సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

30, జూన్ 2017, శుక్రవారం

మధుర స్వరాల డోల!


మ్మెస్ సుబ్బలక్ష్మి పాటల పరిచయం కాదిది... ఆమె పాటలతో నాకున్న కొద్ది పరిచయం!

ఆమె గురించీ, ఆ సంగీత ప్రతిభ  గురించీ  ఎన్నేళ్ళ నుంచో  వింటూ వస్తున్నటికీ ఆమె పాటలను పనిగట్టుకుని వినలేదెప్పుడూ. 

సంగీతమంటే ఇష్టం ఉండి కూడా,   సుబ్బలక్ష్మి  పాటలను వినాలని అనిపించకపోవడానికి  సినీ సంగీత ప్రభావం  కారణం కావొచ్చు.

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం రేడియోలో విన్నపుడు  ప్రౌఢంగానూ,  అదేదో  బృందగానంలానూ   అనిపించింది కానీ,   శ్రావ్యంగా అనిపించలేదు.

 భజ గోవింద శ్లోకాలో, విష్ణు సహస్రనామాలో  రేడియో నుంచీ,  మైకుల నుంచీ  చెవినబడినా  ఆసక్తిగా  పట్టించుకోలేదు.

ఏళ్ళు గడిచాయి.

ఈ మధ్యే  ఆమె జీవిత చరిత్ర  ‘సుస్వరాల లక్ష్మి MS సుబ్బలక్ష్మి’ చదివాను. 

ఆమె పాటలపై ఆసక్తి  ఏర్పడింది.

వరసగా వాటిని  యూ ట్యూబ్ లో వింటూ ... ఆనందిస్తూ  వచ్చాను.

ఎంఎస్ పాటలు ప్రధానంగా భక్తి పాటలే!
 
 కానీ నాకు,  ఆమె పాటలో  భావం కంటే  బాణీలో మెరుపులూ ,  ఆ కంఠంలోని   మాధుర్యమూ   ప్రధానం.

ముఖ్యంగా ఆమె పాడిన  ఓ రెండు పాటలను  ప్రస్తుతం  బాగా వింటున్నాను. విననప్పుడు కూడా తరచూ గుర్తొస్తూ ‘హాంట్’ చేస్తున్న పాటలివి.  (నిజానికివి నాకు  కొత్త కావొచ్చు గానీ... సంగీతాభిమానులు  దశాబ్దాలుగా వింటూ ఉన్నవే,  ప్రసిద్ధమైనవే.). 

మొదటిది  మధురాష్టకం. 

తెలుగు మూలాలుండి,   శ్రీకృష్ణ దేవరాయల కొలువుకు కూడా వచ్చిన  వల్లభాచార్యుడు (1479- 1531)  సంస్కృతంలో రాసిన  అష్టకమిది.




కృష్ణుడికి సంబంధించినది  ఏదైనా  మధురమేనని వర్ణించే  ఈ పాట..

మొదట నెమ్మదిగా మొదలై,  ఆపై  వేగం పుంజుకుంటుంది. మొదట్లో.. ‘మధురాధిపతే రఖిలం’ అనే చోట ‘రా’ను పలికిన  తీరు మధుర సోపానాల ఆరోహణే!

అలాగే...   ‘స్మరణం’ అనే పదాన్ని  ‘పిచ్’ తగ్గించి పలకటంలోని  అందం ఆస్వాదించాల్సిందే.

‘వేణుర్మధురో’  అని ఉండటం వల్ల నాకీ పాట నచ్చిందనుకోవద్దు :) 

రెండోసారి   పాడినపుడు ఇక్కడ కూడా ‘పిచ్’ తగ్గించటం గమనించవచ్చు.

   
రెండో  పాట... ‘డోలాయాం చల..’ .   వల్లభాచార్య కంటే ముందుతరం వాడైన  అన్నమయ్య  (1408-1503)  సంకీర్తనలు తెలుగులోవే  ఎక్కువ.

ఆయన సంస్కృతంలో  రాసిన  పాట ఇది.
 



విష్ణువు  దశావతారాల్లో ఒక్కో అవతారాన్నీ  సంబోధిస్తూ ‘ఓ శ్రీహరీ,  ఉయ్యాల (డోల) లో ఊగు’ అని పాడే జోల పాట ఇది. 

ఇందులో ‘దారుణ బుద్ధ’ అనే  పదబంధం  విచిత్రంగా కనిపించవచ్చు.  అన్నమయ్య  చెప్పిన  ఈ బుద్దుడు కారుణ్యమూర్తి అయిన చారిత్రక  బుద్ధుడు కాడు.  పురాణ బుద్ధుడు.    

