సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

24, డిసెంబర్ 2011, శనివారం

శ్రవణానంద కారకా... ఇళయరాజా ! (పార్ట్-2 )



పాటల బాణీలు బాగుంటే వాటిని పాడుకుంటూ వుంటాం.  మధ్యలో వచ్చే ఇంటర్ ల్యూడ్స్ ని పెద్దగా పట్టించుకోం. అయితే  వీటికి కూడా కొత్తందాలు చేర్చటం  ఇళయరాజా ప్రత్యేకత.   
( మౌనగీతం లోని పరువమా... చిలిపి పరుగు తీయకే.. పాట కంటే  ఇంటర్ ల్యూడ్సే నాకు అత్యంత ఇష్టం )
శ్రీరామరాజ్యం పాటల్లో  ఇంటర్ ల్యూడ్స్ శ్రావ్యంగా, మధురంగానే కాకుండా కొత్తగా,  గమ్మత్తుగా కూడా ఉంటాయి. పాటలను  ఇవి  సహజంగా,  అందంగా  అలంకరించేశాయి. 
 సినిమా  పాటల్లోని కొన్ని  ఇంటర్ ల్యూడ్స్ క్లిప్స్ ను ఈ టపాలో  ఇవ్వబోతున్నాను.
అవి  మాత్రమే వినిపించటం కోసం లిరిక్ నీ, గాయకుల గాత్రాన్నీ తొలగించాల్సివచ్చింది.  ఆ పాటలను బాగా  ఇష్టపడేవారు తప్పనిసరి  రసభంగానికి  మన్నించాలి. 

దేవుళ్ళే మెచ్చింది -  మీ ముందే జరిగింది...
ఈ పాటలో   ... పూమాలై కదిలే ఆ స్వయంవర వధువే... అనే ప్రయోగంలోని చమత్కారం బాగుంటుంది.  ఆ  తర్వాత  వినిపించే వాద్య సంగీతం ఎంత సమ్మోహనంగా ఉంటుందో,  సీత పాత్రను ధరించిన  తార  నయనాభినయం  అంత ఆహ్లాదకరం !




శ్రీరామ లేరా ఓ రామా...’


ఈ పాట లోని  వాద్య సంగీత ఝరి  ఆరంభం నుంచీ  చివరివరకూ  కొత్త తరహాలో ... సింఫనీని స్ఫురింపజేస్తూ  కర్ణపేయంగా వినిపిస్తుంది.  


ఇళయరాజా అలనాటి ఇన్ స్ట్రుమెంటల్  ఆల్బమ్  ‘నథింగ్ బట్ విండ్’  సంగీతం  తలపుకొస్తుంది.   





 ‘రామాయణమూ  శ్రీ రామాయణమూ..’ 

నాకెంతో బాగా నచ్చిన పాట ఇది.  బాణీ మాత్రమే కాకుండా  మధ్యలో కూర్చిన ఇంటర్ ల్యూడ్స్  వల్ల కూడా ఈ పాట ఆకట్టుకుంటుంది.  



‘శ్రీరామ పట్టాభిషేకం... ’  లిరిక్ కి ముందు వచ్చే వాద్య సంగీతం గమనించండి.    విషాదసూచకంగా ధ్వనిస్తూ  వింత అనుభూతినిస్తుంది.  ‘... చెదరని దరహాసం ... కదిలెను వనవాసం’ కి ముందు వచ్చే ధ్వని సంచయం  కూడా శ్రవణానందకరం.







పాట మొత్తం వినాలనుకున్నవారి కోసం....





నేటి యువతరాన్ని లక్ష్యం చేసుకుని పద్యాల హడావిడి లేకుండా,  వేదాంత ధోరణితో ప్రౌఢంగా కాకుండా వీలైనంత సరళంగా తీసిన  ‘శ్రీరామరాజ్యా’నికి   సంగీత శాఖ  పెద్ద ఎసెట్ అనే భావిస్తున్నాను.


కొత్తదనంతో పరిమళించిన ఈ సంగీతం ఇళయరాజా  చాలా కాలం తర్వాత అందించిన   శ్రావ్యమైన ఆడియో.  


బాధ్యతగా బాణీలను కట్టి,  శ్రద్ధతో  మనసుపెట్టి   రీ రికార్డింగుని  సమకూర్చి - అందరినీ కాకపోయినా  అభిమాన శ్రోతల్లో చాలామందిని  సంతృప్తి పరిచాడు  మేస్ట్రో !


ఈ టపా మొదటి భాగం ఇక్కడ చూడండి. 

6 కామెంట్‌లు:

రామ్ చెప్పారు...

వేణు గారూ!

“శ్రవణానంద కారకా..” Title సెబాసో…. post తో పాటు.!!

“ గాన్ కీ ప్రాణ నాయకా ….” అని మీతో గొంతు కలుపుతూ !!!

Ram

వేణు చెప్పారు...

Ram గారూ, ‘శ్రీరామరాజ్యం’ నేపథ్యసంగీతం గురించి రాసిన ఈ టపాపై మీ స్పందనకు థాంక్యూ. “ గాన్ కీ ప్రాణ నాయకా …” అనే ప్రయోగం బాగుంది!

Kottapali చెప్పారు...

టపా శీర్షిక చాలా బావుంది. శ్రవ్యకాల తునకలు కూడ

వేణు చెప్పారు...

నారాయణస్వామి (కొత్తపాళీ) గారూ, థాంక్యూ.

vijay చెప్పారు...

ఈ ఆడియోని ఎలా పబ్లిష్ చేసారు?

వర్డ్ ప్రెస్ లో ఉన్నదీ లేనిదీ నాకు తెలియదు. ఉంటే అవీ అలవాటు చేసుకోవాలిక.

ఓ సారి మెయిల్ చూడండి.

వేణు చెప్పారు...

vijay గారూ, Divshare సైట్ లో రిజిస్టర్ అయితే మన ఆడియోలూ, పీడీఎఫ్ లూ మన ఎకౌంట్లో అప్ లోడ్ చేసుకోవచ్చు. వాటి ఎంబెడెడ్ కోడ్ ని మన బ్లాగులో కాపీ- పేస్ట్ ద్వారా పోస్టు చేసుకోవచ్చు! వర్డ్ ప్రెస్ బ్లాగుల్లో కూడా ఇలా చేయొచ్చనుకుంటాను.