సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

26, సెప్టెంబర్ 2013, గురువారం

చిత్రం ఒకటే ... చిత్రణ తీరు వేర్వేరు!

పురాణేతిహాసాల ఘట్టాలను చిత్రలేఖనంలో కళ్ళకు కట్టేలా  చూపించాలంటే  కళానైపుణ్యంతో పాటు ఎంతో ఊహాశక్తి కూడా  కావాల్సిందే. 

ఈ విషయంలో రవివర్మ పేరు ముందు చెప్పుకోవాలి. సరస్వతి, లక్ష్మి,  గంగావతరణం, శకుంతల, భీష్మ ప్రతిజ్ఞ,  హంస- దమయంతి,  జటాయువు వధ లాంటి బొమ్మలు ఆయన వేసినవే తర్వాతి చిత్రకారులకు ప్రామాణికంగా మారాయి.

మన తెలుగులో చందమామ మాసపత్రిక దశాబ్దాల క్రితం  మహాభారతాన్ని ధారావాహికగా ప్రచురించినపుడు వివిధ సన్నివేశాలను ఎంటీవీ ఆచార్య  ముఖచిత్రాలుగా వేశారు. అవి  పాఠకులను బాగా ఆకట్టుకున్నాయి.  తెలుగు పౌరాణిక సినిమాల్లో  వివిధ పాత్రలకు ఆయన బొమ్మలే ఒరవడి పెట్టాయంటారు. 

భీష్ముడి పాత్రకు గడ్డం ఉందో లేదో గానీ ఆయన గడ్డంతో వేశాక అది ప్రామాణికమైపోయింది. ఇక అప్పటినుంచీ సినిమాల్లో గానీ, చిత్రాల్లో గానీ గడ్డం లేని భీష్ముడిని గుర్తు పట్టలేని పరిస్థితి ఏర్పడింది.

ఆచార్య తర్వాత చందమామలోనే  శంకర్, వడ్డాది పాపయ్య (వ.పా.) లు ఈ బొమ్మల్లో ప్రతిభను చూపించారు.

ఒకే ఘట్టాన్ని వేర్వేరు చిత్రకారులు  బొమ్మగా వేస్తే ?

అలా వేసిన చిత్రాలను గమనిస్తూ  సారూప్యాలూ, తేడాలను  పరిశీలించటం నాకు ఆసక్తికరంగా ఉంటుంది,  రూపు రేఖలెలా ఉన్నాయి,  ఎవరు దేన్ని హైలైట్ చేశారు,  నేపథ్యం ఎలా ఉందీ ఇవన్నీ.  ఆ బొమ్మల  బాగోగులకు చిత్రకారుల కళా సామర్థ్యం మాత్రమే కాకుండా వారి అప్పటి మూడ్,  పెట్టిన శ్రద్ధ,  ఆ సన్నివేశంపై వారికి అప్పటికి ఉన్న పరిజ్ఞానం... ఇవన్నీ కారణమవుతాయి.   

కంసుడు... యోగ మాయ

తనను  చంపబోతుండగా పసిబిడ్డ యోగ మాయగా మారి ఆకాశంలోకి ఎగిరి కంసుణ్ణి హెచ్చరించే ఘట్టం.  దేవకి  దు:ఖం, వసుదేవుడి అనునయం, ఆశ్చర్యానందాలు, కంసుడి విభ్రాంతి, భంగపాటు చక్కగా చిత్రించారు ఎంటీవీ ఆచార్య.   కంసుడి అనుచరుడి భంగిమను ప్రత్యేకంగా గమనించాలి. ఇది చందమామలో  1949 మార్చి ముఖచిత్రంగా వచ్చిన  బొమ్మ.

