సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

20, మార్చి 2017, సోమవారం

ఆ నవల కోసం.... ఏళ్ళ తరబడి సాగిన అన్వేషణ!నిషి కోరుకునేవీ;  అతడికి  సంతోషం, సంతృప్తి  కలిగించేవీ  ఏమిటి?

పోతన భాషలో - బలి చక్రవర్తి  వామనుడికి  చెప్పిన జాబితా చూస్తే....

‘వర చేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో
హరులో రత్నములో రథంబులొ విమృష్టాన్నంబులో కన్యలో
కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో
ధరణీ ఖండమో...’  


వస్తువులూ జంతువులతో సమానంగా ‘కన్యల’ను కలిపెయ్యటం గురించి ఇక్కడేమీ చర్చించబోవటం లేదు.

మిగిలినవాటినే చూస్తే...  మంచి వస్త్రాలూ, డబ్బూ, పండ్లూ, అటవీ సంపదా, ఆవులూ, గుర్రాలూ,  రత్నాలూ, రథాలూ, మంచి ఆహారం, ఏనుగులూ, బంగారం, భవనాలూ, గ్రామాలూ, పొలాలూ , భూ భాగం....

వీటిలో  గ్రంథాలు (పుస్తకాలు)  లేవు!
 
‘ నే జదివినవి గలవు పెక్కులు- చదువులలో మర్మమెల్ల జదివితి’ అన్న ప్రహ్లాదుడికి మనవడై వుండి కూడా బలి చక్రవర్తి ... ఈ జాబితాలో పుస్తకాలను చేర్చలేదెందుకో!

కోరుకోవాల్సిన జాబితాలో పుస్తకాలు ఉండకపోతే నాకు  నచ్చదు.

పుస్తకాలు అంటే సాహిత్యం...
ప్రధానంగా నాకైతే  కథలూ, నవలలూ!

‘పుస్తకాలంటే ప్రాణం!’ అంటూ  ఈ బ్లాగు హెడర్ కింద నా గురించి రాసుకున్నాను కూడా! 

ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే...

చిన్నప్పుడు మూడొంతులు చదివి, చివరి పేజీలు లేక పూర్తిగా చదవలేకపోయిన ఓ నవల...

కథలోని  విషాదంతో  కళ్ళు చెమర్చేలా చేసిన నవల...


బాల్యం నుంచీ మరపు పొరల్లోకి  జారిపోకుండా... తరచూ గుర్తొస్తూ  వెంటాడిన నవల...


దాన్ని మళ్ళీ చదవాలని  ఎంతగానో కోరుకున్నాను.

అది  సెంటిమెంటల్ నవలే.  కానీ నా బాల్యంలో అమితంగా ఇష్టపడ్డాను కదా? అందుకే అది చదవాలనే తపనా,  దానిపై ఇంత  ఆసక్తీ!

దశాబ్దాలుగా వీలున్నపుడల్లా వెతుకులాడుతూ వచ్చాను...
మిత్రుల ద్వారా రకరకాల మార్గాల్లో  ప్రయత్నించాను...

ఇక  దొరకటం దాదాపు అసంభవమేమో అని నిరాశపడ్డాను కూడా!

అలాంటిది -
ఆచూకీ తెలిపీ  తెలపకుండా దోబూచులాడి...
చివరికి..
ఆ పుస్తకం

దొ
    రి
        కిం
              ది!     

అప్పటి నా మన: స్థితిని ఊహించండి!

నలబై సంవత్సరాల తర్వాత ఆ పుస్తకం పూర్తిగా చదవగలిగాను.

*  *  *

ది జరిగి  కొద్ది రోజులే అయింది.

ఏమిటా నవల?
ఎవరు రచయిత?
ఇవేగా  మీ సందేహాలు!

ఇవేమీ నాకూ  తెలియవు  మొన్నమొన్నటి దాకా!

నవల పేరూ,  రచయిత పేరూ , ఆ నవల ముగింపూ తెలియకపోయినా ఇన్నేళ్ళుగా దాని సంగతి ఎప్పుడూ మర్చిపోలేదు.

కనీస ఆధారాలేమీ  తెలియకుండా వెతకటం అంటే చీకట్లో నల్లపిల్లి కోసం వెతకటంతో సమానమేగా?

మనసులోనే నిలిపివుంచుకుంటూ  మరెవరికీ  చెప్పకుండా... మౌనంగా, ఏకాంతంగా సంవత్సరాలుగా సాగించిన ఈ పుస్తకాన్వేషణ...

భౌతిక రూపంలో అక్షరాలుగా బయటపడింది మాత్రం  2014  జులై నెలాఖర్లో.

అప్పుడు ఓ బ్లాగు పోస్టును రాస్తూ ఈ పుస్తకం గురించి ప్రస్తావించాను.నేను గుర్తుంచుకున్న పాత్ర పేరు ‘ విభూతి’  అని తర్వాత అర్థమైంది.

బెంగాలీ నవల  అంటే అది శరత్ రచనో,  బంకించంద్ర రచనో అయివుండొచ్చనుకున్నాను.
 

