చాలా కాలం తర్వాత రంగనాయకమ్మ గారి సీరియల్ ప్రచురితమవుతోంది. ‘నవ్య’ వీక్లీ లో 29 వారాలుగా వస్తోందీ ధారావాహిక.
పేరు ‘కళ్ళు తెరిచిన సీత’
ఇదో కొత్త సాహితీ ప్రక్రియ. ఇది కథో, నవలో కాదని రంగనాయకమ్మగారన్నారు. నాకైతే నవలగానే అనిపిస్తోంది.
సీరియల్ పూర్తి కాకుండానే దీని గురించి రాయటానికి కారణం... దీనిలో ఎన్నో విశేషాలుండటం!
కల్పన లేని వాస్తవిక సంఘటనలకు అక్షర రూపకల్పన ఇది. (తాజా కలం: పుస్తకరూపంలో వెలువడిన ఈ నవల కాని నవలను ఈ-బుక్ గా చదవాలంటే .... http://kinige.com/kbook.
సీత (మారు పేరు) అనే హైదరాబాద్ అమ్మాయి పెళ్ళి చేసుకుని భర్తతో అమెరికా వెళ్ళింది. అక్కడ కష్టాలు పడింది, అవమానాల పాలైంది.
పెళ్ళి విషయంలో పొరబడ్డానని గుర్తించి, చివరకు స్నేహితుల సాయంతో భర్త బారి నుంచి బయటపడింది.
రచయిత్రి స్వయంగా దీనిలో ఒక పాత్రధారి.
ఆమె కొడుకు, కోడలు, వాళ్ళ పాపాయి మాలతీ, బాబు స్పార్టకస్... వీళ్ళే కాదు, రంగనాయకమ్మ గారి పాఠకులు (అభిమానులు అనే మాట ఆమె ఉపయోగించరు) కూడా ఈ సీరియల్లో తారసపడతారు.
సీత అమెరికా లోని భర్త ఇంటి నుంచి తప్పించుకుని, విమానంలో హైదరాబాద్ చేరుకునే ఘట్టం ఉత్కంఠభరితంగా ఉంటుంది.
ఇలాంటి సీరియస్ సీరియల్లో కూడా అక్కడక్కడా రచయిత్రి మార్కు హాస్యపు చెళుకులూ, జోకులూ, వ్యంగ్య వాఖ్యలూ ఆహ్లాదపరుస్తుంటాయి.
ఈ సీరియల్లో చర్చించిన విషయాలను అభినందిస్తూ, విమర్శిస్తూ వచ్చే పాఠకుల లేఖలు కూడా ఆసక్తికరం. ఇందులో ప్రస్తావించిన వ్యక్తులు ‘మెయిల్ బాక్సు’లో పాఠకులుగా తమ అనుభవాలు పంచుకోవటం గమ్మత్తయిన విశేషం. సీత తండ్రి , శ్యామల (ఈమె సీత కు అమెరికాలో సాయపడింది) తండ్రి ఇలాగే తమ అభిప్రాయాలతో లేఖలు రాశారు.
క్లిష్టమయిన ప్రక్రియ
రచయితలెవరికైనా కల్పిత కథను రాయటం మంచినీళ్ళ ప్రాయం. సంఘటనలను ఎలా పడితే అలా కూర్చే సౌలభ్యం ఉంటుంది.
కానీ వాస్తవిక ఘట్టాలను కథగా మల్చటం తేలికైన పనేమీ కాదు.
వ్యక్తుల స్వభావాన్ని చిత్రించేలా, వాస్తవికంగా సంభాషణలు ఉండాలి. అన్ని కథల్లో లాగా రచయిత ‘సర్వాంతర్యామి’లా పాత్రల మనసులో ఆలోచనలను రాసే అవకాశం లేదు. చూడని, తెలియని ఘట్టాలను ఊహించి రాసే అవకాశమే లేదు.
స్వయంగా రచయిత్రే పాత్రధారి కావటం వల్ల... రచయిత్రి నిద్రపోయినపుడు జరిగిన సంఘటనలను తెలుసుకుని, తర్వాత వాటిని రాయాల్సివస్తుంది. ఇలాంటపుడు కథనం నీరసపడే ప్రమాదముంది. ఇవన్నీ కథనానికి ఉన్న పరిమితులు!
కానీ ఈ ‘కళ్ళు తెరిచిన సీత’ కథనం కాల్పనిక నవలా అన్నట్టుగా సూక్ష్మ వివరాలతో, సాఫీగా, ఆసక్తికరంగా సాగటం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. చర్చలూ, వరుస సంఘటనలూ, సంభాషణలూ ఇవన్నీ... రచనా సామర్థ్యానికి గీటురాళ్ళుగా నిలిచేవే!
నాకు ప్రతి బుధవారం నవ్య కోసం ఎదురుచూడటం ఈ మధ్య అలవాటైపోయింది. ఆన్ లైన్లో ఒక వారం లేటుగా అప్ డేట్ అవుతుంది. పాత సంచికలను ఆర్కైవ్స్ లో చదవొచ్చు. ప్రస్తుత సంచికను ఈ లింకులో చూడొచ్చు.
పాఠకుల సందేహాలు
సీరియల్ ప్రచురించే పేజీల్లోనే పాఠకుల ప్రశ్నలకు రంగనాయకమ్మగారిచ్చే సమాధానాలు మూడు వారాలుగా వస్తున్నాయి.
‘... నాకు హేతువాదమే ఇష్టం, సీతకి లాగ. కానీ సీత, నాగరాజు నాస్తికుడో కాదో తెలుసుకోకుండా పెళ్ళాడేసిందే. నేను అలా చెయ్యలేను. కానీ నాస్తిక అబ్బాయిలు నిజంగా స్థిరంగా ఉన్నవాళ్ళు కనపడడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం ఎలాగండీ?’ అంటూ స్వాతి అనే పాఠకురాలు అమెరికా నుంచి అడిగింది.
‘.... నీ భావాలతో సరిపడే మనిషి ఎదురయ్యేదాకా నిరీ్క్షించు! ఎంతకాలం అయినా! ఒక వయసు దాటిన తర్వాత ఆ నిరీక్షణ కూడా వదిలెయ్యి! నీ జీవితం నీ ఇష్టం. రాజీలు పడుతూనే బతకాలని రూలేమీ లేదు. ఏ సమస్యకైనా రెండే మార్గాలు- రాజీ గానీ, స్థిరత్వం గానీ. మూడో మార్గం ఉండదు.’
ఇలాంటి సమాధానం రంగనాయకమ్మ గారు తప్ప ఎవరివ్వగలరు!
4 కామెంట్‌లు:
అంతకు ముందెన్నడూ నవలలు చదవని నన్ను నవలలు చదివేలా చేసినవి మూడే నవలలు. అవి రంగనాయకమ్మ గారు వ్రాసిన జానకి విముక్తి, లియో టాస్టాయ్ వ్రాసిన యుద్ధం-శాంతి, జస్వంత్ సింగ్ కాన్వాల్ వ్రాసిన Dawn of the Blood నవలలు.
ప్రవీణ్,
ఇంతకీ ‘కళ్ళు తెరిచిన సీత’ సీరియల్ ని మీరు చదువుతున్నారా? లేదా?
సుజాతా,
నాగరాజు లాంటి వ్యక్తులకు శిక్ష పడటం న్యాయమే. కానీ వ్యయ ప్రయాసలకు సిద్ధపడి కేసు వేస్తే అలాంటివాళ్ళకు శిక్ష పడుతుందనే గ్యారంటీ ఉందంటారా?
కామెంట్‌ను పోస్ట్ చేయండి