సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

16, జులై 2010, శుక్రవారం

అద్భుతమైన తెలుగు సినిమా లోగోలు!

గంగాధర్
తెలుగు సినిమాల పేర్లు కొన్నిటిని గుర్తు చేసుకోగానే ఆకట్టుకునే వాటి ‘లోగో’లు వెంటనే గుర్తొచ్చేస్తాయి. అలనాటి పబ్లిసిటీ ఆర్టిస్టుల గొప్పతనమది! (లోగో అంటే  అక్షరాలంకరణ అని అర్థం చెప్పుకోవచ్చు).

తెలుగు సినిమా పబ్లిసిటీని ఒక కళగా తీర్చిదిద్ది,  ప్రాచుర్యం కల్పించి, ఉన్నత స్థాయికి చేర్చిన చిత్రకారుల్లో గంగాధర్, ఈశ్వర్ అగ్రశ్రేణిలో నిలుస్తారు.

 గంగాధర్ ఆరేళ్ళ క్రితం చనిపోయారు.


ఆయన సంతకమే విలక్షణం.  హిందీ అక్షరాల మల్లే అడ్డంగా ఓ గీత... దాన్ని తాకుతూ అందమైన, ముత్యాల్లాంటి తెలుగు అక్షరాలు!  ‘గ’ తర్వాత మొదటి సున్నా.. పై గీతను తాకదు గానీ,   తర్వాత సున్నా ‘గా’ అక్షరాన్ని స్ఫురింపజేస్తూ గీతను తాకుతూ అర్థవంతంగా ఉంటుంది. చివర్లో మరో సున్నా... ఆ సున్నా తాకే  గీత పై మరో  గీత  స్టైల్ గా.. ‘ర్’ని తలపిస్తూ!

ఈ గంగాధర్ సంతకాన్ని ప్రాక్టీస్ చేయటం భలే సరదాగా ఉండేది, చిన్నప్పటి రోజుల్లో!

యన రూపొందించిన సినిమా లోగోలంటే నాకు ప్రత్యేకాభిమానం.

దానవీరశూర కర్ణ, అమరదీపం, బొట్టు కాటుక, శంకరాభరణం, ఏకలవ్య, విప్లవశంఖం.. ఈ సినిమాల  లోగోల  రూపకర్త గంగాధరే.  కోడెనాగు సినిమా లోగో కూడా ప్రత్యేకంగా ఉంటుంది. 

సినిమా సారాన్నీ, స్వభావాన్నీ సాధ్యమైనంతవరకూ  లోగోలోకి తీసుకురావటమే ఈ లోగోల ప్రత్యేకత.

అన్ని లోగోల గురించీ వివరించను కానీ, ఎంతో  ప్రత్యేకత  ఉన్న ఒక సినిమా లోగో గురించి మాత్రం చెప్తాను.  గంగాధర్ అనితర సాధ్యంగా దీన్ని రూపొందించారు.


1979లో తీసిన ‘బొట్టు కాటుక’ సినిమా అది. మురళీమోహన్, మాధవి నాయికా నాయకులు. నిర్మాణ సంస్థ శ్యామ్ ప్రసాద్ ప్రొడక్షన్స్. ఈ సంస్థ నిర్దేశకుడు విజయబాపినీడు . ఆయనకు పత్రికా రంగంలో అప్పటికే  పేరుంది. అభిరుచితో ఆయన ఓకే చేసిన లోగో ఇది.

లోగోను ఇక్కడ చూపించి, దాని గురించి చెప్పటమే సరైంది. కానీ ‘బొట్టు కాటుక’ లోగో కోసం ఎంత ప్రయత్నించినా దొరకలేదు. అందుకే ఆ లోగో ఎలా ఉంటుందో  చేతనైనంతవరకూ వర్ణించటానికి ప్రయత్నిస్తాను.

గుండ్రటి బొట్టు ఆకారంలో ‘బొట్టు’అనే రెండక్షరాలూ ఒదిగిపోయాయి.
మిగిలింది- కాటుక. ‘కా’ అక్షరాన్ని ఎడమ  కన్నుగా, ‘టు’ను ముక్కుగా వేసి, ‘క’ను కుడి  కన్నుగా వేశారు.

