సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

12, ఫిబ్రవరి 2012, ఆదివారం

అనగనగా... తొలి 'బ్లాగు పుస్తకం'!

‘సరైన సమయంలో సముచిత నిర్ణయం’- అని వార్తా పత్రికల్లో తరచూ చదువుతుంటాం కదా?  సురవర. కామ్ సంస్థ  ‘బ్లాగు పుస్తకం’ ప్రచురణ గురించి చెప్పాలంటే కూడా ఇదే వ్యాఖ్యను ఉపయోగించొచ్చు.  

ఇంటర్నెట్ సౌకర్యం  పల్లెటూళ్ళక్కూడా వ్యాపిస్తోంది.  తెలుగు బ్లాగుల గురించి  పాఠకుల్లో ఒకప్పటి కంటే అవగాహన పెరుగుతోంది.  ఈ రకంగా కొత్త బ్లాగర్ల సంఖ్య విరివిగా పెరగటానికి అనుకూలమైన పరిస్థితులు  ఏర్పడ్డాయి.

అందుకే ఈ ‘బ్లాగు పుస్తకం’ రూపకల్పన సరైన సమయంలో జరిగిందనిపిస్తోంది. 

18 అధ్యాయాలుగా  విస్తరించిన 108 పేజీల ఈ  చిన్న పుస్తకం ఔత్సాహికులకు కరదీపికగా ఉపయోగపడేలా ఉంది.. సాంకేతిక అంశాలను  స్క్రీన్ షాట్ల సాయంతో శ్రద్ధగా వివరించటం అభినందనీయం.  బ్లాగింగులో విధి నిషేధాలు కూడా చెప్పటం వల్ల  అదనంగా విలువ సమకూరింది. 

బ్లాగింగ్ ఇప్పటికే కొనసాగిస్తున్నవారిలో చాలామంది ప్రాథమిక సెటింగ్స్ తప్ప టపాను అందంగా మలిచే మిగిలిన సెటింగ్స్ గురించి అంతగా పట్టించుకోరు.  ఆ అమరికలన్నిటినీ  ఈ పుస్తకంలో గమనించవచ్చు.  

ఇవాళ్టి ఈనాడు ఆదివారం మ్యాగజీన్ లో ఈ పుస్తకం గురించి రాసిన క్లుప్త పరిచయం ఇక్కడ -



*  *  *

‘పాత్రికేయుల్లోనే చాలామందికి తెలుగు బ్లాగుల గురించి తెలియదు; ఇక వీటి గురించి సగటు పాఠకులకేం తెలుస్తుంది?’అనేది ఒకప్పటి మాట.

ఆ పరిస్థితిలో మార్పు బాగానే వచ్చింది.

చాలా దినపత్రికల్లో బ్లాగుల పరిచయాలతో రెగ్యులర్  శీర్షికలూ,  బ్లాగర్ల టపాల విశేషాలతో కథనాలూ వెలువడ్డాయి. వెలువడుతున్నాయి.  బ్లాగుల తాజా టపాలనూ, సరికొత్త వ్యాఖ్యలనూ  ఒకే చోట చూపే  సంకలినుల గురించి కూడా ప్రత్యేక కథనాలు వచ్చాయి. 

‘ఈనాడు’లో ప్రతి సోమవారం ప్రచురితమయ్యే ఎడ్యుకేషన్ సప్లిమెంట్  ‘చదువు’ ఆర్నెల్ల క్రితమే  బ్లాగు రూపం ధరించి కొనసాగుతోంది. ‘ఈనాడు’ మినీ ఎడిషన్లలో ప్రతిరోజూ కనపడే  ‘ప్రతిభ’ పేజీ కూడా కొత్తగా బ్లాగు రూపం ధరించింది. 

ఏకంగా బ్లాగు టపాలతోనే కదా, ఆంధ్రజ్యోతి పత్రిక సండే మ్యాగజీన్ ను ఇటీవల వెలువరించింది!   టీవీల్లో కూడా బ్లాగుల గురించిన  కార్యక్రమాలు ప్రసారమవుతూనే ఉంటాయి. 

ఇవన్నీ తెలుగు బ్లాగుల ప్రాచుర్యం విస్తరిస్తోందనడానికి  ఉదాహరణలే!

ఈ నేపథ్యంలోనే వెలువడింది ఈ బ్లాగు పుస్తకం. 

