‘‘కొందరివి యతి ప్రాసలు
కొందరివి కుతి ప్రాసలు ’’
బాగుంది కదూ!
ఈ మినీ కవిత రాసింది ‘హాసం’ రాజా. దీనికి శీర్షిక ఏమిటో చూడండి... ‘ఇదీ ఆ జాతే’.
రాజా మినీ కవితల చిరు పుస్తకం ‘కదన కుతూహలం’. దీని గురించి రాయాలనే కుతూహలం నాకెందుక్కలిగిందంటే- ఈ కవితలను పాతికేళ్ళుగా నేను మర్చిపోకపోవటమే; ఎన్నో సందర్భాల్లో అవి కోటబుల్ గా గుర్తుకురావటమే!
ఈ కవితల్లోని పదాలూ, భావాలూ కదం తొక్కుతూ చమత్కారాలతో, చమక్కులతో, భాషా విరుపుల మెరుపులతో ఆకట్టుకుంటాయి! ‘ఎమ్వీయల్’ రచనల్లాగా ఆ అక్షరాలు క్రీడా విన్యాసం చేస్తాయి.
కీ.శే. పెండ్యాల నాగేశ్వరరావు గారి మాటల్లో- ‘నిరంతర సత్యాల లోతులను అతి చిన్ని మాటలలో చేతికందివ్వడం రాజాకే చెల్లిందనిపించింది’.
కీ.శే. రావుగోపాలరావు గారి ప్రశంస చూడండి- ‘.. అందమూ, ఆనందమే కాక ఈ కవితల్లో ‘ఆలోచించండి ప్లీజ్!’అనే తియ్యటి ఆజ్ఞాపన ఉంది’.
య(మ)స్పీ(డు) బాలసుబ్రహ్మణ్యానికి (ఈ ప్రయోగం రాజాదే) అంకితమిచ్చిన ఈ కవితలు పి. సుశీల, జానకి గార్ల అభినందనలు కూడా అందుకున్నాయి.
‘కదన కుతూహలం’ 1982 అక్టోబర్లో విడుదలైంది. ఇదెంత ‘మినీ’పుస్తకమంటే అరచేయంత సైజు కూడా ఉండదు. A 4 పేపర్ లో పావువంతు కంటే కూడా చిన్నదన్నమాట. పేజీకో కవిత ఇవ్వాలనే కారణం వల్ల .. కవిత బుల్లిది కాబట్టి పేజీ సైజు కూడా అనివార్యంగా తగ్గిపోయింది.
‘హాస్య ప్రియ’ మాసపత్రిక లో ‘పదాల పాలవెల్లి’ పూర్తిచేసి పంపినందుకు ఈ పుస్తకం నాకు కానుకగా వచ్చింది, 1985 మార్చిలో!
గళ్ళ నుడికట్లు నింపే అలవాటు నాకుండేది. కానీ ఎప్పుడూ ఒకటో రెండో పదాలు తెలిసేవి కావు. మొదటిసారిగా ఇలాంటి పోటీలో విజేతగా నిలిచానప్పుడు. పైగా పుస్తకం బహుమతిగా రావటం థ్రిల్లింగ్ గా అనిపించింది. అప్పుడు తొలిసారిగా చదివాను రాజా కవితలు.
ఈ పుస్తకంలో 50 మినీ కవితలున్నాయి.
వాటిలో నాకు నచ్చినవి కొన్ని...
ఆర్ట్ బీట్
స్టెతస్కోప్ కీ
ఇయర్ ఫోన్ కీ
తేడా పెద్దగా ఏం లేదు
రెండూ జనాల
గుండెలతో ఆడుకునేవే
రూట్
పాతిపెడితే మరో రూపంలో
మొలకెత్తగలిగేవి
విత్తనం, ఉడుకు మోత్తనం
వా (మను) డే (మహ) వీ (రు) డు
భూ ఆక్రమణోద్యమంలో
నేటి మానవుడికి ప్రేరణ
నాటి వామనుడే
Appendix
నిఘంటువులో మొదట
చూసేదెప్పుడూ చెడు మాట
ఆంక్షలున్న చోట
కాంక్షలూరు ఊట
(చివరి రెండు లైన్లూ నాకు మరీ మరీ నచ్చాయి. ఒక జీవిత సత్యాన్ని ఎంత అందంగా చెప్పారో కదా! )
ఎదుటి మనిషికి
చెప్పేటందుకే...
ఉచిత సలహాలు
ఉమ్మెత్త పూవులు
కృషి లేకనే
రూపు దిద్దుకుంటాయి
మొదట ఉంటాయి సున్నితంగా
పోనుపోను మారుతాయి కంటకంగా
(ఎవరికైనా సలహా ఇవ్వాల్సివచ్చినపుడు ఈ కవితే నాకు హెచ్చరికగా గుర్తొస్తుంటుంది. )
అందుబాటులో లేవు...
