సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

22, మార్చి 2011, మంగళవారం

బ్లాగ్ Vs బజ్!



‘నా వల్ల కాదు బాబోయ్...ఈ బజ్జులతో నేను వేగలేను’ అంటూ Buzzలో  విసుక్కున్నారో  బ్లాగర్ నిన్నటి రోజున. ఎందుకంటే- ‘శని ఆదివారాలు రెండురోజులూ మైల్ ఓపెన్ చెయ్యకపోయేసరికి ఈ రోజు అక్షరాలా 90 బజ్జులున్నాయి చూడడానికి...’!

తెలుగులో  బజ్జుల విజృంభణకు ఇదో  తాజా తార్కాణం!

‘ముందొచ్చిన బ్లాగుల కంటే వెనకొచ్చిన బజ్జులే  వాడి!’ అనొచ్చా? ప్రస్తుతానికి ఇలా అనటం  తొందరపాటూ, ‘టూ అర్లీ’ అవుతుంది కానీ, ఈ మధ్య కాలంలో  తెలుగు బ్లాగుల సంకలినుల్ని చూస్తుంటే నాకు ఆ ఒరిజినల్ సామెతే  గుర్తోస్తోంది.

నిన్న కూ, ఇవాళ్టికీ పెద్దగా తేడాలేమీ కనపడకుండా  - కథ ముందుకు సాగనంటూ  మొరాయించే టీవీ  డెయిలీ సీరియల్ మల్లే- బ్లాగ్ టపాలు భారంగా  కదులుతున్నాయి. ఒకప్పుడు టపాటపా దూసుకొచ్చేసి, పాత టపాలను వెనక్కి నెట్టేసే  కొత్త టపాలకు ఇప్పుడు గమనం అపురూపమై, మందగమనం స్వభావమైపోతోంది.

 పోనీ, వ్యాఖ్యలేవైనా  ఒకప్పటిలాగా శరపరంపరగా వచ్చేస్తున్నాయా అంటే అదీ లేదు.  వీటి తీరూ అంతే !



బ్లాగర్లు తమ టపాలనూ, వ్యాఖ్యాతలు తమ వ్యాఖ్యలనూ రాయటం అర్జెంటుగా  తగ్గించేసుకున్నారా అని అనుమానం వచ్చేలా తయారైన ఈ పరిస్థితికి కారణం....  బజ్జులనే నా నమ్మకం!

బజ్ ల మూలంగా మెయిల్ చెక్ చేసుకోవటం ఒకప్పటిలాగా కాకుండా  ఆసక్తికరంగా తయారయిందనేది కాదనలేని వాస్తవం. బజ్జులు చాట్ రూముల్లా సందడి చేస్తున్నాయి.  ఆట పాటలూ, కొత్త పరిచయాలూ, పాత జోకులూ, అభినయాలూ, అలకలూ..  అలవోకగా అక్షరరూపంలో కనిపిస్తున్నాయి.  బ్లాగు వ్యాఖ్యల్లాగా వీటికి  ‘ఓనర్’ అప్రూవల్ అవసరమే లేదు కదా!  సామూహికంగా, బహిరంగంగా సాగే ఈ  సంభాషణల్లో ... లైవ్ గా వచ్చేసే వ్యాఖ్యలను  చూస్తూ, వెంటనే  స్పందిస్తూ వాటిని తక్షణం చూసుకోగలిగే వెసులుబాటే  బజ్జులకు ఆకర్షణ తెచ్చిపెడుతోంది.

‘ఫలానా టపా రాస్తున్నాను, ఎలా రాస్తే బాగుంటుంది?’ అని బజ్ లో అభిప్రాయాలు తెలుసుకొని, టపాను చక్కగా తీర్చిదిద్దే  అవకాశముంది.

బజ్జుల్లో   ఎక్కువ భాగం మైక్రో బ్లాగింగ్ తరహానే!  ఒక చిన్న మాట,   వాక్యం  రాసేసి కూడా  అసంఖ్యాకమైన స్పందనలను పొందటంలో బజ్జులు ఆదరణ పొందుతున్నాయనిపిస్తోంది.

సరిగ్గా ఈ కారణం వల్లనే... ఎక్కువ సందర్భాల్లో  మన  విలువైన సమయాన్ని దారుణంగా  తినేసెయ్యటంలో బ్లాగులకు పెద్దన్నలాగా బజ్ తయారవుతోందనేది - నాణేనికి మరో వైపు!

