కావలసింది ఆలోచన... విచక్షణ (రోడిన్ శిల్పం ‘థింకర్’) |
తాము అభిమానించేవారు చనిపోయిందాకా ఆగకుండానే విగ్రహాలు పెట్టేవారు కొందరైతే.. . తమ విగ్రహాలను తామే పెట్టించుకునేవారు మరికొందరు.
సినీ తారలకు గుళ్ళు కట్టి పూజించే దురభిమానం.. కోపమొస్తే వాటిని ధ్వంసం కూడా చేసేంతటి ఆగ్రహాభిమానం పొరుగు రాష్ట్రంలో చూస్తుంటాం!
రాజకీయాల విషయానికొస్తే... విగ్రహాల ప్రతిష్ఠ అనేది ప్రతిష్ఠకూ, పరపతికీ సంబంధించినదిగా, ఓట్లు పెంచుకునే సాధనంగా భావించటం పెరగటం వల్ల ఈ విగ్రహావిష్కరణలు పెరుగుతూనే ఉన్నాయి.
కొత్త విగ్రహాలకు చోటే దొరకనంతగా ఊళ్ళల్లో కూడళ్ళు కిటకిటలాడటం చూస్తూనే ఉంటాం.
రకరకాల భావజాలాల ప్రతినిధుల విగ్రహాలనూ , రాజకీయ నాయకుల విగ్రహాలనూ వాటి వ్యతిరేకులు అవమానించటం, ధ్వంసం చేయటం.. ప్రతిగా వారి వ్యతిరేకుల ప్రతిచర్యలూ.. ఆగ్రహావేశాలూ... సవాళ్ళూ, జరిగిన అవమానాన్ని ‘శుద్ధి ’ చేయటానికని క్షీరాభిషేకాలూ .. ఈ మధ్య ప్రతిరోజూ పేపర్లలో చూస్తున్నాం.
ఆ నాయకుల విగ్రహం ధ్వంసం చేశారన్న కోపంతో ఈ నాయకుల విగ్రహాల విధ్వంసం... నిరసనగా బంద్ .. . ఈ బంద్ కు వ్యతిరేకంగా ర్యాలీ...
ఇవన్నీ విషవలయంలాగా తయారయ్యాయి.
(ఈనాడు హైదరాబాద్ ఎడిషన్‌లో ఇవాళ వచ్చిన ఫొటో ఇది.) |
రాష్ట్రానికి తలనొప్పిగా మారిన కొత్త సమస్య ఇది. ఎప్పటినుంచో ఉండి, అప్పడప్పడూ బయటపడుతున్న పాత సమస్య కూడా!
ఈ విగ్రహాల అంశం మూలాలను స్పృశిస్తూ రంగనాయకమ్మ గారు ఇవాళ ‘ఆంధ్రజ్యోతి’లో వ్యాసం రాశారు.
ఆలోచనాత్మకమైన ఈ వ్యాసంలోని కొన్ని భాగాలు చూడండి...
'విగ్రహ విధ్వంసం' అనే వికృతత్వం, దాని కన్నా ముందు జరిగే 'విగ్రహ ప్రతిష్ట' అనే మొదటి వికృతత్వానికి తప్పనిసరి ఫలితం! చిత్రాల లాగే విగ్రహాలు కూడా కళారూపాలే కావచ్చు. కళారూపాలకు, అవి నిలబడవలసిన స్తలాలే సవ్యమైన స్తలాలు. కళా రూపాలకు పోరాటాల పాత్రలు అప్పజెప్పకూడదు.
మనుషుల విగ్రహాల్ని కళా రూపాలుగా భావిస్తూ, ఇళ్లల్లోనూ, మ్యూజియమ్లలోనూ పెట్టుకుంటే, వాటిని ఆ ఇళ్లవాళ్లూ, ఆ మ్యూజియంల వాళ్లూ, ఇష్టంతో బాధ్యతతో చూసుకుంటారు. కానీ వాటిని బహిరంగ ప్రదేశాల్లో పెడితే, వాటిని అవమానించే సదవకాశాలు వాటి వ్యతిరేకుల్ని పిల్చి అప్పగించినట్టే!
విగ్రహాన్ని అవమానం నించి తప్పించే మార్గం, దాన్ని మరింత మరింత దృఢ తరం చెయ్యడం కాదు. మట్టితో రక్షణ లేక, కంచుతో రక్షణ దొరికితే, అది కంచు శక్తే గానీ, అది ఆ నాయకుడి శక్తి కాదు. విగ్రహం చుట్టూ తుపాకులతో కాపలాలు కాయడాలైతే, తుపాకీ లేకుండా రక్షణ దొరకని విగ్రహానికి అదే అసలైన అవమానం.
ఆహారంగా వుపయోగపడే పాలు, ఆకలితో అలమటించే నిరుపేద పిల్లల కడుపుల కోసంగానీ, విగ్రహాల అభిషేకాల కోసం కాదు. భూమిని ఉపయోగించవలసింది, నిలవనీడలేని నిరాశ్రయుల నివాసాల కోసం గానీ, బొమ్మల్ని నిలబెట్టడం కోసం కాదు.
మొత్తం వ్యాసం ఇక్కడ...
32 కామెంట్లు:
'విగ్రహ విధ్వంసం' అనే వికృతత్వం, దాని కన్నా ముందు జరిగే 'విగ్రహ ప్రతిష్ట' అనే మొదటి వికృతత్వానికి తప్పనిసరి ఫలితం! - perfect.
1970ల టైమ్‌లో పంజాబ్‌లో నక్సలైట్ ఉద్యమం బలంగా ఉన్న రోజుల్లో గాంధీ విగ్రహాలని ద్వంసం చేసినది చైనా సాంస్కృతిక విప్లవ స్ఫూర్తితోనే. చైనా సాంస్కృతిక విప్లవాన్ని సమర్థించే రంగనాయకమ్మ గారు ఈ విషయం గుర్తించలేదనిపిస్తోంది. కైలాస్-మాన్ సరోవర్ ప్రాంత సరిహద్దు వివాదం వల్ల ఇండియా-చైనాల మధ్య యుద్ధం జరిగితే హిందీ సినిమా నిర్మాతలు చైనా వ్యతిరేక సినిమాల పేరుతో కమ్యూనిస్ట్ వ్యతిరేక సినిమాలు నిర్మించారు. ఆ సినిమాలు ప్రదర్శించే థియేటర్లని కూడా నక్సలైట్లు ద్వంసం చేశారు. పంజాబ్‌లో ఆ సినిమాలు పోలీస్ ప్రొటెక్షన్‌తో థియేటర్లలో ప్రదర్శితమయ్యేవి. పరమ్‌జిత్ సింగ్ గారు వ్రాసిన "Insurrection to Agitation - The Naxalite Movement in Punjab" పుస్తకంలో ఈ విషయాలన్నీ చదివాను.
@ ప్రవీణ్ శర్మ: ‘చైనా సాంస్కృతిక విప్లవ స్ఫూర్తితో’ చేస్తే మాత్రం? ఆ విధ్వంసానికి సమర్థన దొరుకుతుందా?
‘విగ్రహాలపై చూపే కక్ష నీచమైన అధమ స్థాయితనం’ అనీ, ‘విగ్రహ విధ్వంసంతో వ్యతిరేకులు సాధించేదేమీ వుండదు. వారి ఆగ్రహాలు కొంత తగ్గితే, వారి వ్యతిరేకుల ఆగ్రహాలు వెయ్యి రెట్లు పెరుగుతాయి. చివరికి విధ్వంసాలతో సాధించేది అపజయమే’ననీ రంగనాయకమ్మ గారు ఇదే వ్యాసంలో రాశారు కదా? ఈ విషయం మీరు గుర్తించలేదన్నమాట!
