సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

22, ఆగస్టు 2012, బుధవారం

పాటగా జాలువారిన గురజాడ ‘కవిత్వపు కానుక’... వింటారా?


హాకవి గురజాడ అప్పారావు గారు 1910లో రాసిన  ‘దేశభక్తి’ గేయం స్కూలు రోజుల్లో చదువుకున్నదే. అయితే ప్రపంచసాహిత్యంలో ఇది ఆణిముత్యమని అప్పుడు తెలీదు.

తెలిశాక కూడా  ఈ గేయం/ గీతంలో గొప్పతనమేమిటో చాలాకాలం వరకూ అర్థం కాలేదు!

ఏ దేశభక్తి గేయమైనా దేశాన్ని గురించిన పొగడ్తలతో,  ఘనతను వర్ణిస్తూ భావుకత్వంతో  ఉంటుంది. కానీ గురజాడ గేయానికి  వాస్తవికతే  ప్రాణం! 

సంకుచిత పరిధులను అధిగమించి విశ్వవ్యాప్తంగా  ప్రపంచంలోని  ఏ దేశ ప్రజలకైనా  వర్తించగలిగే విలువైన విషయాలను తేలిక మాటల్లో తెలిపే  గేయమిది.

ముఖ్యంగా దీనిలోని  ‘దేశమంటే మట్టికాదోయి దేశమంటే మనుషులోయి!’ బాగా ప్రాచుర్యం పొందింది.

సాటి మనుషులను పట్టించుకోకుండా భౌగోళిక సరిహద్దులకే  ప్రాధాన్యం ఇచ్చే ధోరణిపై  ఆధునిక కవితా వైతాళికుడి  త్రివిక్రమ ‘పాదం’ఇది!

మనుషులను ప్రేమించలేనిది నిజమైన  దేశభక్తి  కాదని ‘శషభిషలు’లేకుండా చెప్పారాయన.

మాటలు కాదు, చేతలు ముఖ్యమని సూటిగా, సులభంగా చెప్పిన ఈ పాదాలు ఎంత గొప్పవో కదా?
- ‘వొట్టి మాటలు కట్టిపెట్టోయి గట్టిమేల్ తలపెట్టవోయి!’, 

‘దేశాభిమానం నాకు కద్దని వొట్టి గొప్పలు చెప్పకోకోయి - పూని యేదైనాను వొక మేల్ కూర్చి జనులకు చూపవోయి!’

‘మంచి గతమున కొంచెమేనోయి’ అని ఎవరైనా ఇంత ధీమాగా చెప్పారా?

‘మతం వేరైతేను యేమోయి? మనసు వొకటై మనుషులుంటే’ అనీ,

 ‘అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయి!’ అనీ  ఐకమత్య భావనను చిన్నచిన్న మాటల్లో కవిత్వీకరించారు.

ఇవన్నీ నీతులు  ప్రబోధించినట్టు కాకుండా నిజం గుర్తు చేస్తున్నట్టు ఉండటమే ఈ గేయం ప్రత్యేకత!

పావురమూ, సింహమూ!

‘గురజాడ రచనలన్నీ నష్టమై పోయి ఒక్క  ‘దేశభక్తి’ గీతం మిగిలినా చాలును. అతడు ప్రపంచ కవులలో ఒక్కడుగా లెక్కించ దగిన మహాక఼వి అని రుజువుకావడానికి . ఎందువల్లనంటే  ‘దేశ భక్తి’ గీతం సమస్త ప్రపంచ మహాజనుల జాతీయగీతం ’ అంటాడు శ్రీశ్రీ.

‘ఒక తెలుగు కవి ప్రపంచానికిచ్చిన కవిత్వపు కానుక ఇది’ అని  ప్రశంసించాడు.

‘ఒక కాలానికీ ఒక స్థలానికీ పరిమితం కాని సందేశం ఇచ్చేది ఈ గీతం. పావురం లాగ ప్రశాంతంగా రవళిస్తూనే , సింహం  చేసే క్ష్వేళాధ్వనిని స్పురింపజేస్తుంది ఈ గీతం’ అని అభివర్ణించాడు శ్రీశ్రీ.

రాసిన మూడేళ్ళకు  ‘కృష్ణా పత్రిక’లో  ఆగష్టు 9, 1913 తేదీన ఈ గేయాన్ని తొలిసారిగా  ప్రచురించారు.

కవిత కోయిలల.. గానం
ఈ గీతానికి  వయొలిన్ విద్వాంసడు  ద్వారం వెంకటస్వామి నాయుడు గారు స్వరాలు సమకూర్చారు.

ఆ నొటేషన్ చూడండి-


మూడు బాణీలు...

ఈ దేశభక్తి గీతాన్ని మూడు  రకాల బాణీల్లో విందాం...