 
ఇది వ.పా. బొమ్మ. నిజానికి  ఆచార్య బొమ్మకు  కొనసాగింపు వేయటం వల్ల  మాయ క్రోధాన్నీ, కంసుడి భంగపాటునూ వ.పా.  స్ఫుటంగా చిత్రించగలిగారు. మాయగా మారకముందటి పసిపాపను కూడా చూపటం ఓ విశేషం. కుడిపక్కన  ఆకాశంకేసి తలెత్తి నమస్కరిస్తున్న దేవకీ వసుదేవులను గమనించండి. 1987 అక్టోబరు ముఖచిత్రం ఇది.      

వ.పా. వేయటానికి దాదాపు వందేళ్ళ ముందు రవివర్మ ఇదే ఘట్టాన్ని 1890లో  ఇలా చిత్రించారు. ఆకాశంలోని యోగ మాయను అస్పష్టంగా చిత్రించటం ఇందులో విశేషం.

మూడు బొమ్మల్లోనూ వసుదేవుడికి గడ్డం కామన్ గా ఉంది.   

కాళియ మర్దనం

చిన్నికృష్ణుడు కాళింది మడుగులో కాళియుని పడగలపై నాట్యం చేస్తున్న సన్నివేశం.  ఎంటీవీ ఆచార్య చిత్రంలో  కాళియుని భార్యల వేడికోలు, ఒడ్డున గోపబాలురు ఆతృతతగా  చూడటం గమనించండి.

 
 
వ. పా. బొమ్మను  క్లోజప్ లో వే్యటం వల్ల నేపథ్యానికి అవకాశం లేకుండా పోయింది.  అయతే  ఈ  కృష్ణుడు.. .బాల కృష్ణుడిలాగా కాకుండా  యువక కృష్ణుడిలా ఉన్నాడు.

నరకాసుర వధ




కృష్ణుడు రథంపై  మూర్ఛపోగా సత్యభామ  బాణం ఎక్కుపెట్టటం.  నరకాసురుడు ఏనుగు అంబారీ మీద వచ్చినట్టు ఆచార్య వేశారు.

 


గరుడ వాహనం మీద యుద్ధం చేస్తున్నట్టు  వ.పా. చిత్రణ. సత్యభామ కిరీటానికి కూడా నెమలిపింఛం చూడొచ్చు.

ఏకలవ్యుడి గురుదక్షిణ



ఏకలవ్యుడు బొటనవేలు సమర్పించుకున్న దృశ్యంలో  ద్రోణాచార్యుడి వెనక లేతవయసులో ఉన్న అర్జునుడిని చూశారా?  ఆశ్రమ పరిసరాలు అందంగా వేశారు ఆచార్య.  జింకచర్మం ధరించి  నలుపురంగుతో  ఉన్న ఏకలవ్యుడి బొమ్మ సహజంగా ఉంది.


ద్రోణుడి  ప్రతిమను తల వరకే కాకుండా సంపూర్ణంగా  వేశారు వ.పా.  ఏకలవ్యుడి త్యాగాన్ని కళ్ళు విప్పార్చి ఆశ్చర్యంగా  చూస్తున్నాడు కదూ అర్జునుడు!  రెండు బొమ్మల్లోనూ ద్రోణుడికి గడ్డం మీసాలు లేవు.

భీష్ముడిపై చక్రాయుధం 



కురుక్షేత్ర యుద్ధరంగంలో ఆవేశపడిపోయి,  తన ప్రతిజ్ఞ మరచి భీష్మునిపై చక్రాయుధం ప్రయోగించబోతున్న శ్రీకృష్ణుడు.  నేపథ్యంలో యుద్ధ బీభత్సాన్ని కూడా  చిత్రించారు ఆచార్య.




వ.పా. బొమ్మలో భీష్ముడూ,  ఆచార్య బొమ్మలో అర్జునుడూ  మోకరిల్లినట్టు చిత్రితమైంది.

లంకిణి- హనుమ



లంకలో ప్రవేశించిన హనుమంతుడికి లంకిణి  ఎదురవటం.   లంకిణి భీకరాకారాన్ని ఆచార్య  చక్కగా  చిత్రించారు. జూన్ 1948 చందమామ ముఖచిత్రం ఇది. 
 