కొత్తగా బ్లాగ్ లో  టపా  గురించి బజ్ లో లింకిచ్చామా...  బ్లాగుల్లో  వ్యాఖ్యల సంఖ్యను తగ్గించుకున్నట్టే!  బ్లాగు లో కామెంట్ రాయకుండా బజ్ ల్లోనే కామెంట్ రాస్తుంటారు చాలామంది. అలా వ్యాఖ్యలు  రెండు చోట్ల కు షేర్ కావటం ఏం బాగుంటుంది?

‘ఇవాళ తలనొప్పిగా ఉంది!’  అని బజ్ రాశామనుకోండీ...
కొందరు దాన్ని  publicly reshare చేస్తారు. కొంతమంది విచిత్రంగా  like  కూడా చేయవచ్చు.  కాసేపయ్యాక  వేరే టాపిక్ లోకి జంప్ చేస్తూ  స్పందనలు  మొదలవుతాయి. అలా అలా మనకు  ‘తలనొప్పి’ ఎగిరిపోతుందో లేదో గానీ, తలనొప్పి టాపిక్ మాత్రం ఎగిరిపోతుంది!   కాశీ మజిలీ కథల్లో ఉపకథలోని ఉపకథలోకి  వెళ్ళినట్టు  అవుతుంది పరిస్థితి !

బ్లాగు టపాలకు సంకలినులు ఉన్నట్టే... బజ్జులక్కూడా భవిష్యత్తులో  సంకలినులు వస్తాయేమో!

బజ్ లంటే   బృందాలుగా విడిపోయి, ఎవరికి వారు కబుర్లాడుకున్నట్టు నాకు  తోస్తుంది.   బ్లాగుల్లో అలా ఉండదు! అందుకే... నాకయితే  బజ్జుల కంటే బ్లాగులే  ఇష్టం !  (ఏ రాయి అయితేనేం-  అనకండి.... ) :)

అందుకే... నేను బజ్జుల్లో  రాయటం  చాలా తక్కువ. బ్లాగు టపాలు  నెలకొకటి తగ్గకుండా-  బాగానే  రాస్తున్నాను కదా: )

22 కామెంట్‌లు:

శరత్ కాలమ్ చెప్పారు...

నేనూ ఈ బజ్జుండటం గురించి పోస్టుదామనుకున్నా కానీ మీరు ఆల్రెడీ పోస్టేరు. చాలా వరకు మీ అభిప్రాయాలూ, అనుమానాలే నావీనూ. ఇంతవరకయితే బజ్జుల జోలికి అంతగా వెళ్ళలేదు - ఒక్క బజ్జూ రాయలేదు కానీ ముందు ముందు ఏమో.

సుజాత వేల్పూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఆ.సౌమ్య చెప్పారు...

బజ్జులలో పాల్గొనకుండానే ఇంత చక్కగా చెప్పారే బజ్జాయణం! ముందుగా నా వాక్యాలతో పోస్టు మొదలెట్టినందుకు ధన్యవాదములు :) నా ఆ బజ్జు మీకు స్పూర్తినిచ్చిందా ఏమిటి కొంపదీసి?

బజ్జూలలో పడితే టైం మాత్రం ఇట్టే అయిపోతుంది...బోలెడంత సమయం వృధా అవుతుందని తెలిసినా ఏమిటో ఇదొక దురలవాటులా ముదిరిపోయింది. కానీ సరదాగా ఉంది. కలిసి కబుర్లు చెప్పుకోవడం బలే బావుంది.

బ్లాగుల్లో కలిసి కబుర్లు చెప్పుకోవడం ఉండదు కదండీ అభిప్రాయాలు, భేదాలు తప్ప. అందుకే వెనకొచ్చిన బజ్జు ముద్దు. ఎంత ముద్దంటే బజ్జుల జోలికి రాని మీ చేత కూడా ఒక టపా రాయించింది :D.
కాకపొతే మీరన్నట్టు బజ్జు రాక వల్ల బ్లాగు కదలిక బాగానే మందగించింది.

Indian Minerva చెప్పారు...

కొంతమంది విచిత్రంగా like కూడా చేయవచ్చు. :D

సుజాత వేల్పూరి చెప్పారు...

కొంతమంది విచిత్రంగా like కూడా చేయవచ్చు. ....హ హ హ అవునవును

వేణు చెప్పారు...

@ శరత్ : మీ కంటే ముందే టపా రాసేశానా? థాంక్యూ... మీ అభిప్రాయాలకు!