పత్రికల్లో వార్తా కథనాలు ఎన్నయినా వచ్చివుండొచ్చు; టీవీ కార్యక్రమాలు కూడా కొన్ని  ప్రసారమై ఉండొచ్చు. కానీ బ్లాగుల మౌలిక అంశాలు వివరిస్తూ- కొత్త వారికి  దారి చూపిస్తూ, అవసరమైన జాగ్రత్తలు సూచిస్తూ పుస్తకం తేవటం మాత్రం వేరు.  అందుకే ఈ ప్రయత్నం అభినందనీయం!

*  *  *

ఇదే సమయంలో  కొన్ని మాటలు చెప్పదలిచాను.

ఇలాంటి  డెమో ప్రాధాన్యమున్న సమాచారయుత పుస్తకంలో విషయాన్ని తేలిగ్గా  వివరించటమే ముఖ్యం.  అయితే తెలుగు పదాలనే విధిగా వాడాలనే ఆశయం వల్ల- సాంకేతిక అంశాల వివరణ సందర్భంలో- కొత్త పాఠకులు కొంత అసౌకర్యంగా భావించే అవకాశం ఉంది. 

బ్లాగులంటే అసలేమీ తెలియనివారికీ , సగటు పాఠకులకూ  చప్పున అర్థం కాని పదజాలం వాడకుండా ఉండాల్సింది.  ఉదా: అప్రమేయం, అనుకోలు, వేగు, జాలగూళ్ళు, (పని)ముట్లు, దిగుమతి, మునుజూపు.. ఇలాంటివి.  ఈ మాటలు  మొదటిసారి వాడినచోట ఇంగ్లిష్ సమానార్థకాలను ఇవ్వకపోలేదు కానీ, తర్వాత యథేచ్ఛగా వాటిని వాడేశారు. అలా కాకుండా ప్రతిచోటా బ్రాకెట్లో  ఇంగ్లిష్ మాటను కూడా  ఇచ్చివున్నా కొంత బాగుండేది. 

అసలు ‘పరిభాష’ను (అది ఏ భాషలోనైనా)  సాధ్యమైంతవరకూ తగ్గిస్తేనే చదివేవారికి తేలిగ్గా ఉంటుంది.



ఈ పుస్తకంలో నాకు నచ్చిన కొన్ని వాక్యాలు.
*  బ్లాగు రాయడానికి  ప్రాథమిక అర్హత భావ వ్యక్తీకరణే తప్ప సాంకేతిక పరిజ్ఞానం కాదు.

* ఆర్కుట్, ఫేస్ బుక్, ప్లస్, ట్విట్టర్ ఇంకా ఎన్నెన్నో నెట్ వర్కులు! వాటికి జేజెమ్మ లాంటిది బ్లాగు!

 
* బ్లాగు అనేది ఒక రంగస్థలం, ఒక కాన్వాస్, ఒక తెల్ల కాగితం!


* ప్రతి బ్లాగుకూ చిరునామా ఉన్నట్టే ప్రతి టపాకూ శాశ్వత చిరునామా ఉంటుంది. బ్లాగులు సాంకేతికంగా ఇంత ప్రఖ్యాతి వహించడానికి ఈ టపాకుండే శాశ్వత చిరునామా కూడా ప్రముఖ పాత్ర వహించింది.

 
* సప్త వ్యసనాలను అష్ట వ్యసనాలుగా మార్చి అందులో బ్లాగింగ్ ని కూడా చేర్చాలని అప్పుడప్పడూ తెలుగు బ్లాగర్లు జోక్ చేస్తుంటారు. 


* ఒకసారి మీ వ్యాఖ్య (లేదా రాత ఏదైనా సరే) అంతర్జాలంలోకి జారిపోయిందా... ఇక దాన్ని వెనక్కి తీసుకోలేం!


*  *  *

ఎంచుకున్న విషయమే బ్లాగుల గురించి కాబట్టి సందర్భానుసారంగా కొందరు తెలుగు బ్లాగర్ల ప్రస్తావన ఈ పుస్తకంలో కనపడుతుంది.  వారు ఎవరంటే...

