సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

24, ఆగస్టు 2010, మంగళవారం

ఏళ్ళు గడిచినా వెంటాడుతున్న ‘చందమామ’ పాట!

బ్లాగులో ‘చందమామ’ అని  ప్రస్తావిస్తే ‘చందమామ పత్రిక’ గురించి రాస్తున్నానని చాలామంది నిర్ధారణకు వచ్చేస్తారని ఓ అనుమానం. అందుకే ఈ పాట   టపా  రాయాలని ఎప్పట్నుంచో అనుకుంటూ కూడా జాప్యం చేసేశాను!

 నా చిన్నప్పుడు ఎప్పుడు మొదటిసారి విన్నానో గానీ, ‘చక్కనయ్యా చందమామా’పాట నా మనసుకు  పట్టేసింది. బాల్యంతో పెనవేసుకున్న పాటలు స్మృతి పథంలో ఎప్పటికీ చెక్కుచెదరకుండా ఉంటాయి కదా!

‘భార్యాబిడ్డలు’ లోని ఆ పాట సన్నివేశం నాకు చాలా సంవత్సరాల దాకా తెలియదు. కానీ  గాఢమైన వేదన, అపరిమితమైన దు:ఖం నాకు ఆ పాట బాణీలో, పాడిన తీరులో  స్ఫురించాయి.

దీంతో  నాకు తోచిన సందర్భమేదో ఊహించుకున్నాను.


ఆత్మీయులైన వ్యక్తి ఎవరో  దూరమై (చనిపోయారనే నా ఉద్దేశం) తల్లడిల్లుతూ తీరని పరివేదనతో పాడుకున్న పాట అని భావించాను. వాళ్ళ స్థానంలో నన్ను ఊహించుకుని, ఆ శోకాన్ని పంచుకున్నాను. అలా ఆ పాట మీద అనుకోకుండానే  బంధం పెంచుకున్నాను.

అప్పట్లో సినిమా పాటలు వినాలంటే రేడియోనే కదా ఆధారం! వివిధ భారతిలోనో, విజయవాడ  ఆకాశవాణి కేంద్రంలోనో   అనౌన్సర్  ‘.. చిత్రం పేరు ‘భార్యా..’ అని చెప్పగానే ‘భార్యాబిడ్డలు’ ఏమో, నా కిష్టమైన ఈ పాట వస్తుందేమోనని ఆత్రుతగా ఎదురుచూసేవాణ్ణి.

కానీ 90 శాతం ఆ సినిమా ‘భార్యాభర్తలు’  అయ్యేది. ‘జోరుగా హుషారుగా’ అంటూ సరదా పాట మొదలై, విషాదగీతం కోసం ఆత్రంగా ఎదురుచూసే  నాకు తగని నిరుత్సాహం కలిగేది. :) 

టీవీలు వచ్చాక, ఆ పాట సన్నివేశం చూశాను. సినిమాలోని సందర్భమూ, నేను ఊహించుకున్నదీ  వేర్వేరు  అని అర్థమైంది. చిన్నపిల్లలు తండ్రి ఆచూకీ కోసం వెతుకుతూ  చేసే  ఈ గానం హృదయాన్ని కదిలిస్తుంది. ‘ఏ రాణి వాసములోన చేరి రాజువై నావో.. రాలేకవున్నావో ..’ అనే వాక్యం ప్రేక్షకుల కోసం అనిపిస్తుంది. ఆ భావం పిల్లల స్థాయిలో లేదేమో అనుకుంటాను.          

ఈ పాటలో సుశీల గొంతులో కంటే వసంత స్వరంలో నాకు విషాదం చాలా కనపడుతుంది. ఆత్రేయ రాసిన ఈ పాటకు  కె.వి.మహదేవన్ స్వరాలు కూర్చారు.

‘నీవు లేక’ తర్వాత ‘దిక్కులేని’ అని ఉంటుంది కదా! కానీ నేనైతే  ‘దిక్కు లేక’ అని అప్రయత్నంగా పాడేసుకునే వాణ్ని. తర్వాత నా పొరపాటు  గమనించి సరిచేసుకున్నా.


