‘తివిరి ఇసుమున తైలంబు’ తీయటం సుభాషిత కర్తకైనా కష్టమే. నదుల, సముద్రాల ఒడ్డున పడివుండే అలాంటి ఇసుక నుంచి సమ్మోహనపరిచే కళను వెలికితీయటంలో మాత్రం ఆధునిక కళాకారులు అసమాన ప్రతిభా విశేషాలు చూపిస్తున్నారు.
ఒక ఆకారం అంటూ లేకుండా ఇష్టమొచ్చిన దిశలో జారిపోయే ఇసుక - వారి చేతుల్లో మంత్రముగ్ధ అయిపోతుంది. జలంతో జత కట్టి సరికొత్త రూపాలు ధరించటానికి ముస్తాబైపోతుంది.
అయినా ఆ ఇసుకతో అబ్బురపరిచేలా శిల్పాలను మలచటం, కోటలను కట్టటం అంత తేలికేమీ కాదు. దానికెంత సహనం, నేర్పరితనం ఉండాలి! ఈ సైకత కళలో రాణించాలంటే విపరీతమైన శక్తి, శారీరక కష్టం అవసరమవుతాయి. ఒక శిల్పం గానీ, కట్టడం గానీ రూపుదిద్దుకోవాలంటే టన్నుల కొద్దీ ఇసుకను నేర్పుగా ఉపయోగించాల్సిందే.
ఇసుకతో గూళ్ళూ, బొమ్మరిళ్ళూ కట్టటం పల్లెటూళ్ళలో పెరిగినవారికి అనుభవమే. అలాంటి సరదా అభిరుచిని భారీ స్థాయిలో నైపుణ్యంగా మలుచుకుని, సంక్లిష్ట సూక్ష్మవివరాలతో ప్రాణ ప్రతిష్ఠ చేసేవారే సైకత కళాకారులు!
అతి పెద్ద పరిమాణంలో ఉండే ఆకారాలూ, విచిత్ర జీవులూ, అనూహ్యంగా షాక్ చేసే ఘట్టాలూ ఈ కళలో ఎక్కువగా కనిపిస్తాయి. భారీ బడ్జెట్ సినిమాల సెటింగ్స్ లాగా, గాజా పిరమిడ్ దగ్గరుండే గ్రేట్ స్ఫింక్స్ మాదిరిగా పెద్ద తలలూ, మోడ్రన్ ఆర్ట్ లో మల్లే దేహభాగాల క్లోజప్ లూ ఇట్టే మనల్ని ఆకట్టుకుంటాయి.
అంతలోనే అంతర్థానం
శిలతో చేసేదయితే శాశ్వతంగా ఉండే అవకాశముంది. ( అందుకనేగా, మన రాజకీయ నాయకులకు శిలా విగ్రహాలంటే అంత మోజు!)
కానీ ఈ సైకత శిల్పాలకు ఆ భరోసా కూడా లేదు, వీటి ‘జీవన’ కాలం స్వల్పమే. ‘ఇసుక గడియారం’లో ఇసుకలాగా కాలం వేగంగా జారిపోతుంటే... వాతావరణంలో మార్పులు ఎంతటి కళారూపాలనైనా నిర్దయగా రూపం మార్చేస్తాయి.
అయినా ఈ పరిమితులేవీ సృజనకూ, ఆస్వాదనకూ అవరోధం కావటం లేదు! సమకాలీన ఘటనలపై తక్షణ స్పందనకు ఈ కళారూపం గొప్పగా ఉపయోగపడుతోంది.
సైకత శిల్పాలూ, కోటలే కాకుండా ఇసుక పెయింటింగ్ కూడా చూసేవారిని అబ్బురపరుస్తుంది.
చూడండి ఈ చిత్రం-
ఇప్పుడు ఈ డైనోసార్ సైకత శిల్పం చూడండి....
దీని పేరు డైనో స్టోరీ. ఏ ఒక్క కళాకారుడో కాకుండా కెనడా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ కళాకారులు కొందరు బృందంగా ఏర్పడి కలిసికట్టుగా ఆస్ట్రేలియాలో 2008/09 లో దీన్ని రూపొందించారు.
సైకత కళా విన్యాసాలకు కొన్ని దృష్టాంతాలు....
నిద్రావస్థలోనో, విశ్రాంతిలోనో ఉన్న ఈ వదనం బాగుంది... కానీ పరిమాణం ఎంతుందో?
