సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

30, ఏప్రిల్ 2013, మంగళవారం

వేరే రచయితల కథలను తిరగరాయొచ్చా?


రచయిత పుస్తకం రీ ప్రింటుకు వెళ్ళబోతోంది. ఆ రచనను అమితంగా అభిమానించే పాఠకుడికి ఆ కాయితాలు  చూసే అవకాశం వచ్చింది. 

ఆ పుస్తకంలోని ఓ  ఘట్టంలో  ‘... రుజువు కాదా?’ అంటూ ముగిసే  వాక్యం చూసి,  ఇది    ‘... రుజువు కాదూ?’ అని ఉండాలి కదా?’  అన్నాడు పాఠకుడు.

రచయిత  అవాక్కయ్యేలా- పాత ప్రచురణలో పాఠకుడు  చెప్పినట్టే ఉంది.

అంత అతి స్వల్పమైన మార్పును కూడా గుర్తుంచుకున్నందుకూ, గమనించినందుకూ ఆ రచయిత ఆశ్చర్యపోయారు!   

‘ఎన్నోసార్లు చదివి, కంఠతా వచ్చిన వాక్యాలవి’  అని వివరించాడు ఆ  పాఠకుడు. 

ఐదారేళ్ళక్రితం నిజంగా జరిగిన సంఘటన ఇది!

పాఠకులంతే ...!   

రచనలను అభిమానించేటపుడు అక్షరం అక్షరం ప్రాణం పెట్టి చదువుతారు.   రీ ప్రింట్లలో  చిన్న మాట తేడాగా వచ్చినా భరించలేరు! 

*  *  *

పునరపి కథనం

తెలుగులో రచయితలూ, కవులూ తన రచనలకు రెండో వర్షన్ రాసుకున్న సందర్భాలున్నాయి.

*  గురజాడ ‘కన్యాశుల్కం’నాటకానికి  రెండో వర్షన్ రాశాడు. 

*  తన  ‘దిద్దుబాటు’ కథలో భాషను కొంతమార్చి రెండో వర్షన్ తయారుచేశాడు.  


*  తిలక్ ‘మైనస్ ఇంటూ ప్లస్’ కవితను మరో రూపంలోనూ రాశాడు.  


ఇలా ఎవరి రచనలను వారు  మార్చుకోవటంలో పేచీ లేదు.

కానీ వేరే రచయిత అలా చేయొచ్చా? 

అప్పటికే  పాఠక లోకంలోకి వెళ్ళిపోయిన రచనలను క్లుప్తం చేసో, వర్ణనలు తగ్గించో  వేరే రచయితలు తిరగరాయటం నా దృష్టిలో ఆక్షేపణీయం, అనుచితం.

అసలు వేరే రచయితలు ఆ రచనల్లో వేలుపెట్టడమే అసంబద్ధం!

‘కొత్త తరం పాఠకులకు పరిచయం’ చేయాలనే దృష్టి ఉంటే  ఆ రచనలను  అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేయాలి.

వాటికి  పరిచయాలూ, విశ్లేషణలూ ఎంతైనా రాసుకోవచ్చు.

కానీ ఆ కథను పున:కథనం (రీ టెల్లింగ్) చేసే పనికి పూనుకోవటం ఆ రచయితకే కాదు;  ఆ రచయిత రాసిన పుస్తకాలను  ఆరాధించే పాఠకులకు కూడా అవమానం చేసినట్టే !

అనువాదాల సంగతి వేరు

వేరే భాషలో ఉన్న రచనలను అనువదించి, మన భాషలోని పాఠకులకు అందుబాటులోకి తేవటం వేరు. అలా చేసేటపుడు యథాతథంగా ఇవ్వలేకపోతే, క్లుప్తం చేయటం కూడా సమంజసమే.

ఎలెక్స్ హేలీ  రచన ‘ఏడు తరాలు’ను అనువదించినపుడు  సహవాసి చేసిందదే.

ఒకే భాషలో  గ్రాంథిక భాషలోనో, పద్యరూపంలోనో ఉన్న రచనలను వాడుకభాషలోకి మార్చటంలో  అర్థం ఉంటుంది. ఆ భాషనూ, పద్యాలనూ అవగాహన చేసుకోలేనివారికి అది ప్రయోజనం. 

అదే భాషలో ఉన్న రచనలను సంగ్రహం చేసి,  ‘పిల్లల కోసం ’చిన్నచిన్న పదాలతో  రీ టోల్డ్ స్టోరీలు రాయటాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. ఆ పిల్లలు కొంత వయసు వచ్చాక , ఒరిజినల్ కథలను చదివే అవకాశం ఉంటుంది కాబట్టి.  

