సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

30, జూన్ 2015, మంగళవారం

మాసాంత వేళ- నా బ్లాగూ... నేనూ!సక్తితోనో .... అనాసక్తితోనో ... దాదాపు ప్రతిసారీ ఆలస్యంగానే 
బ్లాగులో  పోస్టులు రాసేస్తూ ఉండటమేనా?

ఎక్కడో ఓచోట కామా పెట్టి,
ఓసారి ఈ వ్యాసంగాన్ని పరామర్శించుకోవాలనీ...
ఇలాంటి  టపా ఒకటి రాయాలనీ కొద్ది కాలంగా అనుకుంటూనే ఉన్నాను.

వంద టపాలు పూర్తయినపుడా?
‘వంద’!
అయితే ..?
ఇలాంటి  అంకెల మ్యాజిక్కుల మీద నాకేమీ నమ్మకాల్లేవ్.

నూట ఆరో టపా రాసిన సమయంలో అనుకుంటా... నా బ్లాగు రాతల మీద ‘కన్ఫెషన్’ లాంటిది రాయాలనిపించింది.  కానీ కుదర్లేదు. మరో నాలుగు రాసేశాను.

*****

ప్రతి నెలా చివరి రోజుల్లోనే రాస్తూ వస్తున్నాను చాలా కాలంగా.

కారణం- ప్రతి నెలా తప్పనిసరిగా ఒక పోస్టునైనా రాయాలనే స్వీయ నిబంధన పెట్టుకోవటం !

దీన్ని పాటించటం కొన్నిసార్లు  కష్టంగా ఉన్నప్పటికీ .... రాయకుండా ఉండటం.. దాన్ని ఉల్లంఘించటం నాకే ఇష్టంగా ఉండదు.

ఇది  జూన్ నెల చివరి రోజు... పగలు గడిచింది... రాత్రి సమయం..
సరే,  ఆనవాయితీ తప్పినట్టూ ఉండదూ... అనుకుంటున్న ‘కన్ఫెషన్’ ఏదో  రాసేద్దామూ అనిపించింది...

*****

2009లో తెలుగు బ్లాగ్లోకంలోకి అడుగుపెట్టటమే సోషల్ మీడియాలో నా ప్రవేశం..! అప్పట్లో... ఎంతోమంది ఎంతో బాగా రాసేవారు. 


గూగుల్ బజ్ వల్ల కొంతకాలం బ్లాగుల జోరు తగ్గిపోయింది. తర్వాత  ఫేస్ బుక్ విజృంభణా, మైక్రో బ్లాగ్ ట్విటర్ హోరూ, గూగుల్ ప్లస్  ప్రాచుర్యం....వీటితో బ్లాగుల ప్రభ గణనీయ స్థాయిలో క్షీణించిపోయింది.

అప్పట్లో క్రమం తప్పకుండా బ్లాగులను రాసేవాళ్ళు క్రమంగా బ్లాగులకు దూరమైపోయారు.

అయితే  -

‘బ్లాగు’ ఇప్పటికీ  నా మోస్ట్  ఫేవరిట్!

సవివరంగా చిత్రాలతో, వీడియో-  ఆడియోలతో  అలంకరించటానికి  దీనిలోనే  మంచి అవకాశం ఉంటుంది (అని నా నమ్మకం).

చదివినవారు  సావకాశంగా వ్యాఖ్యానించటానికైనా, 
వ్యాఖ్యలు అప్రూవ్ చేస్తే గానీ  ప్రచురితం కాని వెసులుబాటుకైనా బ్లాగులే బెటర్.

ట్విటర్ అయినా,  ఫేస్ బుక్, గూగుల్ ప్లస్ లైనా లింకులు ఇచ్చుకోవటానికే ఎక్కువ ఉపయోగం.

*****

సాహిత్యం,  సంగీతం,  చిత్రకళ... స్థూలంగా  ఈ బ్లాగు పరిధి అంశాలు. ఏం రాసినా వీటిలో ఏదో  ఒకటి- లేదా రెండు కలిసొచ్చేలా ఉంటాయి,  సాధారణంగా .  

సంగీత సాహిత్య  చిత్రకళలు-  ఈ  మూడూ కలిసొచ్చిన  విశిష్టమైన  పోస్టు మాత్రం  ఒకటుంది. అనుకోకుండా అలా కుదిరిన ఆ  టపా-  హిమగిరి సొగసులు.  బ్లాగింగ్ తొలినాళ్ళలోనే ... 2009లోనే రాశానిది.   
 
బాగా నచ్చిన పుస్తకాలూ, సినిమాలూ,  పాటల గురించే  ఎక్కువ టపాలున్నాయి. 

మరి నచ్చనివాటి గురించి?