ఇప్పుడు చక్కగా తెలుస్తోంది... ఎంత పెద్దదో!
మరికొన్ని ....
సుదర్శన మాంత్రికుడు
నిజానికి ఈ సైకత కళ ఒరిస్సా లో ప్రాచీన, మధ్యయుగాల్లో ప్రాచుర్యంలో ఉండేదట. తర్వాత ఇటీవలి కాలం వరకూ ఉనికిలోనే లేకుండా పోయింది.
సైకత శిల్పం అనగానే మనందరికీ గుర్తొచ్చే పేరు సుదర్శన్ పట్నాయక్ ! ఒడిశా కళాకారుడైనా దేశమంతటికీ తెలిసిన వ్యక్తి.
బడికి వెళ్ళటానికి వీల్లేకుండా చేసిన పేదరికం అతనిది. ఈ దుస్థితి అంతిమంగా అతనికి మంచే చేసిందనాలి. 12 ఏళ్ళ వయసులో సముద్రపుటొడ్డుకు వెళ్ళి ఇసుకతో బొమ్మలు చేయటం సొంతంగా నేర్చుకున్నాడు.
తెల్లారకముందే ఇంటికి 3 కి.మీ. దూరంలో ఉన్న పూరీ గోల్డెన్ బీచికి వెళ్ళి ఇసుకతో దేవతల శిల్పాలు మలచటం, సూర్యోదయానికి ముందే వెనక్కి తిరిగివచ్చెయ్యటం... ఇదీ అతడి ప్రభాత దినచర్య.
మనసాగక... మధ్యాహ్నం మళ్ళీ సముద్ర తీరానికి వెళ్ళేవాడు. తను చెక్కిన బొమ్మలను చూసి జనం ఏమనుకుంటున్నారో ఆసక్తితో గమనించేవాడు!
కళానైపుణ్యం క్రమంగా పదునెక్కింది. జనం మెచ్చుకోవటమూ పెరిగింది. అలా మొదలైంది, సైకత కళతో సుదర్శన్ సహవాసం.
ఒరిస్సాలో ఏడో శతాబ్దంలో ఈ కళ ఉండేదట. 14 వ శతాబ్ది రచనల్లో దీని ప్రస్తావన కనిపిస్తుంది. తర్వాత ఈ కళ అంతరించిపోయింది.
దీని పునరుజ్జీవానికి అనుకోకుండానే కారకుడయ్యాడు సుదర్శన్.
అతడి కళా చాతుర్యానికి కొన్ని తార్కాణాలు...
కోణార్క్ ఆలయ నమూనాకు రూపమిస్తూ...
సముద్రుడు
ధ్యాన బుద్ధుడు
బిస్మిల్లా ఖాన్ కు నివాళి
గణేశుడు
హరిత దుర్గ
ఈ కళకు కొత్త రూపునివ్వటమే అతడి విజయ రహస్యం. తాజా సంఘటనలనూ, వర్తమాన సమస్యలనూ తన కళలో వెనువెంటనే ప్రతిఫలిస్తాడు. ఇతడి కళ ప్రాచుర్యం పొందటంలో టీవీల, పత్రికల పాత్ర కూడా ఉంది.
భూతాపం కావొచ్చు, అంతరించిపోతున్న జీవులూ, హెచ్ఐవీ- ఎయిడ్స్, స్వైన్ ఫ్లూ లాంటి వ్యాధులూ కావొచ్చు. పండగలూ, ప్రసిద్ధ వ్యక్తులకు నివాళులూ ... ఏదైనా ఈ సైకత కళలో ఒదిగేలా చేయగలడు, తన కళాచాతుర్యంతో వాటిపై అందరిలో కాసేపైనా ఆలోచనలు రేగేలా చేయగలడు.
చల్లని సైకత వేదిక...
డిసెంబరు 1 నుంచి 5 వరకూ ఇంటర్నేషనల్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్ (అంతర్జాతీయ సైకత కళోత్సవం) జరగబోతోంది. ఒడిశా లోని కోణార్క్ దగ్గరున్న చంద్రభాగ బీచ్ దీనికి వేదిక.
దీనికి బ్రాండ్ అంబాసిడర్ మరెవరో కాదు, సుదర్శనే !
దీనికి బ్రాండ్ అంబాసిడర్ మరెవరో కాదు, సుదర్శనే !