 1940లో   టంగుటూరి సూర్యకుమారి పాడిన బాణీ వినండి..


1954లో వచ్చిన ‘జ్యోతి’ సినిమాలో  జి. వరలక్ష్మి గానం... సంగీతం- పెండ్యాల నాగేశ్వరరావు.



బాలాంత్రపు రజనీకాంతరావు గారు స్వరపరిచిన ఈ పాటను లలితా సాగరి పాడారు.
(ప్రసారభారతి తెలుగు ఆడియో సీడీ-20 సౌజన్యంతో... )


ఈ మూడు పాటల్లోనూ ఏది ఎక్కువ శ్రావ్యంగా అనిపిస్తోందో  చెప్పండి..!
 - - - -  -  -------------------------------------------- - -- -

 (అడిగిన మరుక్షణాల్లోనే ఏ పాటనైనా ఫోన్లో  వినిపించగల విద్యుద్వేగం;                            
కోరిన  ఆడియో- వీడియో- సమాచారం- ఏదైనా తక్షణమే  మెయిల్దారిని బయల్దేరదీసి,
 మరు నిమిషంలోనే  అవతలివారికి  చేర్చగల ప్రతిభా ఉన్న-
ఒకే ఒక్కడు ...
శ్యామ్ నారాయణ గారి  సహకారంతో.. .)


13 కామెంట్‌లు:

ఆ.సౌమ్య చెప్పారు...

చాలా మంచి పోస్ట్. గొప్ప పాటని గుర్తు చేసారు. మూడూ బాగున్నాయి.
నాయుడు గారు స్వరపరచిన పాట దొరికే అవకాశం ఉందా?? ఉంటే, మాకు వినిపించరూ!!

వేణు చెప్పారు...

ఆ.సౌమ్య గారూ!
థాంక్యూ. ద్వారం వెంకటస్వామినాయుడు గారు తన నొటేషన్ ప్రకారం వాయులీనం వాయించివుండాలి. అది ఎక్కడైనా దొరికితే తప్పకుండా పోస్టు చేస్తాను. అలాగే ఈ నొటేషన్ ప్రకారం ఎవరైనా (గాత్రం) పాడారేమో తెలీదు.

రామ్ చెప్పారు...

వేణు గారూ

మీ స్వతంత్ర దినోత్సవ 'కానుక' బాగుంది.
"మంచి గతమున కొంచెమేనోయ్’ అని ఎవరైనా ఇంత ధీమాగా చెప్పారా?" నిజమే ఈ మాట అనటానికి చాలా ధైర్యం కావాలి. ఏళ్ళ కిందట రాసిన పాటలు - ఇప్పటికీ valid గా ఉండటం irony !! ' మెయిల్దా రి' పదం బాగుంది !! వీరతాళ్ళు !! 'ఆకులందున అణిగి మణిగి కవిత కోకిల పలకవలేనోయ్' అనగా ఏమిటంటారు ?

Padmarpita చెప్పారు...

ప్రతి పాట చెవిలో వేణువై ఊదినట్లుందండి.....మంచి పోస్ట్!

వేణు చెప్పారు...

రామ్ గారూ!
‘మొయిల్దారిన బయల్దేరిన’ అనే ప్రయోగం ‘జగన్నాథుని రథ చక్రాలు’ గేయంలో శ్రీశ్రీ చేసిందే! దాన్నే కొంచెం మార్చి మెయిల్ కి అన్వయించానంతే.

మీ వీరతాళ్ళు శ్రీశ్రీ గారికే చెందుతాయి.

మీరడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘ప్రజాసాహితి’లో పి.ఎస్. నాగరాజు గారు వ్యాస భాగాన్ని కోట్ చేస్తున్నాను-

‘ఆకులందున అణిగిమణిగి కోయిల కూసినట్లు ప్రజల మధ్య, ప్రజల్లో మమైకమై జీవిస్తూ అణకువగా కవిగానీ, రచయత గానీ తన రచనలను ప్రజలనుంచి ప్రజలకు అందించాలని, అణకువగా ప్రజాప్రవాహంలో అలలెత్తాలని నిర్దేశించాడు గురజాడ’.

వేణు చెప్పారు...

Padmarpita గారూ! ‘దేశభక్తి’ పాటలు మూడూ మీకు బాగున్నాయన్నమాట!

ఆకాశవాణిది టిపికల్ లలిత సంగీతంలాగా, జి.వరలక్ష్మి పాడింది పాత సంగీతాన్ని స్ఫురిపంజేసేలా నాకు అనిపించింది. మీ ప్రశంసకు థాంక్యూ.

రహ్మానుద్దీన్ షేక్ చెప్పారు...

:)

వేణు చెప్పారు...

