సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

28, ఏప్రిల్ 2014, సోమవారం

‘విష వలయం’లో ‘మాయావి’ మళ్ళీ కనపడ్డాడు!


మధ్య హైదరాబాద్ కి వచ్చిన శివరామప్రసాద్ గారిని (సాహిత్య అభిమాని బ్లాగర్)  అమీర్ పేటలో ఉన్న శ్యామ్ నారాయణ గారి ఆఫీసులో కలిశాను.

ఆయన తనతో పాటు తెచ్చిన ‘ఉక్కుపిడి మాయావి’, ‘సర్పదీవి’,  ‘ఫ్లైట్ 731’ డిటెక్టివ్ కామిక్ పుస్తకాలను చూపించారు. 

నేనెంతో ఇష్టపడ్డ ఆ బ్లాక్ అండ్ వైట్  బొమ్మల అద్భుత పుస్తకాలను చాలా ఏళ్ల తర్వాత ప్రత్యక్షంగా చూస్తుంటే... భలే సంతోషం వేసింది!

 ఈ సిరీస్ లో మిగిలిన ‘విష వలయం’ నాకెంతో నచ్చిన పుస్తకం!  కానీ నా దగ్గర లేదు; ఎప్పుడో పోయిందది. ఆ పుస్తకం తన సేకరణలో నుంచి మిస్ ఐపోయిందని శివరామప్రసాద్ గారు కూడా చెప్పారు. 

అది దొరక్కపోవటం మాత్రం లోటుగానే ఉండిపోయింది!

ఈలోగా ఓ రోజు (ఏప్రిల్ 14న) ఆయనే మెయిల్లో ఆ పుస్తకం స్కాన్డ్ కాపీ పంపుతూ మరోసారి సంతోషపెట్టారు!  ‘At last I got it atleast in soft copy thanks to Patha Bangaram web site’ అని రాశారు.  ఆ సైట్లో నాలుగైదు భాగాలుగా ఉన్న ఈ పుస్తకం జిప్ ఫైల్స్ ను అన్ జిప్ చేసి, ఒక ఫైలుగా కూర్చి నాకూ, మరికొందరు మిత్రులకూ పంపారన్నమాట!

మొత్తానికి ఆ రకంగా సుదీర్ఘకాలం తర్వాత ‘విషవలయం’ కథను మళ్ళీ చదవగలిగాను.

పాత బంగారం సైట్లో ఆ పుస్తకం ఎలా పెట్టారో చూద్దామనే ఆసక్తితో  చాలా ప్రయత్నించాను. కానీ నా వల్ల కాలేదు. ముఖద్వారం  (లాగిన్ ) దగ్గరే ఆగిపోవాల్సివచ్చింది.  ఆ సైట్లో ప్రవేశం లభించిన అదృష్టవంతులు ఆ పుస్తకాన్ని చదువుకోవచ్చు.

ఏదేమైనప్పటికీ ఒక అరుదైన పుస్తకాన్ని సైటులో స్కాన్ చేసి ఉంచినందుకు పాత బంగారం సైట్ కు కృతజ్ఞతలు. ‘ఉక్కుపిడి మాయావి’ పుస్తకం కూడా ఆ సైట్లో ఉందట!

మూడేళ్ళక్రితం పోస్టు రాశాను...


ఇంతకీ ఈ ఉక్కుపిడి మాయావి గురించి 2011 ఫిబ్రవరిలో ఓ పోస్టు రాశాను.

దానిలో ఈ ‘విష వలయం’ గురించి ప్రస్తావించాను కూడా! 

సరే... ఇప్పుడు పుస్తకం దొరికిన సంగతి ని మళ్ళీ ఈ బ్లాగులో చెప్దామనిపించింది. దీని ఇంగ్లిష్ మాతృక నుంచి కొన్ని పేజీలైనా ఇంటర్నెట్ లో దొరికితే వాటిని కూడా ఇవ్వొచ్చు కదా అనిపించింది.  వెతికాను...  ఇంగ్లిష్ లో ఈ నవల పేరు తెలియకుండానే!

