా పరిచయం ఉంది. ఆయన వక్తగా కూడా చాలా ప్రసిద్ధుడు. నా టపా గురించి మీ అభిప్రాయానికి ధన్యవాదాలు.

చిలమకూరు విజయమోహన్ గారూ,
నేను నూజివీడు కాలేజీలో రెండేళ్ళు చదివినా ఎమ్వీయల్ గారి ‘ఆటోగ్రాఫ్ ’ తీసుకోలేదండీ. మీ వ్యాఖ్యకు థాంక్యూ!

వేణు చెప్పారు...

జ్ఞాన ప్రసూన గారూ,
ఎమ్వీయల్ గారి గురించి రాసిన టపా మీకు నచ్చటం సంతోషం కలిగిస్తోందండీ. ఆయన గురించి రెండు వాక్యాల్లో అయినా బాగా చెప్పారు మీరు. నిజమే- ఆయన స్ఫురద్రూపి. కవితామృత పానం చేసే కవికుమారుడిలా కనిపించేవారు. నా టపా మీ జన్మస్థలి స్మతులు గుర్తొచ్చేలా చేసిందన్నమాట. మీ స్పందనకు ధన్యవాదాలు.

వేణు చెప్పారు...

శ్రీ గారూ,
ఎమ్వీయల్ వర్థంతి ప్రత్యేక సంచిక చూళ్ళేదండీ. క్లాసులో ఆయన పాఠాలు విన్నవారు ఎవరూ అంత త్వరగా ఆయన్ను మర్చిపోలేరు. ఈసారి విజయవాడ వెళ్ళినపుడు నవోదయ రామ్మోహనరావు గారిని కలిసి, ఎమ్వీయల్ గారి పుస్తకాల సంగతి అడుగుతాను. థాంక్యూ!

వేణు చెప్పారు...

@ సుజాత :
జ్ఞాన ప్రసూన గారి అభిప్రాయంలోని ఆర్ద్రతను మీరు చక్కగా వ్యాఖ్యానించారు. ఎమ్వీయల్ గారి రాతల్లో ‘పన్ ’తల్చుకుని ఆనందించేవారిలో మీ అమ్మగారి లాంటివాళ్ళు ఉన్నారంటే ఆయన రచనల ప్రభావం ఒక తరానికే పరిమితం కాదని అర్థమవుతోంది. థాంక్యూ!

మురళి చెప్పారు...

వేణు గారూ.. కొంచం ఆలస్యంగా వచ్చాను.. ముళ్ళపూడి వారి రచనల్లో ఎమ్వీల్ అని చదవడమే తప్ప ఆయన గురించి ఎక్కువగా తెలీదు నాకు.. చాలా బాగుందండి టపా...

వేణు చెప్పారు...

థాంక్యూ మురళీ ! ఎమ్వీయల్ గారి పూర్తి రచనల జాబితాయే దొరకటం లేదు. ఇక వాటి ప్రచురణల సంగతి పట్టించుకునేదెవరో.... ఇంటర్నెట్ లో సినీ నిర్మాత గా ఆయన వివరాలు చాలా క్లుప్తంగా కనిపిస్తున్నాయి. రచయితగా మాత్రం కాదు!

దుప్పల రవికుమార్ చెప్పారు...

చాలా చక్కటి పరిచయం. ఇన్నాళ్లూ ఇంత మంచి బ్లాగు ఎలా మిస్ అయ్యానో కదా! ఇక ప్రతి రోజూ ఇక్కడికొస్తా.

వేణు చెప్పారు...

దుప్పల రవికుమార్ గారూ,
ఎమ్వీయల్ గురించి రాసిన టపా మీకు నచ్చినందుకు
సంతోషంగా ఉంది. నా బ్లాగుపై మీ అభిప్రాయానికి.. థాంక్యూ!

అజ్ఞాత చెప్పారు...

Baagundi.

వేణు చెప్పారు...

అజ్ఞాత గారూ, ఎమ్వీయల్ గారి గురించి రాసిన టపా పై మీ అభిప్రాయానికి ధన్యవాదాలు!

భావన చెప్పారు...

ఈ పోస్ట్ నేను మిస్ అయ్యాను అయ్యో. ఎంత బాగా వివరించేరు మా చిన్నప్పుడు ఎం వీ ల్ గారి గురించి విన్నాను అంతే. అధ్బుతం గా వుందండీ టపా.. పదాలతో విరుపులు ఎంత హాస్యం గా వుంటాయో కదా. ఒక సారి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే (4 గంటలు డ్రైవ్ చేసి వెళ్ళెము) నా కొడుక్కి ఆకలి గా వుంది అన్నం అయ్యిందా అని అడుగుతున్నా నా ఫ్రెండ్ ని, పక్కనే వున్న నా ఫ్రెండ్ వాళ్ళ ఆయన 'నా కొడుక్కి ' అలా కాలాల్సిందే తినమన్నపుడు తినడు కదా అన్నాడు. అబ్బ ఎంత సేపు నవ్వుకున్నామో అందరం ఆ శ్లేష కు. బోలెడన్ని ధన్య వాదాలు..

రవి చెప్పారు...

చాలా బాగా రాశారు. ఆంధ్రజ్యోతిలో అప్పట్లో ఏదో శీర్షిక నిర్వహించే వారనుకుంటారాయన. పేరు గుర్తు రావడం లేదు కానీ, రెగ్యులర్ గా చదివే వాణ్ణి. ఆయన వద్ద రెండేళ్ళు చదివి భలే అనుభవాలు మూటగట్టుకున్నారు.

వేణు చెప్పారు...

భావన గారూ,

ఎమ్వీయల్ గారి పోస్టుపై మీ అభిప్రాయానికి ధన్యవాదాలండీ. పదాల విరుపులతో ఆయన చేసే శ్లేషాలంకారాలు ఎంతో చమత్కారంగా ఉండేవి!

వేణు చెప్పారు...

రవి గారూ,

ఎమ్వీయల్ గారు ‘యువజ్యోతి’ కాకుండా ఆంధ్రజ్యోతిలో మరో శీర్షిక కూడా నిర్వహించారా? అప్పట్లో రెగ్యులర్ గా ఆ వీక్లీని చూసేవాణ్ణి కాదు. అందుకే తెలియదు.

నా పోస్టుపై మీ స్పందనకు ధన్యవాదాలు!