అదో ప్రేమ కథా చిత్రం. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తీశారు. సినిమా పేరు - ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’. త్వరలో విడుదల కాబోతోంది.
హీరో వరుణ్ - గాయకుడు. హీరోయిన్ పాత్ర పేరు నిత్య (తమిళంలో). హీరో ఆమెను మూడేళ్ళ తర్వాత కలుస్తాడు. ఆ సందర్భంలో అతడు ఇళయరాజా పాట పాడి, ఆయన సంగీత ప్రతిభను ఆరాధనాపూర్వకంగా తల్చుకునే సన్నివేశం ఉంది. ఇళయరాజా సంగీతం సమకూర్చిన Ninaivellam Nithya (1982) తమిళ సినిమా పాట పాడతాడు. తెలుగు వర్షన్ లో ఈ పాట గుణ (1991) సినిమాలోని ‘ప్రియతమా నీ వచట కుశలమా’ గా మారింది. దీనిక్కూడా ఇళయరాజానే సంగీత కర్త.
చూడండి ఈ సినిమాలోని ఓ చిన్న సన్నివేశం. ..
చూశారు కదా?
‘అందుకే- నువ్వు పాడటం మొదలుపెట్టగానే...’ అని హీరోయిన్ అన్న తర్వాత ఓ క్షణం నిశ్శబ్దం.. ఆ తర్వాత వినిపించిన నేపథ్య సంగీతం ఎంత సమ్మోహనంగా, హాయిగా ఉందో గమనించారా?. బ్యాక్ గ్రవుండ్ స్కోర్ ని హంగేరియన్ మ్యూజిషియన్స్ తో చేయించారు ఇళయరాజా.
విశేషమేంటంటే... ఈ సినిమా సగం తీసేదాకా సంగీత దర్శకుడు ఎవరనేది దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్ణయించుకోలేదు. అందుకే పాటల సన్నివేశాల చిత్రీకరణను చివరకు అట్టిపెట్టేశారు.
ఆ తర్వాత ఆ సినిమాకు స్వరకర్త ఇళయరాజాయే అయ్యాడు! తన ప్రస్తావన వచ్చిన సన్నివేశానికి స్వయంగా నేపథ్యసంగీతం సమకూర్చుకున్నారన్నమాట.
విచిత్రంగా లేదూ?
ఈ సినిమా సంగీతం గురించి దర్శకుడు గౌతమ్ మీనన్ ఏమన్నారో చదవండి-
‘‘ నాకు ఏ రకమైన సంగీతం కావాలని మొదటిరోజు ఆయనతో చెప్పానో, అదంతా ఇళయరాజా సర్ పూర్తిగా గుర్తుంచుకున్నారు. నా మనసులో ఏదైతే ఉందో అదే ఆయన తన సంగీత బృందానికి చెపుతుండేవారు. బ్రేక్ బీట్స్, జాజ్/ బ్లూస్ స్టఫ్, ప్రతిదీ... !
ఇదంతా నా ఐఫోన్ లో చిత్రీకరించాను. అక్కడ గడిచిన ప్రతి క్షణాన్నీ ఒడిసిపట్టుకుని రికార్డు చేయాలనిపించింది.
‘ఎందుకలా చేస్తున్నావ్?’ అని అడిగారు ఇళయరాజా.
‘ఇదంతా నాకోసం చేస్తున్నా’నని చెప్పాను. ’’ (హిందూ పత్రికకు ఇచ్చిన ఇంటర్ వ్యూ లో).
పాటలు విడుదలయ్యాయి...
‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ సినిమా పాటలు ఈ నెల మొదటి వారంలో విడుదలయ్యాయి. వాటిలో ఓ పాట నాకు బాగా నచ్చింది. ఇళయరాజా అరుదుగానే పాడుతుంటారు కదా? ఈ యుగళగీతాన్ని ఆయన బేల శండేతో కలిసి పాడారు.
చిన్న చిన్న పదాలతో చక్కగా రాశారు అనంత శ్రీరామ్. ( అయితే ‘వేళలో, ఈ వేళ, ఇవ్వాళ’ అంటూ ఒకే రకమైన పదాలు లేకుండా జాగ్రత్త పడితే బాగుండేది). ఈ పాట వినడానికి ముందు సాహిత్యం ఓసారి పరికించండి!
లాయి లాయి లా ఇలా ఈ హాయి నీదే సుమా
మాయలేమి మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి లా ఇలా ఈ తీపి నీవే సుమా
గాలి రంగులోన ఉన్న గాయమమ్మా
లేత లేత చేతిలో చేతులేసి చేరుకో
ఊసులెన్నొ పంచుకున్న వేళలో మనదే సరదా సరదా
లాయి లాయి లా ఇలా ఈ హాయి నీదే సుమా
మాయలేమి మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి లా ఇలా ఈ తీపి నీవే సుమా
గాలి రంగులోన ఉన్న హృదయమమ్మా
1. ఇంతలో ఇలా ఎదిగిన ఆ తలపులో ఎవరికి ఈ పిలుపులో
వింత వింతగా తిరిగిన ఈ మలుపులో తన జతేమొ కలుపుకో
ఇదంత చెప్పలేని ఈ భావనే పేరు ఉందో హో..
తెలియదు దానికైన ఈ వేళ
జవాబు చెప్పలేని ఈ ప్రశ్నలింకెన్ని ఎన్నో హో..