పాట ఇక్కడ వినండి...

     Get this widget |     Track details  |         eSnips Social DNA   



చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ
నీవు లేక దిక్కులేని చుక్కలైనామూ

మొన్న పున్నమి రాతిరి నీ  ఒడిని నిద్దురపోతిమి
తెల్లవారి లేచి చూచి తెల్లబోయామూ.. గొల్లుమన్నాము   /చక్క/

మబ్బు మబ్బు మాటున ఈ మసక చీకటి చాటున
బిక్కు బిక్కున దిక్కులన్నీ తిరుగుతున్నామూ..
వెతుకుతున్నామూ                                                      /చక్క/

దారి తప్పి పోతివో నీ వారి సంగతి మరచినావో
ఏ రాణి వాసములోన చేరి రాజువై నావో..
రాలేకవున్నావో ..                                                        /చక్క/
 

                                  ****

పాట  పల్లవిలోని విషాదం ‘చందమామ పత్రిక’ను తల్చుకున్పపుడు కూడా వర్తిస్తుందనిపిస్తోంది. అలనాటి పత్రికను తల్చుకుంటూ ‘చక్కనయ్యా చందమామా ఎక్కడున్నావూ’ అనుకోవాల్సిందే!

‘చందమామ’ పూర్వవైభవం దశాబ్దాల క్రితమే కోల్పోయినప్పటికీ  ఈ మధ్య వస్తున్న  సంచికలు మరీ నిరాశను కల్గిస్తున్నాయి.

అసలు ప్రచురణ కేంద్రమే చెన్నై నుంచి ముంబాయి కి మారిపోయింది... తెలుగు నేల నుంచి మరింత దూరంగా!

ఫొటో వ్యాఖ్యల పోటీ పేజీని తీసెయ్యటంతో అసందర్భంగా, హఠాత్తుగా సంచికకు  ముగింపు వచ్చేసినట్టు అనిపిస్తోంది. అసలు బేతాళ కథ చివర (కల్పితం) అని లేకపోతే ఏం బావుంటుంది చెప్పండి? ఆ మాట తీసేశారు.

వ.పా. ముఖచిత్రంతో తాజా సంచిక

చిత్రా, శంకర్ ల పేజీ నిడివి  బొమ్మలు ఇవే ( ‘చందమామ’ సౌజన్యంతో)
తాజా సంచికలో వ.పా. ముఖచిత్రం, లోపల చిత్రా, శంకర్ ల బొమ్మలు చూసి తృప్తిపడాల్సివస్తోంది.

అయితే- నాకు నచ్చిన ఒకే మార్పు.. పేజీ నిడివి పెద్ద బొమ్మలను పునరుద్ధరించటం. వాటిని చూస్తుంటే ఎంతో  సంతోషంగా ఉంటుంది!


                                   ****



నేటి ‘ఈనాడు’ పత్రిక చూశారా?  ఈ వార్త చదవండి!




పౌర్ణమి అయినప్పటికీ  ‘చిన్నబోయి’ కనపడబోతున్నాడట...  చంద్రుడు ఈ రాత్రి!

కాకతాళీయమైనప్పటికీ ఈ టపాలో అంశానికీ,  దీనికీ సారూప్యం కనపడింది! :)

15 కామెంట్‌లు:

విజయవర్ధన్ (Vijayavardhan) చెప్పారు...

చంద్రుడు shrink అవుతున్నాడని ఈ మధ్యనే సాక్ష్యాలతో కనుగొన్నారు:
http://physicsworld.com/cws/article/news/43534

Ravi చెప్పారు...