గృహిణులు
వలబోజు జ్యోతి
రాధిక
మాలాకుమార్
అన్నపూర్ణ
వరూధిని
శ్రీలలిత
జయ
సుభద్ర


రచయితలు
గొల్లపూడి మారుతిరావు
కస్తూరి మురళీ కృష్ణ
నిడదవోలు మాలతి
వసుంధర
సుధామ
కల్పనా రెంటాల
పి.సత్యవతి
షాడో మధుబాబు


కవులు
నిషిగంధ
రాధిక
మూలా సుబ్రహ్మణ్యం
కె.క్యూబ్ వర్మ
అక్షర మోహనం
ఏకాంతపు దిలీప్
అఫ్సర్
బీవీవీ ప్రసాద్


సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు
రవి
నాగమురళి
ఫణికుమార్ 
నామాల మురళీధర్
కృష్ణప్రియ
మేథ
రవిచంద్ర
రామ్ బొందలపాటి


మీడియా
రాము
కోవెల సంతోష్
పూడూరి రాజిరెడ్డి
స్కైబాబ
బాలు

ఇంకా...
వి.బి. సౌమ్య
దాట్ల లలిత
మధురవాణి
భమిడిపాటి ఫణిబాబు


(కవి బ్లాగర్లలో బొల్లోజు బాబా, ఎండ్లూరి సుధాకర్;  మీడియా బ్లాగర్లలో తెలకపల్లి రవి, చందమామ రాజు, రెంటాల జయదేవలను వదిలేశారేమిటి అంటారా? భలేవారే... ఇలాంటి జాబితాలు ఇచ్చినపుడు వచ్చే సమస్యే ఇది.  పుస్తకంలో ఇచ్చిన పేర్లు indicative అని అర్థం చేసుకోవాలి :)).

ఈ పుస్తకాన్ని ‘మనసులో మాట’ సుజాత,  ‘సత్యాన్వేషణ’ రహ్మాన్ గార్లు సంయుక్తంగా రాశారు.  సాంకేతిక సంపాదకునిగా వ్యవహరించినవారు ‘ఆది బ్లాగరి’ చావా కిరణ్.  తెలుగులో మొట్టమొదటి  బ్లాగు టపా రాసిన కిరణ్ ఈ  తొలి బ్లాగు పుస్తకంలో కూడా  పాత్ర వహించారన్నమాట! 

తెలుగులో బ్లాగింగ్ అనూహ్యంగా ఎలా మొదలయిందో- ఆ విశేషాలను ఆయన స్వయంగా ఈ పుస్తకంలో పంచుకుని ఉంటే ఆసక్తికరంగా ఉండేది.

తెలుగులో (ఇప్పటివరకూ)  మొత్తం ఎన్ని బ్లాగులున్నాయి, రోజుకు సగటున ఎన్నికొత్త బ్లాగులు మొదలవుతున్నాయి, వాటిలో క్రియాశీలకమైనవి ఎన్ని, ప్రతిరోజూ  ఎన్ని టపాలు రాస్తున్నారు, సంకలినులు సాంకేతికంగా ఎలా పనిచేస్తాయి... ఈ  సమాచారం కూడా ఇచ్చివుంటే ఈ పుస్తకం సమగ్రత సంతరించుకునేది.

ఇంటర్నెట్లో- బ్లాగుల్లో- ‘చోటు’అనేది  అసలు సమస్యే  కాదు. కానీ, పుస్తకంగా వచ్చినపుడు పేజీల పరిమితి విధించుకోవటం మామూలే కదా?  బహుశా ‘గ్రంథ విస్తరణ భీతి’వల్ల   కొన్నిఅంశాలకే పరిమితమయ్యారనిపిస్తోంది!

టపా రాశాక కూడా అవసరమైతే  మెరుగుపరిచి అప్ డేట్ చేస్తుంటాం కదా? అలాగే నాలాంటివారు చేసిన సూచనలన్నీ పరిశీలించి , ఆచరణ సాధ్యమైనవాటిని  రెండో ముద్రణలోనైనా  జోడిస్తే బాగుంటుంది!

ఈ పుస్తకం వివరాలు  ఈ లింకు లో...   

ఈ- పుస్తకం  కోసం చూడాల్సిన లింకు-
 http://kinige.com/kbook.php?id=545&name=Blagu+Pustakam

15 కామెంట్‌లు:

MURALI చెప్పారు...

