చందమామ జులై 1978 సంచికలో ‘భల్లూక మాంత్రికుడు’ సీరియల్ ప్రారంభ చిత్రం. (నాకు నచ్చిన బొమ్మ... ఇది కాదు :-)) |
నాకు చందమామలో చిత్రా, శంకర్ ల బొమ్మలు బాగా ఇష్టమే కానీ, మరో ఆర్టిస్టు ‘జయ’ బొమ్మలు కూడా నచ్చేవి.
‘చిత్రా’ బొమ్మల్లో కనిపించే స్వేచ్ఛ గానీ, కదలిక గానీ వీటిలో ఉండకపోవచ్చు గానీ,
ఇవి ‘పద్ధతి’గా ఉండేవి.
కట్టడాలన్నీ స్కేలుతో గీసినట్టు సౌష్ఠవంగా కనిపించేవి.
J అక్షరం ఎడమవైపునున్న వంపును పైకి గీసి, Jaya తన సంతకం చేయటం అందంగా తోచేది.
‘మాయా సరోవరం’బొమ్మలు గీయటం పూర్తిచేసి, చిత్రా అస్తమించాక దాసరి సుబ్రహ్మణ్యం గారి జానపద సీరియల్ ‘భల్లూక మాంత్రికుడు’ సీరియల్ కి చిత్రకల్పన చేసే అవకాశం Jaya నే వరించింది.
అప్పటికే చందమామలో చాలా కథలకు తాను వేసిన బొమ్మలతో జయ ప్రాచుర్యం పొందాడు.
అయితే ఆ సీరియల్ గానీ, ఆ బొమ్మలు గానీ నన్ను పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి.
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే... జయ కష్టపడి వేసినప్పటికీ ఆ బొమ్మలు పాఠకులను అంతగా ఆకర్షించలేదు. అప్రయత్నంగానో, సప్రయత్నంగానో చిత్రా బొమ్మలతో పోల్చిచూడటం వల్లనే ఇలా జరిగిందనుకుంటాను.
ఫలితంగా... ఈ సీరియల్ ముగియగానే చిత్రా బొమ్మలతో రెండోసారి ‘తోకచుక్క’ పొడవక తప్పలేదు.
అయితే...
‘భల్లూక మాంత్రికుడు’ సీరియల్ కి జయ వేసిన బొమ్మల్లో ఒక్కటి మాత్రం 30 ఏళ్ళుగా నా స్మృతి పథంలో నిలిచిపోయింది.
ఆర్టిస్టు చిత్రించిన కోణం నన్నెంతో థ్రిల్ కు గురిచేసింది.
‘ఎంత బాగా వేశాడు’ అనిపించింది.
ఆ బొమ్మ గురించి అందరితో పంచుకోవచ్చని రెండు రోజుల క్రితం తట్టింది.
వెంటనే ఆ బొమ్మ కోసం చందమామ వెబ్ సైట్లో ఆర్కయివ్స్ లో వెతికాను.
కనపడింది!
మూడు దశాబ్దాల తర్వాత...నాటి నా సంభ్రమాన్ని తలపోసుకుంటూ చూశాను మళ్ళీ!
అదొక్కటే కాదు;
ఆ బొమ్మ కు పూర్వదశలు అనదగ్గ మరో మూడు బొమ్మలు కూడా ఆ సీరియల్లో కనపడ్డాయి.
ఈ బొమ్మలన్నిటినీ వరుసగా చూపిస్తే చాలా బాగుంటుందనిపించింది!
మరి చూడండి... ఆ చిత్రాలు!