నా చిన్నతనంలో మా నాన్నగారి దగ్గర దాదాపు 150 దాకా పాత పాటల క్యాసెట్లు ఉండేవి. అలా నాకు పాతపాటల మీద బాగా ఆసక్తి కలిగింది. ఈ పాటలో సుశీల గారి గొంతులో వినిపించిన భావుకత నా మీద కూడా చెరగని ముద్ర వేసింది. అందుకే ఇలాంటి పాట విన్నప్పుడల్లా నా మనసు నాకు తెలియకుండానే బాల్యం వైపు పరుగులు తీస్తుంది.

రాధిక(నాని ) చెప్పారు...

బాగుందండి .

సుజాత వేల్పూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
వేణు చెప్పారు...

విజయవర్థన్ గారూ! మీరిచ్చిన లింక్ ఆసక్తికరంగా ఉంది. చంద్రుడు కుంచించుకుపోతున్నాడంటే.. ‘అయ్యో!’ అనిపిస్తోంది!

వేణు చెప్పారు...

రవిచంద్ర గారూ! ‘చక్కనయ్యా చందమామ’ పాటలో నాకు వసంత గాత్రం నచ్చితే- మీకు సుశీల గొంతు నచ్చిందన్నమాట! మీకు బాల్యాన్ని గుర్తు చేసే పాటల్లో ఇదీ ఒకటని తెలియటం సంతోషాన్నిస్తోంది. థాంక్యూ!

రాధిక (నాని) గారూ! ధన్యవాదాలండీ.

వేణు చెప్పారు...

సుజాత గారూ! ‘చక్కనయ్యా చందమామా’ పాటలో ధ్వనించే విషాదం చిన్నతనంలోని ఊహపోహలతో మిళితమై ఈ పాటంటే తెలియని ఆసక్తీ, ఇష్టమూ ఏర్పడ్డాయి నాకు.

ఇక మీరు చెప్పిన సినీ బాణీల భజన పాటల సంగతి. ద్వంద్వార్థాల కమర్షియల్ పాటలను కూడా వదలకుండా ఆ ట్యూన్లకు భక్తి పదాలు పేర్చి ధైర్యంగా మైకుల్లో పాడేస్తుంటే... ఆ సాహసానికి నవ్వాలో చిరాకుపడాలో కూడా ఒక్కోసారి అర్థం కాదు!

Sudha Rani Pantula చెప్పారు...

వేణుగారూ,

చక్కనయ్యా చందమామ పాట నాకుకూడా చాలా ఇష్టంగా ఉండేది చిన్నప్పుడు...ఇప్పుడుకూడా పున్నమి రాతిరి అనే పదం వినిపించినప్పుడల్లా ఈ పాట గుర్తొస్తుంది.
అయితే చిన్నప్పుడు ఈ సినిమా నేను చూసాను. అందువల్ల సందర్భంకొంచెం తెలుసు. ఆ పిల్లలు వాళ్ళనాన్నను వెతుక్కుంటున్నారని ఆపాట విన్నప్పుడల్లా ఆ పిల్లలంత బెంగా నాక్కూడా ఉండేది.

వేణు చెప్పారు...

సుధ గారూ! ఈ పాట గురించి మీ అనుభూతిని పంచుకున్నందుకు ధన్యవాదాలండీ.

GKK చెప్పారు...

వేణు గారు! చందమామ నిజంగాను, పత్రికసైజు కూడా చిన్నదిగా అవటం భలేగా ఉంది.

మిమ్మల్ని ఒక విషయం ఎప్పటినుంచో అడగాలనుకున్నాను. చందమామలో ’jaya' అని ఒక artiste బొమ్మలు గీసేవారు. ఆయన/ఆమె వివరాలు చెప్పగలరా. ఎంతో అందంగా గీసేవారు. ముఖ్యంగా మాచిరాజు కామేశ్వరరావు కథలకు జయ వేసే బొమ్మలు అద్భుతంగా ఉండేవి.

వేణు చెప్పారు...