నొప్పింపక, తానొవ్వక పద్దతిలో ఉండి మీ పుస్తక విమర్శ చాలా ఆకట్టుకుంది. ఇంత మంచిగా పుస్తకాన్ని పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. నొప్పించకుండానే చాలా సున్నితంగా ఎన్నో విషయాలను ఎత్తి చూపారు, మంచి సూచనలు కూడా ఇచ్చారు.

<>

నిజమే సుమా. పుస్తకం సూపర్ సక్సెస్ అయ్యి, అందరి సూచనలతో రెండవ ముద్రణ రావాలని కోరుకుందాం.

Unknown చెప్పారు...

పుస్తకాన్ని గురించి మీ సమీక్ష బావుంది

అజ్ఞాత చెప్పారు...

చాలా బాగుంది మీ రివ్యూ! తొలి తెలుగు బ్లాగు పుస్తకంలో ఇన్ని విశేషాలున్నాయన్న మాట. అయితే నాకు తెలిసి ఎక్కువ బ్లాగులు బ్లాగర్ లో ఉన్నాయి. ఇందులో మొత్తం వర్డ్ ప్రెస్ బ్లాగుల గురించి వివరణ ఇచ్చినటు తెలిసింది. బ్లాగర్ కి కూడా కొన్ని పేజీలు కేటాయిస్తే బాగుండేదేమో!

oremuna చెప్పారు...

Venu,



Thank you very much for your kind words. I really appreciate the time you put in reading and writing about the book.

కొత్త పదాలు విరివిగా వాడటం గురించి -

We used words:

a. where the word is self-explanatory. Example అనుకోలు, పనిముట్లు, దిగుమతి, మునుజూపు. One actually don't need to know the meaning in English. The position, flow, story will give you the meaning. That is how we all got used to lots of un-known English words in our daily life I believe.

b. The translation is used in wordpress.com Telugu version. As we are giving screenshots and everything in Telugu version of wordpress, it is more appropriate to use those words. (eg.. పనిముట్లు, టపా)

c. The unknowing word itself is no harm. There will be cases where you get a feeling of meaning.

d. The Telugu medium, village person inside me tells అప్రమేయం is better than default! Like మెట్లు is better than foot-board.

e. May be I should add this, during our several reviews we dropped many words, Dashboard = యుగంధరం. So what is left is after some cycles of reviews.

Giving English equivalent only once: There are couple of reasons for this

1. When we give English meaning in brackets, immediately after Telugu word, it is obstructing reading flow. Thus we gave it as a foot note.

2. When we give English meaning in brackets, immediately after Telugu word, then *many*(?) are ignoring Telugu words and mentally fixing themselves to read what is inside brackets.

3. I feel a Telugu book with lots of English words brackets looks bad. We will never have an English book (even those aimed at poorly educated Telugu person) with Telugu meaning in brackets. People advice you to go for dictionary! That should be usual practice to protect sanity of a language. Otherwise the book will be used (knowingly or un-knowingly) only to transition reader from Telugu language to near future English reader.

4. As Telugu people still don’t have practice of referring to dictionaries, we gave the meaning in footer.

5. We gave meaning only once as we believe it is unnecessary to go on giving meanings in footer. That will make footers lengthy and make book look ugly. That will distract user from flow. But,

6. But, we gave a nice index. So all one need to do is go to last page and see where that particular word is used first in the book. We hope this will help people when they stumble upon a Telugu word and don’t see the meaning in footer.



A note from usability studies:

During our usability studies, we found that new to blog world (to some extent tech/web world) are not complaining about new Telugu words. Of course our usability set is very limited number of people. I am all waiting to get feedback from real targeted audience, the ones new to web world.

----

>>>తెలుగులో (ఇప్పటివరకూ) మొత్తం ఎన్ని బ్లాగులున్నాయి, రోజుకు సగటున ఎన్నికొత్త బ్లాగులు మొదలవుతున్నాయి, వాటిలో క్రియాశీలకమైనవి ఎన్ని, ప్రతిరోజూ ఎన్ని టపాలు రాస్తున్నారు, సంకలినులు సాంకేతికంగా ఎలా పనిచేస్తాయి... ఈ సమాచారం కూడా ఇచ్చివుంటే ఈ పుస్తకం సమగ్రత సంతరించుకునేది. <<<