‘సీర పాణే .. గోసమాణే’ అన్నచోట  శ్రావ్యత  సాంద్రమై ఆకట్టుకుంటుంది... ఎం.ఎస్. గళంలో.

 మొదట శార్ఙ్గపాణే  అనీ,  రెండోసారి  సీరపాణే  అనీ వినపడుతుంది.  మొదటి పదానికి  విల్లు పట్టుకున్న విష్ణువు అనీ,  రెండోదానికి  నాగలి ధరించిన బలరాముడు అనీ అర్థాలు.



గాయకుల్లో రకరకాలు. ప్రేక్షకులను అతిగా పట్టించుకుంటూ పాడేవారు కొందరు.  ఎదుట ఉన్న ప్రముఖులను సంబోధిస్తూ చప్పట్లను ఆశిస్తూ  పాట కొనసాగించేవారు కొందరు. 

ఇలా కాకుండా పాడే పాటమీద దృష్టి పెట్టి  తాదాత్మ్యతతో  పాడటం సుబ్బలక్ష్మి ప్రత్యేకత.


పాట భావం,  ఉచ్చారణ  తెలుసుకుని శ్రద్ధగా నేర్చుకోవటం,  కచ్చేరీకి ముందు గంటలకొద్దీ  కఠోర సాధన చేయటం ... చిత్తశుద్ధితో చేసే ఈ కృషికి  ఆమె  కంఠ మాధుర్యం,  ప్రతిభ జోడయ్యాయి.

అలాంటి  ఏకాగ్రతా, దీక్షా ఏ కళలోనైనా, ఏ పనిలోనైనా ముఖ్యమే కదా!     

తాజా చేర్పు :    ‘సుస్వరాల లక్ష్మి MS సుబ్బలక్ష్మి’ పుస్తకంపై  ‘ఈమాట’లో  చేసిన  సమీక్ష  ఇక్కడ


    

5 కామెంట్‌లు:

M b d syamala చెప్పారు...

సుబ్బులక్ష్మి గారి గురించీ నువ్వు రాసిన బ్లాగు మధురంగా వుంది వేణూ! ముఖ్యంగా మధురాష్టకంలోని మధుర డోలాయాం చల లోని డోల తీసుకుని నువ్వు ఆవిడ స్వరాలలో చదువరులను ఉయ్యాలలూపిన విధానం చాలా బాగుంది శీర్షికలని తీర్చి దిద్దడంలో నీ తర్వాతే ఎవరైనా! ఆరెండు పాటల script ఇవ్వడం బాగుంది! మనోవాక్కాయ కర్మలతో కళను సాధన చేసిన కళా సరస్వతిని నీ బ్లాగు ద్వారా పరిచయం చేసినందుకు ధన్యవాదాలు

అజ్ఞాత చెప్పారు...

వేణు గారు పుస్తకం ఎలా వుంది? అనువాదమా?

వేణు చెప్పారు...

శ్యామలా! బ్లాగుపై, బ్లాగు శీర్షికపై నీ అభినందనకు థాంక్యూ. By the way, ఇది గాయని సుబ్బలక్ష్మిని పరిచయం చేయటానికి కాకుండా ఆమె పాటలతో నా పరిచయం తెలిపే బ్లాగు పోస్టు మాత్రమే.

@ Iddaru: సుబ్బలక్ష్మి జీవిత చరిత్ర పుస్తకం నాకు నచ్చింది. అది దేనికీ అనువాదం కాదు. స్వతంత్ర రచనే. ఆ పుస్తకంపై నా సమీక్ష జూన్ 1న విడుదలైన ఈమాటలో వచ్చింది. దాని లింకును పోస్టుకు జోడించాను.

Kottapali చెప్పారు...

బాగుంది. ఎమ్మెస్ తల్లి నుండి సాంప్రదాయ బాణీ నేర్చుకుని ఉండి ఉంటారు. కానీ రికార్డుల దాకా వచ్చే సరికి మిగతా కలగా పులగం బాణీలు డామినేట్ చేసి ఉంటాయని నేను అనుకుంటున్నా. ఆమె సమకాలికుల్లో ఆమెకంటే గొప్ప విద్వత్ ఉన్నవారు చాలా మంది ఉన్నారు కానీ ఆమె గొంతులో వ్యక్తిత్వంలో సంగీతం పట్ల ఆమె దృష్టిలో .. అదొక తపస్సు ఉంది. సెమ్మంగూడి, నేదునూరి వంటి మహా విద్వామ్సులే అది దైవికం అని నమస్కరించారు.

GKK చెప్పారు...

వేణు గారు.బాగుంది. agree with Narayana Swamy Garu. Mss is synonymous with purity and Divinity.