తెలుగు అభిమాని గారూ,

చందమామలో బొమ్మలు వేసిన Jaya వివరాలు నాక్కూడా తెలీవండీ.
ఆయన దాసరి సుబ్రహ్మణ్యం గారి చివరి సీరియల్ ‘భల్లూక మాంత్రికుడు’ కు బొమ్మలు వేశారు. అప్పటికే మంచి బొమ్మలు వేసి, తనను నిరూపించుకున్న Jaya ను చందమామ యాజమాన్యం కూడా చిత్రా వారసుడుగా గౌరవించినట్టు అనిపిస్తుంది. ఆ బొమ్మలు ‘చిత్రా’ స్థాయిలో లేకపోయినప్పటికీ చక్కగానే ఉన్నాయి. పైగా Jaya చక్కని ప్రయోగాలూ చేశారు. విహంగవీక్షణం కోణంలో... ఎంతో ఎత్తు నుంచి కనిపించేలా ఆయన వేసిన కోట ముఖద్వారం బొమ్మ నన్నెంతో అబ్బురపరిచింది. పేజీ నిడివి బొమ్మల్లో మాత్రం Jaya చిత్రా మాదిరిగా ఆకట్టుకోలేకపోయారు.

Jaya లైన్ నాకు చాలా పర్ఫెక్ట్టుగా, స్ట్ర్రెయిట్ గా... ఉంటుంది. మరో ఆర్టిస్ట్ Razi లైన్ కంటే ఇదే నాకు బాగా నచ్చుతుంది.

kanthisena చెప్పారు...

క్షమించాలి వేణుగారూ, మీ కథనం చాలా ఆలస్యంగా ఇప్పుడే చూస్తున్నాను. దాదాపుగా బ్లాగ్ లోకంతో సంబంధాలు కోల్పోతున్న పరిస్థితి. విషయానికి వస్తే, చందమామ చిత్రకారులు జయ గారి గురించిన వివరాలు. ఆయన చాలా కాలం క్రితమే చందమామనుంచి వైదొలగి బయట కొన్నాళ్లు పనిచేశారు. ఉన్నవాళ్ల గురించే పట్టించుకోని చందమామ చరిత్రలో లేని వాళ్ల గురించిన ఊసు కూడా ఉండదు కదా. అలా ఆయన చందమామ చరిత్ర నుంచి కనుమరుగయ్యారు. చాలా కాలం జీవికకోసం పనిచేసిన తర్వాత ఆయన సంగీత వాయిద్యాల తయారీ రంగంలో కుదురుకున్నారు. ఇప్పుడు కూడా మద్రాసులో మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ రంగంలో షాపు పెట్టి నిర్వహిస్తున్నారని తెలిసింది

ఈ మధ్యే చందమామ ఎక్కౌంటెంట్‌గా సుపరిచితులైన రామారావుగారు ఈయన వివరాలు చెప్పారు. చందమామ ముఖచిత్రాలు చెయ్యితిరిగిన చిత్రకారుల వద్ద వేయించాలని ఈ మధ్య ప్రయత్నం చేసి జయ గారిని, కెసీ గారిని, సీతారాం గారిని సంప్రదించాలని ప్రయత్నించాము. కాని తాను చిత్రలేఖనం వదిలి పెట్టి సంగీయ వాయిద్యాల రూపకల్పనలో కుదురుకుపోయినందున మళ్లీ చిత్రలేఖన ప్రపంచంలోకి రాలేనని, పైగా చందమామ డెడ్‌లైన్ల ప్రకారం, టైమ్ ప్రకారం బొమ్మలు గీసి ఇవ్వాలంటే ఇప్పుడు నాకు కుదరదని జయగారు తేల్చి చెప్పేశారు.

kanthisena చెప్పారు...

