చూసీ చూడగానే ఆకట్టుకుంది. మనసులో ముద్రించుకుపోయింది.
కాలం గడుస్తున్నా వెంటాడింది!
అదో వర్ణ చిత్రం..
‘బ్రహ్మనాయుడి’ రూపం!
మా. గోఖలే గీసిన ఆ పెయింటింగ్... ఒరిజినల్ ని ఇంకా చూడలేదు. ఫొటో మాత్రమే చూశాను.
ఆ చిత్రం గురించి ఇంకా తెలుసుకోవాలన్న ఆసక్తి మాత్రం పెరుగుతూవచ్చింది.
 |
మాధవపెద్ది గోఖలే |
1999లో ‘ఆంధ్రప్రభ’ వాళ్ళు తెలుగు సినిమా విశేషాలతో ‘మోహిని’ పేరుతో రెండు పుస్తకాలు వేశారు. రెండో పుస్తకంలో మా. గోఖలే గురించి చిత్రకారుడు ఎస్.వి. రామారావు రాసిన వ్యాసం యథాలాపంగా చదివాను; మర్చిపోయాను.
ఆ వ్యాసం టైటిల్ కింద బ్రహ్మనాయుడు పెయింటింగ్ ని ఇచ్చారు... బహుశా మొదటిసారి ఈ బొమ్మను అక్కడే చూశాను.
తర్వాతి కాలంలో ముఖ్యంగా చిత్రకారుడిగా మా. గోఖలే వివరాల కోసం అన్వేషిస్తుంటే ఒక్కోటీ తెలుస్తూవచ్చాయి.
‘మాయాబజార్’ సినిమా కళాదర్శకుడిగా ఘటోత్కచ, శ్రీకృష్ణ పాత్రలకు ఆకట్టుకునేలా రూపురేఖలను సమకూర్చటం, ముఖ్యంగా ‘మహాప్రస్థానం’ పుస్తకానికి ఉత్తేజకరమైన ముఖచిత్రం గీయటం, చందమామలో ‘బాలనాగమ్మ’ సీరియల్ కి బొమ్మలు వేయటం.... ఇవన్నీ.
ఈ విశేషాలను అందరితో పంచుకోవటం కోసం ఈ బ్లాగులో రెండేళ్ళ క్రితం వరసగా
రెండు పోస్టులు కూడా రాశాను.
వాటిలో ఒకదానిలో ‘బ్రహ్మనాయుడు’బ్లాక్ అండ్ వైట్ బొమ్మను కూడా ఇచ్చాను.
ఆ పోస్టుకు ‘కమనీయం’ ఓ వ్యాఖ్య రాస్తూ
‘మా. గోఖలే చిత్రించిన బ్రహ్మనాయుడి వర్ణ చిత్రం ఆంధ్రపత్రిక ప్రత్యేక సంచికలో ప్రచురితమైనది’ అంటూ సమాచారం తెలిపారు.
అక్కడితో ఆ బొమ్మ గురించిన ఆలోచనలు ఆగిపోలేదు!
మళ్ళీ ఈ మధ్య ‘మోహిని’ దొరికింది.
ఎస్.వి. రామారావు వ్యాసం మళ్ళీ చదివాను. ఈసారి నాకు పరిచితుడైన ‘గోఖలే’గురించి మరిన్ని విశేషాలు తెలిశాయి. బ్రహ్మనాయుడి చిత్రం గురించి విశిష్ట చిత్రకారుడైన ఎస్. వి. రామారావు అభిప్రాయం కూడా దీనిలో ఉంది.
కానీ...
ఓ కొత్త సందేహం పుట్టుకొచ్చింది!
ఆ వ్యాసంలో ఇలా ఉంది-
‘(గోఖలే) ఇంట్లో ఆయన వేసిన ‘బ్రహ్మన్న’ పెయింటింగ్ ఉండేది. అది ఎందరో చిత్రకారులకు స్ఫూర్తిదాయకంగా ఉండేది. ‘జీవం’ ఉట్టిపడేట్టు ఉండేది. రాయలసీమ ప్రాంతానికి చెందిన భూమిపుత్రుడు బ్రహ్మన్న బాసంపట్టు వేసుకుని గడ్డం కింద చేయి పెట్టుకుని దీర్ఘాలోచనలో మునిగిన ఆ భంగిమను చూస్తే ఎన్నెన్నో విషయాలు మనసులో మెదిలేవి’
ఇప్పటిదాకా ఈ బొమ్మ పల్నాటి బ్రహ్మనాయుడిది అనుకుంటున్నాను కదా?
