సా హి త్య గా నం ... సం గీ త , చి త్ర క ళా లో క నం !

31, మే 2018, గురువారం

ఎలా ఉండాలి సరైన ముగింపు?




'All is well that ends well'  అంటారు.

దేనికైనా సరే... ముగింపు బాగుంటే ...  అంతకుముందు దొర్లిన పొరపాట్లూ,  లోపాలూ, అసంతృప్తులూ  తగ్గిపోతాయి,  సమసిపోతాయి.  

సినిమాల సంగతి చెప్పాలంటే... సెకండాఫ్  మెరుగ్గా ఉన్న సినిమాలు హిట్ అవుతాయి, సాధారణంగా.  సినిమా ముగిసి బయటికి వచ్చేటపుడు  ఉండే ఫీలింగ్ అంత  శక్తిమంతం!    

కథకైనా, సినిమాకైనా తగిన క్లైమాక్స్ లేకపోతే  అది వెలితిగా ఉంటుంది.  ఒక్కోసారి ఆ లోపం ఆ కథనో, సినిమానో దెబ్బతీసేదిగా కూడా ఉంటుంది.

‘సాగర సంగమం ’లో చివర్లో  కథానాయకుడి పాత్ర చనిపోకూడదని దర్శకుడు విశ్వనాథ్ భావిస్తే... ఆ పాత్ర చనిపోవాల్సిందేనని కమల్ హాసన్ పట్టుబట్టాడట.

ఇక ‘స్వాతిముత్యం’ క్లైమాక్స్ లో ఆ  పాత్ర చనిపోవాలని దర్శకుడు అంటే... బతికివుండాల్సిందేనని కథానాయకుడు గట్టిగా చెప్పి పంతం నెగ్గించుకున్నాడట.  కమల్ వాదన ఎంత సబబో ఆ సినిమాల ఫలితమే నిరూపించింది కదా!

క్లైమాక్స్ అంటే  ప్రత్యేకంగా ఉండే   ఓ మూడు సినిమాలు నాకు గుర్తొస్తాయి.

చాణక్య (1989)
మహానది (1993)
ద్రోహి (1995)
ఈ మూడూ  కూడా  కమల్ హాసన్ సినిమాలే అవటం విశేషం!



‘చాణక్య’ సినిమాలో  తన కుటుంబాన్ని నాశనం చేసిన విలన్ ముఖ్యమంత్రి మీద పగ తీర్చుకోవటం కోసం..  తనను చంపేసేలాగా  ప్రేరేపిస్తాడు, హీరో.  తను మరణించినా అప్పటికే రికార్డు చేసిన  సాక్ష్యాధారాలతో విలన్ కు శిక్షపడుతుంది.

ప్రేక్షకులు ఎవరూ ఊహించలేని అరుదైన విచిత్రమైన  ముగింపు ఇది!

విలన్ ను శిక్షించటానికి  తను చనిపోవటానికైనా సిద్ధమవటం విశేషం కదా!

 పునర్జన్మ పాయింటుపై ఆధారపడి తీసిన   ‘అరుంధతి’  సినిమా ఇలాంటిదే కదా!




‘మహానది’లో విలన్ ఓ డాబా మీద నుంచి జారిపోతూ  తన చేతిని ఉడుం పట్టు పట్టుకున్నపుడు  విలన్  జారిపడిపోయి చచ్చిపోయేలా చేసేందుకు హీరో ఏకంగా  తన చేతినే  నరికేసుకుంటాడు!   చిన్నపిల్లలను వ్యభిచార గృహాలకు అమ్మే దారుణమైన  విలన్ కు ఎలాగైతేనేం.. శిక్ష పడింది కదా అని ( హీరో  దుస్థితి పట్ల బాధ వేసినా)  సంతృప్తి పడతాం.




‘ద్రోహి’లో అయితే...  హీరో తన సహచరుడితో కావాలని షూట్ చేయించుకుని మరణిస్తాడు.  ఆ సహచరుడు ఆ ఉగ్రవాదుల నెట్ వర్కులోకి ప్రవేశించటానికి హీరో చేసిన ఆత్మార్పణ అన్నమాట.

ఈ మూడు సినిమాల ముగింపులూ  సినిమాటిక్ గా ఉండొచ్చుకానీ... విభిన్నంగా  ఉండటం వల్ల బాగా గుర్తున్నాయి.
 
బెంగాలీ నవలల్లోనో, రష్యన్ నవలల్లోనో  కేవలం  న్యుమోనియా వచ్చి ఆ రుగ్మతతో  చనిపోయే పాత్రల గురించి చదువుతుంటే ఆశ్చర్యం వేస్తుంది.    అప్పట్లో ఆరోగ్య పరిస్థితులు అంత ఘోరంగా ఉండేవా అనిపిస్తుంటుంది. 

తడబడిన క్లైమాక్సులు

 ‘అద్భుతంగా తీసిన  క్లైమాక్స్ ’ను మార్చి, వేరేది ఉంచటం వల్ల తన  ‘ఆలాపన’ సినిమా  ఫెయిలయిందని దర్శకుడు వంశీ ఓసారి చెప్పారు.