కొత్తగా బ్లాగులు రాయించడం, బ్లాగ్ ప్రపంచానికి తొందరగా పాఠకుడిని అలవాటు చెయ్యడం, మంచి, చెడు వివరించడం, బ్లాగర్లగా మనం అర్థ దశాబ్దంలో నేర్చుకున్న పాఠాలు కొత్తవారికి ముందే వివరించడం, తొందరగా సూటిగా బ్లాగ్ ప్రపంచపు రైలు ఎక్కించి వారిని తిప్పడం అనే లక్ష్యాలతో ఈ పుస్తకం వెలుబడింది. బ్లాగుల గురించి లెక్కలు ఇవ్వాలన్న ఆలోచన రాలేదు. సంకలినులు సాంకేతికంగా ఎలా పనిచేస్తాయి అనే విషయం రాయాలా వద్దా అని బాగా ఆలోచించి కొత్త బ్లాగరుకు అది అంత అవసరంలేని విషయం అని అనుకున్నాము. అందుకని ఫీడ్ల గురించి మరింత సాంకేతిక సమాచారం తెలుసుకునే లింకు మాత్రం ఇచ్చాము. కొత్త బ్లాగర్లకు కూడలిలో బ్లాగు ఎలా కలపాలి అనే విషయం ముఖ్యమైనది గాని, కూడలి ఎలా పని చేస్తుందో కాదు అనుకున్నాము.

<<< బహుశా ‘గ్రంథ విస్తరణ భీతి’వల్ల కొన్నిఅంశాలకే పరిమితమయ్యారనిపిస్తోంది!>>>

అవును పుస్తకం రెండవ భాగం మరింత వివరంగా, మరిన్ని స్క్రీన్ షాట్లతో వ్రాయాలనుకున్నాము కానీ కొంత ఎడిటింగ్ చెయ్యాల్సి వచ్చింది. కొన్ని అడ్వాన్‌డ్ టాపిక్స్ అనుకొన్నవి వదిలెయ్యాల్సి వచ్చింది.



----

oremuna చెప్పారు...

Kiran Kumar గారు,
కేవలం వర్డ్ ప్రెస్ మాత్రమే వివరించడం అనేది ఎడిటోరియల్ నిర్ణయం. దానికి కారణాలు
1. ఈ పుస్తకం కొత్త వారికి మార్గ దర్శిని. అలా చెయ్యవచ్చు, ఇలా చెయ్యవచ్చు, ఇలా అలా కూడా చెయ్యవచ్చు అంటూ కొత్త వారిని కన్ఫ్యూజ్ చెయ్యకూడదు అనేది అనుభవం నేర్పిన పాఠం.
2. ప్రింట్ పుస్తకానికి వెళ్లినప్పుడు గ్రంథ విస్తృతి పెద్ద సమస్య. మనం బ్లాగులో అయితే పుంఖాను పుంఖాలుగా వ్రాసుకోవచ్చు కాని ముద్రణలో ప్రతి లైను ఆచి తూచి వ్రాసుకోవాలి.

కృష్ణప్రియ చెప్పారు...

ఓహ్.. నా పేరు కూడా ప్రస్తావించారా? ధన్యవాదాలు. హైదరాబాద్ కి వచ్చినప్పుడు తప్పక కొనుక్కోవాలి..

(అంటే ..దీని గురించి చదివినప్పటినుంచీ కొందామనుకున్న పుస్తకం అనుకోండి :)..

raja చెప్పారు...

...... mentally fixing themselves to read what is inside brackets.

అబ్బా ఎంత తెలుగుభాషాసేవ!!