కాదా?
ఈ బ్రహ్మన్న ఎవరో తెలుసుకోవటానికి ప్రయత్నించాను. రాయలసీమ చరిత్ర, సాంస్కృతిక వివరాలూ స్థూలంగా పరిశీలించాను. ఎక్కడా బ్రహ్మన్న పేరే కనపడలేదు.
అయినప్పటికీ ... స్వయంగా చిత్రకారుడైన ఎస్.వి. రామారావు తను ఇంతగా వర్ణించిన గోఖలే చిత్రం విషయంలో పొరబడివుంటారని అనుకోలేకపోయాను.
పల్నాటి బ్రహ్మనాయుడి ప్రధాన ఆయుధం పేరు
‘కుంతం’ అని చదివాను.
శిల్పులు దీన్ని రెండు రకాలుగా చెక్కుతున్నారు...
ఒకటి- చివర్లో U ఆకారం ఉన్న ఈటె. ఆ రెండు చివరలూ చెరోవేపూ మొనదేలివుండటం.
హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద పెట్టిన బ్రహ్మనాయుడు విగ్రహంలో అలాగే ఉంది.
ఎన్టీఆర్ నటించిన పల్నాటి యుద్ధం సినిమాలో దాదాపు ఇలాంటి ఆయుధాన్నే చూపించారు.
పల్నాటి యుద్ధం జరిగిన ప్రదేశం ... కారంపూడి ఊరి మధ్యలో బ్రహ్మనాయుడి విగ్రహం ప్రతిష్ఠించారు. ఆ విగ్రహం చేతిలోని ఆయుధం మాత్రం మరో రకంగా ఉంది.
చూడండి... ఆ విగ్రహం !
కానీ.. గోఖలే వేసిన బొమ్మలో పొడవాటి ఖడ్గం కదా ఉన్నదీ?
అందుకే ఆ బొమ్మ- పల్నాటి బ్రహ్మన్నది కాకపోవచ్చనే అనుకున్నా.
ఈ లోపు- కిందటి సంవత్సరం జనవరిలో కార్టూనిస్టు సురేఖ (మట్టెగుంట వెంకట అప్పారావు) తన
బ్లాగులో బహ్మనాయుడి బొమ్మను ప్రచురించారు... ‘భారతి’ పత్రిక నుంచి సేకరించానంటూ!
ఇప్పటివరకూ నేను చూసిన బొమ్మల్లో క్వాలిటీ పరంగా ఇదే అత్యుత్తమం! (దీన్ని చివర్లో చూద్దాం
) .
అయితే ఇది ఆంధ్రపత్రికలోది కాదా? భారతి పత్రికలోదా? భారతిలో ప్రచురించివుంటే ఏ నెల? ఏ సంవత్సరం? అనే వివరాలు అప్పారావు గారి దగ్గర కూడా దొరకలేదు.
ఇలా కొత్త సందేహాలు...
మిసిమి పత్రిక 1992 అక్టోబరు సంచికలో ఇదే బొమ్మను ముఖచిత్రంగా వేసింది.
ఆ సంచికలో ఈ బొమ్మ వివరాలుంటాయని ఆశపడ్డాను. ఏమీ లేవు. పైగా ‘ముఖచిత్రం మాదవపెద్ది ఘోఖలే’ అంటూ ఆయన పేరు రెండు తప్పులతో అక్కడ కనపడింది!
హతవిధీ... అనుకోవాల్సివచ్చింది!
ఈ లోపు ఈ సబ్జెక్టు గురించి బ్లాగు పోస్టు రాయాలనిపించింది.
ఆ ఆలోచన రాగానే నా సందేహాలు తీర్చుకోవటానికి ప్రయత్నించాను.