అవి చాలా తక్కువే.  
‘ప్రశ్నలెన్నో ముసిరే నవలిక మునెమ్మ’ 
‘వేరే రచయితల కథలను తిరగరాయొచ్చా? ’ ఇలాంటివి.  ఇవి వరసగా 2013 ఫిబ్రవరి,  మార్చి నెలల్లో.

‘ శ్రీరామరాజ్యం’  సినిమా పాటల విశేషాలు రెండు రోజులు- రెండు భాగాలుగా! .... ‘శ్రవణానంద కారకా.. ఇళయరాజా’ (2011 డిసెంబరు 23, 24).

వరసగా రెండు టపాల్లో  కళాదర్శకుడూ, రచయితా,  చిత్రకారుడూ అయిన  మా. గోఖలే  విశేషాలు.  (2012 జూన్, జులై).

అమితంగా అభిమానించే సంగీత దర్శకుడు ఇళయరాజా ,  చందమామ ల గురించీ,  ఇష్టమైన  కథల మాంత్రికుడు దాసరి సుబ్రహ్మణ్యం గురించీ-  ఒకటికి మించిన  పోస్టులు. 

ముఖ్యంగా అత్యధిక టపాలు మాత్రం-  నా అభిమాన రచయిత్రి  రంగనాయకమ్మ గురించినవే! 

రచనలు చదవకుండా రచయితలను హేళన చేసే, వ్యతిరేకించే ధోరణి పాఠకలోకంలో  ఒకటుంది.  అరకొరగా చదివి దూషణలతో ముంచెత్తే వైఖరి కూడా.

ముఖ్యంగా రంగనాయకమ్మ గారి విషయంలో  ఇది జరుగుతూ వచ్చింది.  బ్లాగులోకంలోనూ ఇది మరింతగా  ప్రతిబింబించింది. 

వేణువు బ్లాగు టపాలు ఈ mis conception ఎంతో కొంత తొలగటానికి  పరోక్షంగా తోడ్పడ్డాయని అనుకుంటున్నాను. 

మనకిష్టమైన అంశాల విశేషాలన్నీ ఓ చోట ... అక్షరాలుగా- చిత్రాలుగా- దృశ్య శ్రవణ రూపంలో కనపడుతుంటే అదో సంతృప్తి.

ఈ క్రమంలో  నా  వ్యక్తీకరణ- writing ability -  బాగానే  మెరుగుపడింది.

వ్యక్తిగతంగా నేను పొందిన లాభమిది!  

*****

కామెంట్ల   సంఖ్యకీ,  టపాను ఎక్కువమంది చదవటానికీ   సంబంధం ఉండాలనేమీ లేదు.

టపాల  గణాంకాలను గమనిస్తే ఇది  అర్థమైంది.
*  ఇప్పటివరకూ నేను  రాసిన 110 టపాల్లో (నిజానికి మొత్తం టపాలు  111. కానీ వీటిలో ఒకటి-  ఓ మిత్రుడి రచన)  అత్యధిక పేజీ వ్యూస్ (2291)  వచ్చిన పోస్టు- ‘ప్రశ్నలెన్నో ముసిరే నవలిక  మునెమ్మ’.

2013  మార్చి 5న రాశాను. దీనికి వచ్చినవి ఏడే కామెంట్లు.(నా సమాధానాలతో కలిపి).

*  కానీ 2010 జులై 26 న రాసిన ‘నా హీరోలు వాలీ, కర్ణుడూ’కు  అత్యధికంగా  142 కామెంట్లు వచ్చాయి. (నా వ్యాఖ్యలతో కూడా కలిపి..)

కానీ పేజీ వ్యూస్  1421 మాత్రమే.
‘ఇదండీ మహాభారతం’ పుస్తకాన్ని శ్రద్ధగా చదివి, వ్యక్తిగత కోణం అనుసంధానించి సమీక్షిస్తూ  రాసిన టపా కంటే ....

ఆ  పుస్తకం అప్పటికింకా పూర్తిగా చదవకుండా రాసిన కర్టెన్ రైజర్ (మహాభారతంపై రంగనాయకమ్మ పుస్తకం)  టపాకే  కామెంట్లూ ..పేజీ వ్యూస్  ఎక్కువ!

ఇలా ఉంటాయి... బ్లాగ్ లోక విచిత్రాలు!  

*****

చందమామ అభిమానిగాబ్లాగాగ్ని బ్లాగు ప్రేరణతో... 2009 మార్చి 11న తెలుగు బ్లాగ్లోకంలో  ‘తొలి అడుగు’ వేశాను. ఎమ్వీయల్-యువజ్యోతి బ్లాగర్  రామ్ ప్రసాద్,  ‘అనుపల్లవి’ బ్లాగర్   ‘తెలుగు అభిమాని’, చందమామ రాజశేఖరరాజు  .... ఇంకా మరికొందరి ప్రోత్సాహం లభించింది. 