చూడగానే ఓ స్త్రీ మూర్తి ముఖం కదా అనిపిస్తుంది. కొంచెం పరిశీలించి చూస్తే... ‘బొట్టు కాటుక’ అనే అక్షరాలు కనిపిస్తాయి.  చిత్రకళాభిమానులకు అప్పట్లో  గొప్ప ‘థ్రిల్’ని కలిగించిందీ లోగో! 

ఈ లోగో కళాత్మకంగా ఉన్నప్పటికీ సామాన్య ప్రేక్షకులకు అర్థం కాదని , వేరే  లోగో వేయించి, దాన్నే వాల్ పోస్టర్లలో  వాడారు, పబ్లిసిటీలో.
 మార్చిన లోగో రెండు కళ్ళపై వంపు తిరిగి బాగానే ఉంది కానీ, మొదట వేసిన లోగో తో పోలిస్తే ఏమాత్రం నిలవదు!

ఈ లోగో కథ అప్పట్లో సినీ వార పత్రిక ‘జ్యోతి చిత్ర’లో పూర్తి పేజీలో ప్రచురించారు. మొదట ఈ సినిమా కోసం ఏ లోగోలను గంగాధర్ వేశారో వాటిని కూడా ఇచ్చారు. కళాత్మకమైన లోగో  తొలి రూపం, దాన్ని ఇంప్రూవ్ చేసి, ఎలా రూపుదిద్దుకుందీ .. చివరికి ఏ లోగో ఖరారు చేసిందీ... ఆ పరిణామ క్రమమంతా  చక్కగా అందించారు.

30 ఏళ్ళు దాటినా తెలుగులో  ఈ స్థాయి లోగోను నేనెక్కడా చూడలేదు!

ఇప్పడొస్తున్న సినిమా లోగోల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. దాదాపు అన్నీ  మూసలోనే ఉంటున్నాయి.  ఏ లోగో అయినా ఒకే రకంగా, ఎడమవైపు కిందభాగం నుంచి మొదలై కుడివైపు పైభాగానికి ఏటవాలుగా వెళ్తుంది. సినిమాను  తల్చుకుంటే లోగో పొరపాటున కూడా గుర్తుకురాదు.

అసలు తెలుగు సినిమా పబ్లిసిటీ లో ‘కళ’ ఏనాడో అంతరించిపోయిందని నిరాశ కలుగుతోంది!

18 వ్యాఖ్యలు:

అజ్ఞాత చెప్పారు...

Interesting. Thank you.

సుజాత చెప్పారు...
ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.
వేణు చెప్పారు...

విజయ్! థాంక్యూ!

సుజాతా! చిత్రకారుడు గంగాధర్ గురించి మరో టపా రాయటానికి సరిపడా సమాచారం, ఇలస్ట్రేషన్లూ నా దగ్గర ఉన్నాయి. గంగాధర్ సంతకం గురించిన మీ సూచనకు ధన్యవాదాలు! దాన్ని ఈ టపాలోనే ఇస్తున్నాను.

వీరుభొట్ల వెంకట గణేష్ చెప్పారు...

Nice post sir.

శివ చెప్పారు...

చాలా కాలానికి మల్లి మీ బ్లాగు చూసాను. మంచి వ్యాసం వ్రాసారు. గంగాధర్ గారి గురించిన పూర్తి వివరాలు వ్రాయండి వేణూగారూ.

Sitaram చెప్పారు...

వేణు గారు..
మంచి వెరైటి అంశం మీద పోస్ట్ రాసారు. దీన్ని 'ఈనాడు''ఆదివారం అనుబంధం'లో ఒక వ్యాసంగా వేస్తె బాగుంటుంది.
రాము
apmediakaburlu.blogspot.com

చెప్పు దెబ్బలు-పూలదండలు చెప్పారు...

Very nice.Write a post about Eeswar also.

కమల్ చెప్పారు...

వేణుగారు. గంగాధర్ గారి గురించి మంచి వ్యాసం అందచేసారు, బెంగళూర్‌లో ఉన్నప్పుడు నేను ఆయనతో కొన్ని రోజులు ఒక కథ కోసం చర్చాలు చేసిన అనుభవం ఉన్నది..ఇప్పటికి వారి కుమారుల కుటుంబంతో నాకు పరిచయం ఉన్నది. చాలా సున్నిత హృదయులు..ఆయన కొన్ని సినిమాలకి దర్శకత్వం చేయాలని సంకల్పించారు కాని..అవి తీరకుండానే మరణించారు.