గాంధీ చనిపోయినా అతని పేరు చెప్పుకుని పాలక వర్గంవాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. అందుకే 1970లలో గాంధీ విగ్రహాలని నక్సలైట్లు ద్వంసం చేశారు. కానీ దళితుల విషయం అలా కాదు కదా. దళితులు అంబేద్కర్ పేరు చెప్పుకుని పబ్బం గడుపుకోవడం లేదు. తమ కులం నుంచి వచ్చిన అంబేద్కర్ అనే జాతి నాయకుడు ఉన్నాడని చెప్పుకుంటున్నా వాళ్ళని ఎవరూ గౌరవంగా చూడడం లేదు. అదే కదా ఇక్కడ ప్రధాన తేడా. నేనేమీ అంబేద్కర్ అభిమానిని కాదు. "దళిత సమస్య పరిష్కారానికి" పుస్తకంలో అంబేద్కర్ పై రంగనాయకమ్మ గారు చేసిన విమర్శలు చదివాను. అయితే ఒక విషయంలో మాత్రం రంగనాయకమ్మ గారు అంబేద్కర్‌ని సమర్థించారు. అంబేద్కర్ లేకపోతే దళితులు కూడా గాంధీ ఒక మహాత్ముడు అనే భ్రమలో ఉండేవాళ్ళు అనే విషయంలో. నాకు కూడా ఆ విషయంలోనే అంబేద్కర్ అంటే అభిమానం ఉంది, అంతే. ప్రజలకి ఎలాంటి మేలూ చెయ్యని వంగవీటి రంగా లాంటి వీధి రౌడీల విగ్రహాలు కనిపిస్తుండగా అణగారిన కులాలకి కొంచెమైనా మేలు చేసిన అంబేద్కర్ విగ్రహాలని తొలిగిస్తామంటే అణగారిన కులాలవాళ్ళు ఎలా ఒప్పుకుంటారు?
@ ప్రవీణ్ శర్మ: ఈ వ్యాసంలోని విషయం మీకు అర్థమయిందో లేదో నాకు అర్థం కావటం లేదు.
>>‘గాంధీ చనిపోయినా అతని పేరు చెప్పుకుని పాలక వర్గంవాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. అందుకే 1970లలో గాంధీ విగ్రహాలని నక్సలైట్లు ద్వంసం చేశారు. >>
గాంధీ విగ్రహాలను ధ్వంసం చేయటం వల్ల పాలకవర్గం వాళ్ళు పబ్బం గడుపుకోవటం ఆగిపోయిందా? జనాన్ని చైతన్యవంతం చేయటం కంటే విగ్రహాలు కూల్చెయ్యటం తేలికే మరి!
నేనేమీ విగ్రహాలు పెట్టే సంస్కృతిని సమర్థించడం లేదు. అంబేద్కర్లాగ దళిత ఉద్యమాన్ని ముందు ఉండి నడిపించినవాళ్ళు మరో వంద మంది ఉంటే కేవలం అంబేద్కర్ విగ్రహాలు పెట్టాలని దళితులకి అనిపించదు. అటువంటి నాయకుడు ఒక్కడే ఉన్నాడనే కదా దళితులు అతని విగ్రహాలు మాత్రమే పెట్టుకుంటున్నారు. స్త్రీ-పురుష సమానత్వం 100% సాధిస్తే స్త్రీవాదం అనే కాన్సెప్ట్‌తో అప్పుడు అవసరం లేకుండా పోతుంది. అలాగే కులం అనే ఐడెంటిటీ పూర్తిగా పోతే దళితవాదం అనే కాన్సెప్ట్‌తో కూడా అలాగే అవసరం లేకుండా పోతుంది. ఇప్పుడు స్త్రీ-పురుష సమానత్వం అనేది లేదు కాబట్టే కదా స్త్రీవాదం అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. దళితవాదం అనే పదం వినిపిస్తున్నది కూడా కుల వివక్ష వల్లే. కుల వివక్ష గానీ ఐడెంటిటీ గానీ లేని రోజు వస్తే అప్పుడు ఎవరూ అంబేద్కర్ విగ్రహం పెట్టుకుని ఐడెంటిటీ ప్రదర్శించుకోవాలని అనుకోరు. ఇప్పుడు దళితులు అంబేద్కర్ విగ్రహాలని ప్రతి దళితవాడలోనూ పెట్టుకుంటున్నది ఐడెంటిటీ కోసమే. ఐడెంటిటీ అనేది అగ్రకులాలవాళ్ళకే కానీ దళితులకి ఉండకూడదు అని అంటే దళితులు ఒప్పుకోరు కదా. విగ్రహాల సంస్కృతికి నేను వ్యతిరేకమే కానీ కుల సంస్కృతి ఉన్నంత వరకు విగ్రహాల సంస్కృతి కూడా ఉంటుందనే విషయం మర్చిపోకూడదు.
>>>>>
ఈ వ్యాసంలోని విషయం మీకు అర్థమయిందో లేదో నాకు అర్థం కావటం లేదు.
>>>>>
వ్యాసంలోని విషయం నాకు అర్థమైంది. విగ్రహాల సంస్కృతి ఎక్కడ ఉన్నా అది వ్యక్తిపూజ (personality cult)ని ప్రోత్సహిస్తుంది. విగ్రహాలని ద్వంసం చేసినంత మాత్రాన వ్యక్తిపూజ సంస్కృతి పోదు కానీ మోహన్ దాస్ గాంధీ అనే ఒక జాతి ద్రోహి విగ్రహాలు ఊరూరా కనిపిస్తోంటే చూసి సిగ్గుపడలేక, సిగ్గుని అణచుకోలేక ద్వంసం చేశారని ఎందుకు అనుకోకూడదు?
>> అంబేద్కర్లాగ దళిత ఉద్యమాన్ని ముందు ఉండి నడిపించినవాళ్ళు మరో వంద మంది ఉంటే కేవలం అంబేద్కర్ విగ్రహాలు పెట్టాలని దళితులకి అనిపించదు. అటువంటి నాయకుడు ఒక్కడే ఉన్నాడనే కదా దళితులు అతని విగ్రహాలు మాత్రమే పెట్టుకుంటున్నారు. >>
వందమంది గొప్ప నాయకులుంటే విగ్రహాలు పెట్టాలనిపించదు గానీ ఒక్కడే ఉన్నాడు కాబట్టి విగ్రహాలు పెట్టుకుంటున్నారా? ఇదెక్కడి సూత్రీకరణ? ఇలా ఏ దళిత నాయకులు, ఎప్పుడు ప్రకటించారు?
>> కుల సంస్కృతి ఉన్నంత వరకు విగ్రహాల సంస్కృతి కూడా ఉంటుందనే విషయం మర్చిపోకూడదు. >>
అంటే కులాలు పోతే విగ్రహాల సంస్కృతి పోవాలి కదా? కానీ కులాలు లేని చైనాలో మావో విగ్రహాల సంగతేమిటి?
>> ఇప్పుడు దళితులు అంబేద్కర్ విగ్రహాలని ప్రతి దళితవాడలోనూ పెట్టుకుంటున్నది ఐడెంటిటీ కోసమే. >>
దళితులు ఈ కారణంతో విగ్రహాలు పెట్టుకుంటుంటే... మరి అగ్రకులాల వాళ్ళు కూడా వాళ్ళ నేతల విగ్రహాలు ఎందుకని పెట్టుకుంటున్నారు? వాళ్ళక్కూడా ఐడెంటిటీ సమస్యేనా? కాదు; ఆధిక్య ధోరణి కారణమంటారా? అయితే పరస్పర విరుద్ధ ప్రయోజనాలను విగ్రహాల ప్రతిష్ఠాపన ఎంతో చక్కగా నెరవేరుస్తోందన్నమాట!
