సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

18, జూన్ 2013, మంగళవారం

పాము కాటేసింది... మనిషి మన్నించాడు!



ప్రతిరోజూ ఎన్నో వార్తలు చదువుతుంటాం.  అన్నీ గుర్తుండిపోవు; మనసును తాకలేవు.

కానీ  ఇవాళ  ఈనాడు  పత్రిక  హైదరాబాద్ సిటీ ఎడిషన్లో వచ్చిన ఓ వార్త... అసాధారణంగా అనిపించింది.  మరిచిపోతున్న మానవత్వపు పరిమళాన్ని గుర్తు చేసింది.
 
* * *

ఎవరికో  సాయం చేయడానికి వెళ్ళి పాముకాటుతో  చనిపోయాడు కొడుకు. ఆ కొడుకు ప్రాణం తీసిన పాము ఇంకా కళ్లముందే సజీవంగా ఉంది !

ఎవరైనా ఏం చేస్తారు?  కోపంతో చంపేస్తారు కదూ?!

కానీ అనంతరాములు అలా చేయలేదు.

చెట్టంత కొడుకు పోయిన గుండె కోత,  కొడుకు పోయిన దు:ఖంతో తన భార్య,  భర్తను కోల్పోయిన  కోడలి శోకం, మూడేళ్ళ మనవరాలు  తండ్రి గురించి అమాయకంగా తీస్తున్న ఆరా -  వీటిని దిగమింగేశారు.  

ఆ పాముకు ఎలాంటి అపకారమూ తలపెట్టలేదు. కొడుకు శవం ఇంకా ఇంటికి రానేలేదు.  పామును సంచిలో పెట్టుకుని  భద్రంగా అడవిలోకి తీసుకువెళ్ళారు. స్వేచ్ఛగా  వదిలేశారు! 

‘పాముల ద్వారా మనుషులకూ, మనుషుల ద్వారా  పాములకూ ఎలాంటి హానీ కలగకుండా చూస్తా’నని తన గురువుకు ఎప్పుడో ఇచ్చిన  వాగ్దానం ఇలా నెరవేర్చుకున్నారు !

ఆ పాము ఆత్మరక్షణకోసమే శ్రీనివాస్ ను  కాటేసివుంటుంది. నిజమే! అది తెలిసినప్పటికీ  పుత్రశోకం భరిస్తూనే -  చూస్తూ చూస్తూ ఆ పాముకు ప్రాణభిక్ష పెట్టటం మామూలు విషయమైతే కాదు. 

ఈనాడు హైదరాబాద్ సిటీ ఎడిషన్లో  వారం రోజుల క్రితం వచ్చిన వార్త,  దానికి ఫాలో అప్ గా ఇవాళ వచ్చిన వార్తా ఎవరి మనసులనైనా  ద్రవింపజేస్తాయి.  

* * *

మొదటి వార్తను  క్లుప్తం చేసి,  ఇక్కడ  రాస్తున్నాను. 

ఇవాళ  హైదరాబాద్ ఎడిషన్లో వచ్చిన రెండో వార్త ను  యథాతథంగా... ఇదే టపాలో పెట్టిన  scribd లో చూడండి. 

* * *

ది రోజుల క్రితం ...
ఆదివారం రాత్రి -

హైదరాబాద్  గండిమైసమ్మ చౌరస్తాలోని ప్లాస్టిక్ పరిశ్రమలోకి పాము వచ్చింది.  అక్కడివాళ్ళు వెంటనే దాన్ని  పట్టుకోవటం కోసం  మాదాసు అనంతరాములు అనే వ్యక్తికి కబురు పంపారు. జగద్గిరి గుట్ట దగ్గర్లోని దేవమ్మబస్తీ లో ఆయన నివసిస్తుంటారు.

ఇలా జనావాసాల్లోకి పాములు వస్తే వాటిని పట్టుకుని  ఊరికి దూరంగా వదిలివేసే పనిని ఆయన ఉచితంగా 20 సంవత్సరాలుగా చేస్తున్నారు. 

ఫోన్ వచ్చిన సమయంలో అనంతరాములు  వేరే చోటికి వెళ్ళారు ఆయన. దీంతో ఆయన పెద్దకొడుకు శ్రీనివాస్ (32) కు ఫోన్ వెళ్ళింది.  తండ్రి బదులు తనే బయల్దేరి వెళ్ళారు శ్రీనివాస్. పామును పట్టుకున్నారు.

కానీ సంచిలో వేయబోతుండగా శ్రీనివాస్ ను పాము కాటేసింది. చేతివేళ్ళు పాము నోట్లో కరుచుకుపోయాయి. ఎంత ప్రయత్నించినా విడిపించుకోవటం సాధ్యం కాలేదు.

చేతికి కరుచుకున్న పాముతోనే షాపూర్ నగర్లోని ప్రైవేటు ఆస్పత్రికి వరకూ  వచ్చారు. అక్కడికి వచ్చిన మిత్రులూ, బంధువులూ ఎలాగో పాము కోరల నుంచి శ్రీనివాస్ ను విడదీశారు.

అప్పటికే - పాము విషం ఎక్కి,  అపస్మారక స్థితికి చేరుకున్న శ్రీనివాస్ ప్రాణాలు విడిచారు!

* * *     



6 కామెంట్‌లు:

సుజాత వేల్పూరి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
naveenrjy చెప్పారు...

