సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

4, మే 2011, బుధవారం

సాగింది సాగింది గంగ... సాగి చెలరేగింది గంగ!

కర్ణాటక లోని  ఓ శిల్పం


న ‘మైథాలజీ’లో ‘గంగావతరణం’ ఓ రసవద్ఘట్టం.

తరతరాలుగా ఎందరో కవిత్వంలో, శిల్పంలో, చిత్రలేఖనంలో, సంగీతంలో  పొదిగి దీన్ని కళాత్మకంగా మలిచారు.  వర్ణనలతో, వర్ణాలతో, రేఖలతో, రాగాలతో రమణీయం చేశారు. ఊహలతో పెంచి, ఉపమానాలతో, ఉత్ప్రేక్షలతో అలంకరించి చిరస్మరణీయం చేశారు. 

భగీరథ ప్రయత్నంతో  ఆకాశగంగ నేలమీదకు ఎలా వచ్చిందో... ఆ గాధ  తెలిసిందే కదా!

‘కదిలింది కదిలింది గంగ
కదిలి ఉప్పొంగింది గంగ
పరమ రాజసభావ పరిజృంభిత నిజాంగ
కదిలింది కదిలింది గంగ
కదిలి ఉప్పొంగింది గంగ

ఆకాశమే అదరగా
ఐరావతం బెదరగా
నందనవనం ప్రిదులగా
బృందారకులు చెదరగా


సాగింది సాగింది గంగ
సాగి చెలరేగింది గంగ
దూకింది దూకింది గంగ
ఉద్రేకాతిరేకాంతరంగ...’
(సినారె, ‘సీతాకల్యాణం’-1976)



‘శివుడప్పుడు ఎదురుగ జగ
జెట్టి వోలె నిలుచుండెను
మెడను జాచి జడల బార్చి
మింటివంక కనుచుండెను

... ఆకాశము నుండి భువికి
ఉరుములతో మెరపులతో
ఉరవడించి తరలివచ్చె’ 
(ఉత్పల, చందమామ- ‘గంగావతరణము’- 1960)  

సురగంగ గరువమ్ము విరువంగ నెంచి 
సంకీర్ణ పటు జటాచ్ఛటలనుప్పొంగించి
దుర్గమ్ముగా మలచినాడు
గంగ నద్భుతముగా బంధించినాడు

మహా వేగంతో శివుడి జటాజూటంలో ఇరుక్కుపోయి సుళ్ళు తిరగడం మొదలుపెట్టింది గంగ.

జడయను అడవిని వడివడి అడుగిడి 
జాడ ఎరుంగనిదై
తడబడి నడచుచు
గడగడ వడకుచు
సుడివడి పోయినదై
ఒక పరి అటు చని
ఒక పరి ఇటు చని 
మొగమే చెల్లనిదై

 ఎన్ని సంవత్సరాలైనా కిందపడలేకపోయింది.  భగీరథుడు గంగ కనిపించక  మళ్ళీ తపస్సు చేశాడు. శివుడు సంతోషించి గంగను విడిచిపెట్టాడు.

‘పరవశాన శిరసూగంగ
ధరకు జారెనా శివగంగ...’
(వేటూరి,  ‘శంకరాభరణం’-1979)

గంగ భూమ్మీద పడి ప్రవహించడంలో ఏడు పాయలుగా చీలింది.  ఒక పాయ భగీరథుడి వెనకాలే, రథం ఎటు తిరిగితే అటుపోయింది.

‘ఉరికింది ఉరికింది గంగ
ఉన్ముక్త మానస  విహంగ

....

జలజలా పారుతూ
గలగలా సాగుతూ
చెంగుమని దూకుతూ
చెలరేగి ఆడుతూ
తుళ్ళుతూ తూలుతూ
నిక్కుతూ నీల్గుతూ
ముంచివేసెను
జహ్నుముని ఆశ్రమమును’
(సినారె)

జహ్ను మహర్షికి  కోపం వచ్చేసింది.  గంగను పూర్తిగా తాగేశాడు. దేవతలంతా గంగను విడిచిపెట్టమంటూ మహర్షిని పూజించారు. ఆయన సంతోషించి గంగను చెవుల్లోంచి విడిచిపెట్టాడు. ఆ రకంగా గంగ, జహ్ను మహర్షి కూతురు ‘జాహ్నవి’ అయింది.