ఆ పుస్తకాన్ని  కృష్ణాజిల్లాలో  వెనకబడిన  ప్రాంతంలోని మా  ఊరు  చాట్రాయిలో మా ఇంట్లో చదివాను.
బహుశా 1977 ప్రాంతంలో...!

అంత నచ్చిన పుస్తకం పేరు గుర్తు పెట్టుకోలేదు.
రచయిత ఎవరో గమనించే దృష్టి అప్పటికి లేదు.
తర్వాత  ఆ పుస్తకం ఏమయిందో తెలియదు.  మళ్ళీ కనపడనే లేదు.

ఏళ్ళు గడిచాయి.

సరే,   2014లో  బ్లాగు పోస్టులో దాన్ని గురించి  రాశాక,  అది చదివినవారెవరైనా  ఆ నవల ఆచూకీని, కనీసం దాని పేరు అయినా చెపుతారని కొంత ఆశపడ్డాను కానీ,  దాని గురించి ఎవరూ  చెప్పలేకపోయారు.

దాంతో  యథాతథ స్థితి కొనసాగింది.

నవల పేరు ... తె  లి  సిం  ది!

2016లో... అంటే కిందటి సంవత్సరమే... అనుకోకుండా ఆ నవల పేరు తెలిసింది!

యద్దనపూడి సులోచనారాణి  ‘మీనా’ ప్రారంభ భాగాల కోసం యువ పాత సంచికల పీడీఎఫ్ లు తిరగేస్తున్నాను.  అనుకోకుండా ‘ఎండమావులు’ సంక్షిప్త నవల కంటపడింది. దానిలో మొదటి పేజీ మిస్సింగ్.  అయినా కథ చదువుతుంటే  నేను చిరకాలంగా  అన్వేషిస్తున్న కథాంశమున్న నవల ఇదేనని అర్థమైంది.


విషయసూచిక చూస్తే.. రచయిత గా  డా.  నీహార్ రంజన్ గుప్తా  పేరు కనపడింది. (అనువాదకుడి పేరు- మిస్సయిన మొదటిపేజీలో ఉందేమో తెలియదు)

ఈ ఆధారం చాలదూ?

గూగుల్ సహకారంతో తెలుగు , ఇంగ్లిష్ సెర్చి పదాలు ఉపయోగించి వెతికాను.  ఆ రచయిత రాసిన రచనల వివరాలు తెలిశాయి.

వాటిలో మద్దిపట్ల సూరి  తెలుగులోకి అనువదించిన ‘మాయామృగం’ నవల పేరు కనపడింది. నిజానికి నీహార్ రంజన్ గుప్తా రచన తెలుగులోకి వచ్చింది ఇదొక్కటే.


ఎండమావులకూ,  మాయామృగం  పేరుకూ చాలా సారూప్యత కనపడింది.

అంతే కాదు,  మాయామృగ/ మాయా మృగో  బెంగాలీ నవలను బెంగాలీ సినిమాగా తీశారు. దాన్ని‘అన్నై’ పేరుతో భానుమతి- షావుకారు జానకిలతో తమిళంలో తీశారు. దాన్ని తెలుగులో ‘పెంచిన ప్రేమ’గా డబ్ చేశారు.

‘పెంచిన ప్రేమ’ పాటలపుస్తకంలో కథాసంగ్రహం చూశాను.... నాకు తెలిసిన ఆ  కథే.  ఎండమావులు కథే.

అంటే-
నేను ఇన్నేళ్ళూ వెతుకుతున్న నవల - ‘మాయామృగం’ అన్నమాట.

ఇక నా  అన్వేషణకు స్పష్టత వచ్చింది.
ఈ వెతుకులాటలో ముఖ్యమైన ఈ మలుపు  సంభవించిన రోజు-  2016  సంవత్సరం  ఫిబ్రవరి 17!

ఆ రోజే  గుంటూర్లో ఉన్న  శ్యామ్ నారాయణ గారికి  మెయిల్ రాశాను.  తన దగ్గరున్న పుస్తకాల్లో   ‘మాయా మృగం’ ఉందేమో చూడమనీ,  అది  ‘బాల్యం నుంచీ  పేరు తెలియకుండా  నేను  తెగ అన్వేషిస్తున్న నవల ( నవల పేరు ఇవాళే  తెలిసింది.. )  అనీ’ రాశాను.

‘లేదు’ అని   సమాధానం.  కాస్త నిరాశ...

ఇంకా ఆ పుస్తకం గురించి తెలిసే అవకాశం ఉన్న- నాకు తెలిసిన కొద్దిమంది సాహితీవేత్తలకు మెయిల్స్ రాశాను.

అతి కొద్దిమంది మిత్రులకూ తెలియజేశాను.

నవల పేరూ, రచయిత పేరూ తెలియదు కాబట్టి, ఆ పుస్తకం నాకు  దొరికే ఛాన్సు దాదాపు లేదనే భావిస్తూ వచ్చాను.