ఇంతకీ-
పేరు కూడా  కలిసొచ్చేలా  ‘వేణువు’ బ్లాగు పేరు పెట్టాలని నాకెలా తోచింది?  

పత్రికా రంగంలో నా జూనియర్   పప్పు అరుణ  ‘అరుణమ్’  అనే బ్లాగును అప్పటికే  మొదలుపెట్టింది. (తర్వాత  మారిన పేరు ‘అరుణిమ’). 

ఆ పేరు  ప్రభావంతో  ఆలోచిస్తే ... వెంటనే  తట్టిన పేరిది!

12 వ్యాఖ్యలు:

నీహారిక చెప్పారు...

కొంతమంది బ్లాగర్లు చక్కగా వ్రాయగలిగినా కూడా వ్యాఖ్యాతలు బూతులు,ఇతరులను దూషించడం వంటి కమెంట్స్ వ్రాసినా ఆ చెత్తని తమ బ్లాగు(ఇంటి)లోనే ఉంచి తామసానందాన్ని పొందుతుంటారు. ఒక చర్చని ఒక బ్లాగర్ లేవనెత్తినపుడు వ్యాఖ్యలను నియంత్రించకపోతే ఆ చర్చలకు అర్ధం లేదు.అసెంబ్లీలో కూడా బూతులు తిట్టుకుంటారు కానీ వాటిని రికార్డుల్లోనుండి తొలగిస్తారు.రాజకీయాల గురించి,నైతిక విలువలగురించి విమర్శించే బ్లాగు వీరులు మాత్రం తమ బ్లాగుల్లో చెత్తనే శుభ్రం చేయలేక స్వచ్చ భారత్ గురించి లెక్చర్లు దంచుతారు.

మీ బ్లాగులో మునెమ్మ గురించి,వాలి కర్ణుడు గురించిన చర్చలు ఆసక్తికరంగా సాగడమే కాకుండా చర్చలనే మళ్ళీ చదవాలనిపించేలా ఉండడమే కాకుండా ఎవరూ ఎక్కడా సంయమనం కోల్పోకుండా వ్యాఖ్యానించడం వల్ల వివిధ వ్యక్తుల అభిప్రాయాలు తెలుసుకున్నాను.మంచి చర్చలను సమర్ధవంతంగా నిర్వహించడం అభినందనీయం. మరిన్ని చర్చలు మీ బ్లాగులో జరగాలని ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

వేణు చెప్పారు...

@ నీహారిక: అభినందనకూ, మీ అభిప్రాయం తెలిపినందుకూ థ్యాంక్యూ.

తమకు నచ్చని భావాలు వ్యక్తం చేస్తే- అసహనంతోో దూషణలూ, వ్యక్తులను హీనపరిచి అవమానపరచటం లాంటి ధోరణులతో వ్యాఖ్యలు వస్తుంటాయి. వీటిని నియంత్రిస్తే మాత్రం ‘భావ వ్యక్తీకరణ స్వేచ్చకు భంగం’! ఇలాంటి అనుభవాలు నాకూ ఎదురయ్యాయి. భావాలతో విభేదించినా తమ అభిప్రాయాలను దూషణలకు అతీతంగా చెప్పవచ్చు. ఆరోగ్యకరమైన చర్చలు చేయవచ్చు. మొత్తమ్మీద సోషల్ మీడియాలో వ్యాఖ్యల నియంత్రణ తప్పనిసరే. అది ఆరోగ్యకరమైన, సంస్కారవంతమైన భావవ్యక్తీకరణకే వీలు కల్పిస్తుంది.

Sujata చెప్పారు...

అవును. బ్లాగడం ఫిల్టర్ కాఫీ లాంటిది. ఫేసు బుక్కూ.. బజ్జులూ, అవీ బ్రూ(Instant) కాఫీల్లంటివి. అందుకే బ్లాగు కున్న విలువ, శ్రమ, తృప్తి, 'నేను ఇది రాసాను' అనుకోవడం లో ఉన్న ఆనందం.. వేటికీ సాటి రావు. It is kind of recording and putting our thoughts in a rythm. 'మనసులో మాట' సుజాత (Im an other sujata) గారి వల్లనే నాకు మీ బ్లాగు చదవడం అలవాటయింది. చందమామలూ, పాత కధలూ, సినిమా పోస్టర్లూ, పెయింటింగుల గురించి చదవడం నా అదృష్టం. వాటి గురించి ప్రస్తావించలేదేంటి Sir ? అవే హైలైటు మీ బ్లాగు కి. :)

వేణు చెప్పారు...