మునుముందుగా భగీరథుడు నడువంగ
తన మేన సరికొత్త తరగలుప్పొంగ-
తరలింది తరలింది గంగ
సాగరుల పాపములు కడుగంగ
భువికి పుణ్యమొసగె నదిగా....



రవివర్మ వర్ణచిత్రం

 



రవి వర్మ (1848- 1906)  గంగావతరణాన్ని చూడముచ్చటగా చిత్రించాడు. శివుడు నడుం మీద చేతులుంచి  తలపైకెత్తే భంగిమా,  కిందికి చూస్తూ పైనుంచి స్త్రీ రూపంలో దిగే గంగ... మొత్తంగా ఈ దృశ్యానికి ఒక ప్రామాణికతను సృష్టించేశాడు. ఏ చిత్రకారుడైనా, శిల్పి అయినా ఇదే తరహాలో తప్ప వేరే రకంగా రూపకల్పన చేయటానికి వీల్లేనంతగా!

శంకర్ గీసిన చిత్రం - చందమామలో.


గంగావతరణం అంటే వెంటనే బాపు ‘సీతా కల్యాణం’ సినిమా గుర్తొస్తుంది. బాపు ఈ ఘట్టాన్ని తీయడానికి ముందు  బొమ్మలుగా వేస్తే...  వాటిని చూసిన ప్రేరణ పాటగా పొంగిందని సినారె చెప్పారోసారి.

గంగానది గమనాన్ని ఆయన  తెలుగు నుడికారంతో చక్కగా అక్షరబద్ధం చేస్తే... దానికి దీటుగా బాపు కనువిందుగా చిత్రీకరించాడు.

బాపు సీతాకల్యాణం సినిమాలోని గంగావతరణ దృశ్యం

మహదేవన్ సంగీతం, రవికాంత్ నగాయిచ్ ఛాయాగ్రహణాలను ఇక్కడ ప్రస్తావించితీరాలి.

అయితే బాపు అప్పటికి 16 సంవత్సరాల ముందే  చందమామలో  ఉత్పల సత్యనారాయణాచార్య ‘గంగావతరణము’ గేయ కథకు చక్కని బొమ్మలు వేశాడు.  ‘రచన’ మాసపత్రిక ఎడిటోరియల్ పేజీ పై భాగంలో కూడా బాపు వేసిన గంగావతరణం బొమ్మ కనిపిస్తుంది!

‘సీతా కల్యాణం’లో గంగావతరణం పాట ఇక్కడ వినొచ్చు.



ఈ గాథ వెనక వాస్తవమేంటి?
జీవానికీ,  జలానికీ ఉన్న సంబంధం విడదీయరానిది.  గంగ కావొచ్చు; మరే నది అయినా కావొచ్చు. ప్రాణికోటి జీవనం... ముఖ్యంగా మనిషి బతుకు నీటితోనే ముడిపడివుంది.

అసలు స్వర్గమూ,  సుర గంగా ఏమిటి?  ఆ నది భగీరథుడి వెంట, రథం ఎటు తిరిగితే అటు ప్రవహిస్తూ వెళ్ళటమేమిటి?

ఇవన్నీ అసహజాలే కదా?

గంగానది స్వర్గం నుంచి భూమ్మీదకు దిగిరావటం అనేది అందమైన కల్పన.  నీటి కోసం అలమటిస్తూ నరకప్రాయంగా జీవించేవారికి గలగల పారే  జీవధార... స్వర్గం నుంచి వచ్చినట్టు అనిపించడంలో ఆశ్చర్యం ఏముంది?

నీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికి చేరే ఒకనాటి మానవులు , నదీ తీర ప్రాంతాల కోసం యుద్ధాలు చేసిన కాలం ఒకటుంది. ఆ కాలంలో నదులను మానవులు తమకు ఇష్టమైన చోటుకు  తీసుకుపోవడం- ఒక అద్భుతమైన ఊహ!

నీటిని భూమి అంతటా పరిగెత్తించాలనే తీవ్రమైన కోరికతో ఊహించుకున్న కథ అది. 

ఎందుకంటే  మైథాలజీ మానవుల ఆశల్నీ, ఆకాంక్షల్నీ- అతిశయంగానే - ప్రతిబింబిస్తుంది!


8 కామెంట్‌లు:

ఆ.సౌమ్య చెప్పారు...

చాలా బాగా రాసారు. రవివర్మ చిత్రం అద్భుతం...ఇదే మొదటి సారి చూడడం. ఆ శివుడు నిలుచోవడం, గంగ కిందకి చూస్తూ దిగడం ఓహ్ అద్భుతంగా ఉంది.