మహేష్ బాబు సినిమా ‘బాబీ’లో  హీరో హీరోయిన్లు  చనిపోతారు క్లైమాక్స్ లో.   అది ప్రేక్షకులకు నచ్చలేదు. దీంతో   వాళ్ళు బతికినట్టు  మార్చి,  ఆ క్లైమాక్సునే  ఉంచేశారు.  అయినా ఫలితం ఏమీ మారలేదనుకోండీ.



ముగింపు ఎలా ఉండాలన్నదానిలో  ఒక్కొక్కరిది ఒక్కో ధోరణి.  


శ్రీ రమణ ప్రసిద్ధ కథ ‘మిథునం’ ముగింపులో కథానాయకుడు అప్పదాసును చంపేయటం అనవసరం అనేది రచయిత్రి రంగనాయకమ్మ అభిప్రాయం. 

కానీ  ‘శంకరాభరణం’ సినిమాలో శంకరశాస్త్రి చనిపోవటం సహజమనీ, ఆ కథకు అదే సరైన ముగింపు అనీ ఆమె అంటారు!

కానీ.. ఆమె ఓ నవలకు రెండు క్లైమాక్సులు రాశారు మరి.

విషాదాంతాలు  కన్విన్సింగుగా ఉంటే..   పాఠకులూ,  ప్రేక్షకులూ  తప్పకుండా  ఆమోదిస్తారు. 


శరత్  ‘దేవదాసు’  విషాదాంతం కావటం కంటే భిన్నంగా మరే రకంగానూ  ఊహించలేం కదా!


 

4 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

మీరు ఉదహరించిన తతిమ్మా రెండు సినిమాలు నేను చూడలేదు కానీ “మహానది” చాలా పవర్-ఫుల్ కథతో కూడిన సినిమా అని నా అభిప్రాయం. కమల్ సినిమాలల్లో వన్ ఆఫ్ ది బెస్ట్. అయితే క్లైమాక్స్ లో నాకెన్నడూ అర్థం కాని విషయం కమల్ తన చెయ్యి ఎందుకు నరుక్కోవడం అని. దాని బదులు విలన్ చెయ్యిని నరికేస్తే విలన్ కిందకి జారిపోయి చనిపోయేవాడు కదా. అలా అయినా కూడా అదే ఫలితం వచ్చేది.

నీహారిక చెప్పారు...

ఈ మధ్య వచ్చిన సినిమాల్లో రంగస్థలం సినిమా ముగింపు నాకు బాగా నచ్చిందండీ.విలన్ ని బ్రతికించి మళ్ళీ చంపడం దానికి హీరో ఇచ్చిన వివరణ నాకు నచ్చింది.సాధారణంగా ఒక మనిషిని చంపడం వ్యతిరేకిస్తాను.అలా చేయకపోతే ఆ హీరోకి వేరే దారిలేదు.
కుమారి 21 F సినిమాలో హీరో తన స్నేహితురాలిని రేప్ చేసిన వాళ్ళని ఒకచోట బంధించి చిత్రహింసకి గురిచేయడం కూడా నాకు బాగా నచ్వింది.ఈ మధ్య ఆడవాళ్ళు అప్పటికపుడే ఉరితీసేయాలి అని గర్జిస్తూ ఉంటారు కానీ ఈ సినిమాలో కీచకులకి నరకం అంటే ఏమిటో హీరో చూపించడం బాగా నచ్చింది.

అజ్ఞాత చెప్పారు...

నాకైతే "మన్మధ" సినిమా బాగా నచ్చిందండీ. శింబు సినిమా గుర్తుందిగదా ?
అందులో ఒక "శింబు" అమాయకంగా బలైపోవడం, ఇంకో "శింబు" విజిలెంటెలాగా మారడం .. చాలా బావుంది. చివర్లో, ఆ చనిపోయిన "శింబు"ని అడ్డుపెట్టుకొని తప్పించుకోవడం... థ్రిల్లరులా ఉంటుంది.

అదే కాకుండా "సుస్వాగతం" సినిమా గుర్తుందా పవన్ కల్యాన్‌ది. అది కూడా నాకు బగా నచ్చింది. నిజానికి మర్చిపోయే సినిమా కాదు "సుస్వాగతం" సినిమా ఒక తరం ప్రేక్షకులకి, పవన్ కళ్యాన్ అబిమానులకి.. "హీరోయిన్ చివరిగా అతని వద్దకు వచ్చినా, అంతవరకు అతను కోరుకున్నది అదే అయినా ..." హీరో నాకు నువ్వు అక్కర్లేదు అంటాడు. దానికి రీజన్ కూడా చెబుతాడు. అఫ్ కోర్స్, అప్పట్లో బాగా కనెక్ట్ అయ్యాం ఆ సినిమాకి.

రామ్ చెప్పారు...

Nice one Venu garu
My opinion :When climax strikes a positive note, most people like, Especially these days. Do we have any tragedies these days?