ఏం పాఠకులు ఇంగ్లీషు పదాలకు ఫిక్స్ అయితే తప్పేమిటి? వచ్చిన నష్టమేమిటి?
టెక్నికల్ ఇంగ్లీషు పదాలని అలానే వాడటం మంచిదన్న విషయం, సాఫ్ట్ వీరులు ఎప్పటికీ తెలుసుకోలేరు. టెక్నికల్ పదాలకి చిత్రవిచిత్రమైన తెలుగు పదాల్ని సృష్టిస్తూ తెలుగు పాఠకుల్లో అయోమయాన్ని సృష్టిస్తున్నారు. ఇది అతి తెలివి, పాండిత్య ప్రదర్శన తప్ప మరేమీ కాదు. ఓ ముప్పై ఏళ్ళ క్రితం ఈనాడు పత్రిక ఎందుకంత పాపులర్ అయ్యిందో తెలుసా - జనాలలో ఉన్న పదాలను యధాతధంతా వాడటం మొదలెట్టటం వల్ల. ఈ చిన్న విషయాన్ని తామే తెలుగును ఉద్దరించే అపర బ్రౌన్ దొరలమని ఫీలయ్యే ఈ సాఫ్ట్ వీరులు ఎప్పటికి తెలుసుకొంటారు.
కొన్ని ఇంగ్లీషు పదాలు తెలుగు పదకోశంలో చేర్చటం ద్వారా తెలుగుకు వచ్చే హానేమీ ఉండదు. భాష మరింత పరిపుష్టి అవుతుంది. నష్టమేమీ కాదు. ఈరోజు ఇంగ్లీషు బాష ఇంత విస్త్రుతమవటానికి కారణం ఇదేనన్న విషయం దాని పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకొంటే అర్ధమవుతుంది.
పోనీ నిజానికి వీరేమైనా నిజమైన తెలుగు పదాల్ని వాడుతున్నారా అంటే వాడేవన్నీ సంస్కృత సమాసాలతో కూడిన సంకరపదాలు

ఇంకానయం యుగంధరం అని వాడి ఉండాల్సింది...... ఇంకా బాగుణ్ణు.

అజ్ఞాత చెప్పారు...

ముందుగా పుస్తకాన్ని పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు .
సుజాత గారికి, రహ్మాన్ గారికి అభినందనలు
నా పేరు కూడా వుందని తెలిసి చాలా సంతోషంగా వుంది .

venu చెప్పారు...

Exllent blog..

Kottapali చెప్పారు...

good review. Since this is an e-bbok, perhaps not a bad idea to update it on an annual basis

oremuna చెప్పారు...

Narayanaswamy gaaru,

This is primarily not an eBook. This is indeed a print book. (Also available as eBook)

వేణు చెప్పారు...

@ MURALI, @ bhavaraju, @ kiran kumar

@ కృష్ణప్రియ, @ లలిత
@ venu @ Narayana swami S.

మీ అభిప్రాయాలు తెలిపినందుకు కృతజ్ఞతలు!

వేణు చెప్పారు...

ఒరెమూనా (చావా కిరణ్), మీ వివరణ చదివాను.

ఈ ‘బ్లాగు పుస్తకం’ కొత్త పాఠకులకు ప్రధానంగా ఉద్దేశించింది కాబట్టి సాంకేతిక అంశాల గురించి ఇంకా తేలిగ్గా వివరించివుండాల్సిందనే నా ఉద్దేశం. తెలుగు పదాలను వాడకూడదనీ, ఇంగ్లిష్ మాటలే సర్వదా శిరోధార్యమనీ నా ఉద్దేశం కాదు! తెలుగు అయినా, ఇంగ్లిష్ అయినా ‘పరిభాష’వాడకం వీలైనంత తగ్గిస్తేనే పాఠకులకు చదువుకోవటం హాయిగా ఉంటుంది.

‘యుగంధరం’అనే మాట వాడబోయి, సమీక్షించాక దాని బదులు dashboard అనే పదం ఉపయోగించారా? ఇంకా నయం, మీరా మాట వాడివుంటే, ఆ పదం వచ్చినప్పుడల్లా మంత్రి యుగంధరుడో, డిటెక్టివ్ యుగంధరో గుర్తుకొచ్చి చాలా ఇబ్బందయ్యేది. :) ఇలాంటి పదాలు ఇంకా చాలా వదిలేశారా? పుస్తక రూపకల్పనకు ముందు చేసిన సమీక్షల మూలంగా మంచి పనే జరిగిందన్నమాట!

* అనుకోలు, మునుజూపు అనే మాటలు self-explanatory అంటారా? నేను ‘కాదు’అంటున్నాను. ఈ పదాలతో తెలుగు బ్లాగర్లకు కొంత పరిచయం ఉండొచ్చు. కానీ పత్రికలు మాత్రమే చదివే సాధారణ పాఠకులకు ఇవి ఇనప గుగ్గిళ్ళే.
ఓ చిన్న ప్రయోగం చేసి చూడండి. మీకు తెలిసిన, బ్లాగులంటే తెలియని ఐదుగురు తెలుగు పాఠకులకు ఈ రెండు మాటలూ వినిపించి ‘వీటి అర్థం ఏమిటో తెలుస్తోందా?’ అనడగండి. ఎంతమంది తెలుసని చెపుతారో చూడండి. అప్పుడవి self-explanatory అవునో కాదో మీకే తెలుస్తుంది!