సృష్టి అంతటికీ బుద్ధి జీవి ఆటవిక న్యాయం దశనుంచి మనిషిగా రూపాంతరం చెందడానికి 40 వేల ఏళ్ళు పడితే అదే మనిషి రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించే మహోన్నతమైన రుషి దశకు 5 వేల ఏళ్ళక్రితమే ఎదిగినట్టు మన ఇతిహాసాలు చెబుతున్నాయి. మనం చూడని అంతటి రుషి ని మనముందించిన వేణు గారికి కృతజ్ఞతలు

pottapugudi చెప్పారు...

సర్ చాలా బాగుంది. వారి దయార్ద్ర్హ హృదయానికి జోహర్లు

రామ్ చెప్పారు...

వేణు గారు

మీ టపా ప్రచురించిన రోజునే చదివాను. .. చాలా ప్రశ్నలు .... మనసులో ---

పేపర్లో కుంభకోణాలు వాటి లంబకోణాలు చదవటానికే అలవాటు పడ్డామా ? Cynicism మన ఆణువణువూ నిండి పోయిందా ?మన చుట్టూతా జరిగే మంచి మనకి కనపడ్డం మానేసిందా ?

"వీడు చాలా violent గా ఉన్నాడు , కాస్త పువ్వుల్నీ అమ్మాయిల్నీ చూపించండ్రా .." అని జులాయి లో అన్న త్రివిక్రమ్ dialogue గుర్తొచ్చింది .

కొత్త తరానికి మంచి కూడా చూపించాల్సిన బాధ్యత మన మీద ఉంది .ఇలాంటి వాతావరణం లో .. మంచి బతికే ఉందన్న వార్తలు పేపర్లో ప్రచురించడం .. ఆ వార్త కి మీరు పటం, పట్టం కట్టడం చాలా బాగుంది .

వేణు చెప్పారు...

@ సుజాత:
@ Naveeen Peddada:

@ Behara:

@ రామ్ :
స్పందించిన మీకందరికీ కృతజ్ఞతలు.

ఈ టపా విషయంలో మిత్రుడు ప్రసాద్ భిన్నంగా స్పందించారు.
‘ఆ విష జంతువుని అలా అడవిలో వదిలేస్తే, అంతకు ముందు వున్న కారణాల లాంటి కారణాల వల్ల, అది మళ్ళీ ఊళ్ళోకి రాదా? మనుషులని కాటెయ్యదా? ఆత్మ రక్షణ కోసం పాము మనిషిని ఎలా కాటేస్తుందో, అలా మనిషి తన ఆత్మ రక్షణ కోసం పాముని చంపడా? అది ప్రకృతి విషయం కదా? పని గట్టుకుని, అడవికి వెళ్ళి పాముల్ని చంపడంలో అర్థం లేదు గానీ, మనుషుల మధ్యకి వచ్చిన పాముని చంపడం సరైన విషయం కాదా? పాము కాటు తిని మరణించిన ఆ అబ్బాయి రాక ముందరే, ఆ పాము కొంత మంది ఇతరులని కాటేసి వుంటే? తెలివి తక్కువ విష జంతువుల మీద ఈ దయ ఏమిటో నాకు అర్థం కాలేదు.’ అని.

ఊళ్ళోకి వచ్చిన విష సర్పాలను చంపాలా, అడవిలో వదిలెయ్యాలా అనేది చర్చనీయాంశమే.
నా అభిప్రాయం మాత్రం వాటిని చంపకుండా దూరంగా అడవిలో వదిలెయ్యటమే మంచిదని. పల్లెటూళ్ళలో కూడా పాములను కనపడితే అందరూ చంపరు. చాలామంది చేసేదేమిటంటే... పాములను పట్టేవాళ్ళను పిలిపించి, పట్టిస్తారు. అడవిలో విడిచిపెట్టే పాములు ఊళ్ళలోకి వస్తే అవకాశాలు చాలా తక్కువ. ఈ సంఘటనలో పాము భయంతో ఆత్మరక్షణతో మాత్రమే కాటేసిందని తెలుసు కాబట్టే తండ్రి గానీ, కొడుకు కానీ వాటిమీద కసి, ద్వేషం పెంచుకోలేదనుకుంటున్నాను. పాముల విషయంలో మామూలు మనుషులకూ, పాములను పట్టేవాళ్ళ దృష్ణి కోణానికీ ఎంత తేడా ఉంటుందో ఈ ఉదంతం చెప్తోంది.

Praveen Mandangi చెప్పారు...

ఇలాంటివి స్కూల్ పుస్తకాలలోని పాఠాలుగా వ్రాయడానికి పనికొస్తాయి కానీ నిజ జీవితంలో పనికి రావు. అపకారికి కూడా ఉపకారం చెయ్యాలని బోధిస్తే అది జీవితపు విలువని ఎగతాళి చెయ్యడమే అవుతుంది. తండ్రి చనిపోయి, బంధువుల ఇంటిలో వారాలు తీసుకుని చదివినవాడే ఏ డాక్టరో అయిన తరువాత తన బంధువులకి డబ్బులు తిరిగి ఇవ్వడు. మనుషుల మధ్యే ఆరోగ్యకరమైన సంబంధాలు లేవని బాధగా ఉంటే, మనిషి జీవితానికి ఏమాత్రం ఉపయోగపడని జంతువులపై ప్రేమ గురించి బోధించడం విచిత్రంగా ఉంది.