ఏమీ దొరకలేదు... 

scribd లో వెతికితేనో?
ఈ ఆలోచన వెంటనే ఫలితాన్నిచ్చింది... The waves of peril  కామిక్ పుస్తకం మొత్తం కంటబడింది!   ఔను... ‘విష వలయం’ ఒరిజినల్-  మాతృక-  ఇదే!

చారెడు పంచదార మాత్రమే కావాలనుకుంటే ఏకంగా తేనెపట్టు దొరికినట్టయింది! 

ఈ ఇంగ్లిష్ బుక్ లో బొమ్మలూ, కథన- సంభాషణల ముద్రణ  చాలా నాణ్యంగా, స్పష్టంగా  ఉంది.     




స్పష్టంగా లేని బొమ్మలూ, అక్షరాలతో ఉన్న తెలుగు వెర్షన్ ప్రచురణ పరిమితి ఇప్పుడింకా బోధపడింది. అయితే... అనువదించిందెవరో కానీ చక్కని తెలుగు నుడికారంతో, సందర్భోచిత సంభాషణలతో ఆహ్లాదకరంగా... మూలంలో మాదిరే కథనం సాగింది. ఈ కథనాన్నీ,  కొన్ని డైలాగుల్నీ నేను సంవత్సరాలు గడిచినా మర్చిపోలేదు.

ఆకట్టుకునే  బొమ్మలు
ఈ పుస్తక రచయిత టామ్ టులీ.  బొమ్మలు వేసిన చిత్రకారుడు జీసస్ బ్లాస్కో. 


విభిన్న కోణాల్లో,  సహజంగా, అందంగా, ఆకర్షణీయంగా రూపొందించిన బొమ్మలు ఈ పుస్తకానికి పెద్ద ఎసెట్.

నలుపు తెలుపుల్లో చిత్రకారుడు ఇంద్రజాలమే చేశాడు!

మచ్చుకు - 
కొన్ని బొమ్మలు 
చూడండి....






 ఆకాశంలో ఎగిరే విమానాన్ని బయట నుంచి లాంగ్ షాట్లో చూడటం అందరికీ అనుభవమే.  కానీ... లోపలి భాగం ఎలా ఉంటుందో తొలిసారి ఈ బొమ్మ ద్వారానే నాకు పరిచయం! హీరో ‘ఉక్కుపిడి మాయావి’ లూయిస్ క్రాన్డెల్ కూర్చున్నభంగిమ నాకు ఇష్టం. ఈ కథతో సంబంధం లేని సహ ప్రయాణికురాలి రూపంతో పాటు ఈ బొమ్మ బాగా గుర్తుండిపోయింది.

 


అయితే - ఈ కామిక్ బుక్ లో  హీరో, విలన్ లు అన్ని బొమ్మల్లోనూ ఒకే పోలికలతో కనపడకపోవటం నాకు మొదటినుంచీ ఉన్న అసంతృప్తి. బహుశా బ్లాస్కో తో పాటు అతడి అసిస్టెంట్లు కొన్ని బొమ్మలు వేశారేమో..

వత్తులు ప్రింటవకుండానే పుస్తకం తయారైంది. ముఖ్యంగా అక్షరాల కింద ‘ర’వత్తులు (క్రావడులు)  ఉండవు. 


‘కదలొద్దు’ అనే మాట ‘కదలొదు’  అని ఉంటే  అలాగే  చదివేవాణ్ణి.  ఇది ప్రింటింగ్  లోపమని స్పష్టంగా తెలియని రోజుల్లో... వాటిని యథాతథంగా చదువుతూ కథను ఎంజాయ్ చేసేవాణ్ణి. 