>> .... విగ్రహాలు ఊరూరా కనిపిస్తోంటే చూసి సిగ్గుపడలేక, సిగ్గుని అణచుకోలేక ద్వంసం చేశారని ఎందుకు అనుకోకూడదు? >>
విగ్రహాల సంస్కృతిని వ్యతిరేకించటం ఒక్కటే సరిపోదు, విగ్రఃహాల విధ్వంసం వల్ల ప్రయోజనం ఉండదనీ, పైగా దుష్ఫలితాలు ఉంటాయనీ కూడా గ్రహించాలి. నక్సలైట్లు గానీ, మరెవరు గానీ ఏ కారణంతో విగ్రహాలు ధ్వంసం చేసినా ఫలితంలో తేడా రాదు!
>>>>>
వందమంది గొప్ప నాయకులుంటే విగ్రహాలు పెట్టాలనిపించదు గానీ ఒక్కడే ఉన్నాడు కాబట్టి విగ్రహాలు పెట్టుకుంటున్నారా? ఇదెక్కడి సూత్రీకరణ? ఇలా ఏ దళిత నాయకులు, ఎప్పుడు ప్రకటించారు?
>>>>>
వంద మంది నాయకులు ఉంటే ఒక్కడికే ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఎవరూ అనుకోరు కదా.
>>>>>
దళితులు ఈ కారణంతో విగ్రహాలు పెట్టుకుంటుంటే... మరి అగ్రకులాల వాళ్ళు కూడా వాళ్ళ నేతల విగ్రహాలు ఎందుకని పెట్టుకుంటున్నారు? వాళ్ళక్కూడా ఐడెంటిటీ సమస్యేనా? కాదు; ఆధిక్య ధోరణి కారణమంటారా? అయితే పరస్పర విరుద్ధ ప్రయోజనాలను విగ్రహాల ప్రతిష్ఠాపన ఎంతో చక్కగా నెరవేరుస్తోందన్నమాట!
>>>>>
ఐడెంటిటీ సంస్కృతి మొదట ప్రారంభమయ్యింది అగ్రకులాల నుంచే కదా. ఒకప్పుడు మద్రాస్ రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులలో బ్రాహ్మణులు ఎక్కువగా ఉంటే జస్టిస్ పార్టీ నాయకులలో కమ్మవాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. అగ్రకులాలవాళ్ళు తమ ఐడెంటిటీని త్యజించకుండా దళితులని మాత్రమే ఐడింటిటీ రాజకీయాలకి పోవద్దు అని అంటే పోకుండా ఉండరు.
చైనాలో మావో విగ్రహాలు ఎందుకు ఉన్నాయి? అడిగారు. చైనాలో ఇప్పుడు ఉన్నది డెంగ్ సియావోపింగ్‌ని అనుసరించే ప్రభుత్వం. రివిజనిస్ట్లు మావోని కేవలం ఉత్సవ విగ్రహంగా మార్చేసి డెంగ్ సియావోపింగ్‌ని మాత్రం ఆరాధ్య దైవంలా పూజిస్తున్నారు.
కానీ గాంధీ, అంబేద్కర్లు ఇక్కడ ఉత్సవ విగ్రహాలు కారు. జనం కమ్యూనిజం వైపు వెళ్ళకుండా చెయ్యడానికి గాంధీ విగ్రహాలు పాలకవర్గంవాళ్ళకి ఇంప్లిమెంట్స్(ఉపకరణాలు). అంబేద్కర్ విగ్రహాల విషయానికొస్తే ఆ విగ్రహాలు తమ ఐడెంటిటీకి ఉపకరణాలు అని దళితులు అనుకుంటున్నా ఆ విగ్రహాల వల్ల దళితులు ఐడెంటిటీ పొందలేకపోతున్నారు.
గాంధీ విగ్రహాలకీ, అంబేద్కర్ విగ్రహాలకీ మధ్య పోలిక పెట్టడం అనవసరం. ఆ రెండింటి యొక్క పర్పోస్ వేరు. ఒక వర్గంవాళ్ళు గాంధేయవాదాన్ని ప్రజలలో indoctrinate చెయ్యడంలో సఫలమైతే మరో వర్గంవాళ్ళు అంబేద్కర్‌వాదాన్ని ప్రజలలోకి తీసుకువెళ్ళడానికి కూడా విఫలమయ్యారు. దళితులు వీధికి ఒకటి కాదు, సందుకి ఒకటి అంబేద్కర్ విగ్రహం పెట్టుకున్నా అంబేద్కర్‌వాదం ప్రజలలోకి వెళ్ళే పరిస్థితి మన దేశంలో లేదు.
ముళ్ళకంచెల మధ్య ఉన్న నెహ్రూగారి విగ్రహాన్ని చూస్తే బాధగా ఉంది.పైగా ప్రవీణ్‌శర్మ లాంటి వారు గాంధీజీ వంటి"దేశద్రోహి" విగ్రహాలని కూల్చడం మంచిదే గాని అంబేద్కర్ లాంటి నాయకుడి విగ్రహాలను మాత్రం కూల్చడం తప్పు అని అనడం ఇంకా బాధాకరం. కొందరైనా అభిమానించే వారి విగ్రహాలని వారు పెట్టుకొంటారు.అందువలన ఏ విగ్రహాన్నైనా కూల్చడం ,అది ఎవరిదైనా ,తప్పే.సంస్కారం ఉన్నవాళ్ళెవ్వరూ అలా చెయ్యరు.దళితుల్లోనే అంతహ్ కలహల వలన అంబెద్కర్ విగ్రహాల కూల్చివేత జరిగిందని తెలుస్తోంది.కులాలు లేని అనేక దేశాల్లో కూడా విగ్రహాల ప్రతి ష్ఠాపన ఉంది కదా.టాంక్ బండ్ లో విగ్రహాల కూల్చివేత చూశాము కదా .పైగా దాన్ని కొందరు సమర్థించారు కూడా.మన ప్రజలు,నాయకులు,రచయితల్లో వివేకం ,సంస్కారం పెంపొందేవరకు కొన్నాళ్ళపాటు విగ్రహాల స్థాపన నిల్పి వెయ్యడం ఉత్తమమని తోస్తున్నది.
>>>>>
టాంక్ బండ్ లో విగ్రహాల కూల్చివేత చూశాము కదా .పైగా దాన్ని కొందరు సమర్థించారు కూడా.
>>>>>
దాన్ని సమర్థించినవాళ్ళలో నేనూ ఒకణ్ణి. విగ్రహాలు ఒక వర్గ సంస్కృతిని ప్రతిబింబిస్తున్నప్పుడు విరోధి వర్గంవాళ్ళు ఆ విగ్రహాలని ద్వంసం చెయ్యడం నాకు విచిత్రమనిపించలేదు.
@ ప్రవీణ్ శర్మ: >> దాన్ని సమర్థించినవాళ్ళలో నేనూ ఒకణ్ణి. విగ్రహాలు ఒక వర్గ సంస్కృతిని ప్రతిబింబిస్తున్నప్పుడు విరోధి వర్గంవాళ్ళు ఆ విగ్రహాలని ద్వంసం చెయ్యడం నాకు విచిత్రమనిపించలేదు.>>
మీకు విచిత్రమనిపించకపోవటం వేరు; దాన్ని మీరు సమర్థించటం వేరు.
విగ్రహ విధ్వంసం వికృతత్వం అనీ, దాని వల్ల సాధించేది పరాజయమేననీ ఈ వ్యాసంలో రంగనాయకమ్మ గారు చెప్పిన మాటలతో మీరు విభేదిస్తున్నారన్నమాట. అలా కాకపోతే విగ్రహాల విధ్వంసాన్ని మీరెలా సమర్థించగలిగారు?
"విగ్రహాలు ఒక వర్గ సంస్కృతిని ప్రతిబింబిస్తున్నప్పుడు విరోధి వర్గంవాళ్ళు ఆ విగ్రహాలని ద్వంసం చెయ్యడం నాకు విచిత్రమనిపించలేదు."