కానీ అనుకోకుండా ఆ నవల పేరూ, వివరాలూ తెలిశాయి కాబట్టి  ఆ పుస్తకం దొరుకుతుందని నమ్మకం వచ్చేసింది.

ఆధారం దొరికింది కదా?  నవల పేరూ,  రచయిత పేరూ,  అనువాదకుడి  పేరూ ‘కీ వర్డ్స్’గా ఇంటర్నెట్లో  విస్తృతంగా వెతకటం మొదలుపెట్టాను.

dli.ernet.in,
ulib.org,

archive.org,
tirumala.org,

sundarayya.org..

ఇంకా ఇతర  సైట్లలో, చివరకు -
kathanilayam.com లో కూడా వెతుకుతూ వచ్చాను.

కానీ... ఆచూకీ ఏమీ  దొరకలేదు.

అయితే...  నీహార్ రంజన్ గుప్తా రాసిన బెంగాలీ నాటకం ‘మాయామృగ’ pdf  దొరికింది!

లిపీ, భాషా ఏమాత్రం తెలియకపోతేనేం... దాన్ని డౌన్ లోడ్ చేసుకున్నాను.

హిందీ అక్షరాలతో పోలిక ఉన్న భాష  కాబట్టి పాత్రల పేర్లు  పోల్చుకున్నాను.

ఇప్పుడో  కొత్త సందేహం....
ఇంతకీ మాయామృగ  నాటకమా? నవలా? అని. 
బెంగాలీ నవల నెట్లో దొరకలేదు.   నాటకం ఎదురుగా కనపడుతోంది..

మరి మద్దిపట్ల సూరి నాటకాన్ని నవలగా మార్చి అనువదించారా?

సమాధానం దొరకలేదు  (ఇప్పటికీ).

రే,  నవల పేరు తెలియటం తప్ప...  నెలలు గడిచిపోతున్నా పుస్తకం దొరికే దిశలో అడుగు ముందుకు పడలేదు-
...  శ్యామల  పూనుకునేదాకా!

శ్యామల నా చిన్ననాటి స్నేహితురాలు.  నేను హైస్కూల్లో చదువుతున్నపుడు  తను నా సీనియర్.

తను సాహిత్యాభిలాషి మాత్రమే కాదు. అనుభూతివాద కవిత్వాన్ని అద్భుతంగా రాసే భావుకురాలూ,  తొలి తెలుగు గజల్ కవయిత్రీ! 

నా వెతుకులాట గురించి  ఓసారి యథాలాపంగా చెప్పాను.

‘ఆ  పుస్తకం కోసం ప్రయత్నిస్తాననీ,  తప్పకుండా సాధించి ఇస్తా’ననీ  తను వాగ్దానంలాగా చెప్పినపుడు మొహమాటంగా నా సంతోషం తెలిపాను.

అంతే.!  ఆశలైతే పెట్టుకోలేదు. నిజం చెప్పాలంటే... అది సాధ్యమవుతుందని నమ్మనే లేదు!

పుస్తకం దొరికే ఛాన్సు తక్కువ ఉండటం, తన సోర్సులు పరిమితమేనని అనుకోవటం, తన పట్టుదల సంగతి తెలియకపోవటం... దీనికి  కారణాలు.

నా అభిప్రాయం తప్పని త్వరలోనే అర్థమవసాగింది.

పాత పుస్తకాల షాపుల్లో చూడటం,  ఆన్ లైన్లో వెతకటం తప్ప నాకుగా నేను  చెప్పకోదగ్గ ప్రయత్నం ఏం చేశాను?

కానీ శ్యామల సిన్సియర్ గా పుస్తకం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది.  సుప్రసిద్ధ వేటపాలెం గ్రంథాలయంలో ,  తెనాలి , గుంటూరు గ్రంథాలయాల్లో కూడా  ఈ పుస్తకం కోసం  వెతికింది, వెతికించింది. వాటిలో దొరకలేదు.

మద్దిపట్ల సూరి గారి వారసులను సంప్రదిస్తే  పుస్తకం దొరకవచ్చు కదా  అని సలహా ఇచ్చింది.
ఈ ఆలోచన అప్పటికే నాకూ  వచ్చింది కానీ...  అది చివరి ప్రయత్నంగా చేద్దామని ఊరుకున్నాను.

( సాహితీ వేత్తల వారసుల్లో చాలామందికి ఆ సాహిత్యంపై అనురక్తి  లేకపోవటం, వాటి విలువ తెలియనంత అనాసక్తి  ఉండటం నాకు తెలుసు. అందుకే ఈ మార్గం అంత సఫలం కాకపోవచ్చని అనిపించింది కానీ,  పూర్తిగా ఆశ వదులుకోలేదు.)

ఈలోగా శ్యామల తన ప్రయత్నం కొనసాగిస్తూనేవుంది.  రచయితా, అన్నమయ్య ప్రాజెక్టు బాధ్యులూ అయిన పెద్ది సాంబశివరావు గారికీ, ఇతర సాహిత్యాభిమానులకూ  ఆ పుస్తకం గురించి చెప్పివుంచింది.

