సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

22, ఫిబ్రవరి 2013, శుక్రవారం

భయపెడుతుందా చిరునవ్వు?

క్రౌర్యాన్ని చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. మృగాల్లోని  క్రూరత్వం కంటే మనిషిలో ఉన్న క్రూరత్వం భయోత్పాతం కలిగిస్తుంది.  అది సహజం కూడా!   

కానీ చిరునవ్వు భయపెట్టటమేమిటి? 

ఈ మధ్య కమల్ హాసన్ ‘విశ్వరూపం’ సినిమా చూశాను.

ప్రథమార్థం మొదటి అరగంటలోనే  అందరినీ విభ్రాంతపరిచే, అత్యద్భుతమైన కమల్ ఫైట్  ఒకటుంది. 

ఆ ఫైట్ కు ముందు ఏం జరుగుతుంది? 

ఉగ్రవాదుల ముఠా నాయకుడు (పాత్ర పేరు ఫరూక్)  కమల్ ( పాత్ర పేరు విసాం )నీ,  అతని భార్య పూజాకుమార్  (పాత్ర పేరు నిరుపమ) నీ బంధించి,  అనుచరుల సాయంతో బలవంతంగా తమ స్థావరానికి తీసుకుపోతాడు.

వారితో పాటు నిరుపమ బాస్ దీపక్ (పాత్రధారి సమ్రాట్ చక్రవర్తి ) ని కూడా తీసుకుపోతారు. ఇతడికి  ఆ ముఠాతో  సంబంధాలున్నాయి.  వాళ్ళనప్పగించాను కాబట్టి   తనను వదిలెయ్యమంటూ దీపక్  ఫరూక్ ని ప్రాధేయపడుతుంటాడు.

ఫరూక్ బాస్ - ఒమర్ ( పాత్రధారి రాహుల్ బోస్ ) . ఇతడే మెయిన్ విలన్ ఈ చిత్రంలో.  అతడి అసిస్టెంట్ సలీమ్ ( పాత్రధారి జైదీప్ ఆహ్లావత్) .

బాస్ ఆజ్ఞ ప్రకారం... కమల్  ఫొటోను సెల్ ఫోన్ ద్వారా ఈమెయిల్ పంపిస్తాడు  ఫరూక్.   అతడెవరో  గుర్తించిన విలన్ అతణ్ణి వెంటనే  రెండు మోకాళ్ళ మీదా షూట్ చేయమని ఫోన్ లో  సలీం ద్వారా చెప్పిస్తాడు విలన్.   

‘మరి దీపక్ సంగతేమిటి, అతణ్ణి వదిలేయమంటారా?’  అనడుగుతాడు ఫరూక్.  బాస్  ‘ఆదేశం’ సలీం మాటల్లో  ఫోన్లో వినపడుతుంది.  ఇవతల తనను వదిలేస్తారనే ఆశతో, ఆత్రుతతో  ఎదురుచూస్తున్న దీపక్.   ‘వద్దు, అతణ్ణి  ఫినిష్ చేయమ’ ని ఫోన్ ద్వారా సందేశం!   

అది వింటూ కొద్దిక్షణాల్లో  తన చేతిలో ప్రాణాలు కోల్పోబోతున్న వ్యక్తిని  ఫరూక్  జాలిగా చూడడు; గంభీరంగానూ చూడడు.  

ఫోన్ వదలకుండా  అతడి వైపు చూస్తూ నిశ్శబ్దంగా -ఏమీ ఫర్వాలేదన్నట్టు-  చిరునవ్వు నవ్వి, ఓ  క్షణం ఆగమని చేత్తో సైగ చేస్తాడు.
జలదరింపజేస్తుంది ఆ నవ్వు!

ఎందుకంటే- పైకి  స్నేహపూర్వకంగా కనపడినా జరగబోయేది  ప్రేక్షకులకు తెలుసు కాబట్టి-   ఆ విషపు నవ్వు  కలవరపెడుతుంది.

ఆ నవ్వు నిజానికి  కాసేపట్లో కబళించబోయే  మృత్యు వికటాట్టహాసం కాబట్టే  భయపెడుతుంది!  

 వెంటనే   దీపక్ ని ఒకచోట నిలబెట్టి,   వెనక్కి తిరగమని చెప్పి,  క్రూరంగా-  రెప్పపాటులో తలమీద  కాల్చేసి చంపేస్తాడు ఫరూక్.

ఆ తర్వాత  అతడు తన ముఠాతో సహా   కమల్  చేతిలో  హతమవుతాడు! 