@ సుజాత : > > మీరు పెద్దగా బజ్ లు రాయకుండానే, ఎక్కువ మందిని ఫాలో అవకుండానే బజ్ గురించి బాగానే పట్టించుకుంటున్నారే! >> అంతేనంటారా? బజ్జుల్లో పూర్తిగా మునిగిపోయివుంటే ఇలా టపా రాసే వీలు చిక్కేది కాదేమో!:)

వేణు చెప్పారు...

@ సౌమ్య: కొద్ది రోజులుగా అనుకుంటున్నానండీ, ఈ టపా రాయాలని. అయితే... నిన్నటి మీ బజ్ ... వెంటనే రాయటానికి స్ఫూర్తినిచ్చింది! మీకు ధన్యవాదాలు!

అన్నట్టు- ఈ టపాను నా బజ్ లో పెట్టి అక్కడ కామెంట్స్ ఎవరూ రాయకుండా డిజేబుల్ చేశాను! :)

@ Indian Minerva : :))

Malakpet Rowdy చెప్పారు...

LOLZ

We just had a discussion about Blogs vs Buzz last night on Bhaskara Ramaraju's buzz and Kumar thought Buzz is a threat to Telugu blogs.


బాగుందండీ బజ్జు పురాణం! బజ్జుల్లో పడి బజ్జోటం కూడా మానేసి కామెంట్లు రాస్తుంటారు తెల్సా!
______________________________________

GRRRRRRRRRRRRRRRRRRR Sujata. I know its about me.

Praveen Mandangi చెప్పారు...

Either buzz or blogs won't make any difference to me. ఖాళీగా ఉన్నప్పుడు బ్లాగులు, బజ్ చదువుతాను కానీ పని ఉన్నప్పుడు అవి చూడను. ఈ రోజు http://vizaghost.net/test/index.html దీని గురించిన పనిలో పడి బ్లాగులు చూడలేదు. ఇవే కాకుండా ఇతర పనులూ ఉంటాయి. ఆ పనులు ఉన్నప్పుడు పగటిపూట కాకుండా రాత్రిపూట బ్లాగులు, బజ్ ఓపెన్ చేస్తుంటాను. నాకైతే టైమ్ వేస్టేమీ ఉండదు. ఎందుకంటే నా టైమ్ మేనేజ్మెంట్ నాకు ఉంటుంది.

Vasu చెప్పారు...

"లైవ్ గా వచ్చేసే వ్యాఖ్యలను చూస్తూ, వెంటనే స్పందిస్తూ వాటిని తక్షణం చూసుకోగలిగే వెసులుబాటే బజ్జులకు ఆకర్షణ తెచ్చిపెడుతోంది. "

ఇలాటిది బ్లాగ్ ల లో కూడా ఉంటే బజ్ కి పోటీ అవ్వచ్చు .
నేను ఎక్కడో రాసిన ప్రతీ వ్యాఖ్య కి ప్రతి వ్యాఖ్య వచ్చిందా లేదా చూసుకోవడం కష్టం. అందుకే బజ్ అంటే ఇష్టం. కానీ ఇది బజ్ బ్లాగ్లకి త్రెట్ అన్న మాట వాస్తవం.

మధురవాణి చెప్పారు...

How true! :))

KumarN చెప్పారు...

A week or two weeks ago I believe, I was urging someone to write a post on Blog vs Buzz Pros n Cons.

Neatly done job.
Thanks

సుజాత వేల్పూరి చెప్పారు...

మలక్పేట్ రౌడీ,

అయ్యో అది మీక్కూడా వర్తిస్తుందేమో గానీ చాలామందికి కూడా వర్తిస్తుంది. మొన్న కౌటిల్య మిరియాల చారు బజ్ చూశారా? నిన్న పొద్దున్న చూస్తే అర్థ రాత్రి కూడా దానికి వంటల గురించి కామెంట్స్ ఉన్నాయి. అది గుర్తొచ్చి రాశాను. :-))

వేణు చెప్పారు...

@ Malakpet Rowdy: ఇదే విషయమ్మీద మీరు బజ్ లో చర్చించుకున్నారా? బాగుంది.

@ Praveen Sarma: బజ్జులూ, బ్లాగులూ ఏదైనా మీకు ఒకటే అన్నమాట. ఇవి చదువుతూ కూడా టైమ్ మేనేజ్మెంట్ తో- సమయం వృథా చేసుకోని మీలాంటి వాళ్ళు మాత్రం అరుదే!

వేణు చెప్పారు...