*  *  *


మాయామృగం ... పేరు తెలిసి ఊరించి -  నిరాశపరుస్తూ ఉన్నకాలంలో అనుకోకుండా మరో మలుపు.

నెట్లో యథాలాపంగా సెర్చి చేస్తుంటే.. ఆ లింకు వికీపీడియా సైట్ ద్వారా పిఠాపురంలోని వందేళ్ళ గ్రంథాలయ పుస్తకాల జాబితా -2కి తీసుకువెళ్ళింది.  మూడో వరసలో ఉన్న  పేరు చూడగానే ఆశ్చర్యానందాలు.

మయా మృగం...

మొదటి పదం మొదటి అక్షరంలో  దీర్ఘం లేకపోతేనేం... సుదీర్ఘమైన అన్వేషణ ఫలించే సూచనను ఆ  పదం అందించింది.

ఎంట్రీ నంబర్ తో సహా  పుస్తకం వివరాలు  కనపడ్డాయి. ప్రచురణ సంస్థ పేరూ, ప్రచురించిన సంవత్సరం కూడా !


ఇంత స్పష్టంగా పుస్తకం ప్రచురణ వివరాలు తెలియటం ఇదే మొదటిసారి.

ఆ లైబ్రరీలో తప్పకుండా పుస్తకం ఉంటుందని నమ్మకం. 

గట్టి నమ్మకంతో ...ఆశతో... అక్కడి లైబ్రేరియన్ ని ఫోన్లో సంప్రదించాను.

కొద్ది రోజుల్లో....  ఆయన సమయం వెచ్చించి మరీ వెతికారు గానీ దొరకలేదు.

లైబ్రరీలో  ఎంట్రీగా ఉండి కూడా పుస్తకం దొరకనందుకు  నిరాశ పడ్డాను.

*  *  *
వల పేరు తెలిసి సంవత్సరం కావొస్తోంది.

1962లో   తొలిసారి ముద్రితమైన  ఆ పుస్తకం రెండో ముద్రణ కూడా వచ్చినట్టు లేదు.  ఈ 55 ఏళ్ళలో వేసిన వెయ్యి కాపీలూ శిథిలమైవుండటమో,  కాలగర్భంలో కలిసివుండటమో జరిగివుండొచ్చు. ఫిజికల్ కాపీ దొరికే ఆశలను దాదాపు వదిలేసుకున్నాను.

హైదరాబాద్ తార్నాక లోని  స్టేట్ ఆర్కయివ్స్ వారి వద్ద డిజిటల్ రూపంలో ఉండవచ్చనే ఒక ఆశ ఇంకా మిగిలింది.

ఈ పరిస్థితుల్లో శ్యామల ద్వారా ఓ అనుకూల సమాచారం  విన్నాను.  అది పెద్ది సాంబశివరావు గారి ద్వారా తెలిసిన విషయం. వికీపీడియన్, సాహిత్యాభిమానీ అయిన రహమాన్ దగ్గర ఆ పుస్తకానికి సంబంధించిన భరోసా వార్త  ఉందని!

నేరుగా రహమాన్ నే సంప్రదించాను. ఆ పుస్తకం తన దగ్గర లేదనీ,  అఫ్జల్ గంజ్ లోని  స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో డిజిటల్ రూపంలో ఉందనీ , ఆ పుస్తకం సీరియల్ నంబర్ తదితర వివరాలు ఇచ్చారు.

ఆ లైబ్రరీ బాధ్యులతో మాట్లాడాను.  వారం రోజుల తర్వాత మళ్ళీ సంప్రదించమని చెప్పారు.

ఆ హామీతో  నిశ్చింతగా ఉండగా....

ఈ  అన్వేషణ మరో మలుపు తిరిగింది.


*  *  *


రోజు  డిపార్ట్ మెంట్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ సైట్ లోకి ఎలాగో  వెళ్ళాను.  సెర్చి ఆప్షన్లో  నవల పేరును ఎంటర్ చేసి వెతికాను.

ఇలా కనపడింది.
వివరాల  కోసం view details  క్లిక్ చేశాను.

గుంటూరు రీజనల్ లైబ్రరీలో  ఈ పుస్తకం ఉందంటూ ఇలా కనపడింది.

 మళ్ళీ ఉత్సాహం...

పిఠాపురం లైబ్రరీ నిరాశపరిచాక...   ఫిజికల్ పుస్తకం దొరుకుతుందనే ఆశ మళ్ళీ  అంకురించింది.

కానీ అక్కడ వెతికాక   నిరాశే మిగిలింది.

2011లో  చివరిసారి ఎంట్రీ ఉన్న ఆ పుస్తకం ఆ లైబ్రరీలో  కనపడలేదు.

పుస్తకాలను భద్రంగా సంరక్షించాల్సిన గ్రంథాలయాల్లో  పరిస్థితి ఇలా ఉందన్నమాట!