అవన్ని బయట పడవు ఇవ్వాళ
లోపలున్న అల్లరి ఓపలేని ఊపిరి
స్పర్శ లాగ పైకి వచ్చి లేనిపోనివేవో రేపిందా
లాయి లాయి లా ఇలా ఈ హాయి నీదే సుమా
మాయలేమి మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి లా ఇలా ఈ తీపి నీవే సుమా
గాలి రంగులోన ఉన్న హృదయమమ్మా
2. మాటిమాటికీ మొదలయే ఈ అలికిడి మరుక్షణం ఓ అలజడి
ఆకతాయిగా తడిమితే ఈ తడబడి తరగదే ఈ సందడి
చలాకి కంటి పూల తావేదొ తాకిందిలాగా హా..
గులాబి లాంటి గుండె పూసేనా
ఇలాంటి గారడీల జోరింక చాలించదేలా హో..
ఎలాగ ఏమనాలి ఈ లీలా
లోపలున్న అల్లరి ఓపలేని ఊపిరి
స్పర్శ లాగ పైకి వచ్చి లేని పోనివేవో రేపిందా
లాయి లాయి లా ఇలా ఈ హాయి నీదే సుమా
మాయలేమి మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి లా ఇలా ఈ తీపి నీవే సుమా
గాలి రంగులోన ఉన్న హృదయమమ్మా
లేత లేత చేతిలో చేతులేసి చేరుకో
ఊసులెన్నొ పంచుకున్న వేళలో మనదే సరదా సరదా
లాయి లాయి లా ఇలా ఈ హాయి నీదే సుమా
మాయలేమి మోయలేని ప్రాయమమ్మా
లాయి లాయి లా ఇలా ఈ తీపి నీవే సుమా
గాలి రంగులోన ఉన్న గాయమమ్మా
ఈ పాట వినండి ...
ఇళయరాజా గొంతులో ముగ్ధత్వం మిళితమైన మార్దవం ఉంటుంది. దీన్ని ఈ పాటలో కూడా గమనించవచ్చు. ఇళయరాజా మార్కు ‘కోరస్’తో మొదలయ్యే ఈ పాటలో గానం, నేపథ్యసంగీతం అవిభాజ్యమన్నట్టు పరస్పర ఆధారంగా అల్లుకుపోయి వీనుల విందు చేస్తాయి.
చరణాల్లో బాణీ తీరు - ఒక వృత్తాన్ని చుట్టుముట్టి తిరుగుతున్న భావన కలిగిస్తుంది. గాయని పాడిన భాగంలో ‘హాయి నీదే సుమా’ లో ‘నీదే’ అన్నచోట మాధుర్యం ప్రత్యేకం! ‘మనదే సరదా సరదా’ అనేమాటలు త్వరత్వరగా తరుముకొచ్చినట్టు గమ్మత్తుగా వినిపిస్తాయి!
5 కామెంట్లు:
Super Like ! Thanks for posting.
భలేగుంది ......చూసితీరవలసిందే!
వేణు గారు! vintage stuff from ఇళయరాజా. ’లాయి లాయి’పాట హాయిగా ఉంది. సాహిత్యం ఏంటోలా ఉంది. కొంచెం డబ్బింగ్ వాసన వేసింది. music is outstanding. పాట బాణి ఇలా గొప్పగా ఉంటే ఇంక మాటలను పాటి చేసే అవసరంరాదు. ముఖ్యంగా గాయని బేల శండే. my god. ఎవరండీ ఈమె? ఇలాంటి clean vocals ఉన్న గాయని కోసం నేను ఎదురు చూస్తున్నాను. she has fabulous voice. తక్కిన పాటలు కూడా వినాలి.
@ Sujata:
@ padmarpita: మీ స్పందనకు థాంక్యూ అండీ.
@ తెలుగు అభిమాని: థాంక్యూ! ఈ సినిమాలో మిగిలినపాటలు నాకంతగా నచ్చలేదు.కథానుగుణంగా వాటి బాణీలు ఉన్నాయనుకుంటాను.
బేలషిండే వాయిస్ మీరన్నట్టే బాగుంది. ఆమె మరాఠీ గాయని. జోథా అక్బర్ లోకూడా పాడింది. ఆమె తెలుగులో పాడిన పాట బహుశా ఇదే. ఈ గాయని అధికారిక వెబ్ సైట్ చూడండి-http://www.belashende.com/
ఈ సినిమా హీరో నాని ఈ పాట గురించి వివరంగా తన అభిప్రాయం చెప్పాడు- ‘ఇళయరాజా సర్ 80ల్లో 90ల్లో చేసిన సంగీతం గుర్తొచ్చేలా ఈ పాటలు కూర్చారు. నా ఫేవరిట్ పాట- ఇళయరాజా పాడిన ‘లాయి లాయి’. ఇదో మాంటేజ్ పాట. స్నేహం నుంచి ప్రేమలోకి అందంగా పరిణమించటాన్ని చూపిస్తుంది. మొదట్లో వచ్చే పిల్లల కోరస్ నాకు బాగా నచ్చింది. ‘గీతాంజలి’ స్ఫురణకు వచ్చేలా ఇంద్రజాలం చేస్తుంది. ఇన్ స్ట్రుమెంటేషన్ కూడా ఆకర్షణీయం’.
కామెంట్‌ను పోస్ట్ చేయండి