 కానీ అదే  భాషలో - వాడుక భాషలోనే రాసిన ఆధునిక రచనలను ... పాఠకులందరికీ  అర్థమవుతూ ఉన్న రచనలను... వేరే రచయితలు కలగజేసుకుని  పునర్లిఖించటమా?

కొమ్మూరి... మల్లాది    

మల్లాది వెంకటకృష్ణమూర్తి తను అభిమానించే కొమ్మూరి సాంబశివరావు నవల ‘ప్రాక్టికల్ జోకర్’ను ఈ రకంగానే ‘రీ టోల్డ్’ పద్ధతిలో తిరగరాసినపుడు ఆశ్చర్యం వేసింది.

 సరళ- వ్యావహారిక  శైలిలో రాసిన కొమ్మూరి రచనలు  అర్థం కాకపోవటమా? అవి చదవటానికి పాఠకులకు మల్లాది సాయమో, మరెవరి సాయమో అవసరమా?


ఆధునిక వ్యవహార భాషలో ఉత్కంఠ, కథన వేగం మిళితం చేసి  రాసి, వేలమంది పాఠకులను  అభిమానులుగా చేసుకున్న రచయిత   కొమ్మూరి సాంబశివరావు.

ఆ రచనలను అభిమానించిన వ్యక్తే ఆయన రచనను తిరగరాయటమంటే తన అభిమాన రచయితను గౌరవించినట్టవుతుందా? 

అది ఆయనకు చేసిన అవమానం తప్ప మరొకటి కాదు. అంతే కాదు; 
కొమ్మూరి అభిమాన పాఠకుల కోణంలో కూడా అది అపరాధమే!


ఖదీర్ బాబు పున:కథనంః
 
‘నూరేళ్ల తెలుగు కథ’  పేరిట వందమంది రచయితల ప్రసిద్ధ కథలు పునఃకథనం చేసిన మహమ్మద్ ఖదీర్‌బాబు చేసింది కూడా ఇదే !  


 భావం చెడకుండా కథలను  సంక్షిప్తం చేసే ప్రయత్నం కష్టమైనదే  కావొచ్చు. కానీ అంత కష్టానికి  పాల్పడాల్సిన అవసరమేముంది?

ఆ ఒరిజినల్  కథలపై, కథకులపై అభిమానమే ఉంటే... వాటిన్నటినీ సంకలనంగా తెచ్చే ప్రయత్నం -  అదెంత కష్టమైనా సరే, చేసివుండాల్సింది!

*  *  *


రచయిత సంతకం

కథ కావొచ్చు; నవల కావొచ్చు- రచయిత రాసిన ప్రతి అక్షరం, పద ప్రయోగం,  వాక్యనిర్మాణం, చివరికి విరామచిహ్నం  కూడా ఆ రచనలో అంతర్భాగాలే! 

ఆ రచనా శైలి  రచయిత సంతకం!

అది ఇతరులు  అనుకరించినా సంపూర్ణంగా సాధ్యంకాని ప్రత్యేకత!
పాఠకులను చేరటం కోసం రచయిత  సృష్టించుకున్న ఆత్మీయ వాహకం!

వేరే రచయితలు ఆ రచనను తిరగరాస్తే - ఇతివృత్తం మారకపోవచ్చు కానీ కథ ఇక  ఆ ఒరిజినల్  రచయితది అవ్వనే అవ్వదు. 

గొంతుతో ముడిపడిన శ్రావ్యత 


ఘంటసాల గాన ప్రతిభ గురించి చెప్పదల్చుకున్నవాళ్ళు ఆయన పాటను పాడి  విశ్లేషిస్తే,  ఎందుకంత మధురంగా ఉందో వివరిస్తే మంచిదే! 


అంతే కానీ-  ‘ఘంటసాల పాట ఇదీ’  అంటూ తామే పాటంతా  పాడేసి, దాన్ని రికార్డుగా మార్కెట్లో  విడుదల చేయకూడదు.

కళ  వ్యాపారంగా , మార్కెట్ సరుకుగా,  లాభార్జన సాధనంగా   మారటంలో ఏర్పడిన  వికృత పద్ధతుల్లో ఇదొకటి.

మనలాంటివాళ్ళం  ఘంటసాల,  బాలుల పాడినవాటినో;   సుశీల,   జానకిల పాటలనో   ముచ్చటగా, ఆరాధనగా, ఇష్టంగా  పాడుకోవటం, ఆనందించటం;  ఇతరులకు వినిపించి వాళ్ళను  సంతోషపెట్టటం  వేరు.  

దాని సంగతి కాదిది.

ఈ అనుకరణ  వేత్తలు   తాము  గొప్ప పాత పాటలను  అత్యాధునిక సాంకేతిక ధ్వని ముద్రణను  జోడించి, ఒరిజినల్ గా ఉండేలా  పాడటానికి ఎంత కష్టమైనా  పడివుండొచ్చు.