ఇక చేసేదేముందీ... డిజిటల్ పుస్తకం మీదే ఆశలన్నీ పెట్టుకుని ఉన్నాను.   

ఈ అన్వేషణ చివరికి వచ్చేసినట్టేననీ,  డిజిటల్ పుస్తకం దొరకటం మాత్రం తక్కువ సంతోషమేమీ కాదనీ  సర్దుబాటు ధోరణిలోకి వచ్చేశాను.

అయితే-

మరో  సంతోషకరమైన మలుపు నాకోసం ఎదురు చూస్తోందని అప్పటికి నాకు తెలియదు!

*  *  *

నవల అనువాదకుడు మద్దిపట్ల సూరి స్వగ్రామం  తెనాలి దగ్గరున్న  అమృతలూరు అని  వికీపీడియా సమాచారం.

రచయిత సొంత ఊళ్ళోని గ్రంథాలయంలో ఆ పుస్తకం ఉండొచ్చు కదా అనే ఆలోచనతో శ్యామల చేసిన ప్రయత్నం అద్భుతంగా ఫలించింది!

ఫిబ్రవరి 27న... ఆ పుస్తకం అమృతలూరు లైబ్రరీలో తనకు

దొ
రి
కిం
ది!


ఇదే  ఆ పుస్తకం !

కానీ  15వ పేజీ నుంచే ఉంది. ముగింపు  పేజీలూ లేవు.

అయితేనేం...!  డిజిటల్ ప్రతిలోంచి ఆ పేజీలను భర్తీ చేసుకోగలననే భరోసా ఉంది కాబట్టి  అది పెద్ద లోటు అనిపించలేదు.

పుస్తకం కొరియర్లో  పంపిస్తే మిస్ అవ్వొచ్చు కదా,  స్వయంగా వచ్చి  తీసుకుంటాననీ చెప్పాను.

ఈ లోపు  పుస్తకం  పేజీల  ఫొటోలు చూసి, చాలా  ఆనందపడ్డాను.

ఎప్పుడో చిన్నప్పుడు చదివిన పుస్తకం ప్రతిని మళ్ళీ చూడగలననీ, చదవగలననీ అనుకోలేదు.

ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ కళ్ళముందుకొచ్చి,  ఎంత సంతోషం వేసిందో!


  కథకు కొస మెరుపు కూడా ఉంది!

మరో ఐదు రోజుల తర్వాత-   మార్చి 5న...

ఆ ఆదివారం నాడు హైదరాబాద్ ఆబిడ్స్  ఫుట్ పాత్  దగ్గర  పరిచిన పుస్తకాలను చూస్తున్న రహమాన్ కు  ‘మాయా మృగం’ కనపడింది! ( ఈ పుస్తకం గురించిన వెతుకులాట గురించి అప్పటికే తనకు తెలిసివుండటం వల్ల  రహమాన్ దృష్టిని  ఆ నవల ఆకర్షించింది.)

పుస్తకం దొరికిన విషయం  వెంటనే నాకు ఫోన్ ద్వారా తెలిపి సంతోషపెట్టారు రహమాన్.

అంతే కాదు,  నవలకు అన్ని పేజీలూ ఉన్నాయని చెప్పారాయన. దాన్ని హైదరాబాద్ లోనే ఉన్న సాంబశివరావుగారికి అందజేస్తానని చెప్పారు. 

మరుసటి రోజు సాయంత్రం ...  సాంబశివరావు గారిని మాధాపూర్ లో కలుసుకున్నాను.
ఆయనిచ్చిన ఆ పుస్తకాన్ని పదిలంగా తీసుకున్నాను.

గట్టి అట్టతో ఉన్న కవర్ పేజీని  చూశాను.  నవల పేరూ,  మూల రచయిత పేరూ, ప్రచురణ సంస్థ పేరూ మురిపిస్తూ కనపడ్డాయి.
 
చిన్నప్పటి నుంచీ చదువుదామని తపించిన పుస్తకం..


నా జ్ఞాపకాల్లో ఏళ్ళ తరబడి నిలిచిన పుస్తకం..


ఆశా నిరాశల మధ్య ఊగిసలాడించిన, ఊరించిన పుస్తకం..


ఆచూకీ దొరికినట్టే మెరిసి.. అంతలోనే మాయమవుతూ వచ్చిన  ‘మాయా మృగం’

...  ఇలా చేతుల్లోకి వచ్చింది...

ఆత్మీయమైన పాత నేస్తం మళ్ళీ కలిసినప్పటి సంభ్రమంతో
సంతోషంతో
అపురూపంగా అందుకున్నాను!

1977లో ఆ నవల చదివివుంటాను.
2016లో  దాని పేరు తెలిసింది...
2017లో పుస్తకం  దొరికింది!


ఈ సందర్భంగా  రహమాన్ కూ,   పెద్ది సాంబశివరావు గారికీ  కృతజ్ఞతలు చెప్పుకోవటం నా ధర్మం.


