‘వ.పా. బొమ్మలు ఇవ్వలేకపోయానే’ అన్న అసంతృప్తితోనే కిందటి నెల్లో ‘గంగావతరణం’ టపా రాసేశాను. వడ్డాది పాపయ్య గారు ఈ సబ్జెక్టు మీద బొమ్మలు వేశారని తెలిసినా అవి దొరకలేదు. నిజానికి వాటిని అప్పటికి చూడనేలేదు.
అనుకోకుండా ఆ వర్ణచిత్రాలు హైదరాబాద్ అమీర్ పేటలోని శ్యామ్ నారాయణ గారి ఆఫీసులో కనిపించాయి. వ.పా. గారి చిత్రాలపై ఇష్టంతో వాటిని వందలాదిగా సేకరించిన సత్యం గారు ఈ గంగావతరణం బొమ్మలను నాకు చూపించారు. అంతేకాదు, పెన్ డ్రయివ్ లో కాపీ చేసి ఇచ్చారు కూడా!
వ.పా.గారి దస్తూరీ చూశారా? ఇది యువ’మాసపత్రికకు వేసిన బొమ్మ అనుకుంటాను.
1995, 96లలో ‘స్వాతి’ ముఖచిత్రాలు
హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ‘బాపు బొమ్మల కొలువు’కు వెళ్ళినపుడు ‘గంగావతరణం’ బొమ్మల కోసం వెతికాను. ‘రచన’ పత్రిక లో ఉపయోగించే బొమ్మ మాత్రమే అక్కడా కనపడింది. ఫొటో తీసుకున్నాను. ఇక బాపు గారి చిత్రాలతో వేసిన ప్రత్యేక సంచికలో దాదాపు అలాంటిదే... మరోటి కనపడింది. (ఇది అంతగా బాగా లేదు). ఈ రెంటితో పాటు ‘చందమామ’లో ఉత్పల గేయకథకు బాపు గారు వేసిన బొమ్మ కూడా ఇక్కడ చూడండి.
గంగా కూలంకష... కాలుష్య గంగ!
గంగావతరణంపై రమణీయ సాహితీ కల్పనలూ, చిత్ర కల్పనలూ బాగానే ఉన్నాయి. ఇప్పుడీ నది కాలుష్యంతో సహజ స్వరూపాన్నీ, స్వభావాన్నీ కోల్పోతూ అంతరించిపోయే స్థితిలోకి చేరుకుంటోంది. అసలీ దుస్థితి కొత్తగా వచ్చింది కాదు. కానీ దశాబ్దాలు గడుస్తున్నకొద్దీ ప్రమాద తీవ్రత పెరుగుతూ పోవటం ఆందోళనకరం.
భక్తులు అమృత తుల్యంగా భావించే గంగాజలం చివరకు విష తుల్యంగా మారిపోవటం వెనక ప్రకృతి వనరుల దుర్వినియోగం ఏ స్థాయికి చేరుకుందో తెలుస్తుంది. సంవత్సరానికి 20 లక్షల మంది ‘పుణ్యస్నానాలు’ చేసే గంగానది నీరు అసలు స్నానం చెయ్యడానికే పనికి రానంత కాలుష్యమయమైపోయింది.
గంగానది అత్యంత పవిత్రమని నమ్మే భక్తులు ఆ నదిని ఎంతగా కలుషితం చేయాలో అంతగా చేస్తూ వస్తున్నారు, తరతరాలుగా! మోక్ష ప్రాప్తి కోసమనో, పుణ్య లోకాలకు చేర్పించాలనే ఆశతోనో మృతదేహాలను గంగపాలు చేస్తున్నారు. దీన్నిమించి తీరప్రాంత ఆక్రమణలు, ఇసుక మాఫియాల స్వార్థం, రసాయన విషాల, వ్యర్థాలు గంగానది ఉనికికే ముప్పు తెస్తున్నాయి.
‘గంగా కార్యాచరణ పథకం’ పేరుతో పాతికేళ్ళ క్రితం 900 కోట్ల రూపాయిలు కేటాయించారట. వాటిని సవ్యంగా ఖర్చుపెట్టలేదు కాబట్టే స్వామి నిగమానంద లాంటి వాళ్ళు నిరాహార దీక్షలతో ప్రాణాలు కోల్పోతున్నారు. సమస్య అలాగే ఉండటం కాదు; దిగజారిపోతోంది. ఇక తాజాగా 7000 కోట్ల రూపాయిల భారీ ప్రణాళిక! ఈ పథకానికి సంబంధించి 4500 కోట్ల రూపాయిల ప్రపంచ బ్యాంకు రుణ ఒప్పందం!
నదుల కాలుష్య ప్రక్షాళన ఒక్క ఏడాదిలో జరిగేది కాదు. దశాబ్దాలకు దశాబ్దాలే పడుతుంది. ఆ సుదీర్ఘ కాలవ్యవధే ప్రజాధనం భారీగా కేటాయించి, ఆ పేరుతో తరాల తరబడి ఆస్తులు పెంచుకోవటానికి తరగని గనిలా మారుతోంది- రాజకీయనాయకులకూ, వారి ప్రాపకం సంపాదించినవారికీ!
‘... శీతాద్రి సుశ్లోకంబైన హిమాద్రి నుండి
భువి, భూలోకంబు నందుండి
యస్తోకాంబోధి, పయోధి నుండి
పవనాంధోలోకమున్ చేరె గంగా కూలంకష...’
ఒక్క గంగానది కథే కాదిది; దేశంలోని ఏ నది ప్రక్షాళన కథ అయినా దాదాపు ఇంతే!
3 కామెంట్‌లు:
3 va painting gangavataranma? mohini avataram kada
మహేశుడు గారూ, మూడో బొమ్మ మోహినీ అవతారమైతే పక్కన పార్వతి, నంది (వారే కదా? )... సంగతేమిటి ?
కామెంట్‌ను పోస్ట్ చేయండి