ఈ క్రమంలో... తెలుగు విశ్వవిద్యాలయం 1995లో ప్రచురించిన పుస్తకం చూశాను. మొదలి నాగభూషణశర్మ, ముదిగొండ వీరభద్రశాస్త్రి సంపాదకులుగా తెచ్చిన ఈ పుస్తకం పేరు
History and culture of the Andhras.
183 వ పేజీ మొత్తం గోఖలే బ్రహ్మనాయుడు బొమ్మను (బ్లాక్ అండ్ వైట్ ) ప్రచురించారు.
ఆ ముందుపేజీలో పల్నాటి బ్రహ్మనాయుడి వివరాలు ఉన్నాయి.
అంటే ఆ బొమ్మ పల్నాటి బ్రహ్మనాయుడిదేనని ఆ ప్రచురణకర్తలు కూడా భావించారన్నమాటే కదా?
ఆ పుస్తక ప్రచురణ నాటికి గోఖలే చనిపోయారు (1981).
రాయలసీమ బ్రహ్మన్నా? పల్నాటి బ్రహ్మన్నా?
ఏమీ నిర్థారణ కాలేదు.
కొ.కు. నా సాయానికొచ్చారు!
ఇంతలో... విరసం ప్రచురించిన కొడవటిగంటి రచనా ప్రపంచంలోని ‘సాహిత్య వ్యాసాలు’ రెండు పుస్తకాలుగా కొరియర్ లో వచ్చాయి. ఉన్నవ లక్ష్మీనారాయణ రచించిన ‘నాయకురాలు’నాటకంపై ఆంధ్రప్రభలో కొ.కు. చేసిన సమీక్ష ఓ పుస్తకంలో ఉంది. నాయకురాలు నాగమ్మ ఉంటే బ్రహ్మనాయుడు కూడా ఉండాల్సిందే కదా?
నాక్కావలసిన సమాచారం సమీక్ష చివర్లో కనపడి చాలా సంతోషం వేసింది.
‘.. అట్ట మీద గోఖలే బ్రహ్మనాయుడి చిత్రానికి అనుకరణ ఉన్నది’(ఆంధ్రప్రభ వారపత్రిక 25.4.1970).
అనుకరణ బొమ్మ సంగతి అటుంచి... గోఖలే వేసింది పల్నాటి బ్రహ్మనాయుడనటంలో సందేహం లేదన్నమాట...
ఈ విషయం సాక్షాత్తూ కొడవటిగంటి కుటుంబరావు సర్టిఫై చేసినట్టయింది. (గోఖలేతో ఆయనకు చాలా సాన్నిహిత్యం ఉంది మరి) .
చిక్కుముడి వీడింది...!
ఈ బొమ్మ గురించి చిత్రకారుడు ఎస్.వి.రామారావు గారు ఇంకా ఏమని వర్ణించారో చూడండి-
‘... మట్టి రంగులతో చిత్రించిన ఆ పెయింటింగ్ లో వీరుని పౌరుషం స్పష్టంగా కనిపించేది. అతని ముందు డాలు, ఒరలో కత్తి, తలకు పాగా, పంచె తెలుగుదనం ఆ ఆకారంలో కొట్టొచ్చినట్టు కనిపించేది. ఆ బొమ్మకు చారిత్రక న్యాయం చేకూర్చాలన్న తపనతో గీసినట్టు ప్రస్ఫుటంగా కనిపించేది. ’
‘అలా ఆయన ఎన్నో ఎన్నెన్నో మరపురాని, మరువలేని చిత్రాలను గీశారు. స్కెచ్ లు వేశారు. అవి చాలావరకు తెలుగువారికి తెలియకపోవడం దురదృస్టకరం. వాటర్ కలర్స్ లో, ఆయిల్ కలర్స్ లో ఆయన అపురూప చిత్రాలను గీశారు. వాటి ఎవాల్యుయేషన్ జరగనేలేదు.’
ఈ పెయింటింగ్ ను అమ్మటానికి గోఖలే ఇష్టపడలేదట.