టాంక్ బండ్ మీద విగ్రహాలు ఏ వర్గ సంస్కృతిని ప్రతిబింబించాయి ప్రవీణ్? తెలుగు ప్రజల సంస్కృతేగా? విరోధి వర్గం వాళ్లెవరు? కూల్చిన వాళ్ళు తెలుగు వాళ్ళు కాదా?
నీకు వర్గ సంస్కృతి అనే పదం నచ్చినంత మాత్రాన ప్రతి సందర్భంలోనూ వాడేయకు పెద్దగా బాగోదు.
మీకు విషయం అర్థమయ్యేలా చెపుతాను. ముందు గాంధీ విగ్రహాల ద్వంసం గురించి సమాధానం చెప్పి తరువాత ట్యాంక్ బండ్ విగ్రహాల ద్వంసం గురించి చెపుతాను.
1948కి ముందు కమ్యూనిస్ట్‌లు మాత్రమే కాదు, దోపిడీ వర్గానికి ప్రతినిధులైన RSSవాళ్ళు కూడా గాంధీని విమర్శించారు. గాంధీ కూడా దోపిడీ వర్గానికి ప్రతినిధి అయినా దోపిడీ అనేది కేవలం అహింసని నమ్ముకుని చెయ్యడం సాధ్యం కాదు. అందుకే దోపిడీ వర్గంలో కూడా కొంత మంది గాంధీని విమర్శించారు. కానీ 1948లో గాంధీ హత్యకి గురైన తరువాత అతను చాలా మంది దోపిడీ వర్గంవాళ్ళకి ఆరాధ్య దైవం అయిపోయాడు. జనం కమ్యూనిస్ట్ విప్లవాల వైపు వెళ్ళకుండా చెయ్యాలంటే గాంధీ పేరు చెప్పుకుని పబ్బం గడుపుకోవడం మేలైన మార్గం అని దోపిడీ వర్గంలో చాలా మందికి అనిపించింది. అందుకే ఊరూరా గాంధీ విగ్రహాలు ప్రతిష్టించి గాంధీని ఒక దేవుణ్ణి చెయ్యడం జరిగింది. గాంధీని ఏసు క్రీస్తుతోనూ, గౌతమ బుద్ధునితోనూ సమానుణ్ణి చెయ్యడం కూడా జరిగింది. 1967లో నక్సలైట్ ఉద్యమం ఆరంభమయ్యింది. దోపిడీ సంస్కృతి పోవాలంటే దోపిడీ సంస్కృతి యొక్క చిహ్నాలని కూడా ద్వంసం చెయ్యాలనే మావో జెడాంగ్ యొక్క బోధనని విశ్వసించి కొన్ని చోట్ల గాంధీ విగ్రహాలని ద్వంసం చేశారు. అయితే పాలక వర్గంవాళ్ళు భూసంస్కరణలు, గ్రామాల విద్యుతీకరణ, జాతీయ పరిశ్రమల స్థాపన లాంటి సంస్కరణ కార్యక్రమాలు చేపట్టి, నిరుద్యోగాన్ని తగ్గించి ప్రజలు నక్సలైట్ ఉద్యమం వైపు వెళ్ళకుండా చెయ్యగలిగారు. కానీ ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లాంటి కొన్ని చోట్ల నక్సలైట్లు ఇంకా మిగిలారు. ప్రజలు తాత్కాతిక ప్రయోజనాలకి ఆశపడి పాలక వర్గాన్ని గుడ్డిగా నమ్మేసినంతమాత్రాన గతితార్కిక-చారిత్రక భౌతికవాదం తెలిసిన మావోయిస్ట్‌లు పాలక వర్గాన్ని గుడ్డిగా నమ్మెయ్యడం జరగదు. అయితే ఇప్పుడు పాలక వర్గంవాళ్ళు జనం విప్లవం వైపు వెళ్ళకుండా చెయ్యడానికి అంత కష్టపడడం లేదు. గాంధీ జయంతి నాడు & గాంధీ వర్ధంతి నాడు మాత్రమే గాంధీ పేరు స్మరిస్తున్నారు. ఇప్పుడు గాంధీ విగ్రహాలని ద్వంసం చెయ్యడం వల్ల వచ్చేది ఏమీ ఉండదు. ఎందుకంటే పాలక వర్గంవాళ్ళు అహింస పేరు చెప్పుకుని అధికారాన్ని కాపాడుకోవడం అన్ని వేళలా సాధ్యం కాదు. అహింస పేరు చెప్పుకుని అధికారాన్ని కాపాడుకోవడం సాధ్యం కాదు అనిపించినప్పుడు గాంధీ విగ్రహాలని కాకుండా పోలీసుల్నీ, తుపాకులనే నమ్ముకుని అధికారాన్ని కాపాడుకుంటారు. ఈ విషయం తెలిసిన మావోయిస్ట్‌లు గాంధీ విగ్రహాలని ద్వంసం చెయ్యకుండా వేరే పనులు చేస్తారు. అందుకే 1970ల కాలంలో గాంధీ విగ్రహాలని ద్వంసం చేసిన మావోయిస్ట్‌లు ఇప్పుడు ఆ విగ్రహాలని ద్వంసం చెయ్యడం లేదు.
ట్యాంక్ బండ్ విగ్రహాల ద్వంసాన్ని మాత్రం నేను 100% సమర్థిస్తాను, విగ్రహాల ద్వంసం విషయంలో రంగనాయకమ్మ గారి అభిప్రాయం ఎలా ఉన్నా. తుళువ జాతీయుడైన శ్రీకృష్ణ దేవరాయులు కేవలం పరిపాలన సౌలభ్యం కోసం తన మాతృభాష కాని తెలుగు భాషని ప్రోత్సహించాడు. అందులో విచిత్రమేమీ లేదు. బీజాపుర్ ఆదిల్ షాహీ రాజులు కూడా తమ పరిపాలన సౌలభ్యం కోసం మరాఠీ భాషని అధికార భాషగా ప్రకటించారు. ఇప్పుడు మన రాష్ట్రంలో సమైక్యత ముసుగులో హైదరాబాద్వాద(సమైక్యవాదం అనే అందమైన పేరు పెట్టుకున్న) ఉద్యమం నడుస్తోంది. ఆ ఉద్యమం నడుపుతున్నవాళ్ళకి శ్రీకృష్ణ దేవరాయులు, పొట్టి శ్రీరాములు లాంటి కొందరు చరిత్ర పురుషుల పేర్లు అవసరమయ్యాయి, వాళ్ళ విగ్రహాలు కూడా అవసరమయ్యాయి. తెలంగాణాలో బ్రిటిష్-నిజాంలకి వ్యతిరేకంగా పోరాడిన తుర్రెబాజ్ ఖాన్, మౌల్వీ అలాఉద్దీన్ లాంటివాళ్ళ విగ్రహాలు లేవు కానీ తెలంగాణాలో ఎన్నడూ సంచరించని కోస్తా ఆంధ్ర నాయకుల విగ్రహాలు ఉన్నాయి. ఇది కోస్తా ఆంధ్ర ప్రాంతీయవాద సంస్కృతిని ప్రతిబింబించేదే కనుక ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలని ద్వంసం చెయ్యడాన్ని నేను సమర్థించాను. విగ్రహాలు ద్వంసం చేసినంతమాత్రాన ప్రత్యేక రాష్ట్రం రాదు కానీ ప్రాంతీయతత్వాన్ని ప్రతిబింబించే సంస్కృతికి చెందిన విగ్రహాలని ద్వంసం చెయ్యడం తప్పు కాదనే నమ్ముతాను.
నీ మాటల్లో రెండు నాల్కల ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది ప్రవీణ్
@ ప్రవీణ్ శర్మ: ఫలానా సంస్కృతిని ప్రతిబింబిస్తున్నారనే నచ్చని నాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే ఆ సంస్కృతిని అభిమానించే ప్రజలకు ఆ నాయకుడి మీదున్న అభిమానం ఏమీ ధ్వంసమైపోదు.