కానీ అసలు అసలే; నకలు నకలే!

గీతాదత్  పాట గొప్ప పాటను తనే  లతా మంగేష్కర్ పాడి రికార్డుగా  విడుదల  చేసిందంటే అది గీతాదత్ పై  లత గౌరవం చూపినట్టవుతుందా?

ఏమాత్రం కాదు. గీత పాట తియ్యగా ఉందంటే  అది ఆమె గొంతుతో ముడిపడివున్న విషయం.

 ఆ గొంతు లేనపుడు... అది ఇక గీత పాట కానే కాదు. 
కనీసం  అది లత పాట కూడా కాబోదు. 
విషాదకరమైన నకలు పాట అవుతుంది.

ఒక గాయకుడు పాడిన  (సినిమా) పాటను మరొకరు తమ గొంతుతో పాడి రికార్డులుగా విడుదల చేయటం అంటే... ఆ గొంతుతో పెనవేసుకునివున్న శ్రోతల అనుభూతిని ధ్వంసం చేయటమే. శ్రోతల మనసుల్లోని సున్నితమైన బంధాన్ని తుంచివేయటమే!

ఈ చెడు సంప్రదాయం లతతోనే ఆగలేదు.

‘లివింగ్ లెజెండ్’ పేరుతోనో, మరో పేరుతోనో   లతకు ‘నివాళి’ పేరుతో లత పాటలను  అనూరాధ పాడ్వాల్ పాడి రికార్డులుగా విడుదల చేసింది.  రేపు అనూరాధ పాటలను కూడా మరెవరో ఇలాగే చేస్తారు!

ఒక పాటకు దాన్ని పాడిన  గాయకుల గొంతుతో ఉన్న అవినాభావ అనుబంధమే ... ఒక రచనకు దాన్ని రాసిన  రచయితల భాషతో,  శైలితో ఉంటుంది! 


( ఫొటోలు ... google  సౌజన్యంతో)
  

13 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

what u told is 100% right

naveenrjy చెప్పారు...

తిరగరాయడమంటే చెట్టు పేరుచెప్పుకుని కాయలు అమ్మకోవడంలాంటిదే నని నా అభిప్రాయం...

రామ్ చెప్పారు...

రాయరాదు .. అది కేవలం సినిమా దర్శకుల జన్మహక్కు !!

Sharma చెప్పారు...

మీతో ఏకీభవిస్తున్నాను .

mmkodihalli చెప్పారు...

మీరు చెప్పిన 'తిరగరాయడం' కోవలోకి ఈ క్రింది లింకులలో ఉన్న కథలు వస్తాయా? ఆక్షేపణీయమో కాదో తెలియజేయగలరు. నిజానికి ఈ కాన్సెప్ట్ ఒరిజినల్ రచయిత పి.వి.బి.శ్రీరామమూర్తిగారికి నచ్చలేదు.
http://turupumukka.blogspot.in/2011/02/blog-post_26.html
http://turupumukka.blogspot.in/2011/03/blog-post_13.html
http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/paridhi-datina-vela---pi-vi-bi-sriramamurti
http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/vardhanam-ma-mogudu---ravikumar
http://lkamakoti.blogspot.in/2011/03/blog-post_5564.html
http://srilalitaa.blogspot.in/2011/03/blog-post_16.html

వేణు చెప్పారు...

K.Murali Mohan గారూ, మీరిచ్చిన లింకులు చూశాను. మొదట మీరు ఒరిజినల్ కథను ఇచ్చారు. తర్వాత క్విజ్ పెట్టారు. ఇది రచయితల వర్క్ ఫాపులో ఎక్పర్ పైజ్ లాంటిది. నేను చెపుతున్న సందర్భంలాంటిది కాదిది!

Sharada చెప్పారు...

వేణు గారూ,
నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తాను.
ఈ సందర్భంగా ఇంకొక ఆసక్తికరమైన విషయం గమనిచాను.
ఒక కథకుడు- ఒక విషయాని గురించి తన perspective ఇస్తాడు. అదే విషయం మీద, అదే సందర్భానికి ఇంకొక వ్యక్తికి వేరే equally strong and valid perspective వుండోచ్చు. దాన్ని కథగా మార్చిన సందర్భాలు నేను రెండు మూడు చూసాను.(ఇప్పుడు ఉదహరించడానికి నాకు ఆ రచయితల పేర్లు గుర్తు రావటం లేదు.) అది ఉచితమైన ప్రక్రియే అని నా అభిప్రాయం.

రికార్డుల విషయంలో కూడా మీరన్నది నిజమే. ఎవరో ఊరు పేరూ లేని గాయకులు అలా సిడీలు రిలీజ్ చేస్తే ఏమో కానీ, సోనూ నిగం రఫీ పాటల సీడీ రిలీజ్ చెయటం నిజంగా చిరాకెత్తించే విషయం.
శారద

వేణు చెప్పారు...