* default కంటే ‘అప్రమేయం’ మెరుగు అంటారా? ఎలా మెరుగు? అసలు ‘అప్రమేయం’ అనే మాటను ఎవరైనా తమ సంభాషణల్లో ఒక్కసారైనా వాడివుంటారా?
మొదటిది ఆంగ్ల పదం. రెండోది సంస్కృత పదం. రెండోదానికంటే మొదటిదే సరళంగా ఉందని తెలుగుమీడియం లో చదివిన, పల్లెటూరిలో పుట్టి పెరిగిన నాకనిపిస్తోంది.
సెల్ ఫోన్, కంప్యూటర్లు ఉపయోగించేవారిలో చాలామందికి తెలిసిన పదం default. దాన్ని విరివిగా వాళ్ళు సంభాషణల్లో వాడుతుంటారు కూడా. రేపటి బ్లాగర్లుగా మారటానికి ఎక్కువ అవకాశమున్నది వీరే కదా? ఇలాంటివాళ్ళకు తేలిగ్గా అర్థం అయ్యే మాట వాడితే తప్పేముంది?

ప్రతి తెలుగు పదానికీ బ్లాకెట్లో ఇంగ్లిష్ సమానార్థకం ఇవ్వటం వల్ల చదవటంలో ‘ఫ్లో’ తగ్గుతుందనీ, చూడ్డానికి అంత బాగోదనేది నిజమే. ఇలాంటి పుస్తకాలు pleasure reading కోసం కాకుండా కొత్త విషయాలు నేర్చుకునే ఉద్దేశంతోనే చదువుతారు కాబట్టి ఇలాంటి అసౌకర్యాలు తప్పవేమో. అయినా రాసేవారు ఆ అసౌకర్యాలు తగ్గించటానికే ప్రయత్నించాలి.

కొత్తవారిని ‘తొందరగా సూటిగా బ్లాగ్ ప్రపంచపు రైలు ఎక్కించి తిప్పడం’ మీ లక్ష్యం కాబట్టి పుస్తకం చదివిన పాఠకుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటే మీకు ఉపయోగం!

వేణు చెప్పారు...

raja గారూ!
మీ వ్యాఖ్య స్పామ్ లో్కి వెళ్ళిపోయివుండటం వల్ల ఇన్నాళ్ళూ (నెలరోజులకు పైగా) గమనించనేలేదు! ఇవాళ చూసి పబ్లిష్ చేశాను!

kanthisena చెప్పారు...

వేణుగారూ,
మీ పరిచయం పుణ్యమా అని బ్లాగ్ పుస్తకం గురించి వివరంగా తెలుసుకున్నాను. ఇంకా ఈ పుస్తకం చూడలేదు. కాని ఇంగ్లీషు పదాలకు సమానార్థాల గురించి మీ అభిప్రాయంతో ఏకీభవిస్తూనే నా అనుభవంలో ఎదురైన కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను.
తెలుగుకు సంస్కృత సమాన పదాలు -తత్సమాలు- వాడటంలో స్థలపరిమితికి సంబంధించిన సౌలభ్యం ఎక్కువగానే ఉండవచ్చు కాని, చాలామందికి అంటే నిర్దిష్టమైన అంశం-సబ్జెక్ట్-తో సంబంధం లేనివారికి సంస్కృత సమాన పదం చాలా ఇబ్బందికరంగా కూడా ఉంటుంది.

30 ఏళ్లక్రితం అకశేరుకాలు, సకశేరుకాలు అనే పదాలు పాఠశాలలో సైన్స్ పుస్తకంలో చూసి భయపడిపోయాను. జీవశాస్త్రంలో వచ్చే ఇలాంటి వందలాది పదాలు పల్లెటూరి వారికే కాదు ఎవరికయినా కొరకరాని కొయ్యలుగానే ఉంటాయి. వీటిని ఎందుకు తెలుగులోకి తీసుకురాలేరు అనేది ఎన్నటికీ పరిష్కారం కాదు. ఎందుకంటే మనకు ఆంగ్ల వ్యామోహం ఎంతగా ఉందో సంస్కృత పద వ్యామోహం కూడా అంతే స్థాయిలో ఉంది.

