సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

31, డిసెంబర్ 2014, బుధవారం

పాతికేళ్ళుగా నడుస్తున్న విలక్షణ పత్రిక!

రుక్మిణీ కల్యాణ ఘట్టానికి  చిత్రరూపం

చాలా ఏళ్ళ క్రితం ...

హైదరాబాద్ లోని ఒక పత్రికా కార్యాలయానికి  వచ్చిందో యువతి. ఆ పత్రికలో ఏదైనా రాస్తే పీహెచ్ డీ వస్తుందని  ప్రొఫెసర్లు చెప్పారనీ, తన వ్యాసం ప్రచురించమనీ కోరింది.

ఆ  సంపాదకుడు అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి.    

ఆమె అందించిన కాగితాలు చూశారు. వాటిమీద పన్నెండు ప్రశ్నలు రాశారు. వాటికి అదే క్రమంలో స్పష్టంగా సమాధానాలు రాసివ్వమన్నారు. అలా చేస్తే వ్యాసం సరిగా తయారవుతుందనీ, అప్పుడు ప్రచురిస్తాననీ తెలిపారు.

అది తన శక్తికి మించిన పని అంటూ ఆమె వెనుదిరిగివెళ్ళిపోవటం వేరే విషయం!

ఆ పత్రికే  ‘మిసిమి’! 

దానిలో ప్రచురించే వ్యాసాల స్థాయి అది. ధన సంపాదన కంటే విజ్ఞాన వ్యాప్తి ప్రధానమనే ఉద్దేశంతో కొనసాగుతోందీ మాసపత్రిక.

కొన్ని సంచికల  కవర్ పేజీలూ,  చిత్రాలూ   చూడండి....   

ఇది తొలి సంచిక

బౌద్ధ ప్రాంగణ ద్వారం


కిరాతార్జునీయం
ఇది నవంబరు 2014 సంచిక
కళలూ, సాహిత్యాంశాలను ప్రచురించే  పత్రికలు ఉండటంలో  పెద్ద విశేషమేమీ లేదు.

కానీ, ఈ పత్రికలో  హేతువాదానికీ, తర్కానికీ, శాస్త్రీయ విశ్లేషణకూ కొంత ప్రాధాన్యం ఉంటుంది.  చిత్ర, శిల్పకళలకు కూడా ప్రాముఖ్యం ఉంటుంది.  అదీ చెప్పుకోదగ్గ విషయం.  ముఖచిత్రం  విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తుంది.  

‘మిసిమి’ మాసపత్రిక రజతోత్సవం  నవంబరు 4న హైదరాబాద్ లో జరిగింది. ఒక సాహిత్య సభ  ప్రేక్షకులతో  కిక్కిరిసి హాలంతా నిండుగా ఉండటం నేనదే చూడటం. 

ఈ పత్రిక గురించి  తెలుగు వెలుగు డిసెంబరు 2014 సంచికలో ఓ వ్యాసం - ‘మిసిమిలమిలలు’ రాశాను.


 ఈ లింకు లో ఆ వ్యాసం చూడవచ్చు.

‘తెలుగు వెలుగు’లో  వ్యాసం వచ్చాక...  పాఠకుల నుంచి వచ్చిన ఫోన్లలో  ‘మిసిమి అనే పత్రిక ఒకటి ఉందా? దీని గురించి వినటం ఇదే మొదటిసారి ’ అని చాలామంది  చెప్పారు.

ఆశ్చర్యం కలిగింది!


25 సంవత్సరాలుగా ప్రచురితమవుతున్న పత్రిక పరిస్థితి ఇది!  సినీ టీవీ రంగాల్లో  నిన్న గాక మొన్న ప్రవేశించినవాళ్ళ  గురించి  (ముఖ్యంగా నటులు )  మాత్రం  కోట్ల మందికి  ఇట్టే  తెలిసిపోతుంటుంది.


పాత సంచికలకు ఇదిగో లింక్.. 