నా ఉద్దేశంలో చందమామ, ప్రపంచం కూడా ఒక మంచి చిత్రకారుడిని మన చేతకానితనంతోనో ఈగోల దౌర్భాగ్యం కారణంగానో పోగొట్టుకుంది. ఇక రాజీ లేక రజీ గారు దాదాపు 20 ఏళ్ల పాటు చందమామలో బొమ్మలు వేశాక బయటకు పోయి స్వంతంగా పిల్లల పత్రికను నడిపి తర్వాత మూసివేశారట. ఆయన ఇప్పుడు లేరు 1990లలోనే పోయారని వినికిడి. ఇక కెసీ గారు హైదరాబాద్‌లోనే దినపత్రికల్లో కుదురుకున్నారని మంచి పొజిషన్లో ఉన్నారని తెలుస్తోంది. ఈ మధ్యనే ఆయనతో మాట్లాడటం జరిగింది. మళ్లీ చందమామ తనచేత బొమ్మలు గీయించుకోడానికి సిద్ధమవుతోందని తెలియగానే ఆయన చాలా సంతోషపడిపోయారు.

ఆయనతో, సీతారాంగారితో మాట్లాడాక ఫైనల్‌గా చందమామ యాజమాన్యం నుంచి ఆమోదం పొందడంలో విఫలమవడంతో వీరి చేత బొమ్మలు గీయించే కార్యక్రమం ప్రస్తుతానికి అటకెక్కింది. సీతారాం గారు ఇప్పటికీ తండ్రి మరణం వల్ల లభించిన చిన్నపాటి ప్రభుత్వోద్యోగం చేసుకుంటూనే దినమలర్ వంటి పత్రికలకు బొమ్మలు గీస్తున్నారు. ఈయన మూగవారు. రాజమండ్రి వాస్తవ్యులైన వీరి కుటుంబం మద్రాసుకు వలస వచ్చేసింది. ఆయన శ్రీమతి ముందుగా కథ చదివి చిత్రాల గురించిన వర్ణన వినిపిస్తే దాని ఆధారంగా బొమ్మలు వేస్తున్నారు. 2007 వరకు అడపా దడపా ఈయన తాత్కాలిక ప్రాతిపదికన చందమామ కథలకు బొమ్మలు వేసేవారు.

ఈ ఏప్రిల్ నెలలో చెన్నయ్ లోని తిరువాయన్మయూర్‌లో ఉన్న ఆయన ఇంటికి వెళ్లి కలిశాను. తిరిగి చందమామ పిలుస్తోంది అంటే ఆయన కళ్లలో మెరుపు. కాని చందమామ ఆయన సేవలను అందుకోలేక పోయింది. ఉన్న చిత్రకారులతోటే పని కానిచ్చేయమని పైవారి సలహా.

kanthisena చెప్పారు...

చందమామను ప్యాకెట్ సైజుకు తగ్గించి ఖర్చు తగ్గించు కోవాలని చూసిన ప్రయత్నాలు ఘోరంగా విఫలం కావడంతో మళ్లీ చందమామ పాత సైజులోనే నిండుగా 2011 జనవరి నుంచి కనిపించనుంది. నిన్ననే అందిన తాజావార్త. భూమి గుండ్రంగా ఉంటుంది అనేది ఎంత గొప్ప సత్యమో..

వేణు చెప్పారు...

రాజు గారూ,
విలువైన, ఆసక్తికర సమాచారం అందించారు.

చందమామ పత్రిక పాత సైజులో పున్నమి చంద్రుడి మల్లే మళ్ళీ నిండుగా కనిపించబోతోందనే వార్త సంతోషకరం. చిక్కిపోయి చిన్నబోయిన చందమామ పాఠకులను అసలేమాత్రం ఆకట్టుకునేలా లేదు. ఇలాంటి (అప)ప్రయోగాలు చేసేటప్పుడు ఏమీ ఆలోచించరల్లే ఉంది.

చిత్రకారుడు జయ అస్త్ర సన్యాసం, రజీ గారి మృతి వివరాలు విచారం కలిగిస్తున్నాయి. కేసీ గారి బొమ్మలు ‘బొమ్మరిల్లు’లో చాలా బాగుండేవి. ఆయన్ను తల్చుకుంటే కరాళ కథల లోగో గుర్తొస్తుంది!