ఏదో ఒక సాకుతో ప్రభుత్వం - పుస్తకాలను నిషేధించటం, పుస్తకాల్లోని విషయం వ్యతిరేకించేవారు ఆ పుస్తకాలను దహనం చేయటం కూడా ఇలాంటి అర్థం లేని పనులే. నిషేధిస్తే, కూల్చేస్తే, కాల్చేస్తే భావాలూ, అభిమానాలూ అంతరించిపోవని అర్థం చేసుకోవడానికి పెద్ద జ్ఞానం అక్కర్లేదు. నిష్ఫలమైన, వికృతమైన చర్యలు ఇవి!
మంచి భావాలను పెంచాలనే ఉద్దేశం ఉంటే ముందు ప్రజల ఆలోచనా శక్తి మీద గౌరవం ఉండాలి. వారిని చైతన్యవంతం చేయాలంటే అది సహనంతో చేయాలి, విచక్షణతో చేయాలి!
>> ప్రాంతీయతత్వాన్ని ప్రతిబింబించే సంస్కృతికి చెందిన విగ్రహాలని ద్వంసం చెయ్యడం తప్పు కాదనే నమ్ముతాను.>>
ట్యాంక్ బండ్ మీద విగ్రహాలను పెట్టే విషయంలో లోపాలు/తప్పులు జరిగాయి. కొత్తవి ప్రతిష్ఠించాలని ఉద్యమించంటంలో అర్థం ఉంటుంది. పాతవి ధ్వంసం చేయటం ఎందుకు?
ఇదే రాష్ట్ర్రంలో... కేవలం వేరే ప్రాంతంలో పుట్టినందువల్ల కవులకూ, రచయితలకూ ప్రాంతీయ తత్వం ఆపాదించటం సంకుచితత్వం కాక మరేమీ కాదు.
‘విశ్వనరుడ నేను’ అని ప్రకటించుకున్న జాషువా మీకు ప్రాంతీయవాది అయిపోయాడా? సకల దేశాల శ్రామికుల, అణగారిన ఆర్తుల పక్షాన కవిత్వం రాసి ‘ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చిన’ శ్రీశ్రీ మీకు కూడా ప్రాంతీయవాద సంస్కృతికి ప్రతీక అనిపించాడన్నమాట!
తెలంగాణావాదం, సమైక్యవాదం అనేవి లేని కాలంలో పుట్టిన సంఘ సంస్కర్తల విగ్రహాలని ద్వంసం చెయ్యడం మొదట్లో నాకూ ఆశ్చర్యం కలిగించింది కానీ తరువాత విషయం అర్థమైంది. రఘుపతి వెంకటరత్నం గారు సమైక్యవాది కాదు కానీ తెలంగాణాలో ఎన్నడూ సంచరించని ఆయన విగ్రహం తెలంగాణాలో పెట్టి తెలంగాణాలో పోరాడిన తుర్రెబాజ్ ఖాన్, మౌల్వీ అలాఉద్దీన్ లాంటివాళ్ళ విగ్రహాలు పెట్టకపోవడం వల్ల తెలంగాణా ప్రజలు ఆగ్రహానికి గురయ్యారని దేశపతి శ్రీనివాస్ వీడియో చూసిన తరువాత అర్థమైంది. అందుకే నేను విగ్రహాల కూల్చివేతని సమర్థించాను. 1950కి ముందు తెలంగాణావాదం, సమైక్యవాదం అనే కాన్సెప్ట్‌లు లేవు. జాషువా గారు మాత్రమే కాదు, అప్పటివాళ్ళు ఎవరూ సమైక్యవాదులు కారు, తెలంగాణావాదులు అయ్యే అవకాశం కూడా లేదు. పాలకవర్గంవాళ్ళు తమ ప్రాంతానికి చెందినవాళ్ళ విగ్రహాలు మాత్రమే పెట్టి ప్రాంతీయతర్వాన్ని ప్రోత్సహించడం వల్లే ఈ సమస్య వచ్చింది. విగ్రహాల ద్వంసం వల్ల ప్రాంతీయతత్వాన్ని ప్రతిబింబించే సంస్కృతి పోదు కానీ ఆ సంస్కృతిని తమ ప్రాంతంలో అవతలి ప్రాంతంవాళ్ళు నగ్నంగా ప్రదర్శిస్తే తెలంగాణావాదులు ఎలా ఊరుకుంటారు? కనుక ట్యాంక్ బండ్ విగ్రహాల ద్వంసం విషయంలో నేను తెలంగాణావాదులని తప్పుబట్టను.
@ ప్రవీణ్ శర్మ :
>> విగ్రహాల ద్వంసం వల్ల ప్రాంతీయతత్వాన్ని ప్రతిబింబించే సంస్కృతి పోదు>>
>> ప్రాంతీయతత్వాన్ని ప్రతిబింబించే సంస్కృతికి చెందిన విగ్రహాలని ద్వంసం చెయ్యడం తప్పు కాదనే నమ్ముతాను.>>
ధ్వంసం వల్ల ఫలితం ఉండదు; కానీ ఆ ధ్వంసం సమర్థనీయం. ఇవేమీ పరస్పర విరుద్ధంగా మీకు అనిపించటం లేదా?
జాషువా,శ్రీశ్రీ లను ప్రాంతీయ సంస్కృతికి ప్రతీకలుగా ‘విధ్వంసకులు’ గుర్తించటం గురించి కాదు, వాళ్ళ ఆగ్రహ కారణం గురించి కాదు- నేనడిగింది. మీ సంగతేమిటి? మీరు కూడా ఆ కవులను అలాంటి సంకుచిత సరిహద్దులకు పరిమితం చేస్తున్నారా? అది చెప్పండి చాలు!
ఈ వ్యాఖ్య మళ్ళీ చదవండి:
>>>>>
1950కి ముందు తెలంగాణావాదం, సమైక్యవాదం అనే కాన్సెప్ట్‌లు లేవు. జాషువా గారు మాత్రమే కాదు, అప్పటివాళ్ళు ఎవరూ సమైక్యవాదులు కారు, తెలంగాణావాదులు అయ్యే అవకాశం కూడా లేదు. పాలకవర్గంవాళ్ళు తమ ప్రాంతానికి చెందినవాళ్ళ విగ్రహాలు మాత్రమే పెట్టి ప్రాంతీయతర్వాన్ని ప్రోత్సహించడం వల్లే ఈ సమస్య వచ్చింది. విగ్రహాల ద్వంసం వల్ల ప్రాంతీయతత్వాన్ని ప్రతిబింబించే సంస్కృతి పోదు కానీ ఆ సంస్కృతిని తమ ప్రాంతంలో అవతలి ప్రాంతంవాళ్ళు నగ్నంగా ప్రదర్శిస్తే తెలంగాణావాదులు ఎలా ఊరుకుంటారు?
>>>>>
ఈ విషయం స్పష్టంగానే వ్రాసాను కదా. జాతీయ ఝండాని తగలబెట్టినంతమాత్రాన జాతి ద్వంసం అయిపోదు. జాతి ద్వంసం అయిపోదు కదా అని తగలబెట్టినవాణ్ణి పోలీసులు అరెస్ట్ చెయ్యకుండా ఉండరు. మన దేశానికి వచ్చినది బూటకపు స్వాతంత్ర్యం అని తెలిసిన మావోయిస్ట్ లేదా ఇండియా తమ ప్రాంతాన్ని అక్రమంగా తమ ఆధీనంలో ఉంచుకుంది అని నమ్మే ఈశాన్య రాష్ట్రాల వేర్పాటువాది జాతీయ ఝండాని తగలబెడతాడు. ఝండాని తగలబెట్టినంతమాత్రాన జాతి ద్వంసమైపోదు, పాలకవర్గం కూడా ద్వంసమైపోదు అని ఝండాలని తగలబెట్టేవాళ్ళకి తెలుసు, ఝండాలని తగలబెట్టినవాళ్ళని అరెస్ట్ చేసే పోలీసులకి కూడా తెలుసు. చిహ్నాలని ద్వంసం చెయ్యడాన్ని విమర్శించేవాళ్ళకి మాత్రమే ఇది సీరియస్ ఇష్యూ అని ఎందుకు అనిపించింది?