 1990 తొలిసంచిక నుంచి 2010 మే సంచిక వరకూ మొత్తం 245  ‘మిసిమి’ సంచికలు  పత్రిక వెబ్ సైట్ లో ఉచితంగా లభ్యమవుతున్నాయి.  ఈ లింకు నుంచి PDF  ఫైళ్ళను డౌన్ లోడ్ చేసుకోవచ్చు కూడా!
   

8 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

"రుక్మిణీ కల్యాణ ఘట్టానికి చిత్రరూపం" బొమ్మలో, కృష్ణుడికీ, రుక్మిణికీ ఒంటి మీద సరిగా గుడ్డలే లేవు. ఇదేం బొమ్మా?
ఈ పత్రికలో హేతువాదానికి ప్రాధాన్యత వుందా? ఆశ్చర్యమే! ముఖ చిత్రాలు చూస్తే, అలా అనిపించదు. అయినా, నేనెప్పుడూ చదవలేదు లెండి ఈ పత్రికని. మీ రాతలు చూశాకే, ఈ నాలుగు మాటలూ అనిపించాయి.

ప్రసాద్

వేణు చెప్పారు...

ప్రసాద్ గారూ! పురాణ ఘట్టాల్లో దుస్తులు పొదుపుగా వేయటం ఒక సంప్రదాయంగా చిత్రకారులు వేస్తుంటారు. కానీ ఈ సందర్భంలో ఇలా వేయకూడదు. కృష్ణుడి ఆహార్యం సంగతి వదిలేసినా.. కథ ప్రకారం రుక్మిణి గుడికి వెళ్లినపుడు ఆమెను కృష్ణుడు రథం మీద ఎక్కించుకువెళ్తాడు. కాబట్టి ఆమె నిండుగా దుస్తులు వేసుకున్నట్టు వేసివుండాల్సింది.

హేతువాద వ్యాసాలు మిసిమిలో చాలానే వచ్చాయి. ఉదాహరణకు-
పునర్జన్మ , ఒక పరిశీలన వ్యాసం లింకు-
http://misimi1990.files.wordpress.com/2013/06/misimi_1998_05.pdf#page=13

దివ్యశక్తులు ఉంటే 5 కోట్ల రూపాయలు సంపాదించవచ్చు వ్యాసం లింకు-
http://misimi1990.files.wordpress.com/2013/06/misimi_2000_05.pdf#page=25

అజ్ఞాత చెప్పారు...

వేణూ గారూ,
"పురాణ ఘట్టాల్లో దుస్తులు పొదుపుగా వేయటం ఒక సంప్రదాయంగా చిత్రకారులు వేస్తుంటారు." అని అన్నారు మీరు.
అలా అనడమే కాదు, ఆ సంప్రదాయాన్ని అంగీకరిస్తున్నట్టుగా ధ్వనించారు కూడా, ఎక్కడా విమర్శ లేదు కాబట్టి ఆ సంప్రదాయం మీద.
ఈ సంప్రదాయానికి మూలం ఏమిటీ? స్త్రీలని నగ్నంగా చూడాలనే తాపత్రయమే ఈ సంప్రదాయానికి మూలం. అదే పురుషుడి బొమ్మ అయితే, నగ్నంగా ఛాతీ చూపిస్తారు బొమ్మలో. ఈ రకం పురుషుల బొమ్మలు ఇష్టపడే స్త్రీల కన్నా, ఆ రకం స్త్రీల బొమ్మలు ఇష్టపడే పురుషుల సంఖ్య ఎక్కువ కాబట్టి, ప్రతీ చిత్రకారుడూ ఆ పనే చెయ్యడం మొదలు పెట్టాడు. అదేకాక, ఎక్కువ చిత్రకారులు పురుషులే. ఆఖరికి అది సంప్రదాయం అయి కూర్చుంది. సంప్రదాయమా, మన్నాం గట్టా? ఇది చాపల్యం. ఇది ఎన్నో వేల యేళ్ళ నించీ వుంటూ, ఇప్పుడు కూడా వుంది సమాజంలో.
కాసిని హేతువాద వ్యాసాలు వేసుకున్నంత మాత్రాన, ఆ పత్రిక హేతువాదానికి ప్రాధాన్యత ఇస్తుందంటే నమ్మే విషయం కాదు. "డైవర్సిటీ" అంటారే, అలాగన్న మాట. అన్ని రకాల పాఠకుల్నీ ఆకట్టుకోవడానికి, ఇలాంటివి చాలా పత్రికలు చేస్తూ వుంటాయి.