@ Sujata: ఫిల్టర్- ఇన్ స్టంట్ కాఫీల పోలిక బాగుంది. రుచికే కాదు, తయారీ వ్యవధికి కూడా ఇది వర్తిస్తుంది. పోస్టర్లూ, పెయింటింగులూ వగైరా అంటారా? It's been the very nature of this Blog కదా! ప్రత్యేకంగా ప్రస్తావించటమెందుకనుకున్నాను:) థాంక్యూ!

అన్నట్టు- బ్లాగింగ్ వ్యాసంగాన్ని బాగా తగ్గించేసినవారిలో మీరు కూడా ఉన్నారుగా!

y.v.ramana చెప్పారు...

వేణుగారు! అభినందనలు.

మీ బ్లాగ్ వల్ల ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాను.

బ్రహ్మనాయుడు బొమ్మ కోసం మీరు చేసిన పరిశోధన నాకు బాగా నచ్చింది.

మీరు భవిష్యత్తులో ఇంకా బోల్డన్ని పోస్టులు రాయాలని ఆశిస్తున్నాను.

వేణు చెప్పారు...

రమణ గారూ,
థాంక్యూ- మీ ఆశంసకూ, అభినందనకూ!

ఈ ‘పని లేక’ బ్లాగులో మాదిరిగా వ్యంగ్యం రాయటానికి ఓసారి ప్రయత్నం చేశాను. సంతృప్తి రాలేదు; నా genre అది కాదనిపించి మళ్ళీ ప్రయత్నించలేదు.

Surabhi చెప్పారు...

Venu Gaaru,
I am a regular reader of your blog.
The posters and paintings are signatures of this blog. Really appreciate your efforts behind such great posts.
Yes we really miss those good old days. Hope all of those bloggers return back some day. But you please keep posting
Surabhi

Sujata చెప్పారు...

:) i ran out of coffee powder.

వేణు చెప్పారు...

@ Surabhi: థాంక్ యూ. నెలకోసారే కదా,రాసేది! So, పోస్టు(లు)రాస్తూనే వుంటాను.

@ Sujata: :) ఫిల్టర్ కాఫీకే కాదు, ఇన్ స్టంట్ కాఫీకి కూడా మీ పాఠకులు దూరమయ్యారన్నమాట.

రామ్ చెప్పారు...

వీణ వేణువైన మధురిమ ....


బ్లాగ్దిశ వీణియ పైన పోస్టుల మయూఖ తంత్రుల పైన

పలికెను అక్షర తతులే అంతర్జాలపు వేదిక పైన !!


వినైల్ ఫ్లోరుల్లో బందీ అయిన వారికి

వినీలాకాశం లోని చందమామ ని చూపించే వేణు గానం !!


సీరియస్ చర్చలు .. చందన చర్చితం గా చేసే వేణు గారు తన 'వేణువు' ని తానే పరామర్శించుకునే అరుదైన సమయాన ... ...'వేణువు' గురించీ నా రెండు సంగతులూ !!

తెలుగు అభిమాని చెప్పారు...

మీ బ్లాగాల్బం లో వందరోజుల బొమ్మలు చాలానే ఉన్నాయి. The posts are always thoroughly researched and informative. దాసరి సుబ్రహ్మణ్యం గారి గురించి మీరు వ్రాసిన postలు చదివి నేను thrill అయ్యాను. అలాగే చందమామ బొమ్మల చిత్రకారుల మీద వ్రాసిన టపాలు నాకు చాలా ఇష్టం. నెలకొక్క post అయినా వ్రాసే నియమాన్ని మీరు కొనసాగించాలి. అనుపల్లవి కి మీ వ్యాసంలో చోటు దొరికినందుకు thank you. Like many others, I am an ardent admirer and regular reader of వేణువు.

టపా నిడివి ఎంత ఉండాలి. రచనాశైలి ఎలా ఉండాలి. తగిన బొమ్మలు audio video clips ఎలా జోడించాలి. వ్యాఖ్యలను ఎలా స్వీకరించాలి - ఇలా blogging కళలో మీది perfect style.

వేణు చెప్పారు...

@ రామ్ : అంతా మీ అభిమానం. సిరివెన్నెల పాట అన్వయింపు ఇంపూ; వ్యాఖ్యలో విరుపుల మెరుపూ రామప్రసాదం మార్కు కదా!

@ తెలుగు అభిమాని : ‘బ్లాగాల్బం’ పదబంధం కొత్తగా ఉంది.

మీ వ్యాఖ్య చూశాక.. బొట్టు-కాటుక లోగో, బుజ్జాయి కామిక్ కథ, ఉక్కుపిడి మాయావి మొదలైన టపాలూ, వాటికోసం చేసిన అన్వేషణలూ గుర్తొచ్చాయి. బ్లాగింగ్ కళ గురించి మీ ప్రశంసలకు ఏమేరకు అర్హుడినో కానీ... మీ అభిమానానికి కృతజ్ఞతలు.