గతంలోనే నేను ఒక విషయం చెప్పాను. వ్యక్తిపూజ మార్క్సిజానికి వ్యతిరేకమైనప్పుడు మార్క్సిస్ట్ అయిన శ్రీశ్రీ గారికి విగ్రహం పెట్టడమే తప్పు అని. కానీ శ్రీశ్రీ గారికి విగ్రహాలు పెట్టినది మార్క్సిస్ట్లు కాదు, ఆయన అభిమానులు అని చెప్పి దాన్ని మీరే సమర్థించుకున్నారు. విగ్రహాలు ద్వంసమైతే పోయేవి సిమెంట్ & రాళ్ళు తప్ప సజీవ రూపాలు కావు అని ఆ రోజే చెప్పాను. నేను విగ్రహాలని తేలికగా చూస్తున్నానని విగ్రహ ప్రతిష్ట సమర్థకులు అనుకున్నారు. విగ్రహం ద్వంసమైతే పోయేవి సిమెంట్ & రాళ్ళే కానీ సంస్కృతో, సజీవ రూపమో మాత్రం కాదని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను.
శ్రీశ్రీని నేను ఎన్నడూ కోస్తా ఆంధ్ర కవి అని అనలేదు. 1950కి ముందు తెలంగాణావాదం, సమైక్యవాదం అనే కాన్సెప్ట్‌లు లేవు అనీ, ఆ కాలంలో పుట్టినవాళ్ళు తెలంగాణావాదులు లేదా సమైక్యవాదులు అయ్యే అవకాశం లేదనీ నేను నా కామెంట్లో స్పష్టంగానే వ్రాసాను. అంత స్పష్టంగా వ్రాసినా మీకు అర్థం కాలేదా?
శ్రీశ్రీ గారి విగ్రహాల కూల్చివేత గురించి నేను గతంలోనే సమాధానాలు చెప్పాను. ఈ లింక్‌లో చదవండి: http://venuvu.blogspot.in/2011/03/blog-post.html
"పాలకవర్గంవాళ్ళు తమ ప్రాంతానికి చెందినవాళ్ళ విగ్రహాలు మాత్రమే పెట్టి ప్రాంతీయతర్వాన్ని ప్రోత్సహించడం వల్లే ఈ సమస్య వచ్చింది. విగ్రహాల ద్వంసం వల్ల ప్రాంతీయతత్వాన్ని ప్రతిబింబించే సంస్కృతి పోదు కానీ ఆ సంస్కృతిని తమ ప్రాంతంలో అవతలి ప్రాంతంవాళ్ళు నగ్నంగా ప్రదర్శిస్తే తెలంగాణావాదులు ఎలా ఊరుకుంటారు?"
టాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలకి ప్రాంతీయ తత్త్వం ఆపాదించడమే మూర్ఖత్వం అంటే మళ్ళీ ఇదో వింత వాదనా? అసలు టాంక్ బండ్ మీద విగ్రహాలు ఎప్పుడన్నా చూశావా ప్రవీణ్? అక్కడ నీకు ఒక ప్రాంతానికి చెందినా వాళ్ళ విగ్రహాలు మాత్రమె కనిపించాయా? అయినా ఆ విగ్రహాలు పెట్టింది తెలుగు వారి రాజధాని నగర నడిబొడ్డున ఇందులో తెలంగాణా అనే ప్రశ్నే లేదు. ఒక ప్రాంతం లో సంచరించనంత మాత్రాన విగ్రహం కూలగొట్టడం తప్పు కాదని నువ్వంటే ఈ సోకాల్డ్ గాంధీ, అంబేద్కర్ విగ్రహాలు వాళ్ళు తిరిగిన ప్రదేశాలలో మాత్రమె ఉండాలి.
ఇక పోతే తుర్రేబాజ్ ఖాన్,మౌల్వీ అలాఉద్దీన్, కొమరం భీం లాంటి వాళ్ళ పేర్లు ఆ విగ్రహాలు పెట్టె సమయానికి కనీసం తెలంగాణా నాయకులకైనా గుర్తున్నాయా? ఏం విగ్రహాలు పెడుతున్నప్పుడు, పెట్టినప్పుడు కనీసం పెట్టిన ఐదేళ్లకి, పదేళ్ళకి కూడా ఎప్పుడూ ఎవరూ వాళ్ళ గురించి మాట్లాడకుండా ఇప్పుడు ఇంచుమించు పాతికేళ్ళు అవుతుండగా ఇప్పుడు అకస్మాత్తుగా వాళ్ళ మీద ప్రేమ పొంగుకు వచ్చిందా?పోనీ హైదరాబాద్ రాజధాని కాబట్టి వదిలేద్దాం మరి అంత ప్రేమ ఉన్నప్పుడు తెలంగాణా లో మిగిలిన ప్రాంతాలలో వాళ్ళ విగ్రహాలు ఎన్ని ఉన్నాయి చెప్పు ప్రవీణ్?
తెలంగాణా లో ఎన్ని చోట్ల తుర్రేబాజ్ ఖాన్, మౌల్వీ అలాఉద్దీన్ విగ్రహాలు ఉన్నాయి? ఈ ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పు. దాటవేయడానికి ప్రయత్నించద్దు.
హైదరాబాద్‌లో తుర్రెబాజ్ ఖాన్ పేరుతో ఒక రోడ్, మౌల్వీ అలాఉదీన్ పేరుతో ఇంకో రోడ్ ఉన్నాయి. విచిత్రమేమిటంటే రాష్ట్రంలో చాలా మందికి తుర్రెబాజ్ ఖాన్, మౌల్వీ అలాఉద్దీన్లు ఎవరో తెలియకపోవడం. వాళ్ళిద్దరి గురించి పాలక వర్గంవాళ్ళు స్కూల్ పుస్తకాలలో వ్రాయలేదు, వాళ్ళు తెలంగాణాలో బ్రిటిష్ సామ్రాజ్యవాదులని ఎదిరించిన మొదటివాళ్ళైనా. అంత కంటే విచిత్రమేమిటంటే వాళ్ళిద్దరి గురించి తెలంగాణాలో కూడా చాలా మందికి తెలియదు. కోస్తా ఆంధ్ర సంస్కృతి వల్ల తెలంగాణా ప్రజలకి తమ చరిత్ర కూడా తెలియకుండా పోయింది. తమ ప్రాంత చరిత్ర కూడా తమకి తెలియనప్పుడు తమ ప్రాంతానికి చెందిన చరిత్ర పురుషుల విగ్రహాలని తెలంగాణావాళ్ళు ఎలా పెట్టుకుంటారు?
తెలంగాణావాదులు ట్యాంక్ బండ్ మీద జాతి నాయకుల విగ్రహాలు ద్వంసం చేశారని చెప్పి తెలంగాణావాదులు జాతి ద్రోహులు అని నిరూపించలేము. తుర్రెబాజ్ ఖాన్, మౌల్వీ అలాఉద్దీన్ల విగ్రహాలు విజయవాడ ప్రకాశం బేరేజ్ దగ్గర ఉంటే సమైక్యాంధ్ర జెఎసివాళ్ళు కూడా ఆ విగ్రహాలని ద్వంసం చేసేవాళ్ళు. ట్యాంక్ బండ్ విగ్రహాల ద్వంసం వార్త సమైక్యవాద టివి చానెళ్ళకి కొబ్బరి చిప్పలా దొరికింది కాబట్టే సమైక్యవాద టివి చానెళ్ళు దాన్ని ఒక ఇష్యూని చేశాయి.