డిఫాల్ట్ పదానికి 'అప్రమేయం' అనే పదం సరికాదని మీరంటున్నారు. కాని మేం గతంలో చేసిన మైక్రోసాఫ్ట్, నోకియా ఉత్పత్తుల మాన్యువల్స్ అనువాదాలు చూస్తే, డిఫాల్ట్ వంటి పదాలకు వాళ్లు అందించిన గ్లాజరీలను చూస్తే కొన్ని చోట్ల మతిపోతుంది. లోకలైజేషన్ పేరిట గత పదేళ్లుగా వస్తున్న సాఫ్ట్‌వేర్ అనువాదాలు, వస్తూత్పత్తుల అనువాదాలు ఎంత మంది తమ తమ భాషల్లో చదువుతున్నారనేది ప్రశ్నార్థకమే. లోకలైజేషన్ భావనకే భిన్నమైన అనువాదాలను ఇలాంటి సంస్థలు తమ గ్లాజరీలుగా రూపొందించుకుంటున్నాయి.

అనుకోలు, మునుజూపు, ఖతులు వంటి పదాలు ఎన్ని వందలసార్లు వాడినా అవి సగటు తెలుగుజీవికి ఇనుప గుగ్గిళ్లు గానే కనబడతాయి. ఒకవేళ అనుకోలు, మునుజూపు అనే పదాలు ఒక తెలుగు ప్రాంతానికి సంబంధించిన మాండలిక ప్రయోగాలు అనుకున్నా ఇలాంటి పదాలు ఇతర ప్రాంతాల వారికి బోధపడవు.

తమిళంలో మనలాగా కాకుండా ప్రతి పరభాషా పదానికి సమానమైన వాడుక తమిళం పదాన్ని తీసుకురావడంలో వారు మనకంటే బాగా విజయవంతమైనప్పటికీ కొన్ని సాంకేతిక పదాలకు చేస్తున్న అనువాదాలు తమిళులకు కూడా బాగా నవ్వు తెప్పిస్తున్నట్లున్నాయి. కాని వాళ్లు మనలాగా సంస్కృత ప్రభావంలోకి వెళ్లిపోలేదు. ఒక పదానికి నామవాచకం లేనప్పుడు వాళ్లు దానికి వర్ణన రూపంలో -నెరేషన్- పదాలు కూర్చి చేర్చుకుంటున్నారు. అవి చదువుతూంటేనే ఆహ్లాదాన్ని కలిగిస్తుంటాయి.

పదసూచిక, లేదా పదాల పట్టిక చివరి పేజీల్లో ఇవ్వడం మంచి పద్దతే అయినా తెలుగుతనం లేని పదసూచిక, పట్టిక ప్రభుత్వ పాఠ్య పుస్తకాలలోని పదసూచికల్లానే గుగ్గిళ్లను తలపింప జేస్తాయి.

మొత్తం మీద చూస్తే సంస్కృత పదంలోని అద్వితీయ పద సంపద ఆ భాషను శిఖరస్థాయిలో నిలబెట్టి ఉంటే ఉండవచ్చు కాని, అదే స్థానిక భాషలకు ఆటంకంగా మారుతోంది. ఒకసారి అకశేరుకాలు, సకశేరుకాలు పదాలను గుర్తుకు తెచ్చుకోండి చాలు.

ఈనాడు పత్రికకు సంబంధించి మిగతా విషయాలను అలా పక్కన బెట్టి చూస్తే, 35 సంవత్సరాల పైగా అనువాద ప్రక్రియలో సాధించిన గొప్ప కృషే దాన్ని నేటికీ అగ్రస్థానంలో ఉంచుతోంది. వివిధ సబ్జెక్టుల విషయాలను రోజు అచ్చేస్తున్నప్పడు ఆంగ్ల పదానికి ఈనాడు పత్రిక చేసే అనువాదం వెంటనే నోట్సులో ప్రత్యేకంగా రాసుకోదగినంత గొప్పగా ఉంటుంది. సంస్కృత పదాన్నే తీసుకువచ్చినా సరే ఈనాడు అనువాద పదాలు చాలా ఆకట్టుకొనే విధంగా ఉంటాయి.