ఇలాంటి పుస్తకాలు పాఠకులకు ఎప్పడూ అందుబాటులో ఉంటే బాగుంటుంది. కానీ ఈ ‘కదన కుతూహలం’ తర్వాత మళ్ళీ పుస్తకంగా రాలేదు.
రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తిని ముఖ్య పాత్రధారిగా చేస్తూ రాజా రాసిన ‘మల్లాది వెంకట కృష్ణమూర్తి’ నవల అప్పట్లో సంచలనం! ‘పల్లకి’ వీక్లీ లో వచ్చిన ఈ సీరియల్ ను పద్మాలయ పబ్లికేషన్స్ వారు పుస్తకంగా వేశారు. మూడు ప్రింట్లుగా వచ్చాయి. ఆ తర్వాత ఆ ప్రచురణ కర్త ఎమెస్కో ని కొని ఈ పబ్లికేషన్స్ ని క్లోజ్ చేసేశారు. కాబట్టి ఇది కూడా మార్కెట్లో దొరకదు.
మ్యూజిక్ జర్నలిజంలో కృషి చేసిన రాజా ‘మ్యూజికాలజిస్ట్’గా పేరు పొందారు. ఆయనకు 40,000 పైగా పాటల లైబ్రరీ ఉందట. 2,000 కు పైగా సినిమాలు, 1,000 కి పైగా రెఫరెన్సు పుస్తకాలు కూడా ఆయన దగ్గరున్నాయట. ‘వార్త’ దినపత్రికలో రాసిన ‘ఆపాత మధురం’ శీర్షికను సినీ సంగీత ప్రియులు ఎంతగానో ఇష్టపడ్డారు. దూరదర్శన్లో తొలి తెలుగు ధారావాహిక 'బుచ్చిబాబు' కు స్క్రిప్ట్ రాసింది రాజానే!
ఆయన బ్లాగు తెలుసుగా? మ్యూజికాలజిస్ట్ రాజా .
7 కామెంట్‌లు:
@ సుజాత: థాంక్యూ! రాజా గారి ‘ఆపాత మధురం’ (సంగీతం) ఎవర్ గ్రీన్ అన్నారు. మరి ‘ఆలోచనామృతం’ (కవితలు) సంగతి.. అవి ఎలా ఉన్నాయో కూడా చెప్పండి!
వేణుగారు. నెనర్లు. రాజాగారి రచనలలో పరిణితి కనిపిస్తుంది. వారి blog బ్లాగుంది.
తెలుగు అభిమాని గారూ, ‘రాజా మినీ కవితల’ టపాపై మీ స్పందనకు ధన్యవాదాలు!
హంసధ్వని సంస్థ ప్రారంభోత్సవం సందర్భంగా రవీంద్రభారతి లో ఆ పుస్తకం ఆవిష్కరించబడినప్పుడు ఆ గ్రంథాన్ని పరిచయం చేస్తూ నేనే మట్లాదడం మరిచిపోలేని సంగతి.ఎస్పీ .బాలసుబ్రహ్మణ్యం గారు మద్రాస్ నుంచివచ్చారు.
సుధామ గారూ! ఈ మినీ పుస్తకానికి సంబంధించి మీ జ్ఞాపకం గుర్తు చేసుకోవటం బాగుంది. థాంక్యూ!
వేణూ!నీ అన్ని టపాల్లానే ఈ టపా కూడా చాలా బాగుంది!హాసంరాజాగారి మినీ కవితా చమక్కులు తళుక్కుమన్నాయి!ముఖ్యంగా ఆర్టు బీటు శీర్షిక వాడే వీడులో వామనుడే మను మహ ఇలా pun,ching చాలా బాగుంది!ఉచిత సలహాల్రావులకు లేదా రాణులకు చెంపదెబ్బ ఉమ్మెత్త పోలిక!
అవునూ!దశాబ్దాల క్రితం చదివిన మెరుపుల్ని దాచుకున్న నువ్వెంత సాహిత్యాభిలాషివి! ఇలా చదివి అలా వదిలేసే వారున్న లోకంలో . . నీలాంటి వారిని అభినందించకుండా ఉండలేను! నీకు . . . . ఈ వేణువు blog కి హృదయపూర్వక అభినందనలు!
@ Syamala: రాజా మినీ కవితల గురించి రాసిన ఈ పోస్టు గురించి నీ అభిప్రాయం, సహృదయంతో తెలిపిన స్పందనా ప్రోత్సాహాన్ని కలిగించాయి.Thank You! దశాబ్దాలక్రితం చదివినా ఈ కవితలను నేను ఇంతకాలం మర్చిపోకుండా ఉండటానికి వాటిలోని లోకరీతీ, సార్వజనీనతా కారణాలనుకుంటాను. అన్నట్టు- నీ వ్యాఖ్యలో Pun,ching అంటూ విరిచి, చేసిన చమక్కు చక్కగా ఉంది!
కామెంట్‌ను పోస్ట్ చేయండి