@ Vasu: రకరకాల బజ్జుల్లో మనం రాసిన వ్యాఖ్యలకు లేటుగా వచ్చే ప్రతిస్పందనలను చూసుకోవటం కూడా కష్టమే కదా! అందుకే- వీటిక్కూడా సంకలినులు వస్తే; ‘హారం’ ‘జల్లెడ’లో మాదిరిగా ఒక వ్యాఖ్యాత వ్యాఖ్యలన్నీ ఒకేచోట చూసుకునే అవకాశం ఉంటే... బాగుంటుంది.

@ మధురవాణి: థాంక్యూ!

వేణు చెప్పారు...

@ KumarN: ఈ ‘బ్లాగ్ వర్సెస్ బజ్’ టపాపై మీ ప్రశంసకు ధన్యవాదాలండీ!

వేణు చెప్పారు...

‘బజ్ వర్సెస్ బ్లాగ్’టపా గురించి నా బజ్ లో పెట్టి, కావాలని కామెంట్లు డిజేబుల్ చేశా కదా? కానీ మురళీధర్ నామాల గారు అనూహ్యంగా వేరే రూట్లో వచ్చారు. నా బజ్ ని రీషేర్ చేసుకున్న సుజాత గారి బజ్ లో- ఇలా కామెంట్ పెట్టారు!:))
venu garu, miru disable cheste ikkada comments pedatham ha ha ha :D8:52 pm

సిరిసిరిమువ్వ చెప్పారు...

మా బాగా చెప్పారు. ఈ బజ్జుల మోత అంతా ఇంతా కాదండి బాబూ!
"మన విలువైన సమయాన్ని దారుణంగా తినేసెయ్యటంలో బ్లాగులకు పెద్దన్నలాగా బజ్ తయారవుతోందనేది - నాణేనికి మరో వైపు!"..ఏదయినా వ్యసనంలాగా మారితే అంతే కదండి!

కాకపోతే బజ్జుల్లో కబుర్లు ఊర్లల్లో రచ్చబండ మీద మగవాళ్ళు..వీధుల్లో అరుగుల మీద ఆడవాళ్ళు కూర్చుని కాలక్షేపం కబుర్లు చెప్పుకుంటారు చూడండి అలానే ఉంటాయి:)ఆ కబుర్లు ఎక్కడ మొదలయ్యి ఎక్కడకి పోతాయో తెలియదు! ఎవరిదారిన వాళ్లు మాట్లడతా ఉంటారు. మధ్యలో వెళ్ళినవారికి అంతా అయోమయమే!

చూద్దాం ఈ బజ్జు వైభోగం ఎంత కాలమో!

ఏదేమయినా బ్లాగు బ్లాగే..బజ్జు బజ్జే! నేను బజ్జులో టపా చూసినా బ్లాగుకి వచ్చే చదువుతాను!

వేణు చెప్పారు...

@ సిరిసిరిమువ్వ : బజ్జుల గురించి మీ అభిప్రాయాలు బాగున్నాయి. థాంక్యూ!

జ్యోతి చెప్పారు...

T20 వచ్చి టెస్ట్ మ్యాచ్ లను దెబ్బ తీసినట్టు బజ్జు వచ్చి బ్లాగులను దెబ్బకొట్టింది. అందుకే ఎక్కువగా బజ్జుతున్నారు. తీరిగ్గా ఉన్నప్పుడు పర్లేదు కాని చాలా టైమ్ వృధా అవుతుంది. అందుకే నాకు చిరాకేసి ఈ మధ్యే బజ్జును బజ్జోపెట్టాను. :))

వేణు చెప్పారు...

@ జ్యోతి : బజ్జులను T20 మ్యాచుల్తో భలే పోల్చారే! మొత్తానికి Buzz ‘టైమ్ వృథా’ అనే విషయంలో అందరూ ఏకీభవిస్తున్నారన్నమాట! మీ స్పందనకు ధన్యవాదాలు!

వేణు చెప్పారు...

మనం వివిధ బజ్జుల్లో రాసిన వ్యాఖ్యలన్నీ చూసుకోవాలన్నా, మనం ఫాలో అయ్యేవారు రకరకాల బజ్జుల్లో ఏమేం రాశారో చూడాలన్నా సంబంధిత బజ్ లో Comments by.. క్లిక్ చేస్తే సరిపోతుంది. దీనికి ‘హారం’, ‘జల్లెడ’ లో ఉన్నట్టు ప్రత్యేక ఏర్పాటు ఏమీ అవసరం లేదు. ఇవాళే ఇది గమనించాను!

అయినా ‘కొత్త బజ్ లకు స్పందిస్తూ ఉంటేనే సమయం హారతి కర్పూరమవుతోంది... ఇంకా ఇదంతా చేయటానికి తీరికెక్కడిదీ..’ అంటారా? అదీ నిజమే!