సీతా కల్యాణంలో పాట నాకెంతో ఇష్టం. అసలు బాపూ గారు ఆ ఘట్టన్ని చిత్రించిన తీరు అజరామరం. నేను దేవప్రయాగ అవీ వెళ్ళినప్పుడు అక్కడ గంగని చూడగనే మదిలో మెదిలిన పాట ఇదే.

మీరు చివరి రాసిన గాధ వెనుక వాస్తవం కూడా బలే ఉంది.

నాకు ఈ టపా చాలా నచ్చింది.

వేణు చెప్పారు...

ఆ.సౌమ్య గారూ, థాంక్యూ!

మరో 3 రోజుల్లో గంగా పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ‘పవిత్రం’ అని ఓ పక్క నమ్ముతూనే నదీ జలాలను నిర్లక్ష్యంగా కలుషితం చేసే జనాల తీరు ఓ పట్టాన అర్థం కాదు!

మరువం ఉష చెప్పారు...

మీరు పంచిన 3 చిత్రాలూ, ఉత్పల, చందమామ- ‘గంగావతరణము’- 1960 గేయానికి కృతఞతలు. ఆ చివరి గాథ నదీ పరివాహిక ప్రాంతాల్లో నాగరికత వెలసి విలసిల్లడాన్ని, నీటి వనరుకి మానవాళి మనుగడకి గల సంబంధాన్ని చక్కగా తెల్పుతుంది.

వేణు చెప్పారు...

ఉప గారూ! మీ స్పందనకు కృతజ్ఞతలు.

విచిత్రమేమిటంటే... ఇదే గంగావతరణాన్ని
పతనానికి దృష్టాంతంగా కూడా కోట్ చేస్తుండటం!

‘ఆకాశంబున నుండి శంభుని శిరం, బందుండి శీతాద్రి సుశ్లోకంబైన హిమాద్రి నుండి భువి, భూలోకంబు నందుండి యస్తోకాంబోధి, పయోధి నుండి పవనాంధోలోకమున్ చేరె గంగా కూలంకష, పెక్కు భంగులు, వివేకభ్రష్ట సంపాతముల్ ’

GKK చెప్పారు...

చాలా బాగుంది ఈ టపా వేణు గారు. చిత్రాలు కూడా ఎంతో బాగున్నాయి. గంగా పుష్కరాల తరుణంలో సందర్భోచితంగా ఉన్నది.

వేణు చెప్పారు...

తెలుగు అభిమాని గారూ, కృతజ్ఞతలు మీ స్పందనకు!

వేణు చెప్పారు...

@ సుజాత: థాంక్యూ. సరస్వతి లాంటి దేవతల బొమ్మలకు ప్రామాణిక నమూనా క్రెడిట్ రవివర్మదని అందరికీ తెలుసు. గంగావతరణ చిత్ర రీతికి కూడా రవివర్మే ఆద్యుడని ఈ టపా రాస్తున్న సందర్భంగానే నాకు అర్థమయింది!

M b d syamala చెప్పారు...

వేణు!గంగావతరణం పై నీపోస్ట్ కళాత్మకంగా ఉండి ఆహ్లాద పరిచింది ముఖ్యంగా రవివర్మ చిత్రం సినారె కవనం ఎంత బాగున్నాయో!చందమామలో శంకర్ చిత్రం కూడా చాలా బాగుంంది గంగావతరణాన్ని సుభాషితాల్లో భర్తృహరి నీతి ప్రబోధాత్మక దృక్కోణంలో పేర్కొనడం జరిగింది ! పతనం ఆరంభమైతే అట్టడుగుకు చేరడం జరుగుతుందనేది నైతిక దృక్కోణం!అందరానని గగన కుసుమమైన నీటిని కష్ట నష్టాలకోర్చి సాధించిన వైనాన్ని ఎంతకళాత్మకంగా చెప్పారో కదా! ఆనంద తాండవమాడే శివుడు పరవశంతో శిరసు ఊపితే ధరకుశివగంగజారడం ఎంత అందమైన ఊహ!మెరిసేమెరుపులు మురిసేపెదవుల చిరునవ్వులుకావడం ఉరిమేఉరుములు సిరిసిరి మువ్వలు కావడం ఎంత మధురోత్ప్రేక్ష!వేటూరి కలం రసవద్గంగాప్రవాహాాన్వితం!మంచి పోస్ట్ అందించినందుకు ధన్యవాదాలు!!