చిన్నపుడు చదువుకోవటం కుదరని సుదర్శన్ తన కళతో పాటు ఎదిగి మాతృభాష ఒరియాలోనే కాకుండా మరో మూడు భాషల్లో పరిజ్ఞానం పెంచుకున్నాడు. Sand Art గురించి పుస్తకమూ రాశాడు.
అతడి ఈ- మెయిల్ id ఇదీ- sudarsansand@gmail.com
21 కామెంట్లు:
అద్భుతం...ఇంకో మాట లేదు.
సుదర్శన్ గారు కారణ జన్ములు!
బిస్మిల్లా ఖాన్, బుద్ధుడు....అబ్బా వేయి కళ్ళు చాలవు చూడ్డానికి!
ఇంత మంచి పోస్ట్ రాసినందుకు మీకు అభినందనలు!
very nice..thanks for the post.
Beautiful pics..
Good Post.. ..
ఇలాంటి కళ ఉందని విననేలేదు..అద్భుతం..
Very wonderful.Isaw some fine sand sculptures previously,but it is the first time to see colours on them.
చూడరే! యీసృష్టి సృష్టికే ప్రతిసృష్టి చేసెనే మానవుడు
కాదులే మానవుడు కాదతడు మహనీయుడౌనులే
మరోబ్రహ్మయనియన్న కాదన్నవారెవరులే!!
@ ఆ.సౌమ్య, సుజాత, తృష్ణ: మీ స్పందనకు థాంక్యూలు.
@ పద్మార్పిత, రాజేష్: సుదర్శన్, ఇతర కళాకారుల కళ ప్రత్యేకతను మచ్చుకు ప్రతిఫలించేలాఈ pics ను ఎంచుకున్నాను. థాంక్యూ.
@ జ్యోతిర్మయి: ఏదైనా విశేష సంఘటన జరిగినపుడు, ప్రత్యేక సందర్భాలకూ సుదర్శన్ తయారుచేసే సైకత శిల్పాల ఛాయాచిత్రాలు వార్తా పత్రికల్లో వస్తుంటాయి. ఈసారి గమనించండి. థాంక్యూ.
@ కమనీయం, పింగళి శశిధర్: మీ స్పందనకు కృతజ్ఞతలు.
Proud of you Sudarshan.
Thanks for the post.
@ Sujata : మీ స్పందనకు థాంక్యూ!
ఈ కళ పూర్వాపరాలను తెలియజేశారు. ధన్యవాదాలు.
@ శిశిర: థాంక్యూ! సుదర్శన్ పట్నాయక్ వెబ్ సైట్ http://www.sandartindia.com/ కూడా చూస్తే మరిన్ని విశేషాలు తెలుసుకోవచ్చండీ.
మీరు మరిన్ని భారతీయ సైకత శిల్పాలను మన తెలుగు ఇసుక శిల్పాలను నా ఈ http://taraniarts.blogspot.com లో చూడవచ్చు
తరణి గారూ, మీరు చెక్కిన సైకత శిల్పాలు చాలా బాగున్నాయి. అభినందనలు !
అద్భుతంగా ఉన్నాయి
@ మౌనముగా మనసుపాడినా: మీ స్పందనకు థాంక్యూ.
వేణు గారు!
సజీవ చాయా చిత్రాలతో చాలా బాగుంది ఈ టపా. --సైకత ‘జీవన’ కాలం స్వల్పమే. ‘ఇసుక గడియారం’లో ఇసుకలాగా కాలం వేగంగా జారిపోతుంటే... వాతావరణంలో మార్పులు ఎంతటి కళారూపాలనైనా నిర్దయగా రూపం మార్చేస్తాయి-- నిజం. కానీ మీరు శాశ్వతంగా టపాలో భద్రపరిచారుగా.
"చల్లని సైకత వేదిక"- చాలా టపోచితంగా ఉంది.
తెలుగు అభిమాని గారూ! ‘చల్లని సైకత వేదిక’ అనే కవి ప్రయోగాన్ని ఈ టపాలో సముచితంగా ఉపయోగిస్తే మీలాంటి సంగీతాభిరుచి ఉన్నవారు హర్షిస్తారని తెలుసు. :) మీ అభినందనలకు కృతజ్ఞతలు.
beautiful!
@ రసజ్ఞ: థాంక్యూ.
కామెంట్‌ను పోస్ట్ చేయండి