సినిమా చూశాక సినిమాలో కొన్ని సన్నివేశాలతో పాటు ఫరూక్ పాత్రధారి  నవ్వు కూడా నన్ను వెంటాడుతూ వచ్చింది.


బాలచంద్రన్ విషాదాంతం

మొన్న ఎలీటీటీఈ ప్రభాకరన్ కొడుకు బాలచంద్రన్ అమాయకపు మొహంతో ఇసుక బస్తాల సైనిక బంకర్లో కూర్చుని బిస్కెట్లు తింటున్న దృశ్యం పేపర్లలో వచ్చింది.తమిళ టైగర్లకూ, శ్రీలంక సైన్యానికీ మధ్య హోరాహోరీగా జరిగిన పోరాటంలో కాల్పుల మధ్య ఈ పన్నెండేళ్ళ బాలుడు చిక్కి చనిపోయాడని గతంలో వార్తలు వచ్చాయి. కానీ అది   అసత్యమని ఇప్పుడు తేలింది.  ఈ బాలుణ్ణి ఉద్దేశపూర్వకంగా అతి సమీపం నుంచి కాల్చి చంపారని బ్రిటిష్ వార్తల చానల్  ‘ఛానల్ 4′  వెల్లడించింది.  

ఎందుకలా  చంపేశారు?  ప్రభాకరన్ కొడుకు అనే కారణం కావొచ్చు;  ప్రమోషన్ల మీద యావ  కావొచ్చు!  రెండూ కూడా  అయివుండొచ్చు!  

లొంగిపోవటానికి వచ్చిన ఆ బాలుణ్ణి  శ్రీలంక సైనికులు క్రూరంగా  హత్య చేసిన వార్త  చదివినపుడు ... విశ్వరూపంలోని  సన్నివేశం... ఫరూక్ నవ్వూ  గుర్తొచ్చాయి.

 తినటానికి బిస్కెట్లు పెట్టినపుడు...  ఆ పసివాణ్ణి తర్వాత బుల్లెట్లతో ప్రాణం తీయబోతున్న సంగతి  సైనికులకూ /సైనికాధికారులకూ ముందే తెలిసివుంటుంది కదా? 

బాలుడితో వాళ్ళు మాట్లాడినపుడు-

వారి మొహంపై కూడా నవ్వు ఇలాగే... మృత్యువు నీడలా తాండవించి వుండాలి !

బాలచంద్రన్ ఒక్కడినే  కాదు; ఎల్టీటీఈకి సంబంధించిన చాలామంది  పిల్లలను... లొంగిపోతామన్నా వినకుండా  ఇలాగే  హతమార్చారట.

అయినా ఒక్క  శ్రీలంక సైన్యమే అనేముంది,

ఆధిపత్యం కోసం  చెలరేగే  యుద్ధోన్మాదంలో నిరపరాధుల నెత్తురంటుతున్న  సైన్యాలు... ఇంకా చాలా దేశాలవే ఉన్నాయి!  

9 వ్యాఖ్యలు:

రామ్ చెప్పారు...

వేణు గారూ

"ఆధిపత్యం కోసం చెలరేగే యుద్ధోన్మాదంలో నిరపరాధుల నెత్తురంటుతున్న సైన్యాలు... ఇంకా చాలా దేశాలవే ఉన్నాయి! "

నిన్నటి హైదరాబాద్ పేలుళ్ళ గురించీ - ఒక్క మాటా మీరు రాయకుండా - ఫై వాక్యంతో వేదనంతా చెప్పారు కదా !!

భాగ్యనగరం త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ .....

vijay చెప్పారు...

వేణు గారూ
బాలుడికి సంబంధించిన వీడియో కూడా తాము చూశామని ది హిందు పత్రిక రాసింది. ఎవరో తెలిసిన వ్యక్తిని చూసినట్లు ఆ బాలుడు ఆందోళన నిండిన భావాలతో లేచి నిలబడడం, ఆ తర్వాత బులెట్ గాయాలు తగిలి వెనక్కి పడిపోవడం వీడియోలో ఉన్నట్లు రాశారు.

నేను సినిమా చూడలేదు గాని, మీరు రాసింది, ఆ బొమ్మలు చూశాక రెండింటికీ పోలిక కరెక్టుగా సరిపోయినట్లు అనిపిస్తోంది.