"రఘుపతి వెంకటరత్నం గారు సమైక్యవాది కాదు కానీ తెలంగాణాలో ఎన్నడూ సంచరించని ఆయన విగ్రహం "
ఈ విషయం నీకు ఎవరు చెప్పారు ప్రవీణ్? తెలంగాణా లో సంచరించకుండానే ఆయన నిజాం హై స్కూల్లో మెట్రిక్యులేషన్ చదివారా?
తెలంగాణాలో సంచరించకుండానే సికింద్రాబాద్ లోని మహబూబ్ కాలేజ్ కి ప్రిన్సిపాల్ గా పనిచేశారా?
చదువు, ఉద్యోగం గురించి నేను మాట్లాడలేదు. బ్రహ్మ సమాజం వారి కార్యక్రమాలు బ్రిటిష్‌వాళ్ళు పరిపాలించిన ప్రాంతంలో మాత్రమే ఉండేవి. నిజాం పరిపాలించిన ప్రాంతంలో ఆర్య సమాజం వారి కార్యక్రమాలు ఉండేవి. ఫొటోలు తియ్యడానికి నేను గోండ్లూ, కోయలూ నివసించే అడవుల్లో తిరిగినంతమాత్రాన నేను గోండ్ జాతీయుణ్ణో, కోయ జాతీయుణ్ణో అయిపోను. అలాగే ఉద్యోగం కోసం నిజాం పరిపాలించిన ప్రాంతాలలో సంచరించినంతమాత్రాన వెంకటరత్నం గారు నిజాం ఆంధ్రుడు అయిపోరు. వెంకటరత్నం గారు బ్రహ్మ సమాజంలోనూ, ఆ తరువాత జస్టిస్ పార్టీలోనూ పని చేశారని నాకు తెలుసు. నిజాం రాష్ట్రంలో సంఘ సంస్కరణ కార్యక్రమాలు చేపట్టినది ఆర్య సమాజంవాళ్ళే కానీ బ్రహ్మ సమాజికులో, జస్టిస్ పార్టీవాళ్ళో కాదు.
చలం గారు కాకినాడలో ఉన్నప్పుడు కాకినాడ బ్రహ్మ సమాజ శాఖకి రఘుపతి వెంకటరత్నం గారే నాయకులు. బ్రహ్మ సమాజ కార్యక్రమాలు నిజాం రాష్ట్రంలో లేవు అనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. నిజాం రాష్ట్రంలో 1871 వరకు సతీ సహగమనం ఆచారం ఉండేది. భర్త చనిపోయిన స్త్రీలకి గుండు గియ్యించే ఆచారం నిజాం రాష్ట్రంలో 1900 తరువాత కూడా కొనసాగింది. నిజాం రాష్ట్రంలో విధవా వివాహాలు జరిపించినది ఆర్య సమాజంవాళ్ళే కానీ బ్రహ్మ సమాజంవాళ్ళు కాదు. అప్పట్లో నాలుగు లక్షల జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో ఆర్య సమాజం వారికి 20 శాఖ కార్యాలయాలు ఉండేవి. ఆర్య సమాజంవాళ్ళు నిజాం పరిపాలనని వ్యతిరేకించడం వల్ల నిజాం ప్రభుత్వం ఆర్య సమాజాన్ని నిషేధించినా సరే ఆర్య సమాజంవాళ్ళు నిజాం రాష్ట్రంలో సంఘ సంస్కరణ కోసం తీవ్రంగా కృషి చేశారు. అయితే బ్రహ్మ సమాజం కార్యక్రమాలు మాత్రం నిజాం రాష్ట్రంలో ఎన్నడూ లేవు. కేవలం ఆర్య సమాజంవాళ్ళే నిజాం రాష్త్రంలో సంఘ సంస్కరణ ఉద్యమం నడిపారు. వెంకటరత్నం గారు రాజకీయంగా నిజాం రాష్ట్రంతో సంబంధం లేనివారే. అలాగే భోగం మేళాలని నిషేధిస్తూ బ్రహ్మ సమాజంవారు బ్రిటిష్ వాళ్ళ చేత చెయ్యించిన చట్టం మద్రాస్ రాష్ట్రంలో పని చేసింది కానీ నిజాం రాష్ట్రంలో పని చెయ్యలేదు. నిజాం రాష్ట్రంలో కేవలం సతీ సహగమనాలని నిషేధించే చట్టం ఉండేది. విధవా వివాహాలు నిజాం రాష్ట్రంలో 1900 తరువాతే ఆరంభమయ్యాయి, అది కూడా ఆర్య సమాజంవారి చేతులతోనే.
దీన్నే వితండవాదం అంటారు ప్రవీణ్
వితండవాదం కాదు. బ్రహ్మ సమాజంవారు నిజాం రాష్ట్రంలో ఎక్కడ పని చేశారు? తెలంగాణా చరిత్ర చదివితే ఆర్య సమాజం గురించే సమాచారం దొరుకుతుంది కానీ బ్రహ్మ సమాజం గురించి సమాచారం ఎక్కడా దొరకదు.
అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా ప్రవీణ్? తెలంగాణాలో అసలు ఎప్పుడూ తిరగని వాళ్ళ విగ్రహాలను కూల్చారంతే, రఘుపతి వెంకట రత్నం గారు తెలంగాణా లో సంచరించ లేదు అన్నావు.
బాబూ ఆయన ఇక్కడే మెట్రిక్యులేషన్ చేశారు, ప్రతిష్టాత్మక మహబూబ్ కాలేజ్ కి ప్రిన్సిపాల్ గా కూడా పనిచేశారు అని చెప్తే అందుకు నీ దగ్గర సమాధానం లేదు కాబట్టి ఇప్పుడు మాట మార్చి బ్రహ్మ సమాజం అంటున్నావు. విద్య, ఉద్యోగంతో సంబంధం లేదా? అంటే విద్య/ఉద్యోగాల ద్వారా ఏ వ్యక్తీ కైనా ఒక ప్రాంతం తో అనుబంధం ఏర్పడదు అని నువ్వు అంటున్నట్లు భావించాలా?
సరే ఆ విషయం అలా ఉంచు తెలుగు వాళ్ళ రాజధానిలో తెలుగు జాతి మహనీయుల విగ్రహాలు పెట్టుకోడంలో తప్పేమిటో నాకు అర్ధం కాదు. అక్కడ అన్ని ప్రాంతాల వాళ్ళ విగ్రహాలూ ఉన్నాయి ప్రవీణ్. నువ్వు చెప్పిన లిస్టు అంతా పెట్టాలంటే ట్యాంక్ బండ్ సరిపోదు నక్లెస్ రోడ్ పొడవునా పెట్టినా ఇంకా లిస్టు మిగిలిపోతుంది. ఉన్న ప్లేస్ ని బట్టి ఎంపిక చేసుకున్న ముఖ్యులని అక్కడ ఉంచారు గానీ అక్కడ లేని వారు జాతి ప్రముఖులు కారని కాదుగా.
నువ్వు తెలంగాణా వాదాన్ని సమర్దిస్తున్నంత మాత్రాన టాంక్ బండ్ మీద జరిగిన విధ్వంసాన్ని ఎలాగైనా సమర్ధించాలన్న ఆలోచనతో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.
పిడివాదం చేయడం దాన్ని సపోర్ట్ చేయలేక సంబంధం లేని టాపిక్ లు మాట్లాడటం వంటివి నీ మాటల పట్ల గౌరవాన్ని తగ్గిస్తాయి ప్రవీణ్. కొన్నాళ్ళకి నువ్వేం చెప్పినా వేస్ట్, సంబంధం లేకుండా మాట్లాడతాడు అన్న అభిప్రాయం వచ్చేస్తుంది. ఏదన్నా మాట్లాడితే అందులో అర్ధం ఉండేలా చూసుకో.