వ.పా. తన బొమ్మలో హనుమంతుణ్ణీ,  భవనాలనూ  అందంగా చిత్రించారు. డిసెంబరు 1963 చందమామ ముఖచిత్రం ఇది.

జటాయువు  వధ



 



రవి వర్మ గీసిన ఈ రెండు  చిత్రాలూ  ఎంత గొప్పగా ఉన్నాయో కదా?  రావణుడి క్రూరమైన నవ్వూ,  భయపడిన  సీత  చేతులతో  మొహం కప్పుకోవటం చూశారా?

ఇదే ఘట్టాన్ని ఎంటీవీ ఆచార్య ఇలా చిత్రించారు.


ఇక చందమామ చిత్రకారుడే  శంకర్ (రెండు బొమ్మలు) ఎలా చిత్రించారో  కూడా చూడండి.
 

  



(వీటిలో ఎక్కువ బొమ్మలు చందమామ నుంచీ, వారు ప్రచురించిన  ఆర్ట్ బుక్ నుంచీ తీసుకున్నవి.  ప్రచురణకర్తలకు  కృతజ్ఞతలు)

8 కామెంట్‌లు:

sreelu చెప్పారు...

చాలా బాగున్నయి అంది....మళ్ళీ ఆ చందమామ రోజులు గుర్తుకొచ్చాయి.....

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

భలేమంచి బొమ్మలను మళ్ళీచూపించినందుకూ( కొన్ని)
చూడనివి చూపినందుకూ సంతోషమండి. ధన్యవాదాలు. ఇంతగమనించే మీరు బొమ్మలు గీస్తారాండి? చూడవచ్చునా?

voleti చెప్పారు...

good collection and thanks for sharing..

Dantuluri Kishore Varma చెప్పారు...

చాలా బాగుంది మీ పరిశీలన. బొమ్మలు అద్భుతం!

వేణు చెప్పారు...

@ sreelu :
@ voleti :
@ Dantuluri Kishore Varma : చిత్రకళపై మీకున్న అభిమానానికీ, మీ స్పందనకు థాంక్యూ.

వేణు చెప్పారు...

@ లక్ష్మీదేవి: థాంక్యూ అండీ. బొమ్మలు గీసే కళ నా విషయంలో ప్రాథమిక దశలోనే ఉండిపోయిందండీ.

@ సుజాత: ఔను. జటాయువు వధ వర్ణచిత్రం విషయంలో నా ఓటు కూడా రవివర్మకే! థాంక్యూ.

GKK చెప్పారు...

వేణు గారు: బొమ్మలు అత్యుత్తమంగా ఉన్నాయి. ఆచార్య గారి బొమ్మలు చూడటం ఇదే తొలిసారి. ఆయన చిత్రాలకు వేసిన నేపథ్యాలు సజీవంగా ఉన్నాయి.attention to detail బాగా తెలుస్తుంది. కాళీయుడి పడగలపైన నాట్యం చేస్తున్న కృష్ణుడి బొమ్మలో కొంచెం అజంతా చిత్రాలలోని పద్మపాణి పోలికలు కనిపించాయి.

ఈ చిత్రాలు వాటికి మీ వివరణ చూస్తే time machine ఎక్కి ఏవో లోకాలకు వెళ్ళినట్టు అనిపిస్తుంది.

వేణు చెప్పారు...

తెలుగు అభిమాని గారూ! ఎంటీవీ ఆచార్య గారి పేరు వినటం, ఆయన వేసిన బొమ్మలను చూడటం నాలుగైదేళ్ళ క్రితమే జరిగింది. పాత చందమామల ముఖచిత్రాల్లో ఆయన చిత్రకళా కౌశలం వీక్షించవచ్చు.

కృష్ణుడి భంగిమలో పద్మపాణి పోలికలు నిజమే..

థాంక్ యూ!