రహ్మానుద్దీన్ షేక్ గారూ! పొదుపుగా హసించారు. సంతోషం!

సుజాతా! థాంక్యూ. సహజనటిగా పేరుపొందిన జి. వరలక్ష్మి గారు పాడతారని ఈ సందర్భంగానే నాకు తెలిసొచ్చింది!

శ్యామ్ గారు నిన్న ఈ పాటలను నేనిలా అడుగుతుండగానే అలా ఫోన్లో వినిపించేశారు! ఆ ‘టైమింగ్’ భలే అబ్బురంగా అనిపిస్తుంది.

GKK చెప్పారు...

ఇంత చక్కని వ్యాసం ఆలస్యంగా చూచాను వేణు గారు. నా వోటు టంగుటూరి సూర్యకుమారి గారి పాటకే. ఈ స్వరాలు మూడవ పాటతో సరిపోతున్నాయి. అంటే original గా బాలాన్త్రపు గారే స్వరకర్తలా అనిపిస్తోంది. ద్వారంవారు హనుమతోడి లో బాణీ కట్టినట్టుగా ముద్రణలో తెలుస్తోంది. కానీ పాట మాత్రం ఖరహరప్రియలో ఉన్నట్టుగా నాకు అనిపిస్తున్నది. 'మెయిల్దారి’ it is too good venuji.

వేణు చెప్పారు...

తెలుగు అభిమాని గారూ! ‘దేశభక్తి’ గేయం టపాపై మీ స్పందనకు కృతజ్ఞతలు. సూర్యకుమారి గారి పాటక్కూడా బాలాంత్రపు గారే స్వరకర్త అయివుంటారన్న మీ పరిశీలన బాగుంది.

ద్వారం వెంకటస్వామి నాయుడి గారి బాణీ, రాగం గురించి తెలిపినందుకు సంతోషం.

‘మెయిల్దారి’ ప్రయోగానికి ఒరిజినల్ శ్రీశ్రీ ప్రయోగమే! అందుకే మరి అంత బాగుంది.:)

M b d syamala చెప్పారు...

వేణు!దేశభక్తి గేయంపై నీ పోస్టు చదువుతుంటే భలే సంతోషం వేసింది!ఇంత చక్కగా పరిశోధించటం present చేయడం ఎలా నేర్చుకున్నావు! శ్యాం గారికి నువ్వు కృతఙ్ఞతలు చెప్పిన విధానంగూడా చాలా బాగుంది!అయితే ఆ మూడు పాటలూ ముఖ్యంగా జి.వరలక్ష్మి గారి పాట వినాలని ఆశ పడ్డాను!కానీ ఎందుకో అవి play అవడం లేదు!మెయిల్దారి నిజంగా అందమైన ప్రయోగం!మొయిలు దారి శ్రీశ్రీ గారి ప్రయోగం మబ్బుల దారిలో అని కాబట్టి అందులోవిశేషం లేదు దాన్ని మెయిలుకి అన్వయిచడంలో చమత్కారం ఉంది so వీరతాళ్ళు నీకే చెందుతాయి! రామ్ లారి ప్రశ్నకు నీ సమాధాన సేకరణ ఎంతందంగా ఉంది!ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ నీకు?నీ విస్తృత పఠనాసక్తి ఆశ్చర్యం కలిగిస్తోంది!పి ఎస్ నాగరాజు గారి వివరణ గురజాడ హృదయాన్ని అద్దం పట్టింది!అయితే . . మమైకం ప్రయోగం తప్పనుకుంటాను! మమేకం అని ఉండాలి కదా!మంచి పోస్టు లు నువ్వు ఇలాగే ఇవ్వాలని కోరుకుంటూ!

వేణు చెప్పారు...

Syamala: దీనిలో పెట్టిన పాటలు ప్లే అవటం లేదా? చూసి సరిచేస్తాను. అయితే ‘మెయిల్దారి’ వీరతాళ్ళ నుంచి తప్పించుకునే అవకాశం లేదన్నమాట! సరే :)

మమేకం అనే పొరపాటు పదమే విస్తృతంగా వ్యాప్తిలో ఉంది కానీ సరైన ప్రయోగం ‘మమైకం’. (మమ+ ఏకం= మమైకం. వృద్ధి సంధి.) ‘వాడుక భాషలో అపప్రయోగాలు’ పుస్తకంలో రవ్వా శ్రీహరి గారు ఈ పదం గురించి రాసినట్టు గుర్తు. థాంక్యూ.

M b d syamala చెప్పారు...

నిజమే!వృద్ధి సంధి వివరణ నాకు తట్టకపోవడమేమిటి?వాడుకభాషలోని ఈఅపప్రయోగం నన్ను హమార్చింది!sorry nd thank u