అన్నట్టు అప్పుడెప్పుడో శ్రీకృష్ణ దేవరాయలు ముస్లిం మతం స్వీకరించాడు, ఆధారాలు ఉన్నాయి అన్నావు. చూపించమంటే రేపు, మాపు అని దాట వేస్తూనే వచ్చావు. ఏమయింది. మర్చిపోయావా? లేక మరపు నటిస్తున్నావా?
(వేణు గారూ క్షమించాలి ఆఖరి పేరా మీ పోస్ట్ తో సంబంధం లేనిది అయినా అవకాశం వచ్చింది కాబట్టి ప్రవీణ్ ని అడగడానికి రాయవలసి వచ్చింది)
శ్రీకృష్ణ దేవరాయుల పూర్వికులు ఇద్దరు కొంత కాలం ఇస్లాం మతంలో ఉండేవాళ్ళని ఆంధ్రుల చరిత్ర పుస్తకంలో చదివాను. శ్రీకృష్ణ దేవరాయులు ఎంత కాలం హిందూ మతంలో ఉన్నాడు, ఎంత కాలం ఇస్లాం మతంలో ఉన్నాడు అనేది ఇక్కడ అనవసరం. ఏ రాజైనా అధికారం కోసం యుద్ధాలు చేసేవాడు కానీ మతం కోసం యుద్ధాలు చెయ్యలేదని అప్పట్లో చెప్పాను. దాన్ని నువ్వు నమ్మినా, నమ్మకపోయినా నాకు నష్టం లేదు. కేవలం ఉద్యోగం కోసం ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస వెళ్ళేవాళ్ళు ఆ ప్రాంతం యొక్క అస్తిత్వవాద ఉద్యమాలని సపోర్ట్ చేస్తారని నేను అనుకోను. కొత్తగూడెంలో ఉంటున్న కోస్తా ఆంధ్రులు తెలంగాణా కోసం వీధి పోరాటాలు చెయ్యమంటే చేస్తారా? ఎప్పుడో 1950కి ముందు తెలంగాణాలో స్థిరపడిన పూర్వపు వలసదారులలో తెలంగాణావాదం ఉండొచ్చు. తెలంగాణాలో ఉద్యోగాలు చేసేవాళ్ళందరూ తెలంగాణా కోసం ఉద్యమించాలని రూల్ ఉందా అని అడుగుతావు. నీ ప్రశ్నల శైలి ఎలా ఉంటుందో నాకు తెలుసు. తెలంగాణా తన ప్రాంతం అని చెప్పుకుంటున్న ప్రతి వ్యక్తి ఇప్పుడు ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్నే సమర్థిస్తున్నాడు కాబట్టి తెలంగాణా రాష్ట్రాన్ని సమర్థించని వ్యక్తి తెలంగాణా పౌరుడు అనబడే అవకాశం ఇప్పుడు లేదు, అతను కోస్తా ఆంధ్రలో పుట్టి తెలంగాణాలో చదువుకుని ఉద్యోగం చేసే వ్యక్తి అయినా సరే.
రఘుపతి వెంకటరత్నం గారు తన జీవితంలో ఎక్కువ కాలం కోస్తా ఆంధ్రలోనే పని చేశారు. కొంత కాలం నిజాం రాష్ట్రంలో ఉన్నంతమాత్రాన అతను నిజాం ఆంధ్రుడు అయిపోరు. నిజాం ఆంధ్రుడు అయిన సురవరం ప్రతాపరెడ్డి గారు కూడా కొంత కాలం కర్నూల్ జిల్లాలోని తన బంధువుల ఇంటిలో ఉండి చదువుకున్నారు. అలాగని సురవరం ప్రతాపరెడ్డిని సీమాంధ్రునిగా భావించి అతని విగ్రహాన్ని విజయవాడలో పెడితే సమైక్యవాదులు aka హైదరాబాద్‌వాదులు అతన్ని తమ ప్రాంతంవానిగా భావించి అతని విగ్రహాన్ని కూల్చకుండా ఉంటారా? సమైక్యాంధ్ర జెఎసి ఎంత సమైక్యత పేరు చెప్పుకుంటున్నా వాళ్ళు ప్రాక్టికల్‌గా చేస్తున్నవి ప్రాంతీయ విద్వేషవాద కార్యక్రమాలే అనేవి అందరికీ తెలిసినదే. ప్రాంతీయవాదం మా ప్రాంతంవాళ్ళలో ఉండొచ్చు కానీ అవతలి ప్రాంతంవాళ్ళలో ఉండకూడదని అంటే ప్రజలు అంగీకరించలేరు కదా. రాయలసీమలో కొంత కాలం సంచరించిన సురవరం ప్రతాపరెడ్డిని సీమాంధ్ర వాసిగా అంగీకరించే పరిస్థితి సమైక్యవాదులలో లేనప్పుడు రఘుపతి వెంకటరత్నం గారిని తెలంగాణా వాసిగా తెలంగాణావాదులు అంగీకరించే పరిస్థితి ఎలా ఉంటుంది?
తెలుగు ప్రజలు తమ రాజధానిలో తమ నాయకుల విగ్రహాలు పెట్టుకుంటే తప్పా అని అడిగావు. హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేసినదే మేడిపండు లాంటి హైదరాబాద్ నగరం కోసం. అప్పట్లో కూడా హైదరాబాద్ ఇండియాలో ఐదవ అతి పెద్ద నగరం అనేది అందరికీ తెలిసినదే. ఒక నగరం కోసం ఇంకో ప్రాంతాన్ని తమ ప్రాంతంలో విలీనం చేసుకుని, దాన్ని తమ రాష్ట్రానికి రాజధానిని చేసుకుని, ఇది మా రాష్ట్ర రాజధానికి కనుక ఇక్కడ మా జాతి నాయకుల విగ్రహాలు పెట్టుకుంటాము అని సమైక్యవాదులు అంటే తెలంగాణావాదులు నమ్మే పరిస్థితి ఉందా? ఇక్కడ జాతి అనే రిఫరెన్స్ ఇవ్వడం ఇష్టం లేకపోయినా ఆ రిఫరెన్స్ ఇచ్చాను. సమైక్యవాదులు నిజంగా ఉద్యమిస్తున్నది జాతి కోసం కాదు, హైదరాబాద్ నగరం అనే మేడి పండు కోసం. అటువంటప్పుడు ఇక్కడ జాతి అనే రిఫరెన్స్ ఉపయోగించకూడదు. అయినా ఆ రిఫరెన్స్ ఇచ్చాను.
@ ప్రవీణ్ & శంకర్: చర్చ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది, టపా స్ఫూర్తికి దూరంగా!
ఇకనైనా తెలంగాణా, శ్రీకృష్ణదేవరాయల మతాల ప్రస్తావనలను వదిలిపెడితే బాగుంటుంది.
రంగనాయకమ్మ గారి రచనల్లో analysis అద్భుతంగా ఉంటుంది.
"విగ్రహాన్ని అవమానం నించి తప్పించే మార్గం, దాన్ని మరింత మరింత దృఢ తరం చెయ్యడం కాదు. మట్టితో రక్షణ లేక, కంచుతో రక్షణ దొరికితే, అది కంచు శక్తే గానీ, అది ఆ నాయకుడి శక్తి కాదు. విగ్రహం చుట్టూ తుపాకులతో కాపలాలు కాయడాలైతే, తుపాకీ లేకుండా రక్షణ దొరకని విగ్రహానికి అదే అసలైన అవమానం."
ఎంత పచ్చి నిజం!! చెప్పదలచుకున్న విషయాన్ని ఇంత సూటిగానూ, సరళంగానూ, స్పష్టంగానూ చెప్పడంలో రంగనాయకమ్మ గారి కన్నా మెరుగైన వాళ్లు ఉన్నారంటే నేను అస్సలు నమ్మను!!
కామెంట్‌ను పోస్ట్ చేయండి