బాలచంద్రన్ ముఖంలో కనపడీ కనపడనట్లుగా ఉన్న ఆందోళన జాలి, భయం... ఈ రెండు అనుభూతుల్ని ఒకేసారి కలిగిస్తుంది. మనుషులనుండి తయారు చేసుకునే సైనికుల్ని మానుష లక్షణాలకు దూరంగా ఉంచడంలో యుద్ధ వ్యవస్ధలు ఎంతగా సఫలం అయ్యాయో గ్రహిస్తే ఆశ్చర్యము, భయమూ కలుగుతాయి.

నిశ్శబ్దం ఎంత వయొలెంట్ గా ఉంటుందో ఒక సినిమాలో (అతడు అనుకుంటా) తనికెళ్ల భరణి చెబుతాడు. మీరు చెప్పిన 'భయపెట్టే చిరునవ్వు' కూడా ఆ కోవలోనిదే కాబోలు!

వేణు చెప్పారు...

@ రామ్ : థాంక్యూ. టపా రాయటానికి హైదరాబాద్ పేలుళ్ళు కొంత నేపథ్యం, ప్రేరణ ఇచ్చినమాట నిజమే. మరింత విస్తృత పరిధికి దీన్ని అన్వయించవచ్చు.

@ సుజాత: ‘విశ్వరూపం’ సినిమా సన్నివేశానికీ, బాలచంద్రన్ విషాదానికీ అనుకోకుండా లింక్ చేయొచ్చని ఎలా తోచిందో తెలీదు కానీ, రాశాక సరిగానే కుదిరిందనిపించింది. మీ అభినందనకు థాంక్యూ.

@ విజయ్: ‘బాలచంద్రన్ ముఖంలో కనపడీ కనపడనట్లుగా ఉన్న ఆందోళన’ గురించి బాగా చెప్పారు. తనికెళ్ళ భరణి నిశ్శబ్దం వయొలెంట్ ఉండటం (త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్) ఈ సందర్భంలో మంచి పోలిక. థాంక్యూ.

వేణు చెప్పారు...

బాలచంద్రన్ విషాదంపై నిన్న (ఆదివారం) హిందూ ఓపెన్ పేజీలో సీనియర్ జర్నలిస్ట్ శ్రీధర్ కృష్ణ స్వామి రాసిన వ్యాసంలో కొంత ఇక్కడిస్తున్నాను. నా టపా - ఆయన స్పందన దాదాపు ఒకేలా ఉండటం విశేషం!

ఇలాంటి అంశాల్లో ఒకే తరహా స్పందనలు సహజమే.

“Did you see the picture of that little boy in The Hindu … he reminds me of my son who is only a few years younger. I am outraged,” thundered a colleague as she barged into my cubicle.

By now, there have been enough pained people in India and abroad seeing the images of a 12-year old munching on a piece of chocolate, biscuit or whatever, little realising that this perhaps was going to be his last meal before being pumped with bullets. And for what reason? Just because he happened to be the son of a world known terrorist. And was it his fault that the dad chose a different way of life?

A picture tells a thousand words. What struck me in the images was the innocent eyes of the kid, perhaps even looking at his killer in the final moments.

తృష్ణ చెప్పారు...

పేపర్లో ఆ పిల్లవాడి ఫోటోలు చూశాకా నాకు కలిగిన అభిప్రాయాలు కూడా ఇంచుముంచు ఇలాంటివేనండి.. మీ టపా మొన్న చూసాకా అవే ఆలోచనల్లోకి వెళ్పోయి మనసు భారంగా అయిపోయి.. వ్యాఖ్య రాయకుండా వెళ్పోయాను...:(

ఆ.సౌమ్య చెప్పారు...

హ్మ్ ఈ రెండూ నాకు తెలీవు. మీరు రాసినది చదివాక ఏదో విషాదం ముంచుకొచ్చింది.

BVJ చెప్పారు...

It's unfortunate to tag Prabhakaran as a 'terrorist' :-(

వేణు చెప్పారు...

@ తృష్ణ:
@ ఆ.సౌమ్య:
బాలచంద్రన్ విషాదాంతంపై మీ స్పందన సార్వత్రికమైనది. మీ అభిప్రాయం తెలిపినందుకు థాంక్యూ !

వేణు చెప్పారు...

BVJ శ్రీనివాస్ గారూ, ప్రభాకరన్ ను అలా సంబోధించింది జర్నలిస్ట్ శ్రీధర్ కృష్ణస్వామి అని మీరు గమనించేవుంటారు.
నాకైతే ఆయనపై నిర్దిష్టంగా ఒక అభిప్రాయమేమీ లేదు!