‘నాన్న పెయింటింగ్స్ ‘బ్రహ్మనాయుడు’, ‘బొబ్బిలి మల్లన్న’, ‘పావురాలు’ ఆనాటి ప్రఖ్యాత నటులు కొందరు చాలా నచ్చి కొందామని ప్రయత్నించారు. వారు ఎంత మొత్తం చెప్పినా నాన్న అంగీకరించలేదు’ అని గోఖలే రెండో కుమార్తె ఉపాధ్యాయుల జ్యోతి 2009 లో ‘మా నాన్నగారు’సంకలనంలోని వ్యాసంలో గుర్తు చేసుకున్నారు.
సరే.. ఇంతకీ కొడవటిగంటి చెప్పిన అనుకరణ ముఖచిత్రం ఎలా ఉంటుందో చూడాలని ఉబలాటపడ్డాను. నెట్ లో... కొద్దిసేపట్లోనే దొరికింది!
అదే ఇది...
ఈ నాయకురాలు నాటకం 1969 ప్రచురణ.
తొలిసారి 1926లో ప్రచురితమైనపుడు ఏ బొమ్మ ఉండేదో మరి!
రెండు తెలుగు సినిమాల్లో...
పల్నాటియుద్ధం సినిమాను తెలుగులో రెండు సార్లు తీశారు.
1947లో తీసిన సినిమాలో బ్రహ్మనాయుడుగా
గోవిందరాజు సుబ్బారావు నటించారు. (బాలచంద్రుడు అక్కినేని) .
1966లో తీసిన సినిమాలో బ్రహ్మనాయుడు
ఎన్టీ రామారావు. (బాలచంద్రుడు హరనాథ్) .
వీరిద్దరి ఆహార్యం స్థూలంగా చూస్తే దాదాపు ఒకే విధంగా అనిపిస్తుంది. తలపాగా, పెద్ద మీసాలు, పూసల దండలు మొదలైనవి.
ఇద్దరిలో ఎన్టీఆర్ వేషం మాత్రం కొంత మెరుగుపరిచినట్టు ఉంటుంది.
గోఖలే వర్ణచిత్ర ప్రభావం పల్నాటియుద్ధం (1966) సినిమాలోని బ్రహ్మనాయుడి ‘రూప’కల్పనలో ఏమైనా ఉందా అనే ఆలోచన వచ్చింది.
ఎవరు ఈ సినిమాకు కళాదర్శకుడు?
టైటిల్స్ చూస్తే... కనపడింది...
ఆ కళాదర్శకుడు సాక్షాత్తూ... మా.గోఖలే!
గోఖలే కళాదర్శకత్వం గురించి నెట్ లో అందుబాటులో ఉన్న వివరాల్లో ఈ సినిమా పేరు ఎక్కడా కనపడదు. అదో విచిత్రం!
భారతి/ ఆంధ్రపత్రిక లో ప్రచురితమై నన్ను ఆకట్టుకున్న బ్రహ్మనాయుడి బొమ్మ ఇదిగో.. (కార్టూనిస్టు సురేఖ గారి సౌజన్యంతో...)
బ్రహ్మన్న ఘనత ఏమిటి?
అమానుషమైన కుల వ్యవస్థ మీద 12వ శతాబ్దంలోనే యుద్ధం ప్రకటించినవాడు పల్నాటి బ్రహ్మన్న! ‘చాప కూడు’ పేరుతో అన్ని కులాలవారికీ సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసిన సంస్కర్త.
కుల వ్యవస్థ ఇప్పటికంటే ఘోరంగా ఘనీభవించివున్న అన్ని వందల సంవత్సరాల క్రితం నిమ్నకులాల వారిని ఆదరించటం, ఇలాంటి ఒక ప్రయత్నం చేయటం సామాన్యమైన సంగతి కాదు. మానవత, సమతా భావాలతో పాటు ఎంతో సాహసం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు!
తెలుగు విశ్వవిద్యాలయం
‘తెలుగు వైతాళికులు’ సిరీస్ లో 1988లో బ్రహ్మనాయుడు పుస్తకం ప్రచురించింది.
దాన్ని ఇక్కడ చదవొచ్చు...