Advaita TT , థాంక్యూ.

సుజాతా, ‘రచన ఎప్పుడూ ఒరిజినల్ గానే ఉండాలి. తిరగరాయడాలు, కొత్త సువాసనలు అద్దడాలు పనికి రావు. అది వికటించి దుర్గంధమవుతుంది ’- నిజమే. థాంక్యూ.

Naveen గారూ, మీ స్పందనకు థాంక్యూ.

వేణు చెప్పారు...

రామ్ గారూ, ‘దర్శకుల జన్మహక్కు’ను ఈ సందర్భంగా మీరు గుర్తు చేయటం బాగుంది. ధన్యవాద్.

Sharma గారూ, మీ స్పందనకు వందనాలు.

వేణు చెప్పారు...

sharada గారూ, ఒకే విషయం మీద ఇద్దరు కథకులు స్పందించి కథగా మార్చారా? Very interesting! మీరు చెపుతున్న రెండు మూడు సందర్భాల్లో ఒకటైనా గుర్తుచేసుకుని చెప్పండి.మీ అభిప్రాయం తెలిపినందుకు థాంక్యూ.

Sharada చెప్పారు...

కొన్నేళ్ళ క్రితం రచన పత్రికలో "పద్మ వ్యూహం" అనే కథ వచ్చింది. (రచయిత పేరు గుర్తు లేదు). నాస్తికుడైన భర్త (రాజ శేఖర్), ఆస్తికురాలైన భార్య (పద్మ) ఆ కథలోని పాత్రలు. "గత జన్మలో తానేమిటి" అన్న వూహాజనితమైన్ వాదనతో పద్మ శేఖర్ ని ఇరుకున పెట్టడమే కథలోని థీం.
అయితే ఆ మరు నెలలో దీనికి ఇంకో రచయిత "రాజ మార్గం" అనే కౌంటర్ పాయింట్ రాసారు, రచన పత్రికలోనే. నాకు ఇద్దరు రచయితల పేర్లూ కొంచెం కూడా గుర్తు లేదు!!

అలాగే ఆ మధ్య ఎవరో "సప్తపది" సినిమాకి పొడిగింపు రసారు. సప్తపదిలో హేమ, హీరో (పేరు....)పెళ్ళాడినతర్వాత వాళ్ళ భవిష్యత్తు ఎలా వుండొచ్చు అని.నాకీ కథ కూడా చాలా ఇంట్రస్టింగ్ గా అనిపించింది.
శారద

vijay చెప్పారు...

వేణు గారు

ఔను. పాఠకాదరణ పొందిన కధల్ని సొంతగా తిరిగి చెప్పడం బాగోదు. మీరన్నట్లు నేరం లాంటిది అని చెప్పలేను గానీ, పాఠకులు అలాంటివాటిని అదరించరు. అభిమానులైతే కోపం కూడా తెచ్చుకుంటారు.

ఈ గీతాదత్ - లతా మంగేష్కర్ విషయం గురించి గతంలో రంగనాయకమ్మ గారు కూడా రాసినట్లున్నారు కదా?

రీ మిక్సింగ్ అంటే కూడా నాకు పడదు. సరదాకి నాలు గైదు పాటల్లో మాటల్ని, స్వరాల్ని కూర్చి పేరడీలాగా చేస్తే అది సరదాకి అని సరిపెట్టుకోవచ్చు. కాని రీ మిక్సింగ్ ని వ్యాపారంగా మలచుకోవడం అభ్యంతరకరం అని నాకనిపిస్తుంది.

శారద గారు చెప్పిన సంగతి ఆసక్తికరంగా ఉంది. పాఠకుల్లో చురుకుదనం, ఆలోచనలు రేకెత్తించే ప్రక్రియ అది. సృజనాత్మకం కూడా. అలాంటి ప్రక్రియలను ఆహ్వానించవలసిందే.

వేణు చెప్పారు...

Sharada గారూ, మీరు ఉదాహరించిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

vijay గారూ, పాఠకాదరణ పొందినవాటినే కాదు, వేరే రచయిత రాసిన ఏ కథనూ మరో రచయిత ‘మెరుగుపరుస్తా’నంటూ బయల్దేరకూడదనేది నా స్థిరాభిప్రాయం.

ఔను, గీతాదత్- లతామంగేష్కర్ ల గురించి రంగనాయకమ్మగారు రాశారు, ‘మానవ సమాజం’ పుస్తకంలో. అది చదివాకే, ఈ విషయంలో నాలో ఉన్న ఆలోచనలకు ఒక స్పష్టత వచ్చింది.

మీ చివరి పేరా అర్థవంతం. ఏకీభవిస్తున్నాను.