‘విష వలయం’ ఇంగ్లిష్ మాతృక  The waves of peril ని  scribd లో ఇక్కడ చదవొచ్చు-




6 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

వేణూ గారూ,
చిన్నప్పుడు చదివి ఆనందించినవి మీకు ఇంకా ఆనందం కలిగిస్తాయన్న మాట. నాకైతే, అన్నీ ఆనందం కలిగించవు. కొన్నే కలిగిస్తాయి. కొన్ని చిన్నతనాన్ని గుర్తు చేస్తాయి. అంతే కాదు, చిన్నతనంలో చాలా తెలియక చాలా ఇష్టపడ్డానని కూడా అనుకుంటాను. అవి ఇప్పుడు బొత్తిగా నచ్చవు. మీకు కూడా అలా అనిపించేవి ఏవన్నా వున్నాయా?
చిన్నప్పుడు విఠలాచార్య సినిమా అంటే ఎంతో ఇష్టపడేవాడిని. పెద్దయ్యాక వాటిని చూస్తే, బాగా తేలిపోయాయి. మాయలూ, మహిమలూ వున్నాయని ఒప్పేసుకున్నాక కూడా, కొంచెం తర్కంతో కధ నడవాలి. సన్నివేశాలకి అర్థం వుండాలి తర్కంతో. ఈ మధ్య, "జేక్ - ద జైంట్‌ స్లేయెర్" అనే ఒక ఇంగ్లీషు సినిమా చూశాను. ఈ సినిమాలో కొన్ని మాయలున్నాయి. వాటిని ఒప్పేసుకున్నాక, కధా, సన్నివేశాలూ తర్కంతో నడుస్తాయి. బాగానే వుందనిపించింది ఆ సినిమా.

ఈ పాత డిటెక్టివ్ కధలు ఇప్పుడు చదివితే (ఒకప్పుడు బాగా ఇష్ట పడ్డ వాడినే), సరైన తర్కం లేక, బాగా తేలిపోతాయి. చిన్నప్పటి ఆనందమే కలగడం లేదు.
మీకేమనిపిస్తుంది?

ప్రసాద్

వేణు చెప్పారు...

ప్రసాద్ గారూ, చిన్నప్పుడు ఆనందం కలిగించినవి- ముఖ్యంగా పుస్తకాలు అన్నీ పెద్దయ్యాక అదే స్థాయి ఆనందాన్నివ్వవు. అయితే ‘కొన్ని’ బహుశా బొమ్మలతో సంబంధమున్నవి మాత్రం దాదాపు అదే సంతోషాన్ని కలిగిస్తాయని నా అనుభవం. పాత స్మృతులను తట్టి లేపటం దానికో ప్రధాన కారణం కావొచ్చు!

నాకు ఒకప్పుడు బాగా నచ్చినప్పటికీ తర్వాతికాలంలో అంతగా ఆకట్టుకోని పుస్తకాలు చాలా ఉన్నాయి.

BVJ చెప్పారు...

Awesome Venugaru. One of my favorite during childhood.

hari.S.babu చెప్పారు...

I am also fan of this ukkupiDi maayaavi. great remembrance!

anu చెప్పారు...

మీకన్నా 25 సంవత్సరాలు వెనుక పుట్టినా.. నాకన్నా మీకే ఎక్కువ కామిక్ కథలతో బంధం ఉండడం విశేషం. ఈ విషయంలోనూ మీరు మాకన్నా చాలా ముందున్నారు.. కొంచెం అసూయ కలిగించేలా..:P

M b d syamala చెప్పారు...

వేణూ!ఉక్కుుపిడి మాయావి విషవలయంల పై నీ రెండు పోస్ట్ లు 2011,2014 చదివి చాలా సంతోషించాను!ఇంతకు ముందు నేనవి చదవక పోయినా నువ్వు చేసిన కధాపరిచయం నాకు ఆలోటును తీర్చింది !నిజంగా బ్లాక్అండ్ వైట్లో జీసస్ బ్లాస్కో వేసిన చిత్రాలు అద్భుతంగా అనిపించాయి!ఆ ఎఫెక్ట్స్ అంత బాగా వర్ణ చిత్రంలోకూడా అచిత్రించలేరేమో!లూయిస్ క్రాన్డెల్ కూర్చున్న angleనీకు నచ్చిందన్న మాట! ఇంతకీ నీకు స్కాన్డ్ కాపీ పంపి సంతోషపెట్టిన శివరామప్రసాద్ గారికి నా తరఫునకూడా ధన్యవాదాలు! కదలొద్దు ని కదలొదు అని చదివేవాడన్నమాట!చిన్న వేణు!బాల్యం ఎంత మధురఙ్ఞాపకాల తేనె పట్టో కదా!