ప్రసాద్

అజ్ఞాత చెప్పారు...

"ఆ పత్రికలో ఏదైనా రాస్తే పీహెచ్ డీ వస్తుందని ప్రొఫెసర్లు చెప్పారనీ, ..."

హేవిటీ? ఒక పత్రికలో ఏదైనా రాస్తే, పీహెచ్ డీ వచ్చేస్తుందని ప్రొఫెసర్లు చెప్పారా? ఆశ్చర్యమే! మహా అయితే, "ఆ పత్రికలో ఏదైనా రాస్తే అది పీహెచ్ డీకి పనికి వస్తుందని" చెప్పొచ్చు, అంతే గానీ ఒక పత్రికలో రాసినందుకు ఏకంగా పీహెచ్ డీ వచ్చెయ్యడమే? చాలా సత్య దూరంగా వుంది ఈ మాట. ఎక్కడో ఎవరో తప్పుగా అంటున్నారు.

ప్రసాద్

వేణు చెప్పారు...

ప్రసాద్ గారూ!
దుస్తులు పొదుపుగా వేసే సంప్రదాయం గురించి నా అభిప్రాయం ఇక్కడ చెప్పలేదనుకుంటున్నాను. విమర్శించలేదు కాబట్టి అంగీకరిస్తున్నట్టు ధ్వనిస్తోందా? ఏమో.

ఈ పత్రిక పాత సంచికలు మీకు వీలున్నపుడు చూడండి.(వెబ్ లింకు ఇచ్చాను కదా...) అప్పుడు మాత్రమే ఈ పత్రికపై ఒక అభిప్రాయం ఏర్పరచుకోవటంలోన్యాయం ఉంటుంది.

‘మిసిమి’ పత్రికలో ఏదైనా రాస్తే పీహెచ్ డీ రావటం అంటే..., "ఆ పత్రికలో ఏదైనా రాస్తే అది పీహెచ్ డీకి పనికి వస్తుందని" చెప్పటమే! వాళ్ళు చేసే పరిశోధనకు తోడుగా ఈ వ్యాస ప్రచురణ ఉపయోగపడుతుందన్నమాట. రిసర్చ్ స్కాలర్లు తమ వ్యాసాలు ప్రచురితమవ్వాలని కోరుకునే మరో తెలుగు పత్రిక ‘వీక్షణం’.

GKK చెప్పారు...

వేణు గారు! మిసిమి ఒక engima. చిల్లర పత్రికలు, చవుకబారు నవలలు చదువుతూ పెరిగాము. ఏమి చేస్తాము. అవే నచ్చేవి మరి. మిసిమి వంటి serious stuff నేను ఎప్పుడూ చదవలేదు భయంతో వచ్చిన గౌరవం వల్ల కావచ్చు. రెండు సినిమా హాళ్ళలో అడవిరాముడు, రంగులకల సినిమాలు ఆడుతుంటే సగటు మనిషి అడవిరాముడే చూస్తాడు... సంప్రదాయవాదం, హేతువాదం కలుసుకునే horizon ఒకటి ఉంటే బాగుండును. ఎంతో passion ఉంటేతప్ప మిసిమిని ఇంతకాలం నడపలేరు. ముఖచిత్రాలు ఒక art gallery చూచినట్టుగా ఉన్నాయి.

GKK చెప్పారు...

ముద్రారాక్షసం. enigma

కూరెళ్ళ కోదండరామం చెప్పారు...

మిసిమి అన్న పేరం, అలాగే ఆ కవర్ ఫోటోస్ చూసి ఒకప్పటి సోవియట్ స్ఫుత్నిక్ లాఞటి మేగజైన్ అనుకునే వొడిని. చాలా మిస్ అయానని తెలిసింది. ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని పత్రికలను పరిచయం చేయగలరు.