Rishi చెప్పారు...

Good and informative post on diff topic.

వేణు చెప్పారు...

@ వీరుభొట్ల వెంకట గణేష్ : ధన్యవాదాలండీ.

@ శివ: థాంక్యూ. గంగాధర్ చిత్ర కళానైపుణ్యం గురించి తప్పకుండా మరో టపా రాస్తాను.

@ Sitaram : థాంక్యూ.

వేణు చెప్పారు...

@ చెప్పుదెబ్బలు-పూలదండలు : ఈశ్వర్ గారి గురించి కూడా టపా రాయమంటారా? ప్రయత్నిస్తానండీ. ధన్యవాదాలు.

@ కమల్ : గంగాధర్ తో మీ పరిచయం సంగతి తెలిపినందుకు సంతోషం. థాంక్యూ.

@ Rishi: ధన్యవాదాలండీ.

రవి చెప్పారు...

interesting. అమరదీపం సినిమా నేను చిన్నప్పుడు చూసినట్టున్నాను.

బొట్టు కాటుక యాడ్ బొమ్మరిల్లు పత్రికలో చూసినట్టు గుర్తు. నేనూ సినిమా లోగోలు తెల్ల పేపర్ పై రాసే వాణ్ణి.

చదువరి చెప్పారు...

మంచి వ్యాసం! గంగాధరు గారిదీ, ఉత్తమ్ గారిదీ (అప్పట్లో ఆంధ్రభూమిలో బొమ్మలేసేవారు) సంతకాలను నేనూ ప్రాక్టీసు చేసేవాణ్ణి.

వేణు చెప్పారు...

రవి గారూ,
బొమ్మరిల్లు పత్రిక్కి విజయబాపినీడు ఎడిటర్ కాబట్టి ఆ పత్రికలో ‘బొట్టు కాటుక’ యాడ్ వచ్చేవుంటుంది. సినిమా లోగోలను కాగితంపై రాసే అలవాటు నాకు బాగా ఉండేది, మీలాగే :)

చదువరి గారూ,
థాంక్యూ. గంగాధర్ సంతకంతో పాటు పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ సంతకాన్ని కూడా బాగా ప్రాక్టీస్ చేసేవాణ్ణి.

DARPANAM చెప్పారు...

వేణు గారూ,
లోగోల గురించి మీరు చెప్పింది నిజం
ఈమధ్య కాలంలో మంచి లోగోలు రాలేదనే
చెప్పాలి. లోగోను చూడగానే అనుభూతికి
లోనయ్యేవాళ్లం ,కంచుకోట,అండమానమ్మాయి,మీరుచెప్పిన
బొట్టూకాటుక,ఒకటేమిటి పోస్టర్ చూడగానే లోగో యే
థియేటర్ కి రప్పంచేది నేను గంగాధర్ అభిమానిని

వేణు చెప్పారు...

@ DARPANAM : ధన్యవాదాలండీ. సినిమా లోగోల విషయంలో దర్శక నిర్మాతల్లో ఇప్పుడు అంత శ్రద్ధ కనిపించటం లేదెందుచేతనో!

రమణ మూర్తి చెప్పారు...

వేణు గారూ - వ్యాసం బాగుంది. గంగాధర్ గురించి ఇంకా కూడా రాయగల విషయం మీ దగ్గర ఉందనిపిస్తోంది.

లోగోలకి మించి - గంగాధర్ గీసిన బొమ్మలు మనిషిని కదలనివ్వవు. అవుట్ లైన్ ద్వారా కాకుండా షేడ్స్ తో షేప్ తెప్పిస్తారాయన. అలా అని ఆ షేడ్స్ కూడా కొట్టొచ్చినట్టు కనిపించవు. సూచనామాత్రంగా మాత్రమే ఉంటాయి !

వేణు చెప్పారు...

రమణమూర్తి గారూ, థాంక్యూ. గంగాధర్ ఇలస్ట్రేషన్స్ గురించి టపా రాస్తాను, వీలైనంత త్వరలో!