మనం కొంత ఎత్తులోనుంచే చూస్తున్నాం కదూ కోటను. (ఏప్రిల్ 1979). |
ఏనుగుల్నీ, భల్లూకాన్నీ తర్వాత చూడొచ్చు; కోట సింహద్వారాన్ని గమనించండి. మనం మరి కాస్త ఎత్తు నుంచే దీన్ని వీక్షిస్తున్నాం. అవునా? (జూన్ 1979) |
ఆర్టిస్టు జయ మనల్ని ఇంకొంచెం పైకి తీసుకువెళ్ళి ఈ కోటను చూపిస్తున్నాడు (సెప్టెంబరు 1979). బాగుంది కదా... అందుకే, తర్వాతి నెలలో విహంగవీక్షణ చిత్రాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్ళాడు జయ! |
ఇదేనండీ... నన్ను మురిపించిన ఆ బొమ్మ ! (అక్టోబరు 1979) |
ఇంత ఎత్తు నుంచి చూపిస్తే-
చంద్రశిలా నగర ద్వారం వద్ద మాయా మర్కటుడు గానీ,
అతణ్ణి అడ్డగిస్తున్న కాపలా భటులు గానీ ...
మనకు స్పష్టంగా ఎలా కనపడతారు చెప్పండి!
కానీ అలా కనపడకుండా విభిన్నమైన కోణంలో గీయటం వల్లనే కదా, ఈ చిత్రం ఇంతగా బాగుందీ!
8 కామెంట్లు:
i am not that great artist. but in engineering drawing every engineer must draw some images like that.
చాలా బాగుండేవి. మీరు చెబుతుంటే మరీ శ్రద్ధగా పరిశీలించాను. నిజమే, అధ్బుతమైన వూహాశక్తి. మీ ఇంటరెస్ట్ కూడా బాగుంది.
సా.పౌ, బిల్డింగ్స్ ఐసోమెట్రిక్ పద్దతిలో వున్నాయి, కాని ఇంజనీరింగ్ డ్రాయింగుల్లో జంతువులు, మనుషుల హావభావాలు వేయరేమో కదా.
@ సాధారణ పౌరుడు, @ Snkr: మీ స్పందనకు ధన్యవాదాలండీ!
వేణు గారు. జయ గొప్ప చిత్రకారుడు. (నిజానికి నాకు చిత్రా,శంకర్ గారి బొమ్మలకంటె జయగారి బొమ్మలే బాగా నచ్చేవి). ముఖ్యంగా మాచిరాజు కామేశ్వరరావు గారు వ్రాసే దయ్యం కథలకు జయ బొమ్మలు గొప్పగా ఉండేవి. మీరు ప్రచురించిన చిత్రాలు అద్భుతంగా ఉన్నాయి.
తెలుగు అభిమాని గారూ, ‘జయ’ బొమ్మల్లో ఒక విశేషం గమనించారా? బొమ్మలు చాలా యూత్ ఫుల్ గా కనిపిస్తాయి! మీ అభిప్రాయానికి కృతజ్ఞతలు.
వేణు గారూ,
కోటబొమ్మల విషయంలో మీది చక్కటి పరిశీలన. జయ బొమ్మలు అనగానే నాకు గుర్తొచ్చేది బంగారులోయ సీరియల్ కు ఆయన వేసిన బొమ్మలు. ఐదు ప్రశ్నలు (లక్ష్మీగాయత్రి), అపకారికి ఉపకారం (వసుంధర) లాంటి చిన్న సీరియల్స్ కు కూడా ఆయనే వేశారు.
>> బొమ్మలు చాలా యూత్ ఫుల్ గా కనిపిస్తాయి!
నిజమే! :-)
@ త్రివిక్రమ్: ‘జయ’ చిత్రాల టపాపై మీ అభిప్రాయానికి కృతజ్ఞతలు!
వేణు!నిన్ను మురిపించిన బొమ్మ నన్ను కూడా మురిపించింది!నిజానికి చందమామ కథలు ఏళ్ళ తరబడి గుండెల్లో నిలిచిపోడానికి వాటి బొమ్మలుకూడా కారణం!ఎంత శ్రద్ధగా వేసేవారో!అంత ఎత్తునుంచి కోటని చూస్తే ఎలావుంటుందో అంత కరెక్టుగా నీడలతో సహా చిత్రించిన చిత్ర కారుడు అందుకే ఇన్నేళ్ళైనా కళారాధకులకు గుర్తుండిపోయాడు!!
కామెంట్‌ను పోస్ట్ చేయండి