రహమాన్ నాకు తెలిసిన వ్యక్తి అయినప్పటికీ ... మాయామృగం గురించి తనను అడగాలని తోచలేదు.  ప్రత్యక్షంగా సాంబశివరావుగారి ద్వారా,  పరోక్షంగా రహమాన్ ద్వారా ఈ పుస్తకం దొరికేందుకు  శ్యామల  దోహదపడింది. అసలు దొరకదనుకున్న పుస్తకాన్ని  స్వయంగా సాధించటంతో పాటు  మరో ప్రతి  కూడా  దొరకటానికి  కారకురాలయింది.

ఆ రకంగా ఈ చిరకాలపు  అన్వేషణ...  శ్యామల ద్వారా  అద్భుతంగా ఫలించింది!

తన  సంకల్పం,  శ్రద్ధా,  పట్టుదలా  లేకపోతే ఇది సాధ్యమయ్యేదే కాదు!

29 వ్యాఖ్యలు:

శ్యామలీయం చెప్పారు...

ఒక మంచి పుస్తకం దొరికితే ఒక మంచి ప్రపంచం‌ దొరికినట్లే మనకు!
మీ అన్వేషణ భలేగా అనిపించింది. అది ఫలించినందుకు చాలా సంతోషం‌ కలిగింది.
నా చిన్నప్పుడు అంటే ఇంచిమించు పన్నెండు- పదమూడేళ్ళ ప్రాయంలో 1964-65 ప్రాంతంలో చదివిన ఒక నవల "స్వయంప్రభ" గుర్తుకు వచ్చింది, దాని అట్ట ఎలా ఉందో ఆ డిజైన్ - రంగులు సహితంగా నా మనఃఫలకంపై ఇంకా బొమ్మస్పష్టంగా ఉంది! ఆ నవల రచయిత పేరు కె.సుబ్బయ్య. అనవలను నేను ఒక వందసార్లకు పైనే చదివానేమో ఆమూలాగ్రంగా. నెట్ సెర్చ్ ద్వారా ఆ నవల గురించి ఏ సమాచారమూ తెలియరాలేదు. ఆ నవలను ఎవరైనా ఎక్కడైనా గుర్తిస్తే ఎంతో ఆనందం. ఆ కె.సుబ్బయ్య గారు ఎవరో‌ కూడా నాకు తెలియదు. కథానిలయంలో ఒక కె,సుబ్బయ్య గారు కనిపించారు కాని ఆయన పుస్తకాలు ఏమీ చూపలేదక్కడ. అందుకని ఆయనో‌కాదో తెలియదు.

anyagaami చెప్పారు...

మీ వెతుకులాటని ఇంత వివరంగా వ్రాసి, మాతో పంచుకొన్నందుకు ధన్యవాదాలు. మిగిలింది శ్యామలరావుగారు చెప్పినదానికి డిట్టో.

Lalitha TS చెప్పారు...

ఒక మంచి సస్పెన్స్ కథలా వుంది మీ పుస్తక "అన్వేషణ" (కుర్చీ అంచుమీద కూర్చుని చూసిన వంశీ 'అన్వేషణ' సినిమా గుర్తుకొచ్చింది - మీ కథ నడక చూసి).

శ్యామలగారెంత మంచి స్నేహితులు కదా! మీ ఇద్దరికీ శుభాభినందనలు - ఇంత మంచి స్నేహితులయినందుకు.

Syamala Madduri చెప్పారు...

Venu! Innaallaku nee eduruchupu phalinchi maayaamrugam Neeku dorikinanduku neetho samaanamga nenuu santhoshinsthunnaanu aa pusthaka anveshanalo nenu bhagaswaami avadam na adrushtam oka pusthakaanni antha preminchatam nee abhiruchini samskaaraanni theliyajesthondi nee Valla nenu kuda antha manchi novel chadavagaligaanu, nijamgane Manam peddi samba sivarao gariki rehman gariki thanks cheppukovali! Korukovaalsinavaatillo pusthakaalu entha mukhyamo chepthu post begin chesina vidhanam bagundi ,

శ్యామలీయం చెప్పారు...

. . . . ఆ ఆదివారం నాడు హైదరాబాద్ ఆబిడ్స్ ఫుట్ పాత్ దగ్గర పరిచిన పుస్తకాలను చూస్తున్న రహమాన్ కు ‘మాయా మృగం’ కనపడింది! . . . .

ఈమాట నా పాత అలవాటును గుర్చుచేసింది. ఒకప్పుడు నేనూ కోఠీకి తరచుగా పాతపుస్తకాలను వెదకటానికి వెళ్ళేవాడిని. అప్పట్లో బస్సు ప్రయాణమే. ఇప్పుడు కారులో ఒకచోటునుండి మరొక చోటుకు నేరుగా పోవటమే కాని ఇలాంటి చిన్నచిన్న మంచి పనులకు తీరిక ఉండట‌ం‌ లేదు. కోఠీ వెళ్ళి ఎన్నేళ్ళైనదో!

Zilebi చెప్పారు...అదురహో ! మీ ప్రయత్నం ఎండమావి కాకుండా పోయినందులకు !


జిలేబి

Sravan Babu చెప్పారు...

మీ ప్రయత్నం ఫలించినందుకు అభినందనలు! ఇంతకీ దానిలోని విషయం ఏమిటో వీలైతే క్లుప్తంగా ఒక పోస్టులో వివరించగలరు.

Battula Ramnarayana చెప్పారు...

Hats off to your tenacity.Could you pl.share the novel on your blog?

Manjari Lakshmi చెప్పారు...

alaa dorakatam chaalaa aascharyam. dankosam meeru Chisinau prayatnam Na Bhutto Na bhavishyati annatlundi.

S చెప్పారు...

Wow!

వేణు చెప్పారు...

@ శ్యామలీయం: ఈ బ్లాగ్ పోస్టు ద్వారా మీ ‘స్వయంప్రభ’ పఠనానుభవం గుర్తుకు వచ్చినందుకు సంతోషం. వందసార్లు చదివించిందటే.. దానిలో ఏదో ప్రత్యేకత ఉండివుండాలి. మీ అభినందనకు థాంక్యూ.

@ anyagaami: మీ అభిప్రాయం పంచుకున్నందుకు థాంక్ యూ!

@ Lalitha TS: ఈ పోస్టు రచన అంత ఆసక్తికరంగా అనిపించినందుకు సంతోషంగా ఉంది. Syamala's contribution is matchless. Thank you for the good words on our friendship.

వేణు చెప్పారు...

శ్యామలా! అద్భుతమైన నీ కృషీ,సహకారం వల్లనే కదా ఇన్ని సంవత్సరాల ఈ అన్వేషణ ఫలప్రదం అయింది! ఈ పోస్టు ఆరంభం ఎలా రాయాలో కొంత ఆలోచించాను. ఇలా భాగవత ఘట్టంతో మొదలుపెడితే విభిన్నంగా ఉంటుందనిపించింది. నీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది.

శ్యామలీయం గారూ! పాత పుస్తకాలను వెతికే అలవాటు నాకూ ఉంది. కాకపోతే హైదరాబాద్ లో కుదరటం లేదు. విజయవాడలో ఉన్నపుడయితే లెనిన్ సెంటర్, గాంధీనగర్ పాతపుస్తకాల దుకాణాలకు తరచూ వెళ్తుండేవాణ్ణి.

వేణు చెప్పారు...

@ Zilebi: థాంక్యూ. మరి ‘ఎండమావులే’కదా దాహం తీర్చే ఒయాసిస్సుకు దారిచూపాయి!

@ Sravan Babu:

@ Battula Ramnarayana:

మీ అభినందనలకు థాంక్యూ. ‘మాయామృగం’ కథాంశం, కథనశైలి గురించి మరో పోస్టులో వివరంగా రాస్తాను. నవల మొత్తం షేర్ చేయమంటున్నరా? అది సాధ్యంకాకపోవచ్చు కానీ... సమగ్రంగా దాని గురించి రాయాలనేదే నా ఆలోచన.

వేణు చెప్పారు...

@ Manjari Lakshmi: ఈ పుస్తకం చివరికిలా దొరకటం నిజంగా ఆశ్చర్యమే. మీ అభినందనలకు థాంక్యూ. కానీ ఇందులో నా ప్రయత్నం పరిమితమూ, శ్యామల కృషి అపరిమితమూ. ఇక- న భూతో.. అంటారా? గతంలో ఇలాంటి పుస్తకాన్వేషణలు జరిగివుండవని చెప్పలేం కదా? ఇంటర్నెట్, ఆదునిక సాంకేతికత ఇలాంటి అన్వేషణలు ఫలవంతమవటానికి భవిష్యత్తులో బాగానే తోడ్పడతాయనేది నిశ్చయం.

@ S: Thanks a lot for your encouraging reaction!

శ్యామలీయం చెప్పారు...

వేణు గారూ, ఆ "స్వయంప్రభ" నవల నాపై చెరగని ముద్ర వేసిందండి. ఆ నవలకు గొప్ప పేరు వచ్చి ఉండకపోవచ్చును. ఆ నవలాకారుడు ఎవరో ఆయన ఒక లభ్దప్రతిష్ఠుడైన వ్యక్తి కాకపోవచ్చును. కాని ఆ నవలకు మనస్సును పట్టుకొనే‌ శక్తి ఉందని కచ్చితంగా చెప్పగలను. ఆనవలను నేను బాల్యంలోనే బహుమార్లు చదివినందువలన ఆ నవలయొక్క ఇతివృత్తం దాదాపుగా నేను దాన్ని తిరుగవ్రాయటానికి వీలైనంత బాగా గుర్తుండిపోయింది. వీలైతే ఆ నవల గురించి ఒక టపా వ్రాస్తాను ఈవేళో‌ రేపో.

శరత్ కాలమ్ చెప్పారు...

బావుందండీ. అభినందనలు.

వేణు చెప్పారు...

* శ్యామలీయం గారూ, ఎప్పుడో చిన్నవయసులో చదివిన పుస్తకం ‘దాదాపుగా తిరగరాయటానికి వీలైనంత బాగా’ గుర్తుండటం అంటే అది అసాధారణమే. మీ ‘స్వయంప్రభ’ పోస్టు కోసం ఎదురుచూస్తాను.

* శరత్ గారూ, మీ అభినందనలకు కృతజ్ఞతలు!

శ్యామలీయం చెప్పారు...

ఇప్పుడు మరొకసారి గాలిస్తే http://www.wikiwand.com/te/శ్రీ_సూర్యరాయ_విద్యానంద_గ్రంథాలయ_పుస్తకాల_జాబితా_-2 అనే పేజీలో 771వ ఎంట్రీగా స్వయంప్రభ అని ఉంది. వారిని సంప్రదించితే ఆ పుస్తకం ఏదో ఒకరూపంలో దొరుకుతుందేమో చూడాలి. స్వయంప్రభపై ఒక చిన్న టపా కొద్దిసేపట్లో ప్రచురిస్తాను.

వేణు చెప్పారు...

శ్యామలీయం గారూ, a good news!

వేణు చెప్పారు...

ఈ పిఠాపురం గ్రంథాలయం నన్ను మాయా మృగం నవల
విషయంలో
నిరాశ పరిచింది. But let's hope for the best!

శ్యామలీయం చెప్పారు...

స్వయంప్రభ నవలపై నా టపా: http://syamaliyam.blogspot.in/2017/03/blog-post.html

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

వేణు గారూ, పైన శ్యామలీయం గారిచ్చిన సూర్యరాయ విద్యానంద గ్రంధాలయం వారి జాబితా_2 లో మీరు చెప్పిన మాయామృగం (మద్దిపట్ల సూరి) 403వ ఎంట్రీ గా కనిపిస్తోంది.

వేణు చెప్పారు...

విన్నకోట నరసింహారావు గారూ, ఈ book entry ,t he story ..పోస్టులో రాశాను కదా..

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

అవునవునండి, నేనే సరిగ్గా గమనించలేదు.

Vijayakiran Kanadam చెప్పారు...

మీ అన్వేషణ చాలా బాగుంది. congratulations! నాకు కూడా వక నవల అలానే గుర్తు వస్తుంది. పేరు 'వెదురు పొదలు'.రచయిత పేరు తెలియదు. నాకు మళ్ళీ చదివితే బాగుండు అనిపిస్తుంది కానీ నేను దానికోసం ఎలాంటి ప్రయత్నం చేయలేదు. మిమ్మల్ని చూసాక ఇప్పుడు అనిపిస్తుంది కనీసం గూగుల్ సెర్చ్ చేయాలని. అందులో కధానాయిక తనకన్నా వయసు లో చాల చిన్నవాడిని పెళ్లి చేసుకుంటుంది. వేరే సంఘటన లేవీ గుర్తులేవు. బహుసా ఆతను ఇంకేవరినయినా ఇష్టపదతాదేమో గుర్తులేదు. ఏమయినా మీకు నా అభినందనలు.

Sujata చెప్పారు...

ఎంత బాగా రాశారో! మీ ఉత్కంఠ, మీ నిరాశ, దొరికాక excitement, అర్థం చేసుకోగలను. కంగ్రాట్స్. అందరికీ ఇలాంటి స్నేహితులు ఉండరు.

సిరిసిరిమువ్వ చెప్పారు...

ఓ...ఓ పుస్తకం జాడ కోసం మీ అన్వేషణ చాలా స్ఫూర్తివంతంగా ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు చదివిన తలా తోకలేని పిట్ట పుస్తకాన్ని భలే పట్టుకున్నారండి. మీ అన్వేషణ ఫలించినందుకు సంతోషంగా ఉంది.

అభినందనలు.

Viswanadh Bk చెప్పారు...

మీ అన్వేషణ ఫలించినందుకు ఆనందంగా ఉంది. పిఠాపురం లైబ్రరీలో పుస్తకాలు చాలా వరకూ చెదలు పట్టడం, ఎక్కువగా దొంగిలించబడటం జరిగాయి. క్లబ్ నిర్వహణ జరిగినపుడు పుస్తకాలను బటాణీలకు సైతం అమ్మేసుకొన్నారని చెప్పారు. జాబితాలో లేని పుస్తకాలను కొన్నిటినైనా సంపాదించి లైబ్రరీకి చేర్చాలని కృషి చేస్తున్నాం. పుస్తకరూపంలో లేని వాటి కొరకు కంప్యూటర్లను దాతల ద్వారా పొంది డిజిటల్ ప్రతులను అందుబాటులో ఉంచాలని శంకరరావు గారి ద్వారా మా ప్రయత్నం

A. Kalidasu చెప్పారు...

నాకు కూడా ఇలాంటి అనుభవమే ఉంది, నవల పేరు "జాలి లేని జాబిలి" 7th class లో కొంచెం చదివాను, మల్లి తర్వాత 15 ఏళ్ల తర్వాత పూర్తి